పవార్ పవరే వేరప్పా!

రాజకీయాలు.. వివాదాలు.. ఆస్తులు.. ఆటలు.. అన్నీ కలిస్తే శరద్‌ పవార్‌. దేశ రాజకీయాల్లో పవార్‌ది ప్రత్యేక పాత్ర. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. 37 ఏళ్లకే మహారాష్ట్ర సీఎం పీఠమెక్కారు. కాంగ్రెస్‌లో ఉండి ఏకంగా సోనియా గాంధీ జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. వివాదాలు-విమర్శలు ఎన్ని ఎదురైనా దీటుగా ఎదుర్కొన్నారు.
పూర్తి పేరు: శరద్‌ చంద్ర గోవింద్‌రావ్‌ పవార్‌
జననం: 1940 డిసెంబరు 12న బారామతిలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో
తొలి విజయం: 1967లో బారామతి నుంచి ఎమ్మెల్యేగా (కాంగ్రెస్‌)
**తొలిసారి సీఎం పీఠంపై..
పవార్‌ 1978లో కాంగ్రెస్‌ నుంచి విడిపోయి, జనతా పార్టీతో కలిసి మహారాష్ట్రలో ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. తొలిసారిగా సీఎం పదవిని అలంకరించారు. కేంద్రంలో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరిలో పీడీఎఫ్‌ ప్రభుత్వం రద్దయింది. 1983లో కాంగ్రెస్‌(సోషలిస్ట్‌) పార్టీ అధ్యక్ష బాధ్యతలను పవార్‌ స్వీకరించారు. 1984లో బారామతి నుంచి ఎంపీగా గెలిచారు. మరుసటి ఏడాది అక్కడి నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్‌(సోషలిస్ట్‌) 54 సీట్లు దక్కించుకోవడంతో ప్రతిపక్షనేతగా బాధ్యతలు చేపట్టారు.
**శివసేనకు కళ్లెం వేసే బాధ్యత
1987లో పవార్‌ కాంగ్రెస్‌(ఐ) గూటికి చేరుకున్నారు. మహారాష్ట్రలో శివసేన పట్టు పెరగకుండా చూసే బాధ్యతను అధిష్ఠానం ఆయనకు అప్పగించింది. దాన్ని నిర్వర్తించడంలో చాలావరకు సఫలమయ్యారు! 1988లో అప్పటి మహారాష్ట్ర సీఎం శంకర్‌రావు చవాన్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా రాజీవ్‌ గాంధీ తన మంత్రిమండలిలోకి తీసుకోవడంతో పవార్‌ తిరిగి సీఎం అయ్యారు. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భాజపా-శివసేనల నుంచి గట్టి పోటీ ఎదురైంది. కాంగ్రెస్‌కు 141 సీట్లు వచ్చాయి. దీంతో 12 మంది స్వతంత్రుల మద్దతుతో పవార్‌ మళ్లీ సీఎం పీఠమెక్కారు.
ప్రధాని పదవి రేసులో..
రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత ప్రధాని పదవి రేసులో పవార్‌ నిలిచారు. ఆయనతోపాటు పీవీ నరసింహారావు, ఎన్డీ తివారీ పేర్లను కాంగ్రెస్‌ పరిశీలించింది! చివరకు పీవీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించగా.. పవార్‌ రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆపై మహారాష్ట్ర సీఎం పదవి నుంచి సుధాకర్‌రావు నాయక్‌ దిగిపోవడంతో దేశ రాజకీయాల్లో రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని తిరిగి పవార్‌ను ముఖ్యమంత్రిగా చేశారు పీవీ.
**ఎన్సీపీ స్థాపన
12వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పవార్‌ పనిచేశారు. 1999లో ఆ సభ రద్దయ్యాక.. సోనియా గాంధీని కాకుండా భారత్‌లో పుట్టిన ఇతర నేతనెవరినైనా ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించాలని పవార్‌, పి.ఎ.సంగ్మా, తారిక్‌ అన్వర్‌ డిమాండ్‌ చేశారు. సోనియా జాతీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. అదే ఏడాది జూన్‌లో పవార్‌, సంగ్మా కలిసి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ)ని స్థాపించారు. 2004లో తిరిగి యూపీయేలో చేరిన పవార్‌.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
**ఆటలతో అనుబంధం
పవార్‌కు క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌, మహారాష్ట్ర రెజ్లింగ్‌, కబడ్డీ, ఖోఖో అసోసియేషన్‌లకు అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ)తోపాటు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)కి నేతృత్వం వహించారు.
**లెక్కలేనన్ని వివాదాలు
పవార్‌ తన రాజకీయ జీవితంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. సీఎంగా ఉండి నేరగాళ్లను రక్షించారని, అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో పవార్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలొచ్చాయి. నకిలీ స్టాంపుల కుంభకోణం, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు పన్ను మినహాయింపు వంటి వ్యవహారాల్లో కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆస్తుల ప్రకటనలో పవార్‌ పారదర్శకత పాటించలేదనే ఆరోపణలున్నాయి.
**వారసత్వం
పవార్‌ కుమార్తె సుప్రియా సూల 16వ లోక్‌సభ సభ్యురాలు. 2009, 2014 ఎన్నికల్లో బారామతి నుంచి ఎంపీగా ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
**పద్మ విభూషణ్‌
మనదేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్‌’ 2017లో పవార్‌ను వరించింది.
ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపై నడిపించడంలో పవార్‌ కీలక పాత్ర పోషించే అవకాశముంది. మహారాష్ట్రలో ఎన్సీపీతో కాంగ్రెస్‌ పొత్తుకు ఇది కూడా ఒక కారణం.

పాపం వెంటాడింది

తనదైన హాస్యంతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన హాస్య నటుడు పద్మనాభం. నటుడిగానే కాదు, నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. అయితే ఒకప్పుడు ఎంతటి స్టార్‌ హోదా అనుభవించారో, చివరి రోజుల్లో అంత పేదరికంలో బతికారు. చిన్నతనంలో ఓ అంధుడి కంచంలో రాయివేసి అందులో ఉన్న చిల్లర డబ్బులు దొంగతనం చేశారు పద్మనాభం. పెద్దయ్యాక ఈ సంఘటన ఆయనను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ‘జాతకరత్న మిడతం భొట్లు’ సినిమాలో మిడతంభొట్లుని రాజు వద్దకు తీసుకొస్తున్నప్పుడు ఓ అంధుడు “ఇతడు చేసిన నేరం ఏంటి?” అని అడుగుతాడు. ఆ సన్నివేశ చిత్రీకరణకు ఒక నిజమైన అంధుడిని తీసుకొచ్చి షాట్ ఓకే అయ్యాక కొంతడబ్బు ఇచ్చి పంపారు పద్మనాభం. చిన్నప్పుడు చేసిన పాప పరిహారార్ధం లిటిల్ ఫ్లవర్ ‘బ్లైండ్ అండ్ డెఫ్’ సంస్థకు అప్పట్లో అయిదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో మంచితనం ఎల్లవేళలా పనిచేయదు. అందులో నెట్టుకురావాలంటే లౌక్యం అవసరం. అదిలేక చిత్తూరు నాగయ్య వంటి గొప్ప నటులు చీకటి రోజులు చూశారు. అందుకు పద్మనాభం కూడా మినహాయింపు కాదు. 1975లో ‘సినిమా వైభవం’ చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద రూ.60 వేలు అప్పుచేశారు. అందుకు హామీగా ‘దేవత’, ‘పొట్టి ప్లీడరు’, ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’, ‘శ్రీరామకథ’ సినిమాల నెగటివ్‌లను తాకట్టు పెట్టారు. ఆరు నెలల్లోగా అప్పు తీర్చకుంటే ఆ సినిమా హక్కులు ఆయన పరమవుతాయనేది అగ్రిమెంటు. గడువులోగా పద్మనాభం అప్పు తీర్చలేకపోయారు. దాంతో ఆ సినిమాల హక్కులను సదరు వ్యక్తి రాయలసీమ, ఆంధ్రా, నైజాం ఏరియాలకు రూ.2.75లక్షలకు ఆయన అమ్మేశారు. అప్పు తీరగా, మిగతా డబ్బు పద్మనాభంకు ఇవ్వలేదు. పైగా సినిమా నెగటివ్‌లు కూడా వాపసు ఇవ్వలేదు. 1983 దాకా కేసు కోర్టులో నడిచింది. కానీ, పద్మనాభానికి న్యాయం జరగలేదు. గోరుచుట్టు మీద రోకటి పోటులా సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. చివరికి ఆ వ్యక్తి మరణించాక వారి కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు తీసుకొని నెగటివ్‌లు పద్మనాభానికి ఇచ్చారు.

ఓటింగ్ పట్ల ఎన్నారైలకు అనాసక్తి

ప్రవాస భారతీయులు మాతృదేశ ఎన్నికల్లో పాల్గొనడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎన్ఆర్ఐలు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. ఫలితం శూన్యమే. 2014 ఎన్నికల్లో కేవలం 8 మంది ఎన్ఆర్ఐలు మాత్రమే ఓటేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో లేదా ప్రతినిధి ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తేనే.. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
**చట్టానికి సవరణ..
ఎన్ఆర్ఐలు ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగా 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టం, సెక్షన్‌ 20ని సవరించింది. ఓటు పొందాలనుకునే ప్రవాస భారతీయులు దేశంలో అంతకు ముందు ఎక్కడా ఓటరుగా నమోదై ఉండొద్దు. వారు నివాసం ఉంటున్న దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండకూడదు. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ ద్వారా పాస్‌పోర్టు, వీసా, తదితర వివరాలతో దరఖాస్తును సమర్పించి ఓటుహక్కు పొందొచ్చు.
*ప్రతినిధి ద్వారా ఓటేసేలా..
సుదూర దేశాల్లో ఉంటోన్న ఎన్ఆర్ఐలు పోలింగ్‌ తేదీన భారత్‌కు రావడం కష్టసాధ్యమైన పని. పైగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందుకు పరిష్కారంగా ఎన్ఆర్ఐ స్థానంలో వారి ప్రతినిధి ఓటేసే వెసులుబాటు కల్పించేందుకు 2017, డిసెంబరులో ప్రజాప్రాతి నిధ్య చట్టానికి సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు 2018లో లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. లోక్‌సభలో చర్చ జరిగినప్పుడు కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. మరోవైపు ఆన్‌లైన్‌ ద్వారా ఓటేసే అవకాశాన్నీ ఈసీఐ కొంతకాలంగా పరిశీలిస్తోంది.

ఇంకోసారి ఇండియా జోలికి వెళ్తే…

ఉగ్రవాదంపై స్థిరమైన, అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కు అమెరికా మరోసారి సూచించింది. భారత్‌పై మరో ఉగ్రదాడి జరిగిన పక్షంలో పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. ‘‘ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ నిర్మాణాత్మక, స్థిరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జేషే మహ్మద్‌, లష్కరే తోయిబా సంస్థల కార్యకలాపాలపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గే అవకాశం ఉంది’’ అని శ్వేతసౌధానికి చెందిన ఓ ఉన్నతాధికారి అన్నారు. ఉగ్ర సంస్థలపై సరైన చర్యలు తీసుకోకుండా ఉండి, భారత్‌పై మరో ఉగ్రదాడి జరిగితే అది పాకిస్థాన్‌కు చాలా ప్రమాదం అని మరో అధికారి హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ప్రపంచ దేశాల నుంచి పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ఎటువంటి చర్యలు చేపట్టిందన్న అంశంపై అమెరికా అధికారులు స్పందించారు. ఇటీవల పాక్‌ ఉగ్రవాదంపై చర్యలు ప్రారంభించినట్లు అర్థమవుతోందని వారు అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా జేఈఎం లాంటి సంస్థల కార్యకలాపాలపై నియంత్రణ విధించారన్నారు. ఉగ్రనేతల ఆస్తులను సైతం జప్తు చేసినట్లు పేర్కొన్నారు. అయితే వారు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని స్పష్టం చేశారు. గతంలోనూ కొంతమందిని అరెస్టు చేసినప్పటికీ అనంతర కాలంలో వారిని విడుదల చేశారని గుర్తుచేశారు. ఇప్పటికీ కొంత మంది ఉగ్రనేతలు పాకిస్థాన్‌లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆర్థిక చర్యల కార్య దళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగానే పాకిస్థాన్‌ చర్యలకు పూనుకున్నట్లు అర్థమవుతోందిని అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో భవిష్యత్తులో పాక్‌ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితులు కాస్త చల్లబడ్డప్పటికీ.. సైనిక దళాలు మాత్రం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నాయన్నారు. మరో దాడి జరిగిన పక్షంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉందన్నారు. పుల్వామా దాడి, అనంతరం ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన అమెరికా ఇరు దేశాల ప్రతినిధులతో నిరంతర చర్చలు జరిపింది. పరిస్థితులు చేజారిపోకుండా చూడాలని పదే పదే సూచించింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ పటిష్ఠ చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. అలాగే ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. పాక్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాయి.

The Inspirational Life History Of Manavendranath Roy aka MN Roy

Manavendranath Roy
He was celebrity in Andhra once with large following of intellectuals, poets, writers, teachers, and advocates. M.N.Roy ( 1887-1954) was originally Narendranath. Born to a priest family in Bengal, Roy joined freedom movement in Bengal under the leadership of Jatin Mukherjee. They planned to attack britishers to neck them out of country. In pursuance of that goal, Roy was sent to collect money and arms from Germany, the arch rival of Britain. Roy went to south east Asia including China and met Sun Yet Sen. The Germans finally asked him to land in Germany to collect arms and money. Accordingly he travelled from Japan in a ship with a pretext of catholic priest. He reached San Fransisco during 1916 and met Dhan gopal Mukherjee, a Bengali poet in English department of Stanford University. With his advise Roy changed his name as Manavendra. He also met a brilliant student who completed graduation namely Evelyn Trent. They liked each other and married in New York with the help of Lala Laj pat Roy. But the british police were after Roy and hence he along with his wife escaped to Mexico. There Roy quickly learnt Spanish and turned into socialist communist revolutionary. He got the support of president of Mexico. Lenin observed and invited him To Soviet Union. Roy along with his wife went to Moscow and played revolutionary role along with Lenin, Stalin, Trotsky. The couple started two journals from Europe namely Masses and International press correspondence. They were meant to feed the information to revolutionaries and newly emerging communists in India. Roy was also sent to China to play some role in people`s rebellion movement. Stalin sent him. After returning from China Roy returned to India with a pseudonym Mahamood. this was in 1929. Immediately Roy participated in Karachi congress conference and met Nehru. Police suspected and arrested him Bombay in 1930 .Roy was jailed for 6 years. During his stay in jail Roy wrote volumes of literature and sent correspondence to outside world. After release Roy stayed with Jawaharlal Nehru and joined congress party. But Gandhi did not like Roy. Symbolically Roy contested against Moulana Azad for presidentship of Congress, and of course defeated. Roy started new party called Radical Democratic party and trained several persons. During that period he developed contact with Andhra. From 1940 to 1954 innumerable writers, advocates, teachers and others were trained and developed Radical Humanist philosophy. In 1954 Roy fell down from a rock during his morning walk and died later with brain injury. In Andhra Roy was accepted as brilliant leader and philosopher by eminent writers: Some of them are Abburi Ramakrishna rao, Pemmaraju Venkatarao, Devakinandan Tata, Rachakonda Viswanatha sastry, A L Narasimha rao,Abburi Varada Rajwswararao, Mulukutla Venkata sastry, Avula Gopalakrishna murthy, Ravipudi Venkatadri, N V Brahmam, Avula Sambasivarao, D V Narasaraju, G V Krishnarao, Palagummi Padmaraju, Koganti Radhakrishna murthy, Malladi Ramamurthi, Tripuraneni Gopichand, Guttikonda Narahari, Pavuluri Krishna Choudary, Kolla Subbarao, Ch.Rajareddi, Kolli Sivaramareddi,Koganti Subrahmanyam, Jasti Jagannadham, Lavu Ankamma, and many others. Many study camps were conducted and political classes were held. This was continued till the death of M N Roy and after that few years was bubbling with study camps and publications. M N Roy`s major writings were translated in Telugu by Innaiah Narisetti and published by Telugu Akademi and Telugu University. Now the movement became history and very few individual remained in the organization. M N Roy was recognised as world leader among humanists and he was associated with international humanist organization. His birthday is on 21 March. – Contributed by Mr.Innaiah Narisetti, Sr.Journalist & Humanist – On the occasion of birthday of humanist philosopher who influenced several intellectual in Andhra during and after Indian independence.

ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు 60 ఏళ్లు

*పూర్వ విద్యార్థుల్లో ప్రముఖులు – నేటి నుంచి ఏడాది పాటు ఉత్సవాలు
కరవుసీమగా పేరుగాంచిన రాయలసీమలో స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే తిరుపతి వేదికగా సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. కేవలం రాయలసీమకే కాదు.. సాంకేతిక విద్యపై ఆసక్తి కనబరిచే తెలుగు విద్యార్థులందరికీ దిక్సూచిగా దర్శనమిచ్చింది శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాల. ఏర్పాటైన నాటి నుంచి దినదిన ప్రగతిని సాధిస్తూ ఎంతోమంది విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక, పరిపాలనా నిపుణులుగా తీర్చిదిద్దింది. ప్రతిదేశంలోనూ ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలన్నింటిలోనూ ఇక్కడి ఇంజినీరింగ్‌ విద్యార్థులది ప్రత్యేకస్థానం అని చెప్పుకోవచ్చు. ఇంతటి చరిత ఉన్న ఈ కళాశాల విజయవంతంగా 60 ఏళ్లు పూర్తిచేసుకుని ఉత్సవాలకు సిద్ధమైంది. శనివారం ఎస్వీయూ వేదికగా ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నారు.
**నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభం
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలను 1959 అక్టోబరు 13న నాటి దేశ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. తొలిగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ బ్రాంచిలను ప్రారంభించారు. ఒక్కో బ్రాంచిలో నలభై సీట్ల చొప్పున నూట ఇరవై మందితో కళాశాల ప్రారంభమైంది. ప్రసుత్తం ఆ మూడు బ్రాంచిలే కాకుండా ఈసీఈ, కెమికల్, సీఎస్సీ ఆరంభమయ్యాయి. మొత్తం ఆరు బ్రాంచిలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో బ్రాంచిలో అరవై మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. టాప్‌ ర్యాంకర్లకు మాత్రమే అవకాశం ఉంటోంది. అంతేకాకుండా దూరప్రాంతాలు, విదేశీ విద్యార్థులకు సైతం గత రెండేళ్లుగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. నేపాల్, కశ్మీర్, అండమాన్‌ నికోబార్‌ నుంచి విద్యార్థులు విచ్చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ కింద వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఎంటెక్‌లో మొత్తం 12 స్పెషలైజేషన్‌ కోర్సులను ప్రవేశపెట్టారు. ఒక్కోదాంట్లో 24సీట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని సీట్లు ‘గేట్‌’ ద్వారానే భర్తీ అవుతున్నాయి. అదేవిధంగా 2014లో ఇంజినీరింగ్‌ కళాశాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా మేనేజ్‌మెంట్‌ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 1959లో కళాశాలకు మొదటి ప్రిన్సిపల్‌గా నియమితులైన ఆచార్య జి.రామకృష్ణన్‌ దాదాపు 18సంవత్సరాల పాటు సేవలందించారు. తొలి ప్రిన్సిపల్‌ నుంచి ప్రస్తుత ప్రిన్సిపల్‌ ఆచార్య జీఎన్‌ ప్రదీప్‌కుమార్‌ వరకు ప్రతిఒక్కరూ కళాశాల అభివృద్ధిలో తమదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ఆచార్యులు, ఒప్పంద అధ్యాపకులు కలిపి 128మంది బోధన, పరిశోధన సేవలు అందిస్తున్నారు.
**రూ.300 కోట్లతో సీమెన్స్‌ ఏర్పాటు
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం రూ.300 కోట్ల వ్యయంతో ‘సీమెన్స్‌ ప్రయోగశాల’ను కళాశాలలో ఏర్పాటు చేసింది. ఈ ప్రయోగశాల ద్వారా కళాశాల విద్యార్థులకే కాకుండా ఇతర ప్రాంతాల విద్యార్థులకు సైతం నైపుణ్యాభివృద్ధి కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇంజినీరింగ్‌ కళాశాలలోని సివిల్‌ విభాగానికి చెందిన హరీష్‌కు ఇటీవల ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం వచ్చింది. అతని ప్రయణ ఖర్చులను కళాశాలే భరించింది. అదేవిధంగా ఎలక్ట్రికల్‌ విభాగానికి చెందిన పోనీష్‌ కొత్త ఛార్జింగ్‌ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పరికరానికి సంబంధించి పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. మరోవైపు ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ఇగ్నైట్‌ టీం ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కెరీర్‌ ప్లానింగ్, స్కాలర్‌ షిప్పులపై అవగాహన కల్పిస్తున్నారు.
* ఉన్నతస్థానాల్లో పూర్వవిద్యార్థులు
ఇక్కడి పూర్వ విద్యార్థులు పలు రాష్ట్రాల్లో కీలక పదవుల్లో ఉన్నారు. వారిలో కర్ణాటక అడిషనల్‌ డీజీపీ చరణ్‌రెడ్డి, కలకత్తా అడిషనల్‌ డీజీపీ రమేష్, గుంటూరు ఎస్పీ రాజశేఖర్‌ బాబు, తిరుమల జేఈవో శ్రీనివాస రాజు, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఛైర్మన్‌ గోపాల్‌ రెడ్డి తదితరులంతా ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులే కావడం గమనార్హం.

రోగిష్టి వృద్ధులు భారతదేశంలోనే ఎక్కువ

జపాన్‌, స్విట్జర్లాండ్‌లలో నివసిస్తున్న వారితో పోలిస్తే భారతీయుల్లోనే ఎక్కువమంది వయసుతో పాటు వచ్చే అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా వయోధికుల్లో చాలామంది వివిధ వ్యాధుల బారిన పడటంతో పాటు, పలు సందర్భాల్లో గాయాల పాలవడం వంటివి కూడా సంభవిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఏయే దేశాల్లో ఎలా ఉన్నాయన్న విషయమై అమెరికాకు చెందిన పరిశోధకులు తొలిసారిగా విస్తృత అధ్యయనం నిర్వహించారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు, వారి సహచరులు 1990 – 2017 మధ్య 195 దేశాలు, ప్రాదేశికాల్లో ఈ పరిశోధనలు జరిపారు. సగటున 65 ఏళ్ల వయసున్న వారిని అధ్యయనానికి ఎంచుకున్నారు. అనారోగ్యాలతో వార్ధక్యం భారంగా మారిన ప్రజల సగటు వయసు స్విట్జర్లాండ్‌, జపాన్‌లలో 76 ఏళ్లు. ప్రపంచంలోనే ఈ దేశాల్లో పరిస్థితి మెరుగ్గా ఉండగా.. అత్యంత ప్రతికూలంగా ఉన్న పపువా న్యూగినియాలో ఇలాంటి సగటు వయసు కేవలం 46 ఏళ్లు. ఇది భారత్‌లో 60 ఏళ్లుగా తేలింది. వయోధికుల్లో శారీరక, మానసిక, అభిజ్ఞ సామర్థ్యాలను దెబ్బతీస్తున్న 92 రకాల అనారోగ్యాలపై ఈ అధ్యయనం సాగింది. ఇందులో 5 అంటు వ్యాధులు, 81 ఇతర రోగాలు కాగా మరో 6 గాయాలకు సంబంధించినవి. అనారోగ్యం కారణంగా చాలామంది వార్ధక్య జీవితాన్ని భయంగా గడుపుతున్నట్లు ప్రధాన అధ్యయనకర్త ఏంజెలా వై చాంగ్‌ తెలిపారు. వయసుతో వచ్చే సమస్యలు – త్వరగా పదవీ విరమణ చేయడం, తమ పనులు తాము చేసుకోలేని పరిస్థితికి చేరడం, ఆరోగ్యంపై ఎక్కువ ఖర్చు చేయడానికి దారితీస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి అధ్యయనం జరపడం ఇదే తొలిసారిగా చాంగ్‌ తెలిపారు. 2017లో ప్రపంచంలోనే అత్యధికంగా పపువా న్యూగినియాలో ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి వెయ్యిమంది వయోధికుల్లో 500కు పైగా అనారోగ్యానికి గురవుతున్నారు. అదే స్విట్జర్లాండ్‌లో దాదాపు 100 మందికి (వెయ్యి మందికి గాను) మాత్రమే ఇలాంటి సమస్యలున్నాయి.

ఎన్నికల నియమావళి అంటే …

లోక్‌సభ ఎన్నికలకు నిన్న షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనినే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ప్రవర్త నియమావళి) అని అంటారు. ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు రూపొందించిన విధివిధానాలనే ప్రవర్తన నియమావళిగా పేర్కొంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక అధికారాలు వస్తాయి. కోడ్ అమల్లోకి రాగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆంక్షలు అమల్లోకి వస్తాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ అధికారాలు కోల్పోతాయి. వాటికి నామమాత్రమైన అధికారాలు ఉంటాయి. ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు, అభ్యర్థులపై నిఘా వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉటుంది.ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగేలా ఎన్నికల సంఘం రూపొందించిన విధివిధానాలను ప్రవర్త నియమావళిగా పేర్కొంటారు. ఇందులో రాజకీయ పార్టీలు ఏం చేయొచ్చో, ఏమేం చేయకూడదో స్పష్టంగా పొందుపరిచారు. ఇందులో ప్రధానంగా ఎనిమిది ప్రొవిజన్లు ఉన్నాయి. అవి ఎన్నికల నిర్వహణ, సమావేశాలు, ర్యాలీలు, పోలింగ్ తేదీలు, పోలింగ్ బూత్‌లు, ఎన్నికల పరిశీలకులు, అధికారంలో ఉన్న పార్టీ, మ్యానిఫెస్టోలు. ఈ అంశాలకు సంబంధించిన విధివిధానాలు ఉంటాయి. ఎలక్షన్ కోడ్ మొట్టమొదటిసారిగా 1960లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అమల్లోకి వచ్చింది. 1962 సార్వత్రిక ఎన్నికల నుంచి దేశవ్యాప్తంగా కోడ్‌ను అమలు చేస్తున్నారు. పార్టీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధిపొందే అవకాశం లేకుండా 1979 అక్టోబర్‌లో ఎలక్షన్‌కోడ్‌కు అదనంగా ఒక సెక్షన్‌ను చేర్చారు.

రూ.500 కోట్లు చెల్లింపులు

రానున్న జాతీయ ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేపట్టడానికి సామ్ బల్సారా నేతృత్వంలోని మాడిషన్ మీడియాను భాజపా పునః నియమించుకుంది. ప్రింట్, డిజిటల్, టీవీ, రేడియోలో సహా భాజపా తరపున అన్ని రకాలుగా ప్రచారం చేయడానికిగానూ ఈ సంస్థకు రూ.500 కోట్లు చెల్లించినట్లు సమాచారం. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ భాజపా తరపున ఈ మీడియా దిగ్గజం ప్రచార బాధ్యతలను ఒగిల్వి, మేధార్ అనే మరొ కంపెనీకి సైతం అప్పగించారు. ఈ కంపెనీ అధినేత పియూష్ పాండే 2014లో రూపొందించిన నినాదం ఆబ్ కి బార్ మోడీ సర్కార్ (ఈసారి మోడీ సర్కార్ వంతూ) జనసామాన్యంలోకి బాగా చొచ్చుకుపోయింది.

అమెరికాపై కేసు పెట్టింది

చైనాకు చెందిన హువావే కంపెనీపై అమెరికా నిషేధం విధించింది. ఆ కంపెనీ ఉత్ప‌త్తుల‌ను వాడ‌రాదంటూ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భ‌ద్ర‌త నేప‌థ్యంలో తాము ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పింది. అంతేకాదు త‌న మిత్ర దేశాలకు కూడా హువావే టెలిక‌మ్యూనికేష‌న్ ఉత్ప‌త్తుల‌ను వాడ‌రాదంటూ అమెరికా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో హువావే కంపెనీ అమెరికాపై దావా వేసింది. టెక్సాస్ కోర్టులో కేసు న‌మోదు చేసింది. ఫెడ‌ర‌ల్ ఏజెన్సీలు హువావే ఉత్ప‌త్తుల‌ను వాడ‌రాదంటూ అమెరికా నిషేధం విధించ‌డాన్ని ఆ కంపెనీ స‌వాల్ చేసింది. తమ ఉత్ప‌త్తుల్లో లోపం ఉన్న‌ట్లు అమెరికా నిరూపించ‌లేక‌పోయింద‌ని, చైనా ప్ర‌భుత్వంతోనూ త‌మ‌కు లింకులు లేవ‌ని హువావే చైర్మ‌న్ ఇటీవ‌ల షెంజెన్‌లో జ‌రిగిన ఓ మీట్‌లో వెల్ల‌డించారు. కానీ అమెరికా మాత్రం ఆ ఉత్ప‌త్తుల‌ను నిషేధిస్తున్న‌ది. త‌మ ఉత్ప‌త్తుల‌పై ప్ర‌జ‌ల్లో అమెరికా త‌ప్పుడు అభిప్రాయాల‌ను చేర‌వేస్తున్న‌ద‌ని, త‌మ కంపెనీ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేస్తున్న‌ద‌ని హువావే చైర్మ‌న్ ఆరోపించారు. హువావే ఉత్ప‌త్తుల‌ను వాడ‌కూడ‌దంటూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కూడా త‌మ టెలికాం సంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ చేశాయి.

రాజధాని రైలుకు 50ఏళ్లు పూర్తి

వేగం, విలాసాల్లో ఇండియన్ రైల్వేస్ దశ, దిశను మార్చేసిన రాజధాని ఎక్స్‌ప్రెస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.

1960ల్లో తొలిసారి పట్టాలెక్కిన ఈ ఎక్స్‌ప్రెస్ ఆదివారం తన గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది.

50వ ఏట అడుగుపెట్టిన రోజు హౌరా నుంచి బయలుదేరింది.

తొలిసారి కోల్‌కతా-న్యూఢిల్లీ మధ్య 1969, మార్చి 3న రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైనట్లు ఈస్టర్న్ రైల్వే అధికారి వెల్లడించారు.

దేశంలోని పూర్తి ఎయిర్‌కండిషన్డ్, హైస్పీడ్ ట్రైన్‌గా అప్పట్లో ఇది నిలిచింది. 1450 కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల 20 నిమిషాల్లో చేరుకోవడం విశేషం.

ఆదివారం హౌరా నుంచి రైలు బయలుదేరే ముందు దానిని పూలతో అందంగా ముస్తాబు చేశారు.

గతంలో ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నడిపిన ముగ్గురు మాజీ సిబ్బంది జెండా ఊపారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

తొలిసారి ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి హౌరా స్టేషన్‌లోని 9వ నంబర్ ప్లాట్‌ఫాంపైనే ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్ నిలబెడుతున్నారు.

ఆదివారం కూడా అదే ప్లాట్‌ఫాం నుంచి ఆ రైలు బయలు దేరింది.

ఈ గోల్డెన్ జూబ్లీ ప్రయాణంలో పాలుపంచుకున్న ప్యాసెంజర్లకు రైల్వే శాఖ ప్రత్యేక వంటకాలు చేసి పెట్టింది.

రసగుల్లాలు, ఐస్‌క్రీమ్‌లతోపాటు ఫిష్ ఫ్రై, వెజిటబుల్ కట్లెట్స్‌లాంటి సాంప్రదాయ నోరూరే వంటకాలను వడ్డించారు.

తొలిసారి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లోనే రైలు టికెట్‌తోపాటు భోజనానికి కూడా చార్జీ వసూలు చేశారు. రైల్లోని సిబ్బంది గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ప్రత్యేకమైన యూనిఫామ్‌లు ధరించారు.

మీరెంత అదృష్టవంతులో మీకు తెలుసా?

*మనలో చాలా మంది నేను దురదృష్టవంతుడిని, నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే ఇలా తమని తామే నిందించుకుంటూ, తక్కువ చేసుకుంటూ, మనసులోనే కుమిలి కుమిలి పోతూ ఉంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో తెలిస్తే మనకున్న సగం అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే “మన మనసులోని బాధలే మన అనారోగ్యానికి మూల కారణం”. మరి ఆ బాధలేమిటో పరిశీలిద్దాం..

(1) ఈ రోజు పొద్దున్నే నువ్వు “ఏ నొప్పులు, బాధలు లేకుండా, నిన్నేవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్రలేచావంటే “.. దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడివన్నమాట.

(2) నువ్వింత వరకు యుద్దంలో రక్తపాతం కాని, జైల్లో ఒంటరితనాన్ని గాని, కరువు సమయంలో శరణార్థ శిబిరాన్ని కాని చూడలేదంటే…ప్రపంచంలోని 200 కోట్ల మంది అనాధల కంటే నీవే గొప్ప అదృష్ట వంతుడివన్నమాట.

(3) నువ్వీరోజు ఏ భయమూ లేకుండా, ఏ అయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండానే నీవు హాయిగా బయట తిరగ్గలిగావంటే..300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేవన్నమాట.

(4) ఈ రోజు నువ్వు కడుపునిండా తిని, ఒంటి నిండా బట్టలు కప్పుకొని, ఓ ఇంటి కప్పుకింద కంటినిండా నిద్ర పోగలిగితే…ఈ భూప్రపంచంలోని 50 శాతం మంది కన్నా నీవు అతిపెద్ద ధనవంతుడివి అన్నమాట.

(5) నీ జేబులో ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ ఖాతాలో భవిష్యత్తు అవసరాలకు సరిపడా నగదు నిల్వ ఉన్నట్లయితే…ప్రపంచంలో 8 శాతంగా ఉన్న ఆత్యంత ధనవంతుల్లో నీవొకడివన్నమాట.

(6) నీ తల్లిదండ్రులు బ్రతికి ఉండి, వారింకా విడాకులు తీసుకోకుండా, వారు నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా జీవిస్తున్నారంటే.. ఈ ప్రపంచపు 15 శాతం మంది “అనాధ కుటుంబాలలో “నువ్వు ఒకడివి కాదన్నమాట. “జీవితంలో అనాధలు అంటే తల్లిదండ్రులు లేనివారు కాదు, ఉన్న తల్లిదండ్రులను సంతృప్తిగా చూసుకోలేనివాడు అసలైన అనాధలు”. అయితే కొందరు సాకులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రులు అలాంటి వారు, ఇలాంటి వారు అని. కానీ “నువ్వూ అలాంటి వాడివే ” కాకూడదు కదా !

(7) నువ్వు నీ భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో తిరగగలుగుతూ, ఆహ్లదంగా నవ్వగలిగితే, నీ ప్రవర్తన ద్వారా అందరినీ మెప్పిస్తున్నావంటే, ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నావన్నమాట. అదే అసలైన హీరోయిజం.

(8) నీవు ఈ మాటలు చదువగలుగుతున్నావూ అంటే ప్రపంచంలో.. 50 కోట్ల నిరక్ష్యరాస్యులకంటే నువ్వు అదృష్టవంతుడివన్నమాట.

(9) నువ్వింకా నాకు అదిలేదు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తిగా ఉన్నావంటే, నీకున్న ఆస్తులని, నీ విలువలని, నీ శక్తులని, నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట.

*ఇప్పటికైనా తెలిసిందా ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో, నాకు తెలిసి మన జీవితంలో “తృప్తికి మించిన సంపద ” మరొకటి లేనేలేదు.

*ఇప్పటికైనా ..మీకు ఏమైనా బాధలు, కష్టాలూ ఉంటే వాటిని తగ్గించుకుంటూ..ఉన్నంతలో మీరు.. మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను…

*అందరం అర్థం చేసుకుంటే మరింత కాలం సంతోషంగా బ్రతుకుదాం !!!

*మనతోపాటు అందరినీ ఆనందంగా బ్రతకనిద్దాం……

*సర్వే జనా సుఖినోభవంతు.

వాడు మా దగ్గరే ఉన్నాడు

భారత్‌లో పలు ఉగ్రదాడుల సూత్రదారి, జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు ఆ దేశం అంగీకరించింది. పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మసూద్‌ పాకిస్థాన్‌లోనే ఉన్నాడా? అని అడిగిన ప్రశ్నకు ఖురేషి బదులిస్తూ..‘‘అతడు (మసూద్‌) పాక్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంటిని విడిచి బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నాడు’’ అని తెలిపారు. ‘‘మసూద్‌ను పాక్‌ అరెస్ట్‌ చేయాలంటే.. ముందుగా భారత్‌ మాకు సరైన ఆధారాలు అందించాలి. అవి పాక్‌ న్యాయస్థానాలకు ఆమోదయోగ్యం కావాలి’’ అని ఖురేషి చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్‌ ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ‘‘భారత్‌ వద్ద తగిన ఆధారాలు ఉంటే.. దయచేసి కూర్చుని చర్చించుకుందాం. చర్చలను ప్రారంభించండి. మేం సంసిద్ధంగా ఉన్నాం’’ అని ఖురేషి పేర్కొన్నారు. 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల ప్రాణలను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ జైషే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఎప్పట్నుంచో మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ కోరుతోంది. తాజాగా మసూద్‌‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మరోసారి ప్రతిపాదించాయి. ఐరాస భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వమున్న ఈ మూడు దేశాలూ బుధవారం దాని ముందుకు ఈ ప్రతిపాదనను తెచ్చాయి.

కరాచీ బేకరీకి కరాచీకి సంబంధం లేదు

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్రవాదన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై యావత్‌ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత సినీ ఇండస్ట్రీ కూడా పాక్‌ కళాకారులపై నిషేధం విధించింది. చివరికి నదీ జలాలను కూడా ఆపేశారు. ఇక పాక్‌ వ్యక్తులను, పేర్లను, అనుకూలమైన వారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పుల్వామా దాడి ప్రభావం కరాచీ బేకరీపై పడింది. బేకరీ పేరులో పాకిస్తాన్‌కు చెందిన పట్టణం ‘కరాచీ’ ఉందంటూ ఆ బేకరీ ముందు పలువురు ఆందోళనలు చేశారు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. ఈ క్రమంలో తాము పాకిస్తాన్‌కు చెందిన వాళ్లం కాదని భారతీయలమే అంటే బేకరీ యాజమాన్యం ఆందోళనాకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఎంత చెప్పిన వినకపోవడంతో బేకరీ పేరులోని కరాచీ కనపడకుండా క్లాత్‌తో కప్పివేశారు. అంతేకాకుండా బేకరీపై మువ్వన్నెల జెండా కూడా ఎగిరేశారు. దీంతో శాంతించిన ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దేశ విభజన సమయంలో ఖాన్‌ చంద్‌ రమణి అనే వ్యక్తి భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. 1953లో ఆయన హైదరాబాద్‌ వేదికగా కరాచీ బేకరీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా శాఖలను విస్తరించారు. బిస్కెట్లకు కరాచీ బేకరీ ఎంతో ప్రసిద్ధిపొందినది. ఇక ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కరాచీ పేరుని పాకిస్తాన్‌తో లింక్ చేయడం పట్ల వ్యాపారులు విస్మయం చెందుతున్నారు. కరాచీ పేరుకి పాకిస్తాన్‌కు ఎలాంటి సంబందం లేదని వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కాకినాడ సుబ్బయ్య కూకట్‌పల్లి కూడా వచ్చాడు

నాణ్యత, నవ్యత, సాంకేతికత…ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వినియోగదారుణ్ణి ఆకర్షించడానికే. అయితే ఈ క్రమంలో సుబ్బయ్యగారిది ఓ ప్రత్యేకత… అదేంటంటే ఆత్మీయత…63 ఏళ్ల క్రితం ఆయన కనుగొన్న ఈ వ్యాపార సూత్రం ఇప్పటికీ అందరి గుండెను తడుతోంది. తరాలు మారుతున్నా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నా హోటల్‌లో అదే మూలసూత్రంగా, తారకమంత్రంగా పెట్టుకుని ముందడుగులు వేస్తున్నారు…అందుకే అక్కడకు వెళ్లినవాళ్లు దాన్ని హోటల్‌గా కాకుండా ఓ సొంత ఇంటిలా భావిస్తారు…అద్భుతమైన ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారు.సార్‌.. వచ్చారా… రండి…ఇలా కూర్చోండి…మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మా హోటల్‌కు వచ్చారు కదా. తర్వాత సంగతి మాకు వదిలేయండి…అరే… రాజూ… ఇలా రారా… సార్‌కి ఆకు వెయ్యి…ముదిరిపోయింది కాదు… ఆ లేత ఆకు వెయ్యి…నేను చెప్పడం కాదుగనండీ… వేడివేడి అన్నం ఈ లేత అరిటాకు రసాన్ని పీల్చుకున్న తర్వాత మా గొప్ప రుచిగా మారిద్దండీ… పైగానండీ… మంచి ఆరోగ్యం కూడానండీ…ఇదిగో… ముందు ఈ బూరె వేసుకోండి… దీన్ని చాలా చోట్ల చేసినా మా గోదారోళ్లు చేస్తే ఆ రుచే వేరండి…
దాన్ని మధ్యలో కొంచెం మెదపండి…అందులో కాస్త నెయ్యి వేసుకుని తింటే…అప్పుడు తెలుస్తుందయ్యా దీని రుచి…ఇదుగిదిగో… కాస్త ఈ మైసూరుపాక్‌ ముక్క రుచి చూద్దురూ…ఈరోజు బాగా కుదిరిందండీ.. నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండీ… ఆగండాగండి… బిర్యానీ రుచి చూసే ముందు మా స్పెషల్‌ చూడాల్సిందే!
అయ్యా… ఇది కాజా… మీకు తాపేశ్వరం కాజా తెలుసుకదా… దాన్ని మడత కాజా అంటారండీ… అలాగే మా జిల్లాలో ఇంకో కాజా కూడా బాగా ఫేమస్సండోయ్‌… అదే ఇది… దీన్ని కాకినాడ కాజా, గొట్టం కాజా అని కూడా పిలుస్తారు… పిండిని ప్రత్యేకంగా ఇలా గొట్టంలా చేసి దాంట్లో పంచదార పాకం నిండేలా చేస్తారు. ఓ నాలుగ్గంటల తర్వాత చాలా రుచి వచ్చేస్తదండి… సార్‌కి కాజాతో పాటు ఈ పాకం గారెలు కూడా వెయ్యరా…నాటు బెల్లంతో చేసిన ఈ పాకాన్ని మా ఏరియాలో తేనె పానకం అని కూడా పిలుస్తారండీ… నూనెలో నుంచి తీసిన వేడివేడి గారెలు ఈ పాకంలో నానిన తర్వాత మా గొప్ప రుచిని పుంజుకుంటాయండీ… మా దగ్గర కొత్తల్లుళ్లు అయితే పుంజీళ్ల కొద్దీ తినేస్తారండి… వీటిని…ఇప్పుడు వేస్తోంది దబ్బకాయ పులిహోర… చాలా ప్రశస్తంగా ఉంటదండీ…బిర్యానీలో పెరుగుచట్నీ కలుపుకున్నా బాగుంటుందండీ…
*ఇదిగో వేడివేడి అన్నం వచ్చేసింది… ఇందులో ముందు ఈ కరివేపాకు పొడి, నెయ్యి కలపండి… దీని వల్ల ఆకలి పెరుగుతుందండి… అజీర్తి, పైత్యం వంటి సమస్యలకు కూడా మంచి మందు… మొదటి ముద్ద దీంతోనే తినాలి మీరు…ఈ కంది పొడి కూడా చాలా శ్రేష్ఠమండీ… మంచి రుచి కూడా ఉంటది…మీకు నచ్చితే వెళ్లేటప్పుడు రెండు డబ్బాలు కొనుక్కెళ్లవచ్చండీ…వేడి అన్నంలో ఈ పప్పు, ఆవకాయ కలిపి చూడండి…మీరు వహ్వా అనకపోతే మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తానండి…ఈ పనసపొట్టు కూర, ఆనపకాయ కూర, మా దగ్గర చాలా ఫేమస్సండీ బాబూ…ఒరే రాజూ అప్పుడే సాంబారు తెస్తావేంట్రా… మరోమారు కూరలు వడ్డించు…అయ్యా… మీరు సాంబారు వేసుకున్నప్పుడు ముక్కలు వదలకండేం… అప్పడం నంజుకోవడం మాత్రం మర్చిపోవద్దు…కాస్త మజ్జిగ పులుసు ప్రయత్నిస్తారా… కొంచెం ఆగండి… ఈ జున్ను తినిగానీ మీరు కదలడానికి వీల్లేదు!
*శాంపిల్‌గా…31 వంటలు
1955వ సంవత్సరంలో కాకినాడ రామారావుపేటలో సుబ్బయ్య ఏర్పాటుచేసిన మొట్ట మొదటి సుబ్బయ్యగారి హోటల్‌ తర్వాత అక్కడే మూడు రెస్టారెంట్లు ఏర్పాటుచేసే స్థాయికి చేరింది. దీనికి కారణం ఆ హోటల్‌లో అందించే ఆతిథ్యమే. ఎక్కడైనా డబ్బులిచ్చామా… తినేసి వచ్చామా… అని మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడికొచ్చే వారిని అడిగి మరీ వడ్డిస్తారు. కొసరి, కొసరి తినిపిస్తారు. కడుపునిండా తినే వరకు వదిలిపెట్టరు. ఫలానాది కావాలని నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండానే.. వారే ఇది వేసుకోండి.. అది వేసుకోండని.. రుచి చూడమని ప్రేమను పంచుతారు. ఈ ఆప్యాయత.. కడుపు నిండిందా లేదా అని చూసేవారు ఈ రోజుల్లో ఎవరుంటారండీ. అదే వారి వ్యాపారం మూడుపువ్వులు.. ఆరు కాయలుగా వెలుగొందడానికి కారణమైంది. అదొక్క అంశం.. వారిని హోటల్‌ రంగంలో తిరుగులేని స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు భాగ్యనగరంలో కూడా ఆతిథ్యాన్ని పంచుతోంది.
సుబ్బయ్యగారి హోటల్‌ విజయం వెనక మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. అప్పట్లో వినియోగదారుడి అభిరుచి తెలుసుకునేందుకు సుబ్బయ్యగారు ఆకులో కొంచెంకొంచెంగా వండిన పదార్థాలన్నీ వడ్డించడం మొదలుపెట్టారు. శాంపిల్‌గా ఇవన్నీ రుచి చూడమని అడిగేవారు. చిన్నగా వినియోగదారుడిని ఈ పద్ధతే ఆకట్టుకుంది. వచ్చినవాళ్లంతా ఆ శాంపిల్‌ భోజనమే కావాలని అడగడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే ఒక భోజనంలో 31 రకాల పదార్థాలు వడ్డిస్తున్నారు.
*బుట్టలో భోజనం…
రెస్టారెంట్‌లో తినేవారికే కాకుండా తమ రుచులను పార్శిల్‌గా ఇంటికి తీసుకెళ్లేవారికి కూడా పంచుతున్నారు. ప్రత్యేకంగా బుట్ట భోజనం పేరుతో పార్శిల్‌ను ఇస్తున్నారు. ఇందులో 13రకాల వంటకాలు అందిస్తున్నారు. చక్కగా కనిపించే బుట్టలో అరిటాకుల మధ్య ఏర్పాటుచేసిన వంటకాలు నోరూరిస్తాయి. ఇందుకోసం వినియోగించే బుట్టలను కాకినాడలోని రావులపాలెం అనే గ్రామం నుంచి తీసుకొస్తారు. వీటి తయారీపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాల నుంచి కొనుగోలు చేసి బుట్టలో భోజనం అందిస్తున్నారు. ఇలా బుట్టలు తయారుచేసే వారికి జీవనోపాధిని కల్పిస్తున్నామన్న సంతృప్తిని సైతం వీరు మూటకట్టుకుంటున్నారు.

ఎన్నికల తెరపైకి ఎర్రన్నాయుడు కుమార్తె – TNI ప్రత్యేకం

మాజీ కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ తెదేపా నాయకుడు దివంగత కింజరపు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికై మంచి వ్యక్తిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం ఎర్రన్నాయుడు కుమార్తె భవానీని రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం తెదేపా ప్రయత్నాలు ప్రారంభించింది. రాజమండ్రీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలే భవానీ. అప్పారావుకు రాజమండ్రీలో మంచి పలుకుబడి ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా భాజపాకు అసెంబ్లీ స్థానాన్ని తెదేపా కేటాయించింది. ఆకుల సత్యనారాయణ భాజపా తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో అప్పారావును కాదని పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని తెదేపా వదులుకుంది. అప్పారావు కుమారుడు వాసు ఈ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలనీ ప్రయత్నిస్తున్నారు. ఇది గమనించిన చంద్రబాబునాయుడు వాసు భార్య భవానీకి అసెంబ్లీ అభ్యర్దిత్వం ఇస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. అప్పారావుకు రాజమండ్రీలో ఉన్న పలుకుబడితో పాటు ఎర్రన్నాయుడు కూతురుగాను, రామ్మోహన నాయుడు సోదరిగానూ ఉన్న భవానీకి ప్రజల నుండి ఎక్కువ ఆదరణ లభిస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అప్పారావు తో పాటు ఆయన కుమారుడు వాసు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించారని తెలిసింది. బీసీ కులానికి చెందిన భవానీ మహిళ కావటం కూడా తేదేపాకు బాగా ఉపకరిస్తుందని ఆ పార్టీ అధిస్థానం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కింజరాపు (ఆదిరెడ్డి)భవానీ రాజమండ్రీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికవుతారని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. భవానీ ఎన్నికల రంగంలో ఉంటె శ్రీకాకుళం జిల్లాలో కూడా దీని ప్రభావం ఉంటుందని ఆపార్టీ భావిస్తోంది. – కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.

