తామా గణతంత్ర వేడుకలు


అట్లాంటాలో తామా ఆధ్వర్యంలో ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనవరి 26న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ ఆధ్వర్యంలో భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనబడి తెలుగు తరగతులు నిర్వహించే స్థానిక దేశానా మిడిల్ స్కూల్లో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 300 మంది బాలబాలికలు మరియు 200 మంది పెద్దలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ముందుగా తామా అధ్యక్షులు వెంకీ గద్దె స్వాగతోపన్యాసం చేస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యం గురించి వివరించారు. సిలికానాంధ్ర మనబడి ప్రతినిధి విజయ్ రావిళ్ల గారు మరియు ఉపాధ్యాయులకు తామా చైర్మన్ వినయ్ మద్దినేని పుష్పగుచ్ఛాలు అందజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ వంటి దేశభక్తి గీతాలను శ్రద్ధగా ఆలపించారు. తదనంతరం విజయ్ రావిళ్ల గారు జండా వందనం గావించగా అందరూ జాతీయగీతం ఆలపించి భారతావనిపై తమకున్న గౌరవాన్ని తెలియజెప్పారు.

వాతావరణం చాలా చల్లగా వున్నప్పటికీ ప్రతి సంవత్సరం కంటే అత్యధికంగా 500 మందికి పైగా పాల్గొనడం విశేషం అంటూ అక్కడికి విచ్చేసిన అందరూ తామా కార్యవర్గాన్ని కొనియాడారు. ఇంతమంది తెలుగు వారు ఇలా మన జాతీయ పండుగను చేసుకోవటం హర్షణీయం అని ప్రశంసించారు. ఈ కార్యక్రమం భారత దేశంలో చిన్నప్పుడు తమ బడులలో జరిగినట్లు ఉందని, ఆ రోజులను తామా వారు తమకు గుర్తుచేసినందుకు మరియు తమ పిల్లలు ఇందులో భాగం కావటం పట్ల చాలా మంది పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పిల్లలకు గుడీ బాగ్స్ మరియు పెద్దలకు స్నాక్స్ అందించారు. చివరిగా స్నాక్స్ స్పాన్సర్ చేసిన అట్లాంటా ఫుడ్ డిస్ట్రిబ్యూటర్స్, వేడుకల నిర్వహణలో సహకరించిన తోటి తామా కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యులు, మనబడి సమన్వయకర్తలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు ఈ కార్యక్రమాన్నిఅట్లాంటా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో పాల్గొని విజయవంతం చేసిన ఆహుతులందరికి తామా అధ్యక్షులు వెంకీ గద్దె కృతజ్ఞతాభినందనలు తెలియజేసి ముగించారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)