నేడు ఇడ్లీ దినోత్సవం

రోజూ ఉదయమే లొట్టలేసుకుంటూ తినే ఇడ్లీలకూ ఓ రోజు ఉంది. ఇడ్లీలనగానే మనకు గుర్తొచ్చేది తమిళనాడు. ఇడ్లీ సాంబార్ తమిళనాడులో ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఎక్కువగా ఇడ్లీలు తినే తమిళులకు కూడా ఇడ్లీ డే ఒకటుందని తెలియకపోవచ్చు. పొద్దున్నే ఇడ్లీలు తిననిదే పొద్దుపోని వాళ్లకు కూడా ఇడ్లీ డే ఒకటుంటుందని తెలియకపోవచ్చు. మార్చి 30నే ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుకుంటారు. గత మూడు సంవత్సరాల నుంచి మార్చి 30ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా జరుపుతున్నారు. ఇడ్లీ దినోత్సవానికి రూపకర్త ఎమ్ ఎనియావన్. మల్లిపూ ఇడ్లీ రెస్టారెండ్ ఫౌండర్. త‌మిళ‌నాడులో ఈ రెస్టారెంట్ ఫుల్లు ఫేమ‌స్‌. ఇడ్లీలు తినాలంటే అక్క‌డే తినాలి అంటారు.. అంత టేస్టీగా ఉంటాయ‌ట అక్క‌డి ఇడ్లీలు. ఈయనే మార్చి 30ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా ప్రారంభించాడ‌ట. మనకు ఫాథర్స్ డే, మధర్స్ డేలా అన్ని డేలు ఉన్నాయి. రోజూ పొద్దున్నే తినే ఇడ్లీలకు ఒక రోజు ఎందుకు ఉండకూడదు అని ఆలోచించాడు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకు అందరూ ఇష్టపడే ఇడ్లీలకు ఒక రోజు ఉండాల్సిందే.. అని మార్చి 30 ని ప్రపంచ ఇడ్లీ దినోత్సవంగా నామకరణం చేశాడ‌ట.

బ్రా కింద కేజీన్నర బంగారంతో

ఓ మహిళ బ్రా మాటున బంగారం బిస్కెట్లు పెట్టుకొని విమానంలో రావడంతో చెన్నై విమానాశ్రయ అధికారులు థాయ్ మహిళను అరెస్టు చేశారు. థాయ్‌లాండ్‌కు చెందిన క్రైసోర్న్ థాంప్రకోప్ (38) అనే మహిళ 47 లక్షల రూపాయల విలువైన 1.4 కిలోల బంగారం బిస్కెట్లను బ్రాల కింద పెట్టుకొని టీజీ 337 విమానంలో చెన్నై విమానాశ్రయంలో దిగింది. విమానాశ్రయ అధికారులు ఆమెను అరెస్టు చేసి బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పద్మావతి అనే మరో ప్రయాణికురాలు రూ.12 లక్షల విలువచేసే 365 గ్రాముల బంగారాన్ని కువైట్ నుంచి డ్రాయరు లోపల దాచుకొని తరలిస్తుండగా విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు

ఇక తీహార్ జైలులో సౌందర్య మెరుపులు

తిహార్‌ జైలులో కొత్తగా బ్యూటీపార్లర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దిల్లీలోని బ్యూటీపార్లర్లలో ఉండే సౌకర్యాలన్నింటినీ కల్పిస్తూ.. మహిళా కారాగారం ఆరో నంబరు గదిలో ఆకర్షణీయంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. బయట మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఇక్కడ చౌకగా సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు తిహార్‌ జైలులో కేవలం హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌ ఉండేది. అలంకరణకు సంబంధించిన సౌకర్యాలు లేవు. కొత్తగా ఏర్పాటు చేసే బ్యూటీపార్లర్‌లో ఒకేసారి ముగ్గురు నుంచి నలుగురు మహిళా ఖైదీలకు సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హత్యలు, దారి దోపిడీ, దొంగతనం, మాదకద్రవ్యాల రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారితో పాటు ఇతర ఖైదీలు కూడా పార్లర్‌ ఏర్పాటుకు విజ్ఞప్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

అమెరికాలో…పెనమలూరు అమ్మాయిని మోసం చేసిన గోదావరి అబ్బాయి

మాక్కాబోయే అల్లుడు అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీరు.. లక్షల్లో జీతం.. బోల్డంత ఆస్తి కూడా ఉందండి.. పైగా పైసా కట్నం అక్కర లేదంటున్నారు.. నిజంగా మా అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో కదండి.. అంటూ పక్కింటి కామాక్షమ్మ గారికి అడక్కుండానే అన్నీ చెప్పేస్తుంది ఓ మధ్యతరగతి ఇల్లాలు. కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలవనీయట్లేదు ప్రస్తుత సంబంధాలు. అడిగినంత కట్నం ఇవ్వలేదనో.. కట్టుకున్న భార్య పట్ల మోజు తీరిపోయిందనో అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్నారు భర్తతో పాటు అత్తమామలు.కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన సంధ్యారాణికి, అమెరికాలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భీమవరానికి చెందిన ధన్‌రాజ్‌తో 2017లో వివాహం జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు కట్నం కింద రూ.22 లక్షల నగదు, ప్లాటు, 30 తులాల బంగారం సమర్పించుకున్నారు అల్లుడుగారికి. పెళ్లయిన కొద్దిరోజులకే భార్యను ఇక్కడే ఉంచి అమెరికా వెళ్లిపోయాడు భర్త.వీసా పనులు పూర్తవ్వగానే వచ్చి తీసుకువెళతానని చెప్పాడు. అత్తారింట్లోనే ఉంటూ భర్త పిలుపుకై ఎదురుచూస్తోంది సంధ్యారాణి.అత్తగారి చేతిలో పోసిన రూ.22 లక్షల క్యాష్ సరిపోయినట్లు లేదు.. మీ నాన్న నీకిచ్చిన స్థలాన్ని అమ్మి డబ్బు తీసుకురమ్మంటూ అత్తామామ వేధించడం మొదలు పెట్టారు కోడలిని. వారి వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన దగ్గరనుంచి సంధ్యకు భర్తనుంచి ఫోన్ రాలేదు. వీసా గురించిన విషయాలేమీ తెలియట్లేదు.దీంతో అనుమానం వచ్చిన సంధ్య అమెరికాలో ఉంటున్న తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి భర్త గురించి ఎంక్వైరీ చేయమంది. ధనరాజ్ అమెరికాలో కృష్ణావతారం ఎత్తినట్లు తెలుసుకుంది. తన భర్త అక్కడ ఇద్దరు మహిళలతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది సంధ్యకి. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి భర్త, అత్తమామలపై పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

ఎయిరిండియా పైలట్లకు ఇకపై నో స్పెషల్ మీల్స్

అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఖర్చులు తగ్గించుకొనే పనిలో పడింది ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా. దానిలో భాగంగా విధుల్లో ఉన్న సమయంలో పైలట్లు ప్రత్యేక భోజనాన్ని తెప్పించుకోవద్దని పైలట్లకు సూచించింది. ఈ విషయంలో కంపెనీ నిబంధనలనే పాటించాలని వెల్లడించినట్లు అంతర్గత వ్యవహారాల అధికారి మీడియాకు తెలిపారు. ‘నిబంధనలకు విరుద్ధంగా విమాన సిబ్బంది ప్రత్యేక భోజనాన్ని తెప్పించుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది’ అని ఎయిరిండియా డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ అమితాబ్ సింగ్ బుధవారం ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్న వారు మాత్రం వైద్యులు సూచించిన ప్రత్యేక ఆహారాన్ని తెప్పించుకోవచ్చని ఆయన వాటిలో పేర్కొన్నారు. పైలట్లు బర్గర్లు, పిజ్జా వంటి ఆహారాన్ని తెప్పించుకుంటున్నారని గుర్తించామని, దాని వల్ల సంస్థ మీద మరింత భారం పడుతుండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు.

12ఏళ్లకు పెళ్లి. నెలకి ₹60 జీతం. ఇప్పుడు పద్మశ్రీ.

అందరి జీవితం పూల బాట కాదు..ఎన్నో కష్టాలు మరెన్నో కన్నీళ్లు అన్నింటినీ తట్టుకుని పరిస్థితులకు ఎదురొడ్డి తనేంటో నిరూపించి చూపలనుకుంది ప్రపంచానికి. ఇప్పుడు తనే రోల్ మోడలైంది. తనలాంటి మరి కొందరికి. మహారాష్ట్రలోని అలోకా జిల్లాలోని ఓ చిన్ని గ్రామంలో కల్పనా సరోజ్ జన్మించింది. కుటుంబానికి భారం తగ్గాలని కూతురిని పన్నెండేళ్ళకే పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. తల్లిదండ్రులు నరకం ఎలా ఉంటుందో. అత్తారింట్లో అడుగుపెట్టిన ఆరు నెలలకే అర్ధమైంది కల్పనకి. కూతురి పరిస్థితి చూసి చలించి పోయిన తండ్రి ..పద తల్లీ ఇంటికి పోదాం… కలో గంజో కలిసే తాగుదాం అని తీసుకెళ్ళాడు కూతురిని. చదువుకుందామని స్కూలుకు వెళితే ఊర్లో అందరూ హేళనగా చూసేవారు. సూటీ పోటీ మాటలనేవారు. వాటన్నింటినీ భరించలేక చచ్చిపోదామని ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఊర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సకాలంలో వైద్యం అందడంతో కల్పన బ్రతికింది. మరణం అంచుల వరకూ వెళ్లినదాన్ని మళ్లీ బతికానంటే నేను చేయాల్సింది ఏదో ఉందనుకుని ఇంట్లో వాళ్లని ఒప్పించి ముంబై రైలెక్కింది. తెలిసిన బంధువుల ఇంట్లో ఉంటూ బట్టల షాపులో పనికి వెళ్లేది. అక్కడ కల్పనకు నెలకు రూ.60 జీతం ఇచ్చేవారు. ఆతరువాత అక్కడే బట్టలు కుట్టడం నేర్చుకుంది. దీంతో ఆదాయం మరికొంత పెరిగింది. ఆ తరువాత రెండేళ్లు సంపాదించనదాంట్లో కొంత కూడబెట్టింది. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అందులోకి మారిపోయింది. అంతలోనే విషాదం. సమయానికి డబ్బులు లేక, మందులు అందక అక్క అనారోగ్యంతో మరణించిందన్న వార్త తనను కృంగదీసింది.దీంతో ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంది కల్పన. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంది. 1975లో మహాత్మా జ్యోతి పూలే స్కీమ్ కింద రూ.50వేలు లోన్ తీసుకుని సొంతంగా బట్టల షాపు తెరిచింది. బిజినెస్ బాగా సాగుతుండగామరో ఆలోచన చేసింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని భావించింది. సుశిక్షిత్ బెరోజ్‌ యువక్ సంఘటన పేరుతో ఒక అసోసియేషన్ ప్రారంభించింది. 3వేల మందికి పైగా అందులో జాయిన్ అయ్యారు.అక్కడి నుంచి ఆమె మరో అడుగు ముందుకు వేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టింది. అది ఆమె జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. అతి తక్కువ కాలంలోనే ప్రాపర్టీ బిజినెస్ నుంచి ఏకంగా రూ.4 కోట్లు సంపాదించింది. బిజినెస్‌లో సక్సెస్‌ని చూసిన కల్పన రుణ భారంతో మూతబడిన కామానీ ట్యూబ్ కంపెనీ పునరుద్ధరణ బాధ్యతను భుజానికెత్తుకుంది.10 మంది సభ్యులతో ఒక టీమ్‌ని ఏర్పాటు చేసింది. ఇందులో మార్కెటింగ్, బ్యాంక్, లాయర్లు, ప్రభుత్వ అధికారులు వంటి వారందరూ ఉన్నారు. ఆర్థిక మంత్రిని, కంపెనీకి రుణాలిచ్చిన వారందరినీ కలిసింది. బ్యాంకులు పెనాల్టీలను, వడ్డీలను రద్దు చేసేందుకు అంగీకరించాయి. కామానీ కంపెనీనీ తిరిగి ప్రారంభించేందుకు ఈ చర్యలు ఎంతగానో తోడ్పడ్డాయి. 2006లో కంపెనీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టింది కల్పన. కంపెనీకి సంబంధించిన రుణాలను తీర్చడమే మొదటి కర్తవ్యంగా పెట్టుకుని ముందుకు కదిలింది. ఇందుకోసం అంతకు ముందు తను సంపాదించిన ఆస్తిని కూడా అమ్మేసింది.2009లో కంపెనీ సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ నుంచి బయటపడింది. 2011లో రూ.3 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఇచ్చిన ప్రోత్సాహంతో మరికొన్ని వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది కల్పన మరింత ఉత్సాహంతో. ప్రస్తుతం ఆమె నిర్వహిస్తున్న వ్యాపారాల టర్నోవర్ రూ.2వేల కోట్లు. ఏడు కంపెనీలకు అధిపతి అయిన ఆమెని సక్సెస్ మహిళగా గుర్తిస్తూ 2013లో పద్మశ్రీ వరించింది. భారతీయ మహిళా బ్యాంక్ డైరక్టర్ల బోర్డులో కల్పనా సరోజ్ కూడా ఒక మెంబర్ కావడం విశేషం.

డాలర్ కన్నా తెరాస కండువకే విలువ ఎక్కువ

అమెరికన్‌ డాలర్‌ కన్నా ప్రస్తుతం గులాబీ కండువాకే విలువెక్కువుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలోని నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా గులాబీ కండువాకే విలువెక్కువుందన్నారు. అందుకే కాం గ్రెస్‌ కండువాలు బండకేసి కొట్టి గులాబీ కండువా కప్పుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం కాదని, డిపాజిట్లు దక్కించుతాయో లేదో చూసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ పై చంద్రబాబునాయు డు మాట్లాడిన మాటలకు ఎన్‌టీఆర్‌ ట్రస్టు భవన్‌కు తాళం వేసుకోవల్సి వచ్చిందన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఖతం అవుతుందని, గాంధీభవన్‌కు తాళం వేసి వాచ్‌మెన్‌కు తాళం చెవి ఇచ్చి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా వెళ్తారని చమత్కరించారు.నల్లగొండ కాంగ్రెస్‌ పార్టీ కంచుకోట కాదని, అది మంచుకొండగా కరిగిపోతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని చెల్లని రూపాయి అని చెప్పిన ఉత్తమ్‌ రాష్ట్రంలో చెల్లని రూపాయలైన రేవంత్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్, మల్లు రవికి ఎలా టికెట్లు ఇచ్చారన్నారు. బోఫోర్స్, రాఫెల్‌ కుంభకోణాలు తప్ప కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు మేలు చేయలేదన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ధీమా వ్య క్తం చేశారు. రెండు పర్యాయాలు తనను గెలిపిం చినట్లుగానే టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహారెడ్డిని గెలిపించాలని కోరారు. సభాద్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన నిర్వహించే కేసీఆర్‌ బహిరంగసభతో నర్సింహారెడ్డి గెలుపుఖాయం కావాలన్నారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల అధ్యక్షులు తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌బీఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అద్యక్షుడు నల్లమో తు సిద్ధార్థ, మిర్యాలగూడ ఎంపీపీ నూకల సరళా హనుమంతరెడ్డి, జెడ్పీటీసీ నాగలక్ష్మి, దామరచర్ల ఎంపీపీ మంగమ్మ, నారాయణరెడ్డి, చిర్రమల్లయ్య, మోసిన్‌అలీ, చిట్టిబాబు, నాగార్జునచారి, ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, డి.కళావతి, పి.పద్మావతి పాల్గొన్నారు.

రమ్యశ్రీ కుటుంబ రాజకీయం భలే రసకందాయం

అ నగనగా… గవిరెడ్డి వారి కుటుంబం. యజమాని గవిరెడ్డి దేముడుబాబు ఓ సాధారణ రైతు. అతని భార్య సన్యాసమ్మ. స్వగ్రామం విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజపురం. వీరికి ఆరుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. ఈ ఆరుగురిలో తొలి ముగ్గురు రాజకీయాల్లో ఉన్నారు. సుజాత అలియాస్‌ రమ్యశ్రీ వైకాపాలో చేరగా, సన్యాసినాయుడు జనసేన, రామానాయుడు తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు. సినిమా రంగంలో రమ్యశ్రీగా గుర్తింపు పొందారు. పలు చిత్రాల్లో నటించారు. తన పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనే కుతూహలం ఎప్పటి నుంచో ఉంది. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో చాలా గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరారు. ప్రస్తుతం జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ‘జీఎస్‌ఎన్‌ ట్రస్టు’ను స్థాపించి కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో అన్న తెలుగుదేశం తరఫున మాడుగుల నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. వైకాపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. వైకాపా నుంచి హామీ లభించక పోవడంతో జనసేనలో చేరారు. ప్రస్తుతం మాడుగుల బరిలో నిలిచారు. తొలుత విశాఖలో బంగారు నగల విక్రయ దుకాణం నిర్వహించేవారు. రాజకీయాల్లో ప్రవేశించాక 2009లో తెదేపా తరఫున పోటీ చేసి మాడుగుల శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2014లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారీ తెదేపా తరఫున పోటీ చేస్తున్నారు.

వేలల్లో వాట్సాప్ గ్రూపులు

తొలిదశ ఎన్నికలు ప్రారంభం కావడానికి ఎన్నో రోజుల్లేవు. ప్రచారానికి తగిన వ్యవధి కూడా లేకపోవడంతో సామాజిక మాధ్యమాల్లోనే నేతలు ప్రచారం మొదలుపెట్టేశారు. మరీ ముఖ్యంగా వాట్సాప్‌ వేదికగా అన్ని వర్గాల వారికీ చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఓటర్లే లక్ష్యంగా ఈపాటికే 87,000 వాట్సాప్‌ గ్రూపులు పుట్టుకొచ్చాయన్నది ఆ సంస్థ నుంచి అందిన సమాచారం. కేంద్రంలోని అధికార భాజపాకు సంబంధించిన అభ్యర్థులైతే పార్టీ గొప్పతనం, వారు అమలు చేసిన కొత్త పథకాలు, సరిహద్దు దాడుల వంటి అంశాలను ప్రస్తావిస్తూ తమ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారైతే ప్రభుత్వ పనితీరుపై దుమ్మెత్తిపోయడం, అవినీతి నాయకుల్ని ఏకేయడం, దేశభక్తి చాటడం.. ఇలా పలు అంశాలను పంపుతున్నారు. ఒక గ్రూపులో 256 మంది సభ్యులే ఉండాలన్నది నిబంధన. దాంతో ఈ 87000 గ్రూపుల ద్వారా దాదాపు రెండున్నర కోట్ల మందికి చేరువవుతున్నారు. ఆ మేరకు కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ రకరకాల సందేశాలను నేరుగా ఓటర్లకు పంపుతున్నారు

టపాసులను బాంబులనుకున్న గ్రీస్

గ్రీస్‌ జైలులో 14 నెలలు గడిపిన ఐదుగురు భారతీయులు ఎట్టకేలకు ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. సింగ్‌, గగన్‌ దీప్‌, రోతాస్‌ కుమార్‌, జైదీప్‌ థాకూర్‌, సతీశ్‌ పాటిల్‌..ఈ ఐదుగురూ ఒక కార్గో నౌకలో పనిచేసేందుకు స్వదేశం విడిచి వెళ్లారు. అనంతరం టర్కీ నుంచి జిబౌటీ సరకు రవాణా నౌకలో టపాసులు తయారు చేసేందుకు అవసరమైన ముడిసరుకును తరలిస్తున్నారు. ఈ క్రమంలో నౌకలో సాంకేతిక లోపం తలెత్తింది. దానిని సరిచేయించేందుకు నౌకను గ్రీసు తీరం వైపు మళ్లించారు. అప్పుడే వారిని గ్రీస్‌ కోస్టుగార్డులు అదుపులోకి తీసుకుని, నౌకను స్వాధీనం చేసుకున్నారు. నౌకలో పేలుడు పదార్థాలతో దేశానికి అతి సమీపంలోకి వచ్చేందుకు ప్రయత్నించారని వారిపై అభియోగం మోపారు. విషయం తెలుసుకున్న భారత దౌత్య కార్యాలయ అధికారులు, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపారు. కోర్టులో జరిగిన ప్రతి విచారణకు ఐదుగురికి మద్ధతుగా వాదనలు వినిపించారు. నౌకకు అన్ని అనుమతులు ఉన్నా, అవి పేలుడు పదార్ధాలు కాకున్నా నౌకతో సహా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారని అక్కడి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. నౌకకు ఉన్న అన్ని అనుమతులు పరిశీలించి, ఆ సామాగ్రిని న్యాయబద్ధంగానే తరలిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన న్యాయస్థానం వారిని విడుదల చేసింది. అయితే అప్పటికే వారిని జైలులో ఉంచి 14 నెలలు గడచిపోయాయి. విడుదల అనంతరం వారు ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. వారి విడుదలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వీరిని జైలులో పెట్టినప్పుడు పాకిస్థాన్‌ దేశస్థులతో పాటు ఉంచినట్లు వారు తెలిపారు. ‘భారత్‌, పాక్‌లకు చెందిన మేము వేరొక దేశంలో జైలులో కలిసి ఉన్నాం. మేము స్వదేశానికి తిరిగి వెళ్లగలమా అని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన తరుణంలో వారే మాకు మనోధైర్యాన్ని ఇచ్చార’ని వారిలో ఒకరు తెలిపారు.

