విద్యార్ధుల్లో సైన్స్ పట్ల అవగాహన పొందడం కోసం ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ విభాగాన్ని మైలవరంలో గురువారం నాడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. దీని ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి రూ.75 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలుకు 60కోట్ల రూపాయలకు పైగా విరాళం అందించిన డా. హనిమిరెడ్డి ఔదార్యం గొప్పదని ప్రశంసించారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు ముందుకు రావాలని మంత్రి ఉమా కోరారు. మైలవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ఖర్చుతో వివిధ సంస్థలను ఏర్పాటు చేస్తున్న డా.హనిమిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో సైన్స్ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్న అగస్త్య ఫౌండేషన్ మైలవరం ప్రాంతంలో విద్యార్ధుల కోసం శాఖను ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ రాంజీ రాఘవ మాట్లాడుతూ భారతదేశంలో పందొమ్మిది రాష్ట్రాల్లో 200 మొబైల్ వాహనాల ద్వారా అగస్త్య ఫౌండేషన్ విద్యార్ధులకు శాస్త్రీయ పరిశోధనల పైన శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 175 ఎకరాల స్థలంలో అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో ఆధునిక పరిశోధనశాలలను ఏర్పాటు చేసిన ఉపాద్యాయులు, విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ తాము సంపాదించిన దానిలో పేద విద్యార్ధులకు సహాయం చేయడం కోసం వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం కోసం ఎక్కువగా విరాళాలు ఇస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అగస్త్య ఫౌండేషన్ ఆద్వర్యంలో తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని హైస్కూల్ స్థాయి నుండి విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్నార్టీ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ జానకిరాం, డా.హనిమిరెడ్డి సతీమణి విజయలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల స్థానిక ప్రముఖుడు గోగులమూడి సత్యనారాయణరెడ్డి, ఎమ్మార్వో పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
