పెళ్లిళ్లపై యోగీ సర్కార్ దెబ్బ

వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (అలహాబాద్‌) పెళ్లిళ్లు జరగకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని ఫంక్షన్‌ హాళ్లు, అతిథి గృహాలు, హోటళ్లకు ఉత్తర్వులు పంపింది. ముందస్తు బుకింగ్‌లన్నింటినీ రద్దు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ సమయంలో కుంభమేళా ఉన్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేళాకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా వారికి ఫంక్షన్‌హాళ్లు, అతిథి గృహాల్లో బస ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం పెళ్లి వేడుకలన్నింటినీ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశంతో తమ వివాహాల కోసం ముందుగానే క్యాటరింగ్‌లకు, కల్యాణ మండపాలకు అడ్వాన్సులు చెల్లించిన వారు కంగుతిన్నారు. కొంత మంది పెళ్లి తేదీ వాయిదా వేసుకుంటుండగా.. మరికొంత మంది కల్యాణ వేదికను మరో చోటికి మార్చుకోవడం వంటివి చేస్తున్నారు. మరోవైపు జనవరి నుంచి మార్చి వరకూ సీజన్‌ కావడంతో పెళ్లిళ్లు రద్దు చేయడంపై ఫంక్షన్‌ హాళ్ల యజమానులు, క్యాటరింగ్‌ చేసే వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర్వుల ప్రకారం జనవరిలో కుంభ స్నానాలు మొదలయ్యే ఒక రోజు ముందు నుంచి మార్చిలో కార్యక్రమం ముగిసే తర్వాతి రోజు వరకూ పెళ్లిళ్ల వేడుకలు జరపకూడదు. కుంభమేళాలో భాగంగా దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో సాధువులు, మునులతో పాటు భక్తులు తరలి వస్తారు. ఈ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని గంగా నదిలో ఆరు రకాల స్నానాలు చేస్తారు. జనవరిలో మకర సంక్రాంతి, పుష్యమి పూర్ణిమ స్నానాలు, ఫిబ్రవరిలో మౌని అమావాస్య, బసంత్‌ పంచమి, మాఘీ పూర్ణిమ స్నానాలు, మార్చిలో మహా శివరాత్రి స్నానమాచరిస్తారు. కుంభమేళాలో భాగంగా గంగా నదిని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో కాన్పూర్‌లోని తోళ్ల పరిశ్రమలన్నీ ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది మార్చి 15 వరకూ మూసివేయాలని యోగి ఆదదిత్యనాథ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)