అమలులోకి ఎన్నికల కోడ్. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ.

17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 543 ఎంపీ స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. 17వ లోక్‌సభకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న రెండో విడత , ఏప్రిల్ 23న మూడో విడత, ఏప్రిల్ 29న నాలుగో విడత, మే 6న ఐదో విడత, మే 12న ఆరో విడత, మే 19న ఏడో విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

ప్రకాశం ప్రవాసులు బాగా సహకరిస్తున్నారు–కోమటి జయరాం

ఆంధ్రరాష్ట్రంలో ఇప్పటి వరకు 3500 డిజిటల్ తరగతి గదులను ఉన్నత పాటశాలలో ఏర్పాటు చేశామని ఏపీ జన్మభూమి కోఅర్డినేటర్ అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. బుధవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడు పాటశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని జయరాం ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కువగా డిజిటల్ తరగతి గదులను ప్రకాశం జిల్లాలోనే ఏర్పాటు చేశారని దీనికోసం ప్రకాశం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులు విరాళాలు అందించడంలో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జయరాం తన చిన్ననాటి జ్ఞాపకాలును నెమరువేసుకున్నారు. (వీడియో చూడండి) పలు ఆసక్తికరమైన విషయాలను విద్యార్ధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ తరగతి గదికి విరాళం ఇచ్చిన అట్లాంటాకు చెందిన ప్రవాసాంధ్రుడు మొవ్వ రవికిరణ్, జిల్లా విద్యాశాఖాదికారి సుబ్బారావు, పాటశాల ఉపాద్యాయులు, గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం


ఆమెరికాలోని కాలిఫొర్నియా రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటయి భారతీయ కళలు మరియు భాషలలో మాస్టర్స్, డిప్లొమ మరియు సర్టిఫికెట్ స్థాయి కోర్సులను అందిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించబడింది. తొలి బ్యాచ్ లో చేరి కోర్సు పూర్తి చేసిన ౩1 మంది విద్యార్ధులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మరియు విశ్వ విద్యాలయ పాలకవర్గ చైర్మన్ శ్రీ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందించడం జరిగింది. కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్్లో జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలో నిర్వహంచిన శోభాయాత్ర చూపరులను ఎంతో ఆకట్టుకొన్నది. విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా పాలక వర్గ సభ్యులు అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, చైర్మన్ డా. హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా. పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు కొండుభట్ల, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ దిలీప్ కొండిపర్తి, ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణులు ప్రసాద్ కైపా మరియు పట్టభద్రులు కాబోతున్న విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తులతో కవాతుగా వేదిక వద్దకు వచ్చారు. 2001వ సంవత్సరంలో సిలికానాంధ్ర ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ రాబోయే రోజులలో విశ్వవిద్యాలయం లక్ష్యం, ప్రణాళిక, కార్యకలాపాలను వివరిస్తూ స్పూర్తిదాయకమయిన స్వాగతోపన్యాసం చేసారు అధ్యక్షులు శ్రీ ఆనంద్ కూచిభొట్ల. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ త్రైమాసిక పత్రిక ‘శాస్త్ర’ ను పాలక మండలి సభ్యులు మరియు అకాడమిక్ అడ్వైజరి కమిటి చైర్మన్ డా. పప్పు వేణుగోపాలరావ్ ఆవిష్కరించారు. శనివారం జరిగిన స్నాతకోత్సవ సంబరాల్లో విశ్వవిద్యాలయ విద్యార్ధులు ప్రదర్శనలిచ్చారు , ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కర్ణాటక సంగీత ఆచార్యులు డా. శ్రీరాం పరశురాం నిర్వహించిన హిందుస్తాని-కర్ణాటక సంగీత జుగల్‌బంది కచేరీకి ప్రేక్షకులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన అధ్యాపక బృందం డా. శ్రీరాం పరశురాం, డా.మాలా స్వామి, డా.రమాదేవి, డా. సుమిత్ర వేలూరి, డా.యశోద ఠాకూర్, డా.అనుపమ కైలాష్ తదితరులను విశ్వవిద్యాలయ పాలకవర్గం ప్రత్యేకంగా సన్మానించింది.


మదనపల్లె పాఠశాలకు ప్రవాసాంధ్రుడి విరాళం

మదనపల్లె స్థానిక జెడ్పి ఉన్నత పాఠశాలలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి హాజరయ్యారు. ప్రవాసాంధ్రుడు, ఏపీ జన్మభూమి సమన్వయకర్త లోకేష్ నాయుడు పాఠశాలకు విరాళంగా ఇచ్చిన ప్రొజెక్టర్ ను ఆయన తండ్రి నారాయణస్వామినాయుడు సబ్ కలెక్టర్ కు అందజేశారు. ఏపీ జన్మభూమికి ఈ విరాళాన్ని అందించిన లోకేష్ నాయుడుకు ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధికోమటి జయరాం ధన్యవాదాలు తెలిపారు.

ఎదురుమొండి హైస్కూల్లో డిజిటల్ తరగతి గది ప్రారంభం


కృష్ణాజిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి హైస్కూల్లో ప్రవాసాంధ్రుడు న్యూజెర్సీలోని ‘దక్కన్ స్పైస్’ హోటల్ యజమాని బొబ్బా గోవర్ధన్ విరాళంతో డిజిటల్ క్లాసు రూంను ఏర్పాటు చేశారు. దీనిని తానా కోశాధికారి పొట్లూరి రవి బుధవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాత బొబ్బా గోవర్ధన్ తో పాటు తానా సమన్వయకర్త ముప్పా రాజశేఖర్, ఎదురుమొండి గ్రామప్రముఖులు పాటశాల విద్యార్ధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు. అనంతరం పొట్లూరి రవి బృందం, స్థానిక శాసన సభ్యుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బుద్దప్రసాద్ వారిని శాలువాతో సత్కరించారు.
డిజిటల్ తరగతులపై ఏపీ జన్మభూమి డాక్యుమెంటరి


ప్రవాసాంధ్రుల విరాళాలతో ఏపీ జన్మభూమి పధకం కింద రాష్ట్రంలో నిర్మిస్తున్న డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు పై ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. ఒక సైకిల్ యాత్ర ద్వారా జిల్లాలో పర్యటిస్తూ డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. దీనిని కర్నూలులో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల విరాళాలతో నిర్మిస్తున్న డిజిటల్ తరగతి గదులు ప్రభుత్వ పాటశాలల విద్యార్ధులకు బాగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. కర్నూలు జిల్లాలో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు సహకరిస్తున్న జన్మభూమి సమన్వయకర్త కోమటి జయరాం, తానా కోశాధికారి పొట్లూరి రవిలను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాదికారి సుల్తాన్, జన్మభూమి ప్రతినిధులు ప్రదీప్, అమర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లాకు డా.హనిమిరెడ్డి భారీ విరాళం


అమెరికాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు, గుండె వైద్య నిపుణుడు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇప్పటివరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు ₹60కోట్లకు పైగా విరాళాలిచ్చిన హనిమిరెడ్డి కృష్ణాజిల్లాలో కలెక్టర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి మేరకు డిజిటల్ తరగతి గదుల నిర్మాణానికి $50వేలడాలర్లను(₹35లక్షలు) అందించారు. ఏపీ జన్మభూమి పథకం క్రింద కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మిస్తున్న డిజిటల్ తరగతి గదులకు ఈ నిధులను వినియోగిస్తారు. గతంలో డిజిటల్ తరగతి గదులకు $7500 విరాళాన్ని ప్రకటించిన హనిమిరెడ్డి మరో 50వేల డాలర్లను అందించారు. భారీగా విరాళమందించిన హనిమిరెడ్డిని అమెరికాలో ఆంధ్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఏపీ జన్మభూమి సమన్వయకర్త కోమటి జయరాం కృతజ్ఞతలు తెలిపారు.

సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి ఆంబులెన్స్ ప్రారంభం


కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో ఏర్పటు చేసిన మందుల షాపు, ఆంబులెన్స్ సేవలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి.చలమేశ్వర్ మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

సిలికానాంద్ర సంజీవని ఆస్పత్రిలో సేవలు ప్రారంభించిన స్పీకర్


నృత్యం పేరుతొ ప్రపంచ వ్యాప్తమైన సిలికానాంద్ర సంజీవని వైద్యశాల ప్రజలకు ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభపతి డా.కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. మొవ్వ మండలం కూచిపూడిలోని రవిప్రకాష్ సిలికానాంద్ర సంజీవని వైద్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత మహా వైద్య శిభిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.42 లక్షలతో ఏర్పాటు చేసిన అధునాతన ఎక్స్ రే ల్యాబ్ ను సభాపతి ప్రారంభించారు. సిలికానాంద్ర వ్యవస్థాపక అద్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో డా.కోడెల మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన రూ. పది కోట్లు వీలైనంత త్వరలో వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డా.సుబ్రహ్మనేస్వరరావు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ను ప్రారంభించారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, విజయవాడ సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్ధుల సంఘం అద్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సూరపనేని శ్రీనివాస్, డా. అమ్మన్న , ప్రముఖ వైద్యులు, ఎంపీపీ కిలారపు మంగమ్మ, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, తెదేపా మండల అద్యక్షుడు తాతా వీరదుర్గాప్రసాద్, జిల్లా కార్యదర్శి తాతా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మొవ్వ, పామర్రు, మచిలీపట్నం కలిదిండి, తొట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, అవనిగడ్డ తదితర ప్రాంతాల నుంచి రోగులు తరలివచ్చారు. డా.సుబ్రమణ్యశ్వర అమెరికాకు చెందిన యూరాలజిస్తూ డా.వేములపల్లి జగన్మోహనరావు, క్యాపిటల్ ఆసుపత్రి గుండె వ్యాధి నిపుణులు డా.భూపాల్ లతో పాటు నలభై మంది వైద్యులు సేవలందించారు. లింగమనేని రామస్వామి, కాజ చిన వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకటేశ్వరరావు పామర్తి శివకుమార్, పోతుల అనన్య , కిషన్, మద్దాల కామేశ్వరరావు, నాగభూషణం తదితరులు సహకరించారు.
దుర్గి మండలంలో విజయవంతంగా తానా రైతుకోసం


గుంటూరు జిల్లా దుర్గి మండలం ఒబులేసునిపల్లెలో తానా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుకోసం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 1500మందికి పైగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా రైతుకోసం సమన్వయకర్త కోట జానయ్య సోదరుడు కోట హనుమంతరావు విరాళంగా అందించిన డిజిటల్ క్లాస్‌రూం తరగతిని ప్రారంభించారు. డా.గోరంట్ల వాసుబాబు ఒబులేసునిపల్లె, ముటుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలకు సైన్స్ పరికరాలను అందించారు.


కూచిపూడి ‘సంజీవని’ ఆసుపత్రి నిర్మాణం అద్భుతం.


యాభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో నిర్మించిన సంజీవని ఆసుపత్రి ఒక అద్భుతమని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు, దాత డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రశంసించారు. సిలికానాంద్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఆహ్వానం మేరకు డా.హనిమిరెడ్డి గురువారం నాడు ఈ ఆసుపత్రిని సందర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటువంటి భారీ ఆసుపత్రి కూచిపూడి వంటి చిన్న గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని డా. హనిమిరెడ్డి కొనియాడారు. సిలికానాంద్ర ఆద్వర్యంలో చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం డా. హనిమిరెడ్డిని ఆనంద్ ఆద్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమంలో TNI డైరెక్టర్ కిలారు ముద్దుకృష్ణ, విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తోండేపు రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొత్తగూడెం-భద్రాచలంలో ఉరకలెత్తిన “తానా” పరుగు


