ఆ స్వామి డోలోత్సవం ప్రత్యేకత అదే

మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం కూర్మం. స్వామివారు కూర్మనాథుడిగా వెలసిన క్షేత్రం శ్రీకూర్మం. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ శ్రీకూర్మ క్షేత్రం హిందూదేశానికే తలమానికం. ప్రాచీన శిల్పకళా శోభితంగా, దేశ నలుమూలలు నుంచి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాలను పంచిపెడుతూ అలరారుతోంది. వైష్ణవుల 108 దివ్యారామాల్లో ప్రముఖంగా ఉంది. అంతటి మహిమాన్విత గల ఈ క్షేత్రంలో ప్రముఖమైన ఉత్సవంగా ఫాల్గుణ మాసంలో జరిగే డోలోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రతి ఏటా ఫాల్గుణమాస త్రయోదశి నాడు మఖ నక్షత్రంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది.

**మన్మథుని దహించేందుకు గానూ తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఉభయానాంచారులతో కలిపి గోవిందరాజస్వామి, చొప్పరంలో సీతారామ, అశ్వవాహనంపై లక్ష్మణ, పల్లకీలో చక్రనారాయణస్వామి హోమం అనంతరం ప్రత్యేక పూజలనంతరం కామదహనం చేస్తారు. గరుడవాహనం పై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. గ్రామ సమీపంలోని కామదహనం మంటపం వద్ద కామదహన కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు.పడియ… కామదహనంలో పాల్గొన్న భక్తులు వేకువజామున సమీపంలోని సముద్రస్నానాలు చేసి ఆలయంలోని శ్వేతపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అనంతరం స్వామిని దర్శించుకోవడంతో పడియ ఉత్సవం పూర్తవుతుంది. శ్వేతపుష్కరిణిని విష్ణువు సుదర్శన చక్రంతో తవ్వడం జరిగింది. తవ్వుతున్న సమయంలో లక్ష్మీదేవి గరుడవాహనంపై కూర్చున్న విగ్రహం లభ్యమవ్వడంతో ఆలయంలో శ్రీకూర్మనాయకిగా పూజలందుకుంటోంది.
**డోలోత్సవం…
డోలాయమానం గోవిందం మధ్యస్ధ మధుసూదనం రథస్త వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే…డోలోత్సవంలో ఉయ్యాల మంటపంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదన్నది శ్లోక భావన. గ్రామదేవత మోహినీ భద్రాంబిక దర్శనార్ధమై శ్రీకూర్మనాథుడు రాజరాజ అలంకరణలో డోలామంటపం వద్దకు వెళ్తారని స్ధలపురాణం చెపుతుంది. ఈ సందర్భంగా స్వామిపాదాలను భక్తులు తాకే అవకాశం ఉంది. స్వామి అస్పృశ్య దోష నివారణకు బుక్కా, భర్గుండ (రంగులు కలిపిన పదార్ధం)తో అర్చకులు పూజలు చేస్తారు.పూజ చేసిన బుక్కా, భర్గుండను భక్తులపై చల్లుతారు. సనాతనంగా వచ్చిన ఈ ఉత్సవమే ప్రస్తుతం హోళీగా మారిందని చెబుతుంటారు. డోలోత్సవం రోజున ఆలయం నుంచి గజ వాహనంపై స్వామివారు, మరోవాహనంపై ఉభయ నాంచారులు తిరుగు ప్రయాణంలో గరుడవాహనంపై స్వామి వారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఉదయం మాడ వీధుల గుండా జరిగిన ఈ యాత్ర డోలా మంటపం చేరుకున్న తరువాత ఉత్తర నక్షత్ర లగ్నమందు ఉత్తరాభిముఖ దర్శనం ఇస్తారు. విజయనగరం రాజవంశీకుడు పూసపాటి అశోకగజపతిరాజు గోత్ర నామాలతో తొలిపూజలు చేస్తారు. శ్రీరంగం, వైకుంఠంలో స్వామిని చేరేందుకు గద్యత్రయం పఠనం చేస్తారు.