బంగారం కోసం భారతీయుల ఇళ్లల్లో దొంగతనాలు

బ్రిటన్‌లో బంగారం దొంగలు అత్యధికంగా భారత సంతతి ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు శనివారం ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. గత ఐదేళ్లలో రూ. 1,280 కోట్ల విలువైన బంగారం బ్రిటన్‌లో చోరికి గురైందనీ, అందులో అత్యధికం భారత సంతతి ప్రజలదేనని బీబీసీ పరిశోధనలో తేలింది. 2013 నుంచి చూస్తే 28 వేల బంగారం దొంగతనాలు జరిగాయి. గత ఐదేళ్లలో గ్రేటర్‌ లండన్‌లో రూ. 1,050 కోట్ల విలువైన బంగారం దొంగతనానికి గురయ్యింది.ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా బంగారం ఎంతున్నా దొంగలు కొట్టేస్తున్నారనీ, బంగారాన్ని చాలా తక్కువ సమయంలో, చాలా సులువుగా నగదుగా మార్చుకునే అవకాశం ఉండటం ఇందుకు ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు. చెషైర్‌ పోలీస్‌ దళంలో నేరాల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆరోన్‌ దుగ్గన్‌ అనే అధికారి మాట్లాడుతూ ‘సెకండ్‌ హ్యాండ్‌ నగలు కొనే వ్యాపారులు అమ్ముతున్న వ్యక్తి ఎవరు? ఆ నగలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? అని తెలుసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. ఈ దేశంలో బంగారం తునక ముక్కలు అమ్మడం కన్నా సెకండ్‌ హ్యాండ్‌ నగలు అమ్మడమే సులభం’ అని తెలిపారు. దీపావళి, దసరా తదితర భారత ప్రధాన పండుగల సమయంలో ప్రజలు బంగారం ఎక్కువగా ధరించి ఆలయాలు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారనీ, ఆ పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని లండన్‌ పోలీసులు అంటున్నారు. ప్రతీ ఏడాది ఈ పండుగల సమయంలో తాము హెచ్చరికలు కూడా చేస్తామన్నారు. 2017–18లో లండన్‌లోనే 3,300 దొంగతనాలు జరిగాయి. రూ. 193 కోట్ల విలువైన బంగారం చోరీకి గురయ్యింది.పశ్చిమ లండన్‌లోని సౌథాల్‌లో ఆసియా స్టైల్‌ బంగారం నగలు అమ్మే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ బంగారం ఆభరణాలకు సంప్రదాయాల పరంగా ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవాలనీ, బీమా కూడా చేయించుకోవాలని తానెప్పుడూ తన దగ్గర బంగారం కొనేవారికి చెబుతుంటానని ఆయన తెలిపారు. ‘బంగారం కొనడమంటే పెట్టుబడి పెట్టడమనీ, అది అదృష్టాన్ని కూడా తెస్తుందని పిల్లలకు వారి తల్లిదండ్రులు చెబుతారు. ఆసియా ప్రజలు ఇదే చేస్తారు.వాళ్లు ఇక్కడకొచ్చినా ఆ సంప్రదాయాన్ని పాటిస్తారు’ అని సంజయ్‌ కుమార్‌ వివరించారు. బంగారు ఆభరణాలు కేవలం విలువైనవేగాక, వాటి యజమానులకు వాటితో ప్రత్యేక అనుబంధం ఉంటుందనీ, అవి పోయినప్పుడు యజమానుల మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని లండన్‌ పోలీసు విభాగంలో డిటెక్టివ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లీసా కీలే చెప్పారు. తమ చర్యల కారణంగా ఈ దొంగతనాలు కొంచెం తగ్గాయనీ, అయినా చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆమె తెలిపారు. బంగారం దొంగలను పట్టుకోడానికి, దొంగతనాల సంఖ్యను తగ్గించడానికి లండన్‌ పోలీసులు ప్రత్యేకంగా ‘ఆపరేషన్‌ నగ్గెట్‌’ పేరిట ఓ∙కార్యక్రమాన్ని సైతం ఆచరణలోకి తెచ్చారు.

రూపాయి ఉందా? పదండి భోజనం చేద్దాం!

కర్ణాటక హుబ్బళ్లి నగరంలోని మహావీర్‌ వీధిలో ఒక్కరూపాయికే మంచి భోజనం లభిస్తుంది. ఈ సంస్థ దాదాపు తొమ్మిదేళ్ల క్రితం మహావీర్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. 1998లో మహావీర్‌ యువజన సమాఖ్య ఏర్పడి పలు సేవాకార్యక్రమాలు తెలుస్తోంది. ఓ జైన గురువు సలహామేరకు 2009లో ఇక్కడ రోటీఘర్‌ను ప్రారంభించారు. ఈ రోటీఘర్‌లో ఒక్కరూపాయికే కమ్మని భోజనం పెడతారు.

యూపీలో క్వింటా బంగారం పట్టివేత

ఘ‌జియాబాద్ జిల్లాలో ఓ వాహ‌నం నుంచి వంద కిలోలకు పైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మోదీన‌గ‌ర్‌లో చెకింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసులు ఆ వాహ‌నాన్ని సీజ్ చేశారు.

దాదాపు 38 కోట్లు ఖ‌రీదు చేసే 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధం ఉన్న న‌లుగుర్ని అరెస్టు చేశారు.

ఢిల్లీ నుంచి హ‌రిద్వార్‌కు బంగారాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న‌ట్లు తెలిసింది. క్యాషియ‌ర్‌, డ్రైవ‌ర్‌తో పాటు ఇద్ద‌రు సెక్యూర్టీ గార్డుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఎన్‌టీఆర్ ప్రచారనికి ట్రంప్

కాంట్ర‌వ‌ర్షియ‌ల్‌కి కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న సినిమాలు ఎప్పుడు వివాదాల సుడిగండంలో తిరుగుతూనే ఉంటాయి.

తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 22న విడుద‌ల కావల‌సి ఉన్న‌ప్ప‌టికి, ప‌లు వివాదాల నేప‌థ్యంలో రిలీజ్ లేట్ అవుతూ వ‌స్తుంది.

అయితే త‌న సినిమాల‌ని ప్రమోట్ చేసుకునే విష‌యంలో వ‌ర్మ స్టైలే వేరు అనే విష‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

కొన్నాళ్ళుగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని వినూత్నంగా ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తున్న వ‌ర్మ తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న సినిమాపై స్పందించారంటూ మార్పింగ్ వీడియో చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో ట్రంప్‌ని ఓ రిపోర్ట‌ర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై మీ అభిప్రాయ‌మేంట‌ని ప్ర‌శ్నించ‌గా, అందుకు ఆయ‌న ఇది చ‌ర్చించాల్సిన అంశం అని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రు దీని గురించే మాట్లాడుతున్నారు. అస్సలు అక్క‌డ ఏం జ‌రుగుతుందో చూడాలని ఉంది అన్న‌ట్టుగా ఉంది.

గ‌తంలో ట్రంప్ ఇచ్చిన ఇంట‌ర్య్వూ వీడియోని ఫ‌న్నీగా ఇలా మార్ఫింగ్ చేసి విడుద‌ల చేయ‌డం విశేషం.

మార్చి 29న విడుద‌ల కానున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మిస్తున్నారు.

