బ్లూస్టార్ నుండి 75 రకాల ఏసీలు-వాణిజ్య-03/27

*దేశానికి తిరిగి వచ్చి.. తన అవసరం ఉన్న చోట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో సంతోషంగా ఉన్నప్పటికీ తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. ఓ పుస్తకావిష్కరణ సభలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తెలుగుదేశం లాంటి పార్టీలు ఏర్పాటు చేసిన మహాకూటమి అధికారంలోకి వస్తే రాజన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
*ఎయిడ్స్‌, టీబీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు విస్తరించకుండా అదుపుచేసేందుకు కృషి చేస్తున్న గ్లోబల్‌ ఫండ్‌ అనే సంస్థతో హైదరాబాద్‌కు చెందిన లారస్‌ ల్యాబ్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. మూడున్నరేళ్ల పాటు అమల్లో ఉండే ఈ భాగస్వామ్యం కింద గ్లోబల్‌ ఫండ్‌కు హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ ఔషధాలను లారస్‌ ల్యాబ్స్‌ సరఫరా చేస్తుంది. ఇది తమకు ఎంతో ముఖ్యమైన ఒప్పందమని కంపెనీ పేర్కొంది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే శాఖలు తెరిచే ఉంచాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది.
*హైదరాబాద్‌కు చెందిన ఐటీ సేవల కంపెనీ సైయెంట్‌ లిమిటెడ్‌కు ప్రాట్‌ అండ్‌ విట్నీ సప్లయర్‌ అవార్డులు లభించాయి. 2018 సంవత్సరానికి మూడు అవార్డులు గెలుచుకున్నట్లు సైయెంట్‌ లిమిటెడ్‌ ఇక్కడ వెల్లడించింది. ప్రాట్‌ అండ్‌ విట్నీ వార్షిక సరఫరాదార్ల సమావేశంలో ఈ అవార్డులు బహూకరించినట్లు తెలిపింది. పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలపై తాము అధికంగా పెట్టుబడులు పెడుతున్నట్లు, తత్ఫలితంగా అవార్డులు గెలుచుకునే అవకాశం వచ్చిందని సైయెంట్‌ లిమిటెడ్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఆనంద్‌ పరమేశ్వరన్‌ తెలిపారు.
*నిర్మాణ సామగ్రి అమ్మకాలు పెంచుకోడానికి పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు నగరాలు, పట్టణాల్లో నిర్మాణ సామగ్రి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఇటువంటి కేంద్రాలు 11 ఉండగా, త్వరలో మరో 6 ప్రారంభించనున్నట్లు పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ విస్తరించాలని, విక్రయ కేంద్రాల సంఖ్యను 42కు పెంచుకోవాలనే ప్రణాళికలు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. స్టీలు, సిమెంటు, రంగులు, పుట్టీలు, డ్రిల్‌ యంత్రాల వంటి అన్ని రకాల నిర్మాణ సామగ్రిని ఈ కేంద్రాల్లో విక్రయిస్తున్నట్లు పేర్కొంది.
* ఐరిష్‌కు చెందిన క్విన్‌ గ్రూపునకు భారతీయ అనుబంధ కంపెనీగా ఉన్న మాక్‌ సాఫ్ట్‌ టెక్‌పై దివాలా ప్రక్రియను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మాక్‌ సాఫ్ట్‌ టెక్‌…, హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ‘క్యూ సిటీ’ అనే అతిపెద్ద వాణిజ్య భవనం యజమానిగా ఉంది.
*ఎయిర్‌ కండిషనర్ల విపణిలో 13.5 శాతం మార్కెట్‌ వాటా సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని, పలు కొత్త మోడళ్లు ఆవిష్కరిస్తున్నట్లు బ్లూస్టార్‌ లిమిటెడ్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (జాయింట్‌ ఎండీ) బి.త్యాగరాజన్‌ తెలిపారు. బ్లూస్టార్‌ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 75 మోడళ్లను విడుదల చేయగా, కొత్త మోడళ్లను మంగళవారం హైదరాబాద్‌లో ప్రదర్శించారు.
*రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. చివరి గంటన్నర ట్రేడింగ్‌లో కొనుగోళ్లు దుమ్మురేపడంతో సెన్సెక్స్‌ మళ్లీ 38000 పాయింట్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు బలంగా పుంజుకోవడం, రూపాయి రాణించడం ఇందుకు ప్రధాన కారణాలు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. విదేశీ పెట్టుబడులు స్థిరంగా కొనసాగాయి.
*జెట్‌ ఎయిర్‌వేస్‌ను సొంతం చేసుకునే కొనుగోలుదారు లేదా కొత్త యజమాని రూ.4,500 కోట్ల మూలధానాన్ని తీసుకురావాల్సి ఉంటుందని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సీనియర్‌ అధికారి ఒకరు అంచనా వేశారు.
*పాన్‌ కార్డ్‌ సంఖ్యను ఆధార్‌ కార్డ్‌తో అనుసంధానించుకోవడానికి ఆదివారం వరకు మాత్రమే సమయం ఉంది. అనుసంధానం కాని వారి ఐటీ రిటర్నులు ఫైల్‌ చేయడం సాధ్యంకాదని ఆదాయపు పన్నుశాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాదు వారి పాన్‌కార్డు కూడా రద్దయ్యే ప్రమాదం ఉంది.
*ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. ప్రజా ప్రయోజనాలు, బ్యాంకుల ప్రయోజనాలు కాపాడుకొనేలా జెట్‌ ఎయిర్‌వేస్‌ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనకు సంతోషాన్ని కలిగించిందని వెల్లడించారు.
*లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) లిమిటెడ్‌ సంస్థ మైండ్‌ట్రీకి చెందిన 31శాతం షేర్ల కొనుగోలు చేసేందుకు ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ విలువ దాదాపు రూ.5,030 కోట్లు ఉంటుందని అంచనా. దాదాపు 51.3 మిలియన్ల మైండ్‌ట్రీ షేరు కోనుగోలులో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రకటించిన ఎల్‌అండ్‌టీ పేర్కొంది. ఒక్కోషేరుకు రూ.980 చెల్లించేందుకు సిద్ధమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)