కెరీర్‌లో తమన్నా కొత్తదారికి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలవైపే మొగ్గు చూపిన తమన్నా వీలైనప్పుడు స్పెషల్ సాంగ్స్‌లోనూ కాలు కదిపారు. కానీ ఇప్పుడు ట్రాక్ మార్చి లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టారామె. ఆల్రెడీ తమన్నా నటించిన రెండు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు హిందీ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’, తమిళ ‘దేవి 2’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ మిల్కీబ్యూటీ మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రాజుగారి గది 3’కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘దేవి 2, రాజుగారి గది 3’ చిత్రాలు హారర్ బేస్డ్ కావడం విశేషం.తాజాగా తమన్నా మరో హారర్ సినిమాకు సై అన్నారు. ఈ చిత్రానికి రోహిన్ వెంకటేశన్ దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఈ ఏడాది నేను తీసుకున్న నిర్ణయాల్లో కొత్తగా ఉండే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించాలనే నిర్ణయం ఒకటి. ‘రాజుగారి గది 3’ చిత్రంలో నా పాత్ర రెండు కోణాల్లో ఉండటమే కాకుండా స్క్రీన్ ప్లే రెండు కాలసమయాల్లో నడుస్తుంది. ఆసక్తిగా అనిపించి సైన్ చేశాను. స్క్రిప్ట్ నచ్చితే మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. ‘రాజుగారి గది 3’ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తారు. ఇవి కాకుండా చిరంజీవి ‘సైరా’ సినిమాలో నర్తకి లక్ష్మీ అనే ఓ కీలక పాత్రను తమన్నా చేస్తున్న సంగతి తెలిసిందే.
Category: సినిమా వార్తలు
కంగనా దాస్
కన్నడ చిత్రం ‘కోటిగొబ్బ 3’లో శ్రద్ధాదాస్ చేస్తున్న పాత్ర పేరు కంగన అని తెలిసింది. ‘కోటిగొబ్బ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం ఇది. సుదీప్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఇంటర్‌పోల్ ఆఫీసర్ కంగన పాత్రలో నటిస్తున్నారు శ్రద్ధాదాస్. బెంగళూరులో షూటింగ్ జరుగుతోంది. ‘‘కోటిగొబ్బ 3 షూటింగ్ గురువారం మళ్లీ ప్రారంభం అయ్యింది. నాకు ఇష్టమైన పాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. శివకార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుదీప్‌నే కథ అందించారట. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనకుంటున్నారు. ‘కోటికొక్కడు’ అనే టైటిల్‌తో ‘కోటిగొప్ప 2’ తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
నిప్పు-నిజాయితీ
‘‘తప్పు చేసినవాళ్లు మాత్రమే భయపడతారు. నేనెప్పుడూ నిజాయతీగా ఉండడానికి ప్రయత్నిస్తా. అందుకే నాకు భయపడడం చేతకాదు’’ అంటోంది కాజల్. ప్రసుత్తం తేజ దర్శకత్వం వహిస్తున్న ‘సీత’లో నటిస్తోందామె. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. కాజల్ మాట్లాడుతూ ‘‘ఎదుటివాళ్లని గౌరవిస్తాను. వాళ్ల మాటల్ని వింటాను. కానీ నా మనసులో ఏముందో అదే మాట్లాడతాను. పరిశ్రమలో ఎక్కువకాలం అణిగిమణిగి ఉండలేం. అప్పుడప్పుడూ కాస్త దురుసుగా ఉండాలి. లేదంటే మనల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. నేనెప్పుడూ చెప్పుడు మాటల్ని వినను. అలాంటివి ప్రోత్సహించను. నాకెప్పుడూ అమ్మా, నాన్న, చెల్లాయి రూపంలో నాకో రక్షణ కవచం ఉంది. దాన్ని దాటుకుని ఎవరూ రాలేరు. వాళ్లుంటే నాకుండే ధీమానే వేరు’’ అని చెబుతోంది.
ఖాళీ లేని ఖన్నా
అటు ప్రమోషన్స్ ఇటు షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు రాశీఖన్నా. విజయ్‌సేతుపతి, రాశీ జంటగా ‘స్కెచ్’ ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. దీంతో విశాల్ ‘అయోగ్య’ (తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్) సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లారు రాశీ. విజయ్ సేతుపతి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కూడా చెన్నైలో స్టార్ట్ కానుంది.అంటే.. కొన్ని రోజులు రాశీ అక్కడే ఉంటారా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్. రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి రాశీ సూట్ కేస్ సర్దుకుని వేరే లొకేషన్‌లోకి వాలిపోవాల్సిందే. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు రాశీ. ఇలా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ.
ప్రమాణం
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సీయంగా ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఆల్రెడీ దేశంలో మస్త్ ఎలక్షన్ మజా నడుస్తోంది. కంగన ఏమైనా పాలిటిక్స్ వైపు కన్నేశారా? ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు? అని ఆలోచనలో పడకండి. ఎందుకంటే అలాంటిది ఏమీ లేదు. కంగనా ప్రమాణస్వీకారం చేయబోతున్నది వెండితెరపై. తమిళనాడు మాజీ సీయం జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్. విజయ్ దర్శకత్వంలో ‘తలైవి’ (నాయకురాలు) అనే బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హిందీలో ‘జయ’ అనే టైటిల్ పెట్టారు. శైలేష్ ఆర్ సింగ్, విష్ణువర్థన్ ఇందూరి నిర్మించనున్నారు. విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారు.ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించబోతున్నట్లు శనివారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘‘మన దేశంలో అత్యంత విజయవంతమైన మహిళా నాయకురాలు జయలలితగారు. వెండితెరపై సూపర్‌స్టార్‌గా ఎదిగి తర్వాత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఈ మెగా ప్రాజెక్ట్‌లో నా భాగస్వామ్యం ఉండబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు కంగన. ‘‘జయలలితగారి బయోపిక్‌ను తెరకెక్కించడాన్ని ఓ బాధ్యతగా భావిస్తున్నాను. చాలా జాగ్రత్తగా నిజాయతీగా తెరకెక్కిస్తాం. డైనమిక్ లీడర్ పాత్రలో ప్రతిభావంతురాలైన కంగనా రనౌత్ నటించనున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అని ఏఎల్. విజయ్ అన్నారు. అలాగే శనివారం కంగనా రనౌత్ పుట్టినరోజు. 32వ వసంతంలోకి అడుగుపెట్టారామె.
అంతా నార్మల్
సినిమా రంగంలో ప్రత్యేకమైన పరిస్థితులేమీ ఉండవు, బయట అన్ని రంగాల్లోని సూత్రాలే ఇక్కడా వర్తిస్తాయంటోంది అనుపమ పరమేశ్వరన్. మలయాళంలో ప్రయాణం మొదలుపెట్టిన ఈమె, తక్కువ సమయంలోనే దక్షిణాదిలోని నాలుగు భాషల్లో సినిమాలు చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమతో నాది ప్రత్యేకమైన అనుబంధం అని చెప్పే అనుపమ ఇటీవల మరో అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. కొత్తగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వాళ్లకి మీరు ఎలాంటి సలహాలిస్తారని అడిగితే… ‘‘వేరొకరితో నిన్ను పోల్చి చూసుకోవద్దని మాత్రమే చెబుతాన’’ని అంది అనుపమ. ‘‘బయట కూడా చాలా మందిని గమనిస్తుంటాం కదా. మనం ఏం చేస్తున్నామనే విషయం కంటే, పక్కవాళ్ల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మనం ఒకటో పాఠంలో ఉంటే, పక్క వాళ్లు పదో పాఠంలో ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్లతో మనల్ని పోల్చి చూసుకుంటే ఏం లాభం? సినిమా పరిశ్రమలోనూ అంతే. ఒకొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మన ప్రతిభని, మనదైన ప్రత్యేకతని ప్రదర్శించడంపై దృష్టిపెడితే అంతా సానుకూలమే’’అని చెప్పింది అనుపమ.
చిక్కుల్లో త్రిష
ఒకరికి మంచి చేయాలని ప్రయత్నించి తాను చిక్కుల్లో పడ్డారు త్రిష. ఆమెను కిడ్నాప్ చేసి ఓ అజ్ఞాత ప్రదేశంలోని ఓ భవంతిలో దాచారు. అక్కడి నుంచి త్రిష ఎలా బయటపడ్డారు? అందుకు ఎలాంటి సాహసాలు చేశారు అనే అంశాలను ‘పరమపదమ్ విలైయాట్టు’ అనే సినిమాలో చూడొచ్చు. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఒరియంటెడ్ సినిమా ఇది. తిరుజ్ఞానం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపిస్తారు త్రిష. మరి.. డాక్టర్‌గా ఆమె చేయబోయిన హెల్ప్ ఏంటి? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.ఆల్మోస్ట్ టాకీ పార్ట్ పూర్తయింది. ఇక పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి తక్కువ పాటలే ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమాలో త్రిష చేసే యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. అలాగే సిమ్రాన్, త్రిష ముఖ్య తారలుగా సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే… హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన హిట్ మూవీ ‘బద్లా’ తమిళ రీమేక్‌లో త్రిష నటించబోతున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా జరుగుతోంది. రాధామోహన్ దర్శకత్వం వహిస్తారట.
