మహాకూటమిపై వ్యాఖ్యానించడం తొందరపాటు

దేశానికి తిరిగి వచ్చి.. తన అవసరం ఉన్న చోట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో సంతోషంగా ఉన్నప్పటికీ తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. ఓ పుస్తకావిష్కరణ సభలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం లాంటి పార్టీలు ఏర్పాటు చేసిన మహాకూటమి అధికారంలోకి వస్తే రాజన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపై రాజన్‌ను ప్రశ్నించగా ‘ఈ విషయంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుంద’ని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికలు భారత్‌కు ఎంతో కీలకమని.. దేశంలో నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తనకు సలహాలు అందించే అవకాశం వస్తే సంతోషిస్తానన్నారు. కొంత మంది ఆర్థికవేత్తలతో కలిసి కొన్ని విధానాలను రూపొందించామన్నారు. వాటినే పుస్తక రూపంలో తీసుకువచ్చామన్నారు. ఆర్థికమంత్రిగా పనిచేసే అవకాశం వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగే స్వల్పకాల లక్ష్యాలపై దృష్టి సారిస్తానన్నారు. అలాంటి లక్ష్యాలనే పుస్తకంలో పొందుపరిచామన్నారు. అలాగే బ్యాంకింగ్‌ రంగంలోనూ పలు మార్పులు తీసుకువస్తాన్నారు. రైతాంగ సంక్షోభాన్ని తగ్గించేలా పటిష్ఠ వ్యవసాయ విధానాలను అమలు చేయాల్సి ఉందన్నారు. భూసేకరణ పద్ధతిలోనూ రాష్ట్రాలు అవలంబిస్తున్న మెరుగైన విధానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన మేర స్వతంత్రం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇవే తన ప్రధాన్య అంశాలని రాజన్‌ వివరించారు. ఇదే ముఖాముఖిలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధితో పరుగులు తీస్తోందని ప్రభుత్వం ప్రకటించడంపై రాజన్‌ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల సృష్టి మందగించిన నేపథ్యంలో ఇంతటి వృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత జీడీపీ గణాంకాలపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఒక నిష్పాక్షిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కనీస ఆదాయ పథకం రూపకల్పనలో భాగంగా రఘురామ్‌ రాజన్‌ లాంటి ఆర్థికవేత్తలను సంప్రదించామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. 2013 సెప్టెంబరు నుంచి సెప్టెంబరు 2016 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్‌ విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్తగా కూడా రాజన్‌ వ్యవహరించారు.

రమ్యశ్రీ కుటుంబ రాజకీయం భలే రసకందాయం

అ నగనగా… గవిరెడ్డి వారి కుటుంబం. యజమాని గవిరెడ్డి దేముడుబాబు ఓ సాధారణ రైతు. అతని భార్య సన్యాసమ్మ. స్వగ్రామం విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజపురం. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. ఈ ఆరుగురిలో తొలి ముగ్గురు రాజకీయాల్లో ఉన్నారు. సుజాత అలియాస్‌ రమ్యశ్రీ వైకాపాలో చేరగా, సన్యాసినాయుడు జనసేన, రామానాయుడు తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు. సినిమా రంగంలో రమ్యశ్రీగా గుర్తింపు పొందారు. పలు చిత్రాల్లో నటించారు. తన పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనే కుతూహలం ఎప్పటి నుంచో ఉంది. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో చాలా గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరారు. ప్రస్తుతం జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ‘జీఎస్‌ఎన్‌ ట్రస్టు’ను స్థాపించి కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో అన్న తెలుగుదేశం తరఫున మాడుగుల నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. వైకాపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. వైకాపా నుంచి హామీ లభించక పోవడంతో జనసేనలో చేరారు. ప్రస్తుతం మాడుగుల బరిలో నిలిచారు. తొలుత విశాఖలో బంగారు నగల విక్రయ దుకాణం నిర్వహించేవారు. రాజకీయాల్లో ప్రవేశించాక 2009లో తెదేపా తరఫున పోటీ చేసి మాడుగుల శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2014లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారీ తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు.

మా దేశపు బంగారం ట్రంప్ ఎత్తుకుపోతున్నాడు

వెనెజువెలా, అమెరికాల మధ్య వివాదం మరింత ముదిరిపోయింది. ‘‘వివిధ బ్యాంకుల్లో భద్రపర్చుకొన్న మా దేశ సొమ్మును ట్రంప్‌ కోరిక మేరకు దొంగతనం చేశారు. ఈ అపహరించిన సొమ్ము మొత్తం దాదాపు 30 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. కొన్ని నెలల నుంచి ఈ దొంగతనం జరుగుతోంది.’’ అని వెనుజువెలా కమ్యూనికేషన్ల శాఖా మంత్రి జార్జి రోడ్రిగో ఆరోపించారు. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో కూడా గతంలో ఇలాంటి ఆరోపణలే చేశారు. తమ దేశంలో ఆసుపత్రుల్లో ఔషధాల కోసం కేటాయించిన 5 బిలియన్‌ డాలర్లను అమెరికా తస్కరించిందని పేర్కొన్నారు. దీనికి ట్రంపే పూర్తి బాధ్యత వహించాలన్నారు. తమ దేశంలో సహజ సంపదను దోచుకొనేందుకు ట్రంప్‌ సర్కారు ఆత్రుతతో ఉందని పేర్కొన్నారు. వెనెజువెలా దేశంలో తానే దేశ అధ్యక్షుడునని ప్రతిపక్ష నేత జువాన్‌ గుయాడో (35) రాజధాని కారకస్‌లో ప్రజల సమక్షంలో కొన్నాళ్ల కిందట ప్రకటించుకున్నారు. అధ్యక్షునిగా ఆయనను గుర్తిస్తున్నట్టు అమెరికాతో పాటు, పొరుగుదేశాలైన బ్రెజిల్‌, కొలంబియా, పెరు, అర్జెంటినాలు ప్రకటించాయి. అయితే ఈ చర్యను రష్యా, క్యూబా, టర్కీ వంటి దేశాలు ఖండించాయి. అధ్యక్షుడు నికోలస్‌ మదురోకే మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరగాలని ఐక్యరాజ్య సమితి సూచించగా, తాజాగా ఎన్నికలు జరపడమే మేలని యూరోపియన్‌ యూనియన్‌ అభిప్రాయపడింది. చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశం అయినప్పటికీ మదురో పాలనలో వెనెజువెలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయన సైన్యం, రష్యా సహకారంతో పాలన కొనసాగిస్తున్నారు. పరిస్థితులను గమనించిన విపక్ష నేత గుయాడో తనను తాను అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఆయనను దేశ తాత్కాలిక నేతగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన విడుదల చేశారు. దీనికి బదులుగా అమెరికాతో దౌత్య సంబంధాలను రద్దు చేస్తున్నట్టు అధ్యక్షుడు మదురో తెలిపారు. అయితే మాజీ అధ్యక్షునిగా మారినందున ఆయనకు ఆ అధికారం లేదని అమెరికా తిప్పికొట్టింది. వెనెజువెలా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా ఆరోపించింది. జనవరి 26 తేదీన వెనుజువెలా ప్రభుత్వం నిల్వ చేసిన బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు ది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నిరాకరించింది. ఈ విషయాన్ని అప్పట్లో బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. వెనుజువెలా వద్ద కేవలం 8 బిలియన్‌ డాలర్లు మాత్రమే రిజర్వులు ఉన్నాయి. వీటిల్లో 1.2బిలియన్‌ డాలర్ల బంగారం కూడా కీలక భాగమే. అమెరికా అధికారుల కోరిక మేరకే బ్రిటన్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇక్కడ నికోలస్‌ మదురో తన అధికారాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా సిటీ గ్రూప్‌ తాకట్టులో ఉన్న వెనుజువెలా బంగారం వేలానికి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇక్కడ కొన్ని టన్నుల బంగారాన్ని కుదువ పెట్టి వెనుజువెలా ప్రభుత్వం 1.6 బిలియన్‌ డాలర్లను రుణంగా తీసుకొంది. ఇటీవల చెల్లింపు గడువు దాటడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఫలితంగా వెనుజువెలా రిజర్వులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది.

నాకు లేని రోగం లేదు. నేను రాను. రాలేను.

అనారోగ్యంగా ఉన్న కారణంగా తాను భారత్‌కు తిరిగి రాలేనని, ప్రయాణం చేసే పరిస్థితుల్లో కూడా లేనని ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ ముంబయి కోర్టుకు విన్నవించాడు. తన తరఫున వాదిస్తున్న న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశాడు. తనకు చాలా రోగాలున్నాయని, ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లలేనని, ప్రయాణం అస్సలు చేయలేనని చెప్పాడు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన నీరవ్‌ మోదీ, అతని మామ మెహుల్‌ చోక్సీ విదేశాలకు పారిపోయి అక్కడ పౌరసత్వాలు పొంది వ్యాపారాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నీరవ్‌మోదీ లండన్‌లో పట్టుబడ్డాడు. దీంతో ఇప్పుడు మెహుల్‌ చోక్సీ ఈ విధంగా స్పందించడం కోర్టు నుంచి తప్పించుకొనే ప్రయత్నంగానే కనిపిస్తుంది. మళ్లీ ఈ కేసు ఏప్రిల్‌ 9న విచారణకు రానుంది. తాను ప్రయాణం చేసే పరిస్థితుల్లో లేడని నమ్మించేందుకు 38 పత్రాలను న్యాయస్థానం ముందుంచాడు. వాటిలో మెడికల్‌ రిపోర్టులు, ఇతనికి ఉన్న వ్యాధులకు చికిత్సల కోసం వైద్యులు వేరొక ఆసుపత్రికి సిఫారసు చేస్తూ రాసిన లేఖలు ఉన్నాయి. రక్త కణాలు సరిగా లేవని చూపించేందుకు ఆంజియోగ్రామ్స్, అల్డ్రా సౌండ్‌ నివేదికలు, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్టు, మోకాళ్ల జాయింట్లు, వెన్నెముక సరిగా లేవని తెలిపే రిపోర్టులు, రక్త పరీక్షల రిపోర్టులు, వెన్నెముకకు సంబంధించిన రేడియోగ్రాఫ్‌లు, ఎక్స్‌రేలు, వైద్యులను సంప్రదించినట్లు తెలిపే పత్రాలను అతని తరఫు న్యాయవాది కోర్టు ముందుంచారు. ఇన్ని వ్యాధులు చుట్టుముట్టినందున చోక్సీ భారత్‌కు తిరిగి రాలేరని అతని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మెహుల్‌ చోక్సీపై న్యాయస్థానం తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధమని అతని న్యాయవాది అన్నారు. అతను చేసింది ఆర్థిక నేరమే కాబట్టి దానికి నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేయడం తగదంటూ వాదించారు.

