అంబేద్కర్‌నే రెండుసార్లు ఓడించిన దేశం మనది

లోక్‌సభలో అడుగుపెట్టాలన్న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ కలలు కలలుగానే మిగిలిపోయాయి. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో షెడ్యూల్డ్‌ కేస్ట్స్‌ ఫెడరేషన్‌ తరఫున అప్పటి ఉత్తర బొంబయి(రిజర్వ్డు) స్థానం నుంచి అంబేడ్కర్‌ పోటీకి దిగారు. గతంలో అంబేడ్కర్‌ సహాయకుడైన నారాయణ్‌ సడోబా కజ్రోల్కర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడ్డారు. నారాయణ్‌ చేతిలో అంబేడ్కర్‌ 4,561 ఓట్ల స్వల్పతేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత 3 ఏప్రిల్‌ 1952లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2 ఏప్రిల్‌ 1956 వరకూ కొనసాగారు. ఈ మధ్యలో 1954లో బాంద్రా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ అంబేడ్కర్‌ పోటీచేసి ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి బోర్కర్‌ విజయం సాధించారు.

మాయావతితో పవర్ స్టార్ పొలిటికల్ ఫిక్సింగ్–TNI ప్రత్యేకం

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రారంభించిన అనంతరం నాలుగైదు సార్లు బీఎస్పీ అధినేత మాయావతితో భేటీ అయ్యారు. ఈ భేటీలో బేరసారాలు, ఇరువురి మధ్య బాగానే కుదిరినట్లు జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాయావతికి చెందిన బహుజన సమాజ్ వాదీ పార్టీని బలంగా నిలబెట్టడం కోసం పవన్ కళ్యాణ్ తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. బీఎస్పీ అభ్యర్ధులుగా చాలా చోట్ల జనసేన నాయకులు కార్యకర్తలనే పవన్ బరిలోకి దింపారు.
*** ఇవిగో ఉదాహరణలు
జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఆ పార్టీ తరపున నంబూరు శ్రీనివాసరావు తిరువూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలోనూ నంబూరు శ్రీనివాసరావు కీలక నేతగా వ్యవహరించారు. జనసేన పార్టీ తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నంబూరు శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్‌కు దరఖాస్తు కూడా ఇచ్చారు. ఎన్నికల ప్రచార వాహనాన్ని సిద్ధం చేసుకుని జనసేన జెండాలతో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే చివరి నిముషంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నంబూరు బీఎస్పీ అభ్యర్థిగా తిరువూరు నుండి నామినేషన్ వేశారు. దీనితో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
*** కొవ్వూరులోనూ ఇదే తంతు
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోనూ ఇదే విధమైన జిమ్మిక్కును జనసేన అధినేత ప్రదర్శించారు. ఏలూరు రేంజి డీఐజీగా పదవీ విరమణ చేసిన రవికుమార్ మూర్తి జనసేన పార్టీలో చేరారు. ఆయన తిరుపతి నుండి జనసేన పార్టీ తరపున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయటానికి టికెట్ కోసం దరఖాస్తు చేస్తుకున్నారు. ఆయనకి కూడా మొండిచేయ్యే చూపెట్టారు. అనూహ్యంగా రవికుమార్ వద్దన్న కొవ్వూరు నుండి బీఎస్పీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపారు. అదే విధంగా చాలా నియోజకవర్గాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు బీఎస్పీ అభ్యర్ధులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎన్నికల బరిలోకి నిలిచారు. మాయావతి, పవన్ కళ్యాణ్ మధ్య కుదిరిన భారీ ఒప్పందం మేరకే ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ బీఎస్పీ తరపున అభ్యర్ధులను రంగంలోకి దింపారని వీరు భావిస్తున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు

జగన్ రాకతో తిరువూరులో వేగం పుంజుకున్న ఫ్యాన్. ఇంకా పాకులాడుతున్న తెదేపా –TNI ప్రత్యేకం

తిరువూరు నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి ఇప్పటి వరకు ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా అభ్యర్థి రక్షణనిధి ప్రచారంలో ముందడుగులో ఉన్నారు. ఆదివారం నాడు వైకాపా అధ్యక్షుడు జగన్ తిరువూరు పర్యటన సందర్భంగా వైకాపా శ్రేణులు ఊహించిన దాని కన్నా అదనంగా జనం తరలివచ్చారు. దీంతో వైకాపాలో దూకుడు మరికొంత పెరిగింది. మొదటి నుండి తిరువూరు తెదేపా అభ్యర్థిగా స్వామిదాస్ పోటీలో ఉంటారని భావించినప్పటికీ చివరి నిముషంలో మంత్రి జవహర్‌కు కొవ్వూరు సీటు ఇవ్వకుండా, తిరువూరుకు పార్టీ అధిష్టానం అభ్యర్థిత్వం కేటాయించింది. జవహర్ ఇంకా స్థానిక నాయకులను సమన్వయం చేసుకునే పనిలోనే ఉన్నారు. కొన్ని చోట్ల కొందరు సీనియర్ నాయకులు జవహర్‌కు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కనిపించడంలేదు. దాదాపు 30వేలకు పైగా ఓటర్లు ఉన్న తిరువూరు పట్టణంలో తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంది. మున్సిపాల్టీలో అధికారంలో ఉన్న తెదేపా పాలకవర్గం మున్సిపాల్టీని భ్రష్టు పట్టించింది. ఈ ఎన్నికల సమయంలో కూడా మున్సిపాల్టీలో పాలన అధ్వాన్నంగానే ఉంది. పట్టణంలో ఈ వేసవిలో నాలుగు రోజులకొకసారి తాగునీరు ఇస్తున్నారు. తిరువూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం కూడా లేదు. ఉన్న నాయకులు వర్గాలుగా విడిపోయారు. జవహర్ ఒకరిద్దరు నాయకులపైనే తిరువూరు మండలంలో ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది. గంపలగుడెం, ఏ.కొండూరు, విస్సన్నపేటలో ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా పూర్తిగా పార్టీ ప్రచార రంగంలోకి దిగలేదు. సీటు రాలేదని బాధలో ఉన్న స్వామిదాసు ఇప్పుడిప్పుడే జవహర్‌తో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన భార్య జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుధారాణి బయటకు రావడంలేదు. జవహర్‌కు సీటు కేటాయించడం పట్ల స్వామిదాసు వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పుడిప్పుడే స్వామిదాసు జోక్యంతో వారంతా ప్రచారంలోకి దిగుతున్నారు. తిరువూరు మండలంలో కీలక ప్రజా ప్రతినిధిగా వ్యవహరిస్తూ గత ఐదు సంవత్సరాల నుండి ఇసుక, మట్టి తదితరాలను అమ్ముకుని కోట్లు గడించిన ఒక నాయకుడిని జవహర్ దగ్గరకి తీయడంతో ఆ ప్రజాప్రతినిధి గ్రామానికి చెందిన తెలుగుదేశం సర్పంచితో పాటు మరికొందరు వైకాపాలోకి వెళ్లిపోయారు. తిరువూరు నియోజకవర్గంలో జోరుమీదున్న వైకాపాను అధిగమించాలంటే ప్రస్తుత తెదేపా అభ్యర్థి జవహర్ అందరు నాయకులను సమన్వయంతో పని చేయించుకోవాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. దీనికి తోడు గత ఐదు సంవత్సరాల నుండి ఉన్న కొందరు తెదేపా నాయకులు పార్టీని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారు. కార్యకర్తలకు ఒక్క రూపాయి కూడా దక్కకుండా నాయకులు దండిగా సంపాదించారన్న అభిప్రాయం దిగువ స్థాయి పార్టీ కేడర్‌లో బలంగా ఉంది. వీటన్నింటినీ తెదేపా అభ్యర్థి జవహర్ అధిగమించి తనకు అనుకూలంగా మలచుకుంటేనే విజయం సాధ్యమని పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేని పక్షంలో మంచి అభ్యర్థిగా పేరు తెచ్చుకున్న రక్షణనిధి రెండో పర్యాయం ఈ సీటు తన్నుకుపోతారేమో అని తెదేపా వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.

ఆనంద సూచీల్లో అట్టడుగున భారత్

ఆనందదాయక దేశాల జాబితాలో ఈ ఏడాది (2019) భారతదేశం 140వ స్థానంలో నిలిచింది. 2018లో భారత్‌ 133వ స్థానంలో నిలిచిన విషయం గమనార్హం. అంటే..ఈ సంవత్సరంలో ఏడుపాయింట్లు కిందకు దిగజారింది. ఈ ఏడాది కూడా ఫిన్లాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం నాడిక్కడ విడుదలైన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి 20వ తేదీని ఐరాస సర్వప్రతినిధి సభ ‘ప్రపంచ ఆనంద దినోత్సవం’గా ప్రకటించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఆదాయం, స్వేచ్ఛ, విశ్వాసం, ఆరోగ్యకర జీవన విధానం-ఆయుష్షు, సామాజిక మద్దతు, వితరణ తదితర అంశాలను ఆనందం మదింపునకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.బుధవారం విడుదలైన నివేదిక ప్రకారం గత కొన్నేళ్లల్లో ప్రపంచం మొత్తం మీద ఆనంద సూచీ పరిస్థితి అంతకంతకూ తగ్గుతూనే వచ్చింది. డెన్మార్క్‌, ఐస్‌ల్యాండ్‌, నెదర్లాండ్స్‌, నార్వే దేశాలు జాబితాలో ఫిన్లాండ్‌ తర్వాత నిలిచాయి. పాక్‌ 67వ ర్యాంకులో నిలవగా, చైనా 93వ ర్యాంకును సాధించింది. ఇక, ఆనందానికి ఆమడదూరంలో బతుకీడుస్తున్న దేశాల్లో సూడాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌, టాంజానియా, రువాండాలున్నాయి.

తిరువూరుకు రానురానంటూనే…జవహర్ వచ్చేశారుగా?-TNI ప్రత్యేకం


అందరు అనుకున్నదే జరిగింది. తిరువూరుకు జవహర్ తెదేపా అభ్యర్థిగా రాబోతున్నారని సంవత్సరం క్రితమే TVRNEWS చెప్పింది. అదే నిజమయింది. మూడు సార్లు పరాజయం పాలైన స్వామిదాస్‌కు నాలుగోసారి నిరాశే మిగిలింది. చివరి నిముషంలో నియోజకవర్గ తెలుగుదేశం నాయకులందరూ కట్టగట్టుకుని స్వామిదాస్‌కు టికెట్ ఇవ్వాల్సిందేనని తెదేపా అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. కొవ్వూరులో మంత్రి జవహర్‌కు ఉన్న వ్యతిరేకత తిరువూరులో స్వామిదాస్ కొంప ముంచింది. దీనికి తోడు ఎంపీ కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమాలు సైతం స్వామిదాస్‌కు టికెట్ ఇప్పించడానికి ముందుకు రాలేదు. అధిష్టానం మాత్రం స్వామిదాస్‌కు తిరువూరు టికెట్ ఇచ్చే విషయం కనీసం పరిశీలన కూడా చేయలేదని తెదేపా వర్గాలు అంటున్నాయి. దీంట్లో స్వామిదాస్ దంపతుల స్వయంకృతాపరాధం కూడా చాలా ఉంది. వరసగా మూడు సార్లు పరాజయం పాలైన స్వామిదాస్ గత అయిదేళ్లల్లో పార్టీ కార్యకర్తలను, నాయకులను తనవైపు పూర్తిగా తిప్పుకోలేకపోయారు. ఆయనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ కన్వీనర్ పదవి కట్టబెట్టినప్పటికీ ఆయన ఆ పదవిని తన సొంత అవసరాలకే వాడుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఏది ఏమైనప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తల్లోనూ, స్థానిక ప్రజల్లోనూ, ముఖ్యంగా పార్టీ అధిష్టానం వద్ద స్వామిదాస్ సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా ఎదుటివారికి అపకారం చేయని వ్యక్తిగానే గుర్తింపు పొందారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే స్వామిదాస్‌కు ఎమ్మెల్యే కన్నా మంచి పదవే పార్టీ అధిష్టానం కట్టబెడుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు.
*** జవహర్ ముందు అన్ని సవాళ్లే!
తిరువూరు మండలం గానుగపాడుకు చెందిన కొత్తపల్లి జవహర్ అదృష్టం కలిసి వచ్చి పొరుగు జిల్లా కొవ్వూరు వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికై చివర్లో మంత్రి అయ్యారు. మంత్రి పదవి వచ్చిన అనంతరం జవహర్ వ్యవహారశైలిలో చాలా మార్పు వచ్చింది. కొవ్వూరులో చాలా మంది దేశం నేతలను జవహర్ దూరం చేసుకున్నారు. వచ్చిన పదవిని సద్వినియోగం చేసుకోకపోతే ఎంతటి నాయకుడికైనా ఇబ్బందులు తప్పవని జవహర్ విషయంలో రుజువైంది. జవహర్ కుటుంబానికి ఈ ప్రాంతంలో మంచి పేరుంది. ఆయన అన్న రవీంద్రనాథ్ ఇక్కడ తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి కోనేరు రంగారావు చేతిలో కొద్ది ఓట్ల మెజార్టీతో పరాజయం పాలయ్యారు. జవహర్ మంత్రి అయిన అనంతరం రవీంద్ర వ్యవహారశైలిలోనూ మార్పు వచ్చింది. అధికార దర్పంతో ఇసుకు దందాలు పాల్పడుతున్నట్లు, ఇతర పైరవీలు చేస్తున్నట్లు రవీంద్ర మీద ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ మూడు సార్లు నుండి తిరువూరు పరాజయం పాలవుతూ వస్తోంది. ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే రక్షణనిధికి స్థానిక ప్రజలలో మంచి పలుకుబడి ఉంది. ప్రతి ఊరులోనూ ఆయనకు బలమైన అనుచర వర్గం ఉంది. స్థానికంగా ఉన్న తెలుగుదేశం సీనియర్ నాయకుల మధ్య సమన్వయము లేదు. గతంలో స్వామిదాసును ఓడించడంలో కొందరు నాయకులు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం జవహర్ తిరువురుకు రావడం కొందరు తెదేపాకు నేతలకు ఇష్టం లేదు. తెదేపాకు ప్రతి గ్రామంలోనూ బలమైన కార్యకర్తలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వారందరినీ సమన్వయపరచే నాయకత్వం లేకపోయింది. దీనికి తోడు వైకాపా ఎంపీ అభ్యర్థిగా పొట్లూరు వరప్రసాద్ రంగంలోకి వస్తూ ఉండటంతో వైకాపాలో తిరువూరు సీటు తిరిగి తమదేనన్న ధీమా వ్యక్తమవుతోంది. జవహర్ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎన్నికల రంగంలో పావులు కదిపితే గట్టీ పోటీ ఇచ్చినట్లు ఉంటుంది. విజయానికి దగ్గరయ్యే అవకాశం ఉంది.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.

గుడివాడలో అవినాష్ ఎందుకు? లోకేష్ ఉండగా…TNI ప్రత్యేకం

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభ్యర్థుల ఎంపికలో కొన్నిచోట్ల పొరపాట్లు చేస్తున్నట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రధానంగా కృష్ణాజిల్లాలో ఉన్న గుడివాడ అసెంబ్లీ స్థానం తెలుగుదేశానికి చాలా ప్రతిష్టాత్మకమైనది. గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు మినహా గెలుపొందింది. మొత్తం రెండు ఉప ఎన్నికలు సహా ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు తెదేపా విజయం సాధించింది. కేవలం 1989లో కాంగ్రెస్‌ నుంచి కఠారి ఈశ్వర్‌కుమార్‌, 2014లో వైకాపా నుంచి కొడాలి నాని గెలుపొందారు. 2004, 2009లోనూ కొడాలి నాని తెదేపా తరపునే పోటీ చేసి విజయం సాధించారు. 1983, 85 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ఈ స్థానం నుంచి గెలుపొంది ప్రాతినిధ్యం వహించడం విశేషం. 1985 ఉప ఎన్నికలు, 1994 ఎన్నికల్లో రావి శోభనాద్రి చౌదరి, 1999 ఎన్నికల్లో రావి హరగోపాల్‌, 2000 ఉప ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు గెలుపొందారు. అలాంటి స్థానం నుంచి ఈసారి దేవినేని అవినాష్‌ను తెదేపా తరపున పోటీలోకి దింపి కొత్త ప్రయోగానికి తెరతీశారు. ఐతే దేవినేని అవినాష్ గుడివాడ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే స్థాయి కలిగిన వ్యక్తి కాదని అక్కడి తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. గుడివాడలో రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జి యలవర్తి శ్రీనివాసరావులు తెలుగుదేశం పార్టీ అభ్యర్దిత్వాన్ని ఆశిస్తున్నారు. గుడివాడలో తెదేపా మూడు వర్గాలుగా విడిపోయింది. దీంతో చంద్రబాబు గుడివాడ స్థానాన్ని దేవినేని అవినాష్‌కి కేటాయించారు. రాజకీయ పరిశీలకులు మాత్రం ఇది చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదంగానే భావిస్తున్నారు. వాస్తవానికి గద్దె రామ్మోహన్‌ను గాని, బోడె ప్రసాద్‌ను గాని గుడివాడకు పంపించి అవినాష్‌కు వారి స్థానాల్లో ఒక స్థానాన్ని కేటాయించి ఉంటే బాగుండేది. దేవినేని నెహ్రూకు విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. బలమైన అనుచర వర్గం ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా నెహ్రు కుమారుడు అవినాష్‌కు గుడివాడను కేటాయించడం సరైన నిర్ణయం కాదని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి.
*** లోకేష్ ఉన్నాడుగా?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు రాజకీయ రంగప్రవేశం గుడివాడ నుండే ప్రారంభమైంది. 1983లోనూ, 1985లో జరిగిన ఉపఎన్నికల్లోనూ రెండవ సారి ఎన్టీఆర్ ఇక్కడి నుండే గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లుగా గుడివాడ స్థానాన్ని ఆపా ర్టీ వర్గాలు భావిస్తూ ఉంటాయి. అటువంటి చోట కొడాలి నాని తెదేపా నాయకత్వం లోపం మూలంగా బలంగా నాటుకుపోయారు. రాజకీయంగా తొలిసారి ఎన్నికల రంగంలో నిలుస్తున్న చంద్రబాబు తనయుడు నారా లోఖేష్‌కు గుడివాడ నుండి రంగంలోకి దింపితే సీటు గెలుపొందటం ఖాయమని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి.
*** కృష్ణా జిల్లాలో వైకాపా గెలిచే మొదటి స్థానం గుడివాడే!!!
తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును బలంగా విశ్వసించేవారు తప్ప రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ గుడివాడలో కొడాలి నానీని ఓడించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలో వైకాపా కన్నా కొడాలి నానికి వ్యక్తిగా మంచి పేరుంది. ముఖ్యంగా బలహీన వర్గాల్లో ఆయన బలంగా చొచ్చుకుపోయారు. గత ఐదు సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ సామ, దాన, భేద దండోపాయలు ప్రయోగించినప్పటికీ కొడాలి నానీని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురాలేకపోయారు. గత అయిదేళ్ల నుండి కొడాలి నానిపై తెదేపా ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. తెదేపా ఒత్తిళ్లకు తలొగ్గకుండా నానీ గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ అయితేనే గుడివాడలో కొడాలి నానీకి సమఉజ్జీగా ఉంటాడని తెదేపా శ్రేణులు భావిస్తున్నాయి. లేని పక్షంలో మే 23వ తేదీన వచ్చే ఫలితం తేదేపాకు వ్యతిరేకంగానే ఉంటుందని రాజకీయ పరిశీలకులు దృఢంగా విశ్వసిస్తున్నారు. గుడివాడ విషయంలో ఇప్పటికైనా చంద్రబాబు పునరాలోచన చేయాలని తెదేపా వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

విద్యాసంస్థల డబ్బులు ఎన్నికల్లోకి…

సమాజంలో పలుకుబడి, ఆర్థిక అండదండల నేపథ్యంలో విద్యాసంస్థల యాజమానులు కొందరు ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మరికొందరు ఇప్పటికే సీట్లు ఖరారు చేసుకొని ప్రచారమూ ప్రారంభించారు. వీరిలో కొందరు విద్యాసంస్థలను ఏర్పాటుచేశాక రాజకీయాల్లోకి రాగా, ఇంకొందరు రాజకీయాల్లోకి వచ్చాక కళాశాలలను స్థాపించారు. ఆశావహుల్లో కొందరికి ఎమ్మెల్యే టిక్కెట్ల హామీ లభించగా..మరికొందరు వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
*నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ గత శాసనసభ ఎన్నికల్లో పోటీచేయకున్నా తెదేపా తరపున శాసనమండలికి ఎన్నికయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
*అవంతి విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొన్నేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఈసారి ఈయన వైకాపా తరపున భీమిలి నుంచి పోటీకి దిగబోతున్నారు.
*విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత కుమారుడు కృష్ణదేవరాయలు వైకాపా తరఫున గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ ఆశిస్తున్నారు.
*నలంద విద్యాసంస్థల అధినేత వరప్రసాద్‌ రెడ్డి వైకాపా నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీచేయాలని ఈయన భావిస్తున్నారు.
*తెనాలి ప్రస్తుత ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న అలపాటి రాజేంద్రప్రసాద్‌ ఎన్‌ఆర్‌ఐ విద్యాసంస్థల్లో భాగస్వామిగా కొనసాగుతున్నారు. ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించాక విద్యాసంస్థలను స్థాపించారు.
*గుంటూరులోని పూజిత పాఠశాల నిర్వాహకులు హరిప్రసాద్‌ ఇటీవల తెదేపాలో చేరారు. ఈయన బాపట్ల టిక్కెట్‌ ఆశిస్తున్నారు.

