కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ లో తెలుగు కల్చరల్ అసోసియేషన్ పేరుతొ మన తెలుగు వారు 1958లో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థ కోసం 1992లో ఎనిమిది సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి ఒక భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో ఆంధ్ర కళా నిలయం పేరుతొ 2003లో ఒక ఆడిటోరియం ను కూడా నిర్మించారు. 2008లో కొచ్చిన్ తెలుగు సంఘం ఏర్పడి యాభై ఏళ్ళయిన సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఈ సంస్థ ఆద్వర్యంలో అన్ని తెలుగు పండగలకు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొచ్చిన్ లోని ఆంధ్రా కల్చరల్ అసోసియేషన్ ఏర్పడి అరవై సంవత్సరాలు అయిన సందర్భంగా వచ్చే 2వ తేదీన పెద్ద ఎత్తున డైమాండ్ జుబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అద్యక్ష, కార్యదర్శులు ఎస్. సంజయ్, ఎం. హరిహరనాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ప్రారంభిస్తారు. సినీ గేయ రచయిత చంద్రబోస్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషాద్రినాయుడు, కొచ్చిన్ డీసీపీ హిమేంద్రనాద్, అలెప్పి సబ్ కలెక్టర్ కృష్ణతేజ, కోచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ డిప్యుటీ చైర్మన్ వెంకటరమణ తదితరులను ఈ సందర్భంగా సన్మానిస్తున్నారు. అనంతరం సాంస్కృతిక ఉత్సవాలు ఏర్పాటు చేసారు.
