కొచ్చిన్ ఆంధ్రా సంఘం ఏర్పడి 60ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా శనివారం రాత్రి డైమండ్ జూబ్లీ వేడుకలను కొచ్చిన సీతారామ కళ్యాణ మండపంలో కోలాహలంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరయిన ఏపీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కన్నా విదేశాల్లో, పొరుగు రాష్ట్రాల్లోన్నూ నివసిస్తున్న ప్రవాస తెలుగువారు మన భాషా సంస్కృతులకు జీవం పోస్తున్నారని తెలిపారు. కొచ్చిన్ ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు భాష, సేవా కార్యక్రమాలు మిగిలిన తెలుగు సంఘాలకు ఆదర్శంగా నిలుస్తాయని, కేరళకు తుఫాను వచ్చిన సమయంలో కొచ్చిన్ ఆంధ్రా సంఘం బాధితులకు అందించిన సహకారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బుద్ధప్రసాద్ కొనియాడారు. ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్ మాట్లాడుతూ తాను ఇప్పటివరకు 3300 సినీగీతాలు రాశానని, వాటిలో చాలావరకు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని తెలిపారు. కేరళ అన్నా ఇక్కడి ప్రకృతి అన్నా తనకు చాలా ఇష్టమని భగవంతుడు అనుగ్రహిస్తే కేరళలో ఒక గృహాన్ని నిర్మించుకుంటానని చంద్రబోస్ పేర్కొన్నారు. ఆయన రచించిన ప్రాచుర్యం పొందిన చాలా గీతాలను ఆలపించి కొచ్చిన్ తెలుగువారిని అలరించారు. తెలుగువారైన కొచ్చిన్ డీసీపీ, ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్, స్థానిక హిందూస్థాన్ న్యూస్‌ప్రింట్ ఎండీ గోపాలరావు, TNI డైరక్టర్ కిలారు ముద్దుకృష్ణ తదితరులు ప్రసంగించారు. కొచ్చిన్ ఆంధ్రా సంఘం అధ్యక్ష కార్యదర్శులు హరిహరనాయుడు, సంజయ్ తదితరులు సంస్థ కార్యకలాపాల గురించి వెల్లడించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