నీతికథలు చెప్తారు. కానీ అవినీతి చేశారు.

చిన్నపిల్లల కథల పుస్తకం చందమామ మ్యాగజైన్‌ కొత్త యాజమాన్యం మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ముంబయికి చెందిన జియోడెసిక్‌ లిమిటెడ్‌ 2007లో చందమామ మ్యాగజైన్‌ను కొనుగోలు చేసింది. తాజాగా ఈ కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు స్విట్జర్లాండ్‌కు నిధులను తరలించినట్లు , ఇతర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో ప్రశాంత్‌ శారద్‌ ములెకర్‌, పంకజ్‌ కుమార్‌ ఓంకార్‌ శ్రీవాస్తవ, కిరణ్‌ కులకర్ణి ఉన్నారు. దీనిపై ఈడీ, ఎకనమిక్‌ అఫెన్స్‌ వింగ్‌, ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో స్విస్‌ ఖాతాలకు సంబంధించిన సమాచారం విషయంలో సహకారం అందిస్తామని ఇప్పటికే స్విస్‌ ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 5వ తేదీన స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) విభాగం ‘అడ్మిన్‌స్ట్రేటీవ్‌ అసిస్టెన్స్‌’ అందించేందుకు అంగీకరించింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లాలనుకుంటే 30 రోజుల గడువు ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లారు. ఇప్పడు మళ్లీ స్వీస్‌ ఎఫ్‌టీఏ అటువంటి నిర్ణయమే తీసుకొంది. జియోడెసిక్‌ సంస్థ ఇప్పటికే సెబీ నుంచి పలు ఆంక్షలను ఎదుర్కొంటంది. ఆగస్టు 2014 నుంచి ఈ సంస్థ షేరు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అప్పటికే దీని ధర భాగా కుంగిపోయింది. తాజాగా ఈ కంపెనీతోపాటు చెన్నైకి చెందిన ఆది ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఇటువంటి ఆరోపణలనే ఎదుర్కొంటోంది. ఈ కంపెనీకి సంబంధించి కూడా స్విస్‌ ప్రభుత్వం సమాచారాన్ని పంచుకొనేందుకు సిద్ధమైంది.

జవహరా? స్వామిదాసా? తిరువూరు తెదేపాలో వీడని సస్పెన్స్!

కృష్ణాజిల్లాలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలుగుదేశం అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ తిరువూరు రిజర్వుడు నియోజకవర్గంలో మాత్రం ఇంకా తెలుగుదేశం అభ్యర్థి ఖరారు కాలేదు. గత మూడు సారుల నుండి తిరువూరులో నల్లగట్ల స్వామిదాస్ పరాజయం పాలవుతూ ఉండటంతో ఈ పర్యాయం అధిష్టానం తిరువూరు సీటు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మళ్లీ స్వామిదాస్ తనకే సీటు ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. మరొకపక్క తిరువురుకే చెందిన ఎక్సైజ్ శాఖా మంత్రి కొత్తపల్లి జవహర్‌ను తిరువూరుకు పార్టీ అభ్యర్థిగా ప్రకటించే విషయంపై కూడా కసరత్తులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరులో ఈసారి మంత్రి జవహర్ మాకోద్దంటూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. దీనితో మంత్రి జవహర్‌ను తిరువూరుకు పంపించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇది గమనించిన తిరువూరు నియోజకవర్గ తెదేపా సీనియర్ నేతలు తమకు మంత్రి జవహర్ వద్దని మళ్లీ స్వామిదాసే మాకు ముద్దని కట్టకట్టుకుని చంద్రబాబుకు విన్నవించుకుంటున్నారు. మరొక పక్క వైకాపా తరపున ప్రస్తుత ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మళ్లీ బారిలోకి దిగుతున్నారు. ఆయన ప్రచారాన్ని ఇప్పటికే ముమ్మరం చేశారు. మంత్రి జవహర్ తిరువూరుకి వస్తున్నారంటే స్థానిక తెదేపా సీనియర్ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ఇప్పటి వరకు స్వామిదాసును తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుల సైతం జవహర్ కన్నా స్వామిదాసే నయమని భావిస్తున్నారు. మొత్తంమీద తిరువూరు సీటు విషయంలో మరి కొంత కాలం వేచి చూసే ధోరణిలో తెదేపా అధిష్టానం ఉంది. నామినేషన్ల ముందు రోజు వరకు తిరువూరు అభ్యర్థి విషయం తేలే పరిస్థితులు కనిపించడం లేదు. మరికొందరు తెదేపా అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి జవహర్ స్వామిదాసుల పేర్లను పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరపున పరసా రాజీవ్ రతన్ కానీ , మాజీ మంత్రి కోనేరు రంగారావు కుమార్తె తాంతియా కుమారి కానీ బరిలోకి దిగే అవకాశం ఉంది.

నోట్ల రద్దుతో కోటి ఉద్యోగాలు మాయం

భారత్‌లో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల(ఫిబ్రవరి -2019)లో దీని రేటు అత్యధికంగా 7.2 శాతానికి చేరింది. 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. గతేడాది ఫిబ్రవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేలాది ఇళ్లలో సర్వే చేసి ఈ నివేదికను సీఎంఐఈ వెల్లడించింది. ఉద్యోగార్థుల సంఖ్య తగ్గినప్పటికీ.. నిరుద్యోగ రేటు పెరిగిందని ముంబయికి చెందిన ఓ సంస్థకు హెడ్‌ అయిన మహేశ్‌ వ్యాస్‌ తెలిపారు. ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్య ఫిబ్రవరిలో 400 మిలియన్లు ఉంటుందని అంచనా వేశామన్నారు. ఇది గతేడాది 406 మిలియన్లుగా ఉందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 2018లో దాదాపు 1.10కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సీఎంఐఈ జనవరి నివేదిక వెల్లడించింది. మరోవైపు నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగాలపై ఏ మేరకు ఉందో తెలిపే సమాచారం తమ వద్ద లేదని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ఈ గణాంకాలు త్వరలో ఎన్నికలకు సిద్ధం కానున్న ప్రధాని నరేంద్రమోదీకి నిరాశ కలిగించే విధంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.

పాకిస్థాన్ చెంప మీద లాగిపెట్టి కొట్టిన అమెరికా

ఉగ్రవాదం విషయంలో పలు దేశాల నుంచి మొట్టికాయలు వేయించుకుంటున్న పాక్‌కు తాజాగా అమెరికా వీసా షాక్‌ ఇచ్చింది. పాకిస్థాన్‌ పౌరులకు సంబంధించి వివిధ కేటగిరీ వీసాల కాలపరిమితిని తగ్గించింది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి కొత్త విధివిధానాలను మంగళవారం వెల్లడించారు.వర్క్‌, మిషనరీస్‌కు సంబంధించిన వీసాల గడువును ఐదేళ్ల నుంచి ఏడాదికి కుదించింది. జర్నలిస్టుల వీసాల గడువును కూడా ఐదేళ్ల నుంచి మూడు నెలలకు తగ్గించింది. పాక్‌ పౌరులకు వీసా దరఖాస్తు రుసుమును కూడా 160 డాలర్ల నుంచి 192 డాలర్లకు పెంచింది. అయితే, వర్తక, టూరిజం, స్టూడెంట్‌ వీసాల కాలపరిమితి మాత్రం ఐదేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.
ఇటీవల అమెరికా పౌరుల వీసాల విషయంలో పాక్‌ మార్పులు చేపట్టిన నేపథ్యంలో దానికి ప్రతిగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. అంతకుముందు పాక్‌ కూడా అమెరికా పౌరుల వీసా గడువును తగ్గించడంతో పాటు దరఖాస్తు రుసుమును కూడా పెంచింది.

