ట్రంప్ హ్యాపీ

అమెరికా అధ్యక్షుడికి అతిపెద్ద ఉపశమనం లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి చెలరేగిన అతిపెద్ద వివాదం సద్దుమణిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు చేసిన రాబర్ట్‌ ముల్లర్‌ నివేదికను క్రోడీకరించి అటార్ని జనరల్‌ విలియమ్‌ బార్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌కు అందజేశారు. రష్యా జోక్యానికి సంబంధించినంత వరకు అధ్యక్షుడు ట్రంప్‌ పాత్రను కచ్చితంగా తేల్చలేదు. ఆయన చట్టానికి వ్యతిరేకంగా ఏ చర్యకు పాల్పడినట్లు పేర్కొనలేదు. అసలు అమెరికాకు చెందిన ఏ వ్యక్తి ఈ కుట్రలో పాల్గొన్నట్లు గానీ, ట్రంప్‌ ప్రచార కర్తల కుట్ర గానీ, ఉద్దేశపూరక చర్యలుగానీ దీనిలో కనిపించలేదని వెల్లడించారు. కుట్రను నిరూపించడానికి ప్రస్తుతం ఉన్న ఆధారాలు ఏమాత్రం సరిపోవని నాలుగు పేజీల రిపోర్టులో వెల్లడించారు. ఈ రిపోర్టు తయారు చేయడానికి ముల్లర్‌కు దాదాపు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఇది జరిగిన వెంటనే ట్రంప్‌ తన ట్విటర్‌ ద్వార మరోసారి ‘‘ఎటువంటి కుమ్మక్కు లేదు.. ఎటువంటి ఉల్లంఘనలు లేవు. నన్ను తొలగించేందుకు చేపట్టిన అక్రమ చర్య విఫలమైంది.’’ అని పేర్కొన్నారు. గుడ్డుకు ఈకలు పీకుతున్నారని ఎప్పటి నుంచో ట్రంప్‌ ఈ దర్యాప్తును ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై డెమోక్రాట్‌ పార్టీకి చెందిన సెనెటర్‌ రిచర్డ్‌ బ్లూమెంటాల్‌ మాట్లాడుతూ‘‘ అక్కడ సరైన ఆధారలు లభించక నిరూపించలేకపోయారు. కానీ ప్రశ్నలు మాత్రం మిగిలిపోయాయి.’’ అని పేర్కన్నారు. మరోపక్క హౌస్‌స్పీకర్‌ నాన్సీ పెలోసీ, డెమోక్రాటిక్‌ లీడర్‌ చాక్‌ స్కీమర్‌లు కూడా దీనిపై మండిపడ్డారు. ‘‘ప్రశ్నలను సమాధానాలుగా చూపుతున్నారు’’ అని పేర్కొన్నారు. శ్వేతసౌధ ప్రతినిధి సారా సాండర్స్‌ మాట్లాడుతూ ‘‘ఈ నివేదిక అధ్యక్షుడిని నిర్దోషిగా పేర్కొంది’’ అని అన్నారు. మరోపక్క డెమోక్రాటిక్‌ పార్టీ నేతలు పూర్తి నివేదికను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతోపాటు స్పెషల్‌ కౌన్సిల్‌ దర్యాప్తు ఫైళ్లను కూడా అందజేయాలన్నారు. ముల్లర్‌ ఈ కేసు దర్యాప్తు చేయడానికి బాగా కష్టపడ్డారు. దాదాపు 2,800 కోర్టు నోటీసులు, కొన్ని వందల సెర్చి వారెంట్లను జారీ చేయించారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తులను సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 8 మంది అమెరికన్లపై, రెండు డజన్ల మంది రష్యన్లపై అభియోగాలను నమోదు చేశారు. వీరిలో ఆరుగురు ట్రంప్‌నకు అత్యంత సన్నిహితులు. అమెరికన్లను అయితే విచారించారు కానీ రష్యన్లను విచారించడం సాధ్యంకాలేదు. ఎందుకంటే రష్యాతో అమెరికాకు ఎటువంటి నేరస్థుల అప్పగింత ఒప్పందంలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యానికి రష్యా ప్రజెక్టు లుక్తాను చేపట్టింది. దీని కింద రష్యా అనుబంధ సంస్థలు అమెరికాలోకి చొచ్చుకువచ్చాయి. ట్రంప్‌ తరఫున ప్రచారాన్ని మార్చేశాయి. భారీ సంఖ్యలో సోషల్‌ మీడియా ఖాతాలు పుట్టుకొచ్చాయి. తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. మరోపక్క డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన కీలక కంప్యూటర్లు హ్యాక్‌ అయ్యాయి. ఆ సమాచారం ఒక పథకం ప్రకారం వికీలీక్స్‌కు చేరాయి. దీంతో ఆ సమాచారం వెలుగులోకి రావడంతో హిల్లరీ క్లింటన్‌ పోటీలో వెనుకబడిపోయారు. * అమెరికా పౌరులుగా నమోదుచేసుకొని కొందరు వ్యాపార ఖాతాలను తెరిచి నగదును ప్రవహింపజేశారు. దీనికోసం ఏకంగా అమెరికాలో సర్వర్‌ స్పేస్‌ను కొనుగోలు చేశారు. దాదాపు 12.5 కోట్ల డాలర్లను దీనికి వెచ్చించారు. అమెరికాలో రాజకీయ ర్యాలీలు నిర్వహించారు. నిజమైన అమెరికన్లకు అన్యాయం జరగకూడదని ప్రజలను రెచ్చగొట్టారు. ఈ వ్యవహారంలో రష్యా ఆంతరంగికుడు ప్రిగోజైన్‌ కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)