అన్యాయం చేయను. ఎమ్మెల్సీ ఇస్తాను.

ఇటీవల తెదేపాను వీడి జనసేనలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి సీఎం చంద్రబాబు ఆఫర్‌ ఇచ్చారు. తెదేపా గెలుపునకు సహకరించి నంద్యాల అభివృద్ధిలో భాగస్వామి కావాలన్నారు. అలాగైతే, ఆయన కుటుంబానికి గౌరవప్రదంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆఫర్‌ చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల రోడ్‌షోలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన.. నంద్యాల ప్రజలకు హామీల వర్షం కురిపించారు.
‘‘నంద్యాలకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేయిస్తాం. నంద్యాల జిల్లా కావాలి. నంద్యాల జిల్లా కావాలంటే కుప్పం కంటే ఎక్కువ మెజార్టీ రావాలి. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి అన్యాయం చేయను. కొన్ని కారణాల వల్ల ఆ కుటుంబానికి సీటు ఇవ్వలేకపోయాం. ఆయన కుటుంబానికి నేను అండగా ఉన్నా. ఎన్నికల అవ్వగానే నంద్యాలను జిల్లా చేస్తా. నంద్యాలను స్మార్ట్‌సిటీగా మారుస్తా. సీడ్‌ క్యాపిటల్‌గా చేస్తా. వ్యవసాయ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తాం. వ్యవసాయ కళాశాలలో విత్తనాల పరిశోధనపై దృష్టిపెడతాం. డిగ్రీ కళాశాల సైతం ఇస్తా. బాహ్యవలయ రహదారి నిర్మిస్తాం’’ అని హామీ ఇచ్చారు. ‘‘భాజపా, వైకాపాది విడదీయరాని భార్యాభర్తల సంబంధం. ఇంట్లో కాపురం, బయట నాటకాలు ఆడుతున్నారు. ఎందుకీ ముసుగులు. ధైర్యం ఉంటే మోదీ, కేసీఆర్‌, జగన్‌ ముసుగు తీసి రండి. మా తడాఖా చూపిస్తాం. ముసుగులో గుద్దులాట వద్దు. ఎన్నికల యుద్ధంలో ఇంటికో సైనికుడు రావాలి. రాష్ట్రంలో చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేయాలని కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్‌ ఢీ అంటే మేమూ ఢీ అంటాం. తెలంగాణ కంటే మిన్నగా ఏపీని తయారు చేస్తా. ప్రజల కోసం వీరసైనికుడిగా ముందుకెళ్తున్నా. దుర్మార్గులతో పోరాడుతున్నా. ప్రధాని మోదీ నేరస్థులకు కాపలాదారుడిగా మారారు. ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి ఆస్తులపై కావాలనే ఐటీ దాడులు చేయించారు’’ అని అన్నారు. ‘‘గతంలో జరిగిన ఉప ఎన్నికలో నంద్యాల ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. నా జీవితంలో నంద్యాలను మరిచిపోలేను. నంద్యాల ప్రజల అభిమానాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటా. ఐదేళ్ల పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. ప్రపంచంలో ఎవరికీ లేనంతమంది చెల్లెళ్లు నాకు ఉన్నారు. త్వరలోనే మహిళందరికీ స్మార్ట్‌ ఫోన్లు అందజేస్తా. పింఛన్లు పదిరెట్లు పెంచి రూ.2వేలు చేశాం. దాన్ని రూ.3వేలకు పెంచుతాం. నంద్యాల కేంద్రంగా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాది. చంద్రన్న పెళ్లి కానుక, దుల్హన్‌ పథకాల కింద ఇచ్చే సాయాన్ని రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచుతాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)