ఏపీ డబ్బులతో అమెరికా వచ్చిన వారిలో కృష్ణా-గుంటూరు వాసులే అధికం

డబ్బుండి సొంతంగా విదేశాల్లో చదవాలన్నా, ప్రభుత్వ సాయంతో విదేశీబాట పట్టాలన్నా మనోళ్ల లక్ష్యం మాత్రం అగ్రరాజ్యమే! ఎన్ని ఇబ్బందులున్నా, ఖర్చులు ఎక్కువైనా అక్కడే చదవాలి. ఆ దేశంలోనే ఉద్యోగం చేయాలనేది విద్యార్థుల కల. పేద విద్యార్థుల ఆలోచనలూ ఇందుకు భిన్నమేం కాదు. వారు కూడా అమెరికాకే ఓటేస్తున్నారు. కానిపక్షంలో మాత్రమే ఇతర దేశాలవైపు చూస్తున్నారు. అమెరికా కాకపోతే ఆ తర్వాత ఓటు ఆస్ర్టేలియాకు వేస్తున్నారు. విదేశీవిద్య పథకంపై కాపు కార్పొరేషన్‌ చేసిన విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం 2017-18 ప్రామాణికంగా కాపు కార్పొరేషన్‌ విద్యార్థులు ఎంచుకున్న దేశాలు, చేస్తున్న కోర్సులు, వారికి రాయితీ చెల్లింపులను విశ్లేషించింది. ఈ ఏడాదిలో మొత్తం 978 మంది విద్యార్థులను విదేశీవిద్య దీవెన పథకానికి ఎంపిక చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.10లక్షలు ఆర్థిక సాయంతో పాటు విమాన ప్రయాణ ఖర్చులు, వీసా ఖర్చులూ ఇచ్చింది. కాగా.. ఈ 978లో 322 అంటే 32.9శాతం మంది అమెరికాకు వెళ్లారు. ఆ తర్వాత 192 (19.6శాతం) మంది ఆస్ర్టేలియా వెళ్లారు. ఆ తర్వాత కెనడా, ఫిలిప్పీన్స్‌, జర్మనీ దేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. 2017-18లో ఏ దేశానికి వెళ్లాళి అనేదానిపై షరతులు లేకపోవడంతో 32 దేశాలకు విద్యార్థులు ఎంపికయ్యారు. అందులో యూఎస్‌, కెనడా, ఆస్ర్టేలియా, యూకే లాంటి దేశాల్లో కోర్సుల ఫీజులు ఎక్కువగా ఉంటాయి. కానీ కోర్సుల ఫీజులు చాలా తక్కువగా ఉండే దేశాలకు కూడా విద్యార్థులను ఎంపిక చేశారు. 2018-19 నుంచి 15 దేశాల జాబితాను రూపొందించారు. డిమాండ్‌ లేని యూనివర్సిటీలను తొలగించారు. 2017-18లో బంగ్లాదేశ్‌, బెలిజ్‌, గయానా, నార్వే, దక్షిణ కొరియా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, యూఏఈలకు ఒక్కో విద్యార్థి చొప్పున వెళ్లగా వారికి కూడా రూ.10లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేశారు. దీంతో నేపాల్‌, భూటాన్‌, అఫ్ఘానిస్థాన్‌లకూ దరఖాస్తులు వెల్లువెత్తడంతో దేశాల జాబితాపై షరతులు తీసుకొచ్చారు. విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సులు చేస్తున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎ్‌సకు మొగ్గు చూపుతున్నారు. 2017-18లో కంప్యూటర్‌ సైన్స్‌ను 341, ఎంబీబీఎ్‌సను 113 మంది ఎంచుకున్నారు. మాస్టర్స్‌ ఆఫ్‌ సైన్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎంబీఏ కోర్సులు ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఉన్నాయి. ఈ పథకంలో కృష్ణా, గుంటూరు జిల్లాల విద్యార్థులే ఎక్కువగా లబ్ధి పొందారు. స్వయం ఉపాధి పథకంలో ఎక్కువగా గోదావరి జిల్లాల్లోని కాపులు లబ్ధి పొందుతుంటే విదేశీవిద్యలో మాత్రం ఈ రెండు జిల్లాలు ముందున్నాయి. కృష్ణా జిల్లా నుంచి 294, గుంటూరు 234, తూర్పుగోదావరి 130, పశ్చిమగోదావరి 113, విశాఖపట్నం 57, చిత్తూరు 44, ప్రకాశం 35, కడప 22, అనంతపురం 16, నెల్లూరు 13, కర్నూలు 7, శ్రీకాకుళం 7, విజయనగరం 6 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొంది విదేశాలకు వెళ్లారు. తొలుత ఒక దేశాన్ని ఎంపిక చేసుకుని తర్వాత వేరొక దేశానికి మారినా విదేశీవిద్య పథకం వర్తించేలా కాపు కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత జాబితాలో ఉన్న దేశాలకు మార్చుకుంటే లబ్ధి చేకూర్చనుంది. అలాగే యూనివర్సిటీ మార్చుకున్నా కూడా లబ్ధి కొనసాగనుంది. దీనిపై కాపు కార్పొరేషన్‌ ప్రభుత్వం అనుమతికి నివేదిక పంపింది. కాగా విదేశీవిద్య పథకంలో పెండింగ్‌ దరఖాస్తులపై మాత్రం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. గతంలో రెండు, మూడు సెమిస్టర్లు పూర్తిచేసిన వారికీ సాయం చేశారు. దీంతో ఈ ఏడాదిలో చాలా మంది ఆ తరహాలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం వాటిపై నిర్ణయం తీసుకోవడం లేదు. సెమిస్టర్లన్నీ పూర్తయిన వారికీ ఆర్థిక సాయం చేయడం సరికాదనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

తిరువూరు తెదేపాలో అనిశ్చితి. ప్రచారంలో వైకాపా–TNI ప్రత్యేకం


కృష్ణాజిల్లాలో తిరువూరు నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఉండేది. ప్రజల్లో తెదేపాకి మంచి మద్దతు ఉంది. నాయకత్వ లోపం మూలంగా గత మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. ముచ్చటగా మూడు సార్లు ఓడిపోయినా నల్లగట్ల స్వామిదాస్ తిరిగి తెదేపా అభ్యర్థిత్వం తనకే కావాలంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎప్పటిలాగానే నియోజకవర్గంలో ఉన్న తెదేపా సీనియర్ నాయకులు ఈసారి కూడా స్వామిదాసుకే మళ్ళీ అభ్యర్ధిత్వం ఇవ్వాలని కోరుతున్నారు. ఈమేరకు సంతకాల సేకరణ కూడా స్వామిదాసుకు మద్దతుగా జరుపుతున్నారు. కొత్తవారికన్నా స్వామిదాస్ అయితేనే తమకు అనుకూలంగా ఉంటుందని స్థానిక తెదేపా నాయకులూ భావిస్తున్నారు. మొన్నటి వరకు స్వామిదాస్ వద్దని బహిరంగంగా ప్రకటించిన నాయకులు కూడా ఇప్పుడు స్వామిదాస్ అయితేనే మంచిది అంటున్నారు. మంత్రి జవహర్ కానీ, మాజీ ఎమ్మెల్యే పద్మజ్యోతికి కానీ టికెట్ వస్తే తిరువూరు నియోజకవర్గంలో తమ ఆటలు సాగవని తెదేపా నాయకులు భావిస్తున్నారు.
*** తేల్చుకోలేకపోతున్న అధిష్టానం
తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిని అంచనా వేయడంలో పార్టీ అధిష్తానం సరైన దృష్టి పెట్టలేకపోయింది. ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో ఒక అవగాహనకు రాలేకపోయింది. మళ్ళీ స్వామిదాసుకు టికెట్ ఇవ్వడానికి అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎంపీ కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమా తిరువూరు అభ్యర్థి విషయంలో చొరవ చూపడం లేదు. స్వామిదాసుకు అనుకూలంగా అధిష్టానానికి సిఫారసు చేయాలని ఇటీవల తిరువూరు తెదేపా నాయకులు మంత్రి ఉమాను, ఎంపీ నానీని కలిశారు. అయితే వీరిరువురు మౌనంగా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుండటంతో తిరువూరు తెదేపా అభ్యర్థి విషయంలో స్పష్టత లేకపోవడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొని ఉంది.
*** ప్రచారం ప్రారంభించిన వైకాపా
తిరువూరులో వైకాపా ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రస్తుత శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధికే పార్టీ అధిష్టానం మళ్ళీ పోటీ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల రణరంగానికి సిద్దమవుతున్నారు. స్థానిక వైకాపా కార్యాలయం సందడిగా ఉంటోంది. రక్షణనిధి ఇక్కడే ఉంటూ ఓటర్లను కలుసుకునే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ పర్యాయం తిరువూరు నియోజకవర్గంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. తెదేపా, వైకాపా కాకుండా మిగిలిన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే విషయంపై స్పష్టత రాలేదు. జనసేన పార్టీ తరపున పోటీ చేయటానికి ఇప్పటి వరకు మూడు పార్టీలు మారిన నంబూరి శ్రీనివాసరావు సిద్దమవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, కమ్యునిస్టు, భాజపా, బీఎస్పీ తదితర పార్టీల ఎన్నికల వ్యూహం ఏమిటో ఇప్పటి వరకు బహిరంగం కాలేదు. ఈసారి నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్లు కూడా ఎక్కువ మంది బరిలోకి దిగే అవకాశం ఉంది.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.

పాక్‌ను మోడీ ఢీ కొడతారా? యుద్ధం తప్పదా?–TNI ప్రత్యేకం


పుల్వమాలో ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ సరిహద్దుల్లో రోజురోజుకు ఉద్రిక్తత్ర పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. జరిగిన, జరుగుతున్న సంఘటనలను గమనిస్తూ ఉంటె ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం మన జవాన్ల మృతి అనంతరం పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఒంటరి చేసే ప్రయత్నాలు చేపట్టింది. దీనికి తోడు పాక్ ను ఆర్ధికంగా దెబ్బ తీసే చర్యలను చేపట్టింది. మనదేశం నుండి హిందూ జలాలు పాకిస్థాన్ కు వెళ్ళకుండా కట్టడి చేసింది. శుక్రవారం నాడు భారత్ మరో ముందడుగు వేసింది. వాఘా సరిహద్దుల గుండా పాకిస్థాన్ నుండి ట్రక్కుల ద్వారా భారత్ కు దిగుమతి అవుతున్న అన్ని సరుకులను నిలిపివేసింది. మరొకపక్క పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ తో యుద్దానికి సన్నద్ధం అంటూ సవాళ్ళు విసురుతున్నారు. ఈ పరిస్థితులు గమనిస్తూ ఉంటె భారత్ – పాక్ ల మధ్య యుద్ధం వస్తుందా అనే సందేహాలు ఇరు దేశాల ప్రజల్లో ఏర్పడ్డాయి.

*** వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ లారీల నిలిపివేత
పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ దాడి ఘటన అనంతరం పాకిస్థాన్ దేశం నుంచి వివిధ రకాల సరకులతో వస్తున్న లారీలను సరిహద్దుల్లో నిలిపివేశారు. అట్టారి-వాఘా సరిహద్దుల్లో పాక్ లారీలను నిలిపివేయడంతో రోడ్డుపై బారులు తీరాయ. పాక్ నుంచి సరకుల దిగుమతిని నిషేధించిన నేపథ్యంలో తాము సర్కారు నిర్ణయాన్ని గౌరవిస్తూ తాము మద్ధతు ఇస్తున్నట్లు రాజ్ దీప్ అనే ఉప్పల్ అనే వ్యాపారి చెప్పారు. కశ్మీర్ మీదుగా కూడా పాక్ సరకుల దిగుమతిని నిలిపివేయాలని వ్యాపారులు డిమాండ్ చేశారు.పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే సరకుల రవాణను నిలిపివేసిన వ్యాపారులు తాము చెల్లించిన అడ్వాన్సులను తిరిగి చెల్లించాలని కోరాచరు. పాక్, భారత్ ల మధ్య వర్తకం నిలిచిపోవడంతో సరిహద్దుల్లో 250 లారీలు నిలిచిపోయాయి.

*** యుద్దానికి పాక్ సన్నద్ధం
భారత్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా దాడి చేసినా దీటుగా సమగ్రంగా స్పందించాలని పాకిస్తాన్ సైన్యాన్ని ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. పుల్వామా దుర్ఘటన తరువాత భారత్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపద్యంలో ఇమ్రాన్ ఖాన్ అద్యక్షతన పాకిస్తాన్ భద్రతా మండలి గురువారం సమావేశమైంది. త్రివిధ దళాధిపతులు, భద్రతా సంస్థలు, విదేసహ్మ్గా అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రులు సహాయ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పుల్వామా దాడి తదనంతరం పరిణామాల పై చర్చించారు. పుల్వామాలో జరిగిన దాడితో పాకిస్తాన్ కు ఎలాంటి సంబంధం లేదని ఎన్ఎస్సి పేర్కొంది. దుర్ఘటనను కేవలం ఓ సంగటనగా అభివర్ణించింది.

*** హఫీజ్ సయీద్ సంస్థల పై నిషేధం
పుల్వామా దాడి నేపద్యంలో ఉగ్రమూకలు కట్టడి చేయాల్సిందే అంటూ అంతర్జాతీయగా వస్తున్న ఒత్తిల్ల కు పాకిస్థాన్ ప్రభుత్వం తలొగ్గింది. ముంబాయి దాడులకు సూత్రధారి కరడు గట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా, దాని అనుబంద దాతృత్వ సంస్థ ఫలాహీ ఇన్సానీయత్ పౌండేషన్ ల పై నిషేధం విధించింది. గురువారం ఇస్లామాబాద్ లో సమావేశమైన జాతీయ భద్రతా కమిటీ ఈ నిర్ణయం తీసుకునట్లు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ నిషేధం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది ప్రకటించలేదు.

ఆసక్తికరంగా శ్రీకాకుళం ఎంపీ పోటీ

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో తెదేపా, మూడు స్థానాల్లో వైకాపా విజయం సాధించాయి. పాతపట్నం వైకాపా ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆ తర్వాత తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. పాలకొండ, రాజాం మాత్రమే వైకాపా చేతిలో ఉన్నాయి. జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలు శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలో ఉన్నాయి. దీన్ని గత ఎన్నికల్లో తెదేపా కైవసం చేసుకుంది. ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉండగా.. పాలకొండ అరకు ఎంపీస్థానం పరిధిలో ఉంది. శ్రీకాకుళం ఎంపీ స్థానంలో మొదట్నుంచి కింజరాపు కుటుంబానికే పట్టం కడుతున్నారు. తండ్రి ఎర్రనాయుడు చేసిన అభివృద్ధిని మించి తనయుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేశారనే పేరు తెచ్చుకున్నారు. అందుకే దీటైన అభ్యర్థిని బరిలో నిలపాలని వైకాపా ప్రయత్నిస్తున్నాఅది ప్రస్తుతానికి ఫలించడం లేదు. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైకాపాలో చేరిన నేపథ్యంలో ఆ పార్టీకి కొంతమేర బలం చేకూర్చే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే, ఇచ్చాపురం మొదటి నుంచి తెదేపాకి మంచి పట్టున్న నియోజకవర్గం. 2004 ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్నిసార్లు ఇక్కడ సైకిల్‌దే గెలుపు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలిచిన బి.అశోక్‌పై ప్రజల్లో మిశ్రమ స్పందన కన్పిస్తోంది. ప్రత్యర్థి వైకాపా సమన్వయకర్తలను తరచూ మార్చుతూ ఉండడం ఆ పార్టీకి నష్టమనే భావన ఉంది. ఉద్దానం కిడ్నీసమస్యని ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోవడం వల్ల మరోసారి ఇచ్చాపురం తమదేనని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పలాస ఎమ్మెల్యే గౌతం శ్యాంసుందర్‌ శివాజీ 1983 నుంచి కేవలం 2009 మినహా అన్ని ఎన్నికల్లోనూ విజయభేరీ మోగించారు. ఈ సారి శివాజీ స్థానంలో ఆయన కుమార్తె గౌతు శిరీష ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె తెదేపా జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వజ్జ బాబూరావు ఆ తర్వాత తెదేపాలో చేరారు. స్థానిక వైద్యుడిగా గుర్తింపు ఉన్న సీదిరి అప్పలరాజు వైకాపా తరపున పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అభ్యర్థులు ఎవరున్నా ఇక్కడ హోరాహోరీగా పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి.మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో గతంలో ఐదుసార్లు తెదేపా, మూడుసార్లు కాంగ్రెస్‌ విజయం సాధించాయి. అక్కడ వైకాపాకు మంచి క్యాడర్‌ ఉన్నప్పటికీ బలమైన అభ్యర్థి ఎవరూ కన్పించడం లేదు. తాజాగా జగన్‌ను కలిసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఇక్కడ పోటీకి దిగితే బలమైన అభ్యర్థిగా మారే అవకాశం ఉంది. ఎన్నడూ లేని రీతిలో చేసిన అభివృద్ధే తమను గెలుపు సాధించి పెడుతుందన్న భావనలో తెదేపా ఉంది.

ట్రంప్ బల్ల మీద హెచ్4 EAD బిల్లు

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిని తొలగించేలా తయారుచేసిన ప్రతిపాదనలు శ్వేతసౌధానికి చేరుకున్నాయి. ఈ ప్రతిపాదనలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ.. వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై శ్వేతసౌధం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయి. అయితే, ఇది ఇప్పుడే జరగదని, దీనికి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ‘‘ప్రతిపాదనలపై వైట్‌హౌస్‌ విస్తృత సమీక్ష చేపడుతుంది. పలు ఏజెన్సీల నుంచి సమచారం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొన్ని వారాలు లేదా నెలలు కూడా పట్టొచ్చు’’ అని అధికారులు పేర్కొన్నారు. శ్వేతసౌధం ఆమోదించిన తర్వాత ఈ సంబంధిత రెగ్యులేషన్‌ను ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మార్పులు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఒక వేళ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే భారతీయులే ఎక్కువ నష్టపోతారు. హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి జీవిత భాగస్వాములు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధానాన్ని తొలగిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ప్రకటించారు. దీన్ని భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు, పలు సంఘాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్‌ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకుండా చట్టంలో మార్పులు చేసేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. కొత్త చట్టం అమల్లోకి వస్తే నష్టపోయేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 90వేల మందిలో అత్యధికులు భారతీయులే. తాజా ప్రతిపాదనల వల్ల ఇకపై హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబాల్లో ఒకరు మాత్రమే ఉద్యోగం చేసేందుకు వీలుంటుంది. దీంతో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి.

తానా తదుపరి అధ్యక్షుడిగా లావు అంజయ్య చౌదరి?–TNI ప్రత్యేకం

అమెరికాలో అతిపెద్ద జాతీయ స్థాయి తెలుగు సంఘం “తానా” ఎన్నికల్లో మొదటి ఘట్టం పూర్తయింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తానా పెద్దలు కోరుకున్న విధంగా ప్రస్తుత కార్యదర్శి, అట్లాంటాకు చెందిన లావు అంజయ్య చౌదరి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికలు ఏకగ్రీవంగా అయినట్లే కనిపిస్తున్నప్పటికీ పలు సంచలనాలతో ఎన్నికల ఘట్టం ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు ప్రధాన పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తానా ఫౌండేషన్ సభ్యుల పదవులకు మాత్రం ఎన్నిక జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం అయిదు పదవులకు 8మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. తానా కార్యదర్శిగా పొట్లూరి రవి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

*** “తానా” ప్రముఖులు తప్పుకుంటున్నారు.
తానా అధ్యక్ష పదవికి పోటీ చేస్తామని తొలుత ప్రకటించిన తానా ఫౌండేషన్ మాజీ అధయ్కుడు, డెట్రాయిట్‌కు చెందిన గోగినేని శ్రీనివాస తానాలో నుంచి తాను పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తానాలో ఇమడలేకపోతున్నట్లు గోగినేని తెలిపారు. అధ్యక్ష పదవికి తాను పోటీలో ఉంటున్నట్లు సీనియర్ నాయకుడు, తానా ఫౌండేషన్ చైర్మన్ డా.నల్లూరి ప్రసాద్ ప్రస్తుత పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తానా ఫౌండేషన్ చైర్మన్ పదవి నుండి తానూ తప్పుకుంటున్నట్లు తానా కార్యవర్గానికి నల్లూరి ప్రసాద్ లేఖ రాసినట్లు సమాచారం. అయితే తానా కార్యవర్గం ప్రసాద్ రాజీనామాను ఆమోదించలేదని సమాచారం. మొత్తం మీద తానా ఎన్నికల ఘట్టం ప్రశాంతంగానే ముగుస్తున్నప్పటికి సీనియర్లలో ఉన్న అసంతృప్తిని తొలగించడంలో ప్రస్తుత తానా కార్యవర్గం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడవలసి ఉంది. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.

దాడి చెయ్…మోడీపై పెరుగుతున్న ఒత్తిడి. ఎన్నికలు వాయిదా పడతాయా?-TNI ప్రత్యేకం


పుల్వామాలో పాక్ ముష్కరులు మన జవానులను బలిగొన్న అనంతరం దేశం ప్రజల్లో పాకిస్థాన్‌పై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. గంటగంటకు కేంద్ర ప్రభుత్వంపై దేశప్రజలు సామాజిక మాధ్యమాలతో పాటు ఇతర సాధనాల ద్వారా దెబ్బకు దెబ్బ తీయమని ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించమని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే భారతదేశం నలుమూలల నుండి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. కేంద్రం కూడా పాక్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమవారం నాడు భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. పుల్వామాలో ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో మరో నలుగురు భారత జవాన్లు ఎదురు కాల్పుల్లో మృతి చెందడం దేశ ప్రజల ఆగ్రహాన్ని మరింతగా పెంచింది. పుల్వామా దాడులకు ప్రధాన సూత్రధారుడైన ఒక ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టడం ప్రజలకు కాస్త ఊరటనిచ్చింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక విన్యాసాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో పాకిస్తాన్ హైకమీషనర్‌ను ఆ దేశం సోమవారం స్వదేశానికి పిలిచింది. ప్రపంచ స్థాయిలో పాకిస్థాన్‌ను ఏకాకి చేయడం కోసం భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నిస్తున్నాయి. ఏ నిమిషంలోనైనా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపుదాడి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌లో పెంచి పోషిస్తూ భారత్‌పై దాడులకు తెగబడుతున్నారు. ఉగ్రవాద సంస్థ అధినేతలను మట్టుబెట్టాడానికి భారత్ సైన్యం సన్నద్ధమవుతోంది. అమెరికా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన తరహాలోనే ఈ ఉగ్రవాద నేతలను కూడా హతమార్చాలని భారత ప్రజలు మన సైన్యాన్ని గట్టిగా కోరుతున్నారు. మొత్తం మీద ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాక్‌పై దాడులకు సన్నద్ధమవుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

***ఎన్నికలు వాయిదా పడతాయా?
మరొక పదిరోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు, ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎలక్షన్ కమీషన్ తయారవుతోంది. మరొక పక్క భారత్ పాకిస్థాన్‌పై దాడులకు సిద్ధపడితే ఎన్నికలు కచ్చితంగా వాయిదా పడతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనిపై ఒకటి లేదా రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

*** సరిహద్దుల్లో టెన్షన్! టెన్షన్!!
జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాశ్మీర్ లోయలో బంద్ కొనసాగుతోంది. బంద్ నేఫథ్యంలో భారీగా బలగాలను మొహరించారు. అటు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. మరోవైపు ప్రతీకార దాడికి భారత సైన్యం వ్యూహరచన చేస్తోంది. సరిహద్దులో 140 యుద్ద విమానాలను మొహరించాయి. వాయు విన్యాసాల జరుపుతున్నట్లు తెలుస్తోంది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల అంత్యక్రియలు ముగిశాయి. వేలాది మంది అశ్రునయనాలు, కన్నీటిధారల మధ్య వీరసైనికులకు వీడ్కోలు పలికారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరులను స్మరించుకున్నారు. ఢిల్లీ నుంచి ఎప్పుడైతే అమరుల పార్ధివ దేహాలు తమ సొంతూళ్లకు చేరుకున్నాయో.. అప్పటి నుంచి ఆయా గ్రామాల్లో నిర్వేదం అలుముకుంది. కుటుంబ సభ్యుల కన్నీటి రోదనలతో గుండె చెరువైంది. జవాన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చుట్టుపక్క గ్రామాల నుంచి భారీగా తరలిరావడంతో వీరసైనికుల గ్రామాలు జన సంద్రంగా మారిపోయాయి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్

నిర్భయ దోషులను ఎందుకు ఉరి తీయలేదు?