కంప్యుటర్లో వైరస్ ఉందని 9కోట్లు నొక్కేశాడు

పోంజీ స్కామ్‌ ద్వారా సుమారు రూ.8.9 కోట్ల మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యాపారవేత్తకు అమెరికా కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అమ్రిత్‌ జస్వంత్‌ సింగ్‌ చహల్‌(31) న్యూయార్క్‌లో ప్రైవేటుగా మూలధన పెట్టుబడుల కంపెనీ నిర్వహిస్తున్నాడు. కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ, తమ కంపెనీ ఏటా కనీసం 28-34 శాతం లాభాలు ఆర్జిస్తోందంటూ సుమారు 40 మందిని చహల్‌ మోసగించినట్టు కోర్టులో నిరూపణ అయ్యింది. నష్టాల విషయం బయటపడకుండా తప్పుడు బ్రోకరేజ్‌ రికార్డులు కూడా సృష్టించాడు. దీంతోపాటు ఓ పెట్టుబడిదారు పేరిట నకిలీ బ్యాంకు ఖాతాను తెరిచి, సొమ్మును ఆ ఖాతాల్లోకి మళ్లించడం ద్వారా తన వ్యక్తిగత అవసరాలకు నగదు వినియోగించుకున్నట్టు నిరూపణ అవడంతో కోర్టు జైలుశిక్ష విధించింది. అలాగే, ఉత్తర కరోలినాలోని షార్లెట్‌లో ఇతరుల కంప్యూటర్లను హ్యాక్‌ చేయడం ద్వారా రూ.20 కోట్ల మోసానికి పాల్పడిన కేసులో భారతీయ అమెరికన్‌ బిషప్‌ మిట్టల్‌(24)ను మేజిస్ర్టేట్‌ కోర్టు దోషిగా తేల్చింది. వందలాదిమంది కంప్యూటర్లలోకి తప్పుడు పాప్‌పలు పంపించడం ద్వారా కంప్యూటర్లు పనిచేయకుండా చేశారు. దీంతోపాటు వైరస్‌, తదితర సమస్యలు ఉంటే తమ కంపెనీని సంప్రదించాలంటూ కంపెనీ పేరు, ఫోన్‌ నంబరు స్ర్కీన్‌పై కనిపించేలా చేశారు. బాధితులు ఆ ఫోన్‌ నంబరుకు సంప్రదిస్తే, వైరస్‌, ఇతర సమస్యలు తొలగించడానికి అంటూ ఒక్కొక్కరి నుంచి రూ.13 వేల నుంచి రూ.1.64 లక్షల వరకూ వసూలు చేశారు. కోర్టులో నేరం అంగీకరించిన మిట్టల్‌ను పూచీకత్తుపై విడుదల చేశారు. శిక్ష వెల్లడించే తేదీని న్యాయమూర్తి ప్రకటించలేదు.

ఆక్స్‌ఫర్డ్‌లో జేరిన చెడ్డీ

కొత్త పదాలను చేర్చుకొని విడుదల కానున్న ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్‌ డిక్షనరీలో తాజాగా ఓ భారతీయ పదానికి చోటు లభించింది. మనం ఇంట్లో సరదాగా ఉపయోగించే ఆ పదం బ్రిటిష్ వాళ్లకు పరిచయం ఉన్నదే. మనదేశం బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో ప్రభుత్వ గెజిట్‌, ఇతర పబ్లికేషన్లలో దాన్ని ఉపయోగించే వారు. ఆ పదమే చడ్డీస్‌(అండర్ పాంట్స్‌). ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ మార్చి అప్‌డేట్‌లో 650 కొత్త పదాలు చేర్చారు. అయితే ఈ చడ్డీస్ పదాన్ని అప్పట్లో బ్రిటిషర్లు ఉపయోగించినప్పటికీ, 1990ల్లో బీబీసీలో ప్రసారమైన బ్రిటిష్-ఏషియన్ కామెడీ సిరీస్‌ ‘గుడ్‌నెస్-గ్రేసియస్‌ మి’ తో బాగా పాపులర్‌ అయింది. ఇప్పుడు ఆ డిక్షనరీలో చడ్డీస్‌కు షార్ట్ ట్రౌజర్లు, షార్ట్స్‌, అండర్‌ పాంట్స్‌ వంటి అర్థాలు కనిపించనున్నాయి.

అతి తెలివికి ఏమి తక్కువ లేదు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను వేలకోట్లకు మోసగించి లండన్‌ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని ఎట్టకేలకు బ్రిటన్‌ పోలీసులు అరెస్టు చేశారు. లండన్‌లోని ఓ బ్యాంకుకు వెళ్లిన నీరవ్‌ మోదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంవత్సరానికి నీరవ్‌.. పోలీసులకు చిక్కాడు. అయితే ఈ సంవత్సర కాలంలో కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒకానొక దశలో ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకున్నాడట. ఈ మేరకు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికి చాలా రోజుల ముందు 2018 జనవరిలోనే నీరవ్‌, మరో ప్రధాన నిందితుడు మెహుల్‌ ఛోక్సీ విదేశాలకు పారిపోయారు. వీరి ఆచూకీ కోసం భారత దర్యాప్తు సంస్థలు అనేక ప్రయత్నాలు చేశాయి. ఇంటర్‌పోల్‌ను కూడా ఆశ్రయించడంతో నీరవ్‌, ఛోక్సీలపై అరెస్టు వారెంట్‌ కూడా జారీ అయ్యింది. అయితే నీరవ్‌ లండన్‌లోని వెస్ట్‌ఎండ్‌లో గల ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నట్లు ఇటీవల టెలిగ్రాఫ్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో నీరవ్‌ ఆచూకీపై స్పష్టత వచ్చింది. మరోవైపు గతేడాది జనవరి నుంచి నీరవ్‌ లండన్‌లోనే ఉన్నాడు. కేసు దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతి చిన్న పసిఫిక్‌ ద్వీపమైన వనౌటు దేశంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం, యూకేలో ఆశ్రయం పొందేందుకు పెద్ద పెద్ద న్యాయ సంస్థలను కలవడం, సింగపూర్‌లో శాశ్వత నివాసం కోరడం లాంటివి చేశాడు. ఒక దశలో తన రూపాన్ని మార్చుకునేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయించుకోవాలనుకున్నట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నీరవ్‌ ఆచూకీ బయటకు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే లండన్‌లోని మెట్రో బ్యాంక్‌ శాఖలో ఖాతా తెరవడానికి వచ్చిన నీరవ్‌ను అక్కడి సిబ్బంది ఒకరు గుర్తుపట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అరెస్టు చేశారు. త్వరలోనే ఆయనను భారత్‌కు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