రేపు విడుదల కానున్న వైకాపా జాబితా– రాజకీయ-03/16

*వైకాపా అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటించనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం విశాఖపట్నంలో ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. వాస్తవానికి శనివారం ఉదయం 10:26 గంటలకు ఇడుపులపాయలో జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. తన బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన నేపథ్యంలో జాబితా ప్రకటన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. పిడుగురాళ్లలో నిర్వహించవలసిన తొలి ఎన్నికల ప్రచార సభనూ రద్దు చేసుకున్నారు. ఆదివారం నుంచి రోజుకు మూడు జిల్లాల్లో మూడు నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగుతుంది.
*టికెట్ రాకుంటే ఇండిపెండెంట్‌గా పోటీచేస్తా- భూమా బ్రహ్మానంద
126 మంది టీడీపీ అధిష్టానం తొలిజాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ అభ్యర్థిగా మంత్రి భూమా అఖిల ప్రియను ఖరారు చేయగా.. నంద్యాల మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అయితే రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని టికెట్ తనదేనని.. భూమా బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇదివరకే నంద్యాల టికెట్ విషయమై అఖిల మాట్లాడుతూ కచ్చితంగా నంద్యాల టికెట్ మాదేనని చెప్పిన విషయం విదితమే.
*ఎమ్మెల్యేల కొనుగోలు చూడలేకే పోటీ- రేవంత్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత పార్టీ నాయకులను హీనంగా చూస్తూ ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనముందా? అని ప్రశ్నించారు. పదవి కోసం తాను పని చేయట్లేదని, పార్టీ కోసమే కష్టపడుతున్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలును చూడలేకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు.
*వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే
లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, దీన్ని అర్థం చేసుకొనే ఓటర్లు ప్రాంతీయ పార్టీల వైపు నిలుస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. స్థానిక పార్టీలను, జాతీయ, అంతర్జాతీయంగా ఆలోచనలు చేసే దృక్పథం కలిగిన నేతలను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నిజామాబాద్‌లో ఈ నెల 19న నిర్వహించే ఎన్నికల బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలనకు శుక్రవారం ఇక్కడికి వచ్చిన ఆమె, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే గణేష్‌గుప్తాతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
*హత్య చేసిన వారిని ఉరితీయాలి
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు కారకులైన వారిని ఉరి తీయాలని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఎంపీ టికెట్‌ విషయంలో అవినాష్‌రెడ్డి, వివేకానందరెడ్డి కుటుంబాలకు విభేదాలున్నాయని చెప్పారు. వీరి మధ్య అంతర్గత యుద్ధం కొనసాగుతోందని తెలిపారు. గతంలో విజయమ్మపై వివేకానందరెడ్డి పోటీ చేసినప్పటి నుంచి జగన్‌, వివేకా కుటుంబాలకు అంతరం ఏర్పడిందన్నారు. వాళ్ల ఇంట్లో జరిగిన ఘటనను తనకు ఆపాదించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎన్నికల్లో తనను నిజాయతీగా ఎదుర్కొనే ధైర్యం లేక రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే జగన్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
*చంద్రబాబు, లోకేష్‌ సూత్రధారులు
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్యకు సూత్రధారులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌, అమలు చేసింది మంత్రి ఆదినారాయణరెడ్డి అని ఆరోపించారు. ‘జమ్మలమడుగు, కడప నియోజకవర్గాలకు వివేకానంద ఎన్నికల బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనుంటే తనకు రాజకీయ మనుగడ ఉండదనే భయంతో చంద్రబాబు, లోకేష్‌ మద్దతుతో ఆదినారాయణరెడ్డి ఈ హత్య చేయించారు.
*రాహుల్‌జీ కర్ణాటక నుంచి పోటీచేయండి
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కర్ణాటక నుంచి పోటీ చేయాలన్న ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌గుండూరావు తదితరులు ట్విటర్‌ వేదికగా తమ అభిమతాన్ని శుక్రవారం వ్యక్తం చేశారు. గతంలో రాహుల్‌ నానమ్మ ఇందిరాగాంధీ, అమ్మ సోనియాగాంధీ కూడా కర్ణాటక నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాహుల్‌ కర్ణాటక నుంచి పోటీ చేయాలని సిద్ధరామయ్య కోరారు. ‘భావి ప్రధాని రాహుల్‌గాంధీ కర్ణాటక నుంచే పోటీ చేసి గెలవాలి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు స్పందిస్తూ ఈ విషయంపై రాహుల్‌గాంధీతో చర్చిస్తామని చెప్పారు.
*ఏపీలో తెదేపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా కొలిక్కి
తెలుగుదేశం లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొలిక్కి వస్తోంది. ముందుగా శుక్రవారం లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించాలనుకున్నా మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యతో వాయిదా పడింది. శనివారం తిరుపతిలో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను చంద్రబాబు విడుదల చేయనున్నారు. లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులుగా ఒంగోలు నుంచి శిద్దా రాఘవరావు, నెల్లూరు నుంచి బీద మస్తాన్‌రావు, రాజమహేంద్రవరం నుంచి మాగంటి రూప ఖరారయ్యారు.
*ఏపీలో నేటి నుంచే తెదేపా ఎన్నికల శంఖారావం
తెదేపా జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తిరుపతి నుంచి ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. అంతకు ముందుగా ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి ఉదయం 11 గంటలకు చంద్రబాబు తిరుమల చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. అక్కడ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తల సమావేశాలకు హాజరవుతారు. సోమవారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ, మంగళవారం అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనూ సీఎం పర్యటిస్తారు. అన్ని జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలను కలిశాక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళతారు.
*నియమావళి ఉల్లంఘన అంటూ.. కేసీఆర్‌పై సీఈవోకు కాంగ్రెస్‌ ఫిర్యాదు
: ‘ప్రగతి భవన్‌’ వేదికగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ ఆరోపించింది. కన్వీనర్‌ నిరంజన్‌ శుక్రవారం ఈ మేరకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌కు ఫిర్యాదుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడుతున్నారని, తెరాసలో చేరాలని ప్రలోభాలకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. సంబంధించిన వార్తల క్లిప్పింగులను సీఈవోకు సమర్పించిన నిరంజన్‌.. ఇకముందు ఇటువంటివి పునరావృతం కాకుండా కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
*మోదీ ఓటమికి మద్దతు ఇవ్వాలి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వారణాశిలో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడానికి కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల మద్దతును తాను ఆహ్వానిస్తున్నానని భీంసేన అధ్యక్షుడు చంద్రశేఖర్‌ అజాద్‌ వెల్లడించారు. దిల్లీలో జరిగిన ప్రదర్శన అనంతరం శుక్రవారం ఒక వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. తనకైనా మద్దతివ్వాలని లేదా కనీసం తమ పార్టీల నుంచి ములాయం, అఖిలేష్‌, మాయావతిల్లో ఎవరో ఒకరిని రంగంలోకి దింపాలని ఎస్పీ, బీఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. మోదీ అభ్యర్థిత్వాన్ని భాజపా ప్రకటించాల్సి ఉంది.
*12 మంది సిట్టింగ్‌ ఎంపీలకు అవకాశం లేనట్లే..!
అధికార పార్టీ ఎంపీలపై ఉన్న వ్యతిరేకత కారణంగా మధ్యప్రదేశ్‌లో దాదాపు 12 మంది సిట్టింగ్‌ సభ్యులకు భాజపా ఈసారి టిక్కెట్లు ఇవ్వకపోవచ్చని ఆ పార్టీ నేత ఒకరు శుక్రవారం తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పనితీరు సరిగా లేకపోవడం, ప్రజల్లో వ్యతిరేకత కారణంగా అప్పట్లో 80 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వొద్దంటూ సర్వేల్లో తేలిందన్నారు. ఆ నివేదికలను పార్టీ పట్టించుకోకపోవడమే అప్పటి ఓటమికి కారణంగా విశ్లేషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించినందున ఈసారి మళ్లీ అలాంటి తప్పు చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
*పశ్చిమబెంగాల్‌లో 25 మందితో వామపక్ష ఫ్రంట్‌ తొలి జాబితా
పశ్చిమబెంగాల్‌లో సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్‌ 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ శుక్రవారం తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో నలుగురు మహిళలు, ఐదుగురు ముస్లిం అభ్యర్థులకు చోటు కల్పించింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకుని వామపక్ష ఫ్రంట్‌ బరిలోకి దిగుతోంది. మిగిలిన 17 స్థానాల్లో కొన్నింటిలో కాంగ్రెస్‌, మరికొన్ని చోట్ల వామపక్ష ఫ్రంట్‌లు పోటీ చేస్తాయని పశ్చిమ బెంగాల్‌ వామపక్ష ఫ్రంట్‌ ఛైర్మన్‌ బిమన్‌ బోస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కొన్నిచోట్ల కాంగ్రెస్‌, వామపక్ష ఫ్రంట్‌లు సంయుక్తంగా మద్దతిచ్చిన అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. జాదవ్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి కోల్‌కతా మాజీ మేయర్‌, సీపీఎం నేత బికాస్‌ రంజన్‌ భట్టాచార్య బరిలోకి దిగనున్నారు. పురిలియా, బరాసత్‌ స్థానాలను తమకే కేటాయించాలని కాంగ్రెస్‌ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
*బీఎస్పీతో జనసేన పొత్తు
జనసేన పార్టీ పొత్తులపై దృష్టి సారించింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీతోనూ పొత్తు కుదర్చుకుని సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభ తర్వాత జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌లు నేరుగా ఉత్తరప్రదేశ్‌లోని లఖనవూ వెళ్లారు. శుక్రవారం బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో పవన్‌ సుదీర్ఘ చర్చలు జరిపారు. దాదాపు రెండున్నర గంటల పాటు అనేక అంశాలపై వీరు చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మాయావతి ఆశాభావం వ్యక్తం చేసినట్లు జనసేన విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. ‘జనసేన, వామపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తాం’ అని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వివరించింది. బీఎస్పీ ఏయే స్థానాల నుంచి పోటీ చేసేదీ రెండు మూడు రోజుల్లో తేలుస్తామని పేర్కొంది. ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాయావతి, పవన్‌ కల్యాణ్‌ సంయుక్తంగా ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.

