గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేరును వచ్చే సంవత్సరానికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ప్రతిపాదించే యోచనలో గోవా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఆయన అనుచరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అక్కడి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి తెలిపారు. దీనిపై ఆయన త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని అధికారులు తెలిపారు. పారికర్కి అత్యంత సన్నిహితుల్లో ప్రమోద్ సావంత్ ఒకరు. ఈ నిర్ణయాన్ని భాజపా నేత, పార్టీ అధికార ప్రతినిధి శయినా ఎన్సీ స్వాగతించారు. గోవా ప్రజలకే కాకుండా దేశం మొత్తానికి పారికర్ సేవలు అందించారన్నారు. ఎంతో మందికి ఆయన స్పూర్తిగా నిలిచారన్నారు. భారతరత్న ఇవ్వడం పారికర్కి సరైన నివాళి అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే భాగస్వామ్య పక్షాలు కూడా నిర్ణయాన్ని స్వాగతిస్తాయని భాజపా నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ గోవాలో నిర్మించిన ఓ నూతన వంతెనకు పారికర్ పేరుతో నామకరణం చేయాలని మహారాష్ట్ర గోమంతక్ పార్టీ నేత, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సుధిన్ ధావలికర్ నిర్ణయించారు. తీవ్ర అనారోగ్య కారణాలతో మార్చి 17న మనోహర్ పారికర్ కన్నుమూసిన విషయం తెలిసిందే.
