ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌పై మరోసారి పిడుగు పడింది. ఆ సంస్థకు యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. సెర్చింజిన్ తన విధులను మర్చిపోయి నమ్మకాన్ని కోల్పోయిందని యూనియన్ పేర్కొంది. దీనిపై ఈయూ కాంపిటీషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాగర్ మాట్లాడారు. ‘ఈరోజు కమిషన్ గూగుల్‌కు జరిమానా విధించింది. 1.49 బిలియన్ యూరోలు జరిమానా కింద చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్‌లో ఆ సంస్థకున్న మంచి పేరును, అధికారాన్ని గూగుల్ దుర్వినియోగం చేసింది. ఈ సంస్థ వల్ల కొన్ని కంపెనీలు బాగా లాభాలు గడిస్తున్నాయి. వినియోగదారులు మోసపోతున్నారు. కస్టమర్లే ప్రతి కంపెనీకి ప్రధానం. వారి విశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా వారిని ఇబ్బందులకు గూగుల్ గురి చేస్తోంది. ఇది వినియోగదారుల చట్టాలకు విరుద్ధం. వారి స్వేచ్ఛను, ఎంపికను ఈ సంస్థ హరిస్తోంది.దీని వల్ల గూగుల్ తన సుస్థిర స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.’ అని మార్గరెట్ తెలిపారు.
