నేటి వాణిజ్య వార్తలు-01/04

*సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎమ్‌ఈ) ఆర్థిక సుస్థిరత నిమిత్తం చేపట్టాల్సిన దీర్ఘకాలిక చర్యలపై సూచనలు చేసేందుకు ఓ నిపుణుల కమిటీని ఆర్‌బీఐ ఏర్పాటు చేసింది.
*హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూపు ఐరోపాలోని తన అనుబంధ సంస్థ అయిన అమరాక్స్‌ లిమిటెడ్‌ ద్వారా స్పెయిన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న తర్బీస్‌ ఫార్మా, ఎస్‌ఎల్‌యూ., అనే కంపెనీని కొనుగోలు చేసింది. స్పెయిన్‌లో ఔషధ తయారీ, విక్రయ కార్యకలాపాల్లో తర్బీస్‌ ఫార్మా క్రియాశీలక సంస్థ. దీని వార్షిక ఆదాయాలు 11 మిలియన్‌ యూరోల (దాదాపు రూ.88 కోట్లు) మేరకు ఉన్నాయి.
*హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాల కంపెనీ ఎన్‌సీసీ లిమిటెడ్‌కు రూ.2,890.7 కోట్ల విలువైన నిర్మాణ కాంట్రాక్టులు దక్కాయి.
*ఇంజినీరింగ్‌ విభాగాల్లో సేవలు అందిస్తున్న పెన్నార్‌ గ్రూపు రూ.309 కోట్ల విలువైన ఆర్డర్లు సంపాదించింది. రైల్వేస్‌కు చెందిన ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, మెడరన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, పారిశ్రామిక విడిభాగాలు తయారు చేసే సంస్థలైన ఎమర్సన్‌, ఎండ్యూరెన్స్‌, ఫైర్‌స్టోన్‌తో పాటు ఎల్‌అండ్‌టీ, పీఎస్‌ ఇంజనీర్స్‌, ఐఎఫ్‌బీ, ఎల్‌జీ బాలకృష్ణన్‌… తదితర సంస్థల నుంచి పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు రూ.124 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. పెన్నార్‌ ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌ (పెబ్స్‌ పెన్నార్‌) కు మరో రూ.125 కోట్ల ఆర్డర్లు లభించాయి. నీటి శుద్ధి కేంద్రాల డిజైన్‌, తయారీకి సంబంధించి పెన్నార్‌ ఎన్విరోకు రూ.60 కోట్ల ఆర్డర్లు దక్కాయి.
* శ్రీనివాస ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వైస్‌ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన సురేష్‌ రాయుడు అఖిల భారత పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోషియేషన్‌ (ఏఐపీబీఏ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
* ఫ్లిప్‌కార్ట్‌లో వాటాను వాల్‌మార్‌కు విక్రయించడం ద్వారా ఆర్జించిన మూలధన లాభాలపై పన్నును ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ ఈ లావాదేవీ కంటే ముందుగానే చెల్లించినట్లు తెలుస్తోంది.
*రిలయన్స్‌ జియోకు గత అక్టోబరులో మరో కోటి మందికి పైగా కొత్త చందాదార్లు జతయ్యారని, దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 26.28 కోట్లకు చేరిందని టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) వెల్లడించింది.
*నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, గృహాలపై జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే జీఎస్‌టీ మండలి తదుపరి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని ఓ అధికారి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)