టెన్నిస్సీ తెలుగు సమితి సంక్రాంతి వేడుకలు

అమెరికాలోని టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక విఘ్నేశ్వరుని గుడిలో దీప్తి రెడ్డి దొడ్ల అధ్యక్షతన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం నిర్వహణలో జరిగిన ఈ వేడుకల్లో 600 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. జ్యోతి ప్రజ్వలనతో మొదలైన వేడుకల్లో ముగ్గుల పోటీలలో భాగంగా తెలుగు ఆడపడుచులు పోటాపోటీగా వేసిన ముగ్గులు పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేశాయి. బొమ్మల కొలువు, చిత్రలేఖనం, చర్చా వేదిక తదితర పోటీలలో పిల్లలు పాల్గొన్నారు. పిల్లలకు భోగిపళ్లు శాస్త్రోక్తంగా నిర్వహించడంతో ముసి ముసి నవ్వులతో కేరింతలు కొట్టారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆటల పోటీల విజేతలకు ట్రోపీలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు వంటి వివిధ పోటీల విజేతలకు బహుమతులు, ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుడీ బ్యాగ్స్ అందజేశారు. అలాగే కళా రంగానికి చేస్తున్న సేవలకు గాను మోనికా కూలేని సత్కరించారు. పాత కొత్త పాటలతో గాయకులు సందీప్ కూరపాటి, గాయని శృతి నండూరిలు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినీ పాటలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇండియా నుంచి తెప్పించిన సంక్రాంతి స్పెషల్ అరిసెలతోపాటు అమరావతి రెస్టారెంట్ వారు అందించిన పసందైన విందు భోజనాన్ని అందరూ ఆస్వాదించారు. అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేకించి యూత్ కమిటీ సభ్యులను టెన్నెస్సీ తెలుగు సమితి సేవా కార్యక్రమాలవైపు ప్రోత్సహిస్తున్న వారి తల్లితండ్రులను కొనియాడారు. అలాగే ఈ వేడుకల నిర్వహణలో సహాయం చేసిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులు, ఆడియో సహకారం అందించిన డీజే శ్రీమంత్ బృందావనం, వీడియో, ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్ జానర్ తదితరులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)