కీలక నిర్ణయం-వాణిజ్య-03/30

అతిపెద్ద సోషల్ మీడియా నెట్ వర్క్ పేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవసీ పాలసీలో విశ్రుత మార్పులకు సిద్దమవుతోంది. గోప్యతా ఉల్లంఘనులు న్యూజిలాండ్ నరమేధం సంఘతనాలు తరువాత పలు సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. వివక్ష పూరిత అంశాలైన శ్వేతా జాతీయవాద వేర్పాటు వాదాలను నిషేదించిన ఆ సంస్థ ఇప్పుడు మరో దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. ఇక పై పేస్ బుక్ లైవ్ లను మానిటర్ చేయనుంది. లైవ్ ల పై ఆంక్షలు విధించాలని భావిస్తోంది. ఇకపై యుసర్స్ పేస్ బుక్ లో ఇచ్చే లైవ్ ల పై పలు నిబంధనలు అమలు చేయనుంది.
* వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌- సెప్టెంబరు) ప్రభుత్వం స్థూలంగా రూ.4.42 లక్షల కోట్ల రుణం తీసుకోనుంది.
*ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన రిటైల్‌ చెయిన్‌ ‘మోర్‌’, కార్యకలాపాల విస్తరణ కోసం వచ్చే అయిదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
*పీఎన్‌బీ హౌసింగ్‌లో కొంత మేర వాటాను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) విక్రయించనుంది. జనరల్‌ అట్లాంటిక్‌ గ్రూపు, వర్డే పార్ట్‌నర్స్‌లు ఈ వాటా కొనుగోలు చేయనున్నాయి.
*రాజస్థాన్‌కు చెందిన మిరాజ్‌ గ్రూపు సంస్థ అయిన మిరాజ్‌ సినిమాస్‌ తెలంగాణాలో విస్తరణ యత్నాల్లో నిమగ్నమైంది.
*కేవలం దక్షిణాది రాష్ట్రాల కంపెనీలపై పెట్టుబడులు పెట్టడానికి ఉద్దేశించిన వినూత్న పోర్ట్‌ఫోలియో పథకాన్ని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆవిష్కరించింది.
*జీఎంఆర్‌ గ్రూపునకు చెందిన కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజడ్‌)ని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూపు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం అవుతోంది.
*కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా 2019-20 సంవత్సరానికి సంజయ్‌ జయవర్ధనవేలు ఎన్నికయ్యారు.
*దేశీయ ఎఫ్‌ఎమ్‌సీజీ రంగం 2019లో 11-12% వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని నీల్సన్‌ ఇండియా అంచనా వేసింది. 2018లో నమోదు చేసిన 13.8 శాతంతో పోలిస్తే ఇది తక్కువని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సమీర్‌ శుక్లా పేర్కొన్నారు.
*నమోదు ఉపసంహరణకు గురైన 3 లక్షలకు పైగా కంపెనీలపై దర్యాప్తు చేపట్టాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆదాయపు పన్ను కార్యాలయాలకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది.

గోల్డ్ లోనా? పర్సనల్ లోనా? ఏది తీసుకుందాం?

ఆ లోన్ తీసుకోండి.. ఈ లోన్ తీసుకోండి అంటూ పొద్దున్న లేస్తే ఫోన్లో వాయించేస్తుంటారు. దీంట్లో మనకి పనికి వచ్చేవి కొన్నే ఉంటాయి. మిగతా వాటి పట్ల పొరపాటున అట్రాక్ట్ అయినా రేపొద్దున వడ్డీ కట్టాలంటే ఇబ్బంది పడేది కూడా మనమే. దానికంటే ముందే అది నిజంగా మనకి అవసరమా కాదా అని ఆలోచించి తీసుకుంటే మంచిది. హోమ్‌లోన్, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్ అంటే చాలా అవసరం కాబట్టి తప్పదు.అర్జంటుగా నగదు అవసరమైనప్పుడు పనికి వచ్చేది మాత్రం గోల్డ్ లోన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ గోల్డ్ లోన్‌కి క్రెడిట్ స్కోర్ బాధలు కూడా ఉండవు.గోల్డ్ లోన్ ప్రాసెస్‌ కూడా సులభంగా ఉంటుంది. బంగారం తనఖా పెట్టిన వెంటనే నగదు ఇస్తుంటారు. కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ చెప్పే మాటలు విని మోసపోకండి.రీపేమెంట్ కూడా ఈజీగానే వుంటుంది. వడ్డీ చెల్లింపు విషయంలో ఇబ్బంది ఉండదు. అసలు కడుతూ వడ్డీ నెమ్మదిగా కట్టుకోవచ్చు.ఇతర లోన్ల వడ్డీ రేట్లతో పోల్చితే గోల్డ్ లోన్స్ మీద వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.ఇక గోల్డ్ లోన్ తీసుకుంటున్నవారు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి..బ్యాంకులు సాధారణంగా బంగారం మొత్తం వాల్యూ మీద 75 శాతం మాత్రమే నగదును రుణంగా ఇస్తాయి.మీరు రుణం చెల్లించలేని పరిస్థితుల్లో తనఖా పెట్టిన బంగారం మొత్తం శాశ్వతంగా బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఆధీనంలోకి వెళ్లిపోతుంది.సాధారణంగా బంగారు నగల తనఖా గరిష్టంగా 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది.ఇక పర్సనల్ లోన్స్ విషయానికి వస్తే..డాక్యుమెంటేషన్ సులభంగా పూర్తవుతుంది.పర్సనల్ లోన్ పొందేందుకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. గోల్డ్ లోన్‌తో పోల్చితే ఇది చాలా సులభం అని చెప్పవచ్చు.అవసరానికి పర్సనల్ లోన్ పొందొచ్చు.పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు వాటిలో ఉన్న ఇబ్బందులను ఓ సారి పరిశీలించాలి.పర్సనల్ లోన్స్ సాధారణంగా అధిక వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. ఇదే పర్సనల్ లోన్స్ పొందేందుకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.ముఖ్యంగా పర్సనల్ లోన్ పొందాలంటే కచ్చితంగా క్రెడిట్ కార్డ్ స్కోర్‌ని పరిగణనలోకి తీసుకుంటారు. క్రెడిట్ స్కోర్ అంటే ట్రాన్సాక్షన్లు, వడ్డీ సమయానికి కడుతున్నారా లేదా ఇంకా మరికొన్ని విషయలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇస్తారు.లోన్ ముందు చెల్లిస్తే కూడా పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అందుకు బ్యాంకులు ఎలాంటి మొహమాటం లేకుండా లోన్ క్యాన్సిలేషన్ ఛార్జీలను మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. పర్సనల్ లోన్స్ విషయంలో ఇది కూడా ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంటుంది.దీన్ని బట్టి లోన్ ఇస్తాం తీసుకోండి బాబు అని మీ వెంట పడే బ్యాంకులు.. అందులోని సాధక బాధలన్నీ తెలుసుకున్నాకే తీసుకోండి. కాస్త ఆలస్యమైనా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాకే ముందడుగేయండి.

