పాక్ అణు స్థావరంలో ప్రమాదం

అణుపాటవ దేశాలు తమ అణ్వాయుధాలను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. కానీ పాక్‌ పరిస్థితి వేరు. ఆ దేశంలో అణుటెక్నాలజీ కూడా సరిహద్దులు దాటేస్తుంది. ఉత్తరకొరియా అణుకార్యక్రమం పాక్‌ పాపమేనని అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ దేశంలోని కీలకమైన అణుస్థావరంలో ప్రమాదం చోటు చేసుకొందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదీ జరిగినా బాహ్య ప్రపంచానికి తెలియనీయని పాక్‌ ఇప్పుడు ప్రమాదం విషయాన్ని కూడా తొక్కిపడుతోంది. తాజాగా అక్కడి ఉపగ్రహ చిత్రాలను ఒక ఆంగ్లపత్రిక బహిర్గతం చేసింది.
ఫిబ్రవరి 26 దాడుల తర్వాత పాక్‌ అణుస్థావరాల్లో ఏమైనా కదలిక వచ్చిందా అని నిపుణులు పరిశీలించారు. దీనికోసం వారు పలు ఉపగ్రహ చిత్రాలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా బలోచిస్థాన్‌ ప్రాంతంలో ఖుస్దార్‌ అణ్వాయుధ కేంద్రంలో చిత్రాలు తేడాగా అనిపించాయి. ఖుస్దార్‌ అణ్వాయుధ కేంద్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. ఇక్కడి నిర్మాణాలను తీరును బట్టి 46 అణవార్‌ హెడ్లను భద్రపర్చినట్లు భావిస్తున్నారు. వాస్తవానికి 200 వార్‌హెడ్లను, క్షిపణులను భద్రపర్చే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. మార్చి 8వ తేదీన ఇక్కడి శాటిలైట్‌ చిత్రాలను పరిశీలించిన వారికి 200 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో అగ్నిప్రమాదం జరిగినట్లు నల్లటి మచ్చ కనిపించింది. అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వాడే క్షిపణి ఏదైనా ప్రమాదానికి గురై పేలి ఉండవచ్చని భావిస్తున్నారు. కచ్చితంగా ఇక్కడ ఏం జరిగిందో మాత్రం అంచనాకు రాలేకపోతున్నారు. అక్కడ నిజంగా ప్రమాదం జరిగితే కనుక అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)