2012 అత్యాచార కేసులో దోషులైన నలుగురిని త్వరగా ఉరి తీయాలంటూ నిర్భయ తల్లిదండ్రులు గురువారం దిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం మార్చి 2న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దేశ రాజధాని దిల్లీలో 2012 డిసెంబరు 16న తన స్నేహితుడితో కలిసి బస్సులో వెళ్తున్న నిర్భయపై ఆరుగురు దుర్మార్గులు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. యావత్‌ భారతదేశాన్ని ఈ ఘటన కుదిపేసింది. ఈ కేసులో ముఖేశ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌కుమార్‌ సింగ్‌, రామ్‌ సింగ్‌, ఓ జువైనల్‌ దోషులుగా తేలారు. దోషులుగా తేలిన ఐదుగురికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. నిందితుల్లో ఒకరు జువైనల్‌ కావడంతో అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అతడి శిక్షా కాలం పూర్తి కావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. మరో దోషి రామ్‌ సింగ్‌ జైల్లోనే తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా వారంతా జైల్లోనే ఉన్నారు. ఇన్నేళ్లు గడిచినప్పటికీ దోషులను ఇంకా ఉరి తీయకపోవడంపై నిర్భయ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. గతేడాది డిసెంబరులో కూడా నిర్భయ దోషులను త్వరగా ఉరి తీయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కాగా.. దీన్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

రక్షణనిధిని తిరువూరు ప్రజలు తిరిగి రక్షిస్తారా?-TNI ప్రత్యేకం

షెడ్యూలు కులాలకు రిజర్వు చేసిన తిరువూరు నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోరు అధికార తెదేపా, వైకాపా మధ్య భీకరణంగా ఉండబోతోంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తెదేపా ఈ పర్యాయం తప్పనిసరిగా గెలుస్తామనే ధీమాతో ఉంది. గత పర్యాయం తిరువూరు నుండి విజయం సాధించిన వైకాపా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసుకుంటోంది.

*** రక్షణనిధిని మళ్ళీ ప్రజలు రక్షిస్తారా?
తిరువూరు నియోజకవర్గానికి ఒక ఆనవాయితీ ఉంది. ఇక్కడి ప్రజలు స్థానిక వ్యక్తులను కాకుండా బయటి నుండి వచ్చిన వ్యక్తులనే ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఈ కోవకు చెందిన వారే ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి. తోట్లవల్లూరుకు చెందిన రక్షణనిధి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు కేవలం కొద్ది రోజుల ముందే తిరువూరులో ప్రత్యక్షమయ్యారు. వైకాపా సీటు సంపాదించి స్థానిక ప్రజలకు పరిచయం లేకపోయినా ఇప్పటి అధికార పార్టీ అభ్యర్థి స్వామిదాస్‌పై ఉన్న వ్యతిరేకత మూలంగా ఎన్నికల్లో విజయం సాధించారు.

*** రాష్ట్రంలోనే ఆదర్శ ఎమ్మెల్యే
ఎక్కువగా చదువుకోలేకపోయినప్పటికీ, వెనుకబడిన కులంలో జన్మించినప్పటికీ, సంస్కారంలో, వినయ విధేయతలలోనూ రక్షణనిధి మిగిలిన ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కోట్ల కొద్దీ అక్రమ ఆస్తులను వెనుక వేసుకుని, అధికార దాహంతో చాలా మంది ఎమ్మెల్యేలు అక్రమ సంపాదన కోసం, అధికారం, పదవుల కోసం పార్టీని ఫిరాయించినప్పటికీ రక్షణనిధి మాత్రం ఉక్కు మనిషిలాగా తనను ఆదరించిన వైకాపాలోనే కొనసాగారు. కోట్లాది రూపాయల ఆఫర్లు వచ్చినా ఏమాత్రం ప్రలోభాలకు లొంగకుండా రక్షణనిధి దృఢంగా నిలబడ్డారు. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులు తనను చూసి సిగ్గుపడే విధంగా రక్షణనిధి వ్యవహరించారు.

*** కోట రామయ్య బాటలో రక్షణనిధి
గత యాభై సంవత్సరాల నుండి తిరువూరు నియోజకవర్గం షెడ్యుల్ కులాలకు రిజర్వుడు స్థానంలో ఉంది. ఇక్కడి నుండి తొలినాళ్ళలో ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందిన కోట రామయ్యకు మంచి వ్యక్తిగా ప్రజల్లో ఆదరణ ఉండేది. ప్రతినిత్యం ప్రజల మధ్యే ఉంటూ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ కోట రామయ్య తిరువూరు ప్రజల హృదయాల్లో ఆదర్శ ఎమ్మెల్యేగా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన తరువాత అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి మళ్లీ తిరువూరు ప్రస్తుత ఎమ్మెల్యే రక్షణనిధే అనటంలో ఏమాత్రం సందేహం లేదు. తన ఎమ్మెల్యే పదవీ కాలంలో రక్షణనిధి మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవటం విశేషం. వివాదాలకు, వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా రక్షణనిధి తన పదవీ కాలాన్ని ముగించబోతున్నారు.

*** రక్షణనిధిని పక్కదారి పట్టించారు.
రక్షణనిధి మంచి వ్యక్తే అయినప్పటికీ ఆయన చుట్టూ చేరిన నాయకులు మాత్రం ఆయనను పక్కదారి పట్టించారు. ప్రజలుకు దూరంగా ఉండేటట్లు చూశారు. ఎమ్మెల్యేగా ఎన్నికయిన అనంతరం స్థానికంగా ఉన్న ఆర్ అండ్ బీ అతిథి గృహం పక్కనే గృహం నిర్మించుకోవడానికి ఎమ్మెల్యే స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటే తమ నాయకత్వం సాగదని భావించిన కొందరు వైకాపా నాయకులు ఆయనను తోట్లవల్లూరుకు పరిమితం చేశారు. గత సంవత్సర కాలం నుండే రక్షణనిధి తిరువూరు ప్రజల మధ్య చురుగ్గా తిరుగుతున్నారు.

*** ఈసారి వైకాపా గెలుపు అంత సులువు కాదు.
తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రక్షణనిధి చాలా కాలం వరకు స్థానిక ప్రజలకు దూరంగా ఉన్నారు. ఆయన అతిధి లాగానే తిరువూరుకి వచ్చేవారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల బారి నుండి వైకాపా శ్రేణులను కాపాడుకోలేకపోయారని ఈ అయిదేళ్లల్లో పార్టీని పటిష్టవంతం చేయలేకపోయారని ప్రస్తుత ఎమ్మెల్యే మీద అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుడివాడలో కొడాలి నాని, నూజివీడులో ప్రతాప్ అప్పారావుల లాగా తిరువూరులో రక్షణనిధి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడపలేకపోయరని పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆతంస్థైర్యాన్ని నింపలేకపోయారనే అభిప్రాయం స్థానిక ప్రజల్లో ఉంది. ఆయన ద్వారా నియోజకవర్గానికి అయిన పనులు కూడా పెద్దగా ఏమీ లేవు. తెలుగుదేశం ప్రభుత్వం విధానాలు ఎండగట్టడంలో ఆయన వెనుకబడిపోయారు. ఇటువంటి చిన్న ఆరోపణలు తప్ప రక్షణనిధికి వ్యక్తిగా నియోజకవర్గంలో మంచి పేరుంది. ఒక దశలో రక్షణనిధిని పామర్రు నియోజకవర్గానికి పంపిస్తారని, తిరువూరు వైకాపా అభ్యర్ధిగా కొత్త వ్యక్తి వస్తారని వార్తలు వచ్చాయి. అయితే రక్షణనిధి మాత్రం తిరువూరు వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తూ ఉంటే వైకాపా అభ్యర్థిగా తిరిగి రక్షణనిధి తిరువూరు నుండి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన మంచితనం ఎంత వరకు తిరిగి విజయం చేకూర్చి పెడుతుందో వేచి చూడవలసి ఉంది. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.

నిర్భయ సొమ్ములతో భవనాలు కడుతున్నారు

నిర్భయ నిధులతో భవనాల నిర్మాణం చేపట్టడాన్ని పార్లమెంటరీ కమిటీ తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. ఇటువంటి కేటాయింపులు కార్యక్రమం ప్రధాన ఉద్దేశమైన మహిళా భద్రతను నీరుగార్చుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘భవనాల నిర్మాణం కోసం నిర్భయ నిధులు కేటాయించే విధానాన్ని హోం మంత్రిత్వశాఖ విడనాడాలని సిఫార్సు చేస్తున్నాం. కార్యక్రమం అసలు లక్ష్యానికి అనుగుణంగానే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాం’’ అని కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం నిర్భయ నిధిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2012లో దిల్లీలో ఓ యువతి దారుణంగా సామూహిక అత్యాచారానికి గురయి మరణించడం, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబకడంతో కేంద్ర ప్రభుత్వం నిర్భయ నిధిని అందుబాటులోకి తెచ్చింది.

