కేవలం బరువు తగ్గడానికో, ఆకృతిని తీర్చిదిద్దుకోవడానికో వ్యాయామం అనే ఆలోచన తప్పంటున్నారు వ్యాయామ నిపుణులు. ఆరోగ్యంగా ఉండటానికి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వ్యాయామ సాధన అవసరమని చెబుతున్నారు. మరి ఎలా మొదలు పెట్టాలి? ఎప్పుడు మొదలుపెట్టాలో చూద్దామా?మారిన జీవనశైలిలో ప్రతి ఒక్కరికీ శారీరక శ్రమ తగ్గింది. ఆ తీరే అనేక అనారోగ్యాలకు మూలం అవుతోంది. అందుకే ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే…ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరం. అది చిన్నప్పటి నుంచే అలవాటుగా మారాలి. వ్యాయామం చేయడానికి శక్తి అవసరం. అందుకు పోషకాహారం, తగినన్ని నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక అలసట కాస్తా…క్రమంగా శారీరకంగానూ అలసిపోయేలా చేస్తోంది. అందుకే ఏ కొద్ది ఖాళీ సమయం దొరికినా పడుకోవడానికో, ఎక్కువ సేపు కూర్చుని టీవీలు చూడటానికో ఆసక్తి చూపుతున్నాం. దాన్నే రిలాక్సేషన్‌గా భావిస్తున్నా. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే మీ రోజువారి ప్రణాళిక ఎంత తీరికలేకున్నా సరే…వ్యాయామానికి ఓ అరగంటైనా సమయం కేటాయించుకోండి. అది ఉదయం వేళ అయితే మరీ మంచిది. రోజంతా మీలో ఉత్సాహం నింపడానికి వ్యాయామం చక్కని మార్గం.వ్యాయామం ఇంటిపనితోనే మొదలుపెట్టొచ్చు. తోటపని, బట్టలు ఉతకడం వంటివన్నీ చేయొచ్చు. అయితే అది ఏదో చేయాలి అన్నట్లు హడావుడిగా చేస్తే మనసు ఒత్తిడికి గురవుతుంది. పెద్దగా ఫలితం ఉండదు. దానికి బదులు ఉదయాన్నే వాకింగ్‌తో మీ వ్యాయామం మొదలుపెట్టండి. కొన్నాళ్లయ్యాక క్రమంగా…స్క్వాట్స్, చిన్‌అప్స్, పుషప్స్, తాడాట, సైక్లింగ్, జుంబా, యోగా…అలా మరికొన్ని వర్కవుట్లను జత చేసుకుంటూ సాగండి. మీకు పట్టు వచ్చాక మిక్స్ డ్ వ్యాయామాలు మీ అంతట మీరే చేసుకోవచ్చు. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చక్కని ఆకృతిని అందిస్తాయి.
