అజిలాన్ షా హాకీ తుదిపోరుకి చేరుకున్న భారత సేన

మలేసియాలో జరుగుతున్న సుల్తాన్‌ అజ్లాన్‌ షా హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ విజయయాత్ర కొనసాగిస్తోంది. శుక్రవారం పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-0 గోల్స్‌ తేడాతో విజయం సాధించి దిగ్విజయంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా భారత ఆటగాళ్లు గోల్‌లు సాధించారు. మొదటి 30 నిమిషాల్లో ఆరు గోల్‌లు సాధించిన భారత్‌, చివరి అర్థ భాగంలో నాలుగు గోల్స్‌ చేసి విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుకు ఒక గోల్‌ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. సుల్తాన్‌ అజ్లాన్‌ షా టోర్నమెంటులో భారత్‌ ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో భారత్‌ ఆడిన ఐదు లీగ్‌ మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, ఒక డ్రాతో 13 పాయింట్లు సాధించింది. భారత స్ట్ర్రెకర్‌ మణ్‌దీప్‌ సింగ్‌ అద్భుతమైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. బుధవారం కెనడాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించి 7-3 గోల్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పోలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాడు మన్‌ప్రీత్‌సింగ్‌కు బదులు సురేంద్రకుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ విజయంతో టోర్నమెంటులో భారత్‌ మొత్తం ఐదు లీగ్‌ మ్యాచుల్లో 18 గోల్లు సాధించింది. 13 పాయింట్లతో తమ గ్రూపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. శనివారం దక్షిణ కొరియాతో భారత్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.

దోశను పిజ్జా చేసిన ముత్తయ్య

శ్రీలంక మాజీ బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచులతో బిజీబిజీగా ఉన్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రాక్టీస్‌ పూర్తయిన తర్వాత జట్టు ఆటగాళ్లందరూ టిఫిన్‌ చేయడానికి హోటల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ముత్తయ్య దోశను తింటున్నప్పుడు ఆటగాళ్లు ఫొటోలు తీశారు. సన్‌రైజర్స్‌ ఆటగాడు శ్రీ వత్స్‌ గోస్వామి ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. ‘ఇంతకంటే బ్రేక్‌ఫాస్ట్‌ ఎవరూ బాగా చేయలేరేమో..మురళీ సర్‌ ఎలా దోశ పని పడుతున్నారో చూడండి’ అంటూ శ్రీవత్స్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో ఫొటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.‘మురళీ ఏంచేసిన తన మార్క్‌ ఉంటుంది. బౌలింగ్‌ అయినా దోశ తినడం అయినా’అని కామెంట్లు పెడుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.ఐపీఎల్‌లో భాగంగా తొలుత సన్‌రైజర్స్‌.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడింది. ఈమ్యాచ్‌లో ఈ జట్టు ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

విజయ దుందుభి మోగించిన భారత హాకీ జట్టు

అజ్లాన్‌ షా హాకీ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కొనసాగించిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం భారత్‌ 7-3తో కెనడాను చిత్తు చేసి, మరో లీగ్‌ మ్యాచ్‌ మిగిలుండగానే ఫైనల్‌ బెర్తు సాధించింది. స్ట్రైకర్‌ మన్‌దీప్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను పది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్‌ కొట్టడం విశేషం. 20వ నిమిషంలో తొలి గోల్‌ కొట్టిన మన్‌దీప్‌.. 27, 29 నిమిషాల్లోనూ స్కోరు చేశాడు. వరుణ్‌ కుమార్‌ 12వ నిమిషంలో భారత్‌కు తొలి గోల్‌ అందించాడు. సగం సమయం ముగిసేసరికే భారత్‌ 4-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది 35వ నిమిషంలో కెనడా తొలి గోల్‌ కొట్టగా.. ఇంకో నాలుగు నిమిషాలకే అమిత్‌ రోహిదాస్‌ గోల్‌ సాధించి భారత్‌ ఆధిక్యాన్ని 5-1కి పెంచాడు. చివరి క్వార్టర్లో ఇరు జట్లూ తలో రెండు గోల్స్‌ సాధించాయి. వివేక్‌ ప్రసాద్‌ (55వ), నీలకంఠ శర్మ తలో గోల్‌ కొట్టారు. కెనడా 50, 57 నిమిషాల్లో గోల్స్‌ సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక డ్రాతో మొత్తం 10 పాయింట్లు సాధించిన భారత్‌.. ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. మరోవైపు మలేసియాపై 2-1తో నెగ్గిన కొరియా కూడా ఫైనల్‌ చేరింది. రెండు జట్ల మధ్య ఫైనల్‌ ఆదివారం జరుగుతుంది. శుక్రవారం నామమాత్రమైన తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ పోలెండ్‌ను ఢీకొంటుంది.

ఆ ముక్క బీసీసీఐ చెప్పాలి

ఐపీఎల్‌లో గతేడాది తనని ఎందుకు ఆడనివ్వలేదో బీసీసీఐయే సమాధానం చెప్పాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో బాల్‌టాంపరింగ్‌కు పాల్పడిన ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌వార్నర్‌లపై ఐసీసీ ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా స్వచ్ఛందంగా వీరిని నిషేధించడంతో గత సీజన్‌లో వీరు ఐపీఎల్‌ మ్యాచులు ఆడలేదు. శుక్రవారం రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున జెర్సీ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న స్మిత్‌ పై వ్యాఖ్యలు చేశాడు. మార్చి 29న అంతర్జాతీయ మ్యాచుల నిషేధం పూర్తవుతున్న సందర్భంగా ఈసారి ఐపీఎల్‌లో పాల్గొనేందుకు స్మిత్‌ తిరిగి రాజస్థాన్‌ జట్టులో చేరాడు. భుజం గాయం నుంచి కోలుకుంటే.. ఈనెల 25న కింగ్స్‌ XI పంజాబ్‌తో జరిగే మొదటి మ్యాచ్‌లో ఆడనున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ స్పాన్సర్‌ లక్ష్మి సిమెంట్స్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న స్మిత్‌ మీడియాతో మాట్లాడాడు. ఇకపై తాను అన్ని మ్యాచులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, గతడాది ఐపీఎల్‌లో తననెందుకు నిషేధించారో బీసీసీఐ మాత్రమే సమాధానం చెప్పాలన్నాడు . తిరిగి ఐపీఎల్‌ జట్టులో చేరడం తనకెంతో సంతోషంగా ఉందని, ఈ సీజన్‌లో బరిలో దిగేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

ఢిల్లీ భాజపా సీఎం అభ్యర్థిగా గౌతీ!

కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో బీజేపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా గంభీర్ ను ప్రకటించే అవకాశం!

ఐపీఎల్ ప్రసారాలు నిషేధించిన పాక్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2019 ప్రసారాలను పాకిస్తాన్‌లో నిషేధిస్తున్నామని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్‌ అహ్మద్‌ చౌద్రీ తెలిపారు. ఈమేరకు.. ‘ రాజకీయాలను, క్రీడలను వేరుగా చూడాలని భావించాం. కానీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) జరిగిన సమయంలో భారత ప్రభుత్వం, కంపెనీలు పాక్‌ క్రికెట్‌ పట్ల ప్రవర్తించిన తీరు మాకు గుర్తుంది. కాబట్టి ఐపీఎల్‌ ప్రసారాలు పాకిస్తాన్‌లో ప్రదర్శించబడటాన్ని మేము సహించలేం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఫిబ్రవరి 14న కశ్మీన్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు పీఎస్‌ఎల్‌ నాలుగవ సీజన్‌ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ భారత్‌ను ఇబ్బందుల పాలు చేస్తున్న కారణంగా.. భారత్‌లో పీఎస్‌ఎల్‌ ప్రసారాల్ని నిలిపివేస్తూ డీస్పోర్ట్‌ చానల్‌ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ వెనువెంటనే పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని స్పష్టం చేసింది. ఇక పాక్‌ ప్రధాని, ఆ దేశ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలను క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాదు రానున్న ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడకూడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పీసీబీ.. బీసీసీఐ, భారత ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేయాలని చూసింది. పుల్వామా ఘటనకు సంతాప సూచకంగా మిలిటరీ క్యా పులు ధరించినందుకు టీమిండియా ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది కూడా. కాగా మరో రెండు రోజుల్లో ఇండియన్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ 2019 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 23న జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లి మిస్టర్‌ కూల్‌ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టు… టీమిండియా కెప్టెన్‌ కోహ్లి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుతో తలపడనుంది. ఇద్దరు దిగ్గజాల జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గత సీజన్‌ విన్నర్‌గా నిలిచిన సీఎస్‌కే హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతుండగా… అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్‌ టైటిల్‌ గెలవాలని ఆర్సీబీ ఉవ్విళ్లూరుతోంది.

ఫర్వాలేదు. సిగ్గు వస్తుంది. అదొక హెచ్చరిక.

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో 2-3తో ఓటమి టీమ్‌ ఇండియాకు ఓ హెచ్చరికలా పనిచేస్తుందని రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌పై 2-0తో ఆధిక్యంలో ఉండి కూడా భారత్‌ సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. మే 30న ప్రపంచకప్‌ ఆరంభం కావడానికి ముందు కోహ్లీసేనకు ఇదే ఆఖరి సిరీస్‌. ‘‘మనం అలవోకగా ప్రపంచకప్‌ గెలుస్తామనే అభిప్రాయంతో ఉన్నాం. ఆ నేపథ్యంలో సిరీస్‌ పరాజయం మంచిదే. ప్రపంచకప్‌లో మనం చాలా బాగా ఆడాల్సిన అవసరాన్ని ఆ సిరీస్‌ ఫలితం గుర్తు చేసింది’’ అని ద్రవిడ్‌ అన్నాడు. ‘‘గత రెండేళ్లలో వన్డేల్లో భారత్‌ విశేషంగా రాణించింది. నంబర్‌వన్‌ జట్టు కూడా. అందుకే ప్రపంచకప్‌ తేలిగ్గా గెలుస్తామని అభిప్రాయం ఏర్పడింది. ఐతే ఆస్ట్రేలియాతో సిరీస్‌ నాకు మరీ చిత్రంగా ఏమీ అనిపించలేదు. మన జట్టు ఇప్పటికీ ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటన్నది నా అభిప్రాయం. కానీ కష్టపడక తప్పదు. పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది’’ అని బుధవారం ఓ కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్‌ వ్యాఖ్యానించాడు. ఆటగాళ్ల పని భారానికి సంబంధించి అందరికీ ఒకే విధానాన్ని అమలు చేయడం కుదరదని ద్రవిడ్‌ చెప్పాడు ‘‘ఈ విషయంలో చాలా మంది క్రికెటర్లకు అవగాహన ఉంటుంది. తమ శరీరం ఎంత మేర పని భారాన్ని తట్టుకుంటుందన్నది వాళ్లకు తెలుసు. ఎవరూ కూడా తమ దేహం తట్టుకోలేనంత స్థాయిలో ఆడరని అనుకుంటున్నా. విశ్రాంతి తీసుకుని రావడం కంటే, క్రమం తప్పకుండా ఆడుతుంటేనే తాను మెరుగ్గా బౌలింగ్‌ చేయగలనని ఆస్ట్రేలియా పేసర్‌ కమిన్స్‌ అన్నాడని ఎక్కడో చదివా. కాబట్టి పని భారం అనేది ఒక్కో ఆటగాడిగా ఒక్కోలా ఉంటుంది. అందరికీ విశ్రాంతినిచ్చేలా ఓ విధానాన్ని రూపొందించడం కుదరదు. మనం ఆటగాళ్లను నమ్మాలి. ఏం చేయాలో వాళ్లకు తెలుసు’’ అని ద్రవిడ్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ద్రవిడ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

వీలయితే విశ్రాంతి తీసుకోండి

రాబోయే నాలుగు నెలల్లో రెండు మెగా క్రికెట్‌ ఈవెంట్లు జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఆయా జట్లు ఆందోళన వక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లో ఐపీఎల్‌ 12వ సీజన్‌ మొదలవుతుండగా ఇది పూర్తయిన పది రోజులకే వన్డే ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. దీంతో ప్రధాన ఆటగాళ్లు ఆరు వారాల పాటు ఐపీఎల్‌ ఆడి అలసటకు లోనై ఫిట్‌నెస్‌ కోల్పోతారనే ఆందోళన నెలకొంది. ఈ విషయంపై ఇప్పటికే పలు జట్ల కెప్టెన్లు, కోచ్‌లు తమ ఆటగాళ్లని ఐపీఎల్‌ నుంచి వెనక్కి రప్పించేందుకు ఆయా దేశాల క్రికెట్‌ బోర్డుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ అంశంపై మాజీ కెప్టెన్‌ సౌరభ్‌గంగూలీ ఆటగాళ్లకు పలు సూచనలు చేశారు. ఇదొక పెద్ద ఈవెంట్‌, ఇలాంటి అవకాశాలు మళ్లీ రావు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవడమే మంచిదని పేర్కొన్నాడు. ‘ప్రతి ఒక్కరికీ క్రికెట్‌ ఆడేందుకు కొంత సమయమే ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి లేదా ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే మంచిగా ఆడటమే ముఖ్యం. అలాంటి అవకాశాలు మళ్లీ రావు. కాబట్టి వీలైనప్పుడు విశ్రాంతి తీసుకొని సమయం దొరికినప్పడు ఆడటమే మంచిది’ అని గంగూలీ సూచించారు. ఇదే విషయంపై దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ మాట్లాడుతూ.. ‘వన్డే ప్రపంచకప్‌లో ఉత్తమ జట్లని బరిలో దింపేందుకు అన్ని దేశాల క్రికెట్‌బోర్డులు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయని తెలుసు. వారి పరిస్థితి అర్థం చేసుకోగలను. ఆటగాళ్ల కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక సమయంలో భారత జట్టు కూడా తమ ప్రధాన బౌలర్లపై ఆంక్షలు విధించే అవకాశముంది. అంతిమంగా 11 మందిని బరిలో దించి వీలైనన్ని మ్యాచులు గెలవడమే ముఖ్యం. అంతకుమించి మన చేతుల్లో ఏమీ లేదు’ అని పాంటింగ్‌ చెప్పారు. కాగా దిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటివరకూ రెండుస్లార్లు సెమీస్‌ చేరినా ఒక్కసారి కూడా ఫైనల్‌కు వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ప్రత్యేక సలహాదారిడిగా గంగూలీని జట్టులో చేర్చుకుంది దిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం. ఈసారైనా ఆ జట్టు కప్పు గెలుస్తుందో లేదో చూడాలి మరి.

