ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పురుషులతో సమానంగా మహిళలు కూడా అమెరికా లాంటి ఇతర దేశాలకు వెళ్లి వారితో పోటీగా విద్యా, ఉద్యోగాల్లో వారితో సమానంగా రాణిస్తున్నారు. కానీ పెద్ద పెద్ద తెలుగు సంఘాల్లో మాత్రం మహిళల క్రీయాశీలక పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. తానా, నాట్స్, ఆటా, నాటా వంటి తెలుగు సంస్థల కార్యవర్గ పదవుల్లో మహిళల పాత్ర మొక్కుబడిగానే ఉంటోంది. ఇటీవల అమెరికాలో పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తానా కార్యవర్గానికి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. నలభై స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క దేవినేని లక్ష్మీ మాత్రమే కీలకమైన పదవికి ఎన్నికయ్యారు. మహిళా కన్వీనర్ పదవికి మహిళే ఉండాలి కనుక ఆ పదవిని అదృష్టవశాత్తు మహిళలకే దయతలిచి వదిలేశారు. మిగిలిన అన్ని పదవులకు మగ మహారాజులే ఎన్నికయ్యారు. కొద్ది సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిన టాటా లాంటి తెలుగు సంస్థకు ఒక మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికైనప్పటికి ఆవిడ ఆ పదవి నుండి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా తెలుగు సంఘాల వారు మహిళలకు కార్యవర్గ పదవుల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