టర్కీలో గాయాలు
ప్రముఖ నటుడు విశాల్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన సుందర్.సి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. చిత్రీకరణ టర్కీలో జరుగుతోంది. అక్కడి రోడ్లపై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా విశాల్ బైక్ అదుపుతప్పి పడిపోయారు. దాంతో ఆయన ఎడమ చేతికి, ఎడమ కాలికి గాయమైంది. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చేతికి, కాలికి కట్టుకట్టి ఉన్న విశాల్ ఫొటోను చిత్రవర్గాలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాయి. త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు విశాల్‌కు ట్విటర్‌లో ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వైద్యులు రెండు వారాల పాటు విరామం తీసుకోవాలని సూచించారట. ఆ తర్వాత ఆయన భారత్‌కు తిరిగివస్తారు. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఆయన నటించిన ‘అయోగ్య’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ముంబయి ఉత్తర ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఊర్మిళ
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు నటి ఊర్మిళ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. ఆమె గురించి అప్పుడప్పుడూ ఆయన సోషల్‌మీడియాలో మాట్లాడుతుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ స్టిల్‌ను షేర్ చేసి.. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అయితే బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఊర్మిళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ముంబయి ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఈ వార్త తనను ఎంతో థ్రిల్ చేసిందని వర్మ అన్నారు. ఈ మేరకు ఊర్మిళ, రాహుల్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘హే ఊర్మిళ.. నీ కొత్త ప్రయాణం గురించి తెలుసుకుని ఎంతో థ్రిల్ అయ్యా. ఎంతో అందమైన మహిళవైన నువ్వు అందమైన రాజకీయ నాయకురాలివి కాబోతున్నావు’ అంటూ ‘రంగీలా’లోని ‘యాయిరే యాయిరే…’ పాట లిరిక్స్‌ను జత చేశారు. వర్మ తెరకెక్కించిన ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ, ఆమిర్ ఖాన్ నటించారు. 1995లో ఈ సినిమా విడుదలై, హిట్ అందుకుంది.
ఇంకా సస్పెన్స్ బంధాలు వదలని వర్మ చిత్రం
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టు సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వటంతో ఇక రిలీజ్ కు లైన్ క్లీయర్ అని భావించారు అంతా అయితే తాజాగా ఈ సినిమా పై మరో రెండి పిటిషన్లు వేశారు. సెన్సార్ బోర్డు అనుమతుల పై పిటిషన్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల పూర్తయ్యే వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా వేయాలంటూ మరో పిటిషన్ దాఖలైంది. ఈరెండు పిటిషన్ల విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. అయితే దర్శక నిర్మాత రాం గోపాల్ వర్మ మాత్రం ఎత్తి పరిస్థితిల్లో సినిమాను శుక్రవారం రిలీజ్ చేస్తానంటున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో నూ జోష్ పెంచారు. తాజాగా సినిమాలో నేనేం చేశాను అంటూ హాట్ టాపిక్ గా మారటంతో సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నచ్చిండే
నటి సాయి పల్లవి డేటింగ్‌లో ఉన్నారట. ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్, సాయి పల్లవి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్.. సినీ నటి అమలా పాల్ మాజీ భర్త. 2014లో విజయ్.. అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. కాగా.. సాయి పల్లవి నటించిన ‘దియా’ సినిమాకు ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగులో ‘కణం’ టైటిల్‌తో విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే పల్లవి, విజయ్ ప్రేమించుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, దీనికి సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే తనకు పెళ్లి చేసుకోవాలని లేదని, తన తల్లిదండ్రులను చూసుకోవాలనుకుంటున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సాయి పల్లవి. మరి ఇప్పుడు వస్తున్న డేటింగ్ వార్తలపై ఏమని స్పందిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం ఆమె సూర్యకు జోడీగా ‘ఎన్‌జీకే’లో నటిస్తున్నారు.
సూర్యకాంతి సాక్షిగా
జీవితపు ఆనందక్షణాలను ఫొటోలలో దాచుకుంటున్నారు కోలీవుడ్ కొత్త దంపతులు ఆర్య, సాయేషా. ఈ నెల 10న ఈ ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట విదేశాల్లో హనీమూన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సాయేషా. ‘‘సూర్యకాంతి సమక్షంలో మా ప్రేమను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాం. ఇక్కడున్న ఫొటోలను నా భర్త (ఆర్య) తీశారు. హనీమూన్ జ్ఞాపకాలను మనసులోనే కాదు.. ఫొటోల్లోనూ దాచుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సాయేషా. ఇక సినిమాల విషయానికి వస్తే… పెళ్లికిముందు గజనీకాంత్, ‘కాప్పాన్’ సినిమాలో నటించారు సాయేషా, ఆర్య. ‘కాప్పాన్’ చిత్రంలో సూర్య హీరోగా నటించారు. పెళ్లి తర్వాత ఆర్య, సాయేషా జంటగా ‘టెడ్డీ’ అనే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు శక్తిసుందర్ రాజన్ దర్శకత్వం వహిస్తారు.
కత్రినా కుమార్
‘కేసరి’ విజయంతో జోరుమీదున్నాడు అక్షయ్‌కుమార్. ‘సింబా’ తర్వాత రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సూర్యవంశీ’. ఇందులో అక్షయ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఆ గెటప్‌లో విడుదల చేసిన అక్షయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. మరి ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడీగా ఎవరు నటిస్తారంటే… కత్రినాకైఫ్ పేరు దాదాపుగా ఖాయమైంది అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రోహిత్ తన చిత్రంలో కథానాయికగా పలువుర్ని అనుకున్నా అక్షయ్.. కత్రినా పేరుని సూచించడంతో అంగీకరించినట్లు సమాచారం. ఈ ఇద్దరు కలసి నటించిన చివరి చిత్రం ‘తీస్ మార్ ఖాన్’ 2010లో విడుదలైంది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జోడీ కుదిరింది. కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘భారత్’లో నటిస్తోంది. అక్షయ్ ‘హౌస్‌ఫుల్ 4’, ‘గుడ్ న్యూస్’, ‘మిషన్ మంగళ్’ చిత్రాల్లో నటిస్తున్నాడు.
