కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టర్‌గా ఐపీఎస్ అధికారి రిషి కుమార్ శుక్లా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్లాను ఎంపిక చేసింది. శుక్లా నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. శుక్లా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. శుక్లా గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు.
శుక్లా 1983 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ పోస్ట్‌కు 1984 బ్యాచ్‌కు చెందిన జావేద్ అహ్మద్, రజనీ కాంత్ మిశ్రా, ఎస్ఎస్ దేశ్వాల్ పేర్లు కూడా వినిపించాయి. శుక్లా రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. వివాదాలతో కాస్త మసకబారిన సీబీఐకు పూర్వ వైభవాన్ని తీసుకురావడం ప్రస్తుతం ఆయన ముందున్న అతిపెద్ద సవాలు.
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను తాత్కాలిక డైరెక్టర్‌తో నడిపించడంపై శుక్రవారం సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ఆదేశించింది. సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మను కేంద్రం వేరే విభాగానికి బదిలీ చేయడంతో జనవరి 10 నుంచి ఆ పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. ఆలోక్ వర్మ, జాయింట్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా మధ్య వివాదం జరగడంతో కేంద్రం కలగజేసుకొని వారిద్దరిని సెలవుపై పంపించింది. అనంతరం సుప్రీం జోక్యంతో ఏర్పడిన సెలక్షన్ కమిటీ ఆలోక్ వర్మను ఫైర్ విభాగానికి డీజీగా బదిలీ చేసింది. ఆ బాధ్యతలు స్వీకరించడం ఇష్టం లేని ఆలోక్ తన సర్వీసెస్‌కు రాజీనామా చేశారు.