అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులు అందరూ క్షేమంగా ఉన్నట్లు ‘అటా’ అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి తెలిపారు. భారతీయ ఎంబసీ అధికారులు, హోంల్యాండ్ సెక్రటరీ అధికారులను కలిసి విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని తెలిపారు. ఒకే సెల్లో పాతిక మందిని వరకు ఉంచిన మాట వాస్తవమైనప్పటికీ, వారిని హింసిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పోలీసు సిబ్బంది కూడా తమకు సహకరిస్తున్నారని ఆయన వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా అవసరం అయితే అటా హెల్ప్‌లైన్ నంబర్ 8442827382 ఫోన్ చేయాల్సిందిగా ఆయన కోరారు. అటా, ఇతర సంఘాల తరఫున వివిధ ప్రాంతాల్లోని డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్న విద్యార్థులను కలిసినట్లు ఆయన వెల్లడించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వల పన్ని, నకిలీ వర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థి వీసాలను దుర్వినియోగం చేస్తున్న 130 మంది విద్యార్థులతో పాటు ఎనిమిది మంది దళారులను బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన విద్యార్థుల్లో ఒక్కరు మినహా అందరూ భారతీయులే. అరెస్టు చేసిన వారిని విచారణ చేసిన అనంతరం స్వదేశానికి పంపిస్తారని, ఎవరూ ఆందోళన చెందకూడదని ‘అటా’ అధ్యక్షుడు తెలిపారు.