బాధ లేదు. గర్వం ఉప్పొంగుతోంది.

తన కుమారుడు, ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను చూసి తాను గర్వపడుతున్నానని మాజీ ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌. వర్ధమాన్‌ తెలిపారు. అభినందన్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆర్మీ అదుపులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన సురక్షితంగా తిరిగి రావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి వర్ధమాన్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘నా కుమారుడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కుమారుడికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.. అభికి ఎటువంటి ప్రాణహానీ ఉండబోదని, ఆయనకు గాయాలు కాలేదని నేను అనుకుంటున్నాను. పాక్ అధీనంలో ఉన్నప్పటికీ చాలా ధైర్యంగా మాట్లాడాడు.. నిజమైన జవాను. ఆయనను చూసి మేము గర్వపడుతున్నాము’ అని ఆయన వ్యాఖ్యానించారు.‘నా కుమారుడికి మీ అందరి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. అభినందన్‌ ఎటువంటి వేధింపులకు గురికాకుండా, సురక్షితంగా తిరిగి వస్తాడని నేను ఆశిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో మా కుటుంబానికి మద్దతు నిలుస్తున్న వారందకీ కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని వర్ధమాన్‌ తెలిపారు. కాగా, భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అభినందన్‌ను తమ భూభాగంలో పాక్‌ ఆర్మీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన క్షేమంగా తిరిగి రావడానికి భారత ప్రభుత్వం కృషి చేయాలని ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి

చంద్రబాబు….నిన్ను చుస్తే జాలేస్తోంది!

ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు పై సోషల్ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు, చూస్తుంటే.. ఆయనపై జాలేస్తుందని సిఎం కుర్చీలో తానూ ఉంటే ఓ గంట కూడా కూర్చోలేనని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పై తానూ అసూయ పడటం లేదని కేవలం జాలి పడుతున్నానని అన్నారు. చంద్రబాబు వద్ద పని చేసే అధికారులే ఆయన గురించి సరిగ్గా చేబుతారంటూ ఎద్దేవా చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింత జీవి . నిన్న ఒకమాట.. నేడు ఒకమాట .. మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రత్యెక హోదా పై ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలీయదు. నిన్న మోడీని నేడు రాహుల్ గాంధీని పొగుడుతారు. రాజధాని భూములను ఒక్కొక్కరికి ఒక్కో రేటుకు ధారాదత్తం చేశారు. గ్రాఫిక్స్ తోనే డిజైన్లు చూపుతూ కలం గడుపుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. కనకదుర్గమ్మ ప్లై ఓవర్ నిర్మాణం ఏళ్ల తరబడి జరుగుతోంది. ఉక్కు ప్యాక్టరీ, రామయపట్నం పోర్టుల గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు ఇవ్వలేదు. ఎన్నికల కోసం మేమే చేస్తామని ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారు. పోలీస్ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్ధలను ఆయన భ్రష్టు పట్టించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనే బాద్యతను ఇంటలిజెన్స్ ఐజీకి అప్పగించారు. ప్రతిపక్షంలో ఉన్నవారికి కంట్రాక్టులు అప్ప చెపుతామని ఐజీ ప్రలోభాపెడుతున్నారు. స్పీకర్ వ్యవస్థను కూడా దిగాజర్చేశారు. స్పీకర్ వ్యవస్థను తూట్లు పొడుస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజాన్ని నిర్వీర్యం చేశారు. చంద్రబాబు హయాంలో కడుతున్న ప్రాజెక్టుల్లో రాధాకృష్ణకు కమీషన్లు అందాయి. పట్టిసీమ ప్రాజెక్టు పై రాధాకృష్ణ వాస్తవాలు బయటపెట్టగలరా? పట్టిసీమ, పోలవరం, హింద్రీనీవా పనుల్లో ఆయనకు ముడుపులు అందాయి. ప్రజలకు మేలు చేసేలా రాధాకృష్ణ జర్నలిజం లేదు అని మండిపడ్డారు.

ఇటువంటి మూర్ఖుల కోసం రక్తం చిందించారు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి ప్రముఖ దర్శకుడు క్రిష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లోని రెండో భాగమైన ‘మహానాయకుడు’ గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను అందుకుంటోంది. కాగా, కలెక్షన్లు రాబట్టడంలో ఈ చిత్రం వెనబడిందని సినీ వర్గాల ద్వారా తనకు తెలిసిందని కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇదే మంచి అవకాశమనుకుని క్రిష్‌పై కామెంట్లు చేశారు. ‘‘యన్‌టిఆర్‌: మహానాయకుడు’ కలెక్షన్ల రిపోర్ట్‌ గురించి నేను విన్నాను. క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఇప్పుడు చెప్పండి.. నేనేదో క్రిష్‌ను మోసం చేసినట్లు నాపై నిందలు వేసి రాబందుల్లా నన్ను పీక్కుతిన్నారు. ఇప్పుడేమంటారు? బాధాకరమైన విషయం ఏంటంటే.. క్రిష్‌తో పాటు కొన్ని మీడియా వర్గాలు కూడా ‘మణికర్ణిక’పై దుష్ప్రచారం చేశాయి. మన స్వాతంత్ర సమరయోధులు (లక్ష్మీబాయిని ఉద్దేశిస్తూ) దయాగుణం లేని ఇలాంటి మూర్ఖుల కోసం రక్తం చిందినందుకు నాకు చాలా బాధగా ఉంది’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు కంగన.

భారతదేశం మీద 50 అణుబాంబులు వేస్తే అంతా అయిపోతుంది

‘‘మేము భారత్‌పై ఒక అణుబాంబును ప్రయోగిస్తే.. భారత్‌ మాపై 20 అణుబాంబులను వేస్తుంది.’’ ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. సాక్షాత్తూ పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌. ఈ విషయాన్ని పాక్‌ పత్రిక డాన్‌ ప్రచురించింది. ఆయన ఇటీవల యుఏఈలో మాట్లాడుతూ ‘‘భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. అణుయుద్ధం సంభవించకపోవచ్చు. ఒక వేళ మేము భారత్‌పై ఒక అణుబాంబును ప్రయోగిస్తే భారత్‌ మాపై 20 అణుబాంబులను ప్రయోగిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మేము భారత్‌పై 50 అణుబాంబులతో దాడి చేయాలి. అప్పుడే భారత్‌ మాపై 20 అణుబాంబులతో దాడిచేయకుండా ఉంటుంది. మీరు 50 అణుబాంబులతో దాడికి సిద్ధమేనా?’’ అని ముషార్రఫ్‌ పాక్‌ పాలకులను ప్రశ్నించారు. పాక్‌తో సంబంధాలు పెట్టుకోవడానికి ఇజ్రాయిల్‌ సిద్ధంగా ఉందని ముషార్రఫ్‌ వెల్లడించారు. పాకిస్థాన్లో ఇప్పుడు రాజకీయ పరిస్థితి తనకు అనుకూలంగా ఉందని వెల్లడించారు. సగం మంత్రులు తన సొంత మనుషులని పేర్కొన్నారు. న్యాయశాఖ మంత్రి, అటార్ని జనరల్‌ తన న్యాయవాదులని ముషరఫ్‌ వెల్లడించారు. తాను పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

