సింగపూర్‌లో తాడేపల్లిగూడెం బుర్రకథ

సింగపూర్‌ తెలుగు సమాజం వారి ఆధ్వర్యంలో స్థానిక గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ స్మార్ట్‌ క్యాంపస్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగువారి భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్‌ తెలుగు సమాజం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించింది. బొంగరాలు, గోలీలు, గాలిపటాలు, రంగవల్లుల పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. హరిదాసు, సోది, పిట్టలదొర ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తెలుగు వారందరినీ అలరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ తాడేపల్లిగూడెం యడవల్లి శ్రీదేవి బుర్రకథా బృందం వారు చెప్పిన బుర్రకథ అత్యంత ఆదరణ పొందింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తెలుగు బుట్టబొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం సింగపూర్‌ కాలమానంలో ప్రచురించిన సింగపూర్‌ తెలుగు 2019 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సింగపూర్‌లో తొలిసారిగా మన రేడియో వారి భాగస్వామ్యంతో తెలుగు వారికి ప్రత్యేకంగా ఎస్‌టీఎస్‌ మన రేడియోని ప్రారంభించారు. సంక్రాంతి తెలుగు పిండివంటలు, వంటకాలు సింగపూర్‌ వాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భోగి పండగ సందర్భంగా సుమారు వెయ్యి మందికి రేగిపండ్ల ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు నిర్వాకులు నాగేష్‌ టేకూరి తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ సింగపూర్‌ తెలుగు సమాజం కార్యదర్శి సత్యచిర్ల కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)