మరో 40 మల్టిప్లెక్స్‌లు-వాణిజ్య-03/29

* మిరాజ్ సినిమాస్ రాబోయే15 నెలల్లో తెలంగాణలో మరింత విస్తరించనుంది. హైదరాబాద్‌‌లో ప్రస్తుతం 4 స్క్రీన్లుండగా, విస్తరణలో భాగంగా మరో 36 స్క్రీన్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలలో కూడా మల్టీప్లెక్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణలో స్క్రీన్ల పెంపుకు దాదాపు రూ.80 కోట్ల దాకా ఖర్చుచేయనున్నట్లు మిరాజ్ సినిమాస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ భువనేష్ మెండిరట్ట చెప్పారు.
*ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు, సత్వరం తుది ఆమోదం కూడా డిజిటల్‌ పద్ధతిలోనే పొందే రెండు రకాల గృహ రుణ ఉత్పతుల్ని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది
* వాబ్‌కో ఇండియా షేర్లు దాదాపు 8శాతం పెరిగాయి. దీని మాతృసంస్థ వెబ్‌కో హోల్డింగ్స్‌ జెడ్‌ఎఫ్‌ ఫ్రైరిచెష్ఫన్‌ ఏజీతో ఒప్పందానికి రావడంతో షేర్లు ర్యాలీ చేశాయి. జెడ్‌ఎఫ్‌ సంస్థ దాదాపు 136 మిలియన్‌ డాలర్లు విలువైన షేర్లను నగదు చెల్లించి కొనుగోలు చేయనుంది. ఈ సంస్థ విలువను దాదాపు 7బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. దీంతో వాబ్‌కో ఉదయం 10.45 సమయంలో 7.69శాతం పెరిగి రూ.6,852 వద్దకు చేరాయి.
*మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వచ్చే నెల 1 నుంచి వాహన ధరల్ని పెంచబోతున్నట్లు ప్రకటించింది.
*కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రా బ్యాంకు ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ పద్ధతిలో 114,56,72,061 ఈక్విటీ షేర్లు కేటాయించింది. ఒక్కొక్కటీ రూ.10 ముఖ విలువ కల షేర్‌ను రూ.18.42 ప్రీమియంతో కలిపి రూ.28.42 ధరకు ఈ షేర్లు జారీ చేసింది.
*ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న నవయుగ కంటెయినర్‌ టెర్మినల్‌ (ఎన్‌సీటీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల టీఈయూ (ట్వంటీ-ఫుట్‌ ఈక్వలెంట్‌ యూనిట్‌) సరకు నిర్వహణతో ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది.
*వైద్య సేవల రంగంలో సేవలనందిస్తోన్న కాల్‌హెల్త్‌ తన వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి మరింత భద్రత కల్పించేందుకు బ్లాక్‌చైన్‌ సాంకేతికతను వాడుతున్నట్లు తెలిపింది.
*ఏబీఎన్‌ ఆమ్రో బ్యాంకుకు చెందిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థ స్టేటర్‌లో 75 శాతం వాటాను ఇన్ఫోసిస్‌ కొనుగోలు చేయనుంది.
*పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), సెంట్రల్‌ బ్యాంకులకు ప్రభుత్వం రూ.21,428 కోట్ల మూలధనం అందించబోతోంది.
*ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) పెట్టుబడుల రూపంలో 2018లో భారత్‌లోకి 20.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,43,000 కోట్లు) వచ్చాయని ఓ నివేదిక చెబుతోంది.
*రూరల్‌ ఎలక్ట్రిక్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)లో మెజార్టీ వాటాను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి కొనుగోలు ప్రక్రియను గురువారం పూర్తి చేసింది.
* మారుతీ సుజుకీ తమ మధ్య స్థాయి సెడాన్‌ కారు సియాజ్‌ను సరికొత్త ఇంజిన్‌తో విపణిలోకి విడుదల చేసింది. న్యూ అల్యూమినియం 1.5 లీటర్‌ డీడీఐఎస్‌ 225 డీజిల్‌ ఇంజిన్‌, సిక్స్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, మెరుగుపరిచిన సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దినట్లు వెల్లడించింది.
*జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్‌ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. దీని ధరను రూ.59.2 లక్షలుగా (ఎక్స్‌-షోరూమ్‌) నిర్ణయించింది.
*పెన్నా గ్రూపు, రస్‌ ఆల్‌ ఖైమాల భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఆన్‌రాక్‌ అల్యూమినియం కంపెనీకి గురువారం తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
*అపాచీ ఆర్‌టీఆర్‌ శ్రేణి అన్ని బైక్‌లను యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌)తో ఆధునికీకరించినట్లు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది.
*అయిదు నెలల వ్యవధిలోనే రెండు ఘోర దుర్ఘటనలకు కారణమైన 737 మ్యాక్స్‌ విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను నవీకరిస్తుస్తామని, ఫలితంగా విమాన నియంత్రణ వ్యవస్థలో లోపాలు ఉండబోవని తయారీ సంస్థ బోయింగ్‌ ప్రకటించింది.
*శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) తాజాగా రెండు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.

టైటాన్ విలువ అమూల్యం

టైటాన్‌ కంపెనీ మార్కెట్‌ విలువ గురువారం లక్షకోట్లను దాటింది. దీంతో షేరు ధర కూడా 1శాతం లాభపడి రూ.1,129 సరికొత్త మైలురాయిని దాటింది. గతంలో ఈ షేరు అత్యధిక ధర రూ.1,123 మాత్రమే. ఈ మార్కును మార్చి 12వతేదీన దాటింది. ప్రస్తుత షేరు రేటు ప్రకారం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1,00,231కోట్లు. ప్రస్తుతం 29 కంపెనీల మార్కెట్‌ విలువ మాత్రమే రూ.లక్షకోట్లను దాటింది. కంపెనీ 41.6శాతం వృద్ధి రేటును నమోదు చేయడంతో దాదాపు రూ.416కోట్ల లాభాలు వచ్చాయి. కంపెనీ నగల వ్యాపారంలో దాదాపు 37శాతం విక్రయాలు వృద్ధి చెందాయి. నగల వ్యాపార రంగంలో అసంఘటిత రంగం వైపు నుంచి సంఘటిత రంగంవైపునకు మళ్లడంతో టైటానుకు లబ్ధి చేకూరుతోంది.

ప్రత్యేక సంస్థగా ఫోన్ పే-వాణిజ్య-03/28

*టాటా ట్రస్టుల ధర్మకర్తగా ఉన్న ఎన్‌ఏ సూనావాలా (83) వైదొలిగారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో టాటా ట్రస్టులు తెలిపాయి.
* డిజిటల్ పేమెంట్ స్ కంపెనీ ఫోన్‌‌పే ఒక ప్రత్యేక సంస్థగా అవతరిం చబోతోం ది. ఫోన్‌‌పే కార్యకలాపాలను వేరుగా నిర్వహించేందుకు, కొత్త ఓనర్‌ షి ప్‌ కోసం ఫ్లిప్‌ కార్ట్ బోర్డు నుం చి సూత్రప్రాయంగా అనుమతి వచ్చినట్టు సంబంధిత వ్యక్తులు చెప్పా రు. దీంతో బెంగళూరుకు చెందిన ఫోన్‌‌పే స్వతంత్ర బోర్డును నియమించుకుంటుం ది. అంతేకాకుండా,బయట ఇన్వెస్టర్ల నుం చి తాజాగా నిధులు సేకరించాలనుకుంటోందని తెలిసింది. అయితే ఫోన్‌‌పేలో ఉన్న 100 శాతం షేర్‌ హోల్డింగ్‌‌లో ఎంత మొత్తాన్ని వాల్‌‌మార్ట్‌‌కు చెందిన ఫ్లిప్‌ కార్ట్ డిజ్‌‌ఇన్వెస్ట్‌‌మెంట్ చేస్తుందో తెలియలేదు. బయట ఇన్వెస్టర్ల నుంచి100 కోట్ల డాలర్ల వరకు సేకరించాలని ఈ పేమెంట్ స్ సంస్థ చూస్తోందని సంబంధిత వ్యక్తులు చెప్పారు.
*జెట్‌ ఎయిర్‌వేస్‌ పగ్గాలు ఒక సీనియర్‌ బ్యాంకర్‌ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి ఛైర్మన్‌ నరేశ్‌ గోయల్‌, ఆయన భార్య అనితా గోయల్‌ వైదొలగడంతో, కంపెనీ రుణదాతల చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
*మేధో సంపత్తి హక్కుల అపహరణ ఆరోపణలపై అమెరికా సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఎపిక్‌ సిస్టమ్స్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమెరికా ఎగువ న్యాయస్థానాన్ని (ఫెడరల్‌ అప్పిల్స్‌ కోర్టు) టాటా కన్సల్టెంట్స్‌ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఆశ్రయించింది.
*మేధో సంపత్తి హక్కుల అపహరణ ఆరోపణలపై అమెరికా సాఫ్‌్ివేర్‌ సేవల సంస్థ ఎపిక్‌ సిస్టమ్స్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పును సవాలు చేస్తూ అమెరికా ఎగువ న్యాయస్థానాన్ని (ఫెడరల్‌ అప్పిల్స్‌ కోర్టు) టాటా కన్సల్టెంట్స్‌ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఆశ్రయించింది.
*ఆర్సెలర్‌ మిత్తల్‌ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళిక ద్వారా ఎస్సార్‌ స్టీల్‌కు సమకూరే రూ.42,000 కోట్లను రుణదాతలకు ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలనే దానిపై రుణదాతల కమిటీ (సీఓసీ) శుక్రవారం సమావేశం కాబోతున్నట్లు జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌ఏటీ) రుణదాతలు సమాచారం ఇచ్చారు.
*బ్యాంకుల్లో ఎవరైనా పెట్టుబడుదారు లేదా ప్రమోటరు లేదా ఏ ఇతర వ్యక్తినైనా వాటా తగ్గించుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏ అధికారంతో ఆదేశిస్తుందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రశ్నించింది.
*అమెరికాకు చెందిన ఫిట్‌బిట్‌ సంస్థ భారత్‌ విపణి కోసం అందుబాటు ధర ఉత్పత్తులను విడుదల చేస్తోంది. శారీరక వ్యాయామం, ఎంతసేపు నిద్రిస్తున్నారు, హృదయ స్పందన ఎంతమేర ఉంది.. వంటి అంశాలను నమోదు చేసే వేరియబుల్స్‌ (శరీరంపై ధరించే ఉపకరణాలు)ను భారత్‌కు అనువుగా విడుదల చేసింది.
*బ్రిటిష్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌, లైఫ్‌ స్టైల్‌ బ్రాండ్‌ గోజీరో మొబిలిటీ భారత విపణిలోకి బుధవారం మైల్‌, వన్‌ పేర్లతో రెండు విద్యుత్‌ బైక్‌లను ప్రవేశపెట్టింది.
*యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్స్‌(యూబీహెచ్‌ఎల్‌)లో విజయ్‌ మాల్యాకు చెందిన 74 లక్షలకు పైగా షేర్లను విక్రయించడం ద్వారా రుణ రికవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ) రూ.1008 కోట్లు పొందిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పేర్కొంది.

