ఓటింగ్ పట్ల ఎన్నారైలకు అనాసక్తి

ప్రవాస భారతీయులు మాతృదేశ ఎన్నికల్లో పాల్గొనడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎన్ఆర్ఐలు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. ఫలితం శూన్యమే. 2014 ఎన్నికల్లో కేవలం 8 మంది ఎన్ఆర్ఐలు మాత్రమే ఓటేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో లేదా ప్రతినిధి ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తేనే.. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
**చట్టానికి సవరణ..
ఎన్ఆర్ఐలు ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగా 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టం, సెక్షన్‌ 20ని సవరించింది. ఓటు పొందాలనుకునే ప్రవాస భారతీయులు దేశంలో అంతకు ముందు ఎక్కడా ఓటరుగా నమోదై ఉండొద్దు. వారు నివాసం ఉంటున్న దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండకూడదు. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ ద్వారా పాస్‌పోర్టు, వీసా, తదితర వివరాలతో దరఖాస్తును సమర్పించి ఓటుహక్కు పొందొచ్చు.
*ప్రతినిధి ద్వారా ఓటేసేలా..
సుదూర దేశాల్లో ఉంటోన్న ఎన్ఆర్ఐలు పోలింగ్‌ తేదీన భారత్‌కు రావడం కష్టసాధ్యమైన పని. పైగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందుకు పరిష్కారంగా ఎన్ఆర్ఐ స్థానంలో వారి ప్రతినిధి ఓటేసే వెసులుబాటు కల్పించేందుకు 2017, డిసెంబరులో ప్రజాప్రాతి నిధ్య చట్టానికి సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు 2018లో లోక్‌సభలో ఆమోదం పొందింది. రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. లోక్‌సభలో చర్చ జరిగినప్పుడు కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. మరోవైపు ఆన్‌లైన్‌ ద్వారా ఓటేసే అవకాశాన్నీ ఈసీఐ కొంతకాలంగా పరిశీలిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)