నీ బెదిరింపులకు భయపడే దేశం కాదు

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పుల్వామా ఘటనపై తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ఆధారాలు లేకుండా భారత్‌ తమను నిందిస్తోందని ఇమ్రాన్‌ ఆరోపించారు. ‘ఉగ్రదాడితో పాక్‌కు సంబంధాలున్నాయని చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. ఇలాంటి దాడి చేస్తే మాకేంటి ప్రయోజనం. మేం ఉగ్రవాదాన్ని కాదు స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ దిశగా పయనిస్తున్నాం. పుల్వామా దాడిపై మమ్మల్ని నిందించకండి. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్‌ మాపై ఆరోపణలు చేస్తోంది. శాంతి కోసం చేస్తున్న పోరాటంలో మేం ఇప్పటికే లక్షల మంది ప్రజలను కోల్పోయాం. మీరన్నట్లు నిజంగానే దాడిలో పాక్‌ ప్రమేయం ఉన్నట్లు తేలితే దర్యాప్తునకు సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దానికి నేను హామీ ఇస్తున్నా’ అని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పుకొచ్చారు. ‘యుద్ధాన్ని ప్రారంభించడం సులువే. అది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ యుద్ధం ఎక్కడ ముగుస్తుందన్నది ఆ దేవుడికే తెలియాలి. సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలి. దాడి చేస్తే పాక్‌ ప్రతిఘటించదని భారత్‌ భావిస్తోంది. కానీ మీ చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుంది’ అని ఇమ్రాన్‌ హెచ్చరించారు. కశ్మీర్‌ ప్రజలు చావుకు భయపడట్లేదని భారత్‌ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తానా ఎన్నికల్లో పోటీ చేయను–డా.నల్లూరి

ప్రస్తుతం తానా కార్యవర్గానికి నిర్వహిస్తున్న ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి తానా అద్యక్షుడు వేమన సతీష్ తదుపరి అద్యక్షుడు తాళ్ళూరి జయశేఖర్ లు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. గతంలో తానా అద్యక్ష పదవికి తాను పోటీలో ఉంటున్నట్లు ప్రముఖ వైద్యుడు, తానా పౌండేషన్ చైర్మన్ డా.నల్లూరి ప్రసాద్ ప్రకటించారు. అయితే స్వతంత్రంగా ఉంటూ, ముక్కుసూటిగా వ్యవహరించే డా.నల్లూరికి తానా నేతల నుండి మద్దతు లభించలేదని సమాచారం. దీంతో డా. నల్లూరి తానా ఎన్నికల రంగం నుండి తప్పుకుంటున్నానని, అద్యక్ష పదవికి తాను పోటీలో ఉండటంలేదని ఒక ప్రకటన విడుదల చేశారు.

భగత్ సింగ్ నేలలో తప్పుడు పుట్టుక పుట్టాడు

పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ మరోసారి పాక్‌పై సానుభూతి ప్రదర్శించారు. జమ్ము, కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, అదొక పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హింస ఎక్కడ చెలరేగినా వ్యతిరేకించాలని, దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇదే సందర్భంలో కొంతమంది చేసిన తప్పునకు దేశం మొత్తాన్ని నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్ ‌ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధూ హాజరయ్యారు. ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకొని విమర్శల పాలయ్యారు. అంతకుముందు ఉగ్రదాడిని ఖండిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ మాట్లాడుతూ.. శాంతి చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని, పాక్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. పాక్‌ డబుల్‌ గేమ్‌ ఆడుతోందని దుయ్యబట్టారు. ఓ వైపు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ శాంతి చర్చలు జరపాలని మాట్లాడుతుంటే.. మరోవైపు పాక్‌ ఆర్మీ చీఫ్‌ కుమర్‌ జావేద్‌ బజ్వా యుద్ధం గురించి మాట్లాడతారని అమరీందర్‌ మండిపడ్డారు. భారత ప్రభుత్వం ఇకనైనా పరిస్థితిని అర్థం చేసుకొని ముందడుగు వేసి ఈ దాడికి దీటుగా బదులివ్వాలని కోరారు.

తెలంగాణ ఎంపీలుగా పోటీలో ఔత్సాహిక ప్రవాసులు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో పలువురు ప్రవాస తెలంగాణవాసులు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుతూ పలువురు ఎన్ఆర్ఐలు దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలుండగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్ పార్టీల తరపున ఎన్నికల బరిలోకి దిగేందుకు పలువురు ఎన్ఆర్ఐలు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎన్ఆర్ఐలకు పార్టీ టికెట్లు ఇస్తే వారే ప్రచార ఖర్చు సమకూర్చుకుంటారని పలు పార్టీలు టికెట్లు వారికి ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ఐ శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నుంచి ఉత్తం కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. యూకేకు చెందిన మరో ఎన్ఆర్ఐ డాక్టర్ పగిడిపాటి దేవయ్య వర్ధన్నపేట నుంచి తెలంగాణ జనసమితి పక్షాన పోటీ చేసి ఓడిపోయారు. యూఎస్‌కు చెందిన మరో తెలంగాణ ఎన్ఆర్ఐ జలగం సుధీర్ నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూఎస్ శాఖ సంయుక్త కార్యదర్శి అయిన సుక్రూ నాయక్ కూడా నల్గొండ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. యూకేకు చెందిన గంపా వేణుగోపాల్ మెదక్ కాంగ్రెస్ టికెట్ కోసం యత్నిస్తున్నారు. గల్ప్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన జువ్వాడి శ్రీనివాసరావు చేవేళ్ల లేదా మల్కాజిగిరి సీటు కోసం యత్నిస్తున్నారు.తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పలువురు తెలంగాణ ఎన్ఆర్ఐలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

లాబీయింగ్‌కు దిగనున్న తెలుగు కన్సల్టన్సీల ఓనర్లు!

ఫార్మింగ్టన్‌ నకిలీ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులను అమెరికా పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో.. అక్కడి భారతీయ విద్యారంగ కన్సల్టెన్సీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. తమ కార్యాలయాలపైనా దాడులు చేస్తారేమోనని భావిస్తున్న యజమానులు అమెరికాలోని పలు నగరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. భారతీయ కన్సల్టెన్సీల్లో తెలుగు వాళ్లవే ఎక్కువగా ఉన్నాయి. సోమవారం షికాగో నగరంలో 20 మంది కన్సల్టెన్సీ యజమానులు భేటీ అయ్యారు. దాడులు జరగకుండా ముందుగానే రాజకీయ నేతలతో లాబీయింగ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపు రెండు గంటలపాటు జరిగింది. ఇతర నగరాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. కొలువులు దొరకని విద్యార్థులకు తమ కన్సల్టెన్సీల ద్వారా ఏదో ఒక ప్రాజెక్టుపై ఏదో ఒక కంపెనీలో పని కల్పిస్తారు. ఆయా కంపెనీలకు వీరి పేర్లను సిఫార్సు చేస్తారు. ఈ క్రమంలో అవకతవకలను గుర్తించి తమపైనా దాడులు చేసి అరెస్టులు చేస్తారేమోనన్నది అనుమానం. విశాఖపట్నానికి చెందిన విద్యార్థి ఒకరు ఫార్మింగ్టన్‌ వర్సిటీలో చేరాడు. అతడు భారత్‌ వచ్చేందుకు హైదరాబాద్‌కు విమానం టికెట్‌ బుక్‌ చేయించుకున్నాడు. అంతలోనే జనవరి 31న అతడిని అమెరికా పోలీసులు పట్టుకున్నారు. తాను భారత్‌ తిరిగి వెళ్తున్నానని, మళ్లీ రానని, టికెట్‌ కూడా చూపించాడు. అయినా, టికెట్‌ రద్దు చేయించి మరీ అతన్ని డిటెన్షన్‌ కేంద్రానికి తరలించారు. నిర్బంధ కేంద్రాల్లో 129 మంది తెలుగు వారుండగా, అందులో మంగళవారం సుమారు 15 మందిపై న్యాయస్థానాల్లో విచారణ ప్రారంభమైనట్లు సమాచారం.

పిలిస్తే నోరు తెరుస్తా. గుట్టు విప్పుతా.

జయలలిత మృతి గురించి విచారణ కమిషన్‌కు నిజమే చెబుతానని ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… జయలలిత ఉన్నప్పుడు శశికళ క్షమాపణ లేఖ రాశారని గుర్తుచేశారు. అందులో… ‘నాకు తెలియకుండా కొన్ని ఇబ్బందులు కలిగాయని, వాటి గురించి ఇప్పుడే తన దృష్టికి వచ్చిందని, కావున తనను క్షమించాలని’’ శశికళ పేర్కొన్నారని పన్నీర్‌ తెలిపారు. ‘‘శశికళను మాత్రమే సహాయకురాలిగా నియమించా. మిగతా 15 మందిని పార్టీ సభ్యత్వం నుంచి తొలగించానని’’ తర్వాత జరిగిన బహిరంగ సమావేశంలో అమ్మ ప్రకటించారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జయలలిత మృతి సమయంలో పార్టీ, అధికారం దినకరన్‌ కుటుంబం చేతిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అందుకే తాను ధర్మయుద్ధం చేశానని పేర్కొన్నారు. అన్నాడీఎంకేను కార్యకర్తల పార్టీగా ఎంజీఆర్‌ ప్రారంభించారని వివరించారు. జయలలిత కూడా అదే పద్ధతిలో పార్టీని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఆర్ముగస్వామి విచారణ కమిషన్‌ తనకు జనవరి 23న హాజరు కావాలని సమన్లు పంపిందని తెలిపారు. అదే రోజు ప్రపంచ పెట్టుబడుదారుల సమావేశం ఉన్నందున వేరే తేదీని పరిశీలించాలని తాను కమిషన్‌ను కోరానని, అందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. తర్వాత రెండుమూడు సార్లు వాయిదా పడిందని, అందుకు కారణం తనకు తెలియదని వివరించారు. వాయిదా వేసినట్లు వార్తలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. విచారణ కమిషన్‌ ద్వారా తనకు సమాచారం అందితే వెళ్లి నిజాలు చెబుతానని తెలిపారు. ప్రస్తుతం పత్రికలలో వస్తున్న వార్తలకు, తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల కూటమి గురించి జాతీయ, ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి ఏర్పాటవుతుందని స్పష్టం చేశారు. అర్హత, ప్రతిభ ఉంటే ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి పోటీ చేసేందుకు ఇటీవల ఆయన కుమారుడు రవీంద్రనాథ్‌ దరఖాస్తు తీసుకున్నారు. దీనిపై ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పన్నీర్‌సెల్వం విలేకర్లతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తన కుమారుడు ఆసక్తి చూపారని తెలిపారు. ఆయన విద్యార్హత, రాజకీయాలపై ఆసక్తిని చూసి పార్టీ దరఖాస్తు ఇచ్చిందన్నారు. పార్టీలోని సభ్యులందరికీ ఎన్నికల్లో పోటీకి ప్రాథమిక హక్కు ఉంటుందని తెలిపారు. ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని పార్టీ ఇచ్చిన ప్రకటన మేరకు రవీంద్రనాథ్‌ చేసుకున్నారని చెప్పారు. తమపై ఏదో ఒక విమర్శ చేయడానికే ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌ చూస్తుంటారని పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని అమ్మ గతంలోనే వెలివేశారని గుర్తు చేశారు.

