ప్రతి విషయంలో ఎప్పుడూ ముందుండే అమెరికాను తాజాగా డ్రాగన్ చైనా వెనక్కి నెట్టేసింది. ప్రపంచంలోనే 5జీ సేవలను వినియోగిస్తున్న తొలి జిల్లాగా షాంఘై రికార్డు సృష్టించింది. దీంతో ప్రస్తుతం 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి చైనా ముందడుగు వేసినట్లైంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక పత్రిక చైనా డైలీలో తన కథనంలో పేర్కొంది.‘ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ చైనా మొబైల్ 5జీ నెట్ వర్క్ ట్రయల్ రన్‌ను అధికారికంగా షాంఘై జిల్లాలో శనివారం నుంచి ప్రారంభించింది. గత మూడు నెలల కాలంలో షాంఘైలోని వివిధ చోట్ల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా మొత్తం 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చినట్లైంది’ అని చైనా డైలీ తెలిపింది. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా షాంఘై వైస్ మేయర్ వూ క్వింగ్.. ప్రపంచంలోనే తొలి 5జీ ఫోల్డబుల్ ఫోన్ అయిన హువాయ్ మేట్ ఎక్స్ నుంచి తొలి 5జీ వీడియోకాల్‌ను చేశారు. వినియోగదారులు తమ సిమ్ కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోకుండానే ఈ సేవలను పొందవచ్చని తెలిపారు
Category: సైన్స్-టెక్నాలజీ
పిచ్చాయి…నువ్వు సూపరోయి!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ప్రశంసలు కురిపించారు. గూగుల్‌పై గతంలో విమర్శలు కురిపించిన ట్రంప్ తాజాగా యూ టర్న్ తీసుకున్నారు. పిచాయ్ అమెరికా సైన్యం కోసం పనిచేస్తున్నారు. చైనా సైన్యం కోసం కాదు. ఇది సంతోషించదగిన పరిణామామని ఆయన పేర్కొన్నారు. పిచాయ్ పూర్తిగా అమెరికా వైపు దృఢంగా నిలబడ్డారంటూ ట్వీట్ చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో వైట్‌హౌస్‌లో బుధవారం సమావేశమైన అనంతరం ట్రంప్ ట్విటర్లో పోస్ట్ పెట్టడం విశేషం. అలాగే దేశం కోసం గూగుల్ ఏమేమి చేయగలదన్న అంశాలపై కూడా సుందర్ పిచాయ్‌తో చర్చించానంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. సంచలన వ్యాఖ్యలతో టెక్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచే ట్రంప్ ఈసారి గూగుల్ విషయంలో పాజిటివ్‌గా స్పందించారు. అంతేకాదు గతంలో టిమ్ యాపిల్ అని సంబోధించిన అమెరికా ప్రెసిడెంట్, ఈసారి సుందర్ పిచాయ్‌ను ‘ప్రెసిడెంట్ ఆఫ్ గూగుల్’ అని తప్పుగా సంబోధించి మరోసారి చర్చకు తావిచ్చారు. మరోవైపు తాజా పరిణామంపై గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
అంతరిక్షంలో యుద్ధానికి “ఆపరేషన్ శక్తి”
అమెరికా.. రష్యా.. చైనా.. ఇప్పుడు భారత్..! అంతరిక్ష యుద్ధంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించడానికి తొలిఅడుగు పడింది. ‘ఆపరేషన్ శక్తి’ పేరుతో భారత్ చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక ప్రాజెక్టు విజయం సాధించింది. కేవలం మూడు నిమిషాల్లో భారత క్షిపణి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో శాటిలైట్లను కూల్చే టెక్నాలజీ ఉన్న అతితక్కువ దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ఈ విభాగంలో ఇప్పటికే రష్యా చాలా ముందుంది. అమెరికా కూడా దూసుకెళుతోంది. చైనా కూడా కొన్నేళ్ల క్రితమే దీనిని ప్రారంభించింది. భూ కక్ష్యలో దాదాపు 2000పైగా సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి. చైనా 2008లోనే ఏశాట్‌ను పరీక్షించింది. ప్రపంచ వాణిజ్యంలో అత్యధిక భాగం మహా సముద్రాల ద్వారానే జరుగుతుంది. భారత్ పరిధిలోని హిందూ మహా సముద్రంలో చమురులో 66శాతం, సరుకులలో 33 శాతం, కంటైనర్ రవాణాలో 50 శాతం రవాణా జరుగుతుంది. కొన్ని వేల నౌకలు వీటికోసం సముద్రంలో తిరుగుతుంటాయి. ఈ ప్రాంతాల్లో నిఘా వేయడంలో ఉపగ్రహాల పాత్ర చాలా కీలకం. ఈ నేపథ్యంలో కక్ష్యలో ఉన్న తమ ఉపగ్రహాలకు ఏమైనా ముప్పు వాటిల్లితే వెంటనే వాటిని రక్షించేందుకు మనకు ఒక వ్యవస్థ ఉండాలి. ఒక ఉపగ్రహం కూలిపోతే దానిని స్థానంలో మరోదానిని తీసురావడానికి చాలా కష్టపడాలి. ఉపగ్రహాలను కూల్చేందుకు ఏశాట్ టెక్నాలజీని ఇప్పుడు భారత్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 2007లో భారత్ తొలిసారి కార్టోశాట్-2ఎ ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇదే భారత్‌కు చెందిన తొలి సైనిక ఉపగ్రహం. అంతరిక్ష ఆధారిత సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ 2010జూన్‌లోనే ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని నాటి రక్షణ మంత్రి ఏకే ఆంతోనీ ప్రకటించారు. ప్రస్తుతం ఇది ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సర్వీస్ ప్రధాన కార్యాలయం పరిధిలో పనిచేస్తుంది. ఈ కార్యాలయం ఇస్రో, భారతీయ సైన్యంతో సమన్వయం చేసుకుంటుంది. డీఆర్డీవో కూడా దీనితో కలిసి పనిచేస్తుంది.
* 2009లో భారత్ తొలిసారి ఆర్ఐశాట్-2ను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ఇది ఇజ్రాయిలీ రాడార్ ఇమేజింగ్ నిఘా వలే పనిచేస్తుంది. సరిహద్దుల్లో రక్షణకు సంబంధించి దీనిని సిద్ధం చేశారు.
* 2013లో భాతర్ జీశాట్-7 రుక్మిణీని ప్రయోగించారు. ఇది పూర్తిగా సైనిక అవసరాల కోసం ప్రయోగించింది. ఇది ఇప్పుడు భారత నౌకాదళానికి అద్భుతంగా ఉపయోగపడుతోంది.
* 2017 నాటికి భారత్ వద్ద సైనిక అవసరాల కోసం 13శాటిలైట్లు అందుబాటులోకి వచ్చాయి.
జీశాట్-6ను సైనిక దళాలు ఉపయోగించుకోగా.. జీశాట్-7ను యుద్ధనౌకలు, సబ్మెరైన్లు, విమానాలు, ఇతర వ్యవస్థలు వాడుకొనేలా తీర్చిదిద్దారు. ఈ రకంగా ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ పూర్తిస్థాయి అంతరక్షి యుద్ధతంత్రానికి భారత్‌ను సిద్ధం చేసింది. భారత క్షిపణి కార్యక్రమం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. ఫలితంగా ఉపగ్రహాల వ్యూహాత్మక అవసరం భారత్‌కు అర్థమైంది. యుద్ధాల్లో వినియోగించే గైడెడ్ బాంబులు, క్షిపణులు అన్నీ శాటిలైట్ ఆధారంగా తమ లక్ష్యాలను ఛేదిస్తాయి. ఉదాహరణకు భారత్‌పై ఏదైనా దేశం క్షిపణి ప్రయోగిస్తే.. భారత్ అప్రమత్తమై ఆ క్షిపణికి మార్గనిర్దేశకత్వం చేసే శాటిలైట్‌ను కూల్చివేసి ముప్పును తప్పించుకోవచ్చు. ఈ దెబ్బకు దాడి చేసిన దేశం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ అవసరాన్ని గుర్తెరిగి ప్రత్యర్థి దేశాల శాటిలైట్లను కూల్చే సామర్థ్యాన్ని భారత్ కూడా సంపాదించింది. కాకపోతే ఈ పరీక్షను భారత్ అత్యంత రహస్యంగా ఉంచింది. గతంలో చైనా ఈ పరీక్ష నిర్వహించినప్పుడు ప్రపంచ దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం చైనా అంతరిక్ష యుద్ధ విషయంలో మరో అడుగు ముందుకేసింది. దీనికోసం డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ (డ్యూ)ల నుంచి ఎలక్ట్రోమేగ్నిటిక్ తరంగాల ఆధారంగా పనిచేసే ఈఎంపీల వైపు మళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్యూ వ్యవస్థలో అంతరిక్షంలోని శాటిలైట్ల కదలికలు కనుగోనడానికి చైనా పలు చోట్ల ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఒక సారి శత్రువు శాటిలైట్ కదలికలు కనుగొన్నాక డ్యూ ఆయుధాలు రంగంలోకి దిగుతాయి. ఇవి కెమికల్ లేజర్ సాయంతో వాటిని కూల్చివేస్తాయి. షింగ్జాంగ్లో ఇలాంటి ఒక కేంద్రం ఉంది. ఏశాట్ అంటే యాంటీ శాటిలైట్ అని అర్థం. దీనిని భూఉపరితలంపై నుంచికానీ, యుద్ధవిమానాల పై నుంచి కానీ ప్రయోగించే అవకాశం ఉంది. దాదాపు 2,000 కిలోమీటర్ల లోపు ఉన్న ఉపగ్రహాలను పేల్చివేసే సామర్థ్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది. భారత్ చేపట్టిన ‘మిషన్ శక్తి ’ చేపట్టిన ఆపరేషన్‌లో కేవలం మూడు నిమిషాల్లోనే భారత క్షిపణి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ వద్ద ఉన్న ఏ క్షిపణిని అయినా మార్పులు చేసి ఏశాట్గా వాడొచ్చని డీఆర్డీవోకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. 1985 సెప్టెంబర్ 13న యూఎస్ ఏఎస్ఎం-135 ఏశాట్‌ను ఎఫ్-15 ఈగిల్ నుంచి ప్రయోగించి ఒక ఉపగ్రహాన్ని కూల్చింది. ఇదే తొలి ఏశాట్ విజయంగా పరిగణిస్తారు. అదే సమయంలో సోవియట్ యూనియన్ కూడా ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్ష యుద్ధతంత్రంలో ప్రస్తుతం ఏశాట్ ద్వారా భూ ఉపరితలం నుంచి శాటిలైట్లను కూల్చి వేసే వ్యవస్థలను అభివృద్ధి చేశారు. అమెరికా వంటి దేశాలు ఆయుధాలను అంతరక్షింలోకి తరలించి వాటి ద్వారా భూఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే కార్యక్రమాలను కూడా చేపట్టింది. కానీ అధికారికంగా ఎక్కడా దీనికి సంబంధించిన ప్రస్తావన ఉండదు. 1967లో భారత్ ఔటర్ స్పేస్ ట్రీటీపై సంతకం చేసింది. దీనిని 1982లో పార్లమెంట్ గుర్తించింది. (రాటిఫై చేసింది). దీని ప్రకారం అంతరిక్షంలోకి సామూహిక జనహనన ఆయుధాలను తీసుకెళ్లడాన్ని నిషేధించింది. ప్రస్తుత ప్రయోగం భారత్ ఏ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదు.
SBI కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు ఇలా తీసుకోండి
దేశంలో తొలిసారిగా కార్డు లేకుండానే డబ్బులను డ్రా చేసుకునే సదుపాయాన్ని State Bank Of India తన కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఇకపై మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా… మీ కార్డు అందుబాటులో లేకపోయినా… ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫీచర్ ని SBI అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫీచర్ ఉపయోగించుకవాలంటే వారు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే దేశంలోని 16,500 ఎస్బీఐ ఏటీఎంలల్లో ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చు.
*ఈ సర్వీసు ఉన్న ఏటీఎంలకు ‘యోనో క్యాష్ పాయింట్స్’ అని SBI నామకరణం చేసింది. దీని ద్వారా మోసాలకు చెక్ పెట్టవచ్చని SBI భావిస్తోంది. కాగా కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం కల్పించిన మొట్టమొదటి బ్యాంక్ ఎస్బీఐ కావడం విశేషం. అదెలాగో ఓ సారి చూద్దాం
*స్టెప్ 1
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి YONO యాప్ డౌన్లోడ్ చేయాలి. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ పనిచేస్తుంది.
*స్టెప్ 2
యాప్ డౌన్లోడ్ అయిన తరువాత దాంట్లో మీరు రిజిస్టర్ కావాలి. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిక్వెస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయాలి. అక్కడడ మీకు అకౌంట్ నంబర్ కనిపిస్తుంది.
*స్టెప్ 3
అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి. తర్వాత 6 అంకెల యోనో క్యాష్ పిన్ సెట్ చేసుకోవాలి. దాన్ని సెట్ చేసుకోగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎస్ఎంఎస్ వస్తుంది.
*స్టెప్ 4
ఈ రిఫరెన్స్ నెంబర్ కేవలం 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఈ నంబర్ గుర్తు పెట్టుకుని మీరు మీకు దగ్గర్లో ఉన్న యోనో క్యాష్ పాయింట్‌కు వెళ్లాలి. అక్కడ ముందుగా మీకు ఎస్ఎంఎస్లో వచ్చిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి.
*స్టెప్ 5
మీరు యాప్‌లో ఎంటర్ చేసిన అమౌంట్‌ను ఏటీఎంలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు యాప్‌లో క్రియేట్ చేసిన 6 అంకెల యోనో క్యాష్ పిన్ను ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇలా ప్రతి సారి మీరు పై ప్రాసెస్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
మా ఉద్యోగులందరికీ మీ పాస్వర్డ్లు తెలుసు
కోట్లాది మంది ఖాతాదారుల పాస్ వర్డ్ లు తమ ఉద్యోగులకు కనిపిస్తుంటాయని, ఇంటర్నల్ సర్వర్లలో వాటిని దాచామని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
“మరింత స్పష్టంగా చెప్పాలంటే, ఈ పాస్ వర్డ్ లు ఫేస్ బుక్ బయటివారికి ఎన్నటికీ కనిపించవు. ఉద్యోగులకు కనిపిస్తుంటాయి.
వాటిని మా ఉద్యోగులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఇంతవరకూ లేవు” అని సంస్థ ఇంజనీరింగ్, సెక్యూరిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ పెడ్రో కనాహువాటి తన బ్లాగ్ లో వెల్లడించారు.
ఉద్యోగులకు పాస్ వర్డ్ లు కనిపిస్తాయన్న విషయాన్ని ఈ సంవత్సరం ప్రారంభంలోనే తాము తెలుసుకున్నామని ఆయన చెప్పడం గమనార్హం.
ఇప్పటికే డేటా భద్రతపై అందోళన వెల్లువెత్తుతున్న వేళ, పాస్ వర్డ్ లను ప్లెయిన్ టెక్ట్స్ ఫార్మాట్ లో సర్వర్లలో దాచామని,
అవి సంస్థ ఉద్యోగులకు తప్ప మరొకరికి కనిపించవని చెప్పడం భద్రతా నిబంధనలకు విరుద్ధమేనని సైబర్ నిపుణులు మండిపడుతున్నారు.
