జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రారంభించిన అనంతరం నాలుగైదు సార్లు బీఎస్పీ అధినేత మాయావతితో భేటీ అయ్యారు. ఈ భేటీలో బేరసారాలు, ఇరువురి మధ్య బాగానే కుదిరినట్లు జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాయావతికి చెందిన బహుజన సమాజ్ వాదీ పార్టీని బలంగా నిలబెట్టడం కోసం పవన్ కళ్యాణ్ తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. బీఎస్పీ అభ్యర్ధులుగా చాలా చోట్ల జనసేన నాయకులు కార్యకర్తలనే పవన్ బరిలోకి దింపారు.
*** ఇవిగో ఉదాహరణలు
జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఆ పార్టీ తరపున నంబూరు శ్రీనివాసరావు తిరువూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలోనూ నంబూరు శ్రీనివాసరావు కీలక నేతగా వ్యవహరించారు. జనసేన పార్టీ తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నంబూరు శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్‌కు దరఖాస్తు కూడా ఇచ్చారు. ఎన్నికల ప్రచార వాహనాన్ని సిద్ధం చేసుకుని జనసేన జెండాలతో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే చివరి నిముషంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నంబూరు బీఎస్పీ అభ్యర్థిగా తిరువూరు నుండి నామినేషన్ వేశారు. దీనితో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
*** కొవ్వూరులోనూ ఇదే తంతు
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోనూ ఇదే విధమైన జిమ్మిక్కును జనసేన అధినేత ప్రదర్శించారు. ఏలూరు రేంజి డీఐజీగా పదవీ విరమణ చేసిన రవికుమార్ మూర్తి జనసేన పార్టీలో చేరారు. ఆయన తిరుపతి నుండి జనసేన పార్టీ తరపున ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయటానికి టికెట్ కోసం దరఖాస్తు చేస్తుకున్నారు. ఆయనకి కూడా మొండిచేయ్యే చూపెట్టారు. అనూహ్యంగా రవికుమార్ వద్దన్న కొవ్వూరు నుండి బీఎస్పీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపారు. అదే విధంగా చాలా నియోజకవర్గాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు బీఎస్పీ అభ్యర్ధులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎన్నికల బరిలోకి నిలిచారు. మాయావతి, పవన్ కళ్యాణ్ మధ్య కుదిరిన భారీ ఒప్పందం మేరకే ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ బీఎస్పీ తరపున అభ్యర్ధులను రంగంలోకి దింపారని వీరు భావిస్తున్నారు. —కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు
