తిరువూరు నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి ఇప్పటి వరకు ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా అభ్యర్థి రక్షణనిధి ప్రచారంలో ముందడుగులో ఉన్నారు. ఆదివారం నాడు వైకాపా అధ్యక్షుడు జగన్ తిరువూరు పర్యటన సందర్భంగా వైకాపా శ్రేణులు ఊహించిన దాని కన్నా అదనంగా జనం తరలివచ్చారు. దీంతో వైకాపాలో దూకుడు మరికొంత పెరిగింది. మొదటి నుండి తిరువూరు తెదేపా అభ్యర్థిగా స్వామిదాస్ పోటీలో ఉంటారని భావించినప్పటికీ చివరి నిముషంలో మంత్రి జవహర్‌కు కొవ్వూరు సీటు ఇవ్వకుండా, తిరువూరుకు పార్టీ అధిష్టానం అభ్యర్థిత్వం కేటాయించింది. జవహర్ ఇంకా స్థానిక నాయకులను సమన్వయం చేసుకునే పనిలోనే ఉన్నారు. కొన్ని చోట్ల కొందరు సీనియర్ నాయకులు జవహర్‌కు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కనిపించడంలేదు. దాదాపు 30వేలకు పైగా ఓటర్లు ఉన్న తిరువూరు పట్టణంలో తెలుగుదేశం పరిస్థితి దారుణంగా ఉంది. మున్సిపాల్టీలో అధికారంలో ఉన్న తెదేపా పాలకవర్గం మున్సిపాల్టీని భ్రష్టు పట్టించింది. ఈ ఎన్నికల సమయంలో కూడా మున్సిపాల్టీలో పాలన అధ్వాన్నంగానే ఉంది. పట్టణంలో ఈ వేసవిలో నాలుగు రోజులకొకసారి తాగునీరు ఇస్తున్నారు. తిరువూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం కూడా లేదు. ఉన్న నాయకులు వర్గాలుగా విడిపోయారు. జవహర్ ఒకరిద్దరు నాయకులపైనే తిరువూరు మండలంలో ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది. గంపలగుడెం, ఏ.కొండూరు, విస్సన్నపేటలో ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా పూర్తిగా పార్టీ ప్రచార రంగంలోకి దిగలేదు. సీటు రాలేదని బాధలో ఉన్న స్వామిదాసు ఇప్పుడిప్పుడే జవహర్‌తో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన భార్య జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుధారాణి బయటకు రావడంలేదు. జవహర్‌కు సీటు కేటాయించడం పట్ల స్వామిదాసు వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పుడిప్పుడే స్వామిదాసు జోక్యంతో వారంతా ప్రచారంలోకి దిగుతున్నారు. తిరువూరు మండలంలో కీలక ప్రజా ప్రతినిధిగా వ్యవహరిస్తూ గత ఐదు సంవత్సరాల నుండి ఇసుక, మట్టి తదితరాలను అమ్ముకుని కోట్లు గడించిన ఒక నాయకుడిని జవహర్ దగ్గరకి తీయడంతో ఆ ప్రజాప్రతినిధి గ్రామానికి చెందిన తెలుగుదేశం సర్పంచితో పాటు మరికొందరు వైకాపాలోకి వెళ్లిపోయారు. తిరువూరు నియోజకవర్గంలో జోరుమీదున్న వైకాపాను అధిగమించాలంటే ప్రస్తుత తెదేపా అభ్యర్థి జవహర్ అందరు నాయకులను సమన్వయంతో పని చేయించుకోవాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. దీనికి తోడు గత ఐదు సంవత్సరాల నుండి ఉన్న కొందరు తెదేపా నాయకులు పార్టీని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారు. కార్యకర్తలకు ఒక్క రూపాయి కూడా దక్కకుండా నాయకులు దండిగా సంపాదించారన్న అభిప్రాయం దిగువ స్థాయి పార్టీ కేడర్‌లో బలంగా ఉంది. వీటన్నింటినీ తెదేపా అభ్యర్థి జవహర్ అధిగమించి తనకు అనుకూలంగా మలచుకుంటేనే విజయం సాధ్యమని పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేని పక్షంలో మంచి అభ్యర్థిగా పేరు తెచ్చుకున్న రక్షణనిధి రెండో పర్యాయం ఈ సీటు తన్నుకుపోతారేమో అని తెదేపా వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