ఫార్మింగ్టన్ విద్యార్థులెవరూ అమాయకులు కాదు-అమెరికా

అమెరికాలో భారత విద్యార్థుల అరెస్టుపై ప్రభుత్వం దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి అభ్యంతర పత్రం(డెమార్ష్‌) జారీ చేయడంపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. భారత విద్యార్థులకు తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసని చెప్పుకొచ్చింది. ‘‘ఈ విషయంలో అరెస్టయిన విద్యార్థులందరికీ తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసు. ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయంలో బోధనా వ్యవస్థ లేదన్న విషయం కూడా వారికి తెలుసు. అక్రమంగా అమెరికాలో ఉండాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారు’’ అని అమెరికాకు చెందిన ఓ అధికార ప్రతినిధి ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న భారత ప్రభుత్వం.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విద్యార్థులను కలవడానికి భారత దౌత్య అధికారులను అనుమతించాలని కోరింది. దళారులను, విద్యార్థులను ఒకేలాగా చూడొద్దని విజ్ఞప్తి చేసింది. వీలైనంత త్వరగా వారిని విడుదల చేయాలని కోరింది. విద్యార్థులను బలవంతంగా అక్కడి నుంచి పంపొద్దని తెలిపింది. అలాగే భారత రాయబార కార్యాలయంలో 24గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. అలాగే ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయం నకిలీదని భారత విద్యార్థులకు తెలియదని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి వివరించారు. విద్యార్థి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నవారిని పట్టుకోవాలని భావించిన అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించారు. అందులో భాగంగా 8 మంది దళారులను, వారి ద్వారా చేరిన 130 మంది విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫార్మింగ్‌టన్‌ వర్సిటీ మాత్రం జాతీయ గుర్తింపు ఉందని, ఆన్‌లైన్‌ తరగతులు కూడా అందుబాటులో ఉన్నాయని ప్రకటించుకోవడం గమనార్హం. ఒకసారి వారు తిరిగొస్తే మళ్లీ వీసా లభించడం అసాధ్యమని నిపుణుల అంటున్నారు. దీంతో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓపిక ఒక్కటే మీకు దారి-వరప్రసాదరెడ్డి

కోరుకున్న లక్ష్యం కోసం ప్రభుత్వ ఉద్యోగాలని సులభంగా వదులుకునేంత ధైర్యం ఆయనది! తాను తయారుచేసిన వ్యాక్సిన్లను స్వదేశంలోని బిడ్డలకూ అందించాలన్న లక్ష్యం కోసం ‘ఆర్‌యూ జోకింగ్‌’ అన్నా.. ‘గెటవుట్‌’ అన్నా.. పదకొండేళ్లు పాటు భరించిన సహనం ఆయనది. నాస్తికవాదం నుంచి మొదలైన ఆయన పయనం దైవత్వం దిశగా అడుగులు వేసింది. సంగీతం, సాహిత్యం తోడులేకపోతే ఏమయ్యేవాడినో… అనే శాంతా బయోటెక్‌ వరప్రసాదరెడ్డి మనసులో మాటలు…ఎవరికైనా అమ్మ ఒడే తొలి బడి. తల్లి తన కొడుకు వివేకవంతుడైన పౌరుడిగా మారాలని కోరుకోవాలిగానీ కేవలం మార్కులే తెచ్చుకునే అక్రమార్కులుగా ఎదగాలని కోరుకోకూడదు. ముందు తల్లిలో మార్పు రావాలి. ఒకప్పుడు మోరల్‌ క్లాసులు ఉండేవి. ఇప్పుడు సబ్జెక్టుల బట్టీ, మార్కుల విధానంతో పిల్లలు రోబోలుగా తయారవుతున్నారు. 99శాతం మార్కులు రాకపోయినా, ఐఐటీలో సీటు రాకపోయినా నీ మొహం నాకు చూపించొద్దనే తల్లిదండ్రులు తయారయ్యారు. ఇలాంటి కన్నవాళ్లు, మార్కుల కోసమే పుట్టిన ఈ విద్యావ్యవస్థకి ఎలాంటి నైతిక విలువలు ఉంటాయి? రైతుల విషయానికొస్తే వాళ్లకు రుణమాఫీలు ఇవ్వడం కాదు.. రుణం అవసరం లేని పరిస్థితి కల్పించాలి.

* రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి బయటికెందుకొచ్చారు?
మనిషిని ప్రభావితం చేసేవి చదువు, తల్లిదండ్రులు, పెరిగిన వాతావరణం. రైతు కుటుంబంలో పుట్టాను. ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. అల్లరిచిల్లరగా ఉండేవాణ్ణి. అందుకే మా అమ్మ నన్ను మేనమామ దగ్గరికి పంపించారు. ఆయన కరుడుగట్టిన కమ్యూనిస్టు. సుందరయ్యగారి శిష్యుడు. క్రమశిక్షణ గల వ్యక్తి. నాకూ అదే భావజాలం అబ్బింది. డి.ఆర్‌.డి.ఒ.లో 23 ఏళ్ల వయసులో చేరాను. మాపై అధికారి తాను చెప్పినట్లే చేయాలనేవారు. కష్టమైనా ఏడేళ్లు అలాగే చేశాను. అంత కీలకమైన వ్యవస్థలో నిజాయితీ లేకపోవడం నన్ను చాలా బాధించింది. దీంతో బయటికి వచ్చేశాను. ఇది 1972 నాటి పరిస్థితి. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులో ఉద్యోగం వచ్చింది. అక్కడ 90 శాతం దగా. ఐదేళ్లు ఉద్యోగం చేసి రాజీనామా చేశా.

* ఉద్యోగాలు వదిలేస్తున్నప్పుడు భయం లేదా?
వ్యవసాయం చేసుకునైనా బతికేయగలననే ధైర్యం ఉండేది. అందుకే ఉద్యోగాలు వదిలానుగానీ, విలువలు వదులుకోలేకపోయాను. నేను డీఆర్‌డీఎల్‌లో ఉద్యోగం చేసేప్పుడు ఐడీబీఎల్‌లో నామినీ డైరెక్టర్‌ అయిన ప్రొఫెసర్‌ జగదీష్‌ ప్రసాద్‌గారు పరిచయమయ్యారు. 1985లో ఆయన భాగస్వామ్యంతో మిస్సైల్‌ బ్యాటరీలకు సంబంధించిన కంపెనీలో రూ.8.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఆయన విజ్ఞత, నా కార్యశీలత కుదిరాయి. మాది గురుశిష్యుల బంధం. కంపెనీలో పరిశోధనకు పెద్దపీట వేశాం. సంస్థకు మంచి పేరొచ్చింది. తరువాత ఆయనతో విడిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

* విడిపోయాక మీ డబ్బులు మీకు రాలేదా?
నన్ను ఆయన బాగా ఇబ్బంది పెట్టారు. అక్కడ రాజకీయ ప్రమేయం మొదలైంది. గొడవైంది. మానసికంగా చాలా బాధపడ్డాను. కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

* వ్యాక్సిన్‌ ఆలోచన ఎలా వచ్చింది?
అప్పుడు మా కజిన్‌ అమెరికాకు తీసుకెళ్లాడు. ఆ గగనయానం దైవఘటనగానే భావిస్తాను. అమెరికాలో హెపటైటిస్‌ బి గురించి ఎక్కువగా చర్చించుకునేవారు. దాన్ని ఎయిడ్స్‌ కంటే తీవ్రమైన వ్యాధిగా భావించేవారు. హెపటైటిస్‌ బి చాలా రకాలుగా వస్తుంది. పైగా మరణాలు ఎక్కువ. మనదేశంతో పాటు ఆసియా దేశాల్లో ఆ వ్యాధి తీవ్రత గురించి వాళ్లు చర్చించేవాళ్లు. అక్కడ మన పిల్లలు, మన దేశం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడడం విన్నాను. ‘మీకు కావాల్సినంతమంది పిల్లలున్నారు కదా! కొందరు చనిపోతే ఏంటి?’ అన్నట్లు మాట్లాడారు. బాధేసింది. హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ గురించి ఆలోచన మొదలైంది.
మనదేశానికి వచ్చి అహ్మదాబాద్‌లో ఓ ఫార్మా కంపెనీకి వెళ్లా. ఇక్కడ హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ అవసరం గురించి అంజిరెడ్డికి చెప్పా. ‘ఇది బయోటెక్నాలజీ సంగతి. ఆ పరిజ్ఞానం సంపాదించడానికి మనకు సమయం పడుతుంద’న్నారు. దీంతో మళ్లీ అమెరికాకి వెళ్లాను. ఓ బయోటెక్నాలజీ నిపుణుడిని కలిశాను. ‘మీది పేద దేశం… సాధ్యపడదు. మూడేళ్ల క్రితం మేం అభివృద్ధి చేశాం. ఇది అర్థం కావాలంటే మీకు 30 ఏళ్లు పడుతుంది’ అన్నారాయన. మన దేశం గురించి చాలా వ్యంగంగా మాట్లాడాడు. నాకైతే అతన్ని కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఓ ఉత్తరాది వ్యక్తిని కలిస్తే ‘వీళ్లు మనకు నూతన పరిజ్ఞానం అందివ్వరు. మనమే దీన్ని సాధించుకోవచ్చ’ని వివరించారు. డబ్బు, ఓపిక దానికి చాలా అవసరమని చెప్పారు. నేనా ఇంజినీరింగ్‌ చదివినవాడిని… జీవశాస్త్రం గురించి అఆలు కూడా తెలీవు. అందుకే ముందు మంచి బృందాన్ని తయారు చేయాలనుకున్నాను.