తెలుగు రాష్ట్రాల్లో తానా ఆధ్వర్యంలో చేపడుతున్న చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు కొత్తగూడెం, భద్రాచలంలో 5కే రన్, రైతు కోసం కార్యక్రమం తో పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక ఉత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. తానా తదుపరి అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి సారద్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు తానా అద్యక్షుడు వేమన సతీష్ తో పాటు ఇతర ముఖ్య కార్యవర్గ సభ్యులందరూ హాజరయ్యారు. కొత్తగూడెంలో ఉదయం 7.30 గంటల నుండి జరిగిన 5కే రన్ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ సెంట్రల్ పార్కులో జరిగిన సభకు కొత్తగూడెం, ఇల్లెందు శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. స్థానికంగా ఉన్న వివిధ ట్రస్టులు, సేవా సంస్థలు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైతుకోసం పధకం కింద పలువురు రైతులకు వ్యవసాయ సంబందిత పరికరాలను అందజేశారు. పది స్థానిక పాటశాలలో డిజిటల్ తరగతి గదులకు అవసరమైన పరికరాలను అందజేశారు. వివిద్ క్రీడల్లో గెలుపొందిన యువతీ యువకులకు బహుమతులు ప్రదానం చేశారు.
*** భద్రాచలంలో ఎడ్ల ప్రదర్శన
భద్రాచలంలో కార్యక్రమాలు తాళ్లూరి జయశేఖర్ ఇంట్లో విందుతో ప్రారంభమయ్యాయి. ప్రముఖ సీతారామచంద్రుల దేవాలయాన్ని తానా బృందం సందర్శించారు. ఆలయ లాంచనాలతో స్వాగతం లభించింది. అనంతరం రైతుకోసం కార్యక్రమంలో భాగంగా ఎడ్లతో ప్రదర్శన జరిగింది. తానా బృందాన్ని ఎడ్ల బండిపై ఊరేగించారు. అనంతరం రైతులకి పరికరాలను పంపిణీ చేశారు. తానా ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఐకేడీఏ పీవో పమేలా సత్ఫది తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సినీ నటులు శివబాలాజీ తదితరులు ప్రధాన ఆకర్షణగా పాల్గొన్నారు. సినీ గాయకులచే సంగీత విభావరి నిర్వహించారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్ మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో ఇరవై రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చైతన్య స్రవంతులు నిర్వహించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అటు అమెరికాలోనూ ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తానా ఆధ్వర్యంలో మిలియన్ డాలర్ల ఖర్చుతో వివిధ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తానా నిర్వాహకులు తాళ్లూరి జయశేఖర్, లావు అంజయ్య చౌదరి, పొట్లూరి రవి, గోగినేని శ్రీనివాస్, కొండ్రగుంట చలపతి, మందడపు రవి, బత్తిన రాకేశ్, కోట జానయ్య, తాళ్లూరి రాజా, స్థానిక ప్రముఖులు చావా లక్ష్మీనారాయణ, తాళ్లూరి పంచాక్షరయ్య తదితరులు పాల్గొన్నారు. – కొత్తగూడెం, భద్రాచలం నుండి కిలారు ముద్దుకృష్ణ.
డా.హనిమిరెడ్డి ఔదార్యం అందరికి ఆదర్శం-మంత్రి ఉమా


విద్యార్ధుల్లో సైన్స్ పట్ల అవగాహన పొందడం కోసం ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ విభాగాన్ని మైలవరంలో గురువారం నాడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. దీని ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి రూ.75 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలుకు 60కోట్ల రూపాయలకు పైగా విరాళం అందించిన డా. హనిమిరెడ్డి ఔదార్యం గొప్పదని ప్రశంసించారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు ముందుకు రావాలని మంత్రి ఉమా కోరారు. మైలవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ఖర్చుతో వివిధ సంస్థలను ఏర్పాటు చేస్తున్న డా.హనిమిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో సైన్స్ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న అగస్త్య ఫౌండేషన్ మైలవరం ప్రాంతంలో విద్యార్ధుల కోసం శాఖను ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ రాంజీ రాఘవ మాట్లాడుతూ భారతదేశంలో పందొమ్మిది రాష్ట్రాల్లో 200 మొబైల్ వాహనాల ద్వారా అగస్త్య ఫౌండేషన్ విద్యార్ధులకు శాస్త్రీయ పరిశోధనల పైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 175 ఎకరాల స్థలంలో అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో ఆధునిక పరిశోధనశాలలను ఏర్పాటు చేసిన ఉపాద్యాయులు, విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ తాము సంపాదించిన దానిలో పేద విద్యార్ధులకు సహాయం చేయడం కోసం వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఎక్కువగా విరాళాలు ఇస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని హైస్కూల్ స్థాయి నుండి విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జానకిరాం, డా.హనిమిరెడ్డి సతీమణి విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల స్థానిక ప్రముఖుడు గోగులమూడి సత్యనారాయణరెడ్డి, ఎమ్మార్వో పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.కృష్ణా జిల్లా తిరువూరులో డిజిటల్ తరగతి గది ప్రారంభించిన తాళ్లూరి జయశేఖర్


అమెరికాలోని కొలంబస్‌కు చెందిన ప్రవాసుడు, “టాకో” మాజీ అధ్యక్షుడు సామినేని రవి విరాళంతో సమకూర్చిన డిజిటల్ తరగతి గదిని కృష్ణా జిల్లా తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సోమవారం నాడు ప్రారంభించారు. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఈ తరగతి గదిని ప్రారంభించారు. ఏపీ జన్మభూమి పథకం కింద అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తొన్న డిజిటల్ తరగతి గదుల ఏర్పాటుకు స్పందించి తిరువూరులో దీన్ని ఏర్పాటుకు విరాళమందించినట్లు రవి సామినేని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ కిలారు విజయబిందు, ఎంపీపీ గద్దె వెంకన్న, మాజీ తహశీల్దార్ పొట్లూరి తిరుమలరావు, రవి కుటుంబ సభ్యులు, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల అభివృద్ధి అంటే ఇలా ఉండాలి

