జమ్మలమడుగులో ఉద్రిక్తత–తాజావార్తలు–03/19

*కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జమ్మలమడుగు పట్టణం సంజామల మోటు వద్ద ఆగి ఉన్న వైకాపా నేత మహేశ్వర్‌ రెడ్డి కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాహనాన్ని ధ్వంసం చేసింది తెదేపాకు చెందిన రామసుబ్బారెడ్డి వర్గీయులేనని వైకాపా నేతలు అవినాశ్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి ఆరోపించారు. జమ్మలమడుగు పట్టణ పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆ వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న వైకాపా కార్యకర్తలంతా ఒక్కసారిగా పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకోవడంతో.. అక్కడ తీవ్ర ఉద్రిత్త పరిస్థితి తలెత్తింది. దీంతో అప్రమత్తమైన జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణన్‌ కేంద్ర బలగాలను మోహరించి పరిస్థితిని అదుపుచేశారు.
*దేశంలో ఏం జరుగుతుందో, ఏం జరగాలో తాను చెబుతుంటే కాంగ్రెస్‌, భాజపా పీఠాలు కదిలిపోతున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. తాను కరీంనగర్‌ సభలో చెప్పిన మాటలపై సోషల్‌మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫెడరల్‌ ఫ్రంట్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో ఎర్ర జొన్న రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కొందరి నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దని రైతులకు సూచించారు. ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్‌ పార్టీ గానీ, భాజపా గానీ ప్రజల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని, కేవలం రాజకీయ డ్రామాలే ఆడుతున్నాయని దుయ్యబట్టారు. ఈ నెల 21న లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్టు చెప్పారు.
*ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఒక లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను విశాఖ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలో దించుతున్నట్టు వెల్లడించారు.
*ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఒకే ధ్రువపత్రం ఇవ్వనున్నట్లు ఆ బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు. ఇప్పటి వరకూ మార్కుల జాబితా వేరుగా, తరగతిలో ఉత్తీర్ణత సాధించినట్లు వేరుగా ధ్రువపత్రాలు జారీ చేసేవారు. ఇక నుంచి రెండింటికీ కలిపి ఒకే ధ్రువపత్రాన్ని జారీ చేయనున్నారు. ఈ ధ్రువపత్రం అన్ని చోట్ల చెల్లుతుందని, నకలు పొందాలనుకునే వారు సరైన విధానం అనుసరించి దరఖాస్తు చేసుకుంటే ఇస్తామన్నారు. సీబీఎస్‌ఈ బోర్డు కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాత విధానాన్నే అమలు చేస్తున్నామన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ధ్రువపత్రాలు, మార్కుల జాబితాలు ఇస్తామని తెలిపారు.
*కర్ణాటకలోని ధార్వాడ్‌ కమలేశ్వర్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందగా.. ఆరుగురికి గాయాలైనట్టు గుర్తించారు. భవనం శిథిలాల కింద 40 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 20మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగతా వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 10 జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
*ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయంలో ద్వేషం ఉందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. అప్పట్లో తాను ఒక్కడినే చౌకీదార్‌నని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలకు యూపీఏ ప్రత్యేక హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పని చేశామన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కి మరిన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సి ఉందన్నారు.
*ఎప్పటికప్పుడు ఇరు పార్టీల నాయకులు పొత్తుకు అవకాశం లేదని ప్రకటనలు చేస్తోన్న దిల్లీలో కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తుపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపాను ఓడించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నా, పొత్తు విషయంలో మాత్రం ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి.
*ఎన్డీఏపై మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత దేవెగౌడ విమర్శలు గుప్పించారు. అలాగే, కాంగ్రెస్‌-జేడీఎస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘మహాకూటమిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శిస్తున్నారు.
*ఐపీఎల్‌ గ్రూపు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. 12వ ఐపీఎల్‌లో భాగంగా గ్రూపు మ్యాచ్‌లకు సంబంధించి మార్చి 23 నుంచి మే 5 వరకు షెడ్యూల్‌ విడుదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా బీసీసీఐ షెడ్యూల్‌ను ఏర్పాటు చేసింది. అయితే ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో ప్రకటించనుంది. మొదటి మ్యాచ్‌ చిన్నస్వామి మైదానం వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మార్చి 23న జరగనుంది.
*ఐటీరంగ సంస్థ మైండ్‌ ట్రీ స్వతంత్రంగానే పనిచేస్తుందని ఇంజినీరింగ్‌ రంగ దిగ్గజం ఎల్‌అండ్‌టీ నేడు వెల్లడించింది. ‘‘మేము మైండ్‌ట్రీను ఎల్‌అండ్‌టీలో విలీనం చేసుకోవాలనుకోవడంలేదు. ప్రస్తుతానికి అది స్వతంత్రంగానే పనిచేస్తుంది. పర్యవేక్షణకు మాత్రం బోర్డును ఏర్పాటు చేస్తాం. ఒకే విధంగా ఆలోచించే వ్యక్తులు కలవడం లాంటిదే ఈ ఒప్పందం. మమ్మల్ని సిద్ధార్థ మూడు నెలల క్రితమే కలిసి ఆయన వాటాలను విక్రయిస్తామని చెప్పారు. మా సంస్థలోని పరిపాలన విలువను చూసి ఆయన ఈ ఆఫర్‌ చేశారు. మైండ్‌ట్రీలోని సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ మాకు మంచి మిత్రులు. ఈ డీల్‌ తర్వాత మరింత సానుకూల పథంలో సంస్థసాగుతుంది.’’ అని ఎల్‌అండ్‌టీ ఎండీ, సీఈవో ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)