రైతుల పంట బీమా ప్రీమియం మేమే కడతాం

వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ హామీ ఇచ్చారు. దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు గ్యారంటీ ఇస్తామని వివరించారు. దీంతోపాటు రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఆదివారం జగన్‌ ఎన్నికల ప్రచార రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రేపల్లెలో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడ తాగడానికి, వ్యవసాయానికి నీళ్లిచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు మిగిల్చింది దుఃఖమే. ఐదేళ్ల క్రితం రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలుంటే అవి వడ్డీలతో కలిపి 2019 నాటికి రూ.లక్షా 50 వేల కోట్లు అయ్యాయి. భూములు లాక్కునేందుకు భూసేకరణ చట్టానికి మార్పులు కూడా చేశారు. హెరిటేజ్‌ లాభాల కోసం చంద్రబాబు రైతుల పొట్ట కొడుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పతనం చేయిస్తున్నారు’’ అని జగన్‌ అన్నారు. ‘‘వైకాపా అధికారంలోకి వచ్చాక పంట బీమా గురించి రైతులు దిగులు పడక్కర్లేదు. దాని ప్రీమియాన్ని మేమే కడతాం. ప్రతి రైతుకూ ఉచితంగా బోర్లు వేయిస్తాం. పగటి పూట ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్‌ ఇస్తాం. ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు రూపాయిన్నరకే అందిస్తాం. పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాం. గిట్టుబాటు ధరలు కల్పిస్తూ గ్యారెంటీ ఇస్తాం. పంట వేసే ముందే ఫలానా రేటుకు కొంటామని ముందే చెప్తాం. కరవు, అకాల వర్షాలొచ్చినా ఇబ్బంది లేకుండా రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు టోల్‌ ట్యాక్సులు, రోడ్డు ట్యాక్సులు రద్దు చేయిస్తాం. ఆత్మహత్య చేసుకొని లేదా సహజ మరణం పొందిన రైతుకు వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా రూ.7 లక్షలు అందజేస్తాం. వైఎస్‌ఆర్‌ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం’’ అని జగన్‌ హామీలిచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)