కేసీఆర్…చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వైసీపీ విర్రవీగుతోందని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేసీఆర్ చేస్తున్న పనులు తప్పని ఇప్పటికే స్పష్టం చేశామని, ఆయన తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో నిరసన చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా తెలంగాణ సీఎం వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి అతి పెద్ద సమస్య జగనేనని, ఎన్నికల్లో ఓడించడం ద్వారా ఈ సమస్యను వదిలించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో తప్పుడు ఫారం-7 దరఖాస్తులు చేసినవారిపై కేసులు పెట్టాలని సూచించారు. 85 శాతం ఫారం-7 దరఖాస్తులు బోగస్ అని, ఈ దరఖాస్తులు ఇవ్వడం వెనుక వైసీపీ-బీజేపీ నేతల ప్రమేయం ఉందని సీఎం ఆరోపించారు. తప్పుడు విధానాలతో ఎన్నికల్లో గెలవాలని వైకాపా వ్యూహాలు రచిస్తోందని, ఏపీపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజల మద్దతు కూడగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తెదేపా కుటుంబాన్ని వీడి వెళ్లడానికి ఎవ్వరికీ ఇష్టం ఉండదని, టిక్కెట్ దక్కించుకోలేకపోయిన పులపర్తి నారాయణ మూర్తి వైకాపాలో చేరదామని అనుకుని మళ్లీ మనసు మార్చుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. విభేదాల్లేకుండా పని చేయాలని, అందరి సమస్యలు పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)