ఎయిరిండియా పైలట్లకు ఇకపై నో స్పెషల్ మీల్స్

అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఖర్చులు తగ్గించుకొనే పనిలో పడింది ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా. దానిలో భాగంగా విధుల్లో ఉన్న సమయంలో పైలట్లు ప్రత్యేక భోజనాన్ని తెప్పించుకోవద్దని పైలట్లకు సూచించింది. ఈ విషయంలో కంపెనీ నిబంధనలనే పాటించాలని వెల్లడించినట్లు అంతర్గత వ్యవహారాల అధికారి మీడియాకు తెలిపారు. ‘నిబంధనలకు విరుద్ధంగా విమాన సిబ్బంది ప్రత్యేక భోజనాన్ని తెప్పించుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది’ అని ఎయిరిండియా డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ అమితాబ్ సింగ్ బుధవారం ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్న వారు మాత్రం వైద్యులు సూచించిన ప్రత్యేక ఆహారాన్ని తెప్పించుకోవచ్చని ఆయన వాటిలో పేర్కొన్నారు. పైలట్లు బర్గర్లు, పిజ్జా వంటి ఆహారాన్ని తెప్పించుకుంటున్నారని గుర్తించామని, దాని వల్ల సంస్థ మీద మరింత భారం పడుతుండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు.

మహాకూటమిపై వ్యాఖ్యానించడం తొందరపాటు

దేశానికి తిరిగి వచ్చి.. తన అవసరం ఉన్న చోట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో సంతోషంగా ఉన్నప్పటికీ తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. ఓ పుస్తకావిష్కరణ సభలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం లాంటి పార్టీలు ఏర్పాటు చేసిన మహాకూటమి అధికారంలోకి వస్తే రాజన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపై రాజన్‌ను ప్రశ్నించగా ‘ఈ విషయంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుంద’ని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికలు భారత్‌కు ఎంతో కీలకమని.. దేశంలో నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తనకు సలహాలు అందించే అవకాశం వస్తే సంతోషిస్తానన్నారు. కొంత మంది ఆర్థికవేత్తలతో కలిసి కొన్ని విధానాలను రూపొందించామన్నారు. వాటినే పుస్తక రూపంలో తీసుకువచ్చామన్నారు. ఆర్థికమంత్రిగా పనిచేసే అవకాశం వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగే స్వల్పకాల లక్ష్యాలపై దృష్టి సారిస్తానన్నారు. అలాంటి లక్ష్యాలనే పుస్తకంలో పొందుపరిచామన్నారు. అలాగే బ్యాంకింగ్‌ రంగంలోనూ పలు మార్పులు తీసుకువస్తాన్నారు. రైతాంగ సంక్షోభాన్ని తగ్గించేలా పటిష్ఠ వ్యవసాయ విధానాలను అమలు చేయాల్సి ఉందన్నారు. భూసేకరణ పద్ధతిలోనూ రాష్ట్రాలు అవలంబిస్తున్న మెరుగైన విధానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన మేర స్వతంత్రం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇవే తన ప్రధాన్య అంశాలని రాజన్‌ వివరించారు. ఇదే ముఖాముఖిలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధితో పరుగులు తీస్తోందని ప్రభుత్వం ప్రకటించడంపై రాజన్‌ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల సృష్టి మందగించిన నేపథ్యంలో ఇంతటి వృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత జీడీపీ గణాంకాలపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఒక నిష్పాక్షిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కనీస ఆదాయ పథకం రూపకల్పనలో భాగంగా రఘురామ్‌ రాజన్‌ లాంటి ఆర్థికవేత్తలను సంప్రదించామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. 2013 సెప్టెంబరు నుంచి సెప్టెంబరు 2016 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్‌ విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్తగా కూడా రాజన్‌ వ్యవహరించారు.

12ఏళ్లకు పెళ్లి. నెలకి ₹60 జీతం. ఇప్పుడు పద్మశ్రీ.

అందరి జీవితం పూల బాట కాదు..ఎన్నో కష్టాలు మరెన్నో కన్నీళ్లు అన్నింటినీ తట్టుకుని పరిస్థితులకు ఎదురొడ్డి తనేంటో నిరూపించి చూపలనుకుంది ప్రపంచానికి. ఇప్పుడు తనే రోల్ మోడలైంది. తనలాంటి మరి కొందరికి. మహారాష్ట్రలోని అలోకా జిల్లాలోని ఓ చిన్ని గ్రామంలో కల్పనా సరోజ్ జన్మించింది. కుటుంబానికి భారం తగ్గాలని కూతురిని పన్నెండేళ్ళకే పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. తల్లిదండ్రులు నరకం ఎలా ఉంటుందో. అత్తారింట్లో అడుగుపెట్టిన ఆరు నెలలకే అర్ధమైంది కల్పనకి. కూతురి పరిస్థితి చూసి చలించి పోయిన తండ్రి ..పద తల్లీ ఇంటికి పోదాం… కలో గంజో కలిసే తాగుదాం అని తీసుకెళ్ళాడు కూతురిని. చదువుకుందామని స్కూలుకు వెళితే ఊర్లో అందరూ హేళనగా చూసేవారు. సూటీ పోటీ మాటలనేవారు. వాటన్నింటినీ భరించలేక చచ్చిపోదామని ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఊర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సకాలంలో వైద్యం అందడంతో కల్పన బ్రతికింది. మరణం అంచుల వరకూ వెళ్లినదాన్ని మళ్లీ బతికానంటే నేను చేయాల్సింది ఏదో ఉందనుకుని ఇంట్లో వాళ్లని ఒప్పించి ముంబై రైలెక్కింది. తెలిసిన బంధువుల ఇంట్లో ఉంటూ బట్టల షాపులో పనికి వెళ్లేది. అక్కడ కల్పనకు నెలకు రూ.60 జీతం ఇచ్చేవారు. ఆతరువాత అక్కడే బట్టలు కుట్టడం నేర్చుకుంది. దీంతో ఆదాయం మరికొంత పెరిగింది. ఆ తరువాత రెండేళ్లు సంపాదించనదాంట్లో కొంత కూడబెట్టింది. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అందులోకి మారిపోయింది. అంతలోనే విషాదం. సమయానికి డబ్బులు లేక, మందులు అందక అక్క అనారోగ్యంతో మరణించిందన్న వార్త తనను కృంగదీసింది.దీంతో ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంది కల్పన. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంది. 1975లో మహాత్మా జ్యోతి పూలే స్కీమ్ కింద రూ.50వేలు లోన్ తీసుకుని సొంతంగా బట్టల షాపు తెరిచింది. బిజినెస్ బాగా సాగుతుండగామరో ఆలోచన చేసింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని భావించింది. సుశిక్షిత్ బెరోజ్‌ యువక్ సంఘటన పేరుతో ఒక అసోసియేషన్ ప్రారంభించింది. 3వేల మందికి పైగా అందులో జాయిన్ అయ్యారు.అక్కడి నుంచి ఆమె మరో అడుగు ముందుకు వేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టింది. అది ఆమె జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. అతి తక్కువ కాలంలోనే ప్రాపర్టీ బిజినెస్ నుంచి ఏకంగా రూ.4 కోట్లు సంపాదించింది. బిజినెస్‌లో సక్సెస్‌ని చూసిన కల్పన రుణ భారంతో మూతబడిన కామానీ ట్యూబ్ కంపెనీ పునరుద్ధరణ బాధ్యతను భుజానికెత్తుకుంది.10 మంది సభ్యులతో ఒక టీమ్‌ని ఏర్పాటు చేసింది. ఇందులో మార్కెటింగ్, బ్యాంక్, లాయర్లు, ప్రభుత్వ అధికారులు వంటి వారందరూ ఉన్నారు. ఆర్థిక మంత్రిని, కంపెనీకి రుణాలిచ్చిన వారందరినీ కలిసింది. బ్యాంకులు పెనాల్టీలను, వడ్డీలను రద్దు చేసేందుకు అంగీకరించాయి. కామానీ కంపెనీనీ తిరిగి ప్రారంభించేందుకు ఈ చర్యలు ఎంతగానో తోడ్పడ్డాయి. 2006లో కంపెనీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టింది కల్పన. కంపెనీకి సంబంధించిన రుణాలను తీర్చడమే మొదటి కర్తవ్యంగా పెట్టుకుని ముందుకు కదిలింది. ఇందుకోసం అంతకు ముందు తను సంపాదించిన ఆస్తిని కూడా అమ్మేసింది.2009లో కంపెనీ సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ నుంచి బయటపడింది. 2011లో రూ.3 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఇచ్చిన ప్రోత్సాహంతో మరికొన్ని వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది కల్పన మరింత ఉత్సాహంతో. ప్రస్తుతం ఆమె నిర్వహిస్తున్న వ్యాపారాల టర్నోవర్ రూ.2వేల కోట్లు. ఏడు కంపెనీలకు అధిపతి అయిన ఆమెని సక్సెస్ మహిళగా గుర్తిస్తూ 2013లో పద్మశ్రీ వరించింది. భారతీయ మహిళా బ్యాంక్ డైరక్టర్ల బోర్డులో కల్పనా సరోజ్ కూడా ఒక మెంబర్ కావడం విశేషం.

