షేర్లు ఇలా కొనండి-వాణిజ్య-01/24

*షేర్లు కొనుగోలు చేయాలంటే ముందు మీకు డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. కొన్ని స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు, కొన్ని బ్యాంకులు డీమ్యాట్‌ ఖాతాను ఉచితంగా అందిస్తున్నాయి. మంచి స్టాక్‌ బ్రోకర్‌లను ఎంచుకోవడం ముందుగా మీరు చేయాల్సిన పని. దీనికోసం ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, మొబిల్లాలోక్‌పాల్‌, ఏంజిల్‌ బ్రోకింగ్‌, ఇండియా ఇన్‌ఫో లైన్‌, క్వారీ… ఇలాంటివి పరిశీలించవచ్చు. వీటిని ఎంచుకునే సమయంలో ఆ సంస్థలు కొంత నిర్ణీత మొత్తాన్ని రుసుముగా తీసుకుంటాయి. షేర్ల కొనుగోలు, అమ్మకంపైనా అవగాహన అందిస్తాయి. అవి తెలిశాక ఆ సంస్థలు అందించే సేవల గురించీ తెలుసుకోవాలి. అదయ్యాక ఓ డీమ్యాట్‌ ఖాతా తెరవండి. దీన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఉపయోగించొచ్చు. ఇంట్లోనే కూర్చుని సంబంధిత సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని కంప్యూటర్‌ ద్వారా ట్రేడింగ్‌ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇబ్బంది అనుకుంటే సంస్థకు ఫోన్‌ చేస్తే వారే ఏ షేర్లు కొనాలో, కొనకూడదో చెబుతుంటారు. లేదా వాళ్లే ఆర్డర్‌ పెట్టేస్తారు.
***షేర్లు కొనాలంటే…
ముందుగా కొంత మొత్తాన్ని మన డీమ్యాట్‌ ఖాతాలోకి బదిలీ చేసుకోవాలి. అప్పుడే ఏవి ఎంతలో కొనాలనేది నిర్ణయించుకోవచ్చు. షేర్లు మూడు రకాలుగా ఉంటాయి. అవి లార్జ్‌ క్యాప్‌ (పెద్ద కంపెనీలు), మిడ్‌ క్యాప్‌(మధ్యస్థ సంస్థలు), స్మాల్‌ క్యాప్‌ (చిన్న కంపెనీలు). బ్యాంకు, ఫార్మా, ఐటీ, స్టీలు లాంటి విభిన్న రంగాలున్నాయి. అందులో కూడా మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని దానికి సంబంధించిన కంపెనీని కూడా ఎంచుకోవచ్చు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌, ఐసీఐసీఐ, రిలయెన్స్‌… ఇవన్నీ లార్డ్‌ క్యాప్‌ కిందకు వస్తాయి. పెద్ద కంపెనీల్లో నష్టభయం తక్కువగా, చిన్న వాటిలో ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో ఒడిదొడుకులుంటాయి. నష్టభయం కూడా ఉంటుంది. దానికి సిద్ధంగా ఉంటామనుకుంటేనే ఈ రంగంలోకి అడుగు పెట్టాలి. మొదటిసారి కాబట్టి పెద్ద కంపెనీల షేర్లను కొనడమే మంచిది. చాలా ఏళ్ల నుంచి పెద్ద స్థాయిలో మార్కెట్‌లో ఉన్న సంస్థల షేర్లు కొనడమే మంచిది. మీ షేర్లను ఏ పద్ధతిలో పెట్టాలో అంటే దీర్ఘకాలమా, తక్కువ కాలమా అనేదీ ముఖ్యమే. అలాగే ఒకేరోజు కొని అదేరోజు అమ్మాలనుకుంటున్నారా అనేదీ ఆలోచించుకోవాలి. తక్కువ కాలం అంటే రెండు మూడు నెలల్లో మీ షేర్లను అమ్ముకోవచ్చు. అదే దీర్ఘకాలం అయితే అయిదేళ్లు, పది సంవత్సరాల పాటు కదపకుండా అలాగే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
*స్టాక్‌ మార్కెట్‌లో ఈక్విటీ (క్యాష్‌) సిగ్మెంట్‌, డెరివేటివ్‌ సిగ్మెంట్‌ అని ఉంటాయి. క్యాష్‌ సిగ్మెంట్‌లో డబ్బులు ఇచ్చి షేర్లు కొనుక్కుంటాం. డెరివేటివ్‌లో అయితే ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ ఉంటాయి. మొదటిసారి షేర్లు కొనేవారు డెరివేటివ్‌ని ఎంచుకోకపోవడమే మంచిది. స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కొన్న షేర్ల విలువల మార్కెట్‌లో ఎలా ఉందనేది గమనించుకోవాలి. స్టాక్‌ మార్కెట్‌లో అనుభవం ఉన్నవారి నుంచే కాదు, ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్నాకే నిర్ణయించుకోండి.