కాగా, ఫేస్ బుక్ పాస్ వర్డ్ ల విషయమై ‘క్రెబ్స్ ఆన్ సెక్యూరిటీ డాట్ కామ్’ అనే సెక్యూరిటీ న్యూస్ వెబ్ సైట్ గతంలోనే కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే.
దాదాపు 60 కోట్ల మంది పాస్ వర్డ్ లు సాధారణ అక్షరాల్లో ఉన్నాయని, వీటిని సుమారు 20 వేల మంది ఉద్యోగులు చూస్తున్నారని సంస్థ తెలిపింది.
కంప్యుటర్లో వైరస్ ఉందని 9కోట్లు నొక్కేశాడు
పోంజీ స్కామ్ ద్వారా సుమారు రూ.8.9 కోట్ల మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యాపారవేత్తకు అమెరికా కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అమ్రిత్ జస్వంత్ సింగ్ చహల్(31) న్యూయార్క్‌లో ప్రైవేటుగా మూలధన పెట్టుబడుల కంపెనీ నిర్వహిస్తున్నాడు. కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ, తమ కంపెనీ ఏటా కనీసం 28-34 శాతం లాభాలు ఆర్జిస్తోందంటూ సుమారు 40 మందిని చహల్ మోసగించినట్టు కోర్టులో నిరూపణ అయ్యింది. నష్టాల విషయం బయటపడకుండా తప్పుడు బ్రోకరేజ్ రికార్డులు కూడా సృష్టించాడు. దీంతోపాటు ఓ పెట్టుబడిదారు పేరిట నకిలీ బ్యాంకు ఖాతాను తెరిచి, సొమ్మును ఆ ఖాతాల్లోకి మళ్లించడం ద్వారా తన వ్యక్తిగత అవసరాలకు నగదు వినియోగించుకున్నట్టు నిరూపణ అవడంతో కోర్టు జైలుశిక్ష విధించింది. అలాగే, ఉత్తర కరోలినాలోని షార్లెట్‌లో ఇతరుల కంప్యూటర్లను హ్యాక్ చేయడం ద్వారా రూ.20 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో భారతీయ అమెరికన్ బిషప్ మిట్టల్(24)ను మేజిస్ర్టేట్ కోర్టు దోషిగా తేల్చింది. వందలాదిమంది కంప్యూటర్లలోకి తప్పుడు పాప్పలు పంపించడం ద్వారా కంప్యూటర్లు పనిచేయకుండా చేశారు. దీంతోపాటు వైరస్, తదితర సమస్యలు ఉంటే తమ కంపెనీని సంప్రదించాలంటూ కంపెనీ పేరు, ఫోన్ నంబరు స్ర్కీన్‌పై కనిపించేలా చేశారు. బాధితులు ఆ ఫోన్ నంబరుకు సంప్రదిస్తే, వైరస్, ఇతర సమస్యలు తొలగించడానికి అంటూ ఒక్కొక్కరి నుంచి రూ.13 వేల నుంచి రూ.1.64 లక్షల వరకూ వసూలు చేశారు. కోర్టులో నేరం అంగీకరించిన మిట్టల్‌ను పూచీకత్తుపై విడుదల చేశారు. శిక్ష వెల్లడించే తేదీని న్యాయమూర్తి ప్రకటించలేదు.
కార్బైడ్ అంటుకుంటే కాళ్ళు విరగ్గొట్టండి-కోర్టు
వివిధ రకాల పళ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పారిశ్రామిక అవసరాలు, చట్టం నిర్దేశించిన అవసరాలకు మినహా మిగిలిన వాటికి కార్బైడ్‌ను ఉపయోగించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట వ్యతిరేకంగా కార్బైడ్ కలిగి ఉన్న వ్యక్తులపై కఠినచర్యలు తీసు కోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. దీనిపై ఓ నివేదికను తమ ముందుంచాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయి దా వేసింది. ఈ మేరకు ప్రధానన్యాయమూర్తి (సీజే) తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పళ్లను మగ్గబెట్టేందుకు కొందరు వ్యాపారులు విచ్చలవిడిగా కార్బైడ్‌ను ఉపయోగిస్తుండటంపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. వీటిని హైకోర్టు 2015లో సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) గా పరిగణించింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భం గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆహార భద్రత అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇం దుకు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా వచ్చిందని వివరించారు. కొత్తగా 36 ఆహార భద్రతా అధికారుల పోస్టులను సృష్టించామని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థులు, ఇతరులకు చెం దిన రిజర్వేషన్ల వ్యవహారంపై మరింత స్పష్టత అవసరం ఉందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాస నం స్పందిస్తూ అటువంటిదేమీ అవసరం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని, చట్ట నిబంధనల మేరకు ఆ ఉత్తర్వులను అమలు చేస్తే సరిపోతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఆహార భద్రతా అధికారుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్ïపీఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. ఆహార భద్రతారంగం ఎదుర్కొం టున్న పెద్ద సవాళ్లలో కార్బైడ్ వినియోగం ఒకటని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఆ జరిమానా పక్కన సున్నాలు వింటే గుండె జారీ గల్లంతవుతుంది
ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌పై మరోసారి పిడుగు పడింది. ఆ సంస్థకు యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. సెర్చింజిన్ తన విధులను మర్చిపోయి నమ్మకాన్ని కోల్పోయిందని యూనియన్ పేర్కొంది. దీనిపై ఈయూ కాంపిటీషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాగర్ మాట్లాడారు. ‘ఈరోజు కమిషన్ గూగుల్‌కు జరిమానా విధించింది. 1.49 బిలియన్ యూరోలు జరిమానా కింద చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లో ఆ సంస్థకున్న మంచి పేరును, అధికారాన్ని గూగుల్ దుర్వినియోగం చేసింది. ఈ సంస్థ వల్ల కొన్ని కంపెనీలు బాగా లాభాలు గడిస్తున్నాయి. వినియోగదారులు మోసపోతున్నారు. కస్టమర్లే ప్రతి కంపెనీకి ప్రధానం. వారి విశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా వారిని ఇబ్బందులకు గూగుల్ గురి చేస్తోంది. ఇది వినియోగదారుల చట్టాలకు విరుద్ధం. వారి స్వేచ్ఛను, ఎంపికను ఈ సంస్థ హరిస్తోంది.దీని వల్ల గూగుల్ తన సుస్థిర స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.’ అని మార్గరెట్ తెలిపారు.
సరిగ్గా 18 నిముషాలు
భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అమీర్‌పేట – హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20 నుంచి ఈ మార్గంలో సేవలు ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రముఖ కార్పోరేట్ సంస్థలు, ఐటీ సంస్థలు హైటెక్‌సిటీ ప్రాంతంలోనే ఉండటంతో ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోంది. ఈ మార్గంలో మెట్రో రైలు మార్గం పూర్తికావడంతో ట్రాఫిక్ సమస్యకు తెరపడనుంది. ఇకపై అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీకి సుమారు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. అమీర్‌పేట, మధురానగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నం -5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్‌సిటీ. హైదరాబాద్ మహా నగరంలోని మొత్తం మూడు మెట్రో రైలు కారిడార్లలో 56 కి.మీల వరకు మెట్రో సేవలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.
