రాబోయే నాలుగు నెలల్లో రెండు మెగా క్రికెట్ ఈవెంట్లు జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఆయా జట్లు ఆందోళన వక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 12వ సీజన్ మొదలవుతుండగా ఇది పూర్తయిన పది రోజులకే వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానుంది. దీంతో ప్రధాన ఆటగాళ్లు ఆరు వారాల పాటు ఐపీఎల్ ఆడి అలసటకు లోనై ఫిట్‌నెస్ కోల్పోతారనే ఆందోళన నెలకొంది. ఈ విషయంపై ఇప్పటికే పలు జట్ల కెప్టెన్లు, కోచ్‌లు తమ ఆటగాళ్లని ఐపీఎల్ నుంచి వెనక్కి రప్పించేందుకు ఆయా దేశాల క్రికెట్ బోర్డుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ అంశంపై మాజీ కెప్టెన్ సౌరభ్‌గంగూలీ ఆటగాళ్లకు పలు సూచనలు చేశారు. ఇదొక పెద్ద ఈవెంట్, ఇలాంటి అవకాశాలు మళ్లీ రావు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవడమే మంచిదని పేర్కొన్నాడు. ‘ప్రతి ఒక్కరికీ క్రికెట్ ఆడేందుకు కొంత సమయమే ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి లేదా ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే మంచిగా ఆడటమే ముఖ్యం. అలాంటి అవకాశాలు మళ్లీ రావు. కాబట్టి వీలైనప్పుడు విశ్రాంతి తీసుకొని సమయం దొరికినప్పడు ఆడటమే మంచిది’ అని గంగూలీ సూచించారు. ఇదే విషయంపై దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘వన్డే ప్రపంచకప్‌లో ఉత్తమ జట్లని బరిలో దింపేందుకు అన్ని దేశాల క్రికెట్‌బోర్డులు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయని తెలుసు. వారి పరిస్థితి అర్థం చేసుకోగలను. ఆటగాళ్ల కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక సమయంలో భారత జట్టు కూడా తమ ప్రధాన బౌలర్లపై ఆంక్షలు విధించే అవకాశముంది. అంతిమంగా 11 మందిని బరిలో దించి వీలైనన్ని మ్యాచులు గెలవడమే ముఖ్యం. అంతకుమించి మన చేతుల్లో ఏమీ లేదు’ అని పాంటింగ్ చెప్పారు. కాగా దిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకూ రెండుస్లార్లు సెమీస్ చేరినా ఒక్కసారి కూడా ఫైనల్‌కు వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ప్రత్యేక సలహాదారిడిగా గంగూలీని జట్టులో చేర్చుకుంది దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. ఈసారైనా ఆ జట్టు కప్పు గెలుస్తుందో లేదో చూడాలి మరి.