*ఆన్‌లైన్‌ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ మరోసారి తమ ప్రత్యేకత చాటుకుంది. గతేడాది భారత్‌లో సానుకూల అంశాలను బలంగా సృష్టించిన బ్రాండ్‌లలో గూగుల్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ రెండో స్థానంలో, గూగుల్‌కే చెందిన యూట్యూబ్‌ మూడో స్థానంలో నిలిచాయి. ఇంగ్లాండ్‌ కేంద్రంగా పనిచేసే ఆన్‌లైన్‌ మార్కెట్‌ పరిశోధన, డేటా అనలిటిక్స్‌ సంస్థ యూగవ్‌ నివేదికలో ఈ విషయాలను పేర్కొంది
*డిసెంబరు 2018తో ముగిసిన త్రైమాసికంలో రేమండ్‌ గ్రూప్‌ ఏకీకృత నికర లాభం 30 శాతం మేర పెరిగి రూ.39.95 కోట్లకు చేరింది.
*టవర్ల నిర్వహణ సంస్థ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.648 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ మూడో త్రైమాసికంలోనూ డీలా పడింది. అధిక ముడి చమురు ధరలు, గట్టి పోటీ నేపథ్యంలో డిసెంబరు 31, 2018తో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ నికర లాభం రూ.191 కోట్లకు పరిమితమైంది.
*వొడాఫోన్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌లు వొడాఫోన్‌ ఐడియాలోకి రూ.18,000 కోట్ల నిధులను పంపించనున్నాయి. జియోతో పోటీని తట్టుకోవడం కోసం రైట్స్‌ ఇష్యూ ద్వారా ఈ పనిచేయనున్నాయి.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో విజయా బ్యాంక్‌ రూ.143.38 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) ఏకీకృత ప్రాతిపదికన రూ.341 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.
*జీఎస్‌టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు ఒక జాతీయ ధర్మాసనం(బెంచ్‌) ఏర్పాటు చేయడానికి కేంద్రమంత్రి మండలి(కేబినెట్‌) ఆమోద ముద్ర వేసింది.
*ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. 2019, 2020ల్లో చైనా కంటే ముందంజలో నిలవనుందని అభిప్రాయపడింది.
*ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌కు మరో ఘనత లభించింది. అంతర్జాతీయంగా శక్తిమంత రిటైల్‌ దిగ్గజాలతో డెలాయిట్‌ రూపొందించిన ‘గ్లోబల్‌ పవర్స్‌ ఆఫ్‌ రిటైలింగ్‌ 2019’ జాబితాలో ఒకేసారి 95 స్థానాలు పైకి చేరి, 94వ స్థానం పొందింది.
*ఒక వస్తువును ఒక చోట నుంచి మరో చోటికి చేరవేయడం, డ్రై క్లీనింగ్‌ నుంచి దుస్తులను తీసుకురావడం, మందులు, కిరాణా సరకులను ఇంటికి తెచ్చివ్వడం, బ్యాంకులో చెక్కులు డిపాజిట్‌ చేయడం, నగదు తీసుకువచ్చి అందించడం ఇలా పని ఏదైనా సహాయం చేసేందుకు ‘విజ్జీ’ యాప్‌ అందుబాటులోకి వచ్చింది.
*ఇంట్లో వండిన ఆహార పదార్థాలను విక్రయించాలని భావించే వారిని ప్రోత్సహించి, వారికి మార్కెటింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తోన్న బెంగళూరు అంకురం ఫుడ్డీబడ్డీ హైదరాబాద్‌ల తన సేవలను ప్రారంభించింది. వంటలపై ఇష్టం ఉన్న వారిని, ఇంటి వంటలను కోరుకునే వారినీ ఒక చోటకు చేర్చడం ద్వారా ఇది వ్యాపార అవకాశాన్ని కల్పిస్తుంది.
*మారుతీ సుజుకీ హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ వ్యాగన్‌ఆర్‌లో కొత్త వెర్షన్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధరల శ్రేణి రూ.4.19- 5.69 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు.
*నిస్సాన్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) కిక్స్‌ను తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిస్సాన్‌ డీలర్‌ నెట్‌వర్క్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ శహానే మాట్లాడుతూ.. ఈ ఏడాది మరిన్ని కొత్త కార్లను విపణిలోకి తీసుకొస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)