తానా-క్యూరీ పోటీలకు సర్వం సిద్ధం
2020 కల్లా ఇండియాలోకి టెస్లా
ఆటోమొబైల్ రంగ సంచలనం టెస్లా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది నాటికి కచ్చితంగా భారత్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ విషయాన్ని టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ వెల్లడించారు. భారత్‌లోకి అడుగుపెట్టనివ్వకుండా నిబంధనల చట్రం ఉందంటూ విమర్శించిన పదినెలల తర్వాత మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ట్విటర్లో జరిగింది ఇదీ..ప్రొడక్టీవ్ సిటిజన్ అనే సంస్థ కజకిస్థాన్‌లో సూపర్ ఛార్జర్లను ఏర్పాటు చేస్తున్నామని ఎలన్ మస్క్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. దీనికి ఎలన్ మస్క్ స్పందిస్తూ.. లండన్ నుంచి బీజింగ్‌కు సూపర్ ఛార్జర్ మార్గం అని క్యాప్షన్ ఇస్తూ దానిని రీట్వీట్ చేశారు. దీనిపై భారత్‌కు చెందిన శుభం రాఠీ అనే వ్యక్తి ‘మరి భారత్ సంగతేంటీ..?’ అని ప్రశ్నించారు. శుభం ట్వీట్‌కు ఎలన్ మస్క్ స్పందించారు. ‘‘ఈ ఏడాది రావాడానికి ఇష్టపడతాను. సాధ్యం కాని పక్షంలో వచ్చే ఏడాదికల్లా అక్కడుంటాము’’ అని ట్వీట్ చేశారు. భారత్‌లో టెస్లా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ప్రతిపాదన కొంత ముందుకెళ్లినా.. గత మేలో మాత్రం కొంత వివాదాస్పదమైంది. ప్లాంట్ ఏర్పాటు చేసేవరకూ దిగుమతి రుసుములు, ఇతర నిబంధనలు సడలించాలని మస్క్ కోరారు. ఆ సమయంలో ఎలన్‌మస్క్ ట్వీట్ చేస్తూ ‘‘ప్రభుత్వ నిబంధనల విషయంలో కొంత సవాళ్లను ఎదుర్కొంటున్నాం’’ అని పేర్కొన్నారు. ఇటీవల జనవరిలో టెస్లా చైనాలో 5 బిలియన్ డాలర్ల వ్యయంతో ఫ్యాక్టరీ పెడుతున్నట్లు వెల్లడించింది. అమెరికా వెలుపల టెస్లా ఏర్పాటు చేస్తున్న మొదటి ఫ్యాక్టరీ ఇదే. విదేశీమార్కెట్లను చేరుకోవడానికి వీలుగా దీనిని నిర్మిస్తున్నారు. భారత్‌లో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. 2017నాటికి 425 ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి సంఖ్యను 2022 నాటికి 2,800కు చేర్చాల్సిన అవసరం ఉంది.
ఎందుకు ఆగిపోయింది?
భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఫేస్బుక్ పనిచేయడం లేదు. భారత్‌లో నిన్న రాత్రి పది గంటల నుంచి ఈ సమస్య ఉంది. దీంతో ఫేస్బుక్ ఉపయోగించే వారికి ఇబ్బందులు తప్పలేదు. దీనికి సంబంధించి ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ తెలిపింది. సాంకేతిక సమస్యల వల్ల ఫేస్బుక్లో అంతరాయం ఏర్పడినట్లు అధికారికంగా ట్విట్టర్లో తెలిపారు. కానీ ఫేస్‌బుక్‌పై సైబర్ దాడి ఏమైనా జరిగిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఖరగ్‌పూర్ ఐఐటీ నుండి ఓ పెను విప్లవం
నకిలీ కరెన్సీని గుర్తించే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను ఐఐటీ-ఖరగ్‌పూర్ విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ నెల 2-3 తేదీల్లో జరిగిన జాతీయస్థాయి ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2019’ తుది పోటీల్లో ఈ ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇమేజ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానంతో స్మార్ట్ ఫోన్ ద్వారా నకిలీ భారతీయ కరెన్సీని గుర్తించేలా… ఆరుగురు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. టి.వై.ఎస్.ఎస్.సంతోష్, సతీశ్‌కుమార్‌రెడ్డి, విపుల్ తోమర్, సాయికృష్ణ, తులనీ, డి.వి.సాయిసూర్య ఈ క్రతువులో పాలుపంచుకున్నారు. ఫోన్ ద్వారా కరెన్సీని స్కాన్ చేస్తే… అది నకిలీ నోటా, కాదా అన్నది తేలిపోతుందని వారు వివరించారు. మరో ఆరుగురు విద్యార్థుల బృందం చిన్నపాటి సెన్సర్ల ద్వారా ‘న్యూక్లియర్ రేడియేషన్’ జాడను పసిగట్టే వ్యవస్థను రూపొందించింది. అణుశక్తి సంస్థల్లో లీకేజీలను గుర్తించి హెచ్చరించడానికీ; రేడియో థెరపీ వంటి క్యాన్సర్ చికిత్సల్లో కూడా అప్లికేషన్ ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
ఫేస్‌బుక్‌పై పెరుగుతోన్న విముఖత
అమెరికాలో ఫేస్‌బుక్‌పై చేపట్టిన ఎడిసన్స్ సర్వే ఫలితాలు ఫేస్బుక్ విషయంలో అమెరికన్ల ఆలోచనా తీరును తెలియజేస్తున్నాయి. నానాటికీ ఫేస్బుక్లో చేరే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అమెరికాలో ప్రారంభమైన ఫేస్బుక్… వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది. వారంతా సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి, ఫొటోలు షేర్ చేసుకోవడానికి ఇది మంచి వేదికగా ఉండేది. ఇదంతా ఒకప్పటి మాట. నేడు ఫేస్బుక్ ఎన్నో అనవసరమైన విషయాలు, అసత్య వార్తలు, పుకార్లతో నిండిపోయింది. నాడు వినోదం కోసం ఫేస్బుక్ ఖాతా తెరిచేవారు. ఇప్పుడు ఉన్న ఖాతాలనూ మూసేస్తున్నారు. కొత్తగా ఖాతా తెరిచే వారి సంఖ్య కూడా నానాటికీ పడిపోతోంది. ఫలితంగా ఫేస్బుక్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఫేస్‌బుక్‌పై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలు, వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదు అని వినియోగదారులు భావించడమే ఈ పరిణామానికి దారి తీసినట్లు విశ్లేషకులు అంటున్నారు. వినియోగదారుల అభిరుచి తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రకటనలు ఇవ్వడం కోసమే వారి వ్యక్తిగత సమాచారాన్ని, అభిరుచుల్ని తెలుసుకుంటున్నామని, అది డేటా చౌర్యం కిందకు రాదని ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ అనడం కూడా వినియోగదారులకు అంతగా రుచించినట్లు కనిపించడం లేదు. కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ కూడా ఫేస్బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి దానిని ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వినియోగించినట్లు తేలడం అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. ఫేస్బుక్లో ఒక రోజులో కేవలం 15 మిలియన్ల మంది మాత్రమే ఖాతాలు తెరిచారని ఈ నివేదిక వెల్లడిస్తోంది. రోజూ కొత్తగా ఫేస్బుక్ ఖాతాలు తెరిచే వారి సంఖ్య మునుపెన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయినట్లు తెలిపింది. అయితే వీరంతా ఫేస్బుక్ లాంటి మరో యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరుస్తున్నారు. ఫేస్‌బుక్‌కు పోటీగా నిలుస్తున్న ఈ యాప్ కూడా ఫేస్బుక్ యాజమాన్యానికి చెందినదే కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌కు 1 బిలియన్ ఖాతాదారులు ఉన్నారు.
గుంటూరు పోలీసులా మజాకా?
గుంటూరులో నాలుగు ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్బుక్ ఖాతాలే వారిని పట్టించాయి. ఓ పార్టీకి చెందిన యువకులుగా పోలీసులు వీరిని అనుమానిస్తున్నారు. ఈ నెల 4న తెల్లవారుజామున గుంటూరులోని స్తంభాలగరువు, నల్లచెరువు, అరండల్‌పేట, నెహ్రూనగర్ ప్రాంతాల్లోని నాలుగు విగ్రహాలకు నిప్పు పెట్టడం, పగలగొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావు ముగ్గురు సీఐలతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి కేసు విచారణను కొలిక్కి తీసుకొచ్చారు. యువకులు వారి ముఖాలు కనిపించకుండా విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు. ఘటన జరగటానికి ముందు నగరంలో ఓ ప్రాంతంలో ఆందోళన జరిగింది. ఇక్కడ పాల్గొన్నవారు ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ సాగించిన పోలీసులకు క్లూ దొరికింది. ఆందోళనలో పాల్గొన్న వారి ఫొటోలు సేకరించారు. వారు తమ ఫొటోలను ఆ రోజు ఫేస్బుక్ ఖాతాల్లో అప్లోడ్ చేశారు. విగ్రహాల వద్ద సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫొటోలతో వాటిని ధ్రువీకరించుకుని పోలీసులు ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. యువకులను అదుపులోకి తీసుకుని ఆధారాలతో ప్రశ్నించడంతో తప్పు ఒప్పుకున్నారని తెలిసింది. మరో నలుగురు తమకు సంబంధం లేదని బుకాయించినట్లు సమాచారం. ఈ యువకులను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు. విగ్రహాలను పగలగొట్టే ప్రాంతాలకు ముందుగా ఎర్రచొక్కా ధరించిన ఓ యువకుడు బైకు మీద చేరుకుని అక్కడ పరిస్థితులను గమనించి మిత్రులకు చెప్పడంతో పథకం ప్రకారం నాలుగు బృందాలుగా నాలుగు ప్రాంతాలకు చేరుకుని ధ్వంసం చేసినట్లు సమాచారం.
గ్రామీణ విద్యార్థుల కోసం గూగుల్ బోలో యాప్
ఫోన్ ఉంటే చాలు ఇప్పటి పిల్లలకు ఏమీ లేకున్నా ఫర్వాలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని చదువునే పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతో ఓ మంచి నిర్నయం తీసుకుంది గూగుల్. పిల్లల కోసం స్టడీ యాప్ ను ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా, పిల్లల్లో స్టడీ స్కిల్స్ పెంపొందించేందుకు గానూ గూగుల్ సరికొత్త యాప్ ను తీసుకువచ్చింది. “బోలో” అనే యాప్ నే విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా చిన్న పిల్లల్లో ఇంగ్లీష్, హిందీ స్కిల్స్ నేర్చుకోవడం ఈజీ అవుతుందని గూగుల్ చెబుతోంది.ఈ యాప్ లో క్రియేట్ చేసిన యానిమేటెడ్ క్యారెక్టర్ చిన్నారి.. యాప్ లో పొందుపరిచిన పాఠ్యాంశాలను చదవి వినిపిస్తుందట. ఆ తరువాత యాప్ యూజర్లు చదవాల్సి ఉంటుంది. అలా చదవిన అంశాన్ని యాప్ పరిశీలిస్తుందట. అంతేకాకుండా స్టడీలో ఏవైనా తప్పులుంటే.. యాప్ మళ్లీ చదవి వినిపిస్తుందట. ఈ యాప్ గూగుల్ స్పీచ్, టెక్ట్స్ టు స్పీచ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది.
అమెరికాపై కేసు పెట్టింది
చైనాకు చెందిన హువావే కంపెనీపై అమెరికా నిషేధం విధించింది. ఆ కంపెనీ ఉత్పత్తులను వాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రత నేపథ్యంలో తాము ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. అంతేకాదు తన మిత్ర దేశాలకు కూడా హువావే టెలికమ్యూనికేషన్ ఉత్పత్తులను వాడరాదంటూ అమెరికా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో హువావే కంపెనీ అమెరికాపై దావా వేసింది. టెక్సాస్ కోర్టులో కేసు నమోదు చేసింది. ఫెడరల్ ఏజెన్సీలు హువావే ఉత్పత్తులను వాడరాదంటూ అమెరికా నిషేధం విధించడాన్ని ఆ కంపెనీ సవాల్ చేసింది. తమ ఉత్పత్తుల్లో లోపం ఉన్నట్లు అమెరికా నిరూపించలేకపోయిందని, చైనా ప్రభుత్వంతోనూ తమకు లింకులు లేవని హువావే చైర్మన్ ఇటీవల షెంజెన్‌లో జరిగిన ఓ మీట్లో వెల్లడించారు. కానీ అమెరికా మాత్రం ఆ ఉత్పత్తులను నిషేధిస్తున్నది. తమ ఉత్పత్తులపై ప్రజల్లో అమెరికా తప్పుడు అభిప్రాయాలను చేరవేస్తున్నదని, తమ కంపెనీ సర్వర్లను హ్యాక్ చేస్తున్నదని హువావే చైర్మన్ ఆరోపించారు. హువావే ఉత్పత్తులను వాడకూడదంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా తమ టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి.
ఈ మహిళామణులు…వినూత్నతకు గనులు
ప్రముఖ ఆవిష్కర్తల పేర్లు చెప్పమని అడిగితే.. చాలామంది ఠక్కున థామస్ అల్వా ఎడిసన్ అనో, మార్కోనీ అనో, ఐన్‌స్టీన్ అనో, గ్రాహంబెల్ అనో చెప్పేస్తారు. కానీ మేరీ అండర్సన్, అన్ త్సుకమోటోల పేర్లు ఎవరూ చెప్పలేరు.. ఎందుకంటే ఈ పేర్లు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ మహిళలు అందరూ ఆవిష్కర్తలే.. మనం వాడే ప్రతి వస్తువు, సాంకేతికత వెనుక ఎందరో మహిళలు ఉన్నారు. వారి గురించి..
*గ్రేస్ హోపర్
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నేవీలో చేరింది గ్రేస్ హోపర్. అక్కడే ఆమె కొత్త కంప్యూటర్ మార్క్ 1ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించింది. అప్పుడే ప్రోగ్రామింగ్ కోడ్‌ను కంప్యూటర్ భాషలోకి అనువాదం చేసే కంపైలర్ సాఫ్ట్వేర్ టూల్స్‌ను అభివృద్ధి చేసింది. సాఫ్ట్వేర్ అప్లికేషన్లలో డి-బగ్గింగ్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది కూడా గ్రేస్ హోపరే.. 79 ఏళ్ల వయసు వచ్చేవరకూ ఆమె కంప్యూటర్ అభివృద్ధి కోసం పనిచేసింది. అందుకే ఆమెను అంతా ‘అమేజింగ్ గ్రేస్’ అని పిలుస్తుంటారు.
*డా. షెర్లీ ఆన్ జాక్సన్
ఫోన్ కాల్ ఎవరి నుంచి వస్తుందో తెలిపే కాలర్ ఐడీని కనిపెట్టింది ఈమే.. మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మరో కాల్ వస్తే తెలిపే కాల్ వెయిటింగ్ ఫీచర్లను కూడా ఈమే అభివృద్ధి చేసింది. భౌతిక శాస్త్రంలో శాస్తవ్రేత్త అయిన డా. షెర్లీ.. టెలికాం రంగంలో అనేక పరిశోధనలు చేసింది. ఫైబర్ అప్టిక్ కేబుల్, ఫ్యాక్స్ మెషీన్లు, సోలార్ బ్యాటరీల తయారీ వెనుక ఈమె పరిశోధనలే కీలకం. అమెరికాలోని ప్రఖ్యాత మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి ఆఫ్రికన్-అమెరికన్ షెర్లీనే.
*మేరీ అండర్సన్
1903లో మేరీ అండర్సన్ చలికాలంలో న్యూయార్క్‌లో పర్యటిస్తున్నప్పుడు కారు అద్దాలపై మంచు పడుతోంది. ఆ మంచును తొలగించేందుకు డ్రైవర్ మాటిమాటికీ కారును ఆపి బయటకు వెళుతున్నాడు. దాంతో కారులో ఉన్నవారు చలికి వణికిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించిన మేరీ అండర్సన్.. మొదటగా రబ్బరుతో గ్లాస్ వైపర్‌ను తయారుచేసింది. దానిపై 1903లోనే ఆమె పేటెంట్ హక్కులనూ పొందింది.