* నిపుణులు, డబ్బు ఎలా సమకూర్చుకున్నారు?
హైదరాబాద్‌లో అప్పటికి బయోటెక్నాలజీ కంపెనీలు లేవు. దీంతో ఆ రంగంలో పనిచేసేవారూ అందుబాటులో లేరు. విదేశాలకు వెళ్లిన బయోటెక్నాలజీ వాళ్లను వాకబుచేశాను. ‘మీరు ఇక్కడ చదువుకొని అక్కడకు వెళ్లారు.. ఈ దేశానికి ఏమీ తిరిగి ఇవ్వరా’ అని ఉత్తరాలు రాశాను. కొద్దిమంది సానుకూలంగా స్పందించారు. ముగ్గురొచ్చారు. జాయిన్‌ అయ్యాక ఇద్దరు వెళ్లిపోయారు. ఒక్కరే ఉండిపోయారు. మరోవైపు భాగస్వామిగా ఉంటానన్న కంపెనీ రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్యాంకుల చుట్టూ తిరిగాను. బయోటెక్నాలజీ నేపథ్యంలో లేకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. చివరికి మానాన్న భూమి అమ్మి కావాల్సిన డబ్బు సర్దారు. మా కజిన్‌, స్నేహితులు సాయం చేశారు. రూ.2 కోట్లతో మల్లారెడ్డిగారి సౌజన్యంతో ల్యాబ్‌లో పనిచేయడం ప్రారంభించాం. అమెరికా వాళ్లు 18 డాలర్ల వ్యాక్సిన్‌ను మనకు 35 డాలర్లకు అమ్మేవాళ్లు. ఒక్కో డోసు రూ.840. ముగ్గురు పిల్లలుంటే దాదాపు రూ. 2500 దాకా అయ్యేది. దీన్ని సామాన్యులు భరించడం కష్టంగా ఉండేది. తక్కువ డబ్బులకే వ్యాక్సిన్‌ అందివ్వాలనేది నా లక్ష్యం. లక్ష్యశుద్ధి ఉంటే లక్ష్యసిద్ధి కూడా ఉంటుంది. కొందరి సహకారంతో అలా నాకు రూ.15కోట్లు జమకూడాయి.

* వ్యాక్సిన్‌ తయారీకి ఎన్నాళ్లు పట్టింది?
1991 అక్టోబర్‌లో ఈ ఆలోచన వచ్చింది. 1992 నుంచి ఈ పనిలో ఉన్నా. ఆ తర్వాత ఏడాది మార్చికి మా కంపెనీ రిజిస్ట్రేషన్‌ అయింది. 1997 ఆగస్టుకి హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ తయారు చేశాం.

* ఈ క్రమంలో మీరు పడిన ఇబ్బందులేంటి?
అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అందులో మొదటిది డబ్బు. నాకున్న రూ.2కోట్లు ఎంత వరకూ సరిపోతాయి? కావల్సింది రూ.15 కోట్లు. అన్నిటి కన్నా ముఖ్యమైంది ఈ ఉత్పత్తి పుట్టిన కొన్ని క్షణాల్లోనే బిడ్డకు అందాలి. ఇది మంచిది అని చెప్పడానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఇది సోపో, టూత్‌ పేస్టో కాదు కదా! నియంత్రించే విధానం ఒకటి ఉండాలి. డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆ పని చేస్తుంది. కానీ వాళ్ల దగ్గర అంతవరకూ ఎటువంటి విధివిధానాలు లేవు. వెళ్లి అడిగితే ‘ఆర్‌ యూ జోకింగ్‌’ అనేవారు? ఆరోగ్య కార్యదర్శి జావెద్‌ చౌదరీ గారి దగ్గరకు వెళితే… ‘నా సమయం వృథా చేయొద్దు. జోక్‌ చేస్తున్నావా. గెట్‌ అవుట్‌’ అన్నారు. అలా నాకు ఎవ్వరూ సహకరించలేదు.

* ఎవరికైనా లంచాలు ఇచ్చారా?
ఇచ్చాను. అనేక సవాళ్ల ఎదుర్కొన్నాను. శాస్త్రవేత్తలని సమీకరించుకోవడం కష్టం అయ్యింది. ఒక ప్రయోగశాల కట్టాలంటే ఒక నమూనా ఉండాలి. మరి మేం దేన్ని చూసి కట్టాలి. అయినా మంచిగానే కట్టాం. అయితే నేను బ్రహ్మని కాను, మయుడునీ కాదు. కొన్ని తప్పులు వచ్చాయి. సరిదిద్దుకున్నాం. డబ్బు లేదు, అనుభవం లేదు, విధివిధానాలు లేవు. అనుభజ్ఞులైన జనం లేరు, అన్నింటి కన్నా ముఖ్యంగా ప్రభుత్వంలో దీని గురించి స్పందన లేదు. భయంకరమైన రెడ్‌ టేపిజం. చివరికి ప్రైవేట్‌గానే అమ్మడం మొదలుపెట్టాం.

* ఈ పరిస్థితుల్లో కుటుంబం నుంచి ఎలాంటి సహకారం అందింది?
నా కుటుంబం నన్ను భరించింది. నన్ను కట్టుకున్నావిడ నా మేనత్త కూతురే కాబట్టి ఆవిడకి నా గురించి బాగా తెలుసు. ఇతను ఒక నిర్ణయానికి వస్తే మారడు అనుకుంది. ఏకైక సంతానం కాబట్టి అమ్మానాన్నలు ఎదురుచెప్పలేదు.

* అప్పటికే ఉన్న కంపెనీలు మీకు పోటీ వచ్చాయా?
మేం ప్రారంభించిన తర్వాత 8 కంపెనీలు బయోటిక్‌ డివిజన్‌ని ప్రారంభించారు. అప్పటికి ‘శాంతా బయోటెక్‌’కి చాలా పేరు వచ్చేసింది. మనమూ ఈ రంగంలోకి వెళ్లాలి అనే తపన ఇతరుల్లో మొదలైంది. కొంతమంది టెక్నాలజీని దిగుమతి చేసుకుని, మరొకటి చేసి ఈ రంగంలోకి వచ్చేశారు. నేను డబ్ల్యుహెచ్‌వో ప్రీక్వాలిఫికేషన్‌కి వెళ్లాను. రెండేళ్లపాటు మా పనితీరుని పరీక్షించారు. ఆ పరీక్షలో విజయం సాధిస్తే అంతర్జాతీయంగా వ్యాక్సిన్‌ అమ్ముకోవచ్చు. దాంట్లో మేం విజయం సాధించాం. యునిసెఫ్‌ మా దగ్గర కొనడం ప్రారంభించింది. తక్కిన వాళ్లు ఈ విషయంలో వెనకబడ్డారు. అలా మాకు అంతర్జాతీయ అనుమతులు వచ్చిన తర్వాత ఈ మందు మన బిడ్డలకన్నా ఇతర దేశాల బిడ్డలకే ఎక్కువగా అందింది. మన బిడ్డల కోసమన్నా ఆనాటి ఆరోగ్యమంత్రి అన్బుమణిరాందాస్‌ సహకరించలేదు. మన పొరుగు దేశాలు వైజ్ఞానికంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ దేశాలు మన దగ్గర కొనుక్కుని వాడుకున్నారు. కానీ మన బిడ్డలకు అందలేదు. పాకిస్తాన్‌కి మనమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ఇచ్చాం. నాకోసారి టెక్నాలజీ అవార్డు ఇచ్చారు. డబ్బుని వెనక్కి ఇచ్చేసి ఈ వ్యాక్సిన్‌ని మనదేశంలోనూ వాడండి అన్నాను. రెండోసారి అవార్డు వచ్చినప్పుడు అవార్డే వద్దన్నాను. నా సేవలు గొప్పవంటూనే నేను తయారుచేసిన వ్యాక్సిన్‌ వాడకపోతే ఎలా అని ప్రశ్నించాను. వాజ్‌పేయి గారి ప్రత్యేక కార్యదర్శి సుధీంద్ర కులకర్ణి గారికి చెప్పాను. అలా పదకొండేళ్లపాటు నా వ్యాక్సిన్‌ మన బిడ్డలకు చేరువకాలేదు. కానీ ఇప్పుడలా కాదు. మా వ్యాక్సిన్ల కారణంగా చాలామందికి వ్యాధి తగ్గింది.

