ఎంపీ సీటు కోసం రెండు సార్లు వివేకాను కొట్టిన జగన్

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం ద్వారా జగన్‌ సానుభూతి పొందాలని చూస్తున్నారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ పేర్కొన్నారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని కూడా అలాగే ఉపయోగించుకోవాలని చూశారన్నారు. వివేకానందరెడ్డి మరణానంతర పరిణామాలపై ఆయన ఫేస్‌బుక్‌లో కామెంట్లను పోస్టు చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన బాబాయి వివేకానందరెడ్డిపై రెండుసార్లు చేయిచేసుకున్నారని..ఈ విషయం తనతో పాటు అప్పట్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు అందరికీ తెలుసునని హర్షకుమార్‌ అందులో వెల్లడించారు. 2006లో వైఎస్‌ వివేకానందరెడ్డి రాజీనామా విషయంలో జరిగిన సంఘటనను ఆయన ప్రస్తావించారు. ‘కాంగ్రెస్‌ ఎంపీలంతా పార్లమెంటు సెంట్రల్‌హాలులో ఉన్న సమయంలో రాజంపేట ఎంపీ సాయిప్రతాప్‌కు ఫోన్‌ వచ్చింది. నేను వెంటనే వెళ్లాలి.. మన వివేకా రాజీనామా చేశాడు. ఎయిర్‌పోర్టుకి వెళ్తున్నాడు. సోనియాగాంధీ ఆయనను తీసుకురమ్మన్నారని చెబుతూ.. ఆయన వివేకానందరెడ్డిని విమానాశ్రయం నుంచి తీసుకొచ్చిన విషయాన్ని’ గుర్తుచేశారు. ‘వివేకానందరెడ్డి ఎవరికీ తెలియకుండా స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ వద్దకు వెళ్లి రాజీనామా చేసి నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. దీంతో స్పీకర్‌ వెంటనే సోనియాగాంధీకి ఫోన్‌చేసి విషయం చెప్పారు. సాయిప్రతాప్‌ ద్వారా వివేకాను పిలిపించి సోనియా కారణం అడిగితే..ఇది మా నాన్న సీటు నువ్వు ఎంత కాలం ఉంటావ్‌ అని అప్పటికే రెండుసార్లు జగన్‌ తనపై చేయిచేసుకున్నాడు’ అని మేడంకు వివేకానందరెడ్డి వివరించారని వెల్లడించారు. సోనియాగాంధీ వెంటనే రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌ చేసి ‘మీ కొడుకును కంట్రోల్‌లో పెట్టుకోండి.. ఇలా చేస్తే జగన్‌కు సీటు ఇవ్వనని హెచ్చరించగా.. తాను చెబుతూనే ఉన్నానంటూ సోనియాకు వైఎస్‌ క్షమాపణ కూడా చెప్పారు’ అని తెలిపారు. 2009లో జగన్‌ ఎంపీ అయ్యారని, ఈ విషయాలన్నీ అప్పటి రాష్ట్ర ఎంపీలందరికీ తెలుసని ఫేస్‌బుక్‌లో హర్షకుమార్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని హర్షకుమార్‌ వద్ద ప్రస్తావించగా ‘ఫేస్‌బుక్‌లో నేనే పోస్టు చేశానని.. ఇది కొత్త విషయం కాదని, అప్పట్లో అందరికీ తెలిసిందేనని’ ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)