టీ తా గకపోతే ఏ పనీ చేయలేరు కొందరు. అలాగని మితిమీరి తాగడం మంచిది కాదు. అలా సాధారణ టీలకు తాగే బదులు హెర్బల్ టీలను ఎంచుకుంటే ఆరోగ్యానికి మేలంటున్నారు నిపుణులు.తులసి, నిమ్మగడ్డి, పుదీనా… ఇలా చెప్పాలంటే బోలెడన్ని ఆకులు… చామంతి, బంతి, మల్లె, మందార, గులాబీ వంటి పూలు.. మనకి విరివిగా అందుబాటులో ఉంటాయి. వీటిని ఆహారంలో వాడటంతో పాటు అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వినియోగిస్తాం. అయితే వీటితో టీలను కూడా తయారు చేసుకోవచ్చు. విదేశాల్లో ఇప్పటికే ఇవి ప్రాచుర్యంలో ఉన్నాయి. మన దగ్గరా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్నాయి. ఈ టీల తయారీ కోసం నాణ్యమైన పూలను, ఆకులను మొదటి దశలోనే సేకరిస్తారు. వాటిని ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెడతారు. ఇలా సిద్ధం చేసిన పూలు/ఆకులను వేణ్ణీళ్లలో వేసి కాస్త తేనె, యాలకులపొడి లేదా అల్లం కలిపి తాగితే చాలు. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. శరీరంలోని ఫ్రీరాఢికల్స్తో పోరాడతాయి. ట్రైగ్లిజరాయిడ్ల సంఖ్యను తగ్గిస్తాయి. చక్కటి నిద్రకు సాయపడతాయి. నెలసరి నొప్పులకు ఉపశమనం కలిగిస్తాయి. పరగడుపున వేడివేడిగా ఈ హెర్బల్ టీలను తాగితే వీటిల్లో ఉండే విటమిన్ సి జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తుంది. పని ఎక్కువగా ఉన్నప్పుడు తాగితే ఒత్తిడి అదుపులోకి వస్తుంది.
