మా అన్నయ్యకు నరసాపురం లోక్ సభ!

సినీ నటుడు నాగబాబు జనసేనలో చేరారు. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున నాగబాబును పోటీలోకి దింపుతున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు పవన్‌ బీ-ఫారాన్ని అందజేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా తనదైన జీవితం గడుపుతున్న వ్యక్తిని తాను స్వయంగా పార్టీకి రావాల్సిందిగా ఆహ్వానించానని పవన్‌ తెలిపారు. తనలో రాజకీయ చైతన్యం మొదలైంది తన సోదరుడు నాగబాబు వల్లేనని చెప్పారు. దొడ్డి దారిలో కాకుండా ధైర్యంగా తన అన్నయ్యను నేరుగా ప్రజాక్షేత్రంలో నిలబెడుతున్నానని తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నాగబాబు అని చెప్పారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఆయన విజయం సాధిస్తారనే నమ్మకం తనలో ఉందన్నారు. వరుసకు తనకు తమ్ముడే అయినా తనకు కూడా పవన్‌ నాయకుడేనని నాగబాబు అన్నారు. టికెట్‌ ఇచ్చినందుకు సోదరుడు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ్ముడి స్ఫూర్తితో సత్తా చూపిస్తామన్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ అదే జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో నాగబాబు రూ.25 లక్షలు జనసేనకు విరాళంగా ప్రకటించారు. ఆయన తనయుడు వరుణ్ తేజ్‌ కోటి రూపాయలను విరాళమిచ్చారు. ఇటీవల రాజమహేంద్రవరంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ప్రత్యక్షమయ్యారు. దీంతో అప్పటి నుంచి జనసేనలో ఆయన చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు నాగబాబు రంగ ప్రవేశంతో నరసాపురం ఎంపీ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే తెదేపా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శివ రామరాజును ఆ పార్టీ ప్రకటించింది. మొన్నటి వరకు ఆయన ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైకాపా కూడా నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజును బరిలోకి దింపింది. 15 రోజుల కిందటి వరకు ఆయన తెదేపాలోనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)