*ఓల్గా డి గాన్జలెజ్ సనాబ్రియా
అత్యధిక బ్యాకప్ ఇచ్చే నికెల్-హైడ్రొజన్ బ్యాటరీల సాంకేతికతను 1980లోనే ఓల్గా అభివృద్ధి చేసింది. ఈ బ్యాటరీలను అంతరిక్ష కేంద్రాల్లో వినియోగిస్తారు. ప్రస్తుతం నాసా పరిశోధనా కేంద్రంలో ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్‌గా ఓల్గా పనిచేస్తోంది.
జోసెఫీన్ కోష్రేన్
ఇంట్లో పనిమనిషి కంటే వేగంగా, భద్రంగా, శుభ్రంగా వంట పాత్రలను కడిగేసే డిష్ వాషింగ్ మెషీన్‌ను తయారుచేసింది కోష్రేన్. ప్రపంచంలో తొలి ఆటోమేటిక్ డిష్ వాషర్ ఇదే.. ఈ ఆవిష్కరణకు గాను 1886లోనే ఆమె పేటెంట్ హక్కులను పొందింది.
*మేరీ వ్యాన్ బ్రిట్టన్ బ్రౌన్
మేరీ నర్సుగా పనిచేసేది. ఆమె ఎక్కువగా ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. రోజురోజుకీ నేరాలు పెరిగిపోతుండటంతో ఇంటి గుమ్మాన్ని పర్యవేక్షించేందుకు 1960లో ప్రత్యేక కెమెరాను ఏర్పాటు చేశారు. ఇంటి లోపలే ఉండే ఆ కెమెరా ఇంటి ముందు పరిసరాలను తలుపు రంధ్రంలోంచి చిత్రీకరిస్తూ ఉండేది. ఆ వీడియోను బెడ్ రూములోని తెరపై చూసుకునేలా ఏర్పాటు చేసుకుంది. ఆ ఆలోచనే ప్రస్తుత సీసీ కెమెరా సెక్యూరిటీ వ్యవస్థలకు పునాదిగా చెప్పొచ్చు.
*ఆన్ త్సుకమోటో
రక్తకణాలు ఉత్పత్తిలో కీలకమైన స్టెమ్‌సెల్స్‌ను వేరుచేసే విధానాన్ని కనుగొంది త్సుకమోటో.. అందుకు 1991లో పేటెంట్ పొందింది. ఈ విధానాన్ని కనుగొనడంతో బ్లడ్ కేన్సర్ వైద్యం సులభతరమైంది. ప్రస్తుతం స్టెమ్ సెల్ ఎదుగుదలపై ఆమె పరిశోధనలు చేస్తున్నారు.
*స్ట్ఫెనీ కోలెక్
కోలెక్ బుల్లెట్ ప్రూఫ్ దుస్తుల తయారీలో వినియోగించే ఫైబర్‌ను 1965లో సృష్టించింది. స్టీల్ కంటే ఐదు రెట్లు గట్టిగా ఉండే ఆ పదార్థంతో రూపొందించిన జాకెట్లను లక్షల మంది సైనికులు.. పోలీసులు వినియోగిస్తున్నారు. అలాగే చేతి గ్లౌజులు, మొబైల్ ఫోన్లు, విమానాలు, వేలాడే వంతెనల తయారీలో కూడా ఈ ఫైబర్‌ను వాడుతున్నారు.
ఇంటర్నెట్ భారతదేశంలోనే చీప్
ప్రపంచం మొత్తం మీద అంతర్జాల సేవలు ఇండియాలోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు యూకేకి చెందిన కేబుల్ అనే వెబ్సైట్ తెలిపింది. అంతర్జాతీయంగా 230 దేశాల్లో అమలవుతున్న అంతర్జాల సేవల ధరలను పోల్చి చూస్తే ఈ విషయం వెలుగులోకొచ్చింది. అన్ని దేశాలతో పోలిస్తే సరాసరిగా 1 జీబీ ఇంటర్నెట్ ధర రూ.600 పలుకుతోంది. కాని మనం కేవలం రూ.18.50 కే పొందుతున్నాం. అదే 1జీబీ డేటా పొందాలంటే యూకేలో 6.66 అమెరికన్ డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లు వెచ్చించాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలు అందిస్తున్న 6,313 డేటా ప్లాన్లను పరిశీలించిన తర్వాత కేబుల్ వెబ్సైట్ ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 1 జీబీ డేటా కోసం జింబాబ్వేలో అత్యధికంగా 75.20 డాలర్లు చెల్లించాల్సి వస్తే ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఒక్క డాలరు, మరి కొన్ని చోట్ల అదే డేటాకు దాదాపు 50 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా 1జీబీ డేటా చైనాలో(9.89డాలర్లు), శ్రీలంకలో(0.87డాలర్లు), బంగ్లాదేశ్‌లో(0.99 డాలర్లు), పాకిస్థాన్‌లో(1.85 డాలర్లు) పలుకుతోంది. భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అతి తక్కువ ధరకు రావడానికి అనేక కారణాలున్నాయి. ఇక్కడ దాదాపు 430 మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు. వీరికి సేవలు అందించేందుకు అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. అందువల్ల కొంచెం తక్కువ ధరకే అంతర్జాల సేవలు అందుకోగలిగాము. ఆ తర్వాత 2016లో ముఖేశ్ అంబానీ జియో 4జి సేవలు ప్రారంభించారు. దీనిలో ముందు కాల్స్, డేటా పూర్తిగా ఉచితంగా ఇవ్వడంతో పాటు అత్యధిక వేగాన్ని వినియోగదారులకు పరిచయం చేశారు. ఆ తర్వాత నామమాత్రపు ధరకే సేవలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఈ సంస్థ అనతి కాలంలోనే దాదాపు 230 మిలియన్ల వినియోగదారులను తనవైపు తిప్పుకోగలిగింది. దీనిని చూసి మిగిలిన సంస్థలు తమ వినియోగదారులను కాపాడుకోవడానికి డేటా ధరలు పూర్తిగా తగ్గించక తప్పలేదు. ఈ జియో సంస్థ ఫోర్బ్స్ వెలువరించిన ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ 6 స్థానాలు పైకి ఎగబాకడానికి ఉపయోగపడింది. గతంలో ప్రపంచ కుబేరుల్లో 19వ స్థానంలో కొనసాగిన ఆయన ప్రస్తుతం 13వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఇజ్రాయెల్ అద్భుతం
చంద్రునిపై అడుగుపెట్టబోతున్న తొలి ఇజ్రాయెల్ స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలో తన మొదటి సెల్ఫీని తీసి భూమికి పంపించింది. భూమికి దాదాపు 20 వేల మైళ్ల(37 వేల కిలోమీటర్లు) దూరం నుంచి ఈ అద్భుతమైన ఫొటోను అది క్లిక్‌మనిపించింది. ఈ సెల్ఫీలో రోబోటిక్ లాండర్‌తోపాటు వెనుకభాగంలో వెలిగిపోతున్న భూమి స్పష్టంగా కనిపిస్తోంది. బేర్‌షీట్ స్పేస్‌క్రాఫ్ట్ అంతరిక్షంలో తీసిన ఈ సెల్ఫీలో భూమిపై ఆస్ట్రేలియా భూభాగం స్పష్టం కనిపిస్తోందని మిషన్ బృంద సభ్యులు ఆ ఫొటోను పోస్టు చేస్తూ తెలిపారు. ఈ ఫొటోలో స్పేస్‌క్రాఫ్ట్‌పై ఇజ్రాయెల్ జాతీయ పతాకంతోపాటు.. ‘చిన్నదేశం.. పెద్ద కలలు’ అని రాసున్న సందేశం కూడా కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన తొలి మూన్ లాండర్‌ను ఫ్లోరిడాలోని కేఫ్ కానవెరాల్ నుంచి రెండు వారాల క్రితం విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఏప్రిల్ 11న చంద్రునిపై దిగనుంది. 585 కిలోల బరువున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించారు. ఇప్పటివరకూ రష్యా, అమెరికా, చైనాకు చెందిన స్పేస్‌క్రాఫ్టులు 3,84,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రునిపై దిగాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఈ దేశం కూడా చేరనుంది.
