కేరళ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన వారికి దివిసీమ విద్యాసంస్థల అందించిన విరాళాలతో నిర్మించిన గృహాలను ఏపీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ శనివారం నాడు ప్రారంభించారు. పాతాళం ప్రాంతంలో కొచ్చిన్ ఆంధ్రా సంఘం సహకారంతో అతి పేదవారి కోసం నిర్మించిన 16 గృహాలను ఆయన సందర్శించి మాట్లాడారు. వరద ప్రమాదం సంభవించినప్పుడు గతేడాది సెప్టెంబరులో దివిసీమ విద్యాసంస్థల నిర్వాహకులు కొండవీటి ఈశ్వరరావు, ఉమామహేశ్వరరావు తదితరులతో కలిసి తాము ఈ ప్రాంతాన్ని సందర్శించి చలించిపోయాయమ్ని, అందుకే కొచ్చిన్ ఆంధ్రా సంఘం నిర్వాహకులతో సమన్వయం అయి 16గృహాలను నిర్మించాలని సంకల్పించి ఆ దిశగా నూతన గృహాలను నిర్మించామని బుద్ధప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి దివిసీమ విద్యాసంస్థల తరఫున ₹15లక్షలను ఆయన కొచ్చిన్ ఆంధ్రా సంఘం నిర్వాహకులకు అందజేశారు. విద్యార్థినీ విద్యార్థుల విరాళ నిధులు సద్వినియోగం అయినందుకు ఈ కార్యక్రమం తమకు ఎంతో తృప్తిని ఇచ్చిందని బుద్ధప్రసాద్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు రహీమ, జొసెఫ్ షెర్రీ, ST గ్రూపు ఉపాధ్యక్షుడు అజిత్ తదితరులు దివిసీమ విద్యార్థినీ విద్యార్థులకు తమ ధన్యవాదాలు తెలిపారు.