భారత జైలు కంటే దారుణంగా…

భారత్‌లో జైళ్లు నరకప్రాయంగా ఉంటాయి.. ఇది పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడైన విజయ్‌మాల్యా లండన్‌ కోర్టులో చేసిన ఆరోపణలు.. ఇలానే భారత్‌ జైళ్లలో ఉన్న ఇబ్బందులను సాకుగా చూపి నేరస్థులు చక్కగా విదేశాల్లోనే గడిపేస్తుంటారు. ఒకానొక దశలో విజయ్‌ మాల్యా కోసం ముంబయి ఆర్థర్‌ రోడ్‌ జైల్లో ఒక గదిని ప్రత్యేకంగా తయారు చేశారు. పాఠశాలల గదులే సరిగా లేకుండా అవస్థలుపడుతున్న దేశంలో ఒక ఆర్థిక నేరగాడికి ఇంతగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం అవసరమా అన్న విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు తాజాగా లండన్‌లో అరెస్టైన నీరవ్‌ మోదీని అక్కడే కస్టడీలో ఉండాలని విస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం ఆదేశించింది. నీరవ్‌ను తరలించే జైలుకు ఒక ప్రత్యేకత ఉంది. బ్రిటన్‌లోనే అత్యంత రద్దీగా ఉండే హెచ్‌ఎంపీ వాండ్స్‌వర్త్‌ జైలు ఇది. ఇక్కడి ఖైదీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బి కేటగిరిలోకి వచ్చే జైలు. ఇక్కడ కరుడుగట్టిన నేరగాళ్లను ఎక్కవగా ఉంచుతారు. దావూద్‌ ఇబ్రహీం సన్నిహితుడు జబీర్‌ మోతీని కూడా ఇక్కడే ఉంచారు. ఇక్కడ మత్తుపదర్థాల కేసుల్లో అరెస్టైనవారు, మానసిక వైకల్యంతో నేరాలు చేసినవారు ఉంటారు. 1851లో నిర్మించిన ఈ జైల్లో దాదాపు 1,428 మంది ఖైదీలు ఉంటున్నారు. బ్రిటన్‌లో ఒక జైల్లో ఈ సంఖ్యలో ఖైదీలను ఉంచడం చాలా అరుదు. ఇది జైలు సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. ఇక్కడ మరుగుదొడ్ల పరిస్థితులు ఘోరంగా ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ ఖైదీలను కూడా అతితక్కువ సమయం మాత్రమే బయటకు అనుమతిస్తారు. అంతేకాదు ఇక్కడ ఎవరికీ ప్రత్యేకంగా ఒక గది కేటాయించరు. దీంతో నీరవ్‌కూడా మరో నేరగాడితో తన గదిని పంచుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. మార్చి 29 తర్వాత నీరవ్‌ భవిత ఏమిటనేది తేలుతుంది.

హెలికాఫ్టర్లు లేవు

అసలే సార్వత్రిక ఎన్నికలు. మొదటి, రెండో దశలకు నోటిఫికేషన్‌ సైతం విడుదలైంది. ముఖ్యనేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టించాలంటే.. విమానమో లేక హెలికాప్టరో కచ్చితంగా ఉండి తీరాల్సిందే. దీంతో దేశంలోని రాజకీయపార్టీలన్నీ హెలికాప్టర్ల వైపు చూస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు అద్దెకు తీసేసుకుని జాగ్రత్తపడ్డాయి. ఇప్పుడు అద్దెకు తీసుకుందామంటే ఒక్కటంటే ఒక్కటీ దొరకని పరిస్థితి. చిన్న విమానాలు లేక హెలికాప్టర్లు అద్దెకు ఇచ్చే కార్యాలయాలకు వెళితే ‘అద్దెకు అందుబాటులో లేవు’ అన్న బోర్డు కనిపిస్తోంది.
**దేశంలోని పౌర హెలికాప్టర్ల సంఖ్య 275. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కొర్పొరేట్‌ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలకు చెందినవాటిని తీసేస్తే.. ఓ 75 మాత్రం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో అద్దెకు ఉన్నాయి. 2,000 అడుగుల నుంచి 3,000 అడుగుల ఎత్తులో గంటకు వంద నుంచి 140 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించే హెలికాప్టర్లు అంటే మన నేతలకు మక్కువ ఎక్కువ. ప్రచారంలో తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలను చుట్టేసే వీలుండడమే ఇందుకు కారణం. మరోవైపు, అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా.. మన దగ్గర చిన్న విమానాలు, హెలికాప్టర్లు తగినన్ని అందుబాటులో ఉండవు. దీంతో అద్దెకు ఇచ్చే సంస్థలు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే ‘పని’ చక్కబెట్టేశాయి. యూరోకాప్టర్‌, రాబిన్‌సన్‌, బెల్‌, సికోర్‌స్కై తదితర కంపెనీల హెలికాప్టర్లన్నీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బుక్‌ అయిపోయాయి.
**డిమాండ్‌ వేటికంటే..
ఒకే ఇంజిన్‌తో నడిచే సెస్నా వంటి హెలికాప్టర్లను వివిధ కారణాలతో ఎన్నికలకు సంబంధించిన పనుల్లో వాడడం లేదు. రెండు ఇంజిన్ల టర్బోప్రాప్స్‌లకు డిమాండ్‌ విపరీతంగా ఉంది. ‘‘పైలట్‌తోపాటు ఐదుగురు ప్రయాణించే వీలున్న ఎయిర్‌ సీ-90, ఇద్దరు పైలట్లతోపాటు ఎనిమిది మంది ప్రయాణించే వీలున్న ఎయిర్‌ బి-200కు బాగా డిమాండ్‌ ఉంది. ఈ రకం విమానాలు 24 వరకు భారత్‌లో ఉన్నా.. ప్రస్తుతం ఏ ఒక్కటీ అద్దెకు అందుబాటులో లేదు’’ అని ముంబయికి చెందిన విమానయాన రంగ నిపుణుడు ప్రదీప్‌ థాంపీ చెప్పారు.
* భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వంటి అగ్రనేతలు చిన్న హెలికాప్టర్లలో ప్రయాణించరు. తాము ప్రచారం చేయాలనుకున్న ప్రాంతానికి దగ్గర్లోని విమానాశ్రయం వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్‌ లేదా చిన్న విమానంలో ప్రయాణిస్తారు. రక్షణ, భద్రతా చర్యల్లో భాగంగా ఈ ఏర్పాట్లు తప్పనిసరి.
***ప్రధానికి మాత్రం మినహాయింపు
ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏ ఒక్కరూ ప్రభుత్వ హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రయాణించడానికి వీల్లేదు. అద్దెకు తీసుకోవాల్సిందే. భద్రతా పరమైన కారణాల వల్ల ప్రధానమంత్రి మాత్రం భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) హెలికాప్టర్‌లో ప్రయాణించొచ్చు.
సగం హెలికాప్టర్లు భాజపా దగ్గరే కచ్చితమైన సమాచారం లేకున్నా.. దేశంలోని మొత్తం హెలికాప్టర్లలో 50 శాతం వరకు భాజపా అద్దెకు తీసుకుంది. చాలా రాజకీయపార్టీలు ఒకేసారి 45 రోజుల నుంచి 60 రోజుల వరకు హెలికాప్టర్లను బుక్‌ చేసేసుకున్నాయి.
**రూ.లక్షలు ధారపోయాల్సిందే..
హెలికాప్టర్‌ లేదా చిన్న విమానం రకాన్ని బట్టి గంటకు రూ.75,000 నుంచి రూ.3,50,000 వరకు చెల్లించాలి. గాల్లోకి ఎగిరిందా లేదా అనేదానితో సంబంధం లేకుండా.. రోజుకు కనీసం మూడు గంటల అద్దె చెల్లించాలి.

ఆ జరిమానా పక్కన సున్నాలు వింటే గుండె జారీ గల్లంతవుతుంది

ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌పై మరోసారి పిడుగు పడింది. ఆ సంస్థకు యూరోపియన్‌ యూనియన్‌ యాంటీ ట్రస్ట్‌ రెగ్యులేటరీ పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. సెర్చింజిన్‌ తన విధులను మర్చిపోయి నమ్మకాన్ని కోల్పోయిందని యూనియన్‌ పేర్కొంది. దీనిపై ఈయూ కాంపిటీషన్‌ కమిషనర్‌ మార్గరెట్‌ వెస్టాగర్‌ మాట్లాడారు. ‘ఈరోజు కమిషన్‌ గూగుల్‌కు జరిమానా విధించింది. 1.49 బిలియన్‌ యూరోలు జరిమానా కింద చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్‌లో ఆ సంస్థకున్న మంచి పేరును, అధికారాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేసింది. ఈ సంస్థ వల్ల కొన్ని కంపెనీలు బాగా లాభాలు గడిస్తున్నాయి. వినియోగదారులు మోసపోతున్నారు. కస్టమర్లే ప్రతి కంపెనీకి ప్రధానం. వారి విశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా వారిని ఇబ్బందులకు గూగుల్ గురి చేస్తోంది. ఇది వినియోగదారుల చట్టాలకు విరుద్ధం. వారి స్వేచ్ఛను, ఎంపికను ఈ సంస్థ హరిస్తోంది.దీని వల్ల గూగుల్‌ తన సుస్థిర స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.’ అని మార్గరెట్‌ తెలిపారు.

రాజీవ్ హంతకులను విడిపిస్తాం!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడిపించేందుకు కృషి చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే పార్టీ హామీ ఇచ్చింది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ మంగళవారం విడుదల చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టే సంకీర్ణ కూటమిలో తమ పార్టీ ఉంటే.. రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడిపించేందుకు డీఎంకే కచ్చితంగా ప్రయత్నాలు చేస్తుందని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. శ్రీలంక శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని, వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ను రద్దు చేస్తామని, ప్రయివేటు రంగాల్లో రిజర్వేషన్‌ కోటాను తీసుకొస్తామని డీఎంకే హామీలు కురిపించింది. దీంతో పాటు విద్యార్థులు తీసుకున్న విద్యా రుణాలను కూడా మాఫీ చేస్తామని పేర్కొంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని, మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని హమీ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో డీఎంకే.. కాంగ్రెస్‌, ఇతర చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా డీఎంకే 20 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మిగతా 19 సీట్లను కూటమి పార్టీలకు కేటాయించింది. ఏప్రిల్‌ 18న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

పాక్ అణు స్థావరంలో ప్రమాదం

అణుపాటవ దేశాలు తమ అణ్వాయుధాలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. కానీ పాక్‌ పరిస్థితి వేరు. ఆ దేశంలో అణుటెక్నాలజీ కూడా సరిహద్దులు దాటేస్తుంది. ఉత్తరకొరియా అణుకార్యక్రమం పాక్‌ పాపమేనని అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ దేశంలోని కీలకమైన అణుస్థావరంలో ప్రమాదం చోటు చేసుకొందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదీ జరిగినా బాహ్య ప్రపంచానికి తెలియనీయని పాక్‌ ఇప్పుడు ప్రమాదం విషయాన్ని కూడా తొక్కిపడుతోంది. తాజాగా అక్కడి ఉపగ్రహ చిత్రాలను ఒక ఆంగ్లపత్రిక బహిర్గతం చేసింది.
ఫిబ్రవరి 26 దాడుల తర్వాత పాక్‌ అణుస్థావరాల్లో ఏమైనా కదలిక వచ్చిందా అని నిపుణులు పరిశీలించారు. దీనికోసం వారు పలు ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా బలోచిస్థాన్‌ ప్రాంతంలో ఖుస్దార్‌ అణ్వాయుధ కేంద్రంలో చిత్రాలు తేడాగా అనిపించాయి. ఖుస్దార్‌ అణ్వాయుధ కేంద్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. ఇక్కడి నిర్మాణాలను తీరును బట్టి 46 అణవార్‌ హెడ్లను భద్రపర్చినట్లు భావిస్తున్నారు. వాస్తవానికి 200 వార్‌హెడ్లను, క్షిపణులను భద్రపర్చే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. మార్చి 8వ తేదీన ఇక్కడి శాటిలైట్‌ చిత్రాలను పరిశీలించిన వారికి 200 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో అగ్నిప్రమాదం జరిగినట్లు నల్లటి మచ్చ కనిపించింది. అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వాడే క్షిపణి ఏదైనా ప్రమాదానికి గురై పేలి ఉండవచ్చని భావిస్తున్నారు. కచ్చితంగా ఇక్కడ ఏం జరిగిందో మాత్రం అంచనాకు రాలేకపోతున్నారు. అక్కడ నిజంగా ప్రమాదం జరిగితే కనుక అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది.

చిన్నవుటల్లిలో రెచ్చిపోయిన దొంగలు-నేరవార్తలు–03/16

* గన్నవరం మండలం చిన్నఅవుటపల్లిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గోల్డెన్ నెస్ట్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నాలుగు సవర్ల బంగారంరూ.వేల నగదుల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారు.
*ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నేషనల్ హైవే పైన కొండన్‌గావ్ పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగామరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులజిల్లా కలెక్టర్ సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను కలెక్టర్ ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.
*బంగారం అక్రమ రవాణాలో అరితేరిన స్మగ్లర్లు రోజుకో వ్యూహం అనుసరిస్తున్నారు. అధికారుల కళ్లుగప్పేందుకు కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.
*సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత 15 రోజుల్లో అబ్కారీ శాఖ చేపట్టిన దాడుల్లో దాదాపు రూ.1.40 కోట్లు విలువ చేసే 35 వేల లీటర్ల మద్యంను సీజ్‌ చేసినట్లు మద్య నిషేధం, అబ్కారీశాఖ కమిషనర్‌ ముఖేష్‌కుమార్‌ మీనా ప్రకటనలో తెలిపారు.
*ఎలాంటి బిల్లులు లేకుండా అనంతపురం జిల్లా బత్తలపల్లి నుంచి చెన్నైకి తరలిస్తున్న 12,000 చీరలను స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా రాజంపేట డీఎస్పీ మురళీధర్‌ శుక్రవారం విలేకరులకు తెలిపారు. బాలపల్లె తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు పరిశీలిస్తుండగా ఈ చీరలు పట్టుబడినట్లు చెప్పారు. లారీ డ్రైవరుతోపాటు ముగ్గురిని అరెస్టు చేసి రూ.లక్ష నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
*కర్ణాటకలో ఆదాయ పన్ను శాఖ, ఎన్నికల సంఘం అధికారులు జరిపిన దాడుల్లో రూ.2.25 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల ఖర్చుల కోసం గుత్తేదారుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడుతున్నట్లు వచ్చిన సమాచారంతో బెంగళూరు ఆనందరావు కూడలి సమీపంలోని రాజ్‌మహల్‌ హోటల్‌ గదిపై అధికారులు గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత దాడి చేశారు.
*కోట్ల రూపాయల డిపాజిట్‌లు వసూలు చేసిన వ్యవహారంపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేయడం చెల్లదని, వాటిని ఉపసంహరించుకుని తీవ్ర మోసాల దర్యాప్తు సంస్థ (సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయం-ఎస్‌ఎఫ్‌ఐవో)కు అప్పగించాలంటూ హీరాగోల్డ్‌ ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ ఎండీ నౌహీరాషేక్‌లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
*ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా జిల్లాలోని చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోయం రమేశ్‌ (35) అనే జవాను ఆత్మహత్య చేసుకున్నారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డు (డీఆర్‌జీ)గా పనిచేస్తున్న ఆయన శుక్రవారం ఉదయం సర్వీస్‌ రైఫిల్‌తో తనను తాను కాల్చుకున్నారని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.
*అమెరికా జాతీయులతో విదేశీయులకు దొంగ పెళ్లిళ్లు జరిపి, వారంతా అక్రమంగా అగ్రరాజ్యంలో నివసించడానికి సహకరించినట్లు రవిబాబు కొల్లా(47) అనే భారతీయుడు టాలిహాసీలోని కోర్టులో అంగీకరించాడు. దీంతో కోర్టు ఇతనికి మే 22న శిక్ష ఖరారు చేయనుంది.
*బంగారం అక్రమ రవాణాలో అరితేరిన స్మగ్లర్లు రోజుకో వ్యూహం అనుసరిస్తున్నారు. అధికారుల కళ్లుగప్పేందుకు కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.

గ్రీన్ కార్డుల కోసం నకిలీ పెళ్లిళ్లు చేయిస్తున్న కొల్లా రవిబాబు అరెస్టు

భారతీయులు సహా వలసదారులకు అమెరికా పౌరులతో ఉత్తుత్తి పెళ్లిళ్లు చేయించి మోసానికి పాల్పడిన ఒక భారతీయుడిని అక్కడి కోర్టు దోషిగా నిర్ధారించింది. ఫ్లోరిడా రాష్ట్రం పనామా సిటీలో నివాసముంటున్న రవిబాబు కొల్లా(47) 2017 –2018 సంవత్సరాల్లో బే కౌంటీ ప్రాంతంలో ఉత్తుత్తి పెళ్లిళ్ల దందా సాగించాడు. అక్కడి ప్రభుత్వం నుంచి రాయితీలు అందేలా చేసేందుకు, స్థిర నివాసం ఉండేలా చేసేందుకు భారతీయులు సహా ఇతర వలసదారులకు అమెరికా పౌరులతో దాదాపు 80 వరకు పెళ్లిళ్లు జరిపించాడు.అతడికి అమెరికా పౌరసత్వం ఉన్న క్రిస్టల్‌ క్లౌడ్‌(40) సహకరించింది. ఈ పెళ్లిళ్లకు అమెరికా పౌరసత్వం ఉన్న పనామా సిటీ, కల్హౌన్, జాక్సన్‌ కౌంటీలకు చెందిన సుమారు 10 మందిని ఆమె ఎంపిక చేసింది. నకిలీ పెళ్లిళ్లు చేయించిన నేరానికి రవిబాబుకు ఐదేళ్ల వరకు, వీసా మోసాలకు గాను 20 ఏళ్ల వరకు శిక్ష పడే చాన్సుంది.

ఏపీలో 14కేజీలో బంగారం పట్టివేత

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తనిఖీలు ముమ్మరం చేశామని ఎన్నికల కమిషనర్ గోపాల్ కృష్ణ ద్వివేది అన్నారు.

నిన్నటి వరకు జరిగిన సోదాల వివరాలను గురువారం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు.

రూ. 30 కోట్ల వరకు నగదు, 13.57 కేజీల గోల్డ్, 31.5 కేజీల వెండి, 70 వాహనాలు, పేలుడు పదార్థాలు జిలెటిన్ స్టిక్స్, రూ. 1.31 కోట్ల మందు బాటిల్స్ సీజ్ చేసినట్లు చెప్పారు.

రేపటితో ఓటు హక్కు నమోదు కార్యక్రమం ముగుస్తుందని, దరఖాస్తు గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని ద్వివేది స్పష్టం చేశారు.

ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుదేనని, ఇప్పుడు చూసుకోకుండా జాబితాలో ఓటు లేదని ఎన్నికల సంఘాన్ని నిందించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.

ఓటర్ల నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని, 7 నుంచి 9 శాతం వరకూ ఓటర్లు పెరిగే అవకాశం ఉందని ద్వివేది అన్నారు.

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. జనవరి 11కు ముందు 20 లక్షల కొత్త ఓట్లను జాబితాలో చేర్చామన్నారు. వారికి కార్డుల పంపిణీ జరుగుతోందని చెప్పారు.

ఇప్పుడు కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారికి కూడా మార్చి 31వ తేదీలోగా కార్డులు ఇస్తామన్నారు.

ఎన్నికలు సజావుగా జరగడానికి అని రాజకీయ పార్టీలు ఈసీకి సహకరించాలని ద్వివేది కోరారు.

6600 ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌, 6160 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు, 31 అంతరాష్ట్ర చెక్ పోస్టులు, 46 తాత్కాలిక చెక్ పోస్టులు, 18 మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ద్వివేది తెలిపారు.

వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో 161 బృందాలతో లావాదేవీలపై నిఘా పెట్టామని, సోషల్ మీడియా నిఘా కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.

శవానికి ఆయుర్వేద చికిత్స

తండ్రి చనిపోయి రెండు నెలలు అవుతోంది. వైద్యులు డెత్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. కానీ తండ్రి మృతదేహానికి రెండు నెలలుగా ఆయుర్వేద చికిత్స చేయిస్తున్నాడో కొడుకు. అతను ఏదో సాధరణ పౌరుడైతే సమస్య లేదు. కానీ సదరు వ్యక్తి ఐపీఎస్‌ అధికారి కావడం గమనార్హం. వివరాలు.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర మిశ్రా అనే ఐపీఎస్‌ అధికారి తండ్రి(84) ఈ ఏడాది జనవరి 14న మరణించాడు. ప్రైవేట్‌ ఆస్పత్రి సిబ్బంది డెత్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. కానీ రాజేంద్ర కుమార్‌ మాత్రం రెండు నెలలుగా ప్రభుత్వ బంగళాలో తండ్రి మృతదేహానికి చికిత్స చేయిస్తున్నాడు. తల్లి, సోదరులతో పాటు వైద్యం చేసే వ్యక్తిని మాత్రమే ఆ గదిలోకి అనుమతిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మానవహక్కుల కమిషన్‌ రాజేంద్ర ఇంటికి వైద్యులను పంపి.. పరీక్షించడానికి ప్రయత్నించింది. కానీ అతను అందుకు ఒప్పుకోలేదు.ఈ విషయం గురించి రాజేంద్ర మాట్లాడుతూ.. ‘ఈ ప్రపంచంలో శాస్త్రానికి అందని విషయాలు చాలా ఉన్నాయి. అల్లోపతి వైద్యమే ఆఖరు కాదు. మా నాన్న ఆరు దశాబ్దాలుగా యోగా చేస్తున్నారు. ఆయన యోగింద్రుడు. ఒక వేళ మీరు ఆరోపిస్తున్నట్లు మా నాన్న మరణించాడనే అనుకుందాం. మరి ఇప్పటి వరకూ ఆయన శరీరం ఎందుకు కుళ్లిపోలేదు. మృతదేహానికి వైద్యం చేయడం అసాధ్యం. కానీ మా నాన్న శరీరం వైద్యానికి స్పందిస్తుంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం పంపే డాక్టర్లు ఆయనను మేల్కొల్పడానికి ప్రయత్నించినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి.. ఆయనకు ఏమైనా అయితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు. అలాంటిది జరిగితే.. దాన్ని హత్య అంటూ కేసు పెట్టవచ్చా’ అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే రాజేంద్ర తల్లి.. ఈ విషయంలో ఇతరులు జోక్యం చేసుకోకుండా చూడమంటూ.. ఇప్పటికే మానవ హక్కులు కమిషన్‌ను ఆశ్రయించింది.