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర జిల్లా పరిషత్‌ ఓరియెంటల్‌ పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే బోధన చేస్తూ విద్యార్థుల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాల వైఖరులు పెంపొందించేలా పాటుపడుతున్నారు. ఒకవైపు కృత్యాలు, పరిశోధనల ద్వారా తరగతి గదులను తయారు చేస్తూ మరోవైపు పాఠశాల ఆవరణను స్వచ్ఛంగా, నందనవనంగా మారుస్తున్నారు. భాషా సాంస్కృతిక విభాగం పేరుతో తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషా ప్రయోగశాల, సాంఘిుక శాస్త్ర విజ్ఞాన విభాగాల ఏర్పాటుతో ఇక్కడ గోడలే పాఠాలు చెబుతుంటాయ్‌. సిలికానాంధ్ర కుటుంబం దత్తత తీసుకున్న ఈ పాఠశాల ఇతర విద్యాలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
***నాలుగేళ్ల కిందట సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్‌ ఈ పాఠశాలను దత్తత తీసుకున్నారు. తరగతి గదులను దాతల సాయంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
* గత రెండేళ్లుగా పాఠశాల ఆవరణను ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి నందనవనంగా తీర్చిదిద్దుతున్నారు. చూడగానే ఆవరణ హరితవనంలా కనిపిస్తుంది. పాఠశాలలోని మరుగుదొడ్లకు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గత ఏడాది మరమ్మతులు చేసి పచ్చదనం పెంచారు. నాలుగేళ్లుగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులచే తెలుగుభాషాదినోత్సవం, ప్రముఖ కవుల జయంతి కార్యక్రమాలు వంటి వాటితోపాటు భారతీయ సాంస్కృతిక సంప్రదాయలకు పెద్దపీట వేస్తున్నారు.
* పాఠశాలలో గత ఏడాది సాంఘిక శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేసి జిల్లా విద్యాశాఖ నుంచి ప్రశంసలను అందుకున్నారు. నవ్యాంధ్ర అమరావతిలో ఐకాన్‌ బ్రిడ్జి నమూనాలను, కూచిపూడి నృత్యభంగిమలు, ప్రముఖ చరిత్రకారుల జీవిత విశేషాలు, ప్రాచీన విశ్వవిద్యాలయాల వివరాలు, చరిత్ర, సంస్కృతి తెలిసేలా తరగతి గదిని తీర్చిదిద్దారు.
* భాషా సాంసృతిక విభాగం పేరుతో తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషా ప్రయోశాలలను నూతనగా ఏర్పాటుచేశారు. అందులో విభిన్న నాట్య రీతులు, కూచిపూడి నాట్యవైభవం, తెలుగు వెలుగుల పేరుతో ప్రముఖ కవులైన క్షేత్రయ్య, నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, అన్నమయ్య వంటివారితోపాటు ఆధునిక కవులైన గిడుగురామ్మూర్తి, శ్రీశ్రీ వంటివారి చిత్రపటాలను ఏర్పాటు చేశారు. భారతీయ భాషలు, తెలుగు లిపిక్రమ పరిణామ క్రమాన్ని ఇందులో పొందుపరిచారు. మౌర్యుల కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయల వరకు చిత్రాలను ఏర్పాటు చేసి చరిత్రపై అవగాహన ఏర్పడేలా చేశారు.
* భారతీయ వైభవం పేరుతో తల్లి గర్భంలో శిశువు పురుడు పోసుకొని జన్మనిచ్చిన క్రమం.. వేదవ్యాసుని వాయు పురాణంలోని 16 శ్లోకాలకు బాపు చిత్రాలు, చాగంటి వ్యాఖ్యానాలను మాతృవందనం పేరుతో ఏర్పాటు చేశారు. వేమన పద్యాలను గోడపై లిఖించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం కొల్లి జగదీశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలలో విభిన్న అంశాలపై ప్రయోగశాలలు ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా విద్యార్థులు త్వరితగతిన జ్ఞానాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు. చిన్నారులు అన్ని రంగాల్లో రాణించేలా తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
* కూచిపూడి రోటరీ క్లబ్‌ సభ్యుల సహకారంతో తాగునీరు, మౌలిక వసతులు ఏర్పడ్డాయి. పారిశ్రామికవేత్త చీకటిమర్ల శివరామప్రసాద్‌, ప్రభుత్వ సహకారంతో రెండు డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేసుకున్నారు.

గల్ఫ్ బాధితుడికి బెహ్రెయిన్ తెరాస సాయం

బెహ్రెయిన్‌లో ఉపాధి కోసం వెళ్లిన నిజామాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన మారిపెద్ది శంకర్(41) ఆరోగ్య కారణాల రీత్యా స్వదేశానికి తిరిగి రావడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గ్రహించిన బెహ్రెయిన్ తెరాస విభాగం, అతడి పాస్‌పోర్టు ప్రయాణ ఏర్పాట్లకు అవసరమైన సాయాన్ని అందజేసింది. బెహ్రెయిన్ ఆసుపత్రిలో చికిత్సకు అతడి అనారోగ్యం సహకరించకపోవడంతో అతణ్ని స్వదేశానికి పంపించేందుకు తోడ్పడ్డామని బెహ్రెయిన్ ఎన్నారై తెరాస అధ్యక్షుడు రాధారపు సతీష్‌కుమార్ తెలిపారు. బాధితుడికి ప్రయాణ అవసరాలను బెహ్రెయిన్ తెరాస వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, గంగాధర్ గుముళ్లల ఆధ్వర్యంలో అందజేశారు.

నూజివీడు నియోజకవర్గంలో 12డిజిటల్ తరగతులకు గోగినేని కార్తీక్ విరాళం


న్యూజెర్సీలో స్థిరపడిన నూజివీడుకు చెందిన ప్రవాసాంధ్రుడు, 2007-14 మధ్య నూజివీడు నుండి TNSFకు ప్రాతినిధ్యం వహించిన గోగినేని కార్తీక్ తాను విద్యనభ్యసించిన యనమదల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు కృష్ణాజిల్లాలోని ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల్లోని మరో 11 జడ్పీ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతి ఏర్పాటుకు విరాళాలు అందించారు. సోమవారం నాడు ఈ తరగతి గదులను ప్రారంభించి, నూతన బెంచీల ఏర్పాటుకు మరికొంత సొమ్మును అధ్యాపకులకు విరాళంగా అందించారు. సాంకేతికత సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రతిరోజు నూతనత్వం మరింత నూతనంగా రూపాంతరం చెందుతున్న ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు తమ సమకాలీకులతో పోటీపడేందుకు అవసరమైన తర్ఫీదు వ్యవస్థ నెలకొల్పే లక్ష్యంతో ఈ తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నట్లు కార్తీక్ తెలిపారు. తనకు ఈ తరగతి గదులు ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన “ఏపీ జన్మభూమి” కార్యక్రమానికి కార్తీక్ ధన్యవాదాలు తెలిపారు.