* మొదట్లో నాస్తికుడిగా ఉండేవారు. మరి దైవత్వం వైపు ఎలా వచ్చారు?
మా అమ్మ ఆస్తికురాలు. చదువుకుంది. శ్రద్ధగా పూజాపునస్కారాలు చేసుకునేది. పెరిగిందేమో పరమ నాస్తికుడైన మామయ్య దగ్గర. అక్కడ హరిజనవాడల్లో తిరుగుతూ యాంటీబయోటిక్స్‌ ఇస్తూ విటమిన్‌ సి లు ఇచ్చేవాడు. ఆయన సమసమాజం కావాలని చెప్పేవాడు. ‘నువ్వు పెట్టుబడిదారీగా మారిపోతున్నావ్‌. శ్రామికుల అదనపు శ్రమే పెట్టుబడిదారుల పెట్టుబడి. నువ్వు నా దగ్గర పెరిగి ఇంత ద్రోహం చేస్తావను కోలేదు’ అన్నారాయన. నేను ‘శాంతా’ను ప్రారంభించిన తర్వాత ఉద్యోగస్తుల్లో నేను నాకోసం పనిచేస్తున్నాను అనే నమ్మకం కలిగించాను. పదహారు ఉత్పత్తులు. 1600 మంది ఉద్యోగులు. ఎంతో మంది వాటాదారులకు లాభాలువచ్చాయి. ఇక్కడ సంపద పెంచడం, పంచడం కూడా జరిగింది. మామయ్య చెప్పిన దాని ప్రకారం దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. దైవీ గుణాలు ముఖ్యం అని అనుకున్నాను. దయ, కరుణ, ఓపిక, క్షమ, సహనం అలవరుచుకున్నాను. ఒకప్పుడు తీక్షణంగా ఉండేవాడిని. ప్రభుత్వంలో కనీసం వందమందిని చంపేయాలి అనుకునే వాడిని. కానీ అమ్మ నన్ను మార్చింది. ఇప్పుడు చాలా హాయిగా ఉన్నాను. సంగీతంతో, సాహిత్యంతో జీవితం ముడిపెట్టుకుని చాలా ప్రశాంతంగా ఉన్నాను.

* అన్నీ మోహనరాగాలే
మోహనరాగం అంటే నాకు ప్రాణం. నాకు రాగాల గురించి తెలియని వయసులోనే దారినపోతూపోతూ ఎక్కడైనా మంచి పాట వినిపిస్తే గోడకు ఆనుకుని రేడియోలో వచ్చే ఆ పాట వినేవాడిని. ఇంజినీరింగ్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని పాటలు రికార్డు చేసుకున్నాను. రాగం ఏదో తెలియకుండా రికార్డు చేసుకున్నా.. కాస్త అవగాహన వచ్చిన తర్వాత చూస్తే అవన్నీ మోహనరాగాలే.

* అప్పుడే కలాంను చూశా!
యాభై ఏళ్ల క్రితం డీఆర్‌డీవోలో చేస్తున్నప్పుడు అబ్దుల్‌కలాంగారు తారసపడ్డారు. ఆయన, నేను ఓ ప్రాజెక్టులో సభ్యులం. ఆయనను మిస్సైల్‌ సైంటిస్ట్‌ అని రాసేవారు. అయితే ఆయన ఓ గొప్ప మానవతావాది. నిజాయితీపరుడు. సైంటిస్ట్‌ల భుజంమీద చేయి వేసి అభినందించేవారు.
పుస్తకాలు తక్కువ రాశాను. కానీ మంచి పుస్తకం చదివితే సమీక్ష రాస్తాను. చాలామంది ముందుమాట రాయమని అడిగేవారు. పుస్తకం మొత్తం చదివి విషయం మీద సమగ్రంగా రాస్తాను. నన్ను ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి ‘సైకాలజీ టుడే’ పత్రికలో వ్యాసాలు రాస్తున్నాను.
అవగాహన లేదు

ఆ రోజుల్లో ఎయిడ్స్‌ గురించి ప్రచారం విపరీతంగా ఉండేది. ప్రపంచబ్యాంకు బలవంతంగా మనకు రుణమిచ్చి కండోమ్‌లు వాడమని చెప్పారు. మన ప్రభుత్వ పెద్దలు సిగ్గులేక బస్సులమీద రాయించారు. బోలెడు డబ్బు ఖర్చు పెట్టారు. దీని మీద విమర్శిస్తే ‘విదేశీ లోన్‌ లేండీ’ అన్నారు అప్పటి నాయకులు. బాధాకరం ఏంటంటే హెపటైటిస్‌ బి గురించి ఎలాంటి ప్రచారం లేదు. అవగాహన కల్పించలేదు. హెపటైటిస్‌ అంటే కృత్రిమంగా సృష్టించిన ఓ మాయరోగం అని కొన్ని పత్రికలు రాశాయి. ఆ సమయంలో రామోజీరావుగారిని కలిసి మాట్లాడాను. ఆయన ‘క్రియేటెడ్‌ హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ బై వరప్రసాద్‌రెడ్డి’ అని ఆయన ఈనాడులో రాశారు. రుబెల్లాలా అందరు పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ ఇస్తే బావుంటుందినేది నా ఆలోచన. అందుకే నేను తక్కువ డబ్బులకే అందరికీ అందుబాటులో అమ్మాలనుకున్నా. ఈరెండు సాధించగలిగాం.

హవ్వా…న్యాయం కోసం నువ్వా ప్రశ్నించేది?

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా దర్యాప్తు సంస్థలను ఉద్దేశిస్తూ.. న్యాయం ఎక్కడుంది అంటూ ట్వీట్‌ చేశారు. తనకు సంబంధించిన దాదాపు రూ.13వేల కోట్ల ఆస్తులను దర్యాప్తు సంస్థలు జప్తు చేశాయని ఆయన వెల్లడించారు. తాను చెల్లించాల్సిన రుణాలు రూ.9వేల కోట్లు కాగా, ఇప్పటికే రూ.13వేల కోట్ల ఆస్తులను జప్తు చేశారని, ఇంకా ఇది ఎంత దూరం వెళ్తుందని ప్రశ్నించారు. ‘ప్రతి రోజు ఉదయం తన ఆస్తులను అధికారులు జప్తు చేశారనే వార్తతోనే నిద్ర లేస్తున్నాను. వాటి విలువ ఇప్పటికే రూ.13వేల కోట్లు దాటిపోయింది. తాను చెల్లించాల్సిన రుణం వడ్డీతో సహా రూ.9వేల కోట్లు అని బ్యాంకులు చెప్తున్నాయి. ఇంకా ఈ జప్తు ఎంత దూరం వెళ్తుంది? ఇది న్యాయమేనా?’ అని మాల్యా ట్వీట్‌ చేశారు. బ్యాంకుల కన్సార్టియం తరఫున అప్పు రికవరీ ట్రిబ్యునల్‌కు చెందిన అధికారులు ఇటీవల మాల్యా ఆస్తులను జప్తు చేశారు. దీంతో మాల్యా ఈ విధంగా ట్వీట్‌ చేశారు. భారత్‌లోని అప్పులు సెటిల్ చేసేందుకు బ్యాంకులు ఇంగ్లండ్‌లోని నా డబ్బు కావాలనుకుంటున్నాయని ఆరోపిస్తూ మాల్యా పలు ట్వీట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన తొలి భారతీయ వ్యాపారి మాల్యా. ఇటీవల ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం మాల్యాను ఈ విధంగా ప్రకటించింది.

పార్లమెంటును సంప్రదించకుండా ఏర్పాటు చేశారు

ఏపీ హైకోర్టు ఏర్పాటుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు వ్యక్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేస్తున్న విధానం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 3న ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభోత్సావానికి వెళ్లాలా? వద్దా? అన్నది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయమై ఓ జాతీయ మీడియా సంస్థతో జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ఏర్పాటుపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. పార్లమెంటు సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందన్నారు. కానీ ఇక్కడ పార్లమెంటును పక్కనపెట్టి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారనీ, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు. గతేడాది డిసెంబర్ 26న ఏపీ హైకోర్టు ఏర్పాటుపై కోవింద్ గెజిట్ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు 2019, జనవరి 1 నుంచి ఉనికిలోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ చలమేశ్వర్ స్పందిస్తూ.. దేశంలోని ప్రతీ రాజ్యాంగ వ్యవస్థ ఇలా తయారయితే .. ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్న నమ్మకం తనకు లేదని కుండబద్దలు కొట్టారు. ఆ దేవుడే మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆందోళన వ్యక్తం చేశారు.

వంద కోట్లకు నిరుద్యోగులను ముంచేశాడు

దేశ, విదేశాల్లోని కార్పొరేట్‌, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన సంస్థ ప్రతినిధులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. విజ్డమ్‌‌‌ జాబ్స్‌ పేరుతో కోట్ల రూపాయలు టోకరా వేసిన సంస్థ డైరెక్టర్‌ అజయ్‌ కొల్లా సహా 14 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు వంద కోట్ల రూపాయల వరకు ఈ సంస్థ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 3కోట్ల మంది విజ్డమ్‌‌ జాబ్స్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో సుమారు లక్ష మంది వరకూ మోస పోయినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌ సైబర్‌ టవర్స్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని వీరు మోసాలకు పాల్పడ్డారు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ సంస్థ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఉద్యోగాలు కావాలనుకునే వారు తమ బయోడేటాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత ఈ‌ సంస్థ సిబ్బంది నిరుద్యోగులకు ఫోన్‌ చేస్తారు. ప్రైవేటు సంస్థలో ఉద్యోగానికి ఎంపిక చేస్తామని నమ్మించి.. దానికి కావాల్సిన రుసుము రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ముఖాముఖిలో ఎంపికయ్యారని మరికొంత నగదు వసూలు చేసి… తర్వాత నిరుద్యోగులకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. పూర్తి వివరాల కోసం మరింత లోతుగా దర్యాప్తుచేస్తున్నట్టు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ తెలిపారు.

గాంధీ కన్నా అంబేద్కర్ గొప్పవారు. కాశ్మీర్ సర్వస్వం భారత్‌దే!