అత్తగారి వజ్రపు కానుక…వారికి చాలా చౌక

ఆకాశమంత పందిరిలా సాగే కార్పొరేట్‌ వెడ్డింగ్‌లో ప్రతీ అంశమూ ప్రత్యేకంగానే నిలుస్తుంది. వెడ్డింగ్‌ కార్డులు దగ్గరినుంచి, సంగీత్‌, బారాత్‌లంటూ పెళ్లి దాకా సాగా హడావిడి ఇంతా అంతా కాదు. ఈనేపథ్యంలోనే రిలయన్స్‌ కుటుంబం కొత్త కోడలికి ఇచ్చిన భారీ కానుక ఇపుడు హాట్‌ టాపిక్‌గా నిలిచింది. అక్షరాలా 300 కోట్ల రూపాయల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ను రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీ తన కొత్త కోడలు శ్లోకా మెహతాకు కానుకగా ఇచ్చారు. నిజానికి తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారం హారాన్ని కోడలికి పెళ్లిలో కానుకగా ఇవ్వాలనుకున్నారట మొదట నీతా అంబానీ. కానీ సమయానికి తగ్గట్టుగా మనసు మార్చుకున్న నీతా దానికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన నగను ఎంపిక చేయాలనుకున్నారట. అందుకే అత్యంత విలువైన వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి మరీ గిఫ్ట్‌గా అందించారట. తనెంతో ఇష్టంగా చేయించిన వజ్రాల హారాన్ని శ్లోకా మెడలో అలంకరించి నీతా ముచ్చట పడిపోగా, అటు అత్తగారిచ్చిన ప్రేమ పూర్వక కానుకతో శ్లోకా కూడా అంతే మురిసిపోయారట..వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్‌ అంబానీకి, అతని చిన్నప్పటి స్నేహితురాలు శ్లోకా మెహతాకు మార్చి తొమ్మిదిన ముంబైలో అత్యంత వైభవంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే.

బ్లూస్టార్ నుండి 75 రకాల ఏసీలు-వాణిజ్య-03/27

*దేశానికి తిరిగి వచ్చి.. తన అవసరం ఉన్న చోట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో సంతోషంగా ఉన్నప్పటికీ తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. ఓ పుస్తకావిష్కరణ సభలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం లాంటి పార్టీలు ఏర్పాటు చేసిన మహాకూటమి అధికారంలోకి వస్తే రాజన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
*ఎయిడ్స్‌, టీబీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు విస్తరించకుండా అదుపుచేసేందుకు కృషి చేస్తున్న గ్లోబల్‌ ఫండ్‌ అనే సంస్థతో హైదరాబాద్‌కు చెందిన లారస్‌ ల్యాబ్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. మూడున్నరేళ్ల పాటు అమల్లో ఉండే ఈ భాగస్వామ్యం కింద గ్లోబల్‌ ఫండ్‌కు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ ఔషధాలను లారస్‌ ల్యాబ్స్‌ సరఫరా చేస్తుంది. ఇది తమకు ఎంతో ముఖ్యమైన ఒప్పందమని కంపెనీ పేర్కొంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే శాఖలు తెరిచే ఉంచాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది.
*హైదరాబాద్‌కు చెందిన ఐటీ సేవల కంపెనీ సైయెంట్‌ లిమిటెడ్‌కు ప్రాట్‌ అండ్‌ విట్నీ సప్లయర్‌ అవార్డులు లభించాయి. 2018 సంవత్సరానికి మూడు అవార్డులు గెలుచుకున్నట్లు సైయెంట్‌ లిమిటెడ్‌ ఇక్కడ వెల్లడించింది. ప్రాట్‌ అండ్‌ విట్నీ వార్షిక సరఫరాదార్ల సమావేశంలో ఈ అవార్డులు బహూకరించినట్లు తెలిపింది. పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలపై తాము అధికంగా పెట్టుబడులు పెడుతున్నట్లు, తత్ఫలితంగా అవార్డులు గెలుచుకునే అవకాశం వచ్చిందని సైయెంట్‌ లిమిటెడ్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఆనంద్‌ పరమేశ్వరన్‌ తెలిపారు.
*నిర్మాణ సామగ్రి అమ్మకాలు పెంచుకోడానికి పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు నగరాలు, పట్టణాల్లో నిర్మాణ సామగ్రి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఇటువంటి కేంద్రాలు 11 ఉండగా, త్వరలో మరో 6 ప్రారంభించనున్నట్లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ విస్తరించాలని, విక్రయ కేంద్రాల సంఖ్యను 42కు పెంచుకోవాలనే ప్రణాళికలు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. స్టీలు, సిమెంటు, రంగులు, పుట్టీలు, డ్రిల్‌ యంత్రాల వంటి అన్ని రకాల నిర్మాణ సామగ్రిని ఈ కేంద్రాల్లో విక్రయిస్తున్నట్లు పేర్కొంది.
* ఐరిష్‌కు చెందిన క్విన్‌ గ్రూపునకు భారతీయ అనుబంధ కంపెనీగా ఉన్న మాక్‌ సాఫ్ట్‌ టెక్‌పై దివాలా ప్రక్రియను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మాక్‌ సాఫ్ట్‌ టెక్‌…, హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ‘క్యూ సిటీ’ అనే అతిపెద్ద వాణిజ్య భవనం యజమానిగా ఉంది.
*ఎయిర్‌ కండిషనర్ల విపణిలో 13.5 శాతం మార్కెట్‌ వాటా సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని, పలు కొత్త మోడళ్లు ఆవిష్కరిస్తున్నట్లు బ్లూస్టార్‌ లిమిటెడ్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జాయింట్‌ ఎండీ) బి.త్యాగరాజన్‌ తెలిపారు. బ్లూస్టార్‌ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 75 మోడళ్లను విడుదల చేయగా, కొత్త మోడళ్లను మంగళవారం హైదరాబాద్‌లో ప్రదర్శించారు.
*రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. చివరి గంటన్నర ట్రేడింగ్‌లో కొనుగోళ్లు దుమ్మురేపడంతో సెన్సెక్స్‌ మళ్లీ 38000 పాయింట్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు బలంగా పుంజుకోవడం, రూపాయి రాణించడం ఇందుకు ప్రధాన కారణాలు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. విదేశీ పెట్టుబడులు స్థిరంగా కొనసాగాయి.
*జెట్‌ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకునే కొనుగోలుదారు లేదా కొత్త యజమాని రూ.4,500 కోట్ల మూలధానాన్ని తీసుకురావాల్సి ఉంటుందని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సీనియర్‌ అధికారి ఒకరు అంచనా వేశారు.
*పాన్‌ కార్డ్‌ సంఖ్యను ఆధార్‌ కార్డ్‌తో అనుసంధానించుకోవడానికి ఆదివారం వరకు మాత్రమే సమయం ఉంది. అనుసంధానం కాని వారి ఐటీ రిటర్నులు ఫైల్‌ చేయడం సాధ్యంకాదని ఆదాయపు పన్నుశాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాదు వారి పాన్‌కార్డు కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది.
*ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ప్రజా ప్రయోజనాలు, బ్యాంకుల ప్రయోజనాలు కాపాడుకొనేలా జెట్‌ ఎయిర్‌వేస్‌ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనకు సంతోషాన్ని కలిగించిందని వెల్లడించారు.
*లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) లిమిటెడ్‌ సంస్థ మైండ్‌ట్రీకి చెందిన 31శాతం షేర్ల కొనుగోలు చేసేందుకు ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ విలువ దాదాపు రూ.5,030 కోట్లు ఉంటుందని అంచనా. దాదాపు 51.3 మిలియన్ల మైండ్‌ట్రీ షేరు కోనుగోలులో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రకటించిన ఎల్‌అండ్‌టీ పేర్కొంది. ఒక్కోషేరుకు రూ.980 చెల్లించేందుకు సిద్ధమైంది.

యప్ టీవీలో ఐపీఎల్ ప్రచారాలు-వాణిజ్య-03/26

* వివో ఐపీఎల్‌ – 12వ సీజన్‌ భారతదేశ విదేశీ ప్రసార హక్కులను దక్షిణాసియా అంతటా ప్రఖ్యాతి గాంచిన యప్‌టీవీ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరోప్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికాతో పాటు సెంట్రల్ ఆసియా, ఆగ్నేయ ఆసియాలలో ఉన్న పాత, కొత్త వినియోగదారులకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుందని యప్‌ టీవీ యాజమాన్యం తెలిపింది.
*టెలివిజన్‌ రేటింగ్‌ ఏజెన్సీ బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) ఇండియా సోమవారం నుంచి కొత్త సేవలు ప్రారంభించింది.
*బీమా సంస్థలు రైతుల పంట బీమా క్లెయిమ్‌లకు సంబంధించిన వివరాలను హిందీ, ఆంగ్లంతో పాటు వారి స్థానిక భాషల్లోనూ అందించాలని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సూచించింది.
*వైస్రాయ్‌ హోటల్స్‌ లిమిటెడ్‌కు చెందిన నూరుశాతం అనుబంధ కంపెనీ కేఫే డి‘లేక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌) హైదరాబాద్‌ బెంచి ఉత్తర్వులు ఇచ్చింది.
* మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమకు సంబంధించిన కమీషన్ల చెల్లింపు, వెల్లడి నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ ప్రకటించింది.క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక(సిప్‌)ల ద్వారా వచ్చే పెట్టుబడులపై మాత్రమే ఒకేసారి కమీషన్‌ (అప్‌ఫ్రంట్‌) చెల్లింపునకు అనుమతినిచ్చింది.
*యాపిల్‌ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వీడియో సేవలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ సేవలు అందిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ప్రైమ్‌లతో యాపిల్‌ పోటీ పడబోతోంది.
*వచ్చే ఆర్థిక సంవత్సరా (2019-20)నికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తొలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం సమావేశమయ్యారు. ఆర్‌బీఐ గవర్నరు నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏప్రిల్‌ 2-4 తేదీల్లో సమావేశమై, విధాన నిర్ణయాలను 4న ప్రకటించనుంది.ఈ వారం చివర్లో పేమెంట్స్‌ బ్యాంకుల అధిపతులతో ఆర్‌బీఐ గవర్నర్‌ సమావేశం కానున్నారు.
*వచ్చే ఆర్థిక సంవత్సరా (2019-20)నికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తొలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం సమావేశమయ్యారు.
*అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందన్న భయాలు ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందన్న ఆందోళనలు ఇందుకు తోడయ్యాయి. ఈ సెగ మన మార్కెట్లను తాకింది.
* విద్యుత్తుతో నడిచే 3 చక్రాలు (ఆటోలు), 4 చక్రాల (కార్ల) వాహనాలను ప్రజా-వాణిజ్య రవాణాకు మాత్రమే వినియోగిస్తున్నట్లు సంబంధిత ప్రభుత్వ సంస్థ ధ్రువీకరిస్తేనే, వాటికి ప్రోత్సాహకాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది. విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఫేమ్‌ పథకం రెండోదశను ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేసేందుకు రూ.10,000 కోట్లను ప్రభుత్వం కేటాయించిన సంగతి విదితమే. మూడేళ్ల కాలానికి ఈ పథకాన్ని ఉద్దేశించారు.
*జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ వ్యవస్థాపకుడే.. ఆ సంస్థ బోర్డును వీడాల్సి వస్తోంది. అదీ స్థాపించిన పాతికేళ్ల తర్వాత. రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా తన వాటాను విక్రయించడమే కాక, ఛైర్మన్‌ పదవితో పాటు బోర్డు నుంచీ నిష్క్రమించాల్సి వచ్చింది. భారత విమానయాన రంగంలోనే ఇదో విషాదకర రోజని పోటీ సంస్థ స్పైస్‌జెట్‌ అధిపతీ పేర్కొన్నారంటే, పరిస్థితి అర్థమవుతుంది.

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు-వాణిజ్య-03/25

*దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. ఈ ఏడాది లో వడ్డీ రెట్ల పెంపు ఉండబోదని పెడరల్ రిజర్వ్ సంకేతలివ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్వేస్తల సెంటిమెంటు దెబ్బతింది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ నెగటివ్ గా స్పందించాయి. దీంతో దేశీయంగా కూడా, అమ్మకాల జోరందుకుంది. అరంబంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమైంది.
*శత్రు షేర్ల (ఎనిమీ షేర్లు) విక్రయంతో ప్రభుత్వానికి రూ.700 కోట్లు సమకూరాయి. నవంబరు 2018లో కేంద్ర మంత్రివర్గం ఈ తరహా షేర్ల విక్రయానికి చర్యలు తీసుకోమని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (దీపమ్‌) విభాగానికి సూచించింది.
*దేశీయ కేపిటల్‌ మార్కెట్లలో విదేశీ పోర్‌్్ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) మళ్లీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
* ప్రైవేటు రంగంలోని దాదాపు డజను విద్యుదుత్పత్తి ప్లాంట్లపై పెట్టిన సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయి.
*స్టాక్‌మార్కెట్లలో ఈ వారం ఎంపిక చేసిన షేర్లపైనే మదుపర్లు దృష్టి నిలిపే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ సిరీస్‌కు మదుపర్లు పొజిషన్లను మార్చుకునే అవకాశాలుండడం ఇందుకు నేపథ్యం.
*వెనెజువెలా, అమెరికాల మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. ‘‘వివిధ బ్యాంకుల్లో భద్రపర్చుకొన్న మా దేశ సొమ్మును ట్రంప్‌ కోరిక మేరకు దొంగతనం చేశారు. ఈ అపహరించిన సొమ్ము మొత్తం దాదాపు 30 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. కొన్ని నెలల నుంచి ఈ దొంగతనం జరుగుతోంది.’’ అని వెనుజువెలా కమ్యూనికేషన్ల శాఖా మంత్రి జార్జి రోడ్రిగో ఆరోపించారు.
*రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఎంటర్‌ప్రైజస్‌ తాజాగా ఆర్‌కామ్‌కు చెందిన 4.52శాతం షేర్లను ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో తాకట్టుపెట్టింది. ఈ షేర్ల సంఖ్య 12.50 కోట్లు ఉండవచ్చని సమాచారం. ఈ విషయాన్ని రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు ఆర్‌కామ్‌లో 49.06 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇది మొత్తం ఆర్‌కామ్‌లో 17.74 శాతానికి సమానం.
*అమెజాన్‌.కామ్‌పై జర్మనీలో ఆంక్షలు తప్పేట్లు లేవు. గతంలో గూగుల్‌ మాతృసంస్థ కూడా ఈ దేశ ఆంక్షలకు గురైంది. కాంపిటేషన్‌ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు ఈ ఆంక్షలు విధించే అవకాశం ఉందని జర్మనీ మోనోపోలీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అచిమ్‌ వాంబచ్‌ వెల్లడించారు.

తనఖాకు రిలయన్స్ షేర్లు

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఎంటర్‌ప్రైజస్‌ తాజాగా ఆర్‌కామ్‌కు చెందిన 4.52శాతం షేర్లను ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో తాకట్టుపెట్టింది. ఈ షేర్ల సంఖ్య 12.50 కోట్లు ఉండవచ్చని సమాచారం. ఈ విషయాన్ని రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు ఆర్‌కామ్‌లో 49.06 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇది మొత్తం ఆర్‌కామ్‌లో 17.74 శాతానికి సమానం. మార్చి 22న ఈ నిర్ణయం తీసుకొంది. గతంలో కూడా 4.85శాతం షేర్లను తాకట్టు పెట్టింది. దీంతో ఆర్‌సీఈ మొత్తం 9.37శాతం షేర్లను తాకట్టు పెట్టినట్లైంది.