రోజాను ఢీ కొట్టే మగాడి కోసం తెదేపా వేట–TNI ప్రత్యేకం

తెలుగుదేశం పార్టీకి వై.ఎస్.జగన్ తో పాటు ఆ పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాని కూడా ప్రధాన శత్రువుగానే భావిస్తూ ఉంటారు. తెదేపాకు రోజా కొరకురాని కొయ్యగా మారిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. నటిగా, రాజకీయ నాయకురాలిగా రాటుదేలిన రోజా తన పదునైన మాటలతో ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం తీవ్రంగా విమర్శిస్తూ మాటల తూటాలు పేలుస్తూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైకాపాలో రోజాలాగా తెలుగుదేశం నేతలపై విమర్శలు చేసే నాయకుడు మరెవరూ లేరనడంలో సందేహం లేదు. చంద్రబాబుతో పాటు లోకేష్ పైనా వాడీ వేడీ విమర్శలతో పాటు సెటైర్లు వేయడంలో రోజా ఆరితేరింది. రోజా టాలెంట్ ను గమనించిన రామోజీరావు సైతం ఈటీవీ – జబర్దస్ట్ లో ఆమెకు ప్రధాన స్థానం కల్పించి పాపులారిటి పెంచారు.
*** అణగదొక్కిన కొద్దీ ఎదిగింది.
రోజాను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్నిరకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. ఆమెపై పోలీసు కేసులు పెట్టారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా ఒక్క మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా ఆమె పదవీకాలం ముగిసేవరకు బహిష్కరణ వేటు వేశారు. దీనిపై సుప్రీంకోర్టు వరకు రోజా న్యాయపోరాటం చేశారు.
*** ఎన్ని మైండ్ గేములు ఆడినా..
రోజాపై తెదేపా నేతలు చాలా పుకార్లు పుట్టించారు. జగన్‌తో విభేదాలు ఉన్నాయనీ ఒకసారి, వైకాపాను వీడుతోందని ఇంకోసారి, తెలుగుదేశంలో చేరుతోందని పలుమార్లు ఫేక్ వార్తలు సృష్టించారు. వీటన్నింటినీ తట్టుకుని రోజా వైకాపాలోనే కొనసాగింది. తనను, తన పార్టీని విమర్శించిన చాలా మంది తెదేపా నేతలకు చుక్కలు చూపించింది.
*** తెదేపాకు సవాలుగా మారిన రోజా..
ప్రస్తుతం రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తెదేపాకు సరైన అభ్యర్థి లభించడం లేదు. మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు చనిపోవడంతో నగరిలో తెలుగుదేశం “చుక్కాని లేని నావ”గా మారింది. ముద్దుకృష్ణమనాయుడు ఇద్దరు కుమారులు గాలి భానుప్రకాష్, గాలి జగదీష్‌లు రెండు వర్గాలుగా విడిపోయారు. వీరు తెదేపా అభ్యర్ధిత్వం తమకే కేటాయించాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ముద్దుకృష్ణమనాయుడు భార్య సరస్వతి సైతం పార్టీ అభ్యర్దిత్వాన్ని కోరుకుంటున్నారు. నగరిలో రాజుల సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఈ వర్గానికి చెందిన అశోక్‌రాజుకు తెదేపా అభ్యర్ధిత్వం ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల ఎలా కంచుకోటలుగా ఉన్నాయో రోజా కూడా నగరిని అదే విధంగా మలుచుకున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నగరి నియోజకవర్గంలో రోజా గట్టి పట్టు సంపాదించింది. మరొక పక్క వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వై.ఎస్. జగన్ ఎన్నికైన ఫర్వాలేదు కానీ, రోజా మాత్రం ఎన్నిక కాకూడదని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. మరి రోజాపై తెదేపా ఏ మగాడిని బరిలోకి దింపుతుందో వేచి చూద్దాం.—కిలారు ముద్దుకృష్ణ.

సతీమణి గులాబీతో సమానం

జవహర్‌లాల్‌ నెహ్రూ.. ఈ పేరు వినగానే చక్కటి కోటుపై తాజా గులాబీ పువ్వు ధరించిన వ్యక్తి మనకు జ్ఞప్తికి వస్తారు కదా. అయితే కోటుపై గులాబీ ధరించడం వెనుకున్న కారణాన్ని తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించింది. నెహ్రూకు ఆయన సతీమణి కమల అంటే వల్లమాలిన ప్రేమ. చాన్నాళ్లు అనారోగ్యంతో పోరాడిన కమల 1938లో మరణించారు. దీంతో ‘తన జీవితం తన భార్యతోనే ముడిపడి ఉంది’ అన్న సంగతికి చిహ్నంగా రోజూ కోటుకు తాజా గులాబీ పువ్వు ధరించే వారట. గురువారం గులాబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. నెహ్రూ ఫొటోను కూడా ఉంచింది. ఈ పోస్ట్‌ పెట్టిన క్షణాల్లో వేలల్లో లైకులు వెల్లువెత్తడం విశేషం.

ప్రపంచ కుబేరుడు జెఫ్ బీజోస్‌కు బెదిరింపులు

* నగ్న చిత్రాలు విడుదల చేస్తామంటున్న నేషనల్ ఎంక్వైరర్
* విలేఖరితో అక్రమ సంబంధం

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బీజోస్‌కు సైతం బెదిరింపులు తప్పట్లేదు. నేషనల్ ఎంక్వైరర్ దినపత్రిక తన నగ్న చిత్రాలు ప్రచురిస్తామని తనపై బెదిరింపులకు పాల్పడుతోందని బీజోస్ గురువారం సాయంత్రం తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. నేషనల్ ఎంక్వైరర్ దినపత్రికకు చెందిన పాత్రికేయురాలు లారెన్ సాంచెజ్‌తో ప్రేమాయణం నడిపిన సమయంలో బీజోస్‌కు చెందిన పూర్తి నగ్న చిత్రాలు ఆ దినపత్రికకు దొరికాయి. అయితే గతంలో బీజోస్‌కు చెందిన ఎన్నో మొబైల్ సంక్షిప్త సందేశాలు నేషనల్ ఎంక్వైరర్ మాతృసంస్థ AMIకు లభించడంపై ప్రైవేట్ డిటెక్టివ్‌లతో ఆయన దర్యాప్తు చేయించుకుంటున్నారు. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన AMI తనతో బేరానికి దిగిందని, అందుకే ఇప్పుడు ఆ దర్యాప్తు ఆపేయాలని లేని పక్షంలో లారెన్‌తో కలిసి ఉన్నప్పటి తన వ్యక్తిగత చిత్రాలతో పాటు పూర్తి నగ్న చిత్రాలను సైతం అంతర్జాలంలోకి విడుదల చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బీజోస్ రాసుకొచ్చారు. తన దర్యాప్తు సఫలం అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరించి ఎన్నో వ్యతిరేక వార్తలను కొనుగోలు చేసి పక్కన పడేసినట్టు ఇతర దేశాల అధినేతలతో తమకున్న సాన్నిహిత్యం బట్టబయలు అవుతుందనే ఉద్దేశంతో AMI ఈ దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని బీజోస్ అనుమానిస్తున్నారు. తాను భావించినట్లు తనపై AMI చేసిన ఈ రహస్య ఆపరేషన్ రాజకీయపరమైనది కాదని, కేవలం తన దర్యాప్తును కాలరాయాలని చేసిందేనని బీజోస్ తన పోస్టులో వెల్లడించారు. అయితే లారెన్ సాంచెజ్‌తో అక్రమ సంబంధం కారణంగానే బీజోస్ భార్య మెకంజీ బీజోస్ ఆయనతో విడాకులకు సిద్ధపడ్డారు. ₹8.9లక్షల కోట్లతో ప్రపంచ కుబేరుడిగా తళుకులీనుతున్న బీజోస్‌తో విడాకుల ద్వారా మెకంజీ బీజోస్ అందులో సగం సొత్తు ₹4.5లక్షల కోట్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా అవతరించి ఆయన చరిత్రలో నల్లమచ్చ దిద్దనున్నారు.

భారతదేశంలో అతి తక్కువ బంగారం

ఆడవాళ్లకూ, బంగారానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ప్రత్యేకించి భారతీయ స్త్రీలకైతే మరీనూ. పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టిన రోజులు, పండగలు ఇలా ఏది జరిగినా మహిళలు ముందుగా ఆలోచించేది బంగారం గురించే. ఇక అమ్మాయిలయితే నలుగురిలో ‘పుత్తడి’ బొమ్మల్లా మెరిసిపోవాలని కలలు కంటుంటారు. ఎందుకంటే మన భారతీయ సంప్రదాయపు పెళ్లిళ్లలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అందుకే పుత్తడి వినియోగదారుల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. మరి అంతలా బంగారాన్ని ఉపయోగించుకునే భారత్‌లో రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న బంగారం చాలా తక్కువ. మిగతా దేశాల్లోని సెంట్రల్‌ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం రిజర్వు నిల్వలతో పోలిస్తే మన దేశం అట్టడుగున ఉంది. వీటి గురించి ఆసక్తికరమైన విషయాలున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం! అమెరికన్లంటే ఆధునికంగా ఉంటారు. మనలాగా పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు పెట్టుకోరు అనుకుంటున్నారేమో! వాళ్ల అసలు రూపం వేరే ఉంది. భారతీయ ప్రజల్లాగా వాళ్లు ఒంటిపై ధరించకపోచ్చు. కానీ అక్కడి ఫెడరల్‌ బ్యాంకులో బోలెడంత బంగారం ఉందట. బంగారం నిల్వ ఉంచుకున్న బ్యాంకుల్లో దీనిదే అగ్రస్థానం. ఇక్కడ ఏకంగా 8,100 మెట్రిక్‌ టన్నుల బంగారం అక్కడుంది. ఆ బ్యాంకు లెక్కల ప్రకారం ఈ మొత్తం బంగారం మార్కెట్‌ విలువ దాదాపు 300 బిలియన్ డాలర్లు. బంగారం నిల్వల్లో జర్మనీ రెండో స్థానంలో ఉంది. 3,370 మెట్రిక్‌ టన్నుల పుత్తడి అక్కడి సెంట్రల్‌ బ్యాంకు సొంతం. తొలుత ఇక్కడ 3,410 మెట్రిక్‌ టన్నులు బంగారం ఉండేది. కానీ కొన్ని కారణాల 40 మెట్రిక్‌ టన్నులు తగ్గి ప్రస్తుత సంఖ్యకు చేరుకుంది. అయినప్పటికీ బంగారం నిల్వ చేసే దేశాల్లో ఒకప్పుడు మూడో స్థానంలో జర్మనీ..ఇప్పుడు రెండోస్థానానికి చేరుకుంది. అత్యధికంగా పుత్తడిని కలిగిన దేశాల్లో ఇటలీ మూడో స్థానంలో ఉంది. ఇక్కడి కేంద్ర బ్యాంకులో ఉన్న బంగారం 2,450 మెట్రిక్‌ టన్నులు. తొలుత ఇక్కడ 2,800 మెట్రిక్‌ టన్నుల బంగారం ఉండేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి పేర్కొంది. అయితే వివిధ కారణాల వల్ల అది 2,450 మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న దేశం ఫ్రాన్స్‌. 2,435మెట్రిక్‌ టన్నుల బంగారం ఇక్కడి సెంట్రల్‌ బ్యాంకు సొంతం. 18 ఏళ్ల క్రితం ఇక్కడ 3,025 మెట్రిక్‌ టన్నుల బంగారం ఉండేది. కానీ రాను రాను 20% బంగారాన్ని విక్రయించినట్లు సెంట్రల్‌ బ్యాంకు తెలిపింది. బంగారం ఎక్కువగా నిల్వ ఉన్న దేశాల్లో రష్యాది ఐదో స్థానం. ఈ దేశానికి చెందిన సెంట్రల్‌ బ్యాంకులో 2,070 మెట్రిక్‌ టన్నుల పుత్తడి నిల్వ ఉంది. అయితే ఐఎంఎఫ్‌ టాప్‌-10 గ్లోబల్‌ ఎకానమీ దేశాల్లో దరిదాపుల్లో లేని రష్యా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉండటం విశేషం. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో తొలి స్థానంలో ఉన్న చైనా ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. చైనాలోని అతి పెద్ద బ్యాంకులో(మనకు రిజర్వు బ్యాంకు మాదిరిగా) దాదాపుగా 1,840 మెట్రిక్‌ టన్నుల బంగారం నిల్వ ఉంది. 18 ఏళ్ల క్రితం ఇక్కడ కేవలం 395 మెట్రిక్‌ టన్నుల బంగారం మాత్రమే ఉండేది. ధనవంతులు డబ్బులు దాచుకునే స్విస్‌లో పై దేశాలతో పోలిస్తే బంగారం చాలా తక్కువగా ఉందట. 1,040 మెట్రిక్‌ టన్నుల కనకం ఈ దేశానికి చెందిన సెంట్రల్‌ బ్యాంకులో వివిధ రూపాల్లో నిల్వ ఉందట. టాప్‌-10 ఎకానమీలతో ఒకటైన స్విస్‌లో మాత్రం బంగారం నిల్వ తక్కువగా ఉండటం ఆశ్చర్యపోవాల్సిన విషయమే మరి!.ఈ జాబితాలో జపాన్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక రాజ్యంగా ఉన్న జపాన్‌ సెంట్రల్‌ బ్యాంకులో 765 మెట్రిక్‌ టన్నుల బంగారం మాత్రమే నిల్వ ఉందట. ఇక నెదర్లాండ్స్‌ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక్కడి కేంద్ర బ్యాంకులో దాదాపుగా 610 మెట్రిక్‌ టన్నుల బంగారం నిల్వ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ 910 మెట్రిక్‌ టన్నులు ఉండేది. కొంత బంగారాన్ని అమ్మేయడం, ఇతర కారణాల వల్ల 300 మెట్రిక్‌ టన్నులు తగ్గి 610కి చేరుకుంది. అయితే తర్వాత బంగారం పరిరక్షణకు గానూ ఈ దేశపు రక్షణ శాఖ ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. మన దేశపు రిజర్వు బ్యాంకులో కేవలం 590 మెట్రిక్‌ టన్నుల బంగారం నిల్వ ఉన్నట్లు లెక్కల్లో తేలింది. జనాభా లెక్కల్లో రెండో స్థానంలో మన దేశం ఈ జాబితాలో చివరన ఉంది. 2000 నుంచి 2009 మధ్య 360 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉండగా..గత దశాబ్ద కాలంలో నిల్వ శాతం కూడా గణనీయంగా పెరిగింది. అయితే వ్యక్తిగత లెక్కలు తీసుకుంటే మన దేశ జనాభా అందరి వద్దా కలిపి 20 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా బంగారం ఉండటం విశేషం. రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న బంగారంతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ.

