సంచలనాలకు కేంద్ర బిందువు అయిన ఖమ్మం లోక్‌సభ పరిధిలో ప్రస్తుత రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇక్కడి నుంచి రేణుకాచౌదరి, నామా నాగేశ్వరరావు మూడోసారి తలపడుతున్నారు. సీపీఎం, భాజపా అభ్యర్థులూ బరిలో ఉన్నారు. సీనియర్ నేత నామా నాగేశ్వరరావు ఈ నెల 19న తెదేపాకు రాజీనామా చేసి 21న తెరాసలో చేరారు. అదే రోజు రాత్రే బి-ఫారాన్ని దక్కించుకున్నారు.
1.విజయమే లక్ష్యంగా తెరాస
ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం ఎమ్మెల్యేగా తెరాస అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ గెలిచారు. వైరా నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన లావుడ్యా రాములు నాయక్ తరవాత తెరాసలో చేరారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (తెదేపా), పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు తెరాసలో చేరుతామంటూ లేఖలు విడుదల చేశారు. దీంతో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో తెరాస బలం 5కు చేరుకొంది. తెదేపాలో కొనసాగిన సమయంలో ఉప్పునిప్పుగాఉన్న తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, గత శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థులు అయిన నామా, పువ్వాడ అజయ్, సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం ‘కారు’లో పయనిస్తుండటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నామా విజయమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగుతున్నారు.
2.పట్టుకోసం కాంగ్రెస్ ప్రయత్నం..
ఖమ్మం లోక్‌సభ పరిధిలోని సెగ్మెంట్లలో గత శాససనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూడు స్థానాల్లో గెలవగా.. వారిలో ఇద్దరు తెరాసలో చేరడానిక సిద్ధమయ్యారు. దీంతో ఇక్కడి లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్ పట్టును కోల్పోయినట్లయింది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి రేణుకాచౌదరిని గెలిపించుకొని తిరిగి పట్టు సాధించాలని కాంగ్రెస్ నాయకులు పరితపిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో పాలేరు, కొత్తగూడెం, మధిర స్థానాల నుంచి వరుసగా కుందాల ఉపేందర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, మల్లు భట్టివిక్రమార్క గెలుపొందారు. ఇందులో కుందాల, వనమా.. తెరాసలో చేరనున్నట్లు బహిరంగ లేఖలు రాశారు. ప్రస్తుతం మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కీలక పదవిలో ఉన్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఎంపీని గెలుచుకుంటామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
3.కేంద్ర పథకాలే అండగా భాజపా..
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే అండగా భాజపా నాయకులు ముందుకు వెళ్తున్నారు. కేంద్ర పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా వివరించి పార్టీ జెండా ఎగురవేయాలని ఈ పార్టీ నాయకులు తలపోస్తున్నారు. భాజపా అభ్యర్థిగా వాసుదేవ్‌రావు బరిలో నిలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన భాజపా నేతలు ఈ పార్లమెంటు స్థానంపై గురిపెట్టి విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
**శ్రేణులపై సీపీఎం ఆశలు
ఖమ్మం లోక్‌సభ స్థానంలో పరిధిలోని పార్టీశ్రేణులపై సీపీఎం నాయకులు ఆశలు పెట్టుకొన్నారు. సీపీఎం అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం ఒక్కరే ఇక్కడి నుంచి ఒకసారి విజయం సాధించారు. తర్వాత ఎవరూ ఎంపీగా ఎన్నికకాలేదు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ప్రస్తుతం ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు లేరు. ప్రజలకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలు, ప్రజల సమస్యల పరిష్కారానికి చేసిన కృషితో తమ అభ్యర్థి ఎంపీగా గెలవడం ఖాయమని సీపీఎం నేతలు విశ్వాసం ప్రకటిస్తున్నారు. సీపీఎం తరఫున బి.వెంకట్ బరిలో నిలిచారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. దీన్ని బట్టి ఈ స్థానానికి వారిచ్చే ప్రాధాన్యం తెలుస్తోంది.
****2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు
ప్రజాకూటమి : 5,36,817
తెరాస : 5,28,194
బీఎల్ఎఫ్ : 55,411
భాజపా : 9,764
మొత్తం ఓటర్లు: 14,40,289
***2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
వైకాపా : 4,21,957
తెదేపా : 4,09,983
సీపీఐ : 1,87,653
తెరాస : 89,063
ఆధిక్యం : 11,974
మొత్తం ఓటర్లు: 15,04,878