అమెజాన్‌కు జరిమానా పడే అవకాశం

అమెజాన్‌.కామ్‌పై జర్మనీలో ఆంక్షలు తప్పేట్లు లేవు. గతంలో గూగుల్‌ మాతృసంస్థ కూడా ఈ దేశ ఆంక్షలకు గురైంది. పోటీపరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఆంక్షలు విధించే అవకాశం ఉందని జర్మనీ మోనోపోలీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అచిమ్‌ వాంబచ్‌ వెల్లడించారు. ‘‘అమెజాన్‌ అందించే ప్రైమ్‌ సర్వీసుల్లో వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. దీనిలో కొన్ని ఎక్స్‌క్లూజీవ్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఉన్నాయి.’’ దీంతో కంపెనీ సభ్యత్వ నమోదు అంశాన్ని జర్మనీ ఫెడరల్‌ గవర్నమెంట్‌ దృష్టికి తీసుకెళ్లిందని తెలిపారు. గత ఏడాది గూగుల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ దాదాపు 4.3 బిలియన్‌ డాలర్లను ఫైన్‌గా విధించింది. అప్పట్లో యాంటీ ట్రస్ట్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆంక్షలు విధించింది. ఆండ్రాయిడ్‌ డివైజ్‌ తయారీదారులు ఒక్క గూగుల్‌నే ఉపయోగించేలా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తయరా చేయకుండా అడ్డుకొంది.

ఓలాను నిషేధించిన కర్ణాటక ప్రభుత్వం

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ‘ఓలా’కు కర్ణాటకలో షాక్‌ తగిలింది. ఓలా ట్యాక్సీలు, ఆటోలపై ఆ రాష్ట్ర రవాణాశాఖ ఆరు నెలల పాటు నిషేధం విధించింది. అనుమతి లేకుండా బైక్‌ ట్యాక్సీలను నడుపుతున్నందుకు గానూ రవాణాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలను నడపం నిషేధం. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ గత జనవరి నుంచి ఓలా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో బైక్‌ ట్యాక్సీలను నిర్వహిస్తోంది. దీంతో రవాణాశాఖ ఓలాకు గతంలో షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వీటికి స్పందించిన సంస్థ.. ప్రజల నుంచి సమాచారం సేకరించేందుకు బీటా పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ ట్యాక్సీలను నడుపుతున్నామని తెలిపింది. అయితే సంస్థ ఇచ్చిన వివరణ అసంపూర్ణంగా ఉండటంతో ఓలాపై రవాణాశాఖ చర్యలు చేపట్టింది. ఆరు నెలల పాటు ఓలా లైసెన్సును సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ట్యాక్సీలు, ఆటోలు నడపకుండా నిషేధం విధించింది. ఈ నిషేధంపై ఓలా అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఇది చాలా దురదృష్టకరం. చట్టాలకు అనుగుణంగానే ఓలా వ్యవహరిస్తుంది. ప్రజల రవాణా సదుపాయాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ఈ విషయంపై అధికారులతో చర్చిస్తున్నాం’ అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

నాకు లేని రోగం లేదు. నేను రాను. రాలేను.

అనారోగ్యంగా ఉన్న కారణంగా తాను భారత్‌కు తిరిగి రాలేనని, ప్రయాణం చేసే పరిస్థితుల్లో కూడా లేనని ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ ముంబయి కోర్టుకు విన్నవించాడు. తన తరఫున వాదిస్తున్న న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశాడు. తనకు చాలా రోగాలున్నాయని, ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లలేనని, ప్రయాణం అస్సలు చేయలేనని చెప్పాడు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన నీరవ్‌ మోదీ, అతని మామ మెహుల్‌ చోక్సీ విదేశాలకు పారిపోయి అక్కడ పౌరసత్వాలు పొంది వ్యాపారాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నీరవ్‌మోదీ లండన్‌లో పట్టుబడ్డాడు. దీంతో ఇప్పుడు మెహుల్‌ చోక్సీ ఈ విధంగా స్పందించడం కోర్టు నుంచి తప్పించుకొనే ప్రయత్నంగానే కనిపిస్తుంది. మళ్లీ ఈ కేసు ఏప్రిల్‌ 9న విచారణకు రానుంది. తాను ప్రయాణం చేసే పరిస్థితుల్లో లేడని నమ్మించేందుకు 38 పత్రాలను న్యాయస్థానం ముందుంచాడు. వాటిలో మెడికల్‌ రిపోర్టులు, ఇతనికి ఉన్న వ్యాధులకు చికిత్సల కోసం వైద్యులు వేరొక ఆసుపత్రికి సిఫారసు చేస్తూ రాసిన లేఖలు ఉన్నాయి. రక్త కణాలు సరిగా లేవని చూపించేందుకు ఆంజియోగ్రామ్స్, అల్డ్రా సౌండ్‌ నివేదికలు, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్టు, మోకాళ్ల జాయింట్లు, వెన్నెముక సరిగా లేవని తెలిపే రిపోర్టులు, రక్త పరీక్షల రిపోర్టులు, వెన్నెముకకు సంబంధించిన రేడియోగ్రాఫ్‌లు, ఎక్స్‌రేలు, వైద్యులను సంప్రదించినట్లు తెలిపే పత్రాలను అతని తరఫు న్యాయవాది కోర్టు ముందుంచారు. ఇన్ని వ్యాధులు చుట్టుముట్టినందున చోక్సీ భారత్‌కు తిరిగి రాలేరని అతని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మెహుల్‌ చోక్సీపై న్యాయస్థానం తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధమని అతని న్యాయవాది అన్నారు. అతను చేసింది ఆర్థిక నేరమే కాబట్టి దానికి నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేయడం తగదంటూ వాదించారు.

జెట్ పైలట్లకు “స్పైస్” మక్కువ

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ గత మూడు నెలలుగా పైలట్లు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వట్లేదు. దీంతో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘జెట్‌’ సిబ్బంది కంపెనీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వందల మంది ‘జెట్‌’ పైలట్లు.. బడ్జెట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో ఇంటర్వ్యూలకు హాజరైనట్లు తెలుస్తోంది. బోయింగ్‌ విమానాలు నడిపిన అనుభవం ఉన్న దాదాపు 260 మంది పైలట్లు స్పైస్‌జెట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 150 మంది కెప్టెన్లు కూడా ఉన్నారు. వీరంతా బుధవారం ఇంటర్వ్యూలకు హాజరైనట్లు సమాచారం. మరో విమానయాన సంస్థ ఇండిగోకు కూడా పలువురు ‘జెట్‌’ సిబ్బంది దరఖాస్తు చేసుకుంటున్నారట. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ. 8200 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. లీజు చెల్లించలేక ఇప్పటికే అనేక విమానాలను సంస్థ నిలిపివేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు మొత్తంగా 119 విమానాలుండగా.. వీటిలో మూడోవంతు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకవేళ సంస్థ మూతపడితే 23,000 మంది సిబ్బంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికే జీతాలు లేక సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌ నిలిపివేసిన బోయింగ్‌ విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్‌జెట్‌ భావిస్తోందట. జెట్‌ ఎయిర్‌వేస్‌కు విమానాలను అద్దెకిచ్చిన మూడు కంపెనీలు గతవారం స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌ అజయ్‌ సింగ్‌ను కలిశాయి. జెట్‌తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుని ఈ విమానాలను స్పైస్‌జెట్‌కు లీజుకివ్వాలని ఆ కంపెనీలు యోచిస్తున్నాయి. ఇందుకు స్పైస్‌జెట్‌ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. జెట్‌ ఎయిర్‌వేస్‌ను పునరుద్ధరించాలంటే ప్రస్తుత యాజమాన్యాన్ని మార్చాలని బ్యాంకర్లు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

