ఘనంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం


ఆమెరికాలోని కాలిఫొర్నియా రాష్ట్రంలో రెండు సంవత్సరాల క్రితం స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటయి భారతీయ కళలు మరియు భాషలలో మాస్టర్స్, డిప్లొమ మరియు సర్టిఫికెట్ స్థాయి కోర్సులను అందిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించబడింది. తొలి బ్యాచ్ లో చేరి కోర్సు పూర్తి చేసిన ౩1 మంది విద్యార్ధులకు సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మరియు విశ్వ విద్యాలయ పాలకవర్గ చైర్మన్ శ్రీ లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందించడం జరిగింది. కాంప్ బెల్ హెరిటేజ్ థియేటర్్లో జరిగిన ఈ కార్యక్రమం ప్రారంభంలో నిర్వహంచిన శోభాయాత్ర చూపరులను ఎంతో ఆకట్టుకొన్నది. విశ్వవిద్యాలయం ప్రొవొస్ట్ రాజు చమర్తి ముందు నడవగా పాలక వర్గ సభ్యులు అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, చైర్మన్ డా. హనిమిరెడ్డి లక్కిరెడ్డి, డా. పప్పు వేణుగోపాల రావు, నీరజ్ భాటియా, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ దీనబాబు కొండుభట్ల, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ దిలీప్ కొండిపర్తి, ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణులు ప్రసాద్ కైపా మరియు పట్టభద్రులు కాబోతున్న విద్యార్ధులు స్నాతకోత్సవ దుస్తులతో కవాతుగా వేదిక వద్దకు వచ్చారు. 2001వ సంవత్సరంలో సిలికానాంధ్ర ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ రాబోయే రోజులలో విశ్వవిద్యాలయం లక్ష్యం, ప్రణాళిక, కార్యకలాపాలను వివరిస్తూ స్పూర్తిదాయకమయిన స్వాగతోపన్యాసం చేసారు అధ్యక్షులు శ్రీ ఆనంద్ కూచిభొట్ల. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ త్రైమాసిక పత్రిక ‘శాస్త్ర’ ను పాలక మండలి సభ్యులు మరియు అకాడమిక్ అడ్వైజరి కమిటి చైర్మన్ డా. పప్పు వేణుగోపాలరావ్ ఆవిష్కరించారు. శనివారం జరిగిన స్నాతకోత్సవ సంబరాల్లో విశ్వవిద్యాలయ విద్యార్ధులు ప్రదర్శనలిచ్చారు , ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కర్ణాటక సంగీత ఆచార్యులు డా. శ్రీరాం పరశురాం నిర్వహించిన హిందుస్తాని-కర్ణాటక సంగీత జుగల్‌బంది కచేరీకి ప్రేక్షకులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన అధ్యాపక బృందం డా. శ్రీరాం పరశురాం, డా.మాలా స్వామి, డా.రమాదేవి, డా. సుమిత్ర వేలూరి, డా.యశోద ఠాకూర్, డా.అనుపమ కైలాష్ తదితరులను విశ్వవిద్యాలయ పాలకవర్గం ప్రత్యేకంగా సన్మానించింది.






















సిలికానాంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో సిలికానాంద్ర ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంద్ర (యు ఎస్ ఎ ) మొదటి స్నాతకోత్సవాన్ని జనవరి 27వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. పూర్తీ వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించవచ్చు.

సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి ఆంబులెన్స్ ప్రారంభం


కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో ఏర్పటు చేసిన మందుల షాపు, ఆంబులెన్స్ సేవలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి.చలమేశ్వర్ మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

కూచిపూడి ‘సంజీవని’ ఆసుపత్రి నిర్మాణం అద్భుతం.


యాభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో నిర్మించిన సంజీవని ఆసుపత్రి ఒక అద్భుతమని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు, దాత డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రశంసించారు. సిలికానాంద్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఆహ్వానం మేరకు డా.హనిమిరెడ్డి గురువారం నాడు ఈ ఆసుపత్రిని సందర్శించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటువంటి భారీ ఆసుపత్రి కూచిపూడి వంటి చిన్న గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని డా. హనిమిరెడ్డి కొనియాడారు. సిలికానాంద్ర ఆద్వర్యంలో చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం డా. హనిమిరెడ్డిని ఆనంద్ ఆద్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమంలో TNI డైరెక్టర్ కిలారు ముద్దుకృష్ణ, విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తోండేపు రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





పాఠశాల అభివృద్ధి అంటే ఇలా ఉండాలి

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర జిల్లా పరిషత్‌ ఓరియెంటల్‌ పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే బోధన చేస్తూ విద్యార్థుల జ్ఞానం, సామర్థ్యాలు, నైపుణ్యాల వైఖరులు పెంపొందించేలా పాటుపడుతున్నారు. ఒకవైపు కృత్యాలు, పరిశోధనల ద్వారా తరగతి గదులను తయారు చేస్తూ మరోవైపు పాఠశాల ఆవరణను స్వచ్ఛంగా, నందనవనంగా మారుస్తున్నారు. భాషా సాంస్కృతిక విభాగం పేరుతో తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషా ప్రయోగశాల, సాంఘిుక శాస్త్ర విజ్ఞాన విభాగాల ఏర్పాటుతో ఇక్కడ గోడలే పాఠాలు చెబుతుంటాయ్‌. సిలికానాంధ్ర కుటుంబం దత్తత తీసుకున్న ఈ పాఠశాల ఇతర విద్యాలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
***నాలుగేళ్ల కిందట సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్‌ ఈ పాఠశాలను దత్తత తీసుకున్నారు. తరగతి గదులను దాతల సాయంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
* గత రెండేళ్లుగా పాఠశాల ఆవరణను ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి నందనవనంగా తీర్చిదిద్దుతున్నారు. చూడగానే ఆవరణ హరితవనంలా కనిపిస్తుంది. పాఠశాలలోని మరుగుదొడ్లకు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గత ఏడాది మరమ్మతులు చేసి పచ్చదనం పెంచారు. నాలుగేళ్లుగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు నూరుశాతం ఫలితాలు సాధిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులచే తెలుగుభాషాదినోత్సవం, ప్రముఖ కవుల జయంతి కార్యక్రమాలు వంటి వాటితోపాటు భారతీయ సాంస్కృతిక సంప్రదాయలకు పెద్దపీట వేస్తున్నారు.
* పాఠశాలలో గత ఏడాది సాంఘిక శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేసి జిల్లా విద్యాశాఖ నుంచి ప్రశంసలను అందుకున్నారు. నవ్యాంధ్ర అమరావతిలో ఐకాన్‌ బ్రిడ్జి నమూనాలను, కూచిపూడి నృత్యభంగిమలు, ప్రముఖ చరిత్రకారుల జీవిత విశేషాలు, ప్రాచీన విశ్వవిద్యాలయాల వివరాలు, చరిత్ర, సంస్కృతి తెలిసేలా తరగతి గదిని తీర్చిదిద్దారు.
* భాషా సాంసృతిక విభాగం పేరుతో తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషా ప్రయోశాలలను నూతనగా ఏర్పాటుచేశారు. అందులో విభిన్న నాట్య రీతులు, కూచిపూడి నాట్యవైభవం, తెలుగు వెలుగుల పేరుతో ప్రముఖ కవులైన క్షేత్రయ్య, నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, అన్నమయ్య వంటివారితోపాటు ఆధునిక కవులైన గిడుగురామ్మూర్తి, శ్రీశ్రీ వంటివారి చిత్రపటాలను ఏర్పాటు చేశారు. భారతీయ భాషలు, తెలుగు లిపిక్రమ పరిణామ క్రమాన్ని ఇందులో పొందుపరిచారు. మౌర్యుల కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయల వరకు చిత్రాలను ఏర్పాటు చేసి చరిత్రపై అవగాహన ఏర్పడేలా చేశారు.
* భారతీయ వైభవం పేరుతో తల్లి గర్భంలో శిశువు పురుడు పోసుకొని జన్మనిచ్చిన క్రమం.. వేదవ్యాసుని వాయు పురాణంలోని 16 శ్లోకాలకు బాపు చిత్రాలు, చాగంటి వ్యాఖ్యానాలను మాతృవందనం పేరుతో ఏర్పాటు చేశారు. వేమన పద్యాలను గోడపై లిఖించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం కొల్లి జగదీశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలలో విభిన్న అంశాలపై ప్రయోగశాలలు ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా విద్యార్థులు త్వరితగతిన జ్ఞానాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు. చిన్నారులు అన్ని రంగాల్లో రాణించేలా తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
* కూచిపూడి రోటరీ క్లబ్‌ సభ్యుల సహకారంతో తాగునీరు, మౌలిక వసతులు ఏర్పడ్డాయి. పారిశ్రామికవేత్త చీకటిమర్ల శివరామప్రసాద్‌, ప్రభుత్వ సహకారంతో రెండు డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేసుకున్నారు.

సిలికానాంద్ర ‘సంజీవని’కి వరద కడుతున్న విరాళాలు

కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో యాభై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సంజీవని సూపర్ స్పెషాలిటి ఆస్పత్రికి అమెరికాతో పాటు వివిధ దేశాల నుండి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. మంగళవారం విరాళాలు దినోత్సవంగా పాటించి విరాళాలు ఇవ్వాలని సిలికానాంద్ర వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఇచ్చిన పిలుపుకు 69వేల డాలర్లు విరాళంగా అందాయి. 549 మంది దాతల నుండి ఈ అందినట్లు ఆనంద్ ప్రకటించారు. విరాళాలు అందించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన తమిళనాడు కార్మిక మంత్రి


అమెరికా విచ్చేసిన తమిళనాడు కార్మికశాఖ మంత్రి ఎంసీ సంపత్ సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. సంపత్, అతని సిబ్బందికి సిలికానాంధ్ర ఘన స్వాగతం పలికింది. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ రాజు చమర్తి గత పద్దెనిమిది సంవత్సరాలుగా సిలికానాంధ్ర సాధించిన ప్రగతిని మంత్రికి వివరించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో విస్తరిస్తున్న మనబడి, కాలిఫోర్నియా రాష్ట్ర అనుమతి పొంది భారతీయ కళలను బోధిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధిని వివరించారు. అలాగే, కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం దత్తత తీసుకొని ఆ గ్రామానికి మౌళిక సదుపాయాలను కల్పించిన కృషిని, చుట్టుపక్కల 150 గ్రామాలకు వైద్య సదుపాయం అందించాలనే ఉద్దేశంతో సంజీవనీ వైద్యాలయ స్థాపనకు దాతలు అందించిన సహాయాన్ని, అమెరికా డాక్టర్లు, ఇతర శ్రేయోభిలాషుల సహకారాన్ని కంప్యూటర్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. అమెరికాలోనే కాకుండా, భారతదేశంలో కూడా సిలికానాంధ్ర చేస్తున్న సేవలను, సాధిస్తున్న ప్రగతిని మంత్రి సంపత్ కొనియాడుతూ, ఎలాంటి ప్రాంతీయ వివక్ష లేకుండా భారతీయ కళలను, సంస్కృతిని అమెరికా దేశంలో బోధించాలనే సదుద్దేశంతో స్థాపించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని అందుకు కృషిచేస్తున్న సిలికానాంధ్ర బృందాన్ని అభినందించారు. ఇటీవల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృతం, తెలుగు విభాగాలను ప్రారంభించారన్న విషయం తెలుసుకున్న సంపత్‌, విశ్వవిద్యాలయంలో తమిళభాషా ఫీఠాన్ని నెలకొల్పటానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తానని హామీ ఇస్తూ సిలికానాంధ్రా బృందాన్ని తమిళనాడుకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర కార్యవర్గం, బే ఏరియా తమిళ మన్రం, ఫ్రీమాంట్ ఇస్లామిక్ సెంటర్ ముస్లిం అసోషియేషన్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గాల సభ్యులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం గురించిన మరిన్ని వివరాలకు www.universityofsiliconandhra.org ని చూడవచ్చని, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు.


పదో రికార్డు కైవసం చేసుకున్న కూచిభొట్ల ఆనంద్-TNI ప్రత్యేకం


ఓ వ్యక్తి రూపొందించిన ఒక వ్యవస్థ అద్భుతాలను సృష్టిస్తోంది. యావత్ తెలుగు జాతి గర్వించే విధంగా కార్యకలాపాలను చేపడుతోంది. విదేశాల్లో పుట్టిన ఒక చిన్న తెలుగు సంఘం మాతృభూమిని మరచిపోకుండా సొంతగడ్డ పై చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు తెలుగువారందరికి గర్వకారణంగా ఉంటున్నాయి.

*** ఉపాధి కోసం భార్యబిడ్డలతో కలిసి అమెరికా వెళ్లి ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని 18ఏళ్ల క్రితం కూచిభొట్ల ఆనంద్ అనే ఒక చిన్న వ్యక్తి ఏర్పాటు చేసిన ‘సిలికానాంధ్ర’ అనే చిన్న సంస్థ తెలుగుజాతి గర్వించే విధంగా చేస్తున్న కార్యక్రమాలు నేడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘మనం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేపట్టకూడదు’ అనే ఆలోచన ప్రతి తెలుగు సంస్థలో రేకెత్తిస్తున్నాయి.

*** ఒకటా…రెండా…మొత్తం పది రికార్డులు…!
కూచిభొట్ల ఆనంద్ సారధ్యంలోని సిలికానాంద్ర ఇప్పటి వరకు తొమ్మిది గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. 2008లో అమెరికా గడ్డపై తొలిసారిగా ఒకే వేదిక పై దాదాపు నాలుగు వందల మంది కూచిపూడి కళాకారిణిలతో చేయించిన నృత్యంతో సిలికానాంద్ర గిన్నీస్ రికార్డుల పర్వం ప్రారంభమైంది. అక్కడితో ఆగకుండా ‘అన్నమయ్య లక్ష గళార్చన’, తదితర అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేపట్టి గడిచిన పదేళ్ళలో మొత్తం తొమ్మిది గిన్నిస్ రికార్డులను కూచిభొట్ల ఆనంద్ నెలకొల్పారు.

*** కూచిపూడి ‘సంజీవని’తో మరో రికార్డు
ఉభయ తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా నూటికి నూరు శాతం ప్రజల భాగస్వామ్యంతో కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన సంజీవని వైద్యశాల ఆనంద్ సాధించిన మరో రికార్డుగా రూపుదిద్దుకోబోతోంది. కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలో 50కోట్ల ఖర్చుతో కూచిపూడి వంటి చిన్న గ్రామంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన 200 పడకల ఆసుపత్రి తెలుగువారికే కాదు యావత్ భారత జాతికే గర్వకారణం అనటంలో సందేహం లేదు.

*** సంజీవని ఆస్పత్రి నిర్మాణంలో అన్నీ వింతలే?!
వాస్తవానికి కూచిపూడి నాట్యం రూపుదిద్దుకొన్న గ్రామంలో ‘కూచిపూడి నాట్యారామం’ నిర్మించే బాద్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూచిభొట్ల ఆనంద్ కు నాలుగేళ్ళ క్రితం అప్పగించారు. ఈ పని మీద కూచిపూడి వెళ్ళిన ఆనంద్ కు, ఆయన అనుచర బృందానికి అన్ని అడ్డంకులే ఎదురయ్యాయి. ముందుగా అక్కడి ప్రజలు ఆయనకు సహకరించడానికి ఆసక్తి చూపలేదు. అక్కడ ఉన్న కూచిపూడి నాట్యాచార్యులు కొంతమంది ఆనంద్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

** ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని…
కూచిపూడిలో తొలుత తనకు ఎదురైన ఇబ్బందులను కూచిభొట్ల ఆనంద్ తన చాకచక్యంతో అనుకూలంగా మార్చుకున్నారు. పంచె పైకి ఎగగట్టి జోలె పట్టుకున్నారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని దానగుణం ఉన్న దాదాపు ప్రతీ ఒక్కరిని కలిశారు. కూచిపూడి గ్రామ అభివృద్దికి కూచిభొట్ల ఆనంద్ చేపట్టిన నిధుల వేట పలువురిని కదిలించివేసింది. కరడుగట్టిన మీడియా అధినేతగా పేరుపొందిన రవిప్రకాష్ లో ఉన్న మరొక కోణాన్ని ఆనంద్ బయటకు తీసుకువచ్చారు. సంజీవని నిర్మాణానికి రవిప్రకాష్ సొంతగా నాలుగు కోట్ల రూపాయలు విరాళాన్ని అందించారు. మరొక పదికోట్ల విరాళాన్ని తన టీవీ9 ద్వారా ప్రజల నుండి ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఇప్పించారు. శరవేగంగా రూపుదిద్దుకుంటున్న సంజీవని నిర్మాణంలో రైతు కూలీలు, రిక్షా కార్మికులు, పదవీవిరమణ చేసిన వృద్దులు, షాపు గుమ్మస్తాలు తదితర వర్గాల వారిని సంజీవని ఆకర్షించింది. వంద రూపాయల నుండి కోట్ల వరకు విరాళాలు ఈ ఆస్పత్రి నిర్మాణానికి పెద్ద ఎత్తున తరలిరావటం పెద్ద విశేషమే కాదు, గొప్ప వింత కూడా! కూచిపూడిలో ఒక పక్క ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతూనే మరొక పక్క ఆ గ్రామాన్ని సిలికానాంద్ర కుటుంబం సుందరవనంగా తీర్చిదిద్దింది. ఆ గ్రామంలో ఆరు కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేశారు. గ్రామం అంతా ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చారు. పాఠశాలల్లో అమెరికా తరహాలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

*** ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కూచిపూడి.
సిలికానాంద్ర నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖ తెలుగు వైద్యులు ఈ ఆస్పత్రికి తమ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. అన్ని జబ్బులకు ఈ ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. తుఫాను పనుల ఒత్తిడిలో శ్రీకాకుళంలో ఉన్న చంద్రబాబు దసరా పండగ రోజున ఈ ఆస్పత్రి ప్రారంభానికి తీరిక చేసుకుని తరలివచ్చారు. ప్రభుత్వం నుండి పదికోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఈ ఆస్పత్రి నిర్వహణ కోసం మంజూరు చేశారు. కూచిభొట్ల ఆనంద్ తదితర సిలికానాంద్ర కుటుంబ సభ్యుల సేవాభావాన్ని చంద్రబాబు ప్రశంసించారు. తెలుగుజాతికే గర్వకారణమని కొనియాడారు. సిలికానాంద్ర ఆద్వర్యంలో నిరంతరాయంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆరు పదుల వయసుకు దగ్గరలో ఉన్న ఆనంద్ వందేళ్ళ పాటు ప్రజల మధ్య ఉండి మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటూ……కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.











సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రికి రూ.10కోట్లు ప్రకటించిన చంద్రబాబు

రూ.40కోట్ల వ్యయంతో కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని” వైద్యాలయాన్ని గురువారం నాడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న సిలికానాంధ్ర వంటి సంస్థలను ఆదర్శంగా తీసుకుని మరిన్ని గ్రామాల్లో ప్రవాసులు చొరవగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సిలికానాంధ్ర సంస్థ సేవలను ఆయన అభినందించారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం తరఫున రూ.10కోట్లను ఆయన ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన పట్ల సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ హర్షం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో కాలిఫోర్నియా నుండి పెద్ద సంఖ్యలో సిలికానంధ్ర సభ్యులు హాజరయ్యారు.


సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో సిలికానాంధ్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన “రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయాన్ని” ప్రారంభించారు. చంద్రబాబు ప్రసంగిస్తూ రానున్న కాలంలో కూచిపూడి ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి బృహత్తర వైద్యాలయాన్ని ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసినందుకు సిలికానాంధ్ర సంస్థను దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్,మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టీవీ9 సీఈఓ రవిప్రకాష్, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్, సభ్యులు వేట శరత్, దీనబాబు కొండుభట్ల, అనూష కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు చేతుల మీదుగా సిలికానాంధ్ర “సంజీవని” ప్రారంభం

కూచిపూడి గ్రామంలో నిర్మించబడుతున్న “రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం” ది.18-10-2018 న అనగా గురువారం ఉదయం 11:00 గం।।లకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. కావున మీరందరూ ఈ కార్యక్రమానికి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఆశీర్వదించ వలసిందిగా కోరుతూ ఇదే మా ఆహ్వానం.

ఇట్లు
సిలికానాంధ్ర కుటుంబం

దసరాకి ప్రారంభం కానున్న సిలికానాంధ్ర సంజీవని

కళలకు కాణాచిగా… పేరుగాంచిన కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామం మరోసారి వార్తల్లోకి ఎక్కనుంది. చుట్టుపక్కల 150 గ్రామాలవారికి అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు అందించేందుకు ‘సంజీవని’ ఆస్పత్రి ఈ దసరా నుంచి అందుబాటులోకి రానుంది. ‘సిలికానాంధ్ర’ ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారి ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఆస్పత్రి ఇది.
కూచిపూడి గ్రామంలోని మధ్యతరగతికి చెందిన దోనెపూడి సుధారాణి ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడింది. కుటుంబసభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. సమీపంలో వైద్యశాల లేకపోవడంతో ఆమెకు ఏమవుతుందోనని వారు ఆందోళన చెందారు. అష్టకష్టాలు పడి విజయవాడకు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. అయితే అదృష్టం బాగుండి ఏమీ కాలేదు. వైద్యఖర్చులు మాత్రం తడిసిమోపెడయ్యాయి.
ఇదే గ్రామానికి చెందిన రంగిశెట్టి జయలక్ష్మిది మరో అనుభవం. కొన్నాళ్ల క్రితం గర్భం దాల్చిన సమయంలో ఊళ్లోగానీ, చుట్టుపక్కల 55 కి.మీ దూరంలోగానీ వైద్యసౌకర్యం లేకపోవడంతో ప్రాణపాయస్థితి ఏర్పడింది. ఆమె పిల్లలు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే వారి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు.
**వీళ్లిద్దరే కాదు… కనీస వైద్యసౌకర్యానికి నోచుకోలేక, తడిసిమోపెడవుతున్న వైద్య ఖర్చులను భరించలేక ప్రతిరోజూ చచ్చిబతుకుతున్నవారు ఆ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. ’’అయ్యా..! మా ఊరుకు ఎంతో చేశారు. మాతో మమేకమై మా సమస్యలన్నింటిని పరిష్కరిస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలోని ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు లేవు. ఏధైనా అత్యవసర పరిస్థితి అయితే మరణించటమే తప్ప బ్రతికి బట్టకట్టే మార్గం లేదు. దయచేసి ఇక్కడ ఓ చిన్న ఆస్పత్రి కట్టించి, పది మందికి వైద్య సేవలు అందించండి‘‘ అనే చిన్న విన్నపం… ఒక పల్లెటూరులో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణానికి బీజం వేసింది.
**కళలకు కాణాచి అయిన కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో రూ. 50 కోట్ల వ్యయంతో ప్రజల సౌకర్యార్థం ప్రజల భాగస్వామ్యంతో ‘సిలికానాంధ్ర’ ఈ హాస్పిటల్ను ఏర్పాటుచేస్తోంది. సువిశాల ప్రాంగణంలో అయిదంతస్తుల భవంతితో 200 పడకలతో నిర్మిస్తున్న ఈ హాస్పిటల్ వల్ల 150 గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యసదుపాయాలు అందబోతున్నాయి. ప్రభుత్వం నుంచి, ట్రస్ట్ల నుంచి ఎటువంటి లబ్థిపొందకుండా దేశంలోనే ప్రథమంగా నేరుగా ప్రజల సహకారంతోనే ఈ హాస్పిటల్ రూపుదిద్దుకోవటం విశేషం.
***పునర్వైభవం కోసం దత్తత …
కూచిపూడి గ్రామానికి ఆరు శతాబ్థాల ఘన చరిత్ర ఉంది. కూచిపూడి నాట్యంతో తెలుగు ప్రజల ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఒకనాడు అందెల సవ్వడి.. మువ్వల రవళితో అలరాడిన ఈ ప్రాంతం కాలక్రమేణ తన వైభవాన్ని కోల్పోయింది. ఈ సందర్భంలో తెలుగు సాహితీ, సంస్కృతి, సంప్రదాయ స్ఫూర్తిని పదిమందికి పంచుకుని, పదిలంగా ముందుతరాలకు అందించాలనే ఆలోచనతో ఏర్పడిన ’సిలికానాంధ్ర‘ ఈ ప్రాంతానికి పునర్వైభవం తీసుకురావాలనుకుంది. ఈ క్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభోట్ల ఆనంద్, మరో 40 మంది సిలికానాంధ్ర గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్తో చర్చించి కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో మౌలికసదుపాయాలు కల్పించింది. రోడ్లు వేయించింది. నీటి వసతులు కల్పించి, ఇక్కడి ప్రజల నుంచి మన్ననలు అందుకుంది.
***వైద్య సేవల అవస్థలు తీర్చేందుకు…
కూచిపూడి ప్రాంతంలోని ప్రజలకు సకల సదుపాయాలు ఉన్నా.. వైద్య సదుపాయాలు మాత్రం లేవు. ప్రధానంగా దివిసీమ ప్రాంతంలోని పది మండలాల ప్రజలు అనారోగ్యం వస్తే అటు విజయవాడకు లేదా ఇటు మచిలీపట్నం జిల్లా హాస్పిటల్కు పరుగులు పెట్టాల్సిందే. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పాముకాట్లు, ఇతర ప్రాణాపాయ సంఘటనలు జరిగితే గోల్డెన్ అవర్ లోపు హాస్పిటల్కు చేరుకోవటం చాలా కష్టం. కూచిపూడి నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లాలంటే 28కి.మీ. అలాగే కూచిపూడి నుంచి విజయవాడ వెళ్లాలంటే 51కి.మీ. సింగిల్ లైన్ రోడ్డు వల్ల ఈ రూట్లలో ప్రయాణం రెండు గంటలపైనే. దీంతో ఈ ప్రాంత ప్రజలు అనేక మంది అత్యవసర పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు.
**హాస్పిటల్కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో గ్రామస్తులు సిలికానాంధ్ర సభ్యుల వద్దకు వచ్చి తమకు వైద్యసేవలు అందటం లేదని, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న సిలికానాంధ్ర ఓ చిన్న హాస్పిటల్ కట్టి, తమ ఆరోగ్యాలకు భరోసా ఇవ్వాలంటూ విన్నవించారు. ఈ ప్రాంతంలో ప్రజలు వైద్యసేవల కోసం పడుతున్న బాధలు, ఇబ్బందులను చూసి, మెగా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ఆలోచన చేసి, ఆ ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చింది.
**ప్యాలెస్ ఆఫ్ హెల్త్ ఫర్ కామన్ మాన్(పీహెచ్సీ)
కూచిపూడి ప్రాంతంలోని ప్రజలకు నామమాత్రపు ఫీజుతో మల్టీస్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు సిలికానాంధ్ర ’ప్యాలెస్ ఆఫ్ హెల్త్ ఫర్ కామన్ మాన్‘(పీహెచ్సీ)కాన్సె్ఫ్టతో భారీ హాస్పటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ హాస్పిటల్ నిర్మాణంలో ప్రజలనే భాగస్వామ్యం చేసింది. ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వారందరి నుంచి నిధుల సేకరణ ప్రారంభించి, కూచిపూడి నడిబొడ్డున ఎకరం ఎనిమిది సెంట్ల విస్తీర్ణంలో ఈ ’సంజీవని‘ హాస్పటల్ నిర్మాణాన్ని చేపట్టింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ, రేడియాలజీ, ఎమర్జెన్సీ విభాగాలు ఉంటాయి. రెండవ ఫ్లోర్లో ఐసీయూ, డయాలసిస్, కార్డియాలజీ యూనిట్. మూడవ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్స్, జనరల్ వార్డ్, నాల్గవ ఫ్లోర్లో జనరల్ వార్డ్స్, బెడ్స్ ఉంటాయి.
**రిక్షా కార్మికుడినుంచి అంతా భాగస్వాములే…
ఈ మల్టీ హాస్పిటల్ నిర్మాణానికి అనేక మంది సహాయ, సహకారాలు అందించారు. ప్రధానంగా ఎన్ఆర్ఐలు భూరి విరాళాలు ఇచ్చారు. ఎన్ఆర్ఐలు, స్థానికులు గానీ మొత్తం ఇప్పటి వరకు రూ. 30 కోట్ల విరాళాలు అందజేశారు. సిలికానాంధ్రనే ఈ విరాళాలను దేశ, దేశాలు తిరిగి సేకరించింది. స్థానికంగానూ విరాళాల కోసం ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించింది. రిక్షాపుల్లర్ వెంకటేశ్వరరావు తాను కష్టపడి సంపాదించిన రూ. 3500లను విరాళంగా అందించారు. హాస్పిటల్ నిర్మాణంలో చ.అ. రూ. 3500లు. దీంతో అతను ఆ నగదును ఇచ్చాడు. ఆయన నుంచి చాలా మంది స్ఫూర్తి పొందారు. తమకు తోచిన ఆర్థికసాయం చేశారు. స్థానికంగా ఎక్కువగా రూ. అయిదు లక్షలు, రూ. 10లక్షల నగదు సమకూరింది. దీంతోపాటు సిమెంట్ కంపెనీలు, సిమెంట్ను విరాళంగా ఇచ్చాయి.
**100 మంది డాక్టర్ల సేవలు…
ఈ దసరాకు (18న) హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతుంది. అప్పటి నుంచి కూచిపూడివాసులగే గాక ఆ చుట్టుపక్కల 150 గ్రామాల వారికి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాకు చెందిన 100మంది డాక్టర్లు ఇక్కడ సేవలు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వారంతా వారానికి లేదా నెలకు.. ఒక షెడ్యూల్ ప్రకారం ఇక్కడకు వచ్చి, రోగులకు వైద్యం చేస్తారు. ట్రామా, కార్డియాలజీ, గైనకాలజీ, ఆంకాలజీ, రేడియాలజీ, పిడియాట్రిక్, యూరాలజీ, ఫిజియోథెరపీ, ఆఫ్తామాలజీ, ఓపీ, ల్యాబ్స్, ఆంబులెన్స్ సర్వీసులకు సిబ్బందిని తీసుకోనున్నారు. దీంతో పాటు కూచిపూడి చుట్టుపక్కల ఉన్న పది మండలాల్లో పది ఆంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నారు. ఐసీయూ యూనిట్స్తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఏ మండలం వాహనం, ఆ మండలంలోని గ్రామాల్లోని రోగులను తీసుకొచ్చేందుకు ఆంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తానికి చిన్నగా మొదలైన ఒక ప్రయత్నం అందరి సంకల్పబలంతో పేదలకు భరోసానిచ్చే ‘సంజీవని’గా రూపుదిద్దుకోవడం విశేషమే కదా.
**రోగులు కాదు… అతిథులు…- కూచిభొట్ల ఆనంద్, ‘సిలికానాంధ్ర’ వ్యవస్థాపక అధ్యక్షులు
మనిషిని కాపాడే లక్ష్యంతో, వారికి ఆరోగ్య సేవలు అందించేందుకు ఈ వైద్యాలయాన్ని నిర్మిస్తున్నాం. ఈ హాస్పిటల్కు వచ్చేవారంతా అనారోగ్యంతో ఉన్న అతిథులు. వారంతా ఆరోగ్యంతో తిరిగి వెళ్లాలి. ఈ ప్రాంత వాసులకు ఈ హాస్పిటల్ నిజంగా సంజీవని లాంటిది. 18 సంవత్సరాలుగా సిలికానాంధ్ర ఎన్నో కార్యక్రమాలను చేస్తోంది. ప్రజా శ్రేయస్సుకోసం జరుగుతున్న ఈ వినూత్న కార్యాక్రమనికి సహకారం అందించేవారి కోసం సిలికానాంధ్ర ఎదురు చూస్తోంది.

అమెరికాలో డా.మూర్తి ఆఖరి కార్యక్రమం కూడా గీతం కోసమే!

గీతం విద్యాలయాల వ్యవస్థాపకుడు డా.ఎం.వీ.వీ.ఎస్.ముర్తి మంగళవారం సాయంత్రం అలాస్కా రాష్ట్రంలోని ఆంకరేజ్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కాలిఫోర్నియా నుండి అలాస్కాలోని వన్యప్రాణులను సందర్శించే నిమిత్తం ఆయన తన స్నేహితులతో కలిసి అలాస్కా ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం గీతం విశ్వవిద్యాలయాల నడుమ అంగీకార ఒప్పంద సంబంధిత కార్యక్రమంలో డా.మూర్తి చివరిసారిగా పాల్గొన్నారు. ఆఖరివరకు ప్రవసంలో సైతం గీతం సంస్థల కోసమే పాటుపడిన దార్శనికుడు మూర్తి అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. మూర్తి భౌతికకాయాన్ని తీసుకుని యార్లగడ్డ స్వదేశానికి తరలిరానున్నారు.

సిలికానాంధ్ర సంజీవనికి మరో నాలుగు కోట్లు విరాళాలు.

విరాళాల సేకరణ కోసం కూచిపూడిలో ఆదివారం నిర్వహించిన సంజీవనిధామ్‌- 2 కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన దాతలు 35లక్షలు అందించారు. కూచిపూడి చుట్టుపక్కల గల 150 గ్రామాల ప్రజల కోసం నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవని మల్టీస్పెషాల్టీ ఆసుపత్రిని అక్టోబర్‌ 18న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా విరాళాల సేకరణ కోసం నిర్వహించిన సంజీవనిధామ్‌-2 కార్యక్రమాన్ని హైదరాబాద్‌, అమెరికా, కూచిపూడి ప్రాంతాల్లో నిర్వహించగా రూ. 4.10 కోట్లు విరాళాలుగా వచ్చినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కూచిపూడిలో ముందుగా గ్రామానికే చెందిన పామర్తి శివకుమార్‌ రూ. 56 వేలు సాయం చేశారు. తెదేపా మండల మాజీ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట్రావు, మొవ్వకు చెందిన మండవ సుగుణావతిలు రూ. 6 లక్షలు అందించగా గుత్తా హనుమంతరాలు(గూడపాడు) రూ. 5లక్షలు, లింగమనేని రామస్వామి (పెదపూడి) రూ. 3.03లక్షలు, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన(పామర్రు), సూరపనేని రామకృష్ణ(పెడసనగల్లు), దండమూడి బలరామకృష్ణ(కూచిపూడి), సూరపనేని కృష్ణమోహన్‌లు రూ. 3 లక్షలు చొప్పున, కాశీభొట్ల నారాయణమూర్తి రూ. 1.50 లక్షలు, డాక్టర్‌ జి.సుదర్శనరావు(వీరంకిలాకు) రూ. లక్ష అందించారు. కార్యక్రమంలో జయహో కూచిపూడి సభ్యులు, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సరికొత్త కూచిపూడికి నాంది

కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లు… కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి గ్రామం. శతాబ్దాల కిందటే ప్రపంచానికి నృత్యరీతుల్ని నేర్పిన ఈ గ్రామంలో నేటికీ కనీస వసతులు లేకపోవడాన్ని గమనించింది సిలికానాంధ్ర సంస్థ. అందుకే ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని తెలుగు వెలుగు కనిపించేలా అక్కడ వివిధ అభివృద్ధి పనులు చేపడుతోంది.కూచిపూడి… ఆ పేరులో తెలుగుదనం వినిపిస్తుంది. ఆ నాట్యంలో తెలుగుదనం కనిపిస్తుంది. ఈ నృత్యం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందితే, అది పుట్టినగడ్డ అయిన కూచిపూడి గ్రామంలో మాత్రం వెనకబాటు కనిపిస్తోంది. కూచిపూడి అలాంటి పరిస్థితిలో ఉండటాన్ని చూసిన సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్‌ అక్కడి పరిస్థితిని అమెరికాలోని సంస్థ కార్యవర్గంతో చర్చించారు. కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని దాని రూపురేఖలు మార్చుదామన్న ఆయన ఆలోచనకు వారంతా మద్దతు పలికారు. అమెరికాలో తెలుగు భాష, కళల అభివృద్ధికి కృషి చేసే సిలికానాంధ్ర సంస్థ 2015లో కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని ముందుగా పారిశుద్ధ్యంపైన దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థుల్లో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంపైన అవగాహన కల్పించి ఆచరించేలా చేశారు. చెత్తను వీధుల్లో పడేయకుండా ఎక్కడికక్కడ చెత్త డబ్బాలని పెట్టారు. రోజూ ఆటోమీద చెత్తను తరలించేలా ఏర్పాటుచేశారు. ఇందిరానగర్‌ కాలనీలో చాలా ఇళ్లల్లో మరుగుదొడ్లు లేకపోవడాన్ని గుర్తించి పరిస్థితిని మార్చడానికి పెద్ద యజ్ఞమే చేసింది సిలికానాంధ్ర. కాలనీలోని ప్రతి ఇంటికీ వెళ్లి మరుగుదొడ్లను నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపిన వారికి ప్రభుత్వం ఇచ్చే డబ్బుకు అదనంగా రూ.10వేలు ఇచ్చి మరుగుదొడ్లు నిర్మింపజేశారు. పోరంబోకు స్థలాల్లో ఉండేవారికి పూర్తి ఖర్చు సంస్థే భరించి నిర్మాణాలు పూర్తిచేసింది. ఇలా గ్రామంలో 170 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించి వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా మార్చినందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకుంది సిలికానాంధ్ర సంస్థ. ఒకప్పుడు వర్షం కురిస్తే మోకాళ్లలోతున బురదలో ఇందిరానగర్‌ కాలనీలోని ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చేది. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా రూ. 4కోట్ల విరాళాల్ని సేకరించి 8కి.మీ. మేర కాలనీతోపాటు కూచిపూడి అగ్రహారంలోని ప్రధాన వీధుల్ని సిమెంట్‌ రోడ్లుగా మార్చారు. కాలనీలో అన్ని ఇళ్లకూ నీటి కుళాయిలు ఏర్పాటుచేశారు. త్వరలో ఊళ్లోని ప్రతి ఇంటికీ కుళాయిలు ఏర్పాటుచేయాలనేది సంస్థ సంకల్పం. గ్రామంలో పాత వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బుల్ని ఏర్పాటుచేశారు. ఎన్నో ఏళ్లుగా పూడిపోయిన గ్రామంలోని చారిత్రక బావిని బాగు చేయించారు. ఒకప్పుడు కూచిపూడి బస్టాండ్‌ వసతుల లేమితో, ఆవరణలో ముళ్ల పొదలు పెరిగి మురుగు గుంతలతో, చెత్త కుప్పలతో ఉండేది. స్వచ్ఛ కూచిపూడిలో భాగంగా యువత, ప్రజల సహకారంతో బస్టాండ్‌లోని చెత్తను పూర్తిగా తరలించి, మురుగు తొలగించి గుంతల్ని పూడ్పించారు. అనంతరం పూలమొక్కలు నాటి బస్టాండ్‌ ఆవరణని అందంగా మార్చారు. బస్టాండ్‌ గోడలకు రంగులువేయించి కూచిపూడి నృత్య భంగిమల్ని పెయింట్‌ చేయించారు. రూ.27 లక్షలు ఖర్చుచేసి కూచిపూడి ప్రాథమిక పాఠశాలతోపాటు, కూచిపూడి ఓరియంటల్‌ సంస్కృతోన్నత పాఠశాలలో తరగతి గదుల్ని బాగుచేయించి ఆహ్లాదపరిచే కొత్త రంగులు వేశారు. డెస్క్‌లతో కూడిన బల్లల్ని వేయించారు. రూ.10లక్షలు పెట్టి కూచిపూడి పంచాయతీ కార్యాలయాన్నీ! కూచిపూడితోపాటు ఆ చుట్టుపక్కల గ్రామాలలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బంది పడటాన్ని గుర్తించింది సిలికానాంధ్ర. ఈ సమస్యకు పరిష్కారంగా స్థానికంగా సువిశాలమైన ప్రదేశంలో 200 పడకలతో రూ.50 కోట్లు వెచ్చించి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. దీనిద్వారా మచిలీపట్నం, పామర్రు, అవనిగడ్డ, గుడివాడ, పెనమలూరు తదితర నియోజకవర్గాల్లోని 100కిపైగా గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందనున్నాయి. ఈ ఆసుపత్రిలో సేవలందించేందుకు అమెరికాలో స్థిరపడిన 70 మంది ప్రవాస వైద్యులు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. టెలీ మెడిసిన్‌తోపాటు అప్పుడప్పుడూ ఆసుపత్రికే వచ్చి వీరు సేవలు అందిస్తారు. ఈ దసరా నుంచీ హాస్పిటల్‌లో సేవలు మొదలవుతాయి. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన నిధుల్ని సేకరించడానికి ప్రత్యేకంగా విద్యార్థులూ, యువతతో క్లబ్‌ ఏర్పాటుచేశారు. సిలికానాంధ్ర నిధులకు అదనంగా వీరంతా తమ కళల్ని ప్రదర్శించి విరాళాలు రాబట్టి వాటిని ఆసుపత్రి నిర్మాణానికి అందిస్తారు. ‘ప్రజా సహకారంతో కూచిపూడిని ఆకర్షణీయ సాంస్కృతిక వారసత్వ గ్రామంగా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యం’ అంటారు కూచిభొట్ల ఆనంద్‌.

ప్రపంచవ్యాప్తంగా మనబడి తరగతులు ప్రారంభం


ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాలు, ముఖ్యంగా అమెరికాలోని 35 రాష్ట్రాలలోని 260కి పైగా కేంద్రాల్లో ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యా సంవత్సరానికి గాను సెప్టెంబర్ 8న తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో 10 వేల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా మనబడి నూతన విద్యా సంవత్సరం తెలుగు భాషాభిమాని, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో చికాగోలో ప్రారంభం కావడం మరొక విశేషం. సిలికానాంధ్ర మనబడి ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించడం గొప్ప కార్యక్రమమని, అందులోనూ మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందని వెంకయ్య నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, ప్రతిష్టాత్మక (WASC)వాస్క్ ఎక్రిడియేషన్, పలు స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు లభించిన ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడి అని మనబడి డీన్ (అధ్యక్షుడు) రాజు చమర్తి పేర్కొన్నారు. పదకొండేళ్లుగా మనబడి ద్వారా 45 వేల మందికి పైగా చిన్నారులకు తెలుగు నేర్పించామని ఆయన తెలిపారు. అమెరికా వ్యాప్తంగా 260కి పైగా ప్రాంతాలలో ప్రారంభమైన మనబడిలో తెలుగు మాట్లాడటం, బాలానందం, తెలుగుకు పరుగు, పద్యనాటకం, తెలుగు పద్యం, నాటకోత్సవాలు, పిల్లల పండుగలు వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు మన కళలు, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగిస్తున్నామని మనబడి అభివృద్ధి ఉపాధ్యక్షుడు శరత్ వేట తెలిపారు. సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరంలో ప్రవేశం కావాలనుకున్న వారు 1-844-626-2234 కు కాల్ చేయవచ్చని మనబడి ఉపాద్యక్షుడు దీనబాబు కొండుభట్ల కోరారు. మనబడి విజయాలకు కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, భాషా సైనికులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. లాస్ ఏంజిలస్‌లో డాంజి తోటపల్లి, న్యూజెర్సీలో శరత్ వేట, డాలస్‌లో భాస్కర్ రాయవరం, సిలికాన్ వ్యాలీలో దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, స్నేహ వేదుల, రత్నమాల వంక, లక్ష్మి యనమండ్ల, జయంతి కోట్ని, శ్రీరాం కోట్ని , చికాగోలో సుజాత అప్పలనేని, వెంకట్ గంగవరపు, వర్జీనియా నుంచి శ్రీనివాస్ చివలూరి, మాధురి దాసరి, గౌడ్ రామాపురం, ఉత్తర కెరోలిన నుంచి అమర్ సొలస, అట్లాంటా నుంచి విజయ్ రావిళ్ళ తదితరులు, మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తల సహకారంతో నూతన విద్యా సంవత్సర తరగతులు వైభవంగా ప్రారంభమయ్యాయి.




















అమెరికావ్యాప్తంగా ఉల్లాసంగా మనబడి “తెలుగుకై పరుగు”


అమెరికాలోని 9నగరాల్లో సిలికానాంధ్ర మనబడి “తెలుగుకు పరుగు” 5కె రన్/వాక్ మొదటి విడత కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. “ఆరోగ్యమే మహాభాగ్యం-ప్రతి అడుగూ అక్షరానికి అంకితం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన నాయకత్వంతో ముందుకు తీసుకువెళ్లారు. తెలుగుకు పరుగు సమన్వయకర్త వెంకట్ దిడుగు మాట్లాడుతూ తెలుగువారిలో ఆరోగ్యం పట్ల మరింత ఆవగాహన కల్పించటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నం స్ఫూర్తిజ్యోతి అంధ బాలబాలికల సేవా సంస్థకు ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులను అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అమెరికాలోని డిట్రాయిట్, చికాగో, మేరీలాండ్, న్యూజెర్సీ, కాన్సస్, లూయివిల్, బేఏరియా-సున్నీవేల్, బేఏరియా- ప్లెసెన్టన్, లాస్ఏంజెల్స్ తదితర నగరాల నుండి పెద్దసంఖ్యలో తెలుగుభాషాభిమానులు, పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. పూర్ణ చిటినేని, సుధాకర్ కుచిభోట్ల, శ్రీధర్ చిగులపల్లి, మల్లిఖార్జునరావు నంబూరి, శ్రీధర్ బండ్లమూడి, శిరీషపొట్లూరి, వంశీ గోపు, గౌడ్ రామాపురం, నాగ ఆకెళ్ళ, సాయి సుందరి, వెంకట్ గంగవరపు, రఘురాం తాడిమళ్ళ, విజయ్ అడ్డాల, రాత్నేస్వర్ మర్రె, రవి గుమ్మడిపుడి తదితరులు ప్రాంతీయ సమన్వ్యకర్తలుగా వ్యవహరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని దేశాలకు విస్తరిస్తామని మనబడి కులపతి చమర్తి రాజు తెలిపారు.



















చికాగోలో అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలు


సిలికానాంధ్ర మనబడి ఈ వారంతం చికాగోలో ఆరవ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది. ఈ ఆటల విజయానికి మనబడి భాషాసైనికులు అప్పలనేని సుజాత, భమిడి మంజుల, దామరాజు మాలతి,మరి ఎంతో మంది కార్యకర్తల అవిరామ కృషి మూల కారణం. ఈ ఏడాది దేశవిదేశాల్లో పలు నగరాలలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలలో 1200 మంది ప్రాంతీయ పోటీలలో తలపడి, 200 మంది నాలుగు ప్రప్రాంతీయ(జోనల్స్)లో పోటీపడి, అందులో నెగ్గిన 70 మంది మెరికలు ఈ తుది పోటీలలో (ఫైనల్స్) చికాగోకు వచ్చి పాల్గొన్నారు. “పలుకే బంగారం-పదమే సింగారం” అన్న నినాదం సాగిన ఈ తెలుగు మాట్లాట పోటీలలో, “పార్ష్ణిగ్రాహుడు”, “ఉత్ప్రేక్షాలంకారం”, వంటి క్లిష్టమైన పదాలను వాసి, “చేత వెన్నముద్ద చెంగల్వపూదండ ” పద్యాలను పూరించి, ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. తెలుగు వ్యాకరణం, జానపద గేయాలు, తెలుగు ఆటలు, తెలుగు వారి చరిత్ర, మన మహారాజులు, ఇలా ఎన్నో అంశాలలో పిల్లల చూపిన ప్రతిభ అమోఘం. ఈ ఆటల పోటీల అధ్యక్షుడు, అంతర్జాతీయంగా వీటిని నిర్వహించిన నిడమర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ “ఈసారి తెలుగు మాట్లాట ప్రధాన ఇతివృత్తం తెలుగు సాహితీ సాంప్రదాయాలని, దానిపై పిల్లలు చూపిన పదును చూస్తుంటే మన సంస్కృతి, మన తెలుగు భవిష్యత్తుకు ఎటువంటి ఆపదలేదని” అన్నారు.

ఈ ఆరవ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీల ‭విజేతలు:

బుడతలు (5-9 ఏళ్ల పిల్లలు):
paదరంగం: 1. పోలకొండ సమ్యుత (Samyutha Polaconda) 2. కొణతాలపల్లి శ్రీఫల శక్తిధర్ (Sreephala Shakthidhar Konatalapalli).
తిరకాటం: 1. ఉపాధ్యాయుల ఆదిత్య కార్తిక్ (Adithya Karthik Upadhyayula) 2. ఐషా షేక్ (Aisha Shaik)

సిసింద్రీలు (10-14 ఏళ్ల పిల్లలు):
పదరంగం: 1. అరుల్ కొల్ల (Arul Kolla) 2. తాడేపల్లి అభిరామ్ (Abhiram Tadepalli)
తిరకాటం: 1. ఇంద్రగంటి ఆమని (Aamani Indraganti) 2. ఘంటసాల శ్రీవైష్ణవి (Sri Vaishnavi Ghantasala)

చికాగోలో తెలుగు మాట్లాట అంతర్జాతీయ పోటీలు జరగడం ఇది రెండవ సారి. సుజాత మాట్లాడుతూ “ఈ వారాంతంలో సుమారు 200 తెలుగు కుటుంబాలు ఇక్కడకు విచ్చేసి, ఈ ఆటలు చూసి ఆనందించారు. చికాగో పరిసర ప్రాంతాలలో సిలికానాంధ్ర మనబడి ఈ ఆటల ద్వారా మరింత వ్యాప్తి చెందినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సంకల్పానికి సహకరించిన భాషాసైనికులకి పేరుపేరునా ధన్యవాదాలు” అన్నారు. మనబడి ద్వారా సిలికానాంధ్ర పిల్లలకు తెలుగు నేర్పడమే కాకుండా, తెలుగు మాట్లాట వంటి కార్యక్రమాలు చేబడుతోంది. మనబడి కొత్త విద్యాసంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభం అవుతోంది. మీరు, మీ పిల్లలను మనబడి లో జేర్పించి, మన భాష నేర్పడమే కాకుండా Fఒరైగ్న్ ళంగూగె ఛ్రెదిత్స్ కూడా పొందండి” అని డిజిటల్ మనబడి మరియు మనతరం ఉపాధ్యక్షుడు రాయవరం విజయభాస్కర్ తల్లిదండ్రులను అభ్యర్దించారు. మరి ఇంకా ఎంతో మంది తెలుగు పిల్లలు ఇలా అమెరికా, కెనడాలో పుట్టి, తెలుగు నేర్చుకుని మనభాషకు వన్నె తెస్తారని ఆశిద్దాము. భాషాసేవయే భావితరాల సేవ!!




సిలికాన్ వ్యాలీలో ఘనంగా అన్నమాచార్య జయంతి

సిలికానాంద్ర ఆద్వర్యంలో అన్నమాచార్య 610వ జయంతి వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. శాన్ జోస్ లోని చారిత్రాత్మక హోవర్ థియేటర్ లో ఈ వేడుకలు జరిగాయి. కొండిపర్తి దిలీప్, కొండుభట్ల దీనబాబు, చామర్తి రాజు, వంకా రత్నమాల, కూచిభొట్ల శాంతి తదితరుల ఆద్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది. దీనికి సంబందించిన చిత్రాలు ఇవి.




సిలికాన్ వ్యాలీలో సిలికానాంధ్ర 17వ వార్షికోత్సవం


కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో సిలికానాంధ్ర సంస్థ 17వ వార్షికోత్సవ సంబరాల్ని ఆదివారం నాడు ఘనంగా జరుపుకున్నారు. క్యూపర్టీనో నగరం డియాంజా కాలేజీలో జరిగిన ఈ వేడుకలకు సిలికానాంధ్ర కుటుంబం సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు, దాతలు హాజరయ్యారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం సంప్రదాయ కార్యక్రమాలతో తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది. మారేపల్లి వెంకటశాస్త్రి వేదపఠనంతో ప్రారంభమైన ఈ వార్షికోత్సవ వేడుకలకు, విచ్చేసిన అతిధులకు తాటిపాముల మృత్యుంజయుడు ఆహ్వానం పలుకుతూ గత పదహారేళ్ళుగా సిలికానాంధ్ర జరిపిన ప్రయాణాన్ని, చేరుకొన్న మైలురాళ్ళను పునరావలోకనం చేసారు. దిలీప్ కొండిపర్తి, మాధవ కిడాంబి సారథ్యంలో ప్రదర్శించిన ‘హాస్యవల్లరి ‘లోని లఘు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ఆధునిక సాంకేతికాభివృద్ధి తెస్తున్న ఇబ్బందులు, అంతర్జాలంలో జరుగుతున్న పెళ్ళిచూపులు, వివిధ భాషాసంస్కృతుల మేళమైన హైద్రాబాదు నగర జీవిత చిత్రాల్ని ముఖ్యాంశాలుగా రచించిన ఈ నాటికలు సభను నవ్వులతో ముంచెత్తాయి. మాధవ కిడాంబి, రాంబాబు మంచికంటి, శాంతివర్ధన్ అయ్యగారి, లలిత అయ్యగారి, అనిమేష్ కొండిపర్తి, మూర్తి వేదుల, సతీష్ ముచ్చెర్ల సమర్థవంతంగా పాత్రలను పోషించారు. రాంపల్లి సదాశివ మిమిక్రీ, మాట్లాడేబొమ్మను ప్రదర్శించారు. ‘జానపద బ్రహ్మ ‘ మానాప్రగడ నరసిం హమూర్తి కుమారులు సాయి, శ్రీనివాస్ లు పాడిన జానపద గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చివరగా, ‘వికటకవి తెనాలి రామకృష్ణ ‘ నాటకం ప్రదర్శించబడింది. రావు తల్లాప్రగడ రచించగా, తెనాలి రామకృష్ణుని పాత్రలో ప్రముఖ నటుడు అక్కిరాజు సుందర రామకృష్ణ ఒదిగిపోయారు. హాస్యచతురోక్తులతో, మధురంగా ఆలపించిన పద్యాలతో సభికులనుండి కరతాళ ధ్వనులను అందుకున్నారు. ఇతర పాత్రల్లో కూచిభొట్ల శాంతి, ఆర్చీశ్ ప్రఖ్య, శ్రీవేద శ్రీపాద, శ్రీదేవి అంగజాల, సూరజ్ దశిక, శ్రీనివాస శ్రీపాద, నారయణన్ రాజు, రావు తల్లాప్రగడ, సదాశివ్ రామపల్లి, శ్రీనివాస్ మంద్రప్రగడ, శర్మ యేడిద, వంశీ ప్రఖ్య, అభిరాం కల్లూరు నటించారు. హైస్కూల్ చదువుతున్న వరకూర్ ఈష మొదటిసారిగా కీబోర్దు సహకారాన్ని అందించింది. వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి అధ్యక్షోపన్యాసం చేస్తూ సిలికానాంధ్ర సాధించిన విజయాలను, రాబోయే సంవత్సరాలలో చేపట్టే కార్యక్రమాలను సభికులకు వివరించారు. సిలికానాంధ్ర మనబడి కులపతి చమర్తి రాజు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ గత పదకొండు సంవత్సరాలలో 35000 మందికి పైగా ప్రవాస బాలలకు తెలుగు నేర్పుతున్న మనబడి అభివృద్ధిని వివరిన్స్తూ, ఈ కృషి వెనకాల ఉన్న కార్యకర్తలను, ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించి అభినందించారు. 2018-19 సంవత్సరానికి మనబడి ప్రవేశాలు జరుగుతున్నాయని, manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్య కోశాధికారి కొండుభట్ల దీనబాబు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, మరియు సంగీత నృత్యాలకోసం ఏర్పాటు చేసిన ‘సంపద ‘ అకాడమీ కార్యక్రమ వివరాలను సభికులతో పంచుకొన్నారు. మహారాజపోషకుడు, హృద్రోగ నిపుణుడు డాక్టర్ లక్కరెడ్డి హనిమిరెడ్డి చైర్మన్ కూచిభోట్ల ఆనంద్ ఆంధ్రప్రదేశ్ లోని కూచిపూడి గ్రామంలో నిర్మిస్తున్న సంజీవని వైద్యశాల అందించబోయే సేవలను అభినందిస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను, దాతలను సత్కరించారు. ఈ వేదికపైననే శ్రీ విళంబి ఉగాది ఉత్సవంలో జరిగిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ‘ఎనుకుదురాట – అచ్చ తెలుగు అవధానం’ మాతా కోటేశ్వరరావు, మాతా శాంకరీ దేవి సంకలనం చేసిన పుస్తకం ఆవిష్కరించబడింది జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అనిల్ అన్నం, సాయి కందుల, విజయసారధి, రవి చివుకుల, కిశోర్ గంధం, వంశీ నాదెళ్ళ, రత్నమాల వంక, స్నేహ వేదుల, వసంత మంగళంపల్లి, రాజశేఖర్ మంగళంపల్లి సహాయం అందజేసారు. అందమైన కార్యక్రమాలతో పాటు పసందైన పదహారణాల తెలుగు భోజనంతో కార్యక్రమం ఆద్యంతం తెలుగుతనం ఉట్టిపడేలా సాగింది.



ప్రారంభోత్సవానికి ముస్తాభైన సిలికానాంద్ర సంజీవని


కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో, ఐదంతస్తులతో రూపుదిద్దుకున్న ‘సంజీవని’ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్దమైంది. వచ్చే విజయదశమి నాటికీ ఈ ఆసుపత్రిని ప్రారంభించాని రాత్రింబవళ్ళు సిలికానాంద్ర బృందంకష్టపడి పనిచేస్తున్నారు. సంజీవని ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న వివిధ ఆధునిక సౌకర్యాల గురించి సిలికానాంద్ర చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ కొన్ని చిత్రాలను విడుదల చేశారు. వాటిని తిలకించండి.







Siliconandhra sanjeevini ready to be inaugurated-tnilive international

సంజీవిని పది లక్షలు ఇచ్చిన కేసీపీ

కూచిపూడిలో నిర్మాణంలో ఉన్న సిలికానాంద్ర సంజీవని వైద్యశాలకు కేసీపీ యాజమాన్యం తరపున కేసీపీ సీఓఓ జీ.వెంకటేశ్వరరావు రూ.పది లక్షల ఆర్ధిక సాయం ఆదివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలికానాంద్ర వ్యవస్థాపక అద్యక్షుడు కూచిభోట్ల ఆనంద్ ఈ ప్రాంత పేద ప్రజలకు వైద్యసేవలందించేలా దాతల సాయంతో ఏర్పాటు చేస్తున్న వైద్యశాల నిర్మాణానికి తమ చక్కర కర్మాగారం తరపున ఈ సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

సిలికానాంద్ర సంజీవినికి రూ.6లక్షల విరాళం

కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో నిర్మిస్తున్న సిలికానాంద్ర సంజీవని వైద్యశాలకు ఒక గది నిర్మాణానికి అవసరమైన రూ. ఆరు లక్షలను కూచిపూడి రోటరీ క్లబ్ వ్యవస్థాపక అద్యక్షుడు డా.గొట్టిపాటి రామకృష్ణారావు వితరనగా బుధవారం అందించారు. ఆయన సతీమణి గొట్టిపాటి అమ్మాజీ జ్ఞాపకార్ధం సిలికానాంద్ర వ్యవస్థాపక అద్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ కు చెక్కు రూపంలో అందింకాహ్రు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారి పిన్నమనేని భీమశంకరరావు, గొట్టిపాటి శ్రీనివాస్, పెద్దలు పాల్గొన్నారు.

సిలికానాంధ్ర మనబడికి నాటా పురస్కారం

గత 10 సంవత్సరాలలో అమెరికా వ్యాప్తంగా 35,000 మంది విద్యార్ధులకు తెలుగు భాష నేర్పిస్తూ, తెలుగు భాషని ప్రాచీన భాషనుండి ప్రపంచ భాషగా తరువాతి తరానికి అందిస్తున్న సిలికానాంధ్ర మనబడికి​ ​ఉత్తర అమెరికా తెలుగు సమితి (​నాటా​)​ ‘విద్యా ప్రదాయని’ పురస్కారం అందించింది. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన నాటా ​మెగా కన్వెన్షన్ వేదిక మీద​ నాటా​ అడ్వయిజరీ ​ ​కౌన్సిల్ ఛైర్మన్ ​ప్రేం కుమార్ రెడ్డి​​, ​ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ​తదుపరి ​అధ్యక్షులు​ ​రాఘవ రెడ్డి ​​తదితరుల చేతులమీదుగా మనబడి ఉపాధ్యక్షులు​ శరత్ వేట ​​ఈ పురస్కారం అందుకున్నారు. తెలుగు భాష వ్యాప్తికి, మనబడి కార్యకలాపాలను గూర్చి ప్రత్యేక ​ఆడియో విజువల్ ని ప్రదర్శించి, మనబడి బృందం చేస్తున్న కృషిని అభినందించారు.​ తెలుగుభాషాభివృద్ధికై మనబడి సేవలను ​గుర్తించి ఇంతటి విశిష్ట పురస్కారాన్ని అందించినందుకు శరత్ వేట, నాటా కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా శరత్ వేట మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాలలో 1200 మందికి పైగా ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు భాషా సైనికుల సహకారంతో గత పది సంవత్సరాల​కు పైగా​ అమెరికా, కెనడా​లతో పాటు 10 ​ఇతర ​దేశాలలో 35​,000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు భాష ​నేర్పించామన్నారు. గత సంవత్సరం 9,000 కు పైగా విద్యార్థులు మనబడిలో నమోదు చేసుకున్నారని తెలిపారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ACS-WASC (Western of Association of Schools and Colleges) వారి గుర్తింపు పొందిన ఏకైక తెలుగు బోధనా విధానం సిలికానాంధ్ర మనబడి అని పేర్కొన్నారు. భారత దేశంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి విద్యా విధానానికి అమెరికాలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కు అర్హత కూడా లభిస్తోందన్నారు. మనబడి సంచాలకులు ఫణి మాధవ్ కస్తూరి మాట్లాడుతూ సిలికానాంధ్ర మనబడి 2018-19 విద్యాసంవత్సరపు తరగతులు సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమౌతున్నాయని, వెబ్‌సైట్‌ http://manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ‘భాషాసేవయే భావితరాల సేవ’ అనే స్ఫూర్తితో సిలికానాంధ్ర మనబడి రేపటి తరాన్ని తెలుగు భాష సారథులుగా తీర్చిదిద్దడానికి ​అహర్నిశలూ కృషి చేస్తుందని​ ​అన్నారు.

అమెరికాలో ముందడుగు వేస్తున్న “మనబడి”–TNI ప్రత్యేకం


అమెరికాలోని తెలుగువారు తమ పిల్లలతో అక్షరాలు దిద్దిస్తున్నారు. గుణింతాలు వల్లెవేయిస్తున్నారు. చూచిరాత రాయిస్తున్నారు. శతకాలు నేర్పుతున్నారు. 35 రాష్ట్రాలలో పదివేల మంది బాలలతో ‘మనబడి’ కళకళలాడుతోంది.

**అమెరికాలో ఉన్న మనవళ్ళకూ, మనవరాళ్ళకూ బోలెడన్ని కబుర్లు చెప్పాలని ఆశగా ఎదురు చూసే తాతయ్యలకూ నానమ్మలకూ ఎంత నిరాశ. వాళ్ళకు మాత్రం పెద్దపెద్ద కోరికలెం ఉంటాయి? మనవడో మనవరాలో “చేతవెన్న ముద్దా…..” చెబితే వినాలని ఉంటుంది. “ముద్దుగారే యశోద….” పాట పాడితే మురిసిపోవాలని అనుకుంటుంది. గౌరవనీయులైన తాతగారికి అని సంబోధిస్తూ ఉత్తరం రాస్తే నలుగురికీ వినిపించాలని ఉంటుంది. పెద్దల దాకా ఎందుకు? తమ పిల్లలు కమ్మని తెలుగు మాట్లాడాలని గుండ్రని అక్షరాలూ రాయాలనీ కన్నవారికి మాత్రం ఉండదేమిటి? ఆలోటు తీర్చడానికే 2007 ఫిబ్రవరి 21న ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా సిలికానాంధ్ర నేతృత్వంలో మనబడి ప్రారంభమైంది. సర్వజిత్ ఉగాది సుముహూర్తాన ఘనంగా అక్షరభ్యాస కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయబద్దంగా అక్షరాలు దిద్దించాలంటే పలకా బలపాలు కావాలి. అమెరికాలో దొరుకుతాయా? అన్న సందేహం. ప్రయత్నిస్తే దొరక్కపోతాయా అన్న ఆశావాదం. అంగడి అంగడి తిరిగారు. అంజనమేసి గాలించారు. అనుకున్నది సాధించారు. ముహూర్తం సమయానికంతా పంచెకట్టులో నాన్నలోచ్చారు. పట్టుచీరలలో అమ్మలోచ్చారు. అ, ఆ, ఇ, ఈ కన్నవారు చేయిపట్టుకుని రాయిస్తుంటే…..పసివాళ్ళు బుద్దిగా దిద్దుకున్నారు. వందమంది పిల్లలతో కాలిఫోర్నియాలో ప్రారంభమైన తెలుగుబడి ముప్పై ఐదు రాష్ట్రాలకు నేటికి విస్తరించడానికి ఎంతో సమయం పట్టలేదు.

*** ఒప్పించి.. మెప్పించి
అసలే చదువుల ఒత్తిడి. దానికితోడు వారాంతపు బడా? అయినా అమెరికాలో ఉంటున్న పిల్లలకి తెలుగు అక్షరాలూ అవసరమా? అని వాధించినవారు ఉన్నారు. మనబడి వాళ్ళందర్నీ ఒప్పించింది. మెప్పించింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి సంఖ్య పదహారు కోట్లని అనుకుందాం. అందులో సగానికి సగం మంది ..రాష్ట్రం బయటో.. దేశం బయటో ఉన్నారు. వాళ్ళ వరకూ తెలుగు అర్ధం చేసుకోగలరు. మాట్లాడగలరు. రాయగలరు, చదవగలరు. సమస్యంతా రేపటి తరానికే ఓ పదేళ్ళ తర్వాతో పదిహేనేళ్ళ తర్వాతో ఆ పిల్లలు తెలుగు అర్ధం చేసుకోలేని , తెలుగు మాట్లాడలేని తెలుగు రాయలేని, తెలుగు చదవలేని తెలుగువారిగా మిగిలిపోతారు. భాషనే మర్చిపోయినపుడు మాతృ దేశం, మాతృ రాష్ట్రం మాత్రం ఏం గుర్తుంటాయి? అలా ఓ లంకె తెగిపోతుంది. మూలాలనేవీ సమూలంగా నాశనమైపోతాయి. అయినా అక్షరమంటే అక్షరమొక్కటే కాదు. అంతర్లీనతగా అందులో చరిత్ర ఉంది. సంస్కృతీ సంప్రదాయాలున్నాయి అక్షరాన్ని వదులుకుంటే అన్ని వదులుకున్నట్లే. అందుకే అంత ఆందోళన. అమ్మ ఒళ్ళోనో , అమ్మమ్మ పర్యవేక్షణలోనో ఉన్నంత కాలం పిల్లలు మాతృభాషే మాట్లాడతారు. బడికెళ్ళడం మొదలు పెట్టాక తల్లిభాష మెల్లమెల్లగా దూరమవుతుంది.

**ముప్పై ఐదు రాష్ట్రాలకు విస్తరణ
అమెరికాలోని ముప్పై ఐదు రాష్ట్రాల్లో మనబడి తెలుగు పాఠాలు నేర్పుతోంది. గత విద్యా సంవత్సరంలో 9200 మంది మనబడిలో విద్యనభ్యసించారు. 800మంది ఉపాధ్యాయులు అక్షర సేవలో నిమగ్నమయ్యారు. వీరు కాకుండా ఐదు వందల మంది సమన్వయకర్తలుగా ఉన్నారు. పరోక్షంగా మనబడి కోసం మరొక నాలుగు వందల మంది ప్రచార కర్తలుగా ఉన్నారు. మనబడి అంటే…మన బడే. ప్రతి విద్యార్ధి విధిగా తెలుగులో మాట్లాడాలి. మాట్లాడే ప్రయత్నమైనా చేయాలి. ఆరేళ్ళు నిండిన బాలబాలికలు పాఠశాలలో ప్రవేశానికి అర్హులు. అక్షరమాలతో చదువు ప్రారంభం అవుతోంది. శనివారం లేదా ఆదివారం వారానికి ఒకరోజు బడి. అందరికి అనువైన ప్రాంతంలో పాఠశాల నిర్వహించుకుంటారు. పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, సంచులూ, టీషర్టులూ నిర్వాహకులే ఇస్తారు.

*** ప్రవేశం..ప్రసూనం..ప్రకాశం.. ప్రమోదం.. ప్రభాసం.. మొత్తం ఐదు తరగతులు
ఏడాదికో తరగతి. ఆగస్టు చివరి నాటికీ ప్రవేశ ప్రక్రీయ పూర్తవుతోంది. ప్రతి ఒక్కరూ ప్రవేశం నుంచే చదవాలని లేదు. ప్రాధమిక అవగాహనా ఉన్నవారిని నైపుణ్యాన్ని బట్టి ఏ ప్రసూనం లోనో చేర్చుకునే అవకాశమూ ఉంది. క్రమశిక్షణ విషయంలో కచ్చితంగా ఉంటారు. తొంబై శాతం హాజరు తప్పనిసరి. అంతకు తగ్గితే పరీక్షలకు అనుమతించరు. ఏటా స్నాతకోత్సవం ఘనంగా జరుగుతుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధ్రువపత్రాల్ని జారీ చేస్తుంది. బోధన ప్రణాళిక ఎంత పక్కాగా ఉంటుందంటే ..బదిలీ మీదో పదోన్నతి మీదో అమెరికాలోని మరో నగరానికి వెళ్ళినా……స్థానికంగా ఉన్న మనబడిలో చేరిపోవచ్చు. పాఠాలు కోల్పోయే ప్రసక్తే లేదు. వార్షిక రుసుము మూడు వందల డాలర్లు. ఫీజుల్లో చాలా వరకు పాఠశాల భవనం అద్దెలకే వెళ్ళిపోతుంది. అక్కడి చట్టాల ప్రకారం పాఠశాల ఆవరణ బీమా తప్పనిసరి అందుకూ కొంత చెల్లించాలి. భారత్ లో పుస్తకాలు ముద్రించి, అమెరికాకు తరలించడం అంటే వ్యయ ప్రయాసలతో కూడిన విషయం ఖర్చులతో పోలిస్తే ఆ మొత్తం నామమాత్రమే.

**ప్రత్యేక పాఠ్య ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ లో పుట్టి, తెలుగు వాతావరణంలో పెరుగుతూ తెలుగు నేర్చుకోవడం వేరు. మనదికాని దేశంలో, మనది కాని మాధ్యమంలో చదువుకుంటూ, మనది కాని వాతావరణంలో జీవిస్తూ తెలుగు నేర్చుకోవడం వేరు. ప్రాంతాన్ని బట్టి పాఠ్య ప్రణాళిక మారుతుంది. మారాలి కూడా. మనబడి ప్రణాళికా బృందం సభ్యులు తిరుమల పెద్దింటి శ్రీనివాస్, కూచిభొట్ల శాంతి, తూములూరు శంకర్, గుండుమల్ల మాణిక్యవల్లి, వసంత మంగళంపల్లి, ఓరుగంటి గోపాలకృష్ణ, రాయవరం భాస్కర్.. అమెరికాలో ఉంటున్న తెలుగు పిల్లల్ని దృష్టిలో ఉంచుకునే పాటాలు రాశారు. ఈ ప్రయత్నంలో తెలుగు విశ్వవిద్యాలయం, నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ సహకరిస్తున్నాయి.

**ఇప్పటి వరకు 35వేల మందికి బోధన
మనబడి ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 35 వేల మంది విద్యార్ధులకు తెలుగు భాషలో శిక్షణ ఇచ్చారు. వీరిలో ఎనిమిది వేల మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా పట్టాలను(పాస్ సర్టిఫికెట్స్) ఇప్పించారు. ప్రతి ఏటా అమెరికాలోని ప్రధాన నగరాల్లో స్నాతకోత్సవాలు అట్టహాసంగా నిర్వహించి విద్యార్ధులకు పట్టాలను ప్రధానం చేస్తున్నారు.పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ ప్రతి ఏటా ఈ పట్టాల ప్రధానోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు.

**WASC గుర్తింపు
అమెరికాలో మంచి విద్యా ప్రమాణాలు పాటించే సంస్థలకు ఆదేశంలో వెస్టర్న్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (WASC) సంస్థ గుర్తింపు ఇస్తుంది. మనబడికి ఈ సంస్థ గుర్తింపు ఇచ్చింది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన గుర్తింపుగా భావిస్తున్నారు. దీనితో పాటు అమెరికాలోని 28 స్కూల్ జిల్లాల్లో మనబడిని గుర్తించారు. ఇక్కడ ద్వీతీయ భాషగా తెలుగు నేర్చుకున్న విద్యార్ధులను పై తరగతుల్లో ప్రవేశానికి అనుమతిస్తున్నారు. అమెరికాలో ప్రారంభమైన మనబడి ప్రస్తుతం పన్నెండు దేశాలకు విస్తరించింది. చాలా దేశాల్లో ఉన్న తెలుగు వారి నుండి మనబడి శాఖను ప్రారంభించమని విజ్ఞప్తులు అందుతున్నాయి.

**పటిష్టవంతమైన యంత్రాంగం
సిలికానాంద్ర చేపట్టిన ప్రతి ప్రాజెక్టు దిగ్విజయం కావడానికి ఆ సంస్థలో ఉన్న సభ్యుల చిత్తశుద్దే కారణం తమ నాయకుడు కూచిభొట్ల ఆనంద్ కలలు కన్న ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ఆ సంస్థ సభ్యుల అంకితభావానికి నిదర్శనం. ఈ సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు ‘సిలికానాంద్ర’ను తన కుటుంబం లాగా భావిస్తూ శని, ఆదివారాల్లో పూర్తీ సమయాన్ని, మిగిలిన రోజుల్లో సాయంత్రం సమయాలు కేటాయిస్తున్నారు.

**పటిష్టమైన పాలనా వ్యవస్థ
మనబడి కులపతిగా రాజు చామర్తి వ్యవహరిస్తున్నారు. మనబడి వ్యవస్థను నడిపించడం కోసం ఆర్ధిక, సాంకేతిక వ్యవహారాలను కొండుభట్ల దీనబాబు చక్కబెడుతున్నారు. ఎప్పటికప్పుడు నూతన పాట్యంశాలను రూపొందించడంలో కూచిభొట్ల శాంతి ఆద్వర్యంలోని బృందం చురుకైన పాత్ర పోషిస్తుంది. కొండిపర్తి దిలీప్, వేట శరత్, రాయవరం భాస్కర్, డాన్జీ తోటపల్లి తదితరులు మనబడి నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తోంది. వచ్చే ఏడాది 11,000 మంది విద్యార్ధులను మనబడిలో చేర్పించే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిచినట్లు కూచిభొట్ల ఆనంద్ వెల్లడించారు. అమెరికాలోని మరికొన్ని రాష్టాల్లో ఇంకా కొన్ని దేశాల్లో మనబడి శాఖలను ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నట్లు ఆనంద్ తెలిపారు.

**విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రేరణ
అమెరికాలోని సిలికాన్ వ్యాలీకే పరిమితమై ఒకప్పుడు ప్రారంభమైన మనబడి ప్రపంచమంతా విస్తరించింది. మనబడి ప్రేరణతో సిలికానాంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. 2020 నాటికి ఈ విశ్వవిద్యాలయం పూర్తీ స్థాయిలో పని చేయడానికి ప్రణాళికలు సిద్దమయ్యాయి. సొంత గడ్డపై మాతృభాషను మరచిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం నలుమూలలకు తెలుగు భాష తీయదనాన్ని విస్తరింపజేసిన సిలికానాంధ్ర భాషా సైన్యానికి ‘ప్రతి ఒక్క తెలుగువాడు చెయ్యెత్తి జై కొడుతున్నాడు’. –కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.