కోమటి జయరాం సేవలను ప్రశంసించిన చంద్రబాబు

“కృష్టాజిల్లా ఉల్లిపాలెం గ్రామం ఎంపీయూపీ పాఠశాలలో డిజిటల్ క్లాస్ తరగతులను ప్రారంభించి తరగతి గదిలో పిల్లలతో కలిసి కూర్చుని డిజిటల్ బోధనను పరిశీలించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఈ మహత్తర కార్యక్రమం కింద ఉత్తర అమెరికా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే 3500 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఎన్నారైలు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఆయన సేవలను నేను అభినందిస్తున్నాను. కృష్ణా జిల్లాలో ఇప్పటికే సుమారు 200 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ నిర్వహిస్తున్నారు. మరో 240 డిజిటల్ తరగతి గదుల్లో టచ్ స్క్రీన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి భృహత్తర కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే మరింత మేలు జరుగుతుంది” అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు..

Hon’ble CM Sri Nara Chandrababu Naidu garu today inaugurated digital classroom at MPUP school Ullipalem in Krishna District. Hon’ble CM appreciated the efforts of AP Janmabhoomi and Jayaram Komati, Special Representative for North America for connecting NRIs in big numbers and providing digital classrooms in Govt schools. Hon’ble CM felicitated the family members of NRI Dileep Kumar Chandra who donated this digital classroom. AP Janmabhoomi thanks Dileep Kumar Chandra and all other NRIs who supported this cause to provide quality education.The event was graced by Deputy Speaker Sri Mandali Buddhaprasad garu. Hon’ble MP Sri Konakalla Narayana Rao garu, Hon’ble Ministers Sri Devineni Uma Maheswara Rao garu and Sri Kollu Ravindra garu , Zilla Parishad Chairman Gadde Anuradha గారు
.

ఉల్లిపాలెంలో డిజిటల్ తరగతులు ప్రారంభించిన చంద్రబాబు

“కృష్టాజిల్లా ఉల్లిపాలెం గ్రామం ఎంపీయూపీ పాఠశాలలో డిజిటల్ క్లాస్ తరగతులను ప్రారంభించి తరగతి గదిలో పిల్లలతో కలిసి కూర్చుని డిజిటల్ బోధనను పరిశీలించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే ఈ మహత్తర కార్యక్రమం కింద ఉత్తర అమెరికా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇప్పటికే 3500 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఎన్నారైలు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికే సుమారు 200 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ నిర్వహిస్తున్నారు. మరో 240 డిజిటల్ తరగతి గదుల్లో టచ్ స్క్రీన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి భృహత్తర కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే మరింత మేలు జరుగుతుంది.” అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రముఖ విద్యావేత్త, దానశీలి ప్రొ.మూల్పూరి వెంకట్రావు జీవితం అందరికి ఆదర్శం.


విద్యావేత్తగా, దానశీలిగా, నిరుపేదలకు సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు సంతరించుకున్న ఆదర్శ వ్యక్తి డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. సామాన్య కుటుంబం నుంచి అగ్రరాజ్యం అమెరికాలో అత్యున్నతమైన ఫ్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వెంకట్రావు నిరాడంబర, నిస్వార్థ జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తాను సంపాదించిన దాంట్లో గణనీయమైన శాతం డాక్టర్ వెంకట్రావు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ ఉండటం విశేషం. ఆర్భాటాలకు, ప్రచారనికి దూరంగా ఉండే ప్రొఫెసర్ వెంకట్రావు జీవనశైలి అందరికీ, ముఖ్యంగా నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా ఉంటుందనటంలో సందేహం లేదు.

*** తానా కన్వీనర్‌గా కీలక బాధ్యతలు
వాషింగ్టన్ డీసీలో జులై మొదటి వారంలో తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తానా అధ్యక్షుడు వేమన సతీష్ సారథ్యంలోని యువ కార్యవర్గం ఈ మహాసభలను ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాసభలకు ఒక ప్రముఖ వ్యక్తి, అనుభవం ఉన్న కార్యశీలిని కన్వీనర్‌గా ఉండాలని తానా యువ కార్యవర్గం భావించింది. అన్ని విధాలుగా అనుభవం గడించిన, వివాదాలకు దూరంగా ఉండే ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావును తానా మహాసభల సమన్వయకర్తగా, యువ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మూల్పూరి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈసారి జరిగే తానా మహాసభలు చరిత్రలో మరచిపోలేని విధంగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

*** జీవన ప్రస్థానం ఇది
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రఖ్యాతి చెందిన జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో గత 32 ఏళ్ళు నుండి ప్రొఫెసరుగా పనిచేస్తున్న డాక్టర్.మూల్పూరి వెంకట్రావు ప్రతి ఏడాది తన సంపాదనలో పెద్ద మొత్తం (రూ.30లక్షల రూపాయలకుపైగా) సేవా కార్యక్రమాలకు విరాళాలుగా అందజేస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులకు బోధనతో పాటు డాక్టర్.వెంకట్రావు వర్జీనియా పరిసర ప్రాంతల్లో ఉన్న ప్రవాసాంధ్ర కుటుంబాలకు చెందిన మిడిల్ స్కూలు (6,7,8 తరగతులు), హైస్కూలు (9,10,11,12 తరగతులు) విద్యార్థులకు తన తీరిక సమయంలో పాఠాలు బోధిస్తుంటారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు రావాలంటే ప్రత్యేకమైన తర్ఫీదు అవసరం. ఈ స్కూలులో ప్రవేశం కోసం పొందే శిక్షణలకు సైతం అత్యధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది గమనించిన వెంకట్రావు గత 10 సంవత్సరాల నుండి విద్యార్ధులకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఆయన తర్ఫీదు ఇచ్చిన వారిలో 300 మంది థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు సంపాదించారు. వెంకట్రావు స్ధాపించిన క్యూరీ లెర్నింగ్ సంస్ధ అమెరికాలోని ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు పన్నెండు నగరాల్లో క్యూరీ లెర్నింగ్ శాఖలు ఏర్పాటు చేసినట్లు ప్రొఫెసర్ మూల్పురి TNIకు తెలిపారు.

*** బాల్యం-విద్యాభ్యాసం
కృష్ణా జిల్లా ఘంటసాలలో మూల్పూరి చెన్నారావు, లక్ష్మితులసమ్మ దంపతులకు వెంకట్రావు జన్మించారు. తండ్రి చెన్నారావు స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు, వెంకట్రావు 10వ తరగతి వరకు స్థానికంగా, ఇంటర్మీడియట్ విజయవాడ లయోలా కళాశాల (1970-72)లో పూర్తి చేసారు. అనంతరం కాకినాడ జె.ఎన్.టీ.యూలో బీటెక్ (ఈసీఈ) విద్యనభ్యసించారు. తదుపరి ప్రతిష్టాత్మక ముంబై ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1979-81 మధ్య కాలంలో విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1981వ సంవత్సరంలో అమెరికా వెళ్ళి ఆరెగాన్/మిషిగన్ విశ్వవిద్యాలయాల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ విభాగంలో పీ.హెచ్.డీ చేశారు. 2005లో తానా వారు అత్యుత్తమ ఇంజనీర్ అవార్డును ఇచ్చి సత్కరించారు. జార్జి మేసన్ యూనివర్సిటీ నుండి 2002లో ‘ఔట్ స్టాండింగ్ రీసర్చ్’ అవార్డుతో పాటు పలు జాతీయ, ప్రాంతీయ స్ధాయిల్లో 10కు పైగా కమ్యూనిటీ సర్వీసు అవార్డులు, అక్కినేని 89వ జన్మదిన పురస్కారాలు వెంకట్రావును వరించాయి.

*** ఆదాయంలో గణనీయ శాతం విరాళాలకు
ధామస్ జఫర్సన్ పాఠశాలలో ప్రవేశం కోసం ప్రవాసాంధ్ర విద్యార్ధులకు చెప్పే పాఠాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొదటి అయిదేళ్ల పాటు పూర్తిగా అందించిన వెంకట్రావు, ఆ తర్వాత పెరిగిన విద్యార్ధులు, అధ్యాపకుల సంఖ్య, ఇతరత్రా నిర్వహణా ఖర్చుల దృష్ట్యా వచ్చిన ఆదాయంలో గణనీయమైన శాతాన్ని విరాళాలుగా అందిస్తున్నారు. వాషింగ్టన్ లో విద్యార్ధులకు ప్రైవేట్ పాఠాలు చెపుతున్న డాక్టర్.వెంకట్రావుకు సంవత్సరానికి రూ.30లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని ఆయన సమాజ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. గిరిజన విద్యార్ధులకు ఏకల్ విద్యాలయ సంస్ధ ద్వారా నూతన పాఠశాలలను ప్రారంభించటానికి తోడ్పడ్డారు. హైదరాబాద్ లో అనాధ బాలలకోసం వేమూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థకు ఇప్పటి వరకు రూ.15లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీకాకుళం, చల్లపల్లి ప్రాంతాల్లో పురాతన ఆలయాల పున:నిర్మాణానికి ఇప్పటివరకు రూ.10లక్షల వరకు అందజేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా భక్తాళాపురంలో షిర్డీ సాయిబాబా మందిరాన్ని, కమ్యూనిటీ హాలును నిర్మిస్తున్నారు. దీనిలో పాటు ఘంటశాలలో ఏర్పాటు చేసిన గొర్రెపాటి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నారు. వాషింగ్టన్ సమీపంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర లోటస్ టెంపుల్ కు ఇప్పటి వరకు రూ.కోటి 25లక్షలకు పైగా విరాళాన్ని అందించారు. కనకదుర్గ ఆలయానికి ఇప్పటి వరకు రూ.25లక్షలు అందించారు.

* **అంతా మేధావులే
వెంకట్రవు తమ గ్రామానికి సమీపంలో ఉన్న రావివారిపాలేనికి చెందిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆమె వాషింగ్టన్ లో ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అమెరికన్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ సంస్థలో ప్రైమరీ ఎగ్జామినర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కార్తిక్ భవాని శంకర్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన కార్నెల్ మరియు స్టాన్‌ఫోర్డ్ యునివర్శటిల్లో చదివి ప్రస్తుతం న్యూయార్కులోని మీడియా మాత్ అనే కంపెనీలో ఆపరేషన్స్ అండ్ స్ట్రేటజీ విభాగానికి డైరక్టరుగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు కేధార్ నాథ్ ప్రముఖ యునివర్సటీ డార్ట్ మత్ కాలేజీలో బ్యాచిలర్స్ విద్యనభ్యసించి ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీల్ మాస్టర్స్ డిగ్రీని చేస్తున్నారు.

*** ఎన్.టి.ఆర్ వీరాభిమాని మరియు నిర్మాత
ప్రొఫెసర్ వెంకట్రావు చదువుతో పాటు రంగస్థల నటుడిగానూ గుర్తింపు పొందారు. ఎన్.టి.రామరావుకు వీరాభిమాని అయిన వెంకట్రావు ఆయనతో సినిమాలు తీయాలనే బలమైన కోరికతో ఉండేవారు. అది సాధ్యం కాకపోవటంతో 1994, 97 సంవత్సరాల్లో ఎన్.టి.ఆర్ కుమారుడు బాలకృష్ణ కధానాయకుడిగా ‘టాప్ హీరో’, ‘దేవుడు ‘ చిత్ర్రాలు నిర్మించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో కృష్ణా నది ఒడ్డున ఎన్.టి.ఆర్ పేరుమీదుగా మ్యూజియంను ఏర్పాటు చేయాలనేది ఆయన ఆకాంక్ష.

*** పరిశోధన రంగంలో వెంకట్రావు ప్రతిభ
* ఇప్పటి వరకు 17 మంది పీ.హెచ్.డీ విద్యార్ధులకు విజయవంతమైన పరిశోధన మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. ఈయన దిశానిర్దేశంలో ప్రస్తుతం ముగ్గురు పీ.హెచ్.డీ విద్యార్ధులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
* 140 జర్నల్ ఆర్టికల్స్ ప్రచురించారు. 100 కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ప్రచురించారు.
* అమెరికా జాతీయ సైన్స ఫౌండేషన్ నుండి అప్రతిహితంగా 28 ఏళ్లు (1987-2015)పాటు నిధులు అందుకున్నారు.
ఇన్ని చేసినప్పటికీ తనకి సంతృప్తినిచ్చేది కేవలం ఒకే ఒక విషయం అంటారు డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. ఒక వైపు తన సంస్ధ క్యూరీ లెర్నింగ్ లో కిండెర్ గార్టెన్ (ఎల్.కే.జీ) నుండి ఉన్నత పాఠశాల వరకు పలువురు విద్యార్ధులు. మరో వైపు జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులు. వీరందరికీ (ఎల్.కె.జీ నుండి పీ.హెచ్.డీ వరకు) ప్రతిరోజు వివిధ సమయాల్లో విద్యను అందించటం తనకు చాలా ఉత్తేజాన్ని, ఆనాందాన్నిస్తుందని, తద్వారా వచ్చే ఆదాయం ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడం సంతృప్తినిస్తుందని ప్రొఫెసర్ మూల్పూరి పేర్కొనడం నేటితరం ఎందరో యువతీయువకులకు ఓ జీవితపాఠం. –కిలారు ముద్దుకృష్ణ , సీనియర్ జర్నలిస్ట్

కూచిపూడిలో భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం

కూచిపూడి గ్రామంలో NREGS-RWS నిధులతో ఏర్పాటు చేస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన ప్రారంభించారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ₹.7కోట్లతో రూపొందుతున్న ఈ పనులకు 70శాతం NREGS నుండి మిగిలిన 30శాతం RWS నుండి లభిస్తున్నాయి.

సంజీవనికి సిఎం ద్వారా విరాళాలు అందించిన ప్రవాసులు

కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో దాదాపు రూ.50కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు వందల పడకల మల్టీ స్పెషాలిటీ సంజీవని ఆస్పత్రికి ప్రవాసుల నుండి విరాళాలు భారీగా వస్తున్నాయి. 18వ తేదీన ఆసుపత్రి ప్రారంభించడానికి వచ్చిన చంద్రబాబు చేతుల మీదుగా పలువురు ప్రవాసులు సంజీవని ఆస్పత్రికి విరాళాలు అందజేశారు. ప్లోరిడాకు చెందిన నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ పది లక్షల రూపాయలు, డాలస్ కు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు కోనేరు శ్రీనివాస్ ఆరు లక్షల రూపాయలు సిఎం చంద్రబాబు ద్వారా విరాళాలను అందజేశారు. వీరిరువురిని ముఖ్యమంత్రి చంద్రబాబు, సిలికానాంద్ర చైర్మన్ కూచిభొట్ల చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. అమెరికాకు చెందిన ఇద్దరు చిన్నారుల వయసు పెద్దది. కూచిపూడిలో సిలికానాంద్ర కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ వైద్యశాలకు విరాళం అందించారు. అమెరికాలో తాము విక్రయించి, నృత్యాలు ప్రదర్శించి, స్నేహితుల కుటుంబ సభ్యులను ఇంటికి విందుకు పిలిచి ఆస్పత్రి నిర్మాణం గురించి వివరించి విరాళాలు సేకరించారు. ఇలా ఒక్కొక్కరు రూ.పది లక్షల చొప్పున ఆసుపత్రి నిర్మాణానికి విరాళం అందించారు. వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సన్మానించారు.

తిత్లీ బాధితులకు ప్రవాసుల భారీ విరాళం

తిత్లీ బాధితులను ఆదుకునేందుకు అమెరికాలోని ప్రవాసాంధ్రులు స్పందించి వారిని ఆదుకునేందుకు విరాళాలు సేకరించారు. వారికి అవసరమైన ఆహార పదార్థాలు, వస్తువుల్ని పంపిణీ చేశారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా అమెరికా విభాగం ఆధ్వర్యంలో సుమారు రూ.50 లక్షల విరాళాలు సేకరించారు. దానిలో రూ.30 లక్షలతో రొట్టెలు, వాటర్‌ క్యాన్లు, దోమ తెరలు, బట్టలు, దుప్పట్లు, ఎల్‌ఈడీ ల్యాంప్‌లు వంటివి తుపాను బాధిత ప్రాంతాలకు పంపించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా స్థానిక ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌ పంపిణీ వ్యవహారాల్ని సమన్వయం చేస్తున్నారు. రూ.20 లక్షలతో పాఠశాల భవనం నిర్మిస్తామని ఎన్‌ఆర్‌ఐ తెదేపా ప్రతినిధి రామ్‌ చౌదరి తెలిపారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్‌) పలాస, సోంపేట వంటి ప్రాంతాలకు 50 మందికి పైగా వాలంటీర్లను పంపించింది. వీరికి స్థానిక గ్లో ఫౌండేషన్‌ సహాయ పడుతోంది. బాధితుల సహాయార్థం నాట్స్‌ రూ.20లక్షలు సేకరించింది. నాట్స్‌ దత్తత తీసుకున్న కొండలోగం, పట్టులోగం, తంగారపుట్టి వంటి గ్రామాల్లో 10 వేల మంది తుపాను బాధితులకు కిట్‌లు పంపిణీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కిట్లలో చీరలు, దుప్పట్లు, బియ్యం, కందిపప్పు వంటి సరకులు ఉన్నాయి.

పదో రికార్డు కైవసం చేసుకున్న కూచిభొట్ల ఆనంద్-TNI ప్రత్యేకం


ఓ వ్యక్తి రూపొందించిన ఒక వ్యవస్థ అద్భుతాలను సృష్టిస్తోంది. యావత్ తెలుగు జాతి గర్వించే విధంగా కార్యకలాపాలను చేపడుతోంది. విదేశాల్లో పుట్టిన ఒక చిన్న తెలుగు సంఘం మాతృభూమిని మరచిపోకుండా సొంతగడ్డ పై చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు తెలుగువారందరికి గర్వకారణంగా ఉంటున్నాయి.

*** ఉపాధి కోసం భార్యబిడ్డలతో కలిసి అమెరికా వెళ్లి ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని 18ఏళ్ల క్రితం కూచిభొట్ల ఆనంద్ అనే ఒక చిన్న వ్యక్తి ఏర్పాటు చేసిన ‘సిలికానాంధ్ర’ అనే చిన్న సంస్థ తెలుగుజాతి గర్వించే విధంగా చేస్తున్న కార్యక్రమాలు నేడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టకూడదు’ అనే ఆలోచన ప్రతి తెలుగు సంస్థలో రేకెత్తిస్తున్నాయి.