ఫార్మింగ్టన్ తెలుగు దళారుల కేసులో కీలక మలుపు

* ఏడుగురిని వివిధ జైళ్లకు తరలించననున్న ఫెడరల్ అధికారులు
* ఎనిమిది మందిపై 3TB సమాచారం సేకరించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు


తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికావ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిషిగన్‌లోని ఫార్మింగ్టన్ నకిలీ విశ్వవిద్యాలయం కేసు బుధవారం సాయంత్రం కీలక పురోగతి సాధించింది. కాకిరెడ్డి భరత్(29-ఫ్లోరిడా), నూనె అశ్వంత్(26-అట్లాంటా), కందల సురేష్ రెడ్డి(31-వర్జీనియా), కర్నాటి ఫణిదీప్(35-లూయివిల్), రంపీస ప్రేంకుమార్(26-షార్లెట్), సామ సంతోష్‌రెడ్డి(28-కాలిఫోర్నియా), తక్కెళ్లపల్లి అవినాష్(28-పెన్సిల్వేనియా), నవీన్ ప్రత్తిపాటి(29-డల్లాస్)లు అమెరికావ్యాప్తంగా తెలుగు విద్యార్థులకు ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం తరఫున నకిలీ పత్రాలు ఇప్పించేందుకు మధ్యవర్తులుగా వ్యవహరించారు. వీరిలో అశ్వంత్, నవీన్‌లను డెట్రాయిట్ విమానాశ్రయంలో అరెస్టు చేయగా, మిగతా ఆరుగురిని విశ్వవిద్యాలయంలో సమావేశం ఉందని రమ్మని పిలిచి విశ్వవిద్యాలయ ఉద్యోగులుగా నటించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్కడికక్కడే ఖైదు చేశారు. ఈ ఎనిమిది మందిలో ఫణిదీప్ ఒక్కడే హెచ్1బీ వీసాపై ఉండగా మిగిలిన ఏడుగురు ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం ఇచ్చిన నకిలీ విద్యార్థి వీసాలపై అమెరికాలో ఉంటున్నారు. సొంత వకీలును పెట్టుకున్న ఫణిదీప్ సోమవారం నాడు బెయిలు పొంది లూయివిల్‌లో తన ఉద్యోగానికి వెళ్లిపోగా, ఎఫ్1 వీసా రద్దు కాబడిన మిగతా ఏడుగురిలో ఆరుగురు తాము వెయిన్ కౌంటీ ఫెడరల్ జైలులోనే ఉండేందుకే సుముఖత చూపారు. మధ్యవర్తుల్లో ఎనిమిదవ వ్యక్తి రంపీస ప్రేంకుమార్ బెయిలు విచారణ నేడు డెట్రాయిట్‌లోని లఫాయెట్ బొలవార్డ్ మీదనున్న కోర్టులో మేజిస్ట్రేట్ జడ్జి వాలీన్ సమక్షంలో జరిగింది. ఈ విచారణకు ప్రేంకుమార్ తరఫున అధికారిక అనువాదకుడిగా యార్లగడ్డ శివరాం వ్యవహరించగా, ఫెడరల్ జైలు ఏర్పాటు చేసిన వకీలుగా వాండా కాల్ వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో తనను వెయిన్ కౌంటీ ఫెడరల్ జైలులోనే తన ఆరుగురు సహచరులతో ఉంచాలని ప్రేంకుమార్ కోరినట్లు సమాచారం. ఈ మేరకు మేజిస్ట్రేట్ జడ్జి వాలీన్ అతడిని అదే జైలులో తన సహచరులతో ఉండేందుకు అనుమతించారు. ఫణీంద్ర లాగా తమకు హెచ్1బీ వీసా లేనందున, ఇప్పటికే ఉన్న ఎఫ్1 విద్యార్థి వీసా రద్దు కాబడిన నేపథ్యంలో తాము బెయిల్ మీద బయటకు రాగానే ICE ఇమ్మిగ్రేషన్ అధికారులు తమను తిరిగి బంధిస్తారని, వారి జైలులో గడిపే తమ సమయం ఈ కేసు పూర్తి విచారణ అనంతరం విధించే అంతిమ జైలు శిక్షలో భాగంగా పరిగణించరని ప్రేంకుమార్ భావించినట్లు సమాచారం. అందుకే తన సహచరుల మాదిరిగానే తాను కూడా బెయిల్ నిరాకరించి వెయిన్ కౌంటీ జైలులోనే ఉండేందుకు సుముఖత చూపినట్లు సమాచారం. కావాలని అమెరికా వ్యవస్థలో లోపాలను వినియోగించి నేరాలకు పాల్పడినందుకు గానూ ఈ ఏడుగురిని ఒకే జైలులో కాకుండా మిషిగన్ వ్యాప్తంగా ఉన్న పలు జైళ్లకు బుధ గురువారాల్లో బదిలీ చేయనున్నారు. ఈ కేసు తుది విచారణ వచ్చే వారం జరగవచ్చునని, బెయిల్ మీద బయటున్న ఫణీంద్రతో పాటు ఈ ఏడుగురిని అప్పుడు మరోసారి ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతారని శివరాం తెలిపారు. వీరు తమ తప్పు ఒప్పుకుంటే అధికంగా అయిదేళ్ల జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికీ $2,50,000లు జరిమానా విధిస్తారని, తమ తప్పు లేదని వాదించుకునే పక్షంలో మరికొన్ని వాయిదాల్లో కేసు విచారణ పూర్తి అవుతుందని శివరాం పేర్కొన్నారు.
*** 3TB సమాచారం. సినిమాల్లో లాగా చైన్లతో బంధించి…
ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయంలో నకిలీ పత్రాలు ఇప్పించి అమెరికాలో అక్రమ నివాసానికి సహకరించారనే అభియోగాలపై ఖైదు కాబడిన 8మంది తెలుగు దళారులపై ఇమ్మిగ్రేషన్ అధికారులు 3TB (3000GB) సమాచారం సేకరించారని ప్రేంకుమార్ కోర్టు ఆవరణలో శివరాంకు తెలిపారు. విచారణకు పూర్వం సినిమాల్లో ఖైదీలను బంధించినట్లు ప్రేంకుమార్‌ను బేడీలు, చైన్లతో కోర్టు గ్రౌండ్ ఫ్లోర్ రిమాండ్ గదిలో బందీ చేసి ఉంచారు. ఇక్కడ జేర్పించే ప్రతి విద్యార్థికి తనకు సంతోష్ $200 కమీషన్ ఇస్తానని చెప్పాడని, కానీ అది ఇవ్వకుండా విశ్వవిద్యాలయ అధికారులటో మాట్లాడి ట్యూషన్ ఫీజులో రాయితీలు ఇప్పిస్తానన్నాడని ప్రేంకుమార్ పేర్కొన్నాడు. ఫెడరల్ అధికారులు ఏర్పాటు చేసిన ప్రేంకుమార్ వకీలు వాండా కాల్ మాట్లాడుతూ ప్రేంకుమార్ 15 మందిని మాత్రమే జేర్పించాడని చెప్తున్నప్పటికీ, అతను ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎదుట 60మందిని జేర్పించినట్లు ప్రెజెంటేషన్ ఇచ్చాడని, దీనికి అదనంగా వీరంతా నేరం కావాలనే చేశారని ఆరోపణలకు బలం చేకూర్చే పలు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేసిన 129 తెలుగువారి భవితవ్యం కూడా వచ్చే వారం జరగనున్న విచారణలో తేలనుంది. వీరందరూ కావాలనే ఇమ్మిగ్రేషన్ నేరాలకు పాల్పడినట్లు అమెరికా అధికారులు బలమైన ఆధారాలతో సహా వాదిస్తున్న కారణంగా వారిని ఇతర విశ్వవిద్యాలయాలకు బదిలీ చేయడం కష్టం కావచ్చు. దీని కారణంగా వీరందరినీ స్వదేశాలకు తిప్పి పంపేయవచ్చు.