దేశ రాజధాని దిల్లీలో తెలుగు బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం సాయంత్రం దిల్లీ పోలీసులు ఏపీ భవన్ అధికారులను సంప్రదించారు. ‘‘గురుటేక్ నగర్లో నిస్సహాయంగా ఉన్న 16 ఏళ్ల బాలికను గుర్తించాం. ఆ బాలికకు ఇటీవలే అబార్షన్ చేసినట్లుగా ఉంది. గతంలో ఎవరో అత్యాచారం చేసి తదనంతరం అబార్షన్ చేసినట్టుగా భావిస్తున్నాం. బాలిక మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో సంరక్షణ కేంద్రానికి తరలించి ప్రశ్నించాం. హిందీ, ఆంగ్ల భాషలను అర్థం చేసుకోలేకపోతోంది. తెలుగు మాట్లాడుతోంది. కేసు నమోదు చేశాం. కోర్టులో మంగళవారం విచారణకు రానుంది. హిందీ, తెలుగు అర్థం చేసుకొనే వ్యక్తిని దుబాసీగా పంపగలరు’’ అని భవన్ అధికారులను దిల్లీ పోలీసులు కోరారు. పూర్తి వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.