**కూర్మనాథుని ఆవిర్భావం….
ఆలయం తొలుత దేవతలు నిర్మించగా, 2వ శతాబ్దంలో అనంత చోళగంగుడు, అనంగ భీముడు హయాంలో పునఃనిర్మాణం జరిగింది. కూర్మనాథుడి పైనే భూమి అంతా ఆధారపడి ఉందని, క్షీరసాగర మధనంలో దేవతలు, రాక్షసులు వాసుకిని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలుకుతున్నప్పుడు మందర పర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణువు కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని తన మూపున మోస్తూ అమృతం పొందేందుకు సహకరించాడు. తాను స్వామిని కూర్మరూపునిగా సందర్శించాలని ఉందన్న శ్వేత చక్రవర్తి కోరిక మేరకు స్వామి కూర్మరూపంలో ఇక్కడ దర్శనమిచ్చారని స్ధలపురాణం చెబుతుంది.గోపురం అష్టదళపద్మాకారంలో ఉంటుంది. ఈ గోపురంపై గల గాంధర్వ, నారసింహా, కపీశ, హయగీవ్ర, ధదివక్త్ర దర్శనం పుణ్యభరితమని, సర్వరోగ, సకల పాప నివారణి అని చెబుతారు.ఈ క్షేత్రంపై మహమ్మదీయ చక్రవర్తులు దాడికి దిగుతున్నారని తెలిసి, స్థానికులు సున్నం, గుగ్గిలం రాశులుగా పోసారట. వాటిని సైనికుల కొండలుగా భావించి, వీరిని జయించలేమని మహమ్మదీయ సేనలు వెనుదిరిగారట. అప్పటి సున్నం, గుగ్గిలం ఆనవాళ్లు మనం చూడవచ్చు. క్షేత్ర పాలకునిగా ఆలయం చెంతనే శివుడు పాతాళ సిద్ధేశ్వరుడుగా దర్శనమిస్తాడు.
**త్రిమతాచార్యులు సందర్శించిన ఏకైక క్షేత్రం….
ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామి వారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్దంలో స్వామిని సేవించిన రామానుజాచార్యులు కోరిక మేరకు తూర్పు ముఖం కలిగి ఉన్న కూర్మనాథుడు పశ్చిమానికి తిరిగి దర్శనం ఇచ్చాడని చెబుతారు. అందుకోసం రెండు ధ్వజస్తంభాలను ఇక్కడ చూడవచ్చు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు శ్రీనరహరి తీర్థులు క్షేత్రాన్ని సందర్శించి సీత, రామలక్ష్మణ ఉత్సవమూర్తులను బహూకరించారని, ప్రస్తుత ఉత్సవమూర్తులైన గోవింద రాజస్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను లవకుశులు సమర్పించారని పురాణాలు చెబుతున్నాయి. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. శైవ, విషు
**శిల్పకళా శోభితం …..
శ్రీకూర్మనాథుని సన్నిధి అపురూప శిల్పకళతో అలరారుతోంది. ఇక్కడి 108 రాతిస్తంభాలు ఒక దానికీ మరొకదానికీæ పోలికలు ఉండవు. ప్రదక్షిణ మంటపం చుట్టూ 24 నల్లరాతి స్తంభాలున్నాయి. ఇందులో ఏకశిలతో తయారు చేసినట్టుండే ఈ శిల్పాలు మూడు శిల్పాలతో నిర్మితమైనవే. ఆకుపసరు చిత్రాలు ఇక్కడ భక్తులను ఆకట్టుకుంటాయి.
**పితృమోక్ష క్షేత్రం…
ఈ క్షేత్రం ఆవరణలోని శ్వేతపుష్కరిణిలో చనిపోయిన పెద్దల అస్తికలను కలిపితే ముక్తి లభిస్తుందని, ఇందులో కలిపిన అస్తికలు వారం రోజుల్లో శిలలుగా మారుతాయనీ విశ్వాసం. కూర్మనాథుని దర్శిస్తే శని వల్ల కలిగే ఈతిబాధలను నివారించుకోవచ్చునని, శనిదోషనివారణకు తిరుమంజన సేవలో పాల్గొంటే మంచిదని స్థలపురాణం చెబుతుంది.
1. వైభవంగా కదిరి ఖాద్రీశుని రథోత్సవం
అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీఖాద్రీలక్ష్మీ నరసింహుని బ్రహ్మరథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం 8.25గంటలకు శుభ ఘడియల్లో అతిథులు మోకులు లాగి మడుగు తేరును కదిలించారు. ఆ తర్వాత 8.45 గంటలకు ముందుకు సాగిన ఖాద్రీనృసింహుడు తిరుమాడ వీధుల్లో అయిదున్నర గంటల పాటు విహరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల భక్తులు లక్షమందికి పైగా కార్యక్రమానికి హాజరయ్యారు.
2. భక్తులారా… ఓటేయండి!
గుడికెళితే పుణ్యం దక్కుతుందనీ, పాపాలు పోతాయనీ భక్తుల విశ్వాసం. రోజూ ఠంచనుగా గుడికి వెళ్తున్నట్లు, ఐదేళ్లకు ఓ సారి జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి అందరూ పోలింగ్‌ కేంద్రంలోకి అడుగుపెడుతున్నారా? అంటే చెప్పలేం. అందుకే తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా యంత్రాంగం కాస్త వినూత్నంగా ఆలోచించింది. అక్కడి అరుణాచలేశ్వర ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి పౌర్ణమి నాడు భక్తులు ఆ ఆలయానికి పోటెత్తుతారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవాలయ బోర్డుతో కలిసి జిల్లా యంత్రాంగం ఓటింగ్‌ అవగాహనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.ఆలయానికి వచ్చిన భక్తులందరికీ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంచిపెడుతోంది. అలాగే 100 శాతం ఓటింగ్‌ ఉండాలని సూచిస్తూ ప్రసాదం సంచుల్లో ఓ కాగితాన్ని కూడా అందిస్తున్నారు. వీటిని దర్శనం టిక్కెట్లతో పాటు ఇచ్చే ఏర్పాట్లూ చేశారు. అంతేకాదు, ఓటు హక్కు విలువను తెలియజేస్తూ వీధి నాటకాలు, విద్యార్థులతో బైక్‌ ర్యాలీలు… ఓటింగ్‌ శాతం పెంచడానికి వీలున్న ఏ అవకాశాన్నీ అధికారులు వదులుకోవడం లేదు.
3. 3నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్‌ 3 నుంచి 7వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో శ్రీరామచంద్రమూర్తి మంగళవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. ఆరో తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవార్లకు రథోత్సవం జరగనుందని తెలిపారు.
4. శుభమస్తు
తేది : 27, మార్చి 2019
సంవత్సరం : విళంబినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : సప్తమి
(నిన్న రాత్రి 8 గం॥ 8 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 9 గం॥ 0 ని॥ వరకు)
నక్షత్రం : జ్యేష్ట
(నిన్న ఉదయం 7 గం॥ 18 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 21 ని॥ వరకు)
యోగము : వ్యతీపాతము
కరణం : భద్ర(విష్టి)
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 42 ని॥ వరకు)
మ్రుతఘడియలు : (నిన్న రాత్రి 11 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 49 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 20 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 17 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 15 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 28 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : వృచ్చికము
5. చరిత్రలో ఈ రోజు/మార్చి 27
ప్రపంచ రంగస్థల దినోత్సవం
1845 : ఎక్స్ కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం.(మరణం.1923)
1903 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు హెచ్.వి.బాబు జననం.
1968 : అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవునిగా చరిత్రకెక్కిన యూరీ గగారిన్ మరణం.
1981 : భారత బాక్సింగ్ క్రీడకారుడు అఖిల్ కుమార్ జననం.
1998 : ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనత కు ఔషధంగా ధ్రువీకరించారు.
1898 : భారత విద్యావేత్త, ముస్లిం తత్వవేత్త, సామాజిక వేత్త మరియు రాజకీయవేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం. (జననం.1817)
6. అమర్‌నాథ్‌కు ఆహ్వానం
హిమాలయాలంటేనే మహిమాన్విత పుణ్యక్షేత్రాలకు నెలవు. కశ్మీర్‌కు ఉత్తరాన హిమగిరుల్లో స్వయంభువుగా వెలిసే మంచు లింగ దర్శనం కోసం సాగించేదే అమర్‌నాథ్‌ యాత్ర. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎందరో భక్తులు ఈ యాత్రకు వెళ్తుంటారు. ఏటా పరిమితంగా 55 నుంచి 60 రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది జులై మొదటి వారం నుంచి ఆగస్టు 15 (రాఖీ పౌర్ణమి) వరకు సాగనుంది. అమర్‌నాథ్‌ యాత్ర పేర్ల నమోదు ప్రక్రియ మొదలైంది.