వైఫై ఛార్జింగ్
ఏంటీ? వైఫైతో చార్జింగా.. అదెలా సాధ్యం? అని ఆశ్చర్యపోకండి. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అప్డేట్ వల్ల ఏదైనా సాధ్యమే! ఔను మీరు చదివింది నిజమే! మీ ఫోన్‌కు వైఫై కనెక్ట్ అయి ఉంటే చాలు.. మీకు చార్జర్‌తో పనే లేదు. అవును.. ఎంఐటీ పరిశోధకులు ఈ సరికొత్త ఆవిష్కరణ చేశారు. వైఫై ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ద్వారా బ్యాటరీల అవసరం లేకుండానే రిమోట్ సెన్సార్లు, ఇంటర్నెట్తో అనుసంధానం అయి ఉండే గాడ్జెట్లను ఆపరేట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా వైఫై సిగ్నల్స్‌ను ఎలక్ట్రిసిటీగా మార్చి మొబైల్‌ను చార్జింగ్ పెట్టవచ్చు. సెమీ కండక్లర్స్ ద్వారా రూపొందించిన రేడియో యాంటెన్నా వైఫై సిగ్నల్స్‌ను గ్రహించి వైర్లెస్ ఎనర్జీగా మార్చేస్తుంది. రెక్టెన్నా అని పేరుపెట్టిన ఈ యాంటెన్నా త్వరలో ప్రయోగం పూర్తి చేసుకొని మార్కెట్లోకి రానుంది. ఎంఐటీ రీసెర్చర్లు తయారుచేసిన ఈ రెక్టెన్నాలు ల్యాప్‌టాప్, స్మార్ట్ఫోన్ల రేడియో యాంటెనాకు కనెక్ట్ చేస్తారు. ఏసీ సిగ్నల్స్ సెమీ కండక్టర్ల ద్వారా ప్రవహించడం వల్ల అది డీసీ గా మారుతుంది. దీన్నీ విద్యుత్ సర్క్యూట్, బ్యాటరీ రీచార్జికి వాడొచ్చు. ఇది గనుక పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తే.. భవిష్యత్తులో వైఫైతో పనిచేసే వైర్లెస్ కరెంట్ అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అణ్వాయుధాల తయారీలోకి రష్యా
అణ్వాయుధాలపై రష్యా- అమెరికాల మధ్య 1987లో కుదిరిన ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్ఎఫ్) ఒప్పందాన్ని రద్దు చేస్తూ సోమవారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు తొలుత గత ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో రష్యా కూడా దానికి ప్రతిచర్య తీసుకొంది. ఒప్పందం రద్దయిన కారణంగా రష్యా మధ్య శ్రేణి అణు క్షిపణులను తయారు చేసే అవకాశం ఉంది.
సతీష్ రెడ్డికి అమెరికా అవార్డు
అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్త్రనాటిక్స్(ఏఐఏఏ) 2019 సంవత్సరానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి మిసైల్ సిస్టమ్స్ అవార్డును ప్రకటించింది. క్షిపణి వ్యవస్థల సాంకేతికత అభివృద్ధిలో విశేష కృషికి ఆయనను ఈ అవార్డు వరించింది. అమెరికా సంస్థ భారత శాస్త్రవేత్తకు అవార్డును ప్రకటించడం ఇదే మొదటిసారని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. అరిజొనాకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ ఇంజినీరింగ్ ఫెలో రొండెల్ జె విల్సన్‌తో కలిసి ఆయన ఈ అవార్డును పంచుకోనున్నారు. అమెరికాలోని మేరిల్యాండ్‌లో మే 7నుంచి 9 వరకు జరిగే ఏఐఏఏ డిఫెన్స్ ఫోరంలో అవార్డును ఇద్దరికి బహూకరించనున్నారు. ప్రస్తుతం భారత్, పాక్‌లలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారతీయ శాస్త్రవేత్తకు అమెరికా ఈ అవార్డు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయవంతంగా స్పెసెక్స్ ప్రయోగం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన అమెరికా నూతన కాప్య్సూల్ను స్పేస్ ఎక్స్ సంస్థ నింగిలోకి పంపింది. డ్రాగన్ ఆస్ట్రోనాట్ కాప్య్సూల్గా దీనికి పేరు పెట్టింది. ప్రయోగాత్మక పరీక్షలో భాగంగా దీనిని అంతర్జాతీయ అంతరిక్షానికి పంపింది. మనిషి అంత నమూనా ఉన్న బొమ్మను దీనిలో పంపారు. ఏలీయన్ చిత్రంలో ఉన్న విప్‌లే పాత్రను ఆ బొమ్మకు పెట్టారు. వ్యోమగాములను పంపించే ముందు తలెత్తే సమస్యల అధ్యయనానికి బొమ్మతో డ్రాగన్ కాప్య్సూల్ను ప్రయోగించారు. ప్రయోగించినప్పటి నుంచి 27గంటల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్న స్పేస్ ఎక్స్ కాప్య్సూల్.. 5రోజులు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చే శుక్రవారం తిరిగి అట్లాంటిక్ సముద్రంలో పడిపోతుంది. ఇద్దరు వ్యోమగాములతో తదుపరి ప్రయోగాత్మక పరీక్షను జులైలో చేపట్టనుంది. ప్రమాదాల నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2011 జులైలో తమ స్పేస్ షటిళ్ల కార్యక్రమాన్ని రద్దు చేసింది. అప్పటి నుంచి రష్యాకు చెందిన సోయాజ్ కాప్య్సూల్‌లో వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు. ప్రైవేటు సంస్థలైన స్పేస్ ఎక్స్, బోయింగ్‌లకు నాసా అంతరిక్ష నౌకల తయారీలను అప్పగించింది.