హెలికాఫ్టర్లు లేవు

అసలే సార్వత్రిక ఎన్నికలు. మొదటి, రెండో దశలకు నోటిఫికేషన్‌ సైతం విడుదలైంది. ముఖ్యనేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టించాలంటే.. విమానమో లేక హెలికాప్టరో కచ్చితంగా ఉండి తీరాల్సిందే. దీంతో దేశంలోని రాజకీయపార్టీలన్నీ హెలికాప్టర్ల వైపు చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు అద్దెకు తీసేసుకుని జాగ్రత్తపడ్డాయి. ఇప్పుడు అద్దెకు తీసుకుందామంటే ఒక్కటంటే ఒక్కటీ దొరకని పరిస్థితి. చిన్న విమానాలు లేక హెలికాప్టర్లు అద్దెకు ఇచ్చే కార్యాలయాలకు వెళితే ‘అద్దెకు అందుబాటులో లేవు’ అన్న బోర్డు కనిపిస్తోంది.
**దేశంలోని పౌర హెలికాప్టర్ల సంఖ్య 275. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కొర్పొరేట్‌ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలకు చెందినవాటిని తీసేస్తే.. ఓ 75 మాత్రం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో అద్దెకు ఉన్నాయి. 2,000 అడుగుల నుంచి 3,000 అడుగుల ఎత్తులో గంటకు వంద నుంచి 140 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించే హెలికాప్టర్లు అంటే మన నేతలకు మక్కువ ఎక్కువ. ప్రచారంలో తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలను చుట్టేసే వీలుండడమే ఇందుకు కారణం. మరోవైపు, అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా.. మన దగ్గర చిన్న విమానాలు, హెలికాప్టర్లు తగినన్ని అందుబాటులో ఉండవు. దీంతో అద్దెకు ఇచ్చే సంస్థలు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే ‘పని’ చక్కబెట్టేశాయి. యూరోకాప్టర్‌, రాబిన్‌సన్‌, బెల్‌, సికోర్‌స్కై తదితర కంపెనీల హెలికాప్టర్లన్నీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బుక్‌ అయిపోయాయి.
**డిమాండ్‌ వేటికంటే..
ఒకే ఇంజిన్‌తో నడిచే సెస్నా వంటి హెలికాప్టర్లను వివిధ కారణాలతో ఎన్నికలకు సంబంధించిన పనుల్లో వాడడం లేదు. రెండు ఇంజిన్ల టర్బోప్రాప్స్‌లకు డిమాండ్‌ విపరీతంగా ఉంది. ‘‘పైలట్‌తోపాటు ఐదుగురు ప్రయాణించే వీలున్న ఎయిర్‌ సీ-90, ఇద్దరు పైలట్లతోపాటు ఎనిమిది మంది ప్రయాణించే వీలున్న ఎయిర్‌ బి-200కు బాగా డిమాండ్‌ ఉంది. ఈ రకం విమానాలు 24 వరకు భారత్‌లో ఉన్నా.. ప్రస్తుతం ఏ ఒక్కటీ అద్దెకు అందుబాటులో లేదు’’ అని ముంబయికి చెందిన విమానయాన రంగ నిపుణుడు ప్రదీప్‌ థాంపీ చెప్పారు.
* భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వంటి అగ్రనేతలు చిన్న హెలికాప్టర్లలో ప్రయాణించరు. తాము ప్రచారం చేయాలనుకున్న ప్రాంతానికి దగ్గర్లోని విమానాశ్రయం వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్‌ లేదా చిన్న విమానంలో ప్రయాణిస్తారు. రక్షణ, భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఏర్పాట్లు తప్పనిసరి.
***ప్రధానికి మాత్రం మినహాయింపు
ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏ ఒక్కరూ ప్రభుత్వ హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రయాణించడానికి వీల్లేదు. అద్దెకు తీసుకోవాల్సిందే. భద్రతా పరమైన కారణాల వల్ల ప్రధానమంత్రి మాత్రం భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) హెలికాప్టర్‌లో ప్రయాణించొచ్చు.
సగం హెలికాప్టర్లు భాజపా దగ్గరే కచ్చితమైన సమాచారం లేకున్నా.. దేశంలోని మొత్తం హెలికాప్టర్లలో 50 శాతం వరకు భాజపా అద్దెకు తీసుకుంది. చాలా రాజకీయపార్టీలు ఒకేసారి 45 రోజుల నుంచి 60 రోజుల వరకు హెలికాప్టర్లను బుక్‌ చేసేసుకున్నాయి.
**రూ.లక్షలు ధారపోయాల్సిందే..
హెలికాప్టర్‌ లేదా చిన్న విమానం రకాన్ని బట్టి గంటకు రూ.75,000 నుంచి రూ.3,50,000 వరకు చెల్లించాలి. గాల్లోకి ఎగిరిందా లేదా అనేదానితో సంబంధం లేకుండా.. రోజుకు కనీసం మూడు గంటల అద్దె చెల్లించాలి.

నీరవ్ మోడీ అరెస్టు

ఆర్థిక నేరగాడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్‌లో బుధవారం అరెస్టు చేశారన్న వార్తలు పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్ల మీద ప్రభావం చూపాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆ బ్యాంకు షేరు 3.37 శాతం పెరిగి రూ.93.55 వద్ద స్థిరపడింది. నీరవ్‌ మోదీని ఈ రోజు వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు యూకే పోలీసులు వెల్లడించారు. పంజాబ్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో అతడు నిందితుడు. ఈ కేసులో అతడి బంధువు మోహుల్ ఛోక్సీ కూడా నిందితుడే. నీరవ్ లండన్‌ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు బ్రిటిష్ మీడియా బయటపెట్టిన వివరాల ద్వారా వెల్లడైంది. దాంతో ప్రభుత్వం మీద విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే చట్టపరమైన చర్యల తర్వాత నీరవ్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది.

సంపద పెరిగింది

ప్రపంచంలోనే వంద బిలియన్‌ డాలర్ల సంపద గల కుబేరులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ కాగా.. మరో సంపన్నుడు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌. ఈ ఏడాది గేట్స్‌ సంపద 100 బిలియన్‌ డాలర్లు దాటినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్ వెల్లడించింది. జెఫ్‌ బెజోస్‌ సంపద 145.6బిలియన్‌ డాలర్లు. ఈ ఒక్క ఏడాదే బెజోస్‌ సంపద 20.7 బిలియన్‌ డాలర్లు పెరగగా.. గేట్స్‌ ఆస్తులు 9.5 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. కాగా.. బిల్‌గేట్స్‌ 100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ దాటడం ఇదే తొలిసారి కాదు. 1999లో గేట్స్‌ ఆస్తిపాస్తులు 100 బిలియన్‌ డాలర్లను దాటాయి. అయితే ఆ తర్వాత తన సంపదలో కొంత గేట్స్‌ ఫౌండేషన్‌కు ఇవ్వడంతో ఆయన నెట్‌వర్త్‌ తగ్గింది. గేట్స్ తర్వాత ఈ ఘనత సాధించిన మరో వ్యక్తి బెజోస్‌. అమెజాన్‌ అమ్మకాలతో బెజోస్‌ చాలా తక్కువ సమయంలోనే 100 బిలియన్‌ డాలర్ల సంపద ఆర్జించి.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.అయితే ఈ ఘనత వీరికి ఎక్కువ కాలం ఉండకపోవచ్చని బ్లూమ్‌బర్గ్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. గేట్స్‌ ఫౌండేషన్‌ కోసం ఇప్పటికే బిల్‌గేట్స్ 35 బిలియన్‌ డాలర్లకు పైగా విరాళమిచ్చారు. తన సంపదలో సగాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌కు ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఆయన ఆస్తులు తగ్గే అవకాశముంది. ఇక బెజోస్ తన భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నారు. భరణం కింద ఆయన ఆస్తుల్లో కొంత భార్యకు ఇవ్వనున్నారు.

ఎంత పని చేస్తివి బావా!

ప్రపంచ కుబేరుడు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు సంబంధించిన అత్యంత వ్యక్తిగత సమాచారం లీకై వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ‘నేషనల్‌ ఎంక్వైరర్‌’ అనే పత్రిక వీటిని ప్రచురించింది. వీటిని బెజోస్‌ స్నేహితురాలి తమ్ముడే రెండు లక్షల డాలర్లకు ఆ పత్రికకు విక్రయించినట్లు తేలింది. గత జనవరిలో ఎంక్వైరర్‌ పత్రిక బెజోస్‌కు సంబంధించిన టెక్స్ట్ సందేశాలను ప్రచురించింది. మాజీ యాంకర్‌ లారిన్‌తో బెజోస్‌కు వివాహేతర సంబంధం ఉందని పేర్కొంది. ఈ విషయం బయటకు రాగానే జెఫ్‌ భార్య మెకన్జీ విడాకులు ఇచ్చేశారు. ఫిబ్రవరిలో తన కాపురంలో ఎంక్వైరర్‌ పత్రిక నిప్పులు పోసిందిని, డబ్బుకోసం బ్లాక్‌ మెయిల్‌ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ ఇంకో వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది. బెజోస్‌కు చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక తరచూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఆప్తమిత్రుడైన ఎంక్వైరర్‌ యజమాని డేవిడ్‌ పెస్కర్‌ రంగంలోకి దిగి ఈ టెక్స్ట్‌ మెసేజ్‌లను సంపాదించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జెఫ్‌ భార్యకు విడాకులు ఇచ్చాక అధ్యక్షుడు ట్రంప్‌ ఆయన్ను కసిదీరా ‘జెఫ్‌ బోజోస్‌’ అంటూ హేళన చేశారు. తాజాగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ మరో సంచలన కథనం ప్రచురించింది. జెఫ్‌ రహస్య స్నేహితురాలు లారెన్‌ సోదరుడే మిషెల్‌ ఈ వ్యవహారానికంతా కారణమని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తాన్ని పరిశోధించిన సెక్యూరిటీ అధికారి కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. రాజకీయ కారణాలతోనే మిషెల్‌ వీటిని లీక్‌ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. ట్రంప్‌ అంతర్గత మిత్రవర్గంలో మిషెల్‌ కూడా ఉన్నాడని అభిప్రాయపడ్డారు. మిషెల్‌ ఈ సమాచారం లీక్‌ చేసినందుకు 2లక్షల డాలర్ల డబ్బు తీసుకొనే ఉంటాడని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. సాధారణంగా డబ్బు చెల్లించని సమాచారాన్ని పత్రికలు ప్రచురించవు. కానీ ఇవి కేవలం వదంతులు మాత్రమేనని మిషెల్‌ కొట్టిపారేశాడు. దీనిపై బెజోస్‌, లారెన్‌ స్పందించాల్సి ఉంది.

ఓలాలోకి కీయ-హ్యుండాయి!

దేశీయ క్యాబ్‌ సర్వీస్‌ల దిగ్గజం ఓలాలో హ్యుందాయి‌, కియా కంపెనీలు దాదాపు 300 మిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ విషయాన్ని ఓలా కూడా ధ్రువీకరించింది. కియా, హ్యుందాయ్‌లు సంయుక్తంగా ఈ పెట్టుబడి పెడుతున్నాయని వెల్లడించింది. భారత్‌లో అవసరాలకు తగినట్లు విద్యుత్తు కార్ల తయారీ, ఓలా వ్యాపార భాగస్వాములైన డ్రైవర్లకు అవసరమైన విధంగా వాహనాలను అందజేయడం, వాహనాల తరలింపు వంటి అంశాల్లో సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించాయి. ఓలాలో 4శాతం వాటా కొనుగోలు చేసే ఆలోచనలో హ్యుందాయ్‌ ఉందని వార్తలు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడింది. ‌ ‘హ్యుందాయ్‌ వ్యాపార వ్యూహంలో భారత్‌ అంత్యంత కీలకం. మా లక్ష్యాలను చేరుకోవడానికి ఓలాతో భాగస్వామ్యం ఉపకరిస్తుంది. దీని ద్వారా స్మార్ట్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ విభాగంలో అడుగుపెట్టే ప్రక్రియ వేగవంతమవుతుంది.’’ అని హ్యుందాయ్‌ ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ఛైర్మన్‌ యూసున్‌ చుంగ్‌ వెల్లడించారు.

అన్నయ్య దెబ్బకు లాభాల్లోకి

ఎరిక్సన్‌ కంపెనీకి బకాయిల చెల్లింపుతో అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) షేర్లు లాభాల బాట పట్టాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 10శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 10శాతం లాభంతో రూ. 4.4 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన ఇతర కంపెనీలు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, హోమ్‌ ఫైనాన్స్‌, నావెల్‌, నిప్పాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కూడా 4-5శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎరిక్సన్‌కు బకాయిలు, వడ్డీ, జరిమానాలతో కలిపి రూ.550 కోట్లు చెల్లించేందుకు ఈనెల 19 వరకు సుప్రీంకోర్టు అనిల్‌ అంబానీకి గడువు ఇచ్చిన సంగతి విదితమే. నిధులున్నప్పటికీ, తమ ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో, ఉద్దేశపూర్వకంగానే ఎగవేస్తున్నట్లు గుర్తించామని, కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని అనిల్‌ను గత ఫిబ్రవరిలోనే కోర్టు హెచ్చరించింది కూడా. బకాయిలు చెల్లించకపోతే అనిల్‌ను జైలుకు పంపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో గడువుకు ఒక్కరోజు ముందు అనిల్‌ ఈ మొత్తాన్ని ఎరిక్సన్‌కు చెల్లించారు. అనిల్‌ జైలుకు వెళ్లకుండా ఆయన అన్న ముకేశ్‌ అంబానీ ఈ ఆర్థిక సాయం చేశారు. విపత్కర పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన అన్నావదినలు ముకేశ్‌, నీతాలకు అనిల్‌ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

ఒక డాలరుకు రూ.68.59

నేడు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడింది. గత ఏడు నెలల్లో తొలిసారి రూ.69మార్కు దిగువకు చేరింది. నేటి ఉదయం రూ.68.91 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టి ఒక దశలో 68.57కు చేరింది. మళ్లీ ఆ తర్వాత కొద్దిగా విలువ కోల్పోయి 11.50గంటలకు 68.59 వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం కూడా దీనికి కారణమైంది. ఫిబ్రవరిలో ఈ లోటు 17నెలల అత్యల్ప స్థాయికి చేరింది. ముఖ్యంగా చమురు ధరలు తగ్గడంతో దిగుమతులు తగ్గాయి. ఫిబ్రవరి వాణిజ్యలోటు 9.60 బిలియన్‌ డాలర్లు కాగా అంతకు ముందు జనవరిలో ఇది 14.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ విషయాన్ని వాణిజ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఆదిత్య బిర్లా సంస్థకు ఐటీ నోటీసులు

ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌కు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. దాదాపు రూ.5,872కోట్ల మేరకు పన్ను చెల్లించాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. ఆదిత్యబిర్లా క్యాపిటల్‌ షేర్లకు సంబంధించి డివిడెండ్‌ చెల్లింపు విషయంలో ఈ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. దీనిపై గ్రాసిమ్‌ స్పందించింది. దీనిపై న్యాయపోరాటం చేయనున్నట్లు పేర్కొంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ను ఆదిత్య బిర్లా నువో నుంచి విడదీసిన సమయంలో షేర్ల పంపకాలకు సంబంధించిన తేడాల కారణంగా ఈ నోటీసులు జారీ అయ్యాయి.

2020 కల్లా ఇండియాలోకి టెస్లా

ఆటోమొబైల్‌ రంగ సంచలనం టెస్లా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది నాటికి కచ్చితంగా భారత్‌ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ విషయాన్ని టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ వెల్లడించారు. భారత్‌లోకి అడుగుపెట్టనివ్వకుండా నిబంధనల చట్రం ఉందంటూ విమర్శించిన పదినెలల తర్వాత మస్క్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.
ట్విటర్‌లో జరిగింది ఇదీ..ప్రొడక్టీవ్‌ సిటిజన్‌ అనే సంస్థ కజకిస్థాన్‌లో సూపర్‌ ఛార్జర్లను ఏర్పాటు చేస్తున్నామని ఎలన్‌ మస్క్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేసింది. దీనికి ఎలన్‌ మస్క్‌ స్పందిస్తూ.. లండన్‌ నుంచి బీజింగ్‌కు సూపర్‌ ఛార్జర్‌ మార్గం అని క్యాప్షన్‌ ఇస్తూ దానిని రీట్వీట్‌ చేశారు. దీనిపై భారత్‌కు చెందిన శుభం రాఠీ అనే వ్యక్తి ‘మరి భారత్‌ సంగతేంటీ..?’ అని ప్రశ్నించారు. శుభం ట్వీట్‌కు ఎలన్‌ మస్క్‌ స్పందించారు. ‘‘ఈ ఏడాది రావాడానికి ఇష్టపడతాను. సాధ్యం కాని పక్షంలో వచ్చే ఏడాదికల్లా అక్కడుంటాము’’ అని ట్వీట్‌ చేశారు. భారత్‌లో టెస్లా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ప్రతిపాదన కొంత ముందుకెళ్లినా.. గత మేలో మాత్రం కొంత వివాదాస్పదమైంది. ప్లాంట్‌ ఏర్పాటు చేసేవరకూ దిగుమతి రుసుములు, ఇతర నిబంధనలు సడలించాలని మస్క్‌ కోరారు. ఆ సమయంలో ఎలన్‌మస్క్‌ ట్వీట్‌ చేస్తూ ‘‘ప్రభుత్వ నిబంధనల విషయంలో కొంత సవాళ్లను ఎదుర్కొంటున్నాం’’ అని పేర్కొన్నారు. ఇటీవల జనవరిలో టెస్లా చైనాలో 5 బిలియన్‌ డాలర్ల వ్యయంతో ఫ్యాక్టరీ పెడుతున్నట్లు వెల్లడించింది. అమెరికా వెలుపల టెస్లా ఏర్పాటు చేస్తున్న మొదటి ఫ్యాక్టరీ ఇదే. విదేశీమార్కెట్లను చేరుకోవడానికి వీలుగా దీనిని నిర్మిస్తున్నారు. భారత్‌లో ఛార్జింగ్‌ స్టేషన్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. 2017నాటికి 425 ఛార్జింగ్‌ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి సంఖ్యను 2022 నాటికి 2,800కు చేర్చాల్సిన అవసరం ఉంది.