* యాత్రికులు తమ దరఖాస్తులను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, జమ్ము కశ్మీర్‌ బ్యాంకు, యెస్‌ బ్యాంకుల్లో నమోదు చేసుకోవాలి.
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మొత్తం 11 శాఖలలో ఈ సదుపాయం ఉంటుంది.
* హైదరాబాద్‌లో రాష్ట్రపతి రోడ్‌, హిమాయత్‌నగర్‌లలో ఉండే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బ్రాంచీల్లో కానీ, చార్మినార్‌ దగ్గర పత్తర్‌ఘట్టిలో ఉన్న జమ్మూ కశ్మీర్‌ బ్యాంకులో కాని తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.
***హెల్త్‌ సర్టిఫికేట్‌ ఇలా..
* బ్యాంకులో పేర్ల నమోదుకు ముందుగా నిర్దేశిత ఆసుపత్రుల నుంచి ఆరోగ్య ధ్రువీకరణ పత్రం (హెల్త్‌ సర్టిఫికేట్‌) పొందాలి.
* శ్రీ అమర్‌నాథ్‌ జీ ష్రైన్‌ బోర్డు నిర్దేశించిన నమూనాలో వారు ఎంపిక చేసిన వైద్యులతో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని పొందవలసి ఉంటుంది.
* దరఖాస్తులు శ్రీఅమర్‌నాథ్‌జీ ష్రైన్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
***యాత్ర నియమాలు
* ముందు వచ్చినవారికి ముందు అనే పద్ధతిలో యాత్ర సాగుతుంది. రోజుకు 7,500 మందిని అనుమతిస్తారు.
* యాత్ర చేయడానికి పహల్గామ్‌, బాల్తాల్‌ పట్టణాల మీదుగా రెండు మార్గాలు ఉంటాయి. ఏ మార్గంలో వెళ్లాలనుకుంటున్నామో, ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకుని చెబితే ఆ మార్గాన్ని అనుసరించి అనుమతి ఇస్తారు.
* పూరించిన దరఖాస్తు, హెల్త్‌ సర్టిఫికేట్‌తోపాటు మూడు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు ఇవ్వాలి.
* హెల్త్‌ సర్టిఫికేట్‌ ఫిబ్రవరి 15 తర్వాత మాత్రమే తీసుకోవాలి.
* దరఖాస్తుతో పాటు ఆధార్‌ కార్డు, ఇతర చిరునామా ధ్రువీకరణ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.
* ఎంపిక చేసిన బ్యాంకులో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే నమోదు చేసుకుంటారు.
****ప్రైవేటు ఏజెంట్లు.. స్పాట్‌ రిజిస్ట్రేషన్లు
* గుర్తింపు పొందిన ట్రావెల్‌ ఏజెంట్లు కూడా ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు. ఈ సందర్భంలో కూడా పర్మిట్‌, హెల్త్‌ సర్టిఫికేట్‌లు అవసరం.
* అప్పటికప్పుడు యాత్రకు వెళ్లేవారు జమ్మూలోని రైల్వే స్టేషన్‌ దగ్గరలో ఉండే వైష్ణవీధామ్‌, శ్రీనగర్‌ శివారులోని నవ్‌గావ్‌లో ఉన్న రాష్ట్ర పర్యాటక భవన్‌లో కాని స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. హెల్త్‌ సర్టిఫికేట్‌ వెంట తీసుకువెళితే సమయం కలిసి వస్తుంది.13 ఏళ్లలోపు బాలలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను, ఆరు వారాలు దాటిన గర్భిణులను యాత్రకు అనుమతించరు.రిజిస్ట్రేషన్‌ సమయంలో రూ.50 బ్యాంకులో చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌తోపాటు రూ.లక్ష విలువైన బీమా సదుపాయం కల్పిస్తారు.మరిన్ని వివరాలకు www.shriamarnathjishrine.com వెబ్‌సైట్‌ని సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)