12ఏళ్లకు పెళ్లి. నెలకి ₹60 జీతం. ఇప్పుడు పద్మశ్రీ.

అందరి జీవితం పూల బాట కాదు..ఎన్నో కష్టాలు మరెన్నో కన్నీళ్లు అన్నింటినీ తట్టుకుని పరిస్థితులకు ఎదురొడ్డి తనేంటో నిరూపించి చూపలనుకుంది ప్రపంచానికి. ఇప్పుడు తనే రోల్ మోడలైంది. తనలాంటి మరి కొందరికి. మహారాష్ట్రలోని అలోకా జిల్లాలోని ఓ చిన్ని గ్రామంలో కల్పనా సరోజ్ జన్మించింది. కుటుంబానికి భారం తగ్గాలని కూతురిని పన్నెండేళ్ళకే పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. తల్లిదండ్రులు నరకం ఎలా ఉంటుందో. అత్తారింట్లో అడుగుపెట్టిన ఆరు నెలలకే అర్ధమైంది కల్పనకి. కూతురి పరిస్థితి చూసి చలించి పోయిన తండ్రి ..పద తల్లీ ఇంటికి పోదాం… కలో గంజో కలిసే తాగుదాం అని తీసుకెళ్ళాడు కూతురిని. చదువుకుందామని స్కూలుకు వెళితే ఊర్లో అందరూ హేళనగా చూసేవారు. సూటీ పోటీ మాటలనేవారు. వాటన్నింటినీ భరించలేక చచ్చిపోదామని ఎలుకల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఊర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సకాలంలో వైద్యం అందడంతో కల్పన బ్రతికింది. మరణం అంచుల వరకూ వెళ్లినదాన్ని మళ్లీ బతికానంటే నేను చేయాల్సింది ఏదో ఉందనుకుని ఇంట్లో వాళ్లని ఒప్పించి ముంబై రైలెక్కింది. తెలిసిన బంధువుల ఇంట్లో ఉంటూ బట్టల షాపులో పనికి వెళ్లేది. అక్కడ కల్పనకు నెలకు రూ.60 జీతం ఇచ్చేవారు. ఆతరువాత అక్కడే బట్టలు కుట్టడం నేర్చుకుంది. దీంతో ఆదాయం మరికొంత పెరిగింది. ఆ తరువాత రెండేళ్లు సంపాదించనదాంట్లో కొంత కూడబెట్టింది. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అందులోకి మారిపోయింది. అంతలోనే విషాదం. సమయానికి డబ్బులు లేక, మందులు అందక అక్క అనారోగ్యంతో మరణించిందన్న వార్త తనను కృంగదీసింది.దీంతో ఎలాగైనా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంది కల్పన. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంది. 1975లో మహాత్మా జ్యోతి పూలే స్కీమ్ కింద రూ.50వేలు లోన్ తీసుకుని సొంతంగా బట్టల షాపు తెరిచింది. బిజినెస్ బాగా సాగుతుండగామరో ఆలోచన చేసింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని భావించింది. సుశిక్షిత్ బెరోజ్‌ యువక్ సంఘటన పేరుతో ఒక అసోసియేషన్ ప్రారంభించింది. 3వేల మందికి పైగా అందులో జాయిన్ అయ్యారు.అక్కడి నుంచి ఆమె మరో అడుగు ముందుకు వేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టింది. అది ఆమె జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది. అతి తక్కువ కాలంలోనే ప్రాపర్టీ బిజినెస్ నుంచి ఏకంగా రూ.4 కోట్లు సంపాదించింది. బిజినెస్‌లో సక్సెస్‌ని చూసిన కల్పన రుణ భారంతో మూతబడిన కామానీ ట్యూబ్ కంపెనీ పునరుద్ధరణ బాధ్యతను భుజానికెత్తుకుంది.10 మంది సభ్యులతో ఒక టీమ్‌ని ఏర్పాటు చేసింది. ఇందులో మార్కెటింగ్, బ్యాంక్, లాయర్లు, ప్రభుత్వ అధికారులు వంటి వారందరూ ఉన్నారు. ఆర్థిక మంత్రిని, కంపెనీకి రుణాలిచ్చిన వారందరినీ కలిసింది. బ్యాంకులు పెనాల్టీలను, వడ్డీలను రద్దు చేసేందుకు అంగీకరించాయి. కామానీ కంపెనీనీ తిరిగి ప్రారంభించేందుకు ఈ చర్యలు ఎంతగానో తోడ్పడ్డాయి. 2006లో కంపెనీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టింది కల్పన. కంపెనీకి సంబంధించిన రుణాలను తీర్చడమే మొదటి కర్తవ్యంగా పెట్టుకుని ముందుకు కదిలింది. ఇందుకోసం అంతకు ముందు తను సంపాదించిన ఆస్తిని కూడా అమ్మేసింది.2009లో కంపెనీ సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ నుంచి బయటపడింది. 2011లో రూ.3 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఇచ్చిన ప్రోత్సాహంతో మరికొన్ని వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది కల్పన మరింత ఉత్సాహంతో. ప్రస్తుతం ఆమె నిర్వహిస్తున్న వ్యాపారాల టర్నోవర్ రూ.2వేల కోట్లు. ఏడు కంపెనీలకు అధిపతి అయిన ఆమెని సక్సెస్ మహిళగా గుర్తిస్తూ 2013లో పద్మశ్రీ వరించింది. భారతీయ మహిళా బ్యాంక్ డైరక్టర్ల బోర్డులో కల్పనా సరోజ్ కూడా ఒక మెంబర్ కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)