నేను సిద్ధంగా ఉన్నాను
‘‘మాది ఢిల్లీ. మూడేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. అలా ఆడిషన్స్‌లోనే ‘మజిలీ’ సినిమాకు ఎంపిక అయ్యాను. తెలుగులో నా తొలి చిత్రమిది’’ అని దివ్యాంశా కౌశిక్ అన్నారు. నాగచైతన్య హీరోగా, సమంత, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతోంది.ఈ సందర్భంగా దివ్యాంశా కౌశిక్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో నా తొలి చిత్రం సిద్ధార్థ్‌తో చేస్తున్నాను. అది మే లేదా జూన్‌లో విడుదలవుతుంది. ‘మజిలీ’ చిత్రంలో నా పాత్ర పేరు అన్షు. చైతన్యను ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తాను. నాగచైతన్య డౌన్ టు ఎర్త్ పర్సన్. అమేజింగ్ కోస్టార్. చైతన్యతో కలిసి నటించినందుకు ఆనందంగా ఉంది. ఇందులో సమంతతో కలిసి నటించలేదు. తెలుగులోకి ఎంట్రీ కాకముందు ‘ఏమాయ చేసావె’ సినిమా చూశాను. చైతన్య–సమంత పెయిర్‌ను బాగా ఇష్టపడ్డాను. ‘అర్జున్ రెడ్డి, నిన్ను కోరి’ చిత్రాలు చూశాను.‘రంగస్థలం, ఆర్‌ఎక్స్ 100’ సినిమాలు చూడాలి. సమంతగారు నటించిన ‘ఈగ’ సినిమా హిందీ అనువాదాన్ని ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. డైరెక్టర్ శివగారు ఇచ్చిన స్వేచ్ఛ, నాలో నింపిన నమ్మకంతో ‘మజిలీ’లో బాగా నటించాను. తెలుగుతో పోల్చితే తమిళ్‌లో నటించడం కొంచెం కష్టంగా అనిపించింది. కంటెంట్ ఉన్న సినిమాలే కాదు.. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. బాలీవుడ్‌లో ఆలియా భట్, కరీనా కపూర్, అనుష్కా శర్మలను ఇష్టపడతాను. ఇక్కడ సమంత నటనంటే ఇష్టం. కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.. వివరాలు త్వరలో చెబుతా’’ అన్నారు.
సుతారియా RX100
చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం అందుకున్న తెలుగు చిత్రం ‘ఆర్ ఎక్స్ 100’. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కథా నాయకుడిగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి నటిస్తున్నాడు. అతడికి జోడీగా తారా సుతారియాను ఎంపిక చేశారు. మిలన్ లుత్‌రియా దర్శకత్వం వహిస్తారు. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మాత. తారా ప్రస్తుతం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, ‘మర్జావాన్’ చిత్రాల్లో నటిస్తోంది. అవి విడుదల కాకముందే మూడో చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ‘‘తార మంచి నటి. అహాన్, తారల జోడీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. జూన్‌లో చిత్రీకరణ మొదలు పెడతామ’’న్నారు నిర్మాత సాజిద్.
పాపం వెంటాడింది
తనదైన హాస్యంతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన హాస్య నటుడు పద్మనాభం. నటుడిగానే కాదు, నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. అయితే ఒకప్పుడు ఎంతటి స్టార్ హోదా అనుభవించారో, చివరి రోజుల్లో అంత పేదరికంలో బతికారు. చిన్నతనంలో ఓ అంధుడి కంచంలో రాయివేసి అందులో ఉన్న చిల్లర డబ్బులు దొంగతనం చేశారు పద్మనాభం. పెద్దయ్యాక ఈ సంఘటన ఆయనను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ‘జాతకరత్న మిడతం భొట్లు’ సినిమాలో మిడతంభొట్లుని రాజు వద్దకు తీసుకొస్తున్నప్పుడు ఓ అంధుడు “ఇతడు చేసిన నేరం ఏంటి?” అని అడుగుతాడు. ఆ సన్నివేశ చిత్రీకరణకు ఒక నిజమైన అంధుడిని తీసుకొచ్చి షాట్ ఓకే అయ్యాక కొంతడబ్బు ఇచ్చి పంపారు పద్మనాభం. చిన్నప్పుడు చేసిన పాప పరిహారార్ధం లిటిల్ ఫ్లవర్ ‘బ్లైండ్ అండ్ డెఫ్’ సంస్థకు అప్పట్లో అయిదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో మంచితనం ఎల్లవేళలా పనిచేయదు. అందులో నెట్టుకురావాలంటే లౌక్యం అవసరం. అదిలేక చిత్తూరు నాగయ్య వంటి గొప్ప నటులు చీకటి రోజులు చూశారు. అందుకు పద్మనాభం కూడా మినహాయింపు కాదు. 1975లో ‘సినిమా వైభవం’ చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద రూ.60 వేలు అప్పుచేశారు. అందుకు హామీగా ‘దేవత’, ‘పొట్టి ప్లీడరు’, ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’, ‘శ్రీరామకథ’ సినిమాల నెగటివ్‌లను తాకట్టు పెట్టారు. ఆరు నెలల్లోగా అప్పు తీర్చకుంటే ఆ సినిమా హక్కులు ఆయన పరమవుతాయనేది అగ్రిమెంటు. గడువులోగా పద్మనాభం అప్పు తీర్చలేకపోయారు. దాంతో ఆ సినిమాల హక్కులను సదరు వ్యక్తి రాయలసీమ, ఆంధ్రా, నైజాం ఏరియాలకు రూ.2.75లక్షలకు ఆయన అమ్మేశారు. అప్పు తీరగా, మిగతా డబ్బు పద్మనాభంకు ఇవ్వలేదు. పైగా సినిమా నెగటివ్‌లు కూడా వాపసు ఇవ్వలేదు. 1983 దాకా కేసు కోర్టులో నడిచింది. కానీ, పద్మనాభానికి న్యాయం జరగలేదు. గోరుచుట్టు మీద రోకటి పోటులా సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. చివరికి ఆ వ్యక్తి మరణించాక వారి కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు తీసుకొని నెగటివ్‌లు పద్మనాభానికి ఇచ్చారు.
లీడర్2
రాజకీయం నేపథ్యంలో సాగే కథలు రానాకి బాగా అచ్చొచ్చాయి. తొలి చిత్రం ‘లీడర్’తోనే మెప్పించిన ఆయన, ‘నేనే రాజు నేనే మంత్రి’తో మరో విజయాన్ని అందుకొన్నారు. త్వరలోనే మరో చిత్రంలోనూ ఆయన రాజకీయ నాయకుడిగా ఖద్దరు దుస్తులు ధరించనున్నట్టు సమాచారం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రానికి ‘విరాటపర్వం’ అనే పేరును ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు. ‘నీది నాది ఒకే కథ’తో పరిచయమైన దర్శకుడు వేణు. తొలి చిత్రంతోనే విమర్శకుల మెప్పు పొందిన ఆయన, ఎమర్జెన్సీ నేపథ్యంలో బలమైన కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అందులో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తారు. ప్రజాస్వామ్యం, మార్క్సిజం, మానవ హక్కులు తదితర విషయాల్ని స్పృశిస్తూ సాగే చిత్రమని సమాచారం. డి.సురేష్‌బాబు నిర్మిస్తారు. జులైలో చిత్రం పట్టాలెక్కనుంది. ఇది ఎమర్జెన్సీలో మొదలై, 1992తో ముగిసే కథ అని సమాచారం. ప్రముఖ నటి టబు కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. మానవ హక్కుల కార్యకర్తగా ఆమె బలమైన పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. త్రిపురనేని సాయిచంద్ కూడా ఓ పాత్రలో నటిస్తారు.
అందం లేదు.అందుకని…
‘దంగల్’ సినిమాతో బాలీవుడ్‌లో నటిగా గుర్తింపు పొందిన ముద్దుగుమ్మ ఫాతిమా సనా షేక్. ఈ సినిమాలో ఆమె ఆమిర్ ఖాన్ కుమార్తెగా నటించారు. దీని తర్వాత ఫాతిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంలో మెరిశారు. ఓ సక్సెస్ పొందడానికి సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నానని ఫాతిమా చెప్పారు. ‘నువ్వేమీ కత్రినా కైఫ్, దీపికా పదుకొణెలా అందంగా లేవు’ అని కొందరు అన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఫాతిమా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ‘నేను బాలనటిగా పనిచేశా. అయినప్పటికీ.. ఆఫర్స్ రావడం కష్టంగా మారింది. పని దొరకలేదు. నువ్వు కత్రినా, దీపికలా అందంగా లేవు అని కొందరు అన్నారు. నువ్వు చూడటానికి హీరోయిన్‌లా లేవు కాబట్టి సినిమాలో పాత్ర ప్రాముఖ్యంతో సంబంధం లేకుండా వచ్చిన ఆఫర్ చేయాలని సలహాలు కూడా ఇచ్చారు. ‘నువ్వు బాగోలేవు’ అని ఇతరులు నాకు చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి’. ‘ఎన్నో మాటలు పడ్డా.. నా మైండ్‌లో కేవలం నటన మాత్రమే ఉంది. కెమెరా ముందు నిల్చోవచ్చు అనే కారణంతో అనేక ఆడిషన్లకు వెళ్లా. ‘దంగల్’కు ముందు నచ్చిన ప్రాజెక్టులు ఎంచుకునే పరిస్థితిలో నేను లేను. ‘దంగల్’ సినిమా అప్పట్లో నాకున్న ఒకేఒక్క ఆప్షన్. అందుకే దానిలో నటించా. ఇలాంటి పరిస్థితులు ప్రతి నటీ ఎదుర్కొంటుంది. కానీ ‘దంగల్’ తర్వాత నాకు ఆఫర్లు వస్తుండటం సంతోషంగా ఉంది. ప్రత్యేకించి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ తర్వాత నాకంటూ కాస్త గుర్తింపు ఏర్పడింది. దీనికి నాకు దాదాపు ఆరేళ్లు పట్టింది. కనీసం నేను ఎంచుకున్న రంగంలో ఉన్నందుకు కృతజ్ఞురాలిగా భావిస్తున్నా. ‘థగ్స్..’కు ముందు నాలో పోటీపడే గుణం ఉండేది. వాళ్లు ఏం చేస్తున్నారు, ఎలా తయారయ్యారు అని చూసేదాన్ని. కానీ ఇప్పుడు నా ఆలోచనలు మారిపోయాయి. అందరి ప్రయాణం ఒకలా ఉండదని అర్థమైంది. చక్కగా పనిచేస్తే ప్రశంసలు వస్తాయి. దీపిక చిత్ర పరిశ్రమలో చాలా ఏళ్లుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజలు ఆమె మంచి నటని, చక్కటి స్క్రిప్టు ఎంచుకుంటున్నారని అంటున్నారు. దేనికైనా కాస్త సమయం పడుతుంది’ అని అన్నారు. ఫాతిమా 1997లో కమల్ హాసన్ ‘చాచీ 420’ సినిమాతో బాలనటిగా పరిచయం అయ్యారు. తర్వాత పలు సినిమాల్లో నటించారు. 2015లో తెలుగులో ‘నువ్వు నేను ఒకటవుదాం’ అనే చిత్రంలో కథానాయిక పాత్ర పోషించారు. 2016లో ‘దంగల్’ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆమె రాజ్‌కుమార్ రావుకు జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నారు. అనురాగ్ బసు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
విజయం నిదానంగా వస్తుంది
సొంతంగా ఎదగడంలో ఉన్న ఆనందమే వేరు అంటోంది పూజాహెగ్డే. దక్షిణాదిన ప్రయాణం మొదలు పెట్టిన ఈమె, ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ రాణిస్తోంది. తెలుగులో మహేష్‌బాబు, ప్రభాస్‌లతో కలిసి నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ‘‘కథానాయికని కావడం ఒకెత్తైతే, పాత్రలు విసిరే సవాళ్లకి అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటూ ఎదుగుతుండడం మరో ఎత్తు. అందుకే నా ప్రతి అడుగూ నాకు సంతృప్తిని పంచుతోంద’’ని చెబుతోంది పూజాహెగ్డే. ‘‘సినిమా జీవితాన్ని కలలో కూడా ఊహించలేదు. అనుకోకుండా మోడలింగ్‌లోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత కెమెరా ముందుకు రావడం… అంతా ఒక మాయలా అనిపిస్తుంది. కథానాయికని అయ్యాక ప్రతి అడుగు ఓ సవాల్‌గానే అనిపించింది. స్వతహాగా నేను సిగ్గరిని, ఎక్కువగా మాట్లాడను. ఆ స్థితి నుంచి పాత్ర కోరుకున్నట్టుగా ఒదిగిపోతూ, వ్యక్తిగా కూడా నన్ను నేను ఉత్తమంగా తీర్చిదిద్దుకున్నా. మొదట్లో విజయం కూడా ఊరించింది. విజయం నిదానంగానే వస్తుంది, కానీ చాలా తీయగా ఉంటుందని అనుభవమైంది. ఇప్పటిదాకా ఏం చేసినా సొంతంగానే చేశా, స్వీయ అనుభవంతోనే నేర్చుకున్నా. ఈ సంతృప్తే మరిన్ని సవాళ్లని స్వీకరించేంత ధైర్యాన్ని ఇస్తోంద’’ని చెప్పింది పూజాహెగ్డే.
జయలలిత నేను ఒక్కటే!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనారనౌత్ నటించనున్నారు. శనివారం కంగనా పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘భారతదేశంలో దిగువ దక్షిణాదిలో హిందీ సినిమాలు పెద్దగా చూడకపోవడం వల్ల అక్కడికీ, బాలీవుడ్‌కి మధ్య చిన్నగ్యాప్ ఉంది. ప్రాంతీయ భాషల్లో నటించడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటా. నేను ఎదురుచూస్తున్న అవకాశం ఈ బయోపిక్ రూపంలో వచ్చింది. జయలలితగారి కథకు, నా కథకు చాలా సారూప్యత ఉంది. ఆవిడ గురించి తెలుసుకుంటుంటే నా కథను నేనే చేస్తునట్లు అనిపిస్తుంది. ఈ సందర్భంలో ఆవిడ కథ చేయాలా, నా కథ చేయాలా అన్న ఆప్షన్ నా ముందు ఉన్నప్పుడు జయలలితగారి కథే చేయాలనుకున్నా. నాతో పోలిస్తే జయలలితగారిది చాలా సక్సెస్‌ఫుల్ స్టోరి. ఇప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా. ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకోవాలనుకుంటున్నా’’ అని కంగనా రనౌత్ తెలిపారు. తమిళంలో ‘తలైవి’, హిందీలో ‘జయ’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి కె.విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి నిర్మాత.
మహర్షి-మీనాక్షి
‘నీ దూకుడు.. సాటెవ్వడూ..’ అంటూ ‘దూకుడు’ టైటిల్ సాంగ్‌లో కనిపించిన హీరోయిన్ గుర్తుండే ఉంటారు. తన పేరు మీనాక్షి దీక్షిత్. ‘లైఫ్ స్టైల్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. ‘బాడీగార్డ్, బాద్‌షా’ వంటి సినిమాల్లో టైటిల్ సాంగ్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారీ బ్యూటీ. లేటెస్ట్‌గా ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబు గాళ్‌ఫ్రెండ్‌గా కనిపిస్తారట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’.అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో మీనాక్షి కనిపిస్తారట. ఈ పాత్ర ఫుల్ గ్లామరస్‌గా ఉంటుందట. దాని కోసం మీనాక్షి తన లుక్‌ని టోటల్‌గా మార్చుకున్నారు. ‘‘వంశీగారు నాకోసం ఓ ఆసక్తికరమైన పాత్రను రాశారు. మహేశ్‌బాబుగారికి, నాకు ఉండే కెమిస్ట్రీ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది’’ అని తన పాత్ర గురించి పేర్కొన్నారు మీనాక్షి. ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. తొలి పాటను ఈ 29న విడుదల చేయనున్నారు.
శింబు పక్కన
నటుడు శింబుతో నటి కల్యాణి ప్రియదర్శన్‌కు సెట్ అవుతుందా? ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తిగా మారిన విషయం ఇదే. శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలనాలకు కేరాఫ్ ఈ పేరు. జయాపజయాల విషయాన్ని పక్కన పెడితే ఈయన చిత్రాలంటేనే సంచలనం అవుతాయి. అలాంటి శింబు తాజాగా మానాడు అనే చిత్రంలో నటించబోతున్నారు. దీన్ని వెంకట్‌ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాక్షి నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రకటన చేసి చాలా కాలమైంది. అంతేకాదు ఆ తరువాత మానాడు ఆగిపోయిందనే ప్రచారం హల్‌చల్ చేసింది. అయితే అవన్నీ వదంతులని చిత్ర వర్గాలు ఖండించారనుకోండి. మానాడు చిత్రం నిర్మాణం అవుతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇందులో శింబుకు జంటగా నటి కల్యాణి ప్రియదర్శన్‌ని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయని తాజా సమాచారం. 2013లోనే ప్రొడక్షన్స్ డిజైనర్ శాఖలో చేరిన ఈ బ్యూటీ ఆ తరువాత ఇరుముగన్ చిత్రానికి సహాయ దర్శకురాలిగానూ పని చేసింది. ఆ తరువాత తెలుగులో హలో చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ తరువాత మలయాళంలో, ఇటీవల తమిళంలోనూ పరిచయమైంది. అయితే మలయాళం, తెలుగులో నటించిన తొలి చిత్రాలు తెరపైకి వచ్చాయి. కోలీవుడ్‌లో మాత్రం వాన్ అనే చిత్రం నిర్మాణంలో ఉంది. అదేవిధంగా శివకార్తికేయన్‌కు జంటగా హీరో చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు కోలీవుడ్‌లో శింబుకు జంటగా నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇతర నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇక్కడ ఒక్క చిత్రం కూడా విడుదల కాకుండానే మూడు చిత్రాలను దక్కించుకున్న ఈ మలయాళీ బ్యూటీ ఏ మాత్రం నిలదొక్కుకుంటుందో చూడాలి. త్వరలోనే మానాడు చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని నిర్మాత సురేశ్‌కామాక్షి తెలిపారు.
వివాహం విక్టరీ
విక్టరీ వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత వివాహం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాజధాని జయపురలోని ఓ హోటల్‌లో ఆశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వేడుకకు రామ్‌చరణ్, ఉపాసన, నాగచైతన్య, సమంత, సల్మాన్ ఖాన్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జయపురలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో సమంత, నాగచైతన్య, రానా తదితరులు నృత్య ప్రదర్శన ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6న ఆశ్రిత, వినాయక్‌ల నిశ్చితార్థం జరిగిందట. కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.
