మూర్ఖుల దినోత్సవం నాడు హైదరాబాద్ నడిబొడ్డున మోడీ సభ

ప్రధాని మోదీ ఈనెల 29న మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభతోపాటు ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొంటారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ ప్రచార షెడ్యూల్‌ సైతం ఖరారైందని చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..‘‘అమిత్‌షా ఏప్రిల్‌ 4న.. కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 6న నల్గొండతోపాటు హైదరాబాద్‌లో రోడ్‌షోల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారు’’ అని వివరించారు. మోదీని విమర్శిస్తే గొప్ప నాయకుడు అవుతానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భ్రమ పడుతున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. ‘‘మే 23న ఫలితాల తర్వాత కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రావడం, మోదీ మళ్లీ ప్రధాని అవడం ఖాయం. రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమా’’ అని కేటీఆర్‌కు లక్ష్మణ్‌ సవాలు విసిరారు. ‘‘కేంద్రంలో భాజపా అధికారంలోకి రాగానే.. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. మీ భరతం పడతాం. మీ అవినీతికి, కుటుంబ పాలనకు స్వస్తిపలుకుతాం’’ అని తెరాసను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం అభివృద్ధి అజెండాతో వెళ్తుంటే కేసీఆర్‌ ప్రజల దృష్టి మారుస్తూ తానే అసలైన హిందువుగా చెబుతున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది భక్తులు మరణిస్తే పరామర్శించని మీరు హిందువు ఎలా అవుతారు? అసదుద్దీన్‌తో పోలిస్తే గడ్డం లేదుకానీ, అతడిని మించిన ముస్లిం మీరు. ప్రశ్నించిన ఎంపీలను పక్కన పెట్టారు. భజనపరులకు, డబ్బు సంచులు ఇచ్చినవారికి వేలంపాటను బట్టి లోక్‌సభ టికెట్లు ఇచ్చారు’’ అని సీఎం కేసీఆర్‌పై లక్ష్మణ్‌ నిప్పులుచెరిగారు. ‘‘ఉపాధ్యాయులు, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తెరాసకు గుణపాఠం చెప్పారు. ‘కారు’ గాలిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో పంక్చర్‌ కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాల కోసం భాజపా దేశవ్యాప్తంగా ‘భారత్‌కీ మన్‌కