ప్రముఖ గాయనీ వింజమూరి అనసూయాదేవి మృతి

ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్‌లో కన్ను మూశారు. ఆలిండియా రేడియో ద్వారా తెలుగు జానపద గీతాలకు అనసూయా దేవి ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాలు రాయడంలో, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయా దేవిది అందెవేసిన చేయి. ఈమెకు హార్మోనియం వాయించడంలోనూ అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. అనసూయా దేవి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ, డాక్టరేట్‌ కూడా అందుకున్నారు. 1920 మే 12న కాకినాడలో జన్మించారు. అనసూయా దేవికి ఐదుగురు సంతానం. ఈమె ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు. ఆమె మృతి పట్ల సిలికానాంధ్ర సంతాపం వ్యక్తపరిచింది.

టాంటెక్స్ సాహిత్య సదస్సులో “తెలుగుతో నా పోరాటం”పై చర్చ

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 140వ సాహిత్య సదస్సును ఆదివారం, మార్చి 17న డాలస్ లో సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీ కృష్ణారెడ్డి కోడూరు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 140 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ వేమూరి వెంకటేశ్వరరావుగారు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని సాహిత్య ,సింధూ దేశభక్తి గేయంతో మొదలై ,డాక్టర్ నరసింహారెడ్డి గారి మన తెలుగు సిరిసంపదలు ధారావాహిక కార్యక్రమం తో పాటుగా లెనిన్ గారు ప్రముఖ సాహితీ వేత్త డా.తుమ్మలపల్లి వాణికుమారి గారి రచనలు ఊరు కొత్తబడింది,సాహితీ సౌజన్యం,ప్రాచీన కావ్యాలలో సాంస్కృతిక మూలాల పరిచయం,శ్రీ గారు రాఘవయ్య తప్పిపోయాడు అన్న అంశం మీద మాట్లాడిన తర్వాత ముఖ్య అతిధి డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావుగారు తెలుగుతో నా పోరాటం కథ అనే అంశం మీద మాట్లాడారు. ప్రొఫెసర్ వేమూరి గారు సైన్సు ని తెలుగులో, తెలుగును ఆధునిక అవసరాలకి సరిపోయే విధంగా తేలిక పరిస్తే బాగుంటుందని నమ్మి, జనరంజక శైలిలో రాయాలనే కుతూహలంతో తను రాసే రాతలలో మానవీయ విలువలు ప్రతిబింబించవు. హృదయానికి హత్తుకునే సంఘటనలు లేకపోవడమే కాదు కళ్ళని చెమ్మగిల్లించే కథనాలు అసలే ఉండవు కాని, సైన్సులో తనకి కావాల్సిన పదజాలాన్ని ఎలా సేకరించారో వివరించడమే కాకుండా ఆ పదజాలంతో వేమూరి నిఘంటువుకి ఎలా రూపకల్పన చేసారో కూడా వివరించారు. వేమూరి గారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తో పాటు డాక్టర్ అబ్దుల్ కలాం గారితో కలిసి DRDL లో పనిచేసిన అనుభవంతో పాటు తను ఎన్నో విద్యా సంస్థలలో విశ్వవిద్యాలయాలలో పని చేసి లారెన్స్ లివర్మోర్ నేషనల్ లాబొరేటరీ సంస్థలో 2012 లో పదవీ విరమణ చేసారు. ‘జీవరహశ్యం’, ‘రసగంధాయ రసాయనం’, ‘నిత్య జీవితంలో రసాయనశాస్త్రం’, అమెరికా అనుభవాలు’, ‘విశ్వస్వరూపం’, ‘ధర్మసంస్థాపనార్థం’, ‘రామానుజన్ నుండి ఇటూ, అటూ’, ‘ఫెర్మా చివరి సిద్దాంతం’, ‘చుక్కల్లో చంద్రుడు: సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ జీవిత చరిత్ర’, ’ ‘గుళిక రసాయనం (క్వాంటం కెమిస్ట్రీ ) ‘ , ఇలా ఎన్నో పుస్తకాలని రచించడమే కాకుండా పబ్లిక్ సర్వీస్ అవార్డ్, వంశీ పురస్కారం: త్రిపురనేని గోపీచంద్ అవార్డ్, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి జీవిత సాఫల్య పురస్కారం, 11 వ రాధికా సాహితీ అవార్డులను పొందారు. మూడు గంటలు గడిచిన తర్వాత కూడా అప్పుడే కార్యక్రమం ముగిసిందా అనిపిస్తూ, ఆహుతుల కరతాళ ధ్వనులతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. సభికుల హర్షద్వానాల మధ్య ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు శ్రీ చినసత్యం వీర్నపు , ఉత్తరాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, శ్రీకాంత్ జొన్నల, ఇతర కార్యవర్గ సభ్యులు మరియు పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి , పవన్ నెల్లుట్ల , సాహిత్య వేదిక కమిటి సభ్యులు స్వర్ణ అట్లూరి, శ్రీ బసాబత్తిన ,డాక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. సాహిత్య వేదిక కమిటీ సభ్యులు ,ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు,పాలక మండలి సభ్యులు డాక్టర్ వేమూరి వెంకటేశ్వర రావుగారిని ,పుష్పగుచ్చాలు , జ్ఞాపిక , దుశ్శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

టాకో ఆధ్వర్యంలో ఉత్సాహంగా అక్షరమాల కార్యక్రమం


ముందు తరాలు కూడా ఉత్సాహంగా తెలుగు నేర్చుకోవాలనే ఉద్దేశంతో సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం(టాకో) ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే అక్షరమాల కార్యక్రమాన్ని ఈ ఏడాది ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు పొట్లూరి ఫణిభూషణ్, సాహిత్య కమిటీ చైర్మన్ మావులేటి కాళీప్రసాద్‌ల సంయుక్త నేతృత్వంలో శని,ఆదివారాల్లో స్థానిక భారతీయ హిందూ ఆలయం, హయ్యత్స్ పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. వ్రాత, కథలు, కవితలు, వక్తృత్వం, ఏకపాత్రాభినయం, తెలుగు స్పెల్లింగ్ బీ, శాస్త్రీయ, లలిత సంగీత పోటీలు నిర్వహించారు. పోటీలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల తెలుగు బడి సర్టిఫికెట్స్ అందించారు. విజేతలకు మే 11న జరిగే టాకో ఉగాది వేడుకల్లో బహుమతి ప్రదానం చేయనున్నారు. అనిత ఈడుపుగంటి, సుష్మ వడ్డే, టాకో కార్యనిర్వాహక సంఘం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ జగన్ చలసాని, ట్రస్టీ, దాతలు, వాలంటీర్లు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.


ఘనంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం


ఆమెరికాలోని కాలిఫొర్నియా రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటయి భారతీయ కళలు మరియు భాషలలో మాస్టర్స్, డిప్లొమ మరియు సర్టిఫికెట్ స్థాయి కోర్సులను అందిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించబడింది. తొలి బ్యాచ్ లో చేరి కోర్సు పూర్తి చేసిన ౩1 మంది విద్యార్ధులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మరియు విశ్వ విద్యాలయ పాలకవర్గ చైర్మన్ శ్రీ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందించడం జరిగింది. కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్్లో జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలో నిర్వహంచిన శోభాయాత్ర చూపరులను ఎంతో ఆకట్టుకొన్నది. విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా పాలక వర్గ సభ్యులు అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, చైర్మన్ డా. హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా. పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు కొండుభట్ల, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ దిలీప్ కొండిపర్తి, ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణులు ప్రసాద్ కైపా మరియు పట్టభద్రులు కాబోతున్న విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తులతో కవాతుగా వేదిక వద్దకు వచ్చారు. 2001వ సంవత్సరంలో సిలికానాంధ్ర ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ రాబోయే రోజులలో విశ్వవిద్యాలయం లక్ష్యం, ప్రణాళిక, కార్యకలాపాలను వివరిస్తూ స్పూర్తిదాయకమయిన స్వాగతోపన్యాసం చేసారు అధ్యక్షులు శ్రీ ఆనంద్ కూచిభొట్ల. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ త్రైమాసిక పత్రిక ‘శాస్త్ర’ ను పాలక మండలి సభ్యులు మరియు అకాడమిక్ అడ్వైజరి కమిటి చైర్మన్ డా. పప్పు వేణుగోపాలరావ్ ఆవిష్కరించారు. శనివారం జరిగిన స్నాతకోత్సవ సంబరాల్లో విశ్వవిద్యాలయ విద్యార్ధులు ప్రదర్శనలిచ్చారు , ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కర్ణాటక సంగీత ఆచార్యులు డా. శ్రీరాం పరశురాం నిర్వహించిన హిందుస్తాని-కర్ణాటక సంగీత జుగల్‌బంది కచేరీకి ప్రేక్షకులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన అధ్యాపక బృందం డా. శ్రీరాం పరశురాం, డా.మాలా స్వామి, డా.రమాదేవి, డా. సుమిత్ర వేలూరి, డా.యశోద ఠాకూర్, డా.అనుపమ కైలాష్ తదితరులను విశ్వవిద్యాలయ పాలకవర్గం ప్రత్యేకంగా సన్మానించింది.


సిలికానాంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో సిలికానాంద్ర ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంద్ర (యు ఎస్ ఎ ) మొదటి స్నాతకోత్సవాన్ని జనవరి 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. పూర్తీ వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించవచ్చు.

టాగ్స్ రచనల పోటీ విజేతలు వీరే

2019 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విదేశాలలో ఉన్న తెలుగు వారికే పరిమితమైన ఈ పోటీలో అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ కూడా పాల్గొనడం హర్షణీయం. టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవ లో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది (http://www.koumudi.net) , సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org ), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె” http://sirimalle.com , మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. బహుమతి పొందిన రచనలు, మరియూ ప్రచురణార్హమైన ఇతర రచనలు టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక లోనూ ప్రచురించబడతాయి.

ప్రధాన విభాగం:
“ఉత్తమ కథానిక విభాగం విజేతలు”
1.సీతారామాంజనేయులు – సత్యం మందపాటి (టెక్సాస్, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.మిధిల – మానస చమర్తి (మసాచుసెట్స్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.ప్రేమించిచూడు – ఆర్. శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా) : ($28, ప్రశంసా పత్రం)

కన్సొలేషన్ బహుమతులు గెలిచుకున్నవారు:
1.దైవం అంటే విగ్రహం కాదు నిగ్రహం – రాజశేఖర్ పరుచూరి (కెంటకీ, అమెరికా)
2.సంక్రాంతి సంబరం – ఒక మధుర జ్ఞాపకం – కల్యాణి జీ యెస్ యెస్ (రాక్లిన్, కాలిఫోర్నియా, అమెరికా)

ఉత్తమ కవిత విభాగం విజేతలు:
1.ఆఫ్రికా..ఆఫ్రికా – సీతారామరాజు రాపోలు (దక్షిణాఫ్రికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.ఏమి వింతయో : ఉత్పల మాలలు – మల్లేశ్వరరావు పోలిమేర (టెక్సస్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.ముల్లు – మానస చామర్తి (మసాచుసెట్స్, అమెరికా) : ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

కన్సొలేషన్ బహుమతులు గెలిచుకున్నవారు:
1.మాతృదేవోభవ – గంగావర ప్రసాద్ వరకూర్ (డాన్ వెల్లి, కాలిఫొర్నీయా, అమెరికా)
2.వెన్నెల – రాధిక నోరి (ఫ్లోరిడా, అమెరికా)
================================================

“మొట్టమొదటి రచనా విభాగం”
“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
1.అద్దం – రవికాంత్ పొన్నాపల్లి (టెక్సస్, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.మేరేజస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ – సూర్య అల్లంరాజు (మెరీలాండ్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
3.చిన్ననాటి జ్ఞాపకాలు – రాధ అనుపూరు (ఆస్ట్రేలియా) : ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
1.వట వృక్షం – ఉమాదేవి అద్దేపల్లి (శాన్ హోసే , కాలిఫోర్నియా, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
2.అమ్మ – సూర్య అల్లంరాజు (మెరీలాండ్, అమెరికా) : ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” నిర్వహణకు సహాయ సహకారలు అందజేసిన గ్రీట్ వే సంస్థకు టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం సంవత్సరం పొడవునా రచనలు స్వీకరించడం జరుగుతుంది. భారత్ తో సహా విదేశాలలో నివసిస్థున్న రచయితలు ఎవరైనా వారి వారి కధ, కధానిక, కవిత, వ్యాసాలు, మరియూ పుస్తక పరిచయం వంటి రచనలు మా ఈమెయిలు telugusac@yahoo.com కు పంపవచ్చును. ధన్యవాదాలు.

భవదీయులు,
శాక్రమెంటోతెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం:
అనిల్మండవ (చైర్మన్),
మల్లిక్సజ్జనగాండ్ల (వైస్ చైర్మన్),
నాగ్దొండపాటి (అధ్యక్షులు),
దుర్గచింతల (కార్యదర్శి),
మోహన్కాట్రగడ్డ (కోశాధికారి),
రాఘవచివుకుల (సమాచార అధికారి)
సత్యవీర్సురభి (సలహామండలి సభ్యుడు)
వెంకట్నాగం (ట్రస్టీ)
వెంకటేష్రాచపూడి (కార్యకర్త)
ఈమెయిలు: telugusac@yahoo.com

రేపు హైదరాబాద్ లో తానా సాహిత్య సమ్మేళనం

TANA అమెరికా ఆధ్వర్యంలో ” మూడు తరాల సాహిత్య సమ్మేళనం ” NTR భవనంలో 30-12-2018 ఉదయం 10 గంటలకు జరుగనుంది.. ఈ కార్యక్రమంలో మూడుతరాల సాహిత్య కారులు పాల్గొంటున్నారు.. ప్రముఖులు రాసిన వివిధ ప్రక్రియల 10పుస్తకావిష్కరణలు జగనున్నాయి.. 15 సాహితీ సంస్థల అధ్యక్షులు – ప్రధానకార్యదర్శులు.. 15 మంది తెలుగు అధ్యాపకులు మరియు 25 మంది కవులు పాల్గొంటున్నారు.. డా.. తిరునగరి (భారత భాషాభూషణ్ ) మూడుతరాల సాహిత్యంలో ”పద్యం – శతకం” ఎల్.బి శ్రీరామ్.. మూడుతరాల సాహిత్యంలో ”సినిమా సాహిత్యం” డా.. పెద్దింటి అశోక్ కుమార్ మూడుతరాల సాహిత్యంలో ”తెలుగు కథ ” డా..శరతజ్యోత్స్నారాణిమూడుతరాల సాహిత్యంలో ”రచయిత్రులు – కవయిత్రులు” బోలుగద్దె అనిల్ కుమార్ మూడుతరాల కవిత్వంలో అంతర్గత సూత్రం.

డా.హనిమిరెడ్డి ఔదార్యం అందరికి ఆదర్శం-మంత్రి ఉమా


విద్యార్ధుల్లో సైన్స్ పట్ల అవగాహన పొందడం కోసం ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ విభాగాన్ని మైలవరంలో గురువారం నాడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. దీని ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి రూ.75 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలుకు 60కోట్ల రూపాయలకు పైగా విరాళం అందించిన డా. హనిమిరెడ్డి ఔదార్యం గొప్పదని ప్రశంసించారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు ముందుకు రావాలని మంత్రి ఉమా కోరారు. మైలవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ఖర్చుతో వివిధ సంస్థలను ఏర్పాటు చేస్తున్న డా.హనిమిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో సైన్స్ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న అగస్త్య ఫౌండేషన్ మైలవరం ప్రాంతంలో విద్యార్ధుల కోసం శాఖను ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ రాంజీ రాఘవ మాట్లాడుతూ భారతదేశంలో పందొమ్మిది రాష్ట్రాల్లో 200 మొబైల్ వాహనాల ద్వారా అగస్త్య ఫౌండేషన్ విద్యార్ధులకు శాస్త్రీయ పరిశోధనల పైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 175 ఎకరాల స్థలంలో అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో ఆధునిక పరిశోధనశాలలను ఏర్పాటు చేసిన ఉపాద్యాయులు, విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ తాము సంపాదించిన దానిలో పేద విద్యార్ధులకు సహాయం చేయడం కోసం వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఎక్కువగా విరాళాలు ఇస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని హైస్కూల్ స్థాయి నుండి విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జానకిరాం, డా.హనిమిరెడ్డి సతీమణి విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల స్థానిక ప్రముఖుడు గోగులమూడి సత్యనారాయణరెడ్డి, ఎమ్మార్వో పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.అర్ధ శతాబ్దిలో అమెరికా తెలుగు కథకి రచనల ఆహ్వానం

50 ఏళ్ల ఉత్తర అమెరికా కథా సాహిత్యాన్ని ‘అర్ధ శతాబ్దిలో అమెరికా తెలుగు కథ’ పేరిట కథా సంకలనంగా కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించనుంది. అందుకు రచన, సేకరణల్ని ఆహ్వానిస్తోంది. రచయితలు, పాఠకులు తాము రాసిన లేదా తమకు నచ్చిన రెండు కథల్ని మాత్రమే పంపాలి. డా.వంగూరి చిట్టెన్ రాజు (వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా హ్యూస్టన్, టెక్సస్), డా. సి.మృణాళిని(హైదరాబాద్) సంపాదకులుగా వ్యవహరించనున్నారు. కథకుడి నివాసం, కథ ఇతివృత్తాల ఆధారంగా పరిశీలనకు వచ్చిన ఏ కథ అయినా అమెరికా కథా, కాదా అనే అంశంపై సంపాదకులదే తుది నిర్ణయం. కథా సంకలనంలో కథల సేకరణ, ఎంపికల బాధ్యత సంపాదకులదే. ఏ ప్రచురణయినా 1964-2014 మధ్య కాలానికి సంబంధించినదై ఉండాలి. ప్రతి కథా ప్రచురించబడిన పత్రిక పేరు, సంవత్సరం, నెల, తేదీ వివరాలు తప్పనిసరి. కథా ప్రచురణ వివరాలు, అనుమతి పత్రంతోపాటు ప్రతీ రచయితా తప్పనిసరిగా తమ పాస్పోర్ట్ సైజ్ ఫొటో, పది వాక్యాల లోపు జీవిత విశేషాలు, ఫోన్నంబర్, ఇ-మెయిల్ ఐ.డి పంపాలి.ఆఖరు తేదీ ఈనెల 31. పంపించాల్సిన చిరునామా vangurifoundation@gmail.com, ఫోన్ నంబర్:8325949054.

గుంటూరులో తెలుగు పద్యంపై నాట్స్ సదస్సు


ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో గుంటూరులో “ప్రతి నోట తెలుగు పద్యం” పేరిట సాహితీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు, యువతీయువకులు, రచయితలు పాల్గొన్నారు. తెలుగు భాష వ్యాప్తికి, తెలుగు పద్యం పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నాట్స్ ఆధ్వర్యంలో చేపడతామని చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో నాట్స్ ప్రతినిధులు డా.కొర్రపాటి మధు, మన్నవ మోహనకృష్ణ, ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.టాంటెక్స్ ఆధ్వర్యంలో అష్టావధానం


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 137వ సాహిత్య సదస్సును ఆదివారం నాడు డల్లాస్‌లో వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం లాస్య కండేపి , సహస్ర కాసం , సాన్విక కాసం, మనోజ్ఞ బొమ్మదేవర, ప్రితిక పలనిసేల్వం, దీప్తి గాలి, దర్శిత రాకం, శ్రీఆద్య ఊర, శ్రీనిధి తటవర్తి ప్రార్థనా గీతం ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాల సింహావలోకనం జరిగింది. అవధాన ప్రారంభసూచకంగా మంజు తెలిదేవర శిష్య బృందం అనిక మల్లెల, అరుణ గోపాలన్, ద్రువ్ చిట్టిప్రోలు, సుమిత్ చిట్టిమల్ల, భవాని, ఈషాని గీతాన్ని ఆలపించారు. సాహితి వేముల, సింధూర వేముల మరియు సమన్విత మాడ గరుడ గమన గీతాన్ని ఆలపించారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసులు డా.పుదూర్ జగదీశ్వరన్ అవధానిగా, జువ్వాడి రమణ సంధాతగా, డా. తోటకూర ప్రసాద్ వ్యస్తాక్షరి, కాజ సురేష్ నిషిధ్ధాక్షరి, భాస్కర్ రాయవరం సమస్య, డా. సుధ కలవగుంట న్యస్తాక్షరి, డా. ఊరిమిండి నరసింహారెడ్డి దత్తపది, వేముల లెనిన్ వర్ణన, వీర్నపు చినసత్యం ఘంటాగణనం, దయాకర్ మాడ అప్రస్తుత ప్రసంగం తదితర అంశాలకు పృచ్ఛకులుగా వ్యవహరించారు. లేఖకులుగా బాసబత్తిన, రమణ దొడ్ల, కృష్ణ కోడూరి బాధ్యతలు నిర్వహించారు. ‘వాజియు నెక్కెను పఠాని ప్రాకట ఫణితిన్’ అన్న సమస్యని శివాజీకి వర్తింపచేస్తూ అద్భుతంగా పూరించారు, పెరుగు, అరుగు, మరుగు, తరుగు పదాలను ఉపయోగిస్తూ మానవ సమతుల్య జీవనానికి సూత్రాలను దత్తపదిలో పూరించారు. వరూధినీ సౌందర్యాన్ని నిషిద్దాక్షరిలో లాఘవంగా పూరించారు. 20 అక్షరాల ఉత్పలమాల పాదాన్ని వ్యస్తాక్షరిలో చేధించారు. ఆద్యంతమూ అప్రస్తుత ప్రసంగం సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. అవధాని కూడా చిలిపి ప్రశ్నలకు గడుసు సమాధానాలు ఇచ్చారు. ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం, ఉత్తరాధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉపాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, కోశాధికారి పాలేటి లక్ష్మి, ఇతర కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కమిటి సభ్యులు డా.పుదూర్ జగదీశ్వరన్‌ను జ్ఞాపిక, దుశ్శాలువాతో సన్మానించి “అవధాన విరించి” బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బు జొన్నలగడ్డ, ఆనంద్ మూర్తి కూచిభోట్ల, జగదీశ్వర్ రావు, పులిగండ్ల విశ్వనాధ్, డా. ప్రసాద్ తోటకూర, సీ.ఆర్.రావు, రామకృష్ణ రోడ్ద తదితరులు పాల్గొన్నారు.శ్రీశ్రీ సాహిత్యంలో హాస్యంపై టాంటెక్స్ సదస్సు


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించు “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, నవంబరు 18 న సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మంజుల తెలిదేవర శిష్య బృందం వృంద, సంజన , హమ్సిక ,అంటోనియో ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. సింధూర, సాహితి వేముల అన్నమాచార్య కృతి ఆలపించారు. డా. ఊరిమిండి నరసింహ రెడ్డి – మన తెలుగు సిరి సంపదలు శీర్షికన, నానుడి , జాతీయాలు , పొడువు కథలు గురించి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ పాట పూర్వాపరాలు వివరించారు. దానిలో ఉపయోగించిన చరిత్ర, అల్లూరికి కలిగించిన ప్రేరణ వివరించారు. లెనిన్ వేముల తెలుగు శాసనాల చరిత్రని, పరిణామక్రమాన్ని వివరించారు.డా. పుదూర్ జగదీశ్వరన్ఆ ముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగయుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి రాగయుక్తంగా ఎంకి పాటలు పాడి అలరించారు. ముఖ్య అతిధి మల్లవరపు అనంత్ ని చంద్రహాస్ సభకు పరిచయం చేయగా టాంటెక్స్ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం పుష్పగుచ్చంతో సత్కరించారు. మల్లవరపు అనంత్ మాట్లాడుతూ “శ్రీ శ్రీ ప్రముఖంగా అభ్యుదయ కవి, విప్లవ కవి…. ఆయన రచనలలోనుండి హాస్యం వెతకడం సాహసమే అవుతుంది” అన్నారు. శ్రీ శ్రీ వ్రాసిన సిప్రాలి (సిరి సిరి మువ్వలు, ప్రాసక్రీడలు, లిమఋక్కులు ) పుస్తకాన్ని కూలంకషంగా పరిశీలించి దానిలోని హాస్యాన్ని సభికులకు పంచి సభలో నవ్వులు పూయించారు. అనంతరం అనంత్‌ను టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కోశాధికారి పాలేటి లక్ష్మి పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంత్ మల్లవరపు తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిథ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ అనంత్ మల్లవరపు సాహిత్య సేవలను ఎంతో కొనియాడారు మరియు తను నిర్వహించిన పూర్వ సాహిత్య సదస్సులను గుర్తుచేసుకున్నారు . సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.


వంగూరికి ఆస్ట్రేలియా ప్రవాసుల సత్కారం


ప్రముఖ హాస్య రచయిత వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా కొన్ని దశాబ్దాలుగా అందిస్తున్న తెలుగు సాహిత్య సేవలని గుర్తిస్తూ అభినందన పూర్వకంగా ఆస్ట్రేలియా లోని మూడు నగరాల తెలుగు సంఘాలు గత వారం ఆయనని తమ దసరా దీపావళి కార్యక్రమాలకి ఆత్మీయ అతిధిగా ఆహ్వానించి సముచిత రీతిలో సత్కరించారు. నవంబర్ 3, 2018 నాడు శ్రేణి కట్టా నాయకకత్వంలో ఆస్ట్రేలియా తెలుగు సంఘం మెల్ బోర్న్ లో జరిగిన ‘జనరంజని” భారీ సాంస్కృతిక కార్యక్రమంలో సుమారు 1000 మంది ఆహుతుల సమక్షంలో వంగూరి చిట్టెన్ రాజు గారి సేవలని ప్రశంసిస్తూ చిరు సత్కారం జరిగింది నవంబర్ 9, 2018 నాడు కృష్ణ నడింపల్లి నాయకత్వంలో ఆస్ట్రేలియా రాజధాని కేన్ బెర్రా తెల్గుగ్ సంఘం వారు స్థానిక ఇండియన్ కమిషన్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వంగూరి గారి కి ఆత్మీయ సత్కారం జరిగింది. మర్నాడు నవంబర్ 10. 2019 నాడు సతీష్ వరదరరాజు, సారధి మోటుమర్రి తదితరుల సారధ్యంలో జరిగిన దసరా -దీపావళి భారీ కార్యకమంలో వంగూరి చిట్టెన్ రాజు హాస్య రచనా చతురతనీ, సాహిత్య, సమాజ సేవలనీ గుర్తిస్తూ ఆత్మీయ సత్కారం జరిగింది. ఆయా సందర్భాలలో మాట్లాదుతూ ఆస్ట్రేలియా లో తెలుగు వారి సామాజిక వాతావారణం ఆహ్లాదంగా ఉంది అనీ ప్రతీ నగరాలలోనూ నెల బెలా తెలుగు వెన్నెల తరహాలో నెలవారీ సాహిత్య సమావేశాలు, మెల్ బోర్న్ లో విజవంతంగా జరిగిన 6వ ప్రపంచ తెల్గు సాహితీ సదస్సు స్పూర్తిగా ఆస్ట్రేలియా తెలుగు సాహితీ సదస్సులు నిర్వహించుకోవాలనీ, జీతం కోసం ఆంగ్లభాష. జీవితం కోసం తెలుగు బాష అనే సిద్దాంతాన్ని విదేశాలలో ఉన్న తెలుగు వారు సరియిన స్ఫూర్తిలో ఆచరిస్తూ తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో సాధిస్తున్న ప్రగతి ప్రశంసనీయం అనీ వంగూరి చిట్టెన్ రాజు స్పందించారు. తదుపరి 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు దుబాయ్ నగరంలో వచ్చే ఏడు జరుగుతుంది అని వంగూరి చిట్టెన్ రాజు ఈ సందర్భంలో ప్రకటించారు.

ప్రముఖ విద్యావేత్త, దానశీలి ప్రొ.మూల్పూరి వెంకట్రావు జీవితం అందరికి ఆదర్శం.


విద్యావేత్తగా, దానశీలిగా, నిరుపేదలకు సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు సంతరించుకున్న ఆదర్శ వ్యక్తి డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. సామాన్య కుటుంబం నుంచి అగ్రరాజ్యం అమెరికాలో అత్యున్నతమైన ఫ్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వెంకట్రావు నిరాడంబర, నిస్వార్థ జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తాను సంపాదించిన దాంట్లో గణనీయమైన శాతం డాక్టర్ వెంకట్రావు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ ఉండటం విశేషం. ఆర్భాటాలకు, ప్రచారనికి దూరంగా ఉండే ప్రొఫెసర్ వెంకట్రావు జీవనశైలి అందరికీ, ముఖ్యంగా నేటి యువతరానికి ఆదర్శప్రాయంగా ఉంటుందనటంలో సందేహం లేదు.

*** తానా కన్వీనర్‌గా కీలక బాధ్యతలు
వాషింగ్టన్ డీసీలో జులై మొదటి వారంలో తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తానా అధ్యక్షుడు వేమన సతీష్ సారథ్యంలోని యువ కార్యవర్గం ఈ మహాసభలను ఘనంగా నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాసభలకు ఒక ప్రముఖ వ్యక్తి, అనుభవం ఉన్న కార్యశీలిని కన్వీనర్‌గా ఉండాలని తానా యువ కార్యవర్గం భావించింది. అన్ని విధాలుగా అనుభవం గడించిన, వివాదాలకు దూరంగా ఉండే ప్రొఫెసర్ మూల్పూరి వెంకట్రావును తానా మహాసభల సమన్వయకర్తగా, యువ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మూల్పూరి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈసారి జరిగే తానా మహాసభలు చరిత్రలో మరచిపోలేని విధంగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు.

*** జీవన ప్రస్థానం ఇది
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రఖ్యాతి చెందిన జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో గత 32 ఏళ్ళు నుండి ప్రొఫెసరుగా పనిచేస్తున్న డాక్టర్.మూల్పూరి వెంకట్రావు ప్రతి ఏడాది తన సంపాదనలో పెద్ద మొత్తం (రూ.30లక్షల రూపాయలకుపైగా) సేవా కార్యక్రమాలకు విరాళాలుగా అందజేస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులకు బోధనతో పాటు డాక్టర్.వెంకట్రావు వర్జీనియా పరిసర ప్రాంతల్లో ఉన్న ప్రవాసాంధ్ర కుటుంబాలకు చెందిన మిడిల్ స్కూలు (6,7,8 తరగతులు), హైస్కూలు (9,10,11,12 తరగతులు) విద్యార్థులకు తన తీరిక సమయంలో పాఠాలు బోధిస్తుంటారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు రావాలంటే ప్రత్యేకమైన తర్ఫీదు అవసరం. ఈ స్కూలులో ప్రవేశం కోసం పొందే శిక్షణలకు సైతం అత్యధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది గమనించిన వెంకట్రావు గత 10 సంవత్సరాల నుండి విద్యార్ధులకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఆయన తర్ఫీదు ఇచ్చిన వారిలో 300 మంది థామస్ జఫర్సన్ హైస్కూల్లో సీటు సంపాదించారు. వెంకట్రావు స్ధాపించిన క్యూరీ లెర్నింగ్ సంస్ధ అమెరికాలోని ఇతర నగరాలకు కూడా విస్తరిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు పన్నెండు నగరాల్లో క్యూరీ లెర్నింగ్ శాఖలు ఏర్పాటు చేసినట్లు ప్రొఫెసర్ మూల్పురి TNIకు తెలిపారు.

*** బాల్యం-విద్యాభ్యాసం
కృష్ణా జిల్లా ఘంటసాలలో మూల్పూరి చెన్నారావు, లక్ష్మితులసమ్మ దంపతులకు వెంకట్రావు జన్మించారు. తండ్రి చెన్నారావు స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు, వెంకట్రావు 10వ తరగతి వరకు స్థానికంగా, ఇంటర్మీడియట్ విజయవాడ లయోలా కళాశాల (1970-72)లో పూర్తి చేసారు. అనంతరం కాకినాడ జె.ఎన్.టీ.యూలో బీటెక్ (ఈసీఈ) విద్యనభ్యసించారు. తదుపరి ప్రతిష్టాత్మక ముంబై ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1979-81 మధ్య కాలంలో విజయవాడ సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. 1981వ సంవత్సరంలో అమెరికా వెళ్ళి ఆరెగాన్/మిషిగన్ విశ్వవిద్యాలయాల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ విభాగంలో పీ.హెచ్.డీ చేశారు. 2005లో తానా వారు అత్యుత్తమ ఇంజనీర్ అవార్డును ఇచ్చి సత్కరించారు. జార్జి మేసన్ యూనివర్సిటీ నుండి 2002లో ‘ఔట్ స్టాండింగ్ రీసర్చ్’ అవార్డుతో పాటు పలు జాతీయ, ప్రాంతీయ స్ధాయిల్లో 10కు పైగా కమ్యూనిటీ సర్వీసు అవార్డులు, అక్కినేని 89వ జన్మదిన పురస్కారాలు వెంకట్రావును వరించాయి.

*** ఆదాయంలో గణనీయ శాతం విరాళాలకు
ధామస్ జఫర్సన్ పాఠశాలలో ప్రవేశం కోసం ప్రవాసాంధ్ర విద్యార్ధులకు చెప్పే పాఠాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొదటి అయిదేళ్ల పాటు పూర్తిగా అందించిన వెంకట్రావు, ఆ తర్వాత పెరిగిన విద్యార్ధులు, అధ్యాపకుల సంఖ్య, ఇతరత్రా నిర్వహణా ఖర్చుల దృష్ట్యా వచ్చిన ఆదాయంలో గణనీయమైన శాతాన్ని విరాళాలుగా అందిస్తున్నారు. వాషింగ్టన్ లో విద్యార్ధులకు ప్రైవేట్ పాఠాలు చెపుతున్న డాక్టర్.వెంకట్రావుకు సంవత్సరానికి రూ.30లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని ఆయన సమాజ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. గిరిజన విద్యార్ధులకు ఏకల్ విద్యాలయ సంస్ధ ద్వారా నూతన పాఠశాలలను ప్రారంభించటానికి తోడ్పడ్డారు. హైదరాబాద్ లో అనాధ బాలలకోసం వేమూరి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థకు ఇప్పటి వరకు రూ.15లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీకాకుళం, చల్లపల్లి ప్రాంతాల్లో పురాతన ఆలయాల పున:నిర్మాణానికి ఇప్పటివరకు రూ.10లక్షల వరకు అందజేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా భక్తాళాపురంలో షిర్డీ సాయిబాబా మందిరాన్ని, కమ్యూనిటీ హాలును నిర్మిస్తున్నారు. దీనిలో పాటు ఘంటశాలలో ఏర్పాటు చేసిన గొర్రెపాటి ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్ధులకు ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నారు. వాషింగ్టన్ సమీపంలో నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర లోటస్ టెంపుల్ కు ఇప్పటి వరకు రూ.కోటి 25లక్షలకు పైగా విరాళాన్ని అందించారు. కనకదుర్గ ఆలయానికి ఇప్పటి వరకు రూ.25లక్షలు అందించారు.

* **అంతా మేధావులే
వెంకట్రవు తమ గ్రామానికి సమీపంలో ఉన్న రావివారిపాలేనికి చెందిన సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆమె వాషింగ్టన్ లో ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అమెరికన్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ సంస్థలో ప్రైమరీ ఎగ్జామినర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కార్తిక్ భవాని శంకర్ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన కార్నెల్ మరియు స్టాన్‌ఫోర్డ్ యునివర్శటిల్లో చదివి ప్రస్తుతం న్యూయార్కులోని మీడియా మాత్ అనే కంపెనీలో ఆపరేషన్స్ అండ్ స్ట్రేటజీ విభాగానికి డైరక్టరుగా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు కేధార్ నాథ్ ప్రముఖ యునివర్సటీ డార్ట్ మత్ కాలేజీలో బ్యాచిలర్స్ విద్యనభ్యసించి ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీల్ మాస్టర్స్ డిగ్రీని చేస్తున్నారు.

*** ఎన్.టి.ఆర్ వీరాభిమాని మరియు నిర్మాత
ప్రొఫెసర్ వెంకట్రావు చదువుతో పాటు రంగస్థల నటుడిగానూ గుర్తింపు పొందారు. ఎన్.టి.రామరావుకు వీరాభిమాని అయిన వెంకట్రావు ఆయనతో సినిమాలు తీయాలనే బలమైన కోరికతో ఉండేవారు. అది సాధ్యం కాకపోవటంతో 1994, 97 సంవత్సరాల్లో ఎన్.టి.ఆర్ కుమారుడు బాలకృష్ణ కధానాయకుడిగా ‘టాప్ హీరో’, ‘దేవుడు ‘ చిత్ర్రాలు నిర్మించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో కృష్ణా నది ఒడ్డున ఎన్.టి.ఆర్ పేరుమీదుగా మ్యూజియంను ఏర్పాటు చేయాలనేది ఆయన ఆకాంక్ష.

*** పరిశోధన రంగంలో వెంకట్రావు ప్రతిభ
* ఇప్పటి వరకు 17 మంది పీ.హెచ్.డీ విద్యార్ధులకు విజయవంతమైన పరిశోధన మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. ఈయన దిశానిర్దేశంలో ప్రస్తుతం ముగ్గురు పీ.హెచ్.డీ విద్యార్ధులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
* 140 జర్నల్ ఆర్టికల్స్ ప్రచురించారు. 100 కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ప్రచురించారు.
* అమెరికా జాతీయ సైన్స ఫౌండేషన్ నుండి అప్రతిహితంగా 28 ఏళ్లు (1987-2015)పాటు నిధులు అందుకున్నారు.
ఇన్ని చేసినప్పటికీ తనకి సంతృప్తినిచ్చేది కేవలం ఒకే ఒక విషయం అంటారు డాక్టర్.మూల్పూరి వెంకట్రావు. ఒక వైపు తన సంస్ధ క్యూరీ లెర్నింగ్ లో కిండెర్ గార్టెన్ (ఎల్.కే.జీ) నుండి ఉన్నత పాఠశాల వరకు పలువురు విద్యార్ధులు. మరో వైపు జార్జి మేసన్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, మాస్టర్స్, పీ.హెచ్.డీ విద్యార్ధులు. వీరందరికీ (ఎల్.కె.జీ నుండి పీ.హెచ్.డీ వరకు) ప్రతిరోజు వివిధ సమయాల్లో విద్యను అందించటం తనకు చాలా ఉత్తేజాన్ని, ఆనాందాన్నిస్తుందని, తద్వారా వచ్చే ఆదాయం ద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడం సంతృప్తినిస్తుందని ప్రొఫెసర్ మూల్పూరి పేర్కొనడం నేటితరం ఎందరో యువతీయువకులకు ఓ జీవితపాఠం. –కిలారు ముద్దుకృష్ణ , సీనియర్ జర్నలిస్ట్

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన తమిళనాడు కార్మిక మంత్రి


అమెరికా విచ్చేసిన తమిళనాడు కార్మికశాఖ మంత్రి ఎంసీ సంపత్ సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. సంపత్, అతని సిబ్బందికి సిలికానాంధ్ర ఘన స్వాగతం పలికింది. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ రాజు చమర్తి గత పద్దెనిమిది సంవత్సరాలుగా సిలికానాంధ్ర సాధించిన ప్రగతిని మంత్రికి వివరించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో విస్తరిస్తున్న మనబడి, కాలిఫోర్నియా రాష్ట్ర అనుమతి పొంది భారతీయ కళలను బోధిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధిని వివరించారు. అలాగే, కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం దత్తత తీసుకొని ఆ గ్రామానికి మౌళిక సదుపాయాలను కల్పించిన కృషిని, చుట్టుపక్కల 150 గ్రామాలకు వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతో సంజీవనీ వైద్యాలయ స్థాపనకు దాతలు అందించిన సహాయాన్ని, అమెరికా డాక్టర్లు, ఇతర శ్రేయోభిలాషుల సహకారాన్ని కంప్యూటర్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. అమెరికాలోనే కాకుండా, భారతదేశంలో కూడా సిలికానాంధ్ర చేస్తున్న సేవలను, సాధిస్తున్న ప్రగతిని మంత్రి సంపత్ కొనియాడుతూ, ఎలాంటి ప్రాంతీయ వివక్ష లేకుండా భారతీయ కళలను, సంస్కృతిని అమెరికా దేశంలో బోధించాలనే సదుద్దేశంతో స్థాపించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని అందుకు కృషిచేస్తున్న సిలికానాంధ్ర బృందాన్ని అభినందించారు. ఇటీవల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృతం, తెలుగు విభాగాలను ప్రారంభించారన్న విషయం తెలుసుకున్న సంపత్‌, విశ్వవిద్యాలయంలో తమిళభాషా ఫీఠాన్ని నెలకొల్పటానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తానని హామీ ఇస్తూ సిలికానాంధ్రా బృందాన్ని తమిళనాడుకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర కార్యవర్గం, బే ఏరియా తమిళ మన్రం, ఫ్రీమాంట్ ఇస్లామిక్ సెంటర్ ముస్లిం అసోషియేషన్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాల సభ్యులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం గురించిన మరిన్ని వివరాలకు www.universityofsiliconandhra.org ని చూడవచ్చని, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు.


ఘనంగా టాంటెక్స్ సాహితీ సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు నిర్వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 135 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులను టాంటెక్స్ నిర్వహించింది. భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసి, ఉత్సాహంగా పాల్గొని సభని జయప్రదం చేశారు. కార్యక్రమంలో ముందుగా చిన్నారులు వేముల సాహితి, వేముల సింధూర ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తరువాత మనబడి చిన్నారులు గురజాడ దేశభక్తి గీతం ఆలపించారు. నానుడి, జాతీయాలు, పొడువు కథలు గురించి డా. ఊరిమిండి నరసింహ రెడ్డి ప్రశ్నలు అడిగి సభికులలో ఆసక్తి రేకెత్తించారు. చంద్రహాస్ మద్దుకూరి ‘పిలిచినా బిగువటరా’ పాట పూర్వాపరాలు వివరించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ కవితా వైశిష్ట్యాన్ని సోదాహరణంగా వివరించారు. కొన్ని కవితలు చదివి వినిపిస్తూ, అమృతం కురిసిన రాత్రితో ముగించారు. రమణ జువ్వాడి శ్రీనాధుని పద్య వైభవాన్ని కొన్ని పద్యాలు చదివి వివరించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఆముక్తమాల్యదలోని కొన్ని పద్యాలను రాగ యుక్తంగా చదివి వాటి అర్ధం వివరించారు. ఉమా భారతి రాసిన ‘సరికొత్త వేకువ’, ‘నాత్యభారతీయం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. బసాబత్తిన ‘నాట్య భారతీయం’ , ‘సరి కొత్త వేకువ’ పుస్తకాలను, రచయిత్రిని సభకు పరిచయం చేశారు. ఉమాభారతి కోసూరి మాట్లాడుతూ.. ‘సాహిత్యమంటే.. ఓ పుస్తకం, వేమన పద్యాలు మాత్రమే కాదు. కళలంటే ‘తకిట తఝణులు’, రాగాలాపనలు మాత్రమే కాదు. ‘సహితస్య భావం సాహిత్యం’ అంటే అన్ని కళలు కలగలసినదే సాహిత్యం అని అర్ధం. కళలలో కవిత్వానిది అగ్రపీటం. కవిత్వం సాహిత్యంలో అంతర్భాగం అని మనకి తెలిసిందే. కవిత్వం అంటే దుఃఖార్తులకూ, శ్రమార్తులకూ, శోకార్తులకూ మానసికోల్లాసాన్ని కలిగించే దివ్య కళ అని నాట్యశాస్త్రంలో భరతుడు అంటాడు. అసలు జీవించడం నుండే సాహిత్యం పుట్టుకొస్తుంది అని కూడా అనవచ్చు. మానవ జీవనానికి గొప్ప మార్గదర్శకం మనకున్న సాహిత్య సంపదే అని, జీవన విధానాన్ని దిద్దుకునేందుకు సరిదిద్దుకునేందుకు కూడా మనకున్న గొప్ప సాహిత్య సంపద ఎంతైనా తోడ్పడుతుంది అని ఎందరో మేధావులు సూచించారు. అలాగే మనిషి మానసిక ఎదుగదల, సంక్షేమాలపై కూడా సాహిత్య, లలితకళల ప్రభావం తప్పక ఉంటుంది అని కూడా ఉండనే ఉంది. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని మొదటి తరం సాహితీ వేత్తలు ముందు తరాల కందించే విధానానికి ముగ్దురాలై అమెరికాలోని సాహితీ వేత్తలందరికీ ధన్యవాదాలు తెలుపుపుతున్నా’ అని పేర్కొన్నారు. ఉమాభారతి కోసూరిని టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు, అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి, ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి శ్రీలు మండిగ, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన టాంటెక్స్ కార్యవర్గానికి ఉమా భారతి కృతజ్ఞతలు తెలియజేశారు. టాంటెక్స్ అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం మాట్లాడుతూ ఉమా భారతి నృత్య సేవలను కొనియాడారు. తన పూర్వ ప్రదర్శనలను గుర్తు చేసుకున్నారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంజీవనికి సిఎం ద్వారా విరాళాలు అందించిన ప్రవాసులు

కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో దాదాపు రూ.50కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండు వందల పడకల మల్టీ స్పెషాలిటీ సంజీవని ఆస్పత్రికి ప్రవాసుల నుండి విరాళాలు భారీగా వస్తున్నాయి. 18వ తేదీన ఆసుపత్రి ప్రారంభించడానికి వచ్చిన చంద్రబాబు చేతుల మీదుగా పలువురు ప్రవాసులు సంజీవని ఆస్పత్రికి విరాళాలు అందజేశారు. ప్లోరిడాకు చెందిన నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ పది లక్షల రూపాయలు, డాలస్ కు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు కోనేరు శ్రీనివాస్ ఆరు లక్షల రూపాయలు సిఎం చంద్రబాబు ద్వారా విరాళాలను అందజేశారు. వీరిరువురిని ముఖ్యమంత్రి చంద్రబాబు, సిలికానాంద్ర చైర్మన్ కూచిభొట్ల చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. అమెరికాకు చెందిన ఇద్దరు చిన్నారుల వయసు పెద్దది. కూచిపూడిలో సిలికానాంద్ర కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ వైద్యశాలకు విరాళం అందించారు. అమెరికాలో తాము విక్రయించి, నృత్యాలు ప్రదర్శించి, స్నేహితుల కుటుంబ సభ్యులను ఇంటికి విందుకు పిలిచి ఆస్పత్రి నిర్మాణం గురించి వివరించి విరాళాలు సేకరించారు. ఇలా ఒక్కొక్కరు రూ.పది లక్షల చొప్పున ఆసుపత్రి నిర్మాణానికి విరాళం అందించారు. వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సన్మానించారు.

పదో రికార్డు కైవసం చేసుకున్న కూచిభొట్ల ఆనంద్-TNI ప్రత్యేకం


ఓ వ్యక్తి రూపొందించిన ఒక వ్యవస్థ అద్భుతాలను సృష్టిస్తోంది. యావత్ తెలుగు జాతి గర్వించే విధంగా కార్యకలాపాలను చేపడుతోంది. విదేశాల్లో పుట్టిన ఒక చిన్న తెలుగు సంఘం మాతృభూమిని మరచిపోకుండా సొంతగడ్డ పై చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు తెలుగువారందరికి గర్వకారణంగా ఉంటున్నాయి.

*** ఉపాధి కోసం భార్యబిడ్డలతో కలిసి అమెరికా వెళ్లి ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని 18ఏళ్ల క్రితం కూచిభొట్ల ఆనంద్ అనే ఒక చిన్న వ్యక్తి ఏర్పాటు చేసిన ‘సిలికానాంధ్ర’ అనే చిన్న సంస్థ తెలుగుజాతి గర్వించే విధంగా చేస్తున్న కార్యక్రమాలు నేడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టకూడదు’ అనే ఆలోచన ప్రతి తెలుగు సంస్థలో రేకెత్తిస్తున్నాయి.

*** ఒకటా…రెండా…మొత్తం పది రికార్డులు…!
కూచిభొట్ల ఆనంద్ సారధ్యంలోని సిలికానాంద్ర ఇప్పటి వరకు తొమ్మిది గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. 2008లో అమెరికా గడ్డపై తొలిసారిగా ఒకే వేదిక పై దాదాపు నాలుగు వందల మంది కూచిపూడి కళాకారిణిలతో చేయించిన నృత్యంతో సిలికానాంద్ర గిన్నీస్ రికార్డుల పర్వం ప్రారంభమైంది. అక్కడితో ఆగకుండా ‘అన్నమయ్య లక్ష గళార్చన’, తదితర అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేపట్టి గడిచిన పదేళ్ళలో మొత్తం తొమ్మిది గిన్నిస్ రికార్డులను కూచిభొట్ల ఆనంద్ నెలకొల్పారు.

*** కూచిపూడి ‘సంజీవని’తో మరో రికార్డు
ఉభయ తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా నూటికి నూరు శాతం ప్రజల భాగస్వామ్యంతో కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన సంజీవని వైద్యశాల ఆనంద్ సాధించిన మరో రికార్డుగా రూపుదిద్దుకోబోతోంది. కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో 50కోట్ల ఖర్చుతో కూచిపూడి వంటి చిన్న గ్రామంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 200 పడకల ఆసుపత్రి తెలుగువారికే కాదు యావత్ భారత జాతికే గర్వకారణం అనటంలో సందేహం లేదు.

*** సంజీవని ఆస్పత్రి నిర్మాణంలో అన్నీ వింతలే?!
వాస్తవానికి కూచిపూడి నాట్యం రూపుదిద్దుకొన్న గ్రామంలో ‘కూచిపూడి నాట్యారామం’ నిర్మించే బాద్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూచిభొట్ల ఆనంద్ కు నాలుగేళ్ళ క్రితం అప్పగించారు. ఈ పని మీద కూచిపూడి వెళ్ళిన ఆనంద్ కు, ఆయన అనుచర బృందానికి అన్ని అడ్డంకులే ఎదురయ్యాయి. ముందుగా అక్కడి ప్రజలు ఆయనకు సహకరించడానికి ఆసక్తి చూపలేదు. అక్కడ ఉన్న కూచిపూడి నాట్యాచార్యులు కొంతమంది ఆనంద్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

** ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని…
కూచిపూడిలో తొలుత తనకు ఎదురైన ఇబ్బందులను కూచిభొట్ల ఆనంద్ తన చాకచక్యంతో అనుకూలంగా మార్చుకున్నారు. పంచె పైకి ఎగగట్టి జోలె పట్టుకున్నారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని దానగుణం ఉన్న దాదాపు ప్రతీ ఒక్కరిని కలిశారు. కూచిపూడి గ్రామ అభివృద్దికి కూచిభొట్ల ఆనంద్ చేపట్టిన నిధుల వేట పలువురిని కదిలించివేసింది. కరడుగట్టిన మీడియా అధినేతగా పేరుపొందిన రవిప్రకాష్ లో ఉన్న మరొక కోణాన్ని ఆనంద్ బయటకు తీసుకువచ్చారు. సంజీవని నిర్మాణానికి రవిప్రకాష్ సొంతగా నాలుగు కోట్ల రూపాయలు విరాళాన్ని అందించారు. మరొక పదికోట్ల విరాళాన్ని తన టీవీ9 ద్వారా ప్రజల నుండి ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఇప్పించారు. శరవేగంగా రూపుదిద్దుకుంటున్న సంజీవని నిర్మాణంలో రైతు కూలీలు, రిక్షా కార్మికులు, పదవీవిరమణ చేసిన వృద్దులు, షాపు గుమ్మస్తాలు తదితర వర్గాల వారిని సంజీవని ఆకర్షించింది. వంద రూపాయల నుండి కోట్ల వరకు విరాళాలు ఈ ఆస్పత్రి నిర్మాణానికి పెద్ద ఎత్తున తరలిరావటం పెద్ద విశేషమే కాదు, గొప్ప వింత కూడా! కూచిపూడిలో ఒక పక్క ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతూనే మరొక పక్క ఆ గ్రామాన్ని సిలికానాంద్ర కుటుంబం సుందరవనంగా తీర్చిదిద్దింది. ఆ గ్రామంలో ఆరు కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేశారు. గ్రామం అంతా ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చారు. పాఠశాలల్లో అమెరికా తరహాలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

*** ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కూచిపూడి.
సిలికానాంద్ర నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖ తెలుగు వైద్యులు ఈ ఆస్పత్రికి తమ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. అన్ని జబ్బులకు ఈ ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. తుఫాను పనుల ఒత్తిడిలో శ్రీకాకుళంలో ఉన్న చంద్రబాబు దసరా పండగ రోజున ఈ ఆస్పత్రి ప్రారంభానికి తీరిక చేసుకుని తరలివచ్చారు. ప్రభుత్వం నుండి పదికోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఈ ఆస్పత్రి నిర్వహణ కోసం మంజూరు చేశారు. కూచిభొట్ల ఆనంద్ తదితర సిలికానాంద్ర కుటుంబ సభ్యుల సేవాభావాన్ని చంద్రబాబు ప్రశంసించారు. తెలుగుజాతికే గర్వకారణమని కొనియాడారు. సిలికానాంద్ర ఆద్వర్యంలో నిరంతరాయంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆరు పదుల వయసుకు దగ్గరలో ఉన్న ఆనంద్ వందేళ్ళ పాటు ప్రజల మధ్య ఉండి మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటూ……కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన “రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయాన్ని” ప్రారంభించారు. చంద్రబాబు ప్రసంగిస్తూ రానున్న కాలంలో కూచిపూడి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి బృహత్తర వైద్యాలయాన్ని ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసినందుకు సిలికానాంధ్ర సంస్థను దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్,మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టీవీ9 సీఈఓ రవిప్రకాష్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, సభ్యులు వేట శరత్, దీనబాబు కొండుభట్ల, అనూష కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు చేతుల మీదుగా సిలికానాంధ్ర “సంజీవని” ప్రారంభం

కూచిపూడి గ్రామంలో నిర్మించబడుతున్న “రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం” ది.18-10-2018 న అనగా గురువారం ఉదయం 11:00 గం।।లకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. కావున మీరందరూ ఈ కార్యక్రమానికి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఆశీర్వదించ వలసిందిగా కోరుతూ ఇదే మా ఆహ్వానం.

ఇట్లు
సిలికానాంధ్ర కుటుంబం

దసరాకి ప్రారంభం కానున్న సిలికానాంధ్ర సంజీవని

కళలకు కాణాచిగా… పేరుగాంచిన కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామం మరోసారి వార్తల్లోకి ఎక్కనుంది. చుట్టుపక్కల 150 గ్రామాలవారికి అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు అందించేందుకు ‘సంజీవని’ ఆస్పత్రి ఈ దసరా నుంచి అందుబాటులోకి రానుంది. ‘సిలికానాంధ్ర’ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారి ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఆస్పత్రి ఇది.
కూచిపూడి గ్రామంలోని మధ్యతరగతికి చెందిన దోనెపూడి సుధారాణి ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడింది. కుటుంబసభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. సమీపంలో వైద్యశాల లేకపోవడంతో ఆమెకు ఏమవుతుందోనని వారు ఆందోళన చెందారు. అష్టకష్టాలు పడి విజయవాడకు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. అయితే అదృష్టం బాగుండి ఏమీ కాలేదు. వైద్యఖర్చులు మాత్రం తడిసిమోపెడయ్యాయి.
ఇదే గ్రామానికి చెందిన రంగిశెట్టి జయలక్ష్మిది మరో అనుభవం. కొన్నాళ్ల క్రితం గర్భం దాల్చిన సమయంలో ఊళ్లోగానీ, చుట్టుపక్కల 55 కి.మీ దూరంలోగానీ వైద్యసౌకర్యం లేకపోవడంతో ప్రాణపాయస్థితి ఏర్పడింది. ఆమె పిల్లలు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే వారి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు.
**వీళ్లిద్దరే కాదు… కనీస వైద్యసౌకర్యానికి నోచుకోలేక, తడిసిమోపెడవుతున్న వైద్య ఖర్చులను భరించలేక ప్రతిరోజూ చచ్చిబతుకుతున్నవారు ఆ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. ’’అయ్యా..! మా ఊరుకు ఎంతో చేశారు. మాతో మమేకమై మా సమస్యలన్నింటిని పరిష్కరిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలోని ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు లేవు. ఏధైనా అత్యవసర పరిస్థితి అయితే మరణించటమే తప్ప బ్రతికి బట్టకట్టే మార్గం లేదు. దయచేసి ఇక్కడ ఓ చిన్న ఆస్పత్రి కట్టించి, పది మందికి వైద్య సేవలు అందించండి‘‘ అనే చిన్న విన్నపం… ఒక పల్లెటూరులో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణానికి బీజం వేసింది.
**కళలకు కాణాచి అయిన కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో రూ. 50 కోట్ల వ్యయంతో ప్రజల సౌకర్యార్థం ప్రజల భాగస్వామ్యంతో ‘సిలికానాంధ్ర’ ఈ హాస్పిటల్ను ఏర్పాటుచేస్తోంది. సువిశాల ప్రాంగణంలో అయిదంతస్తుల భవంతితో 200 పడకలతో నిర్మిస్తున్న ఈ హాస్పిటల్ వల్ల 150 గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసదుపాయాలు అందబోతున్నాయి. ప్రభుత్వం నుంచి, ట్రస్ట్ల నుంచి ఎటువంటి లబ్థిపొందకుండా దేశంలోనే ప్రథమంగా నేరుగా ప్రజల సహకారంతోనే ఈ హాస్పిటల్ రూపుదిద్దుకోవటం విశేషం.
***పునర్వైభవం కోసం దత్తత …
కూచిపూడి గ్రామానికి ఆరు శతాబ్థాల ఘన చరిత్ర ఉంది. కూచిపూడి నాట్యంతో తెలుగు ప్రజల ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఒకనాడు అందెల సవ్వడి.. మువ్వల రవళితో అలరాడిన ఈ ప్రాంతం కాలక్రమేణ తన వైభవాన్ని కోల్పోయింది. ఈ సందర్భంలో తెలుగు సాహితీ, సంస్కృతి, సంప్రదాయ స్ఫూర్తిని పదిమందికి పంచుకుని, పదిలంగా ముందుతరాలకు అందించాలనే ఆలోచనతో ఏర్పడిన ’సిలికానాంధ్ర‘ ఈ ప్రాంతానికి పునర్వైభవం తీసుకురావాలనుకుంది. ఈ క్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభోట్ల ఆనంద్, మరో 40 మంది సిలికానాంధ్ర గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్తో చర్చించి కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో మౌలికసదుపాయాలు కల్పించింది. రోడ్లు వేయించింది. నీటి వసతులు కల్పించి, ఇక్కడి ప్రజల నుంచి మన్ననలు అందుకుంది.
***వైద్య సేవల అవస్థలు తీర్చేందుకు…
కూచిపూడి ప్రాంతంలోని ప్రజలకు సకల సదుపాయాలు ఉన్నా.. వైద్య సదుపాయాలు మాత్రం లేవు. ప్రధానంగా దివిసీమ ప్రాంతంలోని పది మండలాల ప్రజలు అనారోగ్యం వస్తే అటు విజయవాడకు లేదా ఇటు మచిలీపట్నం జిల్లా హాస్పిటల్కు పరుగులు పెట్టాల్సిందే. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పాముకాట్లు, ఇతర ప్రాణాపాయ సంఘటనలు జరిగితే గోల్డెన్ అవర్ లోపు హాస్పిటల్కు చేరుకోవటం చాలా కష్టం. కూచిపూడి నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లాలంటే 28కి.మీ. అలాగే కూచిపూడి నుంచి విజయవాడ వెళ్లాలంటే 51కి.మీ. సింగిల్ లైన్ రోడ్డు వల్ల ఈ రూట్లలో ప్రయాణం రెండు గంటలపైనే. దీంతో ఈ ప్రాంత ప్రజలు అనేక మంది అత్యవసర పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు.
**హాస్పిటల్కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో గ్రామస్తులు సిలికానాంధ్ర సభ్యుల వద్దకు వచ్చి తమకు వైద్యసేవలు అందటం లేదని, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న సిలికానాంధ్ర ఓ చిన్న హాస్పిటల్ కట్టి, తమ ఆరోగ్యాలకు భరోసా ఇవ్వాలంటూ విన్నవించారు. ఈ ప్రాంతంలో ప్రజలు వైద్యసేవల కోసం పడుతున్న బాధలు, ఇబ్బందులను చూసి, మెగా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ఆలోచన చేసి, ఆ ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చింది.
**ప్యాలెస్ ఆఫ్ హెల్త్ ఫర్ కామన్ మాన్(పీహెచ్సీ)
కూచిపూడి ప్రాంతంలోని ప్రజలకు నామమాత్రపు ఫీజుతో మల్టీస్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు సిలికానాంధ్ర ’ప్యాలెస్ ఆఫ్ హెల్త్ ఫర్ కామన్ మాన్‘(పీహెచ్సీ)కాన్సె్ఫ్టతో భారీ హాస్పటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ హాస్పిటల్ నిర్మాణంలో ప్రజలనే భాగస్వామ్యం చేసింది. ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వారందరి నుంచి నిధుల సేకరణ ప్రారంభించి, కూచిపూడి నడిబొడ్డున ఎకరం ఎనిమిది సెంట్ల విస్తీర్ణంలో ఈ ’సంజీవని‘ హాస్పటల్ నిర్మాణాన్ని చేపట్టింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ, రేడియాలజీ, ఎమర్జెన్సీ విభాగాలు ఉంటాయి. రెండవ ఫ్లోర్లో ఐసీయూ, డయాలసిస్, కార్డియాలజీ యూనిట్. మూడవ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్స్, జనరల్ వార్డ్, నాల్గవ ఫ్లోర్లో జనరల్ వార్డ్స్, బెడ్స్ ఉంటాయి.
**రిక్షా కార్మికుడినుంచి అంతా భాగస్వాములే…
ఈ మల్టీ హాస్పిటల్ నిర్మాణానికి అనేక మంది సహాయ, సహకారాలు అందించారు. ప్రధానంగా ఎన్ఆర్ఐలు భూరి విరాళాలు ఇచ్చారు. ఎన్ఆర్ఐలు, స్థానికులు గానీ మొత్తం ఇప్పటి వరకు రూ. 30 కోట్ల విరాళాలు అందజేశారు. సిలికానాంధ్రనే ఈ విరాళాలను దేశ, దేశాలు తిరిగి సేకరించింది. స్థానికంగానూ విరాళాల కోసం ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించింది. రిక్షాపుల్లర్ వెంకటేశ్వరరావు తాను కష్టపడి సంపాదించిన రూ. 3500లను విరాళంగా అందించారు. హాస్పిటల్ నిర్మాణంలో చ.అ. రూ. 3500లు. దీంతో అతను ఆ నగదును ఇచ్చాడు. ఆయన నుంచి చాలా మంది స్ఫూర్తి పొందారు. తమకు తోచిన ఆర్థికసాయం చేశారు. స్థానికంగా ఎక్కువగా రూ. అయిదు లక్షలు, రూ. 10లక్షల నగదు సమకూరింది. దీంతోపాటు సిమెంట్ కంపెనీలు, సిమెంట్ను విరాళంగా ఇచ్చాయి.
**100 మంది డాక్టర్ల సేవలు…
ఈ దసరాకు (18న) హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతుంది. అప్పటి నుంచి కూచిపూడివాసులగే గాక ఆ చుట్టుపక్కల 150 గ్రామాల వారికి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాకు చెందిన 100మంది డాక్టర్లు ఇక్కడ సేవలు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వారంతా వారానికి లేదా నెలకు.. ఒక షెడ్యూల్ ప్రకారం ఇక్కడకు వచ్చి, రోగులకు వైద్యం చేస్తారు. ట్రామా, కార్డియాలజీ, గైనకాలజీ, ఆంకాలజీ, రేడియాలజీ, పిడియాట్రిక్, యూరాలజీ, ఫిజియోథెరపీ, ఆఫ్తామాలజీ, ఓపీ, ల్యాబ్స్, ఆంబులెన్స్ సర్వీసులకు సిబ్బందిని తీసుకోనున్నారు. దీంతో పాటు కూచిపూడి చుట్టుపక్కల ఉన్న పది మండలాల్లో పది ఆంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నారు. ఐసీయూ యూనిట్స్తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఏ మండలం వాహనం, ఆ మండలంలోని గ్రామాల్లోని రోగులను తీసుకొచ్చేందుకు ఆంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తానికి చిన్నగా మొదలైన ఒక ప్రయత్నం అందరి సంకల్పబలంతో పేదలకు భరోసానిచ్చే ‘సంజీవని’గా రూపుదిద్దుకోవడం విశేషమే కదా.
**రోగులు కాదు… అతిథులు…- కూచిభొట్ల ఆనంద్, ‘సిలికానాంధ్ర’ వ్యవస్థాపక అధ్యక్షులు
మనిషిని కాపాడే లక్ష్యంతో, వారికి ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ వైద్యాలయాన్ని నిర్మిస్తున్నాం. ఈ హాస్పిటల్కు వచ్చేవారంతా అనారోగ్యంతో ఉన్న అతిథులు. వారంతా ఆరోగ్యంతో తిరిగి వెళ్లాలి. ఈ ప్రాంత వాసులకు ఈ హాస్పిటల్ నిజంగా సంజీవని లాంటిది. 18 సంవత్సరాలుగా సిలికానాంధ్ర ఎన్నో కార్యక్రమాలను చేస్తోంది. ప్రజా శ్రేయస్సుకోసం జరుగుతున్న ఈ వినూత్న కార్యాక్రమనికి సహకారం అందించేవారి కోసం సిలికానాంధ్ర ఎదురు చూస్తోంది.

డెట్రాయిట్‌లో గుబాళించిన తెలుగు సాహితీ సౌరభం


డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితీ (డిటీఎల్ సి) 20 సంవత్సరాల క్రితం చిన్న తెలుగు బుక్ క్లబ్ తో ప్రారంభమయ్యి పుస్తకాలు చదవడంతోనే ఆగిపోక, నిక్కచ్చిగా విమర్శ చేయడం, ఎంతో శ్రమతో, నిరపేక్షతో, కేవలం తెలుగు సాహిత్యం పట్ల ప్రేమతో మరుగునపడిన పుస్తకాలను ప్రచురించే బాధ్యత కొంత తలకెత్తుకోవడం, తెలుగు భాషాసాహిత్యాల గురించిన సభలు నిర్వహించడం వరకూ ఎదిగింది. వారు సెప్టెంబర్ 29-30 తేదీల్లో 20ఏళ్ల పండుగ జరుపుకున్నారు. ఆ సందర్భంగా నిర్వహించిన సదస్సులకు విశిష్ట అతిథిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. తెలుగు గుర్తించే పూనిక అనే అంశంపై రమేశ్ కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు నరిసెట్టి ఇన్నయ్య, వాసిరెడ్డి నవీన్, అప్సర్, బసాబత్తిన శ్రీనివాసులు, గోపరాజు లక్ష్మి, మెట్టుపల్లి జయదేవ్, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి తదితరులు ప్రసంగించారు.

శాక్రిమెంటో తెలుగు సంఘం కథల పోటీలు
ఈ వారాంతం డెట్రాయిట్ సాహితీ సమితి 20వ వార్షికోత్సవం

ప్రపంచవ్యాప్తంగా మనబడి తరగతులు ప్రారంభం


ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాలు, ముఖ్యంగా అమెరికాలోని 35 రాష్ట్రాలలోని 260కి పైగా కేంద్రాల్లో ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యా సంవత్సరానికి గాను సెప్టెంబర్ 8న తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో 10 వేల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా మనబడి నూతన విద్యా సంవత్సరం తెలుగు భాషాభిమాని, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో చికాగోలో ప్రారంభం కావడం మరొక విశేషం. సిలికానాంధ్ర మనబడి ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించడం గొప్ప కార్యక్రమమని, అందులోనూ మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందని వెంకయ్య నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, ప్రతిష్టాత్మక (WASC)వాస్క్ ఎక్రిడియేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు లభించిన ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడి అని మనబడి డీన్ (అధ్యక్షుడు) రాజు చమర్తి పేర్కొన్నారు. పదకొండేళ్లుగా మనబడి ద్వారా 45 వేల మందికి పైగా చిన్నారులకు తెలుగు నేర్పించామని ఆయన తెలిపారు. అమెరికా వ్యాప్తంగా 260కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన మనబడిలో తెలుగు మాట్లాడటం, బాలానందం, తెలుగుకు పరుగు, పద్యనాటకం, తెలుగు పద్యం, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు మన కళలు, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగిస్తున్నామని మనబడి అభివృద్ధి ఉపాధ్యక్షుడు శరత్ వేట తెలిపారు. సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరంలో ప్రవేశం కావాలనుకున్న వారు 1-844-626-2234 కు కాల్ చేయవచ్చని మనబడి ఉపాద్యక్షుడు దీనబాబు కొండుభట్ల కోరారు. మనబడి విజయాలకు కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. లాస్ ఏంజిలస్‌లో డాంజి తోటపల్లి, న్యూజెర్సీలో శరత్ వేట, డాలస్‌లో భాస్కర్ రాయవరం, సిలికాన్ వ్యాలీలో దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, స్నేహ వేదుల, రత్నమాల వంక, లక్ష్మి యనమండ్ల, జయంతి కోట్ని, శ్రీరాం కోట్ని , చికాగోలో సుజాత అప్పలనేని, వెంకట్ గంగవరపు, వర్జీనియా నుంచి శ్రీనివాస్ చివలూరి, మాధురి దాసరి, గౌడ్ రామాపురం, ఉత్తర కెరోలిన నుంచి అమర్ సొలస, అట్లాంటా నుంచి విజయ్ రావిళ్ళ తదితరులు, మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తల సహకారంతో నూతన విద్యా సంవత్సర తరగతులు వైభవంగా ప్రారంభమయ్యాయి.