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు




ఇతర జట్టుకు కలిసి వస్తాయి

రాబోయే ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ భద్రతకు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదని ఐసీసీ సీఈవో డేవ్‌ రిచర్డ్‌సన్‌ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై స్పందించారు. ప్రపంచకప్‌లో పాల్గొనే అన్ని దేశాలూ ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటాయనే సంతకాలు చేశాయని ఆయన తెలిపారు. అలాగే జూన్‌ 16న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నిర్వహణ, భద్రతా అంశాల్లో తనకెలాంటి అనుమానం లేదన్నారు. ఒకవేళ ఏదైన కారణం చేత ఏదైన జట్టు క్రికెట్‌ మ్యాచ్‌ ఆడకపోతే ఆ పాయింట్లు ఇతర జట్టుకి కలిసివస్తాయని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందిన నేపథ్యంలో రాబోయే ప్రపంచకప్‌లో పాక్‌తో టీమిండియా మ్యాచ్‌ను నిషేధించాలని వస్తోన్న డిమాండ్‌పై ఆయన ఈ విధంగా స్పందించారు. పుల్వామా దాడి అనంతరం ఉగ్రవాద సంబంధం కలిగిన దేశాలను(పాకిస్థాన్‌ పేరు ప్రస్తావించకుండ) ఐసీసీ నుంచి బహిష్కరించాలని కోరుతూ బీసీసీఐ పాలక కమిటి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే పాక్‌ బోర్డు సైతం.. భారత్‌-ఆసీస్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు ఆర్మీ క్యాపులను ధరించి ఆడటంపై అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయాలపై స్పందించిన డేవ్‌రిచర్డ్‌సన్‌.. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల గౌరవార్థం, బాధితులకు విరాళాలు సేకరించేందు కోసం.. భారత ఆటగాళ్లు ఆర్మీ క్యాపులు ధరించేందుకు అనుమతి పొందారని చెప్పారు. క్రికెట్‌కు రాజకీయాలను ఆపాదించడం ఐసీసీ ఉద్దేశం కాదని ఆయన తేల్చిచెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక మ్యాచులకు ఐసీసీ ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించగా.. ఈ అంశంపై భారత్‌-పాక్‌ క్రికెట్‌ బోర్డులే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడటంపై ప్రపంచదేశాలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాయని డేవ్‌ తెలిపారు. ఈ విషయంపై ఐసీసీ పీసీబీకి సహకరిస్తుందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ విజయవంతమైతే ఐసీసీ సంతోషిస్తుందని చెప్పారు. పాక్‌లో క్రికెట్‌ ఆడేందుకు వస్తోన్న విదేశీ ఆటగాళ్లను ఆయన అభినందించారు.

జేబుకు చిల్లు వేయించుకున్న పీసీబీ

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై బీసీసీఐ గురిచూసి కొట్టిన దెబ్బ బాగా తగిలింది. దీంతో పాక్‌ బీసీసీఐకి 1.6 మిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించింది. ఈ విషయాన్ని పీబీసీ ఛైర్మన్‌ ఎహెసన్‌ మని సోమవారం వెల్లడించారు. భారత్‌ తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందుకు భారీ నష్టం వాటిల్లిందని పీసీబీ దావా వేసింది. పరిహారం కింద బీసీసీఐ రూ.400 కోట్లకు పైగా చెల్లించాలని గతేడాది ఐసీసీ వద్ద మొరపెట్టుకుంది. విచారించిన ఐసీసీ వివాద పరిష్కార కమిటీ పాక్‌దే తప్పని తేల్చింది. అనవసరంగా తమపై నిందలు వేసినందుకు విచారణకైన ఖర్చును చెల్లించాలని బీసీసీఐ తిరిగి పిటిషన్‌ వేసింది. ఐసీసీ దానిని ఆమోదించింది. ‘మేం ఓడిపోయిన పరిహారం కేసులో దాదాపు 2.2 మిలియన్‌ డాలర్లు ఖర్చైంది. ఐసీసీ ఆదేశించడంతో బీసీసీఐకి మేం 1.6 మిలియన్‌ డాలర్లు చెల్లించాం’ అని మని తెలిపారు. భారత్‌ 2015-2023 మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతుందని బీసీసీఐ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని పాక్‌ ఆరోపించింది. అది అవగాహన ఒప్పందం కాదని, కేవలం సూచనప్రాయంగా ఒక కాగితంపై రాసిందని బీసీసీఐ స్పష్టం చేసింది. కేసు గెలిచింది.

అతని ప్రశాంతత జట్టుకు చాలా అవసరం

ఒత్తిడి సమయాల్లో టీమిండియా ఇప్పటికీ మహేంద్రసింగ్‌ ధోనీపై ఆధారపడుతూనే ఉందని ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ దిగ్గజం రికీపాంటింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లంతా ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోనీ ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుకు నడిపించే తీరు వెలకట్టలేమని పాంటింగ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం ధోనీ నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉన్నప్పటికీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి విలువైన సలహాలు ఇస్తున్నాడని తెలిపాడు. దిల్లీ క్యాపిటల్స్‌కి కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్‌ ఆదివారం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 2-3 తేడాతో భారత్‌ చేజార్చుకోవడంపై పాంటింగ్‌ స్పందిస్తూ.. వన్డేల్లో భారత్‌ ఒత్తిడిని జయించలేకపోతోందని.. ఒత్తిడి జయించడంలో ప్రస్తుతం భారత్‌కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ధోనీనే అని పేర్కొన్నాడు. చివరి వన్డేల్లో ధోనీ లోకపోవడమూ సిరీస్‌ ఓటమికి ఒక కారణమేనని అన్నాడు. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు జట్టును విజయతీరాలకు చేర్చడంపైనే దృష్టిపెట్టాలన్నాడు. ప్రపంచకప్‌లో చోటు కోసం ఇతరులను ఆకట్టుకోవాలన్న ఆలోచనతో ఆడితే ఆటలో రాణించలేమన్నాడు. ఆటగాళ్లకు అదే చెప్తానని తెలిపాడు. దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఈసారి సమతూకంగా ఉందని.. శిఖర్‌దావన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడన్నాడు. ప్రృథ్వీషా, రిషభ్‌పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి యువ క్రికెటర్లు జట్టులో ఉండటం శుభపరిణామమన్నాడు. కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించడం సవాలుతో కూడుకున్నదేనని అయినా వందశాతం జట్టు విజయాలకు కృషి చేస్తామన్నాడు.

డల్లాస్‌లో ఉల్లాసంగా నాట్స్ వాలీబాల్ పోటీలు


అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా నిర్వహించిన నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు చక్కటి స్పందన లభించింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిపే నాట్స్ తెలుగు సంబరాలకు టాంటెక్స్ సిద్ధమవుతోంది. దీని కోసం తెలుగువారందరిని ఒక్కటి చేసే క్రమంలో ముందస్తుగా అనేక ఈవెంట్స్, ఆటల పోటీలను నాట్స్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.. ఈ పరంపరను కొనసాగిస్తూ టాంటెక్స్ తో కలిసి నాట్స్ టెక్సాస్ లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. 26 టీమ్ లు,,250 మంది ఆటగాళ్లతో ఈ టోర్నమెంట్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఆస్టిన్, హ్యూస్టన్ నుంచి కూడా ఈ టోర్నమెంట్ కు విచ్చేశారు. నాట్స్ ప్రొఫెషనల్ కప్, నాట్స్ వాలంటీర్ కప్, నాట్స్ ఫన్ కప్, అనే మూడు రకాలు కప్స్ తో ఈ టోర్నమెంట్ ప్లాన్ చేసింది. నాట్స్ ప్రొఫెషనల్ కప్ కోసం హోరా హోరీగా సాగిన ఈ టోర్నమెంట్ లో థండర్స్ టీం విజేతగా నిలిచింది. రన్నరప్ గా రేంజర్స్ టీం నిలిచింది. నాట్స్ వాలంటీర్స్ ను కప్ ను స్పైకర్స్ 1 సొంతం చేసుకుంది. వీవీఎస్ 1 టీం రన్నరప్ గా నిలిచింది. నాట్స్ ఫన్ కప్ ను స్పైకర్స్2 టీం కైవసం చేసుకుంది. రన్నరప్ గా రెడ్ బుల్స్ టీం నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో ఉత్సాహంగా వాలీబాల్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ పాల్గొనడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. నాట్స్ సంబరాల స్పోర్ట్స్ డైరక్టర్ ఎన్.ఎమ్.ఎస్ రెడ్డి, నాట్స్ స్పోర్ట్స్ ఛైర్ శ్రీనివాస్ కాసర్ల ఈ టోర్నమెంటు విజయవంతానికి ఎంతో కృషి చేశారు. నాట్స్ చాలా సంవత్సరాల నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు నిర్వహించిన టోర్నమెంట్ కు విశేష స్పందన వచ్చింది. ఎంతో క్రీడోత్సాహంతో వాలీబాల్ టోర్నమెంట్ పాల్గొన్నవారందరికి నాట్స్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపునూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ ,కాన్ఫరెన్స్ సెక్రటరీ రాజేంద్ర మాదల,టాంటెక్స్ ప్రెసిడెంట్ చినసత్యం వెర్నపు నాట్స్ స్పోర్ట్స్ టీం పై ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ సంబరాల కాన్పరెన్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల ఈ టోర్నమెంట్ కు హజరయ్యారు. విన్నర్స్, రన్నర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. మే 24 నుంచి 26 వరకు డాలస్ లో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని వారిని ఆహ్వనించారు. విజయ్ శేఖర్ అన్నే,కిషోర్ వీరగంధం, సంబరాల జాయింట్ సెక్రటరీ మహేశ్ ఆదిబొట్ల, నాట్స్ టీమ్ మెంబర్స్ రాజేంద్ర గొండి, హర్ష పిండి, వెంకట్ దండ, మురళీ పల్లబత్తుల, రఘు గుత్తికొండ, అభిరామ్ సన్నపురెడ్డి, వంశీ నాగళ్ల, పవన్ నెలుట్ల, సుబ్బు జొన్నలగొడ్డ, సురేష్ మండువ, మహేశ్ చొప్ప, రమేష్ రెడ్డి, మధు మల్లు, టాంటెక్స్ ప్రెసిడెంట్ చిన్న సత్యం వీరనపు, స్పోర్ట్స్ ఛైర్ వెంకట్ బొమ్మ తదితరుల మద్దతు ఈ టోర్నమెంట్ ను నాట్స్ దిగ్విజయంగా నిర్వహించింది.

 

షెడ్యూల్ కుదరక

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ‘సైనా’గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో టైటిల్‌ పాత్ర కోసం మొదట శ్రద్ధాకపూర్‌ను తీసుకున్నారు. ఆమె బ్యాడ్మింటన్‌ సాధన కూడా మొదలుపెట్టేసింది. కానీ ఇప్పుడు ఆమె ‘సైనా’ చిత్రం నుంచి తప్పుకుంది. పాత్ర కోసం ఇంత కష్టపడ్డాకా తప్పుకోవడం ఎందుకో? అనే ప్రశ్న బాలీవుడ్‌లో వినిపిస్తోంది. కానీ తప్పడం లేదట. చేతినిండా సినిమాలు ఉండటంతో షెడ్యూల్స్‌ను సర్దుబాటు చేయడం కష్టంగా మారిందట శ్రద్ధకు. దీంతో ‘సైనా’పై శ్రద్ధగా దృష్టిపెట్టలేక పోతుందట. ఇప్పుడు శ్రద్ధ ఆడాల్సిన ఆటను పరిణీతి చోప్రా ఆడనుంది. ‘‘2020 ప్రథమార్ధంలో ఈ సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇందులోని ప్రధాన పాత్ర కోసం పరిణీతి చోప్రాను తీసుకున్నాం. ఒలింపిక్స్‌ కంటే ముందే సైనా కథను ప్రపంచానికి చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’అని చిత్ర నిర్మాత భూషణ్‌కుమార్‌ తెలిపారు. క్రీడా బయోపిక్‌లో నటించే అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానని సంబరపడిపోతుంది పరిణీతి చోప్రా. ‘‘సైనా లాంటి శక్తిమంతమైన అమ్మాయి పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. ప్రపంచ పటంలో మన దేశాన్ని ప్రత్యేకంగా నిలిపిన సైనా పాత్రలో చేయాలంటే ఎంతో కష్టపడాలి’’ అని చెప్పింది పరిణీతి. ఆమోల్‌ గుప్తా ‘సైనా’ను తెరకెక్కిస్తున్నారు.

జేపీ డుమిని రిటైర్మెంట్

దక్షిణాఫ్రికా ఆల్‌ రౌండర్‌ జీన్‌పాల్‌ డుమిని వన్డే క్రికెట్‌కు స్వస్తి పలకనున్నాడు. ఇంగ్లాండ్‌లో జరగనున్న 2019 ప్రపంచకప్‌ తర్వాత వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నట్లు డుమిని ప్రకటించాడు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కఠినతరమైనవే.. అయినప్పటికీ క్రికెట్‌ నుంచి తప్పుకొనేందకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు డుమిని తెలిపాడు. రిటైర్మెంట్‌ తర్వాత అంతర్జాతీయ టీ20లతో పాటు దేశవాళీ క్రికెట్‌ ఆడతానని పేర్కొన్నాడు. ‘నేను కలలు కన్న క్రీడలో రాణించేందుకు శ్రమిస్తూనే ఉన్నాను.. అందుకోసం నాకు మద్దతుగా నిలిచిన జట్టు సభ్యులు, కోచ్‌, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని తెలిపాడు. ఇకపై తన కుటుంబం కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దక్షిణాఫ్రికా తరఫున 2011, 2015 ప్రపంచకప్‌ టోర్నీల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ ప్రపంచకప్‌ డుమినికి మూడో టోర్నీ. 2017లోనే టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. డుమిని ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడుతున్నాడు. 193 వన్డేలాడిన డుమిని 37.39 సగటుతో 5,047పరుగులు చేశాడు. 68 వికెట్లు సొంతం చేసుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా చివరిదైన ఐదో వన్డే శనివారం జరగనుంది.

నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. కోల్‌కతా పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల అభియోగాల నమోదు చేశారు. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ నేరాలతో కూడిన ఛార్జిషీట్‌ను అలీపోర్‌ పోలీసు కోర్టులో దాఖలు చేశారు. సెక్షన్‌ 498ఏ (వరకట్న వేధింపులు), 354ఏ (లైంగిక వేధింపులు) కింద కేసులు పెట్టారు. తన భార్య హసిన్‌ జహాన్‌తో షమీకి తీవ్ర విభేదాలున్న సంగతి తెలిసిందే. తన భర్తకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన స్ర్కీన్‌షాట్లను జహాన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. గతేడాది మార్చి 7న ఈ వ్యవహారాన్ని బహిరంగం చేసింది. షమి సైతం తన భార్యపై ఘాటుగా స్పందించాడు. ఆమె తన కెరీర్‌ను నాశనం చేసేందుకే ఇలా ప్రవర్తిస్తోందని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో షమిపై జహాన్‌ వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, గృహహింస కేసులు పెట్టింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేసింది. విచారణకు దిగిన బీసీసీఐ అతడి సెంట్రల్‌ కాంట్రాక్టును తాత్కాలికంగా నిలిపేసింది. ఫిక్సింగ్‌ ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో కాంట్రాక్టును పునరుద్ధరించింది. అప్పట్నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. మానసిక వేధనతో కొన్నాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్న షమి తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. కుటుంబ విభేదాల నుంచి దూరం జరిగాడు. ప్రశాంతంగా ఉంటూ తిరిగి తన ఫిట్‌నెస్‌ సాధించాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించి ప్రపంచకప్‌ జట్టులో పోటీకి నిలిచాడు. తాజా ఆసీస్‌ సిరీస్‌లోనూ నాలుగు మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు.

తండ్రి సోదరుడు చేయలేకపోయారు. దినపత్రిక కోసం చేసేసింది.

శ్రీనివాస్‌ మంధాన.. జాతీయ జట్టుకు క్రికెట్‌ ఆడాలని కలలు కన్న ఓ తండ్రి. శ్రవణ్‌ మంధాన.. అదే క్రికెట్‌ను ఎంచుకొని అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డ ఓ సోదరుడు. కానీ, ఆ తండ్రి కల నిజం కాలేదు.. ఆ సోదరుడి ఆశా నెరవేరలేదు.. అందుకే తండ్రి కలల్ని.. అన్నయ్య ఆశలను నెరవేర్చేందుకు నడుం కట్టిందో యువతి.. అహర్నిశలూ శ్రమించింది.. అనుకున్నది సాధించింది. ఇప్పుడామె.. భారత మహిళా క్రికెట్‌లో చెరిగిపోని అధ్యాయం.. అత్యంత విజయవంతమైన క్రీడాకారుల్లో ఒకరు.. ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌ ఉమెన్‌.. మహిళల క్రికెట్‌ను చూసేందుకూ ప్రేక్షకులు మైదానానికి వస్తారని నిరూపించిన అందాల బొమ్మ.. ఈ పాటికే ఆమె ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఆమే స్మృతి మంధాన.. తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు వార్తపత్రికల్లో తన ఫొటో చూసుకోవాలని కలిగిన కోరిక ఆమెను ఆట వైపు అడుగులు వేయించింది.. మరి ఆ ఆట ఆమె జీవితాన్నే ఎలా మలుపు తిప్పింది..? ఆమె క్రికెట్‌ కెరీర్‌లో ఎత్తుపల్లాలేంటి..?

క్రికెటర్‌ కొడుకే క్రికెటర్‌ అవుతాడనేది పాత ట్రెండు.. క్రికెటర్‌ కూతురు కూడా క్రికెటర్‌ అవుతుందనేది కొత్త ట్రెండు. అందుకే స్వతహాగా క్రికెటర్‌ అయిన శ్రీనివాస్‌ కుమార్తె స్మృతి మంధాన కూడా క్రికెటర్‌ అయింది. 1996 జూలై 18న ముంబయిలో శ్రీనివాస్‌ మంధాన, స్మితా దంపతులకు రెండో సంతానం స్మృతి మంధాన. తండ్రి కెమికల్‌ డిస్ర్టిబ్యూటర్‌, తల్లి గృహిణి. స్మృతి రెండేళ్లు ఉన్నప్పుడు కుటుంబం మొత్తం సంగ్లీలోని మాధవనగర్‌కు మకాం మార్చింది. అక్కడే స్మృతి మంధాన పాఠశాల విద్య పూర్తి చేసింది. తండ్రి శ్రీనివాస్‌ ఒకప్పటి జిల్లా స్థాయి క్రికెటర్‌. సంగ్లీ జట్టు తరఫున ఆడేవారు. అన్నయ్య శ్రవణ్‌ కూడా జిల్లా స్థాయి క్రికెటర్‌. అండర్‌-16 జట్టులో శ్రవణ్‌ క్రికెట్‌ ఆడుతుంటే స్మృతి ఆసక్తిగా గమనించేది. అన్నయ్య ఫొటోలు వార్త పత్రికల్లో వస్తే చూసి.. నా ఫొటో కూడా పేపర్లో వస్తే చూసుకోవాలని అనుకునేది. క్రికెట్‌పై స్మృతికి ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి ఆమెను ప్రోత్సహించినా.. తన గారాల పట్టీకి ఎక్కడ గాయాలవుతాయోనని గాబరా పడేవారు. అలా స్మృతి క్రికెట్‌లో రాణించడంతో తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉంది. మరోవైపు తల్లి స్మితా కూడా.. స్మృతికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసేది. ఇప్పటికీ స్మృతికి సంబంధించి తిండి, దుస్తుల ఎంపికలో తల్లి కీలక పాత్ర పోషిస్తుంది. తన అన్నయ్య క్రికెట్‌ ఆడుతుంటే తండ్రితో పాటు వెళ్లి చూసేది.. రోజూ అన్నయ్యతో పాటు నెట్స్‌కి వెళ్లేది. అన్నయ్యలాగే ఆడాలని అతడ్ని అనుకరించేది. సాధారణంగా కుడిచేతి వాటం అయిన మంధాన.. తనకు తెలియకుండానే ఎడమచేతితో చేయడం ప్రారంభించిది. అలా అన్నయ్యను చూస్తూ క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టింది.. ప్రతి రోజు ఉదయం నెట్స్‌లో క్రికెట్‌ సాధన చేసి.. ఆ తర్వాత పాఠశాలకు వెళ్లేది. మళ్లీ సాయంత్రం కాసేపు నెట్స్‌కు వెళ్లి సాధన చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్లేది. ఉపాధ్యాయులు ముందుగా పంపిస్తే సాధనకు ఎక్కువ సమయం కేటాయించేది.. సాధన పూర్తవగానే ఇంటికి వెళ్లి టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌లు చూసేది. 15ఏళ్ల వయసులో ఉన్న మంధాన శిక్షణ కోసం ముంబయి లేదా బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్లాలన్నా చదువుకు దూరం కావాల్సి వస్తోంది. ఓ వైపు చదువు.. మరో వైపు క్రికెట్‌.. ఏం చేయాలో తోచలేదు. దేన్ని వదులుకోవాలో అర్థం కాలేదు. ఇంతలోనే తనకో ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా తాను పొదుపు చేసుకున్న డబ్బుతో సొంతంగా కాంక్రీట్‌ పిచ్‌ తయారు చేయించుకుంది. ఆ పిచ్‌పై రోజూ సాధన చేసేది. చదువు కొనసాగిస్తూనే క్రికెట్‌ సాధన చేసింది. తాను పడ్డ శ్రమకు ప్రతిఫలంగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. క్రికెట్‌ ఆడటం మొదలు పెట్టిన అతి తక్కువ కాలంలోనే మహారాష్ట్ర అండర్‌-15జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత పదిహేడేళ్ల వయసులో మంధానకు మహారాష్ట్ర అండర్‌-19జట్టు నుంచి పిలుపొచ్చింది. 2013లో ఆమె ఆడిన ఓ మ్యాచ్‌ మంధాన క్రికెట్‌ జీవితాన్నే మలుపు తిప్పింది. వడోదరలో మహారాష్ట్ర, గుజరాత్‌ అండర్‌-19 జట్ల మధ్య మ్యాచ్‌. అందులో మంధాన సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై చిచ్చరపిడుగులా విరుచుకుపడింది. కళ్లు మూసి తెరిచేలోపు డబుల్‌ సెంచరీ పూర్తి చేసింది. 150 బంతుల్లో 224 పరుగులు చేసి.. ద్విశతకం చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి ఆమెకు ఎన్నో అవార్డులు.. మరెన్నో అవకాశాలు రావడం మొదలయ్యాయి. 2013లో ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే, టీ20 మ్యాచ్‌లో అవకాశం రావడంతో పదహారేళ్లకే స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2014 ఆగస్టులో టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టింది. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు మ్యాచ్‌ ఆడింది. మొదటి ఇన్నింగ్స్‌లో 22, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అదే ఊపుతో 2016లో ఆసీస్‌ గడ్డపై జరిగిన ఓ వన్డేలో 109 బంతుల్లో 102 పరుగులు చేసింది. ఆ ఏడాది మంధానకు మంచిపేరు తీసుకొచ్చింది. 2016 ఉమెన్స్‌ ఛాలెంజర్‌ ట్రోఫీలో ఇండియా రెడ్‌ తరఫున మూడు అర్ధశతకాలు నమోదు చేసింది. ఇండియా బ్లూ జట్టుపై విజయం సాధించడంలో ముఖ్యభూమిక పోషించింది. ఆ టోర్నీలో 192 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌ఉమెన్‌గా నిలిచింది. ఐసీసీ 2016 ఉమెన్స్‌ జట్టులో చోటు సంపాదించింది. మంధాన మినహా మరే భారత క్రీడాకారిణి ఆ జట్టులో చోటు సంపాదించకలేకపోవడం గమనార్హం. మంధాన 2017 మహిళా ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌లోనే ఇంగ్లాండ్‌పై 90 పరుగులు చేసింది. వెంటనే వెస్టిండీస్‌పై మరో మారు శతకం(106)తో విజృంభించింది. మార్చి 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 30 బంతుల్లో 50 పరుగులు చేసింది. అత్యంత వేగవంతమైన అర్ధశతకం చేసిన మొదటి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. 2018 మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 25బంతుల్లోనే అర్ధశతకం చేసింది. ఇంతకుమందు తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టింది. ‘2017లో మోకాలి గాయంతో ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. దాదాపు రెండు నెలల పాటు నడవడానికి కూడా కర్రసాయం. రకరకాల ఆలోచనలు నన్ను చుట్టుముట్టేవి. ఇక కెరీర్‌ ముగిసినట్లే అని ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఆ సమయంలో మానసికంగా ఎంతో కుంగిపోయాను. కానీ నాకు నేను ధైర్యం చెప్పుకొని సానుకూల దృక్పథంతో ఆలోచించడం మొదలుపెట్టా. నేను కనీసం ఇండియన్‌ జెర్సీ వేసుకోగలుగుతున్నాను.. ఆ అవకాశం కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు.. కాబట్టి వాళ్లకంటే నేను ఎంతో అదృష్టవంతురాలిని అనుకునేదాన్ని’ అని తన మనసులోని మాట బయటపెట్టింది మంధాన. ఆ తర్వాత 2017 ప్రపంచ కప్‌లో పునరాగమనం చేసిన మంధాన బ్యాటుతో విజృంభించింది. శ్రీలంక మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ కుమార సంగక్కర అంటే చాలా ఇష్టం. మంధాన తన బ్యాటింగ్‌లో అసంతృప్తి కలిగినప్పుడు వెంటనే టీవీలో సంగక్కర బ్యాటింగ్‌ క్లిప్పులు చూస్తుందట. ఇటీవల జరిగిన భారత్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో ఆడుతున్న మంధానకు అదే మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగక్కరను కలిసే అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి ఫొటో కూడా దిగింది. ఆ ఫొటోను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి సంగక్కరను టీవీల్లో చూడటం తప్ప నేరుగా చూడటం అదే మొదటి సారి.. అని తెగ సంబరపడిపోయింది. సినిమాల్లో బాలీవుడ్‌ స్టార్‌.. హృతిక్‌రోషన్‌ అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలు వదలకుండా చూస్తుందట. సమయం దొరికితే అరిజిత్‌సింగ్‌ పాటలు వింటుందట. వాలీబాల్‌ అంటే ఇష్టం.. క్రికెట్‌ మ్యాచ్‌ లేనప్పుడు వాలీబాల్‌ చూస్తుందట.

*** రికార్డులు
• ద్విశతకం బాదిన ఏకైక భారత క్రీడాకారిణిగా రికార్డు.
• ఐసీసీ ప్రకటించిన 2016 జట్టులో భారత్‌ నుంచి చోటు సంపాదించిన ఏకైక బ్యాట్స్‌ఉమెన్‌.
• 2018లో అర్జున అవార్డుతో సత్కారం.
• 2018 ఐసీసీ క్రికెటర్‌, వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గుర్తింపు.
• కియా సూపర్‌ లీగ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌.
• 2019 ఫిబ్రవరిలో ప్రకటించిన ఐసీసీ బ్యాట్స్‌ఉమెన్‌ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానం.
• దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో సెంచరీలు చేసిన మొదటి భారత మహిళ క్రికెటర్‌.
• 2019 ఫోర్బ్స్‌ ప్రకటించిన అత్యంత ప్రతిభావంతులైన 30ఏళ్లలోపు వాళ్ల జాబితాలో స్మృతికి చోటు.
• టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన వారిలో మిథాలీరాజ్‌ తర్వాతి స్థానం మంధానదే.
• 2016 బిగ్‌బాష్‌లీగ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మొదటి క్రీడాకారుల్లో ఒకరు.
• జూన్‌ 2018లో కియా సూపర్‌ లీగ్‌లో ఆడిన మొదటి భారత క్రీడాకారిణిగా రికార్డు.

పద్మభూషణ్ మీద దృష్టి పెడతా

పద్మశ్రీ పురస్కారంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని, దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధిస్తానని గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక చెప్పింది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అవార్డును అందుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడింది. అవార్డును అందుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. మే 14 నుంచి 18 వరకు చైనాలో జరగనున్న ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నమెంట్లో విజయం సాధిస్తానని హారిక ధీమా వ్యక్తం చేసింది. మరోవైపు, హోటల్‌ అశోకలో సమైక్య తెలుగు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జీవీఆర్‌ మురళి.. హరికను దుశ్శాలువాతో సత్కరించారు.

గాయాలకు దూరంగా ఉండండి

రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో టీమిండియా ప్రధాన ఆటగాళ్లు ఎలాంటి గాయాలకు గురవకుండా జాగ్రత్తగా ఆడాలని టీమిండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ సూచించాడు. మే 30 నుంచి ఇంగ్లాండ్‌, వేల్స్‌లో జరగబోయే ప్రపంచకప్‌ ఈవెంట్‌కు బలమైన జట్టుగా వెళ్లాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌ గెలిచి ప్రపంచ నంబర్‌వన్‌ జట్టుగా మెగా ఈవెంట్‌లో అడుగుపెట్టాలని కోరాడు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన హర్భజన్‌ మీడియాతో మాట్లాడాడు. ‘ప్రపంచకప్‌ ఈవెంట్‌కు చాలా సమయం ఉంది. అప్పటివరకూ ఏదైనా జరగొచ్చు. మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుత టీమిండియా జట్టు ఎలాంటి ఛాంపియన్‌ కప్పునైనా గెలుచుకోగలదు. కాగా ఐపీఎల్‌ సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. దీంతో ఆటగాళ్లు గాయాలబారిన పడే ప్రమాదముంది. అయితే వరుస మ్యాచ్‌లు ఆడటం వల్ల ఆటగాళ్లకు సరైన ఫిట్‌నెస్‌ లభిస్తుంది. కోహ్లీ, రోహిత్‌శర్మ, బుమ్రా తదితర ప్రధాన ఆటగాళ్లు ఈ సమయంలో గాయాలబారిన పడి ప్రపంచకప్‌ ఈవెంట్‌కు దూరం కావొద్దు. ప్రతిఒక్కరూ మెగా ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శన చేయాలి’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. భారత జట్టు ఆసీస్‌పై సిరీస్‌ గెలిచి నంబర్‌ వన్‌ స్థానంలో ప్రపంచకప్‌లో అడుగుపెట్టాలని.. దీని ద్వారా ఆటగాళ్లలో మనోధైర్యం పెరుగుతుందని చెప్పాడు. రాంచీలో 41వ శతకం బాదిన కోహ్లీ బ్యాటింగ్‌ను మెచ్చుకున్నాడు. ‘ప్రపంచమేటి బ్యాట్స్‌మెన్‌లలో అతనొక్కడు. గత నాలుగైదేళ్లుగా కోహ్లీ బ్యాటింగ్‌ చూస్తుంటే అతడెలా మారిపోయాడో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. కోహ్లీకి మాత్రం ఏ బలహీనత లేదు. ప్రత్యర్థి బౌలర్‌ ఏ బంతి వేసినా దాన్ని వేటాడే సత్తా కోహ్లీ సొంతం. ఒక వేళ నేను అతడికి బౌలింగ్‌ చేయాల్సి వస్తే కాస్త ఆలోచించాల్సిన విషయమే’ అని వివరించాడు.

కథ కంచికి

ఆల్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌ సాధించాలన్న భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఏడో ప్రయత్నంలోనూ ఆమె విఫలమైంది. బుధవారం ప్రారంభమైన ఆల్‌ ఇంగ్లాండ్‌లో సింధుకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ సింధు 16-21, 22-20, 18-21తో సుంగ్‌ హ్యున్‌ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. ఒక గంటా 21 నిమిషాల పాటు హోరాహోరీగా మ్యాచ్‌ సాగింది. తొలి గేమ్‌ 17 పాయింట్ల వరకు నువ్వానేనా అన్నట్లు నడిచింది. ఐతే వరుసగా 4 పాయింట్లతో సుంగ్‌ 21-16తో తొలి గేమ్‌ గెలుచుకుంది. రెండో గేమ్‌లో సింధు గొప్పగా పుంజుకుంది. 14-18తో వెనుకబడిన సింధు.. క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌లు సంధించి 17-18తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. ఐతే వరుసగా 2 పాయింట్లతో సుంగ్‌ మ్యాచ్‌ పాయింటుకు చేరువైంది. ఈ సమయంలో పట్టుదలగా ఆడిన సింధు వరుస పాయింట్లతో చెలరేగింది. బాడీ స్మాష్‌ సంధించి 22-20తో రెండో గేమ్‌ నెగ్గి మ్యాచ్‌లో ఆశల్ని సజీవంగా నిలుపుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఏకపక్షంగా సాగింది. సుదీర్ఘ ర్యాలీలు సాగిన ఈ గేమ్‌లో అనవసర తప్పిదాలు సింధుకు నష్టం చేశాయి. ఒకదశలో 13-20తో ఓటమి అంచుల్లో ఉన్న సింధు వరుసగా 5 పాయింట్లతో ఆశలు రేపింది. ఐతే విజయానికి కావాల్సిన ఒక పాయింటును గెలుచుకున్న సుంగ్‌.. 21-18తో సింధు ఆశలకు తెరదించింది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ ముందంజ వేశాడు. 21-13, 21-11తో బ్రైస్‌ లెవెరెడ్జ్‌ (ఫ్రాన్స్‌)ను చిత్తు చేశాడు. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సాయి ప్రణీత్‌ 21-19, 21-19తో ప్రణయ్‌పై నెగ్గాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీ 21-16, 26-28, 16-21తో ఏడో సీడ్‌ షిహో తనక, కొహరు యొనెమోటో (జపాన్‌) చేతిలో పోరాడి ఓడింది.

ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ గెలుపు ఎవరిదీ?

అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌పై భారత స్టార్‌ క్రీడాకారులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ గురిపెట్టారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత పురాతన టోర్నీలో టైటిల్‌ సాధించి.. 18 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించాలని ఉవ్విళ్లూరుతున్నారు. బుధవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో సింధు, సైనా, శ్రీకాంత్‌ ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నారు. ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌లో భారత క్రీడాకారులు మెరిసింది రెండు సార్లే. 1980లో ప్రకాశ్‌ పదుకొణె, 2001లో పుల్లెల గోపీచంద్‌ మాత్రమే టైటిల్‌ సాధించారు. ఇప్పటికి 10 సార్లు దండెత్తిన సైనాకు 2015లో ఫైనల్‌ చేరడమే అత్యుత్తమ ప్రదర్శన. ఆరు సార్లు బరిలో దిగిన సింధుకు నిరుటి సెమీస్‌ ప్రదర్శనే అత్యుత్తమం. ఇప్పటికీ కలగానే మిగిలిన ఆల్‌ ఇంగ్లాండ్‌ టైటిల్‌ను నిజం చేసుకోడానికి భారత స్టార్లు ఈసారి గట్టిగానే ప్రయత్నించనున్నారు. మహిళల సింగిల్స్‌లో సింధు ఐదో సీడ్‌గా, సైనా 8వ సీడ్‌గా.. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ ఏడో సీడ్‌గా బరిలో దిగుతున్నారు. తొలి రౌండ్లో సుంగ్‌ హ్యున్‌ (కొరియా) రూపంలో సింధుకు కఠినమైన సవాల్‌ ఎదురుకానుంది. ఇప్పటి వరకు వీరిద్దరు 14 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఎనిమిదింట్లో సింధు, ఆరింట్లో సుంగ్‌ పైచేయి సాధించారు. మరోవైపు ఆరంభ రౌండ్లో సైనాకు సులువైన ప్రత్యర్థే ఎదురైంది. క్రిస్టీ గిల్మూర్‌ (స్కాట్లాండ్‌)తో సైనా పోటీపడుతుంది. ఇప్పటి వరకు వీరిద్దరు ఆరు సార్లు తలపడగా.. ఆరింట్లోనూ సైనాదే విజయం! పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో బ్రైస్‌ లెవెర్‌దెజ్‌ (ఫ్రాన్స్‌)తో శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌తో ప్రణయ్‌, విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌)తో సమీర్‌వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో షువాన్‌- షియాంగ్యు (చైనా)తో సుమీత్‌రెడ్డి- మను అత్రి; మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో తనక- యొనెమొట (జపాన్‌)తో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప, బొలొతొవా- దవ్లెతోవా (రష్యా)తో మేఘన- పూర్విష; మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో చాంగ్‌ చింగ్‌- వింగ్‌ యంగ్‌ (హాంకాంగ్‌)తో ప్రణవ్‌- సిక్కిరెడ్డి పోటీపడతారు.

మీరు డబ్బులు మింగేసి…పన్నులు కట్టరా?

భారత్‌లో 2021లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2023లో ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో వీటికి పన్ను మినహాయింపు కావాలని అంతర్జాతీయ క్రికెట్‌ సమాఖ్య(ఐసీసీ) కోరుతున్న సంగతి తెలిసిందే. ఒక వేళ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు రాని పక్షంలో బీసీసీఐ ఆ మొత్తాన్ని భరించాలని చెబుతోంది. అయితే, అది ఎంత మాత్రం కుదరదని బీసీసీఐ స్పష్టం చేసింది. కావాలంటే టీ20, వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లను నిరభ్యంతరంగా మరో దేశంలో నిర్వహించుకోవచ్చని చెప్పేసింది. తాజాగా ఐసీసీ త్రైమాసిక సమావేశం జరిగింది. భారత్‌లో నిర్వహించే టీ20, ప్రపంచకప్‌ టోర్నీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు ఇప్పించాలని బీసీసీఐని ఐసీసీ కోరింది. ఒకవేళ ప్రసారదారు కోసమే ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు కావాలంటే తర్వాత మాట్లాడుకోవచ్చని చెప్పింది. సాధారణంగా దిగుమతి చేసుకొనే యంత్రాలపై సుంకం విధిస్తారు. ప్రపంచకప్‌ను స్టార్‌ నెట్‌వర్క్‌ ప్రసారం చేయనుంది. ఇప్పటికే భారత్‌లో స్టార్‌కు సంబంధించిన పూర్తి యంత్రాలు, యంత్రాంగం ఉన్నప్పుడు ఇక మినహాయింపు ఎందుకని బీసీసీఐ ప్రశ్నించింది. క్రికెట్‌ ఆడుతున్న ఇతర దేశాలు ఇస్తున్నట్లు ఐసీసీ మెగా ఈవెంట్లకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడం లేదు. ‘ఒక వేళ ఆ ఈవెంట్లను భారత్‌లో కాకుండా మరో దేశంలో నిర్వహించుకోవాలని ఐసీసీ భావిస్తే, నిస్సందేహంగా నిర్వహించుకోవచ్చు’ అని బీసీసీఐ అధికారు ఒకరు తెలిపారు.

పంత్ వద్దు

మే 30 నుంచి ఇంగ్లాండ్‌, వేల్స్‌లో ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్‌ జట్టు ఎంపికపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మెన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తాను అనుకుంటున్న టీమిండియా జట్టును ప్రకటించారు. ఆ జట్టులో మాత్రం యువక్రికెటర్‌ రిషబ్‌పంత్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. రిషబ్‌పంత్‌కి బదులుగా దినేశ్‌కార్తిక్‌ను జట్టులోకి తీసుకోవాలని లక్ష్మణ్‌ సూచించారు. పంత్‌ను కాదనడానికి గల కారణాలను లక్ష్మణ్‌ స్టార్‌స్పోర్ట్స్‌తో ఇలా పంచుకున్నారు.. ‘రిషబ్‌పంత్‌ ఆడిన గత ఐదు వన్డేల్లో 4, 40(నాటౌట్‌), 28, 3, 1 పరుగులే చేశాడు. ప్రపంచకప్‌కి అత్యుత్తమ జట్టుని తీసుకోవాలి. ఆటగాళ్ల అనుభవం దృష్ట్యా రిషబ్‌పంత్‌కి బదులు దినేశ్‌కార్తిక్‌ను తీసుకోవడమే సెలెక్షన్‌ కమిటీ ముందున్న నిర్ణయం’ అని పేర్కొన్నారు. బౌలర్ల గురించి ప్రస్తావిస్తూ నలుగురు ఫాస్ట్‌బౌలర్లు, ఇద్దరు స్పిన్‌ బౌలర్లను తీసుకోవాలని లక్ష్మణ్‌ వివరించారు. ఇదే విషయంపై గంగూలీ ఇప్పటికే మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘ప్రపంచకప్‌ జట్టుతో రిషబ్‌పంత్‌ కలిసిపోవాల్సిన అవసరముంది. అతను ప్రస్తుత జట్టుతో కలిసిపోతాడో లేదో నాకు తెలీదు. కాని కచ్చితంగా రాబోయే కాలంలో మాత్రం మంచి క్రికెటర్‌గా ఎదిగే అవకాశముంది. దినేశ్‌ కార్తిక్‌ వన్డే ఆటగాడు కాదు కాబట్టి జట్టు సెలెక్షన్‌ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు’ అని గంగూలీ ఇది వరకే ప్రకటించారు. లక్ష్మణ్‌ ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టు: రోహిత్‌శర్మ, శిఖర్‌ధావన్‌, విరాట్‌కోహ్లీ, అంబటిరాయుడు, ఎంఎస్‌ధోనీ, కేదార్‌జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్‌దీప్‌యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌కుమార్‌, మహ్మద్‌షమీ, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌కార్తిక్‌, ఖలీల్‌ అహ్మద్‌.

వంద టైటిళ్లు సొంతం

స్విస్‌ దిగ్గజం తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను సృష్టించాడు. మరెన్నో కీర్తి కిరీటాలను సంపాదించుకున్నాడు. తాజాగా దుబాయ్‌ ఓపెన్‌ టోర్నీ ఫైనల్లో గ్రీస్‌ సంచలనం సిట్సిపాస్‌ను ఓడించి తన కెరీర్‌లో 100వ ఏటీపీ టూర్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికా మాజీ టెన్నిస్‌ స్టార్‌ జిమ్మి కానర్స్‌ (109) తర్వాత 100 ఏటీపీ టైటిళ్లు సాధించిన ఘనత ఫెదరర్‌దే. దీంతో ఫెదరర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే రోజర్‌ కూడా తన మధుర జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటూ వందటైటిళ్ల ఫొటోలను కొలేజ్‌‌ చేసిన ఫొటోను ఫెదరర్‌ రీ ట్వీట్‌ చేశాడు. దీంతో పాటు 109 టైటిళ్ల వీరుడు జిమ్మి కానర్స్‌..ఫెదరర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ‘మూడంకెల టైటిళ్ల జాబితాలోకి స్వాగతం. ఇన్ని రోజుల వరకు ఈ జాబితాలో నేను ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు నాకు తోడైనందుకు సంతోషంగా ఉంది’ అని జిమ్మి ట్వీట్‌ చేశారు. దీనికి రోజర్‌ బదులిస్తూ..‘మీ జాబితాలోకి నేను వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేశాడు.ఫెదరర్‌ ఖాతాలో ఇప్పటి వరకు 20 గ్రాండ్‌స్లామ్స్‌ ఉన్నాయి. వీటిలో ఎనిమిది వింబుల్డన్‌లు, ఆరు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు, ఐదు యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లు, ఒక ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ ఉన్నాయి. 2001లో తన తొలి ట్రోఫీ గెలిచిన రోజర్‌.. 18 ఏళ్ల తర్వాత వందో టైటిల్‌ అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడిని ఉద్దేశించి నెజిజన్లు సృష్టించిన ‘ఆర్‌ఎఫ్‌100’ ట్రెండింగ్‌లో ఉంది.

రాహుల్‌ని మార్చిన రాహుల్

‘కాఫీ విత్‌ కరణ్‌’ షో తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తనలో మార్పు తెచ్చాయని టీమిండియా స్ట్రోక్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. తనలో మరింత అణకువ పెరిగిందన్నాడు. భారత్‌ తరఫున ఆడే అవకాశాన్ని గౌరవిస్తున్నానని పేర్కొన్నాడు. ఫామ్‌లేమితో జట్టులో చోటు కోల్పోయి భారత్‌-ఏ తరఫున ఆడివచ్చిన రాహుల్‌ ఆస్ట్రేలియాతో రెండు టీ20ల్లో అద్భుతంగా రాణించాడు. ‘అది కచ్చితంగా గడ్డుకాలమే. ఆటగాడైనా ఇంకెవరైనా ఈ దశను అనుభవించాల్సిందే. ఈ కాలాన్ని నా ఆటను సరిదిద్దుకొనేందుకు వచ్చిన అవకాశంగా భావించా. వివాదం తర్వాత నాలో అణకువ పెరిగింది. దేశానికి ఆడే అవకాశాన్ని గౌరవిస్తాను. వచ్చిన అవకాశాలను లెక్కలోకి తీసుకొని తలవంచుకొని క్రికెట్‌పై దృష్టిసారించా. కొద్దికాలం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ఎడబాటు దొరికింది. కాస్త ఒత్తిడి తక్కువగా ఉండే భారత్‌-ఏ తరఫున ఆడా. నా టెక్నిక్‌, నైపుణ్యంపై దృష్టి సారించా’ అని రాహుల్‌ అన్నాడు. ‘ఈ సమయంలో ఎక్కువగా రాహుల్‌ ద్రవిడ్‌తో గడిపా. ఆయనతో నా ఆట గురించి చర్చించా. భారత్‌-ఏకు ఆడిన ఐదు మ్యాచుల్లో ఆయన నాకెంతో సాయపడ్డారు. తిరిగి సహచరులతో కలిసినందుకు సంతోషంగా ఉంది. కెరీర్‌ తొలినాళ్లలోనే వివాదంలో చిక్కుకోవడం వల్ల నేర్చుకొనే అవకాశం దొరికింది. ఒక క్రికెటర్‌గా ఇప్పుడు నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. పునరాగమనం తర్వాత నాపై ఒత్తిడి నెలకొంది. పరుగులు చేసినందుకు సంతోషంగా ఉంది. బెంగళూరులో ఛేదన చేసిన జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువ. మాక్స్‌వెల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ను ప్రశంసించక తప్పదు. తడిచిన బంతితో మా బౌలర్లు చాలా కష్టపడ్డారు’ అని రాహుల్‌ వెల్లడించాడు.