సీవీరామన్ గొప్పదనం అదే-నేడు సైన్స్ దినోత్సవం
చాలా కాలం కిందట చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ క్లాసు జరుగుతోంది. పదకొండేళ్ల పిల్లాడొకడు క్లాసు గుమ్మం దగ్గరకు వచ్చాడు. చిన్న పంచె, చొక్కా, ఊలు టోపీతో నిల్చున్న ఆ పిల్లాడిని చూసి పాఠం చెబుతున్న ప్రొఫెసర్ ‘బాబూ! పొరపాటున ఇక్కడకు వచ్చినట్లున్నావు. నీవు వెళ్లాల్సిన స్కూలు పక్కనే ఉంది. వెళ్లు’ అని అన్నాడు. కానీ ఆ పిల్లాడు ‘సర్ నేను డిగ్రీలో చేరడానికే వచ్చా’ అన్నాడు. ఇది విని ప్రొఫెసర్‌తో పాటు క్లాసులోని విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఆ బాలుడే సి.వి.రామన్. పదకొండేళ్లకే ఇంటర్మీడియట్ పరీక్షలో ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణుడై స్కాలర్‌షిప్‌తో డిగ్రీలో చేరడానికి వచ్చాడా పిల్లాడు. ఈ అబ్బాయి 1888, నవంబరు 7న తమిళనాడులోని తిరుచునాపల్లిలో జన్మించాడు. తండ్రి విశాఖపట్టణంలోని మిసెస్ ఎ.వి.యన్ కాలేజీలో లెక్చరరుగా పనిచేస్తుండటంతో ఆ బాలుడు ఆ కాలేజీలోనే ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. విశాఖపట్టణంలో చదివే రోజుల్లో సముద్రాన్ని ఆసక్తిగా గమనిస్తుండేవాడు. ముఖ్యంగా సముద్రపు నీరు నీలం రంగులో ఎందుకుంటుందని.బాల్యం నుంచే ఆ బాలునికి పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టం. ఎన్నో సైన్స్, సాహిత్య పుస్తకాలను చదివాడు. ఏ పుస్తకం దొరికినా శ్రద్ధతో చదివే ఆ పిల్లాడికి ‘సైన్స్’ అంటే అమితమైన ఇష్టం. ఇంట్లో దొరికే పరికరాలతోనే ఏవేవో ప్రయోగాలు చేసేవాడు. ఓసారి చిన్న లోహపు తీగెను తీసుకొని విద్యుత్ డైనమోనే చేయగలిగాడు. చదువులో స్కాలర్షిప్లు, బహుమానాలు అందుకొని 11 ఏళ్లకే ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో పాసయ్యాడు. ఇంకా 14 ఏళ్లకే బీఏలో ఇంగ్లిష్, ఫిజిక్స్‌ల్లో గోల్డ్‌మెడల్ సాధించాడు. తర్వాత ఎంఏ భౌతికశాస్త్రంలో చేరి పాఠ్య పుస్తకాలన్నీ ముందుగానే చదివేసి రోజూ క్లాసులకు వెళ్లకుండా కాలేజీ ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసేవాడు. అతని ప్రతిభ తెలిసిన ప్రొఫెసర్లు కూడా దానికి అభ్యంతరం పెట్టేవారు కాదు. అలా సోనామీటర్, కటకాలు, పట్టకాలు, స్పెక్ట్రామీటర్లతో అనేక ప్రయోగాలు చేసి కొత్త విషయాలు కనుగొనేవాడు. ఆ తర్వాత రోజుల్లో కాంతికి సంబంధించి తాను కనిపెట్టిన అంశాలతో ఒక పరిశోధనా పత్రం రాసి దాన్ని బ్రిటన్‌లోని ఓ సైన్స్ పత్రిక ‘ఫిలసాఫికల్ మ్యాగజైన్’కు పంపాడు. అప్పటికి అతని వయసు 17 ఏళ్లే. ఆ వ్యాసాన్ని చదివిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ‘లార్డ్ ర్యాలీ’ అతడిని లండన్‌కు పరిశోధనలకు రమ్మని ఆహ్వానిస్తూ, ఆ బాలుని వయసు తెలియక ‘ప్రొఫెసర్’ అని సంబోధించాడట!ఎంఏ తర్వాత మన దేశంలో పరిశోధనలకు సదుపాయాలు లేక ‘ఇండియన్ ఫైనాన్షియల్ సివిల్ సర్వీసెస్’ నిర్వహించే పోటీ పరీక్ష రాశాడు. దేశంలోనే ప్రథముడిగా నిలిచి కోల్‌కతాలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరాడు. అప్పటికి అతని వయసు 19 ఏళ్లే.ఒకసారి ఆయన కోల్‌కత్తాలో ఆఫీసుకు వెళుతుంటే దారిలో ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ అనే బోర్డు కనిపించింది. పరిశోధనలంటే ఇష్టపడే ఆయన ఆ సంస్థలో చేరాడు. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే తీరిక సమయాల్లో అక్కడ ధ్వని, సంగీత వాద్యాల ప్రయోగాలు చేశాడు. వాటి ఫలితాల వల్ల ఆయనకు కలకత్తా యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ పదవిలో చేరమని ఆహ్వానం వచ్చింది.ఆ రోజుల్లో 1100 రూపాయల జీతాన్నిచ్చే హోదా గల బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని 600 రూపాయల జీతం వచ్చే ప్రొఫెసర్‌గా చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఆరోజుల్లోనే ఓసారి లండన్‌లో ఒక శాస్త్రీయ సమావేశానికి వెళ్లి తిరిగి మధ్యదరా సముద్రంపై ఓడలో వస్తుంటే సముద్రం అంత నీలంగా ఎందుకుంది? అన్న తన చిన్ననాటి ప్రశ్న మళ్లీ తలెత్తింది. సముద్రపు నీటితో ఆకాశపు నీలిరంగు ప్రతిబింబించడం వల్లనే అని అప్పటి శాస్త్రజ్ఞుల భావన. కానీ ఆకాశపు లేత నీలి రంగుకు సముద్రపు ముదురు నీలానికి పొంతనే లేదు. లండన్ నుంచి తిరిగి వచ్చిన ఆయన అత్యంత దీక్షతో కాంతి శక్తిపై చేసిన పరిశోధనల ఫలితం సముద్రపు నీలి వర్ణం గుట్టును రట్టుచేసింది. ఆ ఫలితమే ఆ మేధావికి 1930లో భౌతికశాస్త్రంలో భారతదేశానికే కాకుండా ఆసియా ఖండానికే మొట్టమొదటి నోబెల్ బహుమతిని అందించింది. దేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించిన ఆయన్ను భారత ప్రభుత్వం తొలి నేషనల్ ప్రొఫెసర్‌గా నియమించింది. ఆ తర్వాత ‘భారత రత్న’ బిరుదుతో సత్కరించింది. ఇంతకీ ఆయన ఎవరంటే.. సర్ చంద్రశేఖర వెంకటరామన్ (సి.వి.రామన్). సముద్రం నీలిరంగులోనే ఎందుకు ఉంది? అనే చిన్న ప్రశ్నకు జవాబే రామన్ ఆవిష్కరణ ‘రామన్ ఎఫెక్ట్’.రామన్ ఎఫెక్ట్ ప్రకారం ‘ఒకే రంగు ఉన్న కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపైన పతనం చెందిన తర్వాత ఆ కాంతి పరిక్షేపణ చెందుతుంది. అంటే చెదురుతుంది. అలా చెదిరిన కాంతిలోని పౌనఃపున్యంతో పాటు అదనంగా మరో పౌనఃపున్యం ఉన్న కాంతి తక్కువ తీవ్రతలో కనిపిస్తుంది. దీనికి కారణం కాంతి శక్తిలోని ఫోటాన్లు ద్రవ పదార్థంలోని అణువులు పరస్పరం ఢీకొనడమే.దీన్ని కనిపెట్టడానికి రామన్ ఉపయోగించిన పరికరాల ఖరీదు ఎంతో తెలుసా? కేవలం 196 రూపాయలు!మనదేశం రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన ఫిబ్రవరి 28వ తేదీని ‘నేషనల్ సైన్స్ డే’గా జరుపుకొంటోంది.
కావాలని 50 కంప్యూటర్లు ధ్వంసం చేసిన తెలుగు విద్యార్థి అరెస్ట్
న్యూయార్క్ రాష్ట్రంలోని అల్బనీలో ఉన్న సెయింట్ రోస్ కాలేజీకి చెందిన 50 కంప్యూటర్లను ఆకుతోట విశ్వనాథ్ అనే తెలుగు విద్యార్థి ఓ USB స్టిక్ సాయంతో కావాలనే ధ్వంసం చేశాడనే ఆరోపణలపై పోలీసు అధికారులు అతడిని అరెస్టు చేశారు. ఫిబ్రవరి 14వ తేదీన సెయింట్ రోస్ క్యాంపస్‌లోకి ప్రవేశించిన అతడు ఈ USB సాయంతో 50 కంప్యూటర్లను ధ్వంసం చేశాడని వీడియో ఆధారల ద్వారా ప్రాథమిక విచారణలో తేలిన కారణంగా అతడిని 22వ తేదీన ఉత్తర కరోలినాలో అరెస్టు చేశారు. ఈ ధ్వంసం కారణంగా కాలెజీకి సుమారు 50వేల డాలర్ల నష్టం వాటిల్లిందని, అతడిపై నేరారోపణ నిజమైతే 10ఏళ్లు జైలుశిక్ష, రెండున్నర లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. విశ్వనాథ్ ప్రస్తుతం విద్యార్థి వీసాపై అమెరికాలో నివసిస్తున్నాడు.