రాజీవ్ హంతకులను విడిపిస్తాం!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడిపించేందుకు కృషి చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే పార్టీ హామీ ఇచ్చింది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ మంగళవారం విడుదల చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టే సంకీర్ణ కూటమిలో తమ పార్టీ ఉంటే.. రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడిపించేందుకు డీఎంకే కచ్చితంగా ప్రయత్నాలు చేస్తుందని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. శ్రీలంక శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని, వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్‌ను రద్దు చేస్తామని, ప్రయివేటు రంగాల్లో రిజర్వేషన్‌ కోటాను తీసుకొస్తామని డీఎంకే హామీలు కురిపించింది. దీంతో పాటు విద్యార్థులు తీసుకున్న విద్యా రుణాలను కూడా మాఫీ చేస్తామని పేర్కొంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని, మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని హమీ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో డీఎంకే.. కాంగ్రెస్‌, ఇతర చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా డీఎంకే 20 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మిగతా 19 సీట్లను కూటమి పార్టీలకు కేటాయించింది. ఏప్రిల్‌ 18న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)