కశ్మీర్‌ వ్యవహారంలో పాకిస్తాన్‌ జోక్యం మానుకోవాలని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. కశ్మీర్‌ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని, కశ్మీర్‌ ప్రజలు, యువకులు కూడా భారత ప్రజలేనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన ప్రసంగాలు విద్వేషపూరితంగా ఉన్నాయంటే అవి నలుగురిలో ఆలోచనలు రేకెత్తించడానికే అని చెప్పుకొచ్చారు. తన దృష్టిలో మహాత్మాగాంధీ కన్నా భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ గొప్పవారని పేర్కొన్నారు. రాజకీయాల్లో యువత రావాలని ఒవైసీ పిలుపునిచ్చారు. అయితే జాతీయ పార్టీల్లో చేరితే ఉన్నత స్థానాలకు ఎదగలేరన్నారు. యువత ప్రాతినిధ్యం పెంచేందుకు ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులుగా పోటీచేసేందుకు కనీస వయసును 20 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. తనకు 49 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా తనను యువ నాయకుడిగానే గుర్తిస్తున్నారంటూ హాస్యపూరితంగా మాట్లాడారు.

ఫలాంతర్లకు కాదు నైపుణ్యవంతులకే హెచ్1బీ

హెచ్‌-1బీ వీసాలో మార్పులు తప్పనిసరిగా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హామీ ప్రకటించారు. వీసా విధానంలో మార్పులు తీసుకురావడం వల్ల అమెరికా పౌరసత్వం పొందేందుకు ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌1బీ వీసాల జారీ అంశాన్ని ప్రస్తావించారు. అత్యంత నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే ఈ వీసాలు అందేలా చేస్తామన్నారు. ఇదే విషయాన్ని ట్విటర్‌ ద్వారా ట్రంప్‌ ప్రకటించారు. ‘హెచ్‌ 1బీ వీసా విధానంలో త్వరలో మార్పులు చేయబోతున్నాం. దీని వల్ల వీసా విధానంలో సరళత్వం, కచ్చితత్వంతో పాటు పౌరసత్వం లభించేందుకు కూడా అవకాశం లభిస్తోంది. కెరీర్‌ కోసం అమెరికాను ఎంచుకునే ప్రతిభ, అత్యంత నైపుణ్యం ఉన్న ప్రజలను మేం ప్రోత్సహిస్తాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాల్లోని కంపెనీల్లో విదేశీయులు ఉద్యోగాలు చేసుకునేందుకు హెచ్‌-1బీ వీసా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భారతీయులు ఈ వీసాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌ నిబంధనల ప్రకారం ఏటా 65వేల హెచ్‌-1బీ వీసాలు జారీ చేయాలి.

చినబాబు ముఖ్యమంత్రి పదవికి పూర్తిగా అర్హుడు

ప్రజాసేవకు తెదేపా ప్రభుత్వమే నిదర్శనమని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ అన్నారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడులో బుధవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులను జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజల ముంగిటకు తీసుకొస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిందన్నారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తూ కోతలు లేకుండా చేశారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అర్హత నూరు శాతం ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, ఆయనకు సమాధానం చెప్పడానికి నేనొక్కడిని చాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పరిశ్రమలు ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు.

సరే గోడ వద్దు. స్టీల్ కంచె పెడదాం.

మెక్సికో సరిహద్దులో గోడ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గారు. గోడకు బదులుగా స్టీల్‌తో దృఢమైన కంచె ఏర్పాటు చేయాలని ట్రంప్‌ యంత్రాంగం నిర్ణయించింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. అమెరికా పాక్షిక షట్‌డౌన్‌ ముగించేందుకు తన యంత్రాంగం, డెమోక్రటిక్‌ పార్టీ నేతలతో చర్చలు జరుపుతోందని ట్రంప్‌ వెల్లడించారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందన్నారు. మెక్సికోతో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తేనే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తానని ట్రంప్‌ పట్టుబట్టడం.. అందుకు డెమోక్రటిక్‌ నేతలు అంగకరించకపోవడంతో అక్కడ పాక్షిక షట్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో డెమోక్రటిక్‌ నేతలు కూడా పట్టుదలతో ఉండడంతో షట్‌డౌన్‌ ముగించేందుకు ట్రంప్‌ కాస్త తన పట్టు వీడారు. ‘‘మేము ప్రస్తుతం సరిహద్దులో కాంక్రీటు గోడకు బదులుగా స్టీలు కంచె ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తున్నాం. ఇది దృఢంగా ఉండడమే కాకుండా వలసలను అడ్డుకుంటుంది. ఇదే మంచి పరిష్కారం. స్టీలు కంచెను అమెరికాలోనే తయారుచేస్తాం’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, పలువురు కీలక డెమోక్రటిక్‌ నేతలతో చర్చలు అనంతరం ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. డెమోక్రాట్లకు, పెన్స్‌కు జరిగిన సమావేశం ఫలవంతంగా జరిగిందని ట్రంప్‌ తెలిపారు. సరిహద్దు రక్షణ గురించి చాలా అంశాలు చర్చించినట్లు చెప్పారు. స్టీలు కంచె విషయంపై కూడా చాలా మంది అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. కాంక్రీటు గోడ నిర్మాణాన్ని డెమోక్రాట్లు ఇష్టపడడం లేదని, అందుకే స్టీలు కంచె నిర్మించనున్నట్లు తెలిపారు. వాస్తవంగా కాంక్రీటు గోడ కంటే స్టీలు కంచెకే ఎక్కువ ఖర్చువుతుందని, కానీ దృఢంగా చాలా బాగుంటుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.

ఫేకు పితరేలు వద్దు. పక్కా ప్రతిభ కావాలి.

యువత డాలర్‌ డ్రీమ్స్‌ మీద నీళ్లు కుమ్మరిస్తూ వలసదారుల పట్ల కఠినంగా ప్రవర్తించిన ట్రంప్‌ తొలిసారి ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా టాప్‌ యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశి విద్యార్థులు అమెరికాలోనే ఉండి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. అమెరికాలోని పాత వలస విధానలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొనారు. దీని వల్ల ప్రతిభావంతులను కోల్పోతున్నాం అని తెలిపారు. చట్టబద్ధమైన వలస విధానాల్లో ఉన్న లొసుగులను అంతం చేయాలని.. ప్రతిభ ఆధారిత వలసలను ప్రోత్సహించాలని అన్నారు. చట్టబద్ధంగా, ప్రతిభ ఆధారంగా అమెరికాకు వలస వచ్చే ప్రజలను తమ ప్రభుత్వం స్వాగతిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికాలో చాలా గొప్ప కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో పని చేయడానికి ప్రతిభావంతులు కావాలి. అందుకే చట్టబద్ధంగా, మెరిట్‌ ఆధారంగా వచ్చే వారిని ప్రోత్సాహించాలని నిర్ణయించామన్నారు. కంపెనీల యజమానులు కూడా ఇదే విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ‘నాకు గొప్ప గొప్ప టెక్‌ కంపెనీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. దేశంలోని మంచి విద్యాసంస్థలలో చదువుకున్న వారిని ఇక్కడ ఉంచలేకపోతున్నాం. వాళ్లు ఇక్కడి అత్యుత్తమమైన విద్యాసంస్థల్లో చదువుకుని తిరిగి చైనా, జపాన్‌, తదితర దేశాలకు వెళ్లిపోతున్నారు. వివిధ కారణాల వల్ల వారికి ఇక్కడ ఉండే అవకాశం ఉండట్లేదు. దీంతో గొప్ప ప్రతిభావంతులను కోల్పోతున్నాం. మనం అలా చేయకూడదంటూ కంపెనీల యాజమానులు తనను విన్నవించారని ట్రంప్‌ తెలిపారు. ఈ సందర్భంగా చదువు పూర్తయిన విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండి ఉద్యోగం చేసుకునే విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. ఈ విషయంపై డెమోక్రటిక్‌ కాంగ్రెషనల్‌ నేతలతో చర్చించినట్లు చెప్పారు. గొప్ప కంపెనీలను, ప్రతిభావంతులను వదులుకోమని అన్నారు. ఆశ్రయం కావాలని కోరుకునే వారికి చట్టబద్ధమైన విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన పోలీసు అధికారిని అక్రమ వలసదారుడు కాల్చి చంపడంపై స్పందించిన ట్రంప్‌.. అమెరికన్లను సురక్షితంగా ఉంచేందుకు సరిహద్దులు మరింత భద్రంగా ఉండాలని వెల్లడించారు.

బాబుకు భయం పట్టుకున్నట్లు ఉంది

శబరిమల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ ప్రభుత్వం అమలు చేస్తుంటే భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ రాద్ధాంతం చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కోర్టు తీర్పును గౌరవించాల్సింది పోయి కావాలనే అలా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విజయవాడలోని దాసరి భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేరళలో ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పుతో మహారాష్ట్రలోని శని సింగనాపూర్‌ ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని సమర్థించిన భాజపా సంకీర్ణ ప్రభుత్వం.. శబరిమల అంశాన్ని ఎందుకు రాజకీయం చేస్తోందని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం దేవాలయాలను అడ్డుపెట్టుకోవడం విచారకరమని నారాయణ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని నారాయణ చెప్పారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, రైతులు మాత్రమే ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు జనసేన అధినేత పవన్‌ను ఆహ్వానిస్తున్నారని.. సీపీఐ, సీపీఎం, జనసేన కలిసి పోటీ చేస్తాయని, ఈ విషయంలో మరో ఆలోచనే లేదన్నారు. పవన్‌ను నిన్నటి వరకు విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనను ఆహ్వానించడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పవన్‌ మద్దతు కోరుతున్నట్లు అనిపిస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు.