తానా అధ్యక్షుడిగా పని చేసేవారికి వారి పదవీ కాలంలో రెండు సవాళ్లు ఎదురవుతాయి. ఒకటి తానా మహాసభలను మూడురోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడం. రెండవది దానికి ఆరునెలల ముందు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే తానా చైతన్య స్రవంతిని సమర్థవంతంగా పూర్తి చేయడం. ప్రస్తుతం తానా ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గతనెల 23వ తేదీ నుండి తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత తానా అధ్యక్షుడు వేమన సతీష్ తన జన్మభూమి కడప జిల్లా రాజంపేటలో 5వ తేదీ శనివారం తానా బ్యానర్ తో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా ఇది సతీష్ తన సత్తాను ప్రదర్శించే కార్యక్రమం ఇది. రాజంపేట చైతన్య స్రవంతికి వేమన సతీష్ తానా కార్యవర్గం మొత్తాన్ని ఆహ్వానించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా సతీష్ ఏర్పాట్లు చేశారు. రాజంపేట పట్టణంలో సతీష్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి నిర్వహించే భారీ ప్రదర్శన ఆ పట్టణం చరిత్రలో నిలిచిపోయే విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 500 మంది వివిధ రకాల కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ కళలను ప్రదర్శిస్తున్నారు. సినీ నటులు నారారోహిత్, సునీల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగే తానా మహాసభల కన్వీనర్ ప్రొఫెసర్.మూల్పురి వెంకట్రావు, రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు రాజంపేట చైతన్య స్రవంతికి హాజరవుతున్నారు.