*** ఒకటా…రెండా…మొత్తం పది రికార్డులు…!
కూచిభొట్ల ఆనంద్ సారధ్యంలోని సిలికానాంద్ర ఇప్పటి వరకు తొమ్మిది గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. 2008లో అమెరికా గడ్డపై తొలిసారిగా ఒకే వేదిక పై దాదాపు నాలుగు వందల మంది కూచిపూడి కళాకారిణిలతో చేయించిన నృత్యంతో సిలికానాంద్ర గిన్నీస్ రికార్డుల పర్వం ప్రారంభమైంది. అక్కడితో ఆగకుండా ‘అన్నమయ్య లక్ష గళార్చన’, తదితర అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేపట్టి గడిచిన పదేళ్ళలో మొత్తం తొమ్మిది గిన్నిస్ రికార్డులను కూచిభొట్ల ఆనంద్ నెలకొల్పారు.

*** కూచిపూడి ‘సంజీవని’తో మరో రికార్డు
ఉభయ తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా నూటికి నూరు శాతం ప్రజల భాగస్వామ్యంతో కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన సంజీవని వైద్యశాల ఆనంద్ సాధించిన మరో రికార్డుగా రూపుదిద్దుకోబోతోంది. కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో 50కోట్ల ఖర్చుతో కూచిపూడి వంటి చిన్న గ్రామంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 200 పడకల ఆసుపత్రి తెలుగువారికే కాదు యావత్ భారత జాతికే గర్వకారణం అనటంలో సందేహం లేదు.

*** సంజీవని ఆస్పత్రి నిర్మాణంలో అన్నీ వింతలే?!
వాస్తవానికి కూచిపూడి నాట్యం రూపుదిద్దుకొన్న గ్రామంలో ‘కూచిపూడి నాట్యారామం’ నిర్మించే బాద్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూచిభొట్ల ఆనంద్ కు నాలుగేళ్ళ క్రితం అప్పగించారు. ఈ పని మీద కూచిపూడి వెళ్ళిన ఆనంద్ కు, ఆయన అనుచర బృందానికి అన్ని అడ్డంకులే ఎదురయ్యాయి. ముందుగా అక్కడి ప్రజలు ఆయనకు సహకరించడానికి ఆసక్తి చూపలేదు. అక్కడ ఉన్న కూచిపూడి నాట్యాచార్యులు కొంతమంది ఆనంద్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

** ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని…
కూచిపూడిలో తొలుత తనకు ఎదురైన ఇబ్బందులను కూచిభొట్ల ఆనంద్ తన చాకచక్యంతో అనుకూలంగా మార్చుకున్నారు. పంచె పైకి ఎగగట్టి జోలె పట్టుకున్నారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని దానగుణం ఉన్న దాదాపు ప్రతీ ఒక్కరిని కలిశారు. కూచిపూడి గ్రామ అభివృద్దికి కూచిభొట్ల ఆనంద్ చేపట్టిన నిధుల వేట పలువురిని కదిలించివేసింది. కరడుగట్టిన మీడియా అధినేతగా పేరుపొందిన రవిప్రకాష్ లో ఉన్న మరొక కోణాన్ని ఆనంద్ బయటకు తీసుకువచ్చారు. సంజీవని నిర్మాణానికి రవిప్రకాష్ సొంతగా నాలుగు కోట్ల రూపాయలు విరాళాన్ని అందించారు. మరొక పదికోట్ల విరాళాన్ని తన టీవీ9 ద్వారా ప్రజల నుండి ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఇప్పించారు. శరవేగంగా రూపుదిద్దుకుంటున్న సంజీవని నిర్మాణంలో రైతు కూలీలు, రిక్షా కార్మికులు, పదవీవిరమణ చేసిన వృద్దులు, షాపు గుమ్మస్తాలు తదితర వర్గాల వారిని సంజీవని ఆకర్షించింది. వంద రూపాయల నుండి కోట్ల వరకు విరాళాలు ఈ ఆస్పత్రి నిర్మాణానికి పెద్ద ఎత్తున తరలిరావటం పెద్ద విశేషమే కాదు, గొప్ప వింత కూడా! కూచిపూడిలో ఒక పక్క ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతూనే మరొక పక్క ఆ గ్రామాన్ని సిలికానాంద్ర కుటుంబం సుందరవనంగా తీర్చిదిద్దింది. ఆ గ్రామంలో ఆరు కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేశారు. గ్రామం అంతా ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చారు. పాఠశాలల్లో అమెరికా తరహాలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

*** ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కూచిపూడి.
సిలికానాంద్ర నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖ తెలుగు వైద్యులు ఈ ఆస్పత్రికి తమ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. అన్ని జబ్బులకు ఈ ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. తుఫాను పనుల ఒత్తిడిలో శ్రీకాకుళంలో ఉన్న చంద్రబాబు దసరా పండగ రోజున ఈ ఆస్పత్రి ప్రారంభానికి తీరిక చేసుకుని తరలివచ్చారు. ప్రభుత్వం నుండి పదికోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఈ ఆస్పత్రి నిర్వహణ కోసం మంజూరు చేశారు. కూచిభొట్ల ఆనంద్ తదితర సిలికానాంద్ర కుటుంబ సభ్యుల సేవాభావాన్ని చంద్రబాబు ప్రశంసించారు. తెలుగుజాతికే గర్వకారణమని కొనియాడారు. సిలికానాంద్ర ఆద్వర్యంలో నిరంతరాయంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆరు పదుల వయసుకు దగ్గరలో ఉన్న ఆనంద్ వందేళ్ళ పాటు ప్రజల మధ్య ఉండి మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటూ……కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రికి రూ.10కోట్లు ప్రకటించిన చంద్రబాబు

రూ.40కోట్ల వ్యయంతో కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని” వైద్యాలయాన్ని గురువారం నాడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న సిలికానాంధ్ర వంటి సంస్థలను ఆదర్శంగా తీసుకుని మరిన్ని గ్రామాల్లో ప్రవాసులు చొరవగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సిలికానాంధ్ర సంస్థ సేవలను ఆయన అభినందించారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం తరఫున రూ.10కోట్లను ఆయన ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన పట్ల సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ హర్షం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కాలిఫోర్నియా నుండి పెద్ద సంఖ్యలో సిలికానంధ్ర సభ్యులు హాజరయ్యారు.