అమెరికాను అధిగమిస్తున్న భారత్‌!-తాజావార్తలు–02/22

*భారత్‌లో త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల వ్యయం అమెరికాను మించిపోనుంది. తద్వారా అత్యధిక ఎన్నికల వ్యయం చేసిన ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ నిలవనుంది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష, కాంగ్రెషనల్‌ ఎన్నికల్లో జరిగిన 6.5 బిలియన్‌ డాలర్ల (సుమారు 4620 కోట్లు) ఖర్చే ఇప్పటి వరకు అత్యధిక వ్యయంతో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారత్‌లో 5 బిలియన్‌ డాలర్లు (సుమారు 3550 కోట్లు) ఖర్చు కాగా, 2019 ఎన్నికల్లో ఆ మొత్తం పెరగనుంది. అంటే అమెరికా 6.5 బిలియన్‌ డాలర్లకన్నా ఎక్కువ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈసీ ఖర్చు చేయనుందని అంతర్జాతీయ శాంతి కోసం ఏర్పాటు చేసిన మేధావుల సంఘంలో సభ్యుడు, నిపుణుడు మిలన్‌ వైష్ణోవ్‌ అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థులు, పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడం, ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, వారికి ఓటరు స్లిప్పులను పంచడం తదితర అంశాల కారణంగా ఎన్నికల వ్యయం పెరిగుతున్నట్టు తెలిపారు. ఇదిలాఉండగా.. వచ్చే నెల 7 నుంచి 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. జూన్‌ 3వ తేదీన 16వ లోక్‌సభ పదవీ కాలం ముగుస్తుంది. అంతేకాకుండా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల (ఆంధ్రప్రదేశ్‌(జూన్‌ 18న), అరుణాచల్‌ ప్రదేశ్‌ (జూన్‌1న), ఒడిశా (జూన్‌ 11న), సిక్కిం (మే 27న)) పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిచాలని ఈసీ భావిస్తోంది. ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్‌ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్‌ యంత్రాలు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది.
*శ్రీవారిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దర్శించుకున్నారు.రాహుల్ సాంప్రదాయ దుస్తులతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.రాహుల్ పంచెకట్టుతో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
*తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ఈరోజు వాయిదా పడ్డాయి. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. రేపు, సోమవారం బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. రేపు బడ్జెట్‌పై.. సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. మరోవైపు రేపు ఉపసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. సోమవారం ఉపసభాపతి ఎన్నికను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పదవికి మాజీ మంత్రి, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
*పారీస్ లో ప్రఖ్యాత ఐపిల్ టవర్ ఇప్పుడు డిల్లీలో కనువిందు చేస్తోంది. అవును నిజామేనండీ. దీంతో పాటు ఏడు ప్రపంచ వినతలు ఇక్కడకు వచ్చేశాయి వెస్ట్ టూ వండర్స్ పార్క్ లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ ప్రఖ్యాత కట్టడాల ప్రతిమలన్నింటిని వ్యర్ధలతో తయారు చేయడం విశేషం.
* స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. సతీసమేతంగా నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. వెంకటాచలంలో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ 18వ వార్షికోత్సవ వేడులకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. గతంలో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షర పాఠశాలను సందర్శించినట్లు రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. క్లిష్టమైన సవాళ్లు ఎదురైనప్పుడు వెరవనితత్వం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సొంతమని కోవింద్‌ కొనియాడారు.
* ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీడియోకాన్‌ స్కాం విషయంలో ఆమెపై ఇప్పటికే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. తాజాగా చందాకొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ దూత్‌కు సీబీఐ లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్‌ సంస్థకు రుణం మంజూరు చేయడంలో చందాకొచ్చర్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటికే సీబీఐ నిర్ధరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో పదవికి రాజీనామా చేయగా, దాన్ని కారణం రీత్యా తొలగింపుగా భావిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.
* బాసరశ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. అమ్మవారి ఆలయంలో ఈ రోజు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు కుటుంభ సమేతముగా విచ్చేసి తన మనుమరాలు అమృత రాశికి ఆలయ పూజారులచే అన్నప్రాసన చేయించారు. ఎస్పీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ సిబ్బందిపూజారులు శాలువతో సన్మానించితీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ఆలయ ప్రత్యేక అధికారి అన్నాడి సుధాకర్ రెడ్డిఆలయ ఏఈవో శ్రీనివాస్బాసర మండల ఎస్సై తోట మహేష్ తదితరులు పాల్గొన్నారు.
* పెరూ-ఈక్వెడార్‌ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5గా నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఇవాళ తెల్లవారుజామున 3.47 గంటలకు భూకంపం సంభివించినట్లు యూఎస్‌ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.
*టీం 20ల నుంచి తానూ రిటైర్ కానున్నట్లు వచ్చిన వార్తలను మిధాలీ రాజ్ తోసిపుచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పట్లో పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికే యోచన లేదని ఆమె గురువారం తెలిపింది.
*మీకు బ్రేక్ డాన్స్ లో అద్భుత ప్రావీణ్యం ఉందా? అయితే మీరు ఒలింపిక్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంది. బ్రేక్ డాన్స్ వస్తే ఒలింపిక్స్ లో పాల్గొనడం ఏమిటీ.. అనుకుంటున్నారా? పారీస్ లో జరగనున్న 2024 ఒలింపిక్స్ లో బ్రేక్ డాన్స్ తో పాటు వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టనున్న స్కేట్ బోర్డింగ్, క్లైమ్బింగ్ సర్పింగ్, క్రీడాంశాలు కూడా కొనసాగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కి పారీస్ 2024 ఒలింపిక్ నిర్వాహక కమిటీ విన్నవించింది. ఈ ప్రతిపాదన పై ఐవోసి వచ్చే ఏడాది డిసెంబరు లోపు నిర్ణయం తీసుకోనుంది.
*విశాఖకి మహేంద్ర సింగ్ దినీకి విడదీయరాని అనుబందం ఉంది. మహి ధనాధన్ మొదలైంది ఇక్కడే. వైజాగ్ లో ఈనెల 24న ఆస్ట్రేలియాతో తోలి టీం 20 జరగనున్న నేపద్యంలో ధోనీ తనకిష్టమైన విశాఖలో మళ్ళీ అడుగు పెట్టాడు. శనివారం రాయ్ పూర్ నుంచి విశాఖ విమానాశ్రయంలో దిగిన ఈ భారత మాజీ కెప్టెన్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
*ప్రమాదవ శాత్తు ద్వీచక్ర వాహనం పై నుంచి కిందపడిపోయిన ఓ చిన్నారికి ఏనుగు మంద నుంచి ఎలాంటి హనీ కలగకుండా ఓ పెద్ద ఏనుగు అండగా నిలిచింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని గురుమర అటవీ ప్రాంతంలో జాతీయ రహదారి నంబరు 31పై జరిగింది.
*ప్రైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌గా పేరొందిన ప్యారడైజ్‌‌ బిర్యానీ మరో అరుదైన ఘనత సాధించింది. ఒక ఏడాదిలో అత్యధిక వినియోగదారులకు బిర్యానీ సేవలు అందించినందుకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించింది. ఒక ఏడాదిలోనే దాదాపు 70 లక్షల మందికిపైగా బిర్యానీ రుచిని అందించినందుకు ‘ప్యారడైజ్‌’ ఈ అవార్డును సొంతం చేసుకుంది. లిమ్కా బుక్‌ అవార్డుతో పాటు బెస్ట్‌ బిర్యానీ అవార్డు లభించాయి. ప్యారడైజ్‌‌ ఛైర్మన్‌ అలీ హేమతికి ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ సంస్థ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌‌ హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సిబ్బంది కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకొన్నారు.
*భవిష్య నిధి (పీఎఫ్‌) డిపాజిట్లపై 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ చెల్లించాలని ప్రతిపాదించినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ వెల్లడించారు. గురువారం జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
*దేశంలో ఇక ఏ విద్యాసంస్థ అయినా డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా పొందాలంటే 20 ఏళ్ల చరిత్ర తప్పనిసరి. దీంతో పాటు మరిన్ని నిబంధనలతో ‘డీమ్డ్‌’ హోదా మంజూరుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యా ప్రమాణాల పెంపు దిశగా.. 2016 నాటి విధివిధానాలను పక్కనపెట్టి వాటి స్థానంలో ‘యూజీసీ (ఇన్‌స్టిట్యూషన్స్‌ డీమ్డ్‌ టుబీ యూనివర్సిటీస్‌) రెగ్యులేషన్‌-2019’ పేరుతో వీటిని రూపొందించింది.
*హరియాణా రాష్ట్రం హిసార్‌ కేంద్రంగా చోటు చేసుకున్న ‘ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌’ (ఎఫ్‌ఎంఎల్‌సీ) కుంభకోణంలో పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లినట్లు తెలుస్తోంది. గొలుసుకట్టు మోసం ద్వారా హరియాణా, దిల్లీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశాతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితుల నుంచి అక్రమంగా నిధులు సేకరించిన ఈ సంస్థ నిర్వాకాన్ని సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీసులు గత ఏడాది సెప్టెంబరులో బయటపెట్టిన సంగతి తెలిసిందే.
*జాతీయ విద్యాసంస్థలు, కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలతోపాటు, ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థలకు నిలయమైన తెలంగాణ రాష్ట్రం పరిశోధన, నవకల్పనల పేటెంట్ల దరఖాస్తుల్లో అగ్ర పథాన కొనసాగుతోంది. ఈ అంశంలో దేశవ్యాప్తంగా తెలంగాణ 5వ స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్‌ 11వ స్థానాన్ని దక్కించుకుంది. పరిశోధన పత్రాల ప్రచురణలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోని 50 సంస్థల్లో 6వ స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
*కాంగ్రెస్‌ శాసనసభాపక్షం శుక్రవారం ఉదయమే సమావేశం కానుంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన ఆ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు హాజరవుతారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తారు
*సికింద్రాబాద్‌, కర్ణాటకలోని బీదర్‌ల మధ్య వారంలో ఆరు రోజులు నడుస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (నెం.17010/17009) ఇక ప్రతిరోజూ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపిందని, 23వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణమధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది
*గాంధీ ఆసుపత్రిలో మరొకరు స్వైన్‌ఫ్లూతో మృతిచెందారు. వ్యాధితో చికిత్స పొందుతూ, ఈ ఏడాది ఇప్పటివరకు అక్కడ మరణించినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటకు చెందిన 47 ఏళ్ల మహిళ స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వరంగల్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
*తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌గా వైద్య రంగానికి చెందిన వ్యక్తిని నియమించాలని, ఐఏఎస్‌ నియామకం చెల్లదని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌గా ఆరోగ్య ట్రస్ట్‌ సీఈఓగా ఉన్న కె.మాణిక్‌ రాజ్‌ ఐఏఎస్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం గతేడాది అక్టోబరు 31న జీవో 604 జారీ చేసింది.
* కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఉన్నతీకరణకు మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 2017-18 విద్యా సంవత్సరంలో 84 కేజీబీవీలు మంజూరు కాగా వాటిల్లో ఆ ఏడాది 6, 7 తరగతులను ప్రారంభించారు.
*విశాఖ పర్యటనకు మార్చి 1న రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి మట్టి కుండలు, సంకెళ్లతో నిరసన తెలుపుతామని ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. విభజన హామీలపై దిల్లీ స్థాయిలో దీక్ష చేయమని చంద్రబాబుకు రెండేళ్ల నుంచే సూచిస్తున్నామని తెలిపారు.
* హైదరాబాద్‌లో యూఎస్‌ రాయబార కార్యాలయం సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని యూఎస్‌ రాయబారి కెన్నెత్‌ ఐ.జస్టర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో యూఎస్‌ రాయబార సేవలు ప్రారంభమై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం శంషాబాద్‌ విమానాశ్రయంలోని దేశీయ నిష్క్రమణ ప్రాంతంలో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ పదేళ్ల ప్రయాణంలో తీసిన ఛాయాచిత్రాలను ఇందులో పొందుపరిచారు. ఈ ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం యూఎస్‌ రాయబారి కెన్నెత్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో యూఎస్‌ రాయబార కార్యాలయం సేవలను దేశ, విదేశాలకు చెందిన ప్రయాణికులు తిలకించేలా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విమానాశ్రయ సీఈఓ కిషోర్‌ మాట్లాడుతూ…ఈ ఛాయాచిత్ర ప్రదర్శనకు విమానాశ్రయాన్ని వేదికగా ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. ఈ ప్రదర్శన పదిహేను రోజుల పాటు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా తదితరులు పాల్గొన్నారు.
* ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. ఇవాళ సియోల్ శాంతి బ‌హుమ‌తిని అందుకున్నారు. ద‌క్షిణ‌కొరియా రాజ‌ధాని సియోల్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మోదీకి ఈ అవార్డును ఆ దేశం అంద‌జేసింది. సియోల్ పీస్ ప్రైజ్‌ను అందుకున్న త‌ర్వాత మోదీ మాట్లాడారు.
ఈ అవార్డు త‌న‌కు ద‌క్కిన వ్య‌క్తిగ‌త‌మైన గౌర‌వం కాద‌ని, ఇది దేశ ప్ర‌జ‌ల‌కు చెందుతుంద‌ని అన్నారు. గ‌త అయిదేళ్ల‌లో భార‌త్ సాధించిన ప్ర‌గ‌తికి ఈ అవార్డు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 130 కోట్ల మంది భార‌తీయుల స‌త్తాకు ఈ అవార్డు ద‌క్కుతుంద‌న్నారు. మ‌హాత్మా గాంధీకి 150వ జ‌యంతి జ‌రుగుతున్న సంవ‌త్స‌రంలో ఈ అవార్డును అందుకోవడం గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్లు మోదీ చెప్పారు.

హైదరాబాద్ కళాశాలల్లో విచ్చలవిడిగా గంజాయి

గ్రేటర్‌లోని కొన్ని ప్రముఖ కళాశాలల్లో గంజాయి గుప్పుమంటోంది. వీటిలో చదువుతున్న కొందరు విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగం, క్రయవిక్రయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చి అక్రమార్కుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. జల్సాల కోసం ఈ చీకటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఒంటరిగా వసతిగృహాలు, అద్దె గదుల్లో ఉండే విద్యార్థులే ఎక్కువగా ఈ ఉచ్చులో పడుతున్నారు. అబ్కారీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో గంజాయితో దొరుకుతున్న వారిలో విద్యావంతులు ఎక్కువగా ఉండటం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. పట్టుబడుతున్న విద్యార్థుల కుటుంబాల వివరాలను పరిశీలిస్తే.. వీరంతా ఆర్థికంగా స్థిరపడినవారే. ఆర్థిక ఇబ్బందులతో ఈ ఉచ్చులోకి వచ్చిన విద్యార్థులే కాకుండా.. జల్సాల కోసం చిక్కుకున్నవారే ఎక్కువ. కొన్ని నెలలుగా తరచూ దొరుకుతున్న వారిలో నగరంలో ఏదో ఒక కళాశాలలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. వీరంతా రూ.లక్షలు వెచ్చించి ఆయా కళాశాలల్లో సీట్లు దక్కించుకున్నారు. ఇందులో చేరిన తక్కువ కాలంలోనే చెడు స్నేహాలతో అక్రమార్కుల ఉచ్చులో పడుతున్నారు. నగరంలో కొందరు విద్యార్థులు గంజాయి, కొకైన్‌, గంజాయి చాక్‌లెట్లు తదితర మాదకద్రవ్యాలను క్రయవిక్రయాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒక్కసారి ఈ వ్యాపారంలోకి ఆకర్షితులైన వారు దీని నుంచి బయటపడలేకపోతున్నారు. కొన్ని కళాశాలల ఆవరణలోనే మాదకద్రవ్యాలను పలువురు వినియోగిస్తున్నట్లు వాటిల్లోని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. గంజాయి వ్యాపారులు తమ కార్యకలాపాలకు విద్యార్థులను ఉపయోగించుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని వారు ఇలా చేస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది వివరిస్తున్నారు. కొన్ని వసతిగృహాల్లో తనిఖీలు చేయగా వారి వద్ద మద్యం, గంజాయి ఉండటాన్ని వారు గుర్తించారు. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యానికి తెలిపారు. తమ కళాశాల పేరు వెలుగులోకి వస్తే పరువు పోతుందని ఈ విషయాన్ని మరుగున ఉంచేశారు. అబ్కారీశాఖ ఇటీవల చేస్తున్న దాడుల్లో భారీగా గంజాయి నిల్వలు దొరుకుతున్నాయి. ఇటీవల ఇద్దరు నిందితుల నుంచి 105 గంజాయి చాక్‌లెట్లు, 31 గ్రాముల కొకైన్‌, రూ.7 లక్షల నగదును ఆబ్కారీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నెల రోజులు తిరగకుండానే ఎల్బీనగర్‌ సమీపంలో 10 కిలోల గంజాయి దొరికింది. ఇలా ఎక్కడ దొరుకుతున్నా కిలోలకొద్దీ గంజాయి దొరుకుతోంది. నగరంలో చాపకిందనీరులా మాదకద్రవ్యాల కొనుగోళ్లు, అమ్మకాలు, వినియోగం సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అబ్కారీశాఖ అధికారులు దీనిపై దృష్టి సారించారు. నిత్యం తనిఖీలు చేస్తున్నారు.

ప్రేమికుల దినోత్సవం ఇలా పుట్టింది

ప్రేమ అజరామరమైనది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఒక ఊహని ప్రియురాలికి చేరవేయడానికి ఎన్నెన్నో తీయటి ఇబ్బందులు పడేవారు. ప్రేయసి ఇంటిముందు నుంచి ప్రియుడలా పచార్లు చేసుకుంటూ, చూశాడో లేదో తెలీనంతగా ఆ ఇంటివైపు ఓ చూపు విసిరేవాడు. ఆమె కూడా చూసీచూడనట్టుగానే దండెం మీద తన మనసును ఆరేసి వెళ్లేది. అప్పుడు ల్యాండ్‌లైన్ కూడా లేదు. మనసు మరో మనసుతో నిశ్శబ్దంగానే ప్రేమకబుర్లు చెప్పుకునేది. వారిద్దరి మధ్యా పెదవులు దాటని ప్రేమ ఉండేది. మాటలు రాలని మమతుండేది. ఎప్పుడెప్పుడు విప్పుదామా అనుకుంటూ మనసు విప్పకనే ఎవరో ఒకరిని పెళ్లాడి ప్రేమనలా మనసులోనే సమాధి చేసేవారు.
**కొండొకచో ఒకటో అరో విజయవంతమయ్యేవి… కాలం కొద్దిగా మారింది. లైన్ వేయడానికి ల్యాండ్‌లైన్ ఒకటొచ్చింది. ఫోను మామూలుగా మోగితే బంధువులు చేసినట్టు. ఒకసారి మోగి ఆగి, మళ్లీ మోగి ఆగి, మళ్లీ మోగి ఆగితే అది ప్రేమ సిగ్నలేగా! ఎంతో కొంత ప్రేమికులు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఉపయోగపడింది. ఇక్కడ్నుంచి ఇంకాస్త ముందుకొస్తే ..రంగుల హంగుల ప్రపంచం మొదలైంది.
**ఈ మెయిళ్లు, ఫేస్‌బుక్కులు, వాట్సప్‌లు, సెల్‌ఫోన్లూ ప్రేమికులను చాలా దగ్గర చేశాయి. మాటల్లేని కాలం నుంచీ మాటలు పొంగి పొరలే కాలం వచ్చింది. అప్పుడైనా ఇప్పుడైనా ప్రేమ ప్రేమేకానీ, మాటల్లేని కాలంలో మనసు విప్పలేక మూగగా రోదించింది. మాట్లాడుకోవడం సులభమైన కాలంలో మాటామాటా పెరిగి మనసు విరిగి రోదించింది.యుక్త వయసులో ఉన్నవారు అపోజిట్ సెక్స్‌కి ఆకర్షింపబడటం సహజం. ఏడాదికి మామూలుగా మూడు కాలాలు. యువతకు నాలుగు కాలాలు. అదే ప్రేమ కాలం. ప్రేయసీ ప్రియులకు ఎండా కాలమైనా అది చల్లని కాలమే. వానాకాలమైనా అది వెచ్చనికాలమే. చలికాలమైనా ఎండాకాలమే. మొత్తంగా అన్ని కాలాలూ అనుకూల కాలాలు. ప్రేమంటేనే ఒక గొప్ప అనుభూతి. ఎవరెక్కడివారో కులమేంటో మతమేంటో వాళ్లకనవసరం..ప్రేమొక్కటే వాస్తవం.
*ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రేమకథ ఉంటుంది. వాటిలో కొన్ని విజయగాథలూ ఉంటాయి. చరిత్రలో నిలిచిపోయేవీ ఉంటాయి. కానీ అవన్నీ ఆ ప్రేయసీప్రియులకు మాత్రమే సొంతం. వాటికి భిన్నమైన ప్రేమకథ..‘వాలంటైన్’ కథ. ప్రేమికుల కోసం వాలంటైన్ చేసిన పోరాట గాథ. సెయింట్ వాలంటైన్ ప్రేమికుల కోసం అమరుడయ్యాడు.
***క్రీ.శ. 269-70 ప్రాంతంలో రోమన్ సామ్రాజ్యాన్ని రెండో క్లాడియస్ పాలించేవాడు. క్రూరుడు, నియంతగా పేరుతెచ్చుకున్నాడు. క్లాడియస్‌కి సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువ. అందుకే రోమన్ సైన్యం నిత్యం యుద్ధాలు చేయాల్సి వచ్చేది. ఏడాది పొడుగునా యుద్ధభూమిలో ఉండటం వల్ల సైన్యంలో పనిచేసేవారి జీవితాలు చాలా ఘోరంగా ఉండేవి. దాంతో యువకులు అటువైపు ఆసక్తి చూపడం మానేశారు. ఫలితంగా సైన్యంలో పనిచేసేవారి సంఖ్య తగ్గిపోయింది. దేశంలోని యువకులు తమ ప్రియురాళ్లనీ, కుటుంబాల్నీ విడిచి రావడానికి ఇష్టపడకపోవడమే సైనికుల కొరతకు కారణమని భావించాడు క్లాడియస్. దీంతో దేశంలో నిశ్చితార్థాలూ, పెళ్లిళ్లపైన ఆంక్షలు పెడుతూ చట్టం చేశాడు. ఫలితంగా యువకులు తమ ప్రియురాళ్లకు దూరంగా ఉంటూ విరహవేదన అనుభవించాల్సి వచ్చేది. ఈ విషయంలో రాజుని ఎదురించే ధైర్యం కూడా ఎవరికీ లేకపోయింది.ఆ సమయంలో వాలంటైన్ అనే క్రైస్తవ మతబోధకుడు ప్రేమికులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని అంగీకరించలేకపోయాడు. యువకులకు, ప్రత్యేకించి సైనికులకు రహస్యంగా పెళ్లిళ్లు చేసేవాడు. ఆ విషయం క్రమంగా బయటకు తెలిసింది. చివరకు క్లాడియస్ చెవిన పడింది. కోపోద్రిక్తుడైన క్లాడియస్ వాలంటైన్‌ను బంధించి జైల్లో పెట్టించాడు. ఆపైన ఉరి తీయమని ఆదేశించాడు.
*కారాగారంలో ఉన్నప్పుడు జైలు అధికారి కుమార్తెతో ప్రేమలో పడ్డాడు వాలంటైన్. అంధురాలైన ఆమెకు చూపు రావాలని రోజూ ప్రార్థించేవాడు. ఉరి తీయడానికి ముందురోజు తన ప్రేమను తెలుపుతూ గోడపైనే లేఖ రాస్తూ చివరిగా ‘ఫ్రమ్ యువర్ వాలంటైన్…’ అని రాశాడు. అవే అతడి చివరి మాటలు. ఆమెకు ఆ తర్వాత చూపు వచ్చి ఆ మాటల్ని చదవగలిగిందని చెబుతారు. వాలంటైన్ చనిపోయిన తర్వాత కూడా అనేక తరాల వారు ఆయన గురించి కథలుగా చెప్పుకునేవారు. తరువాత రెండు శతాబ్దాలకు కాథలిక్ చర్చి ఆయనకు ‘సెయింట్’ బిరుదిచ్చింది. ఆయన మరణించిన రోజు ఫిబ్రవరి 14ని ఒక పండగలా చేసుకోమని ప్రకటించింది. నాటి నుంచీ వాలంటైన్ ప్రేమికులకు ఆరాధ్యుడయ్యాడు. నెమ్మదిగా ఆయన కథ రోమన్ సామ్రాజ్యాన్ని దాటి ఐరోపా అంతటికీ పాకింది.
*****మదర్ ఆఫ్ వాలంటైన్
ప్రేయసీప్రియులు రాసుకునే ప్రేమలేఖల్లో వాలంటైన్‌ను ప్రస్తావించడం కాలక్రమంలో వచ్చిన మార్పు. డ్యూక్ ఆఫ్ ఆర్లీన్స్ అయిన చార్లెస్ 1415లో తన భార్యకు రాసిన ప్రేమలేఖలో చివరన ‘యువర్ వాలంటైన్’ అని రాశాడు. వాలంటైన్‌ను ప్రస్తావిస్తూ రాసిన మొట్టమొదటి ప్రేమలేఖగా అది చరిత్రలో నిలిచిపోయింది. వాలంటైన్ లాగానే చార్లెస్ కూడా జైలు నుంచే ప్రేమలేఖ రాయడం మరో విశేషం. ఇటలీ, ఫ్రాన్సు, ఇంగ్లండుల్లో దాదాపు ఒకే కాలంలో మొదలైన వాలంటైన్స్ డే సంప్రదాయం తర్వాత కాలంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకూ అక్కణ్నుంచి మిగతా దేశాలకూ వెళ్లింది. ‘వాలంటైన్స్ డే’ కి గ్రీటింగులు ఇవ్వడమనే సంప్రదాయం మాత్రం 19వ శతాబ్దంలో మొదలైంది. ఇంగ్లండ్‌కు చెందిన ఎస్తర్ హోలండ్ అనే మహిళ దీనికి ఆద్యురాలని చెబుతారు.
***వూస్టర్ నగరంలో ఆమె గ్రీటింగుల వ్యాపారం మొదలుపెట్టింది. మొదట్లో అల్లికల ద్వారా తయారుచేసిన గ్రీటింగు కార్డులు అమ్మిన ఎస్తర్ తర్వాత వాటికి గిరాకీ పెరగడంతో కాగితపు కార్డుల్నీ తీసుకొచ్చింది. ఎస్తర్‌కి ‘మదర్ ఆఫ్ వాలంటైన్’ గానూ పేరు.ఎవరు పంపారో తెలియకుండా గ్రీటింగులు పంపించి లోపల ‘ఇట్లు మీ వాలంటైన్’ అని రాసే సంప్రదాయం చాలా చోట్ల ఉంది. అలాగే వాలంటైన్స్‌డే కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం కేవలం ప్రేయసీప్రియులకే పరిమితం కాదు, తమ జీవితంలో ముఖ్యమనుకునే వారందరికీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పే సంప్రదాయం చాలా దేశాల్లో కనిపిస్తుంది. అంటే, ఆ రోజున కొత్త సంవత్సరం మాదిరిగానే తల్లిదండ్రులకీ, తోబుట్టువులకీ, స్నేహితులకీ శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. ప్రేమికుల రోజు ప్రేమను పంచేవారి రోజు.
****ప్రేమ వారం
వేలంటైన్ డే అనేది ఓ వారం రోజులపాటు చేసుకునే పండుగ. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు సాగుతుంది.
* వారంలో మొదటిది రోజ్ డే: ఈ రోజున తమకిష్టమైన వ్యక్తికి ఒక గులాబీని ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తారు. రొమాన్స్‌ కు గుర్తుగా ఎర్ర గులాబీని ఇచ్చుకుంటారు.
* ప్రపోజ్ డే : ప్రేమను వ్యక్తం చేసే రోజుది. నీపై నాకెంత ప్రేముందో అంటూ తెలిపే రోజు.
* చాక్‌లేట్ డే: సంతోషం కలిగినప్పుడు నోటిని తీపి చేయడం తెలిసిందే. ప్రేమను వ్యక్తం చేయడానికి ఇదో మార్గం. ఎలాంటి వారైనా ప్రేమలో పడాల్సిందే.
* టెడ్డీ డే: ఐ లవ్ యూ చెప్పడానికి మరో మార్గం టెడ్డీని కానుకగా ఇచ్చుకోవడం.
* ప్రామిస్‌డే: జీవితాంతం నీతోనే ఉంటాను. నీకు నేను భరోసా అంటూ చెప్పుకునేది ప్రామిస్ డే.
* హగ్ డే: మనసులోని భావాల్ని పలికించడానికి ఒక్కోసారి మాటలు కరువవుతాయి. మనసు దాటి మాట బయటకు రాదు. అలాంటప్పుడు కౌగిలింతే సరి.
* కిస్ డే : ప్రేమను వ్యక్తపరచడానికి మరో మార్గం ముద్దు. ప్రేమను వ్యక్తం చేయడానికి ఇదో మంచి మార్గం.
* వాలంటైన్స్ డే : అందరూ ఎదురుచూసే రోజు ఇదే. ప్రేమను పండించుకునే రోజు.
*****ప్రసన్నం చేసుకోండిలా…
వాలంటైన్ డే రోజున ప్రియురాలికి ఓ మంచి బహుమతి ఇవ్వాలనుకుంటాడు ప్రియుడు. కొంచెం రొమాంటిక్‌గా మారిపోతుంటాడు. మొదట్లో ప్రియుడు ప్రేయసికి ఉత్తరాలు రాసేవాడు. తర్వాత ఉత్తరంతో పాటు బహుమతిని ఇవ్వడం అలవాటయింది. మరి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చి ఆమెను ప్రసన్నం చేసుకోవాలా అని ఆలోచించేవారి కోసం…
* ప్రేమను ప్రకటించడానికి గులాబీని మించింది లేదు. అభినందనలు తెలపడానికి 25, షరతులు లేని ప్రేమకోసం 50 గులాబీల గుచ్ఛం ఉండాలంట. ఇవన్నీ లవర్స్ నాట్‌లో కట్టాలి.
* హృదయ ఆకారంలో ఉండే కార్డులు, గిఫ్ట్ ఐటమ్స్‌కి భలే డిమాండ్ ఉంది. టెడ్డీ బేర్, పౌచ్, ఇయర్ రింగ్స్, రింగ్స్, జ్యుయలరీ బాక్స్, సిరామిక్ మగ్, కుషన్‌కవర్, పిల్లో కవర్, షోపీసులు ఇచ్చి మనసు దోచుకోవచ్చు.
*పావురాల జంట రూపంలో ఉన్న గిఫ్ట్‌లు కూడా మంచి ఆప్షన్. పావురాలు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటాయంటే జంటలో ఒకటి చనిపోతే మరొకదాన్ని వెతుక్కోవు. వాటి ప్రేమలో సమర్పణ ఉంటుంది.
* కెనడా దేశ వృక్షం మేపల్ ట్రీ. జపాన్, చైనాల్లో ఇప్పటికీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ ఆకును ఉపయోగిస్తుంటారట. అమెరికాలో చాలా మంది ప్రేమికులు బెడ్ కింద మేపల్ ఆకులను పెట్టుకుంటారట. అలా అయితే వాళ్ల కోరికలు తీరుతాయని నమ్మకమట. మేపల్ ఆకులున్న కార్డులు, వాటిపై రొమాంటిక్ కవితలు ఉన్నవి ఇస్తే ఆమె ఓకే అనడం ఖాయం. అలాగే తులిప్ పువ్వులు కూడా ప్రేమకు ప్రతీకలు.
* ప్రేమను ప్రదర్శించడానికి డైమండ్‌ని మించింది మరోటి ఏముంది. ప్రేమ శిలా శాసనంలా స్థిరంగా ఉంటుంది. దాన్ని ప్రదర్శించేందుకు వజ్రం అద్భుత బహుమతి.
****వింత విషయాలు..
ప్రేమికుల దినోత్సవం అంటే యువకులకు సంబరమే. ఈ సందర్భంగా ప్రేమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..
* లవ్ అనే పదం సంస్కృతంలో కోరిక అనే అర్థాన్నిచ్చే లుబ్యాతి అనే పదం నుంచి పుట్టింది.
*నేను నీకు ఎందుకు అంతగా నచ్చాను ..ఇది ప్రపంచంలో ప్రతి ప్రేమికుడు లేక ప్రేయసి ఒక్కసారైనా తప్పకుండా అడిగే ప్రశ్న.
* ప్రతి మనిషి పెళ్లయ్యేలోపు ఏడు సార్లు ప్రేమలో పడతాడట.
* ఫిలిప్పీన్స్‌లో పువ్వుల ధరను పెంచడం కోసం ప్రేమికుల రోజును ఆచరించేవారట. అదిప్పుడు సంప్రదాయంగా మారింది.
* నాలుగేళ్ల వయసు నుంచి కలిసి ఆడుకున్న అమ్మాయిలు అబ్బాయిలు ఒకరితో ఒకరు ప్రేమలో పడే అవకాశాలు దాదాపు శూన్యం.
*ప్రేమలో పడటం వల్ల మెదడులో విడుదలయ్యే రసాయనాలు జ్ఞాపక శక్తిని ఐదు శాతం పెంచుతాయట.
* ప్రతి ఐదు ప్రేమ జంటల్లో రెండు జంటలు తమ మొదటి లవ్‌నే పెళ్లి చేసుకుంటారట.
* ప్రేమికుల రోజుకు దేశాలను బట్టి పేర్లు మారుతున్నాయి. ఫిన్లాండ్‌లో ఫ్రెండ్స్ డే, స్వీడన్‌లో ఆల్‌హార్ట్ డే, టర్కీలో స్వీట్ హార్ట్ డే ఇలా పిలుచుకుంటారు.
* ముద్దు పెట్టేటప్పుడు ఎక్కువమంది కుడివైపునకే తలను వంచుతారట.
* క్రీ.పూ 3500 సంవత్సరాల కిందట సుమేరియన్ల కాలంలో మట్టిపలక మీద రాసిన ప్రేమ కవిత ఇప్పటి వరకూ లభించిన వాటిలో అతి పురాతనమైనది.
* ఒక్క ఈ రోజే ప్రపంచం మొత్తంలో 20 కోట్ల గ్రీటింగుల వరకు ఇచ్చిపుచ్చు కుంటా రు. నూతన సంవత్సర వేడుక తర్వాత ఇలా శుభాకాంక్షలు తెలుపుకునే పండుగ ఇదే.
***మనసును గెలవండి
అబ్బాయిలు అమ్మాయిల మనసును గెలవడం చాలా ముఖ్యం. కొన్ని విషయాలను పాటిస్తే అది సాధ్యమే.
* ఆమెను గౌరవించడం చాలా ముఖ్యం. ఆమె అభిప్రాయాలను, ఆలోచనలకు విలువివ్వాలి. అభినందించాలి.
* నలుగురిలో చిన్నచూపు చూడకూడదు.
* అలాగే ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటే గొడవలు రావని చెబుతున్నారు నిపుణులు.
* సందర్భం ఏమీ లేకున్నా సృష్టించుకుని ఐలవ్‌యూ చెబుతుండండి.
* మీరు ఆమెను బాధ పెట్టిన సంఘటనను గుర్తుచేసి మరోసారి క్షమాపణలు కోరండి.
* పొదుపు గురించి మాట్లాడుతుండండి. డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. అలాగని పిసినారిని అస్సలు ఇష్టపడరు.
* భక్తురాలైతే ఆమెకు తెలియకుండా ఎప్పుడైనా ఆమె పేరిట పూజలు చేయించి ప్రసాదం ఇవ్వండి.
* ఆమె ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించండి. ఏ నలతగానో ఉన్నట్లు గమనిస్తే ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఓ చిన్న మెసేజ్ పెట్టండి.
* ఆమె చీర కలర్ గుర్తుపెట్టుకుని, దానికి మ్యాచింగ్‌గా ఓ వంద రూపాయలు పెట్టి గాజులు కొని పట్టుకెళ్లండి.
*ఆమెకు సంబంధించిన ముఖ్యమైన సందర్భాలన్నీ తేదీ వారాలతో సహా గుర్తుపెట్టుకుని విష్ చేయండి.
* ఎక్కడికెళ్లావు, ఎవరితో మాట్లాడావు అని తరచుగా అడగొద్దు. నమ్ముతున్నాను కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పండి.

పవనా…అవినీతిపరుడు నీకు సలహాదారుడా?

జనసేన అద్యక్షుడు తాను అవినీతిని నిర్మూలించడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని మహాత్మాగాంధీకి తనే నిజమైన వారసుడు అని ప్రతి సభలో పవన్ ప్రగార్భాలు పలుకుతూ ఉంటారు. కానీ పవనన్న తీసుకునే నిర్ణయానికి, ఆయన చెప్పే మాటలకూ ఏమాత్రం పొంతన ఉండటం లేదు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన తెలుగువారరైన రామ్మోహనరావు పై ఇప్పుడు అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో రామమోహనరావుతో పాటు ఆయన సన్నిహితుడు అప్పటి టీటీడీ బోర్డు మెంబరు శేఖర్ రెడ్డి పైనా ఆరోపణలు గుప్పించారు. శేఖర్ రెడ్డి అనే వ్యక్తీ లోకేష్ కు సన్నిహితుడని ఆయన పెద్ద అవినీతి పరుడని రామమోహనరావు కు ఆయనకు సన్నిహిత సంబందాలు ఉన్నాయని అప్పట్లో పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వందకోట్ల అవినీతికి పాల్పడ్డ శేఖర్ రెడ్డి రామ్మోహనరావులతో లోకేష్ కు సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. *ఇదంతా గతం… తాజాగా తానూ ఎవరిపైనైతే అవినీతి ఆరోపణలు చేశాడో .. ఆ వ్యక్తినే పార్టీలో చేర్చుకుని సలహాదారుడిగా పోస్టు ఇచ్చి పవన్ సంచలనం సృష్టిస్తున్నారు. గతంలో తానూ అవినీతిపరుడని ఆయనను నిందించాననే సంగతిని ఆయన మరచిపోయారా? లేకపోతె అప్పట్లో తాను గాలి మాటలు చెప్పానని భావించారా.. తెలియదు కానీ.. తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావును పార్టీలో చేర్చుకోవడం, దాని పై వివిధ పార్టీలకు చెందిన వారు.. ప్రస్నిస్తుండటంతో ..వాటికి సమాధానం చెప్పడం జనసేన నాయకులకు కష్టంగా మారింది. గతంలో తాము అవినీతిపరుడని ముద్ర వేసిన వారినే మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం , దాన్ని సమర్దించుకోవడం పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తోంది. దీని పై పవన్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూద్దాం.

ఎన్నారై మొగుళ్ళారా….మీ వివాహం నమోదు చేసుకోకపోతే…

ఎన్‌ఆర్‌ఐ వివాహాల్లో చోటుచేసుకుంటోన్న మోసాలకు చెక్‌ పెట్టేలా రాజ్యసభలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ వివాహాల్లో జరుగుతోన్న మోసాలపై ఫిర్యాదులు పెరుగుతోన్న నేపథ్యంలో 30 రోజుల్లోగా ఎన్‌ఆర్‌ఐ పురుషులు వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకొనేలా ఈ బిల్లును తీసుకువచ్చారు. ఆ బిల్లు ప్రకారం..30 రోజుల గడువులోగా వివాహాన్ని రిజిస్టర్‌ చేయించకపోతే వారి పాస్‌పోర్టును సీజ్ ,రద్దు చేస్తారు. వారికి సంబంధించిన స్థిర, చర ఆస్తులను కోర్టులు స్వాధీనం చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది. అలాగే వారిని నేరస్థుడిగా పరిగణిస్తారు. ‘రిజిస్ట్రేషన్‌ ఆఫ్ మ్యారేజ్‌ ఆఫ్ నాన్‌ రెసిడెంట్ ఇండియన్‌ బిల్‌, 2019’ కింద ప్రయాణ పత్రాలు, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవచ్చు. భారత్‌, విదేశాల్లో వివాహం చేసుకొన్న ఎన్‌ఆర్‌ఐ పురుషులకు ఈ కొత్త బిల్లులోని నిబంధనలు వర్తిస్తాయి. బుధవారంతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ ప్రభుత్వానికి చివరి పార్లమెంటు సమావేశం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ బిల్లు పాసయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. రాజ్యసభలో పెండింగ్‌లోఉన్న ఈ బిల్లు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత చర్చలోకి వచ్చే అవకాశముంది.

గ్రీన్ కార్డు బిల్లు ఆమోదం పొందేనా?

అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త. గ్రీన్‌కార్డుల జారీలో దేశాలకు కేటాయించే కోటాను ఎత్తివేసే దిశగా ముందడుగు పడింది. దేశాల కోటాను ఎత్తివేయాలని ప్రతిపాదిస్తూ తీసుకొచ్చిన బిల్లు తాజాగా అమెరికా కాంగ్రెస్‌ ముందుకొచ్చింది.ఉద్యోగం ఆధారంగా జారీ చేసే గ్రీన్‌కార్డుల్లో దేశాల కోటాను ఎత్తివేయాలని ప్రతిపాదిస్తూ ఫేర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ బిల్లును సెనేట్‌లో రిపబ్లిక్‌ సభ్యుడు మైక్‌ లీ, డెమోక్రటిక్‌ సభ్యురాలు కమలా హారిస్‌ ప్రవేశపెట్టారు. ఇక ప్రతినిధుల సభలోనూ సభ్యులు ఈ బిల్లును తీసుకొచ్చారు. అమెరికా కాంగ్రెస్‌లో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అధ్యక్షుడి సంతకంతో ఇది చట్టరూపం దాల్చుతుంది.ఈ చట్టం అమల్లోకి వస్తే ఎక్కువగా ప్రయోజనం పొందేది భారతీయులే. హెచ్‌-1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చాలా మంది భారతీయులు దేశాల కోటా కారణంగా గ్రీన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ కోటాను తీసేసి ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు జారీ చేస్తే భారతీయులు ఎక్కువగా లబ్ధి పొందుతారు.ప్రస్తుతం అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు జారీ చేస్తోంది. వీటిలో 7 శాతానికి మించి ఒక దేశానికి కేటాయించదు. ఈ పరిమితి కారణంగా మిగతా దేశాలకు చెందిన వారితో పాటు భారత్‌, చైనాకు చెందిన వ్యక్తులు గ్రీన్‌కార్డుల కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రెండు దేశాల నుంచి గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య ఏటా లక్షల్లో ఉంటుంది. తాజా బిల్లు అమల్లోకి వస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక తెలంగాణ అడవుల్లో వేటగాళ్ల ఆటలు సాగవు!

అటవీ నేరాల నియంత్రణకు, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర అటవీశాఖ ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించబోతున్నది. అభయారణ్యా లు, అరణ్యాల్లో వేటగాళ్లు రకరకాల ఉచ్చులు, ఉరులు బిగించి వన్యప్రాణులను హతమారుస్తుండటం, పెద్దపులుల చర్మాలను ఒలుస్తున్న క్రమంలో సాంకేతికతో వారి ఆటకట్టించాలని నిర్ణయించింది.అడవుల లోపల ఉన్న దాదాపు వేయి కెమెరాట్రాప్‌లను రెట్టింపుచేయడంతోపాటు అటవీ ప్రాంతాలకు వెళ్లే ప్రధానమార్గాల్లో, అన్ని చెక్‌పోస్టుల్లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను అమర్చాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యం పరిధిలో వరుసగా పెద్దపులులు, చిరుత పులులు వేటగాళ్ల ఉచ్చులకు బలైన నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు వాడుతున్న హ్యాండ్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను కొనుగోలు చేసి మొదట కవ్వాల్, అచ్చంపేట-అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యాల్లో వాడాలని అధికారులు నిర్ణయించారు. వేటగాళ్లు పొదలమాటున, చెట్ల గుబురుచాటున అమర్చే ఉచ్చులు భూమిపై తేలి ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం అటవీ సిబ్బందికి కష్టంగా ఉంటుంది. మెటల్ డిటెక్టర్లను ఉపయోగించడం ద్వారా ఉచ్చులను రెండుమీటర్ల దూరంనుంచే బీప్‌సౌండ్ ద్వారా గుర్తించవచ్చని అధికారులు చెప్తున్నారు. యా నిమల్ ట్రాకర్లు, బేస్‌క్యాంప్ వాకర్లకు వీటిని ఇచ్చి సున్నిత ప్రాంతాల్లో వినియోగిస్తారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో శిక్షణ పొందిన రెండు జర్మన్ షెపర్డ్ డాగ్‌స్కాడ్లు నెలరోజుల క్రితం రాష్ర్టానికి వచ్చాయి. వాటిని కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాల్లో స్మగ్లర్ల కదలికలను పసిగట్టడానికి, నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే డాగ్‌స్కాడ్లు కొందరు నేరస్తులను పట్టించాయి. మరోరెండు డాగ్‌స్కాడ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ (ఐటీ, విజిలెన్స్) రఘువీర్ తెలిపారు. త్వరలో అవికూడా రంగంలోకి దిగనున్నాయన్నారు. అడవుల్లో వన్యప్రాణులను బలిగొనడానికి వేటగాళ్లు ఎక్కువగా కరంట్ వైర్లను అమరుస్తున్నారు. కరంట్‌వైర్లు వేటగాళ్లు వాడకుండా ప్రత్యామ్నాయ చర్యలపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు విద్యుత్‌శాఖ అధికారులతో చర్చలు జరిపారు. అటవీ ప్రాంతాల్లో ఇన్సులేటెడ్ వైరింగ్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. విద్యుత్, అటవీశాఖ సమన్వయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ట్రంప్ అబద్ధాల సంఖ్య 8వేలకు పైగానే

అబద్ధం చెబితే బాగా అతికినట్టు, ఓ గోడ కట్టినట్టు ఉండాలంటారు. ట్రంప్‌కి ఈ సామెత పెద్దగా తెలిసినట్టు లేదు. అందుకే తరచూ అబద్ధాలు చెబుతూ, దొరికిపోతుంటారు. చిత్రంగా తను చెప్పే ఆ అసత్యాలు త్వరగా బయటపడిపోతూ ఉంటాయి. చాలామందికి తెలియదు కానీ, ట్రంప్‌ తన మొత్తం పాలనలో 8,158 సార్లు అబద్ధాలు చెప్పారట. ఈ విషయాన్ని అక్కడి పత్రికలే చెబుతున్నాయి. తాజాగా స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగంలోనూ ఆయన కొన్ని అబద్ధాలు అలవోకగా చెప్పేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన పదవీకాలంలో 8,158 అబద్ధాలు చెప్పారని కొద్ది రోజుల క్రితం అమెరికా పత్రికలు గగ్గోలు పెట్టాయి. తాజాగా ట్రంప్‌ స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగం విన్న వారికి మళ్లీ అసత్యాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ కావాలని చెబుతున్నారో, సరైన సమాచారం లేక తప్పులు చెబుతున్నారో అర్థం కాదు. ఒక్కటి మాత్రం నిజం.. ఆయన వాస్తవానికి దూరంగా ఉండే విషయాలను చెబుతుంటారు. నేటి ప్రసంగాన్నీ అక్కడి కొన్ని పత్రికలు విశ్లేషించాయి. వాటిల్లో తప్పులను, తప్పుదోవ పట్టించే అంశాలను వెతికి పట్టాయి. ఏడాదికోసారి కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసే స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగాన్ని కూడా తప్పులకు వేదిక చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఆ అబద్ధాల్లో కొన్ని.. అలాగే నిజం ఏంటంటే..!

ట్రంప్‌: మధ్య ప్రాచ్యంలో అమెరికా దళాలు 19ఏళ్లుగా పోరాడుతున్నాయి..
వాస్తవం: అమెరికా దళాలు మధ్య ప్రాచ్యంలో 2003లో అడుగుపెట్టాయి. అంటే 16ఏళ్ల క్రితం. ఆయన ఆఫ్గనిస్థాన్‌ యుద్ధాన్ని కూడా మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పోరాటంలో కలిపేశారు.

ట్రంప్‌: నేను బాధ్యతలు చేపట్టే సమయానికి ఎల్‌పసో నగరం అత్యంత ప్రమాదకరంగా ఉంది. సరిహద్దుల్లో కట్టడి చేశాక.. సురక్షిత నగరంగా మారింది.
వాస్తవం: ఎల్‌ పసో ఎప్పుడూ అత్యంత ప్రమాదకర పట్టణంగా పేరు తెచ్చుకోలేదు. దేశంలో నేరాలు తగ్గడానికి సరిహద్దుల్లో కంచెలకు సంబంధం లేదు. సరిహద్దుల్లో కంచె వేయడానికి ముందే 2008లో ఎల్‌పసో దేశంలోనే రెండో అత్యంత సురక్షిత నగరంగా పేరు తెచ్చుకొంది..!

ట్రంప్‌: ‘అక్రమంగా సరిహద్దులు దాటడం’… ఓ అత్యవసర సమస్య.
వాస్తవం: అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి వచ్చే వారి సంఖ్య గత కొన్నేళ్లలో గణనీయంగా తగ్గింది. అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లో ప్రతినెలా 50వేల మందిని భధ్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొన్నారు. రెండు వేల సంవత్సరంలో ఈ సంఖ్య లక్ష వరకు ఉండేది.

ట్రంప్‌: ఉత్పాదక రంగంలో 6,00,000 ఉద్యోగాలను సృష్టించాం. దాదాపు అందరికీ అవకాశాలు ఇచ్చాం.
వాస్తవం: 2017 జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల ఉద్యోగాలనే ఉత్పాదక రంగంలో సృష్టించారు. ఒబామా హయాంలోనూ ఇలాగే జరిగింది. పైగా 1990లో ఉద్యోగ సృష్టి కంటే ఇది చాలా తక్కువ.

ట్రంప్‌: మేం మొత్తం 53లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాం.
వాస్తవం: ది బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ లెక్కల ప్రకారం 2017 జనవరి నుంచి 49 లక్షల ఉద్యోగాలనే కొత్తగా సృష్టించారు.

ఇలా ట్రంప్‌ చాలా చెప్పుకొచ్చారు. వాటిల్లో చాలా తప్పుదోవ పట్టించే అంశాలు కూడా ఉన్నాయి. వీటిని అమెరికా మీడియా విశ్లేషించింది. ట్రంప్‌ అధికారం చేపట్టిన రెండేళ్లలో దాదాపు 8,158 అబద్ధాలు చెప్పారని కొన్నాళ్ల కిందట వాషింగ్టన్‌ పోస్టు పత్రిక లెక్కలతో సహా వెల్లడించింది. తొలి ఏడాది అబద్ధాలు చెప్పేందుకు కొంచెం సంకోచించినట్లున్నారు. ఆ ఏడాది రోజుకు సగటున 6 అసత్యాలు చెప్పారు. రెండో ఏడాదికి రాటుదేలిపోయారు. రోజుకు 17 అలవోకగా చెప్పేస్తున్నారు. ‘ది ఫాక్ట్‌ చెకర్‌ డేటాబేస్‌’ నుంచి ఈ వివరాలను సేకరించింది. వీటిల్లో ఆరువేల అబద్ధాలైతే ఏకంగా ఆశ్చర్యపర్చే రీతిలో ఉన్నాయట. గత అక్టోబర్‌లో మిడ్‌టర్మ్‌ ఎన్నికలప్పుడు ట్రంప్‌ జూలు విదిల్చి ఏకంగా 1,200 సార్లు అబద్ధాలు వల్లెవేశారు. ట్రంప్‌ తన పాలనలో అత్యధిక అబద్ధాలు వలసలపైనే చెప్పారట. దాదాపు మొత్తం 1,433 సార్లు ఆయన వలసలపై ప్రజలను తప్పుదోవ పట్టించినట్లు తేలింది. విదేశీ విధానాలపై 900, వాణిజ్యంపై 854, ఆర్థిక వ్యవస్థపై 790, ఉద్యోగాలపై 755, మీడియా ఇతర అంశాలపై 899 అబద్ధాలు చెప్పారట.

మాఘమాసం ఆగమనంతో పెళ్లిళ్ల సందడి

“మాఘ మాసం ఎప్పుడొస్తుందో… మౌనరాగాలెన్నినాళ్లో…” అని రోజులు లెక్కించుకోవాల్సిన అవసరం ఇక లేదు. వివాహమైనా, నూతన గృహ ప్రవేశమైనా, కొత్త వ్యాపారమైనా, ఇంటి నిర్మాణానికి శంకుస్థాపనైనా… ఎన్నో మంచి శుభ ముహూర్తాలను మోసుకుంటూ మాఘ మాసం నేటి నుంచి ప్రారంభమైంది. ేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వివాహాల సందడి ప్రారంభం కానుండగా, లక్షలాది జంటలు మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నాయి. ఇదే నెలలో 12వ తేదీన రథసప్తమి, 16వ తేదీన భీష్మ ఏకాదశి, ఆపై మార్చి 4న మహా శివరాత్రి పర్వదినాలు కూడా ఉన్నాయి.మార్గశిర బహుళ నవమి… అంటే డిసెంబర్ 30తో ముహూర్తాలు ముగిసిపోగా, ఆపై 35 రోజుల తరువాత శుభముహూర్తాల సీజన్ తిరిగి మొదలైంది. ఈ నెలలో 8, 9, 10, 11 అత్యంత శుభ దినాలని, ఆపై కూడా నెలాఖరు వరకూ మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలు, పట్టణాల్లోని ఫంక్షన్ హాల్స్ మాఘ మాసం కోసం బుక్ అయిపోయినట్టు తెలుస్తోంది. వివాహాల నేపథ్యంలో పురోహితులతో పాటు క్యాటరింగ్ చేసే సంస్థలకు, బాజా భజంత్రీలకు, ఈవెంట్ మేనేజర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

జరిమానాలు వంద కోట్లు. కట్టించుకుంది పాతిక కోట్లు.

ట్రాఫిక్‌ నిబంధనలకు ఇష్టారీతిన తిలోదకాలిస్తూ వాహనదారులు జరిమానాలకు గురవుతున్నారు.. వాటిని చెల్లించే విషయంలో వెనకడుగు వేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. పది కంటే ఎక్కువ కేసులు నమోదైన వాహనాల్ని తాజాగా పోలీసులు నడిరోడ్డుపైనే స్వాధీనం చేసుకొంటుండటంతో బకాయిలు మొత్తం చెల్లించక తప్పడం లేదు. ఈ పరిణామాల్ని గమనిస్తే ఉల్లంఘనలకు పాల్పడేకంటే వాహనాల్ని జాగ్రత్తగా నడపడమే ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల్ని పాటించని వాహన చోదకులపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిలో మార్పు తీసుకువచ్చే ఉద్దేశంతో జరిమానాలనూ భారీగానే వడ్డిస్తున్నారు. కానీ చెల్లించడంలో ఉల్లంఘనులు విఫలమవుతున్నారు. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించారు. ఎక్కువ చలానాలు నమోదై.. చెల్లించకుండా ఉన్న వాహనాలను గుర్తించి సీజ్‌ చేసే కార్యాచరణకు ఐటీ కారిడార్‌లో నాలుగు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. ఒక వాహనంపై పది కంటే ఎక్కువ కేసులుంటే అక్కడికక్కడే ఆపేస్తున్నారు. ఎవరైనా వాహనదారు నిబంధనలను అతిక్రమించినట్లు సీసీ కెమెరాల్లో నమోదైనా.. పోలీసులు కెమెరాతో ఉల్లంఘనను చిత్రీకరించినా సంబంధిత వాహనం ఖాతాలో సహజంగానే కేసు నమోదు చేస్తుంటారు. ఈ కేసుల వివరాలు పోలీసుల వద్ద ఉండే ట్యాబ్‌ల్లోనూ వీక్షించే అవకాశం ఉండటంతో.. ప్రధాన మార్గాలపై వాహనాలను ఆపి చలానాల గురించి ఆరా తీస్తున్నారు. పది కంటే అధికంగా కేసులుంటే వాహనాన్ని నిలిపివేసి.. జరిమానాల మొత్తం చెల్లించిన తర్వాతే వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో పెండింగ్‌ చలానాలున్న పలు వాహనాలు చిక్కుతుండటం గమనార్హం. ఈ డ్రైవ్‌ను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని స్పష్టం చేస్తుండటంతో ఉల్లంఘనులకు చుక్కలు కనిపించడం ఖాయమే.

ఏడాది చెల్లింపుదారులు వసూలైన మొత్తం
2016 8,53,059 రూ.30,75,85,870
2017 8,67,552 రూ.41,99,28,465
2018 6,29,270 రూ.25,83,69,085

కొండలా అపరిష్కృత కేసులు
నిబంధనలు ఉల్లఘించి.. జరిమానాల చెల్లింపులకు ముందుకు రాకపోవడంతో సహజంగానే అపరిష్కృత కేసులతోపాటు చెల్లించాల్సిన జరిమానాల మొత్తం కొండలా పేరుకుపోతోంది. 2016లో అపరిష్కృత కేసులు 4.6 లక్షలుంటే.. 2018లో వీటి సంఖ్య 19.91లక్షలు. అప్పట్లో చెల్లించాల్సిన జరిమానాల మొత్తం కేవలం రూ14 కోట్లుంటే.. 2018లో ఆ మొత్తం రూ.77 కోట్లపైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించారు.

ఏడాది అపరిష్కృత కేసులు అపరిష్కృత జరిమానాలు
2016 4,61,838 రూ.14,84,19,780
2017 11,72,543 రూ.58,56,08,140
2018 19,91,411 రూ.77,29,83,620

తెలుసుకోండి.. చెల్లించండి..
సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌ నేపథ్యంలో ఎవరికి వారు తమ వాహనాలపై ఉన్న చలానాల గురించి తెలుసుకొని చెల్లించడం ద్వారానే ఉపశమనం పొందే వీలుంది. వాటిని ‌www.htp.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. వెబ్‌సైట్‌లో ‘ఈ-చలానా స్టేటస్‌’ ఆప్షన్‌కు వెళ్లి ఏ వాహనంపై ఎన్ని చలానాలు అపరిష్కృతంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అనంతరం అదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో జరిమానాల మొత్తాన్ని చెల్లించొచ్చు. లేదా మీ సేవ కేంద్రాల్లోగానీ.. నాంపల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌లలో గల ట్రాఫిక్‌ చెల్లింపు కేంద్రాల్లోనూ కట్టొచ్చు.

చెల్లింపులు 25 శాతం లోపే..
జరిమానాల చెల్లింపుల్లో ఉదాసీనత వాహనదారుల్లో ఏటికేడాది పెరుగుతోంది. 2016లో 8.53 లక్షల మంది రూ.30 కోట్లు చెల్లించారు. అంటే ఆ ఏడాది దాదాపు 60 శాతం మంది చెల్లించినట్లే. 65 శాతానికిపైగా జరిమానాల సొమ్ము వసూలైంది. 2018 విషయానికొస్తే 6.29 లక్షల మంది రూ.25 కోట్లు మాత్రమే చెల్లించారు. దీన్నిబట్టి 25 శాతం లోపు మంది మాత్రమే చెల్లించినట్లైంది. చెల్లింపులూ 25శాతం లోపే ఉండటం గమనార్హం.