మే 19 సాయంకాలం మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలి

దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి పెరుగడంతో ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది.

మే 19వ తేదీ సాయంత్రం లోక్‌సభ తుది విడుత పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయాలని ఈసీ స్పష్టం చేసింది.

ఈ మేరకు మీడియాతోపాటు తొలిసారి వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలకు శనివారం సూచనలను జారీ చేసింది.

ఏడు దశల్లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి దశ పూర్తికావడానికి ముందు 48 గంటల వ్యవధిలో ఏ పార్టీకి, అభ్యర్థికి అనుకూలమైన లేదా వ్యతిరేకమైన కార్యక్రమాలను, అభిప్రాయాలను, విజ్ఞప్తులను ప్రసారం చేయరాదని టీవీ, రేడియో చానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలకు ఈసీ సూచించింది.

లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలు జరుగనున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ర్టాలకు కూడా ఈ సూచన వర్తిస్తుంది.

ఇందుకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 126(ఏ) సెక్షన్‌ను ఈసీ అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ సెక్షన్ ప్రకారం తొలి విడుత పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తుది విడుత పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిర్వహించడం, వాటి ఫలితాలను వెల్లడించడం నిషిద్ధం.

ఒపీనియన్ పోల్స్ ప్రదర్శనతోపాటు ప్రామాణిక చర్చలు, విశ్లేషణలు, విజువల్, సౌండ్ బైట్స్‌కు కూడా ఈ సూచన వర్తిస్తుందని ఈసీ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)