వారితో పోల్చితే బాధగా ఉంటుంది
ముఖ తమిళ నటుడు రాధా రవి.. నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నయన్ నటించిన ‘కోళయుథిర్ కాలం’ అనే సినిమా ప్రచార కార్యక్రమాన్ని ఇటీవల చెన్నైలో ఏర్పాటుచేశారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. దాంతో దర్శకుడు, నిర్మాత కూడా సినిమాను వదిలేసుకున్నారు. అయినప్పటికీ పూర్తికాని ఈ సినిమా ప్రచార వేడుకకు రాధా రవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్‌పైకి వచ్చి ప్రసంగిస్తూ నయన్‌పై కామెంట్లు చేశారు. ‘నయనతార ఇప్పుడు ఒక స్టార్ నటి. ఆమెను అంతా లేడీ సూపర్‌స్టార్ అంటారు. ఆమెను ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లతో సమానంగా చూస్తారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ అమరులు. అలాంటివాళ్లతో నయనతారను పోలుస్తున్నందుకు చాలా బాధగా ఉంది. నయన్ మంచి నటే. అందుకే ఆమె ఇండస్ట్రీలో ఇన్నేళ్లు కొనసాగుతూ వచ్చారు. ఆమెపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. అయినా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. ఇలాంటి విషయాలను తమిళనాడు ప్రజలు నాలుగు రోజులకు మించి గుర్తుపెట్టుకోరు. ఒకప్పుడు సినిమాలో దేవత పాత్రలు చేయాలంటే అందుకు కేఆర్ విజయనే సంప్రదించేవారు. కానీ ఇప్పుడు ఎవరుపడితే వారు (నయన్‌ను ఉద్దేశిస్తూ) దేవతామూర్తుల పాత్రలను పోషిస్తున్నారు. నయన్ హారర్ చిత్రాల్లోనూ నటిస్తారు. చెప్పాలంటే నయన్‌ను చూసి దెయ్యాలు కూడా పారిపోతాయి’ అని వ్యాఖ్యానించారు. రాధా రవి ప్రసంగిస్తున్నప్పుడు కార్యక్రమంలో నయన్ లేరు. నయన్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. అది ఆమె ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చేసుకున్న అగ్రీమెంట్. దాంతో ఆయన మాటలు కాస్తా కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. నయన్ ప్రియుడు, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో పాటు చిన్మయి శ్రీపాద, రాధికా శరత్‌కుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు ట్విటర్ వేదికగా రాధా రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాది నేనే చెప్పుకుంటా!
తన సినిమాల గురించి స్వయంగా వెల్లడించేవరకూ ఎవ్వరి మాటలూ నమ్మొద్దని అంటున్నారు సినీ నటుడు నితిన్. ఆయన మున్ముందు చేయబోయే ప్రాజెక్ట్‌ల గురించి తప్పుడు సమాచారంతో వార్తలు వెలువుడుతున్నాయి. దాంతో ఆయన తాజాగా ట్విటర్ ద్వారా అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. ‘నేను చేయబోయే సినిమాల గురించి, అప్‌డేట్స్ గురించి నా అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా ప్రకటిస్తాను. నా గురించి వచ్చే ఎలాంటి ఫేక్ వార్తలను నమ్మకండి. థాంక్యూ’ అని నితిన్ ట్వీట్ చేశారు. గురువారం హోలీ పండుగను పురస్కరించుకుని నితిన్ తన కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల నుంచే చిత్రీకరణ మొదలు కాబోతోంది. ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలు సమకూర్చబోతున్నారు. మరోపక్క రమేశ్ వర్మ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కానీ నితిన్ మాత్రం ఈ సినిమా గురించి నిన్న ప్రకటించలేదు. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్‌ను బట్టి చూస్తే నితిన్.. రమేశ్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారన్న వార్తలు అవాస్తమని తెలుస్తోంది.
అది చేసుకోదు
తన కుమార్తె శ్రద్ధా కపూర్ మరో ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకోదని ఆమె తండ్రి, బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ స్పష్టం చేశారు. ‘సాహో’ భామ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రోహన్ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని, 2020లో వీరి వివాహ వేడుక జరగబోతోందని ప్రచారం జరిగింది. శ్రద్ధ వయసు 32 ఏళ్లు కావడంతో ఇంట్లో వాళ్లు తొందరపెడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఈ వదంతులపై శక్తి కపూర్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. ‘అవన్నీ చెత్తవార్తలే. వాటిలో నిజం లేదు. శ్రద్ధకు మరో ఐదేళ్లు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఆమె చేతిలో ప్రస్తుతం ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. వాటితో బిజీగా ఉంది. మరో రెండేళ్లు ఆమె క్యాలెండర్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది’ అని ఆయన చెప్పారు. అనంతరం రోహన్‌తో ప్రేమ గురించి ప్రశ్నించగా.. ‘గత కొన్నేళ్లుగా ‘శ్రద్ధ ఇతడ్ని ప్రేమిస్తోంది’ అంటూ చాలా మంది పేర్లు చెప్పారు. ఇది చిత్ర పరిశ్రమ.. ఇక్కడ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా అలానే అంటుంటారు. అంతలో మాత్రాన ఏదో అయిపోయినట్లు కాదు. రోహన్ తండ్రి రాకేశ్ నాకు మంచి స్నేహితుడు. మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా కుమార్తె తన జీవితంలో జరిగే ప్రతి విషయం నాకు చెబుతుంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆమె పెళ్లి చేసుకోదు’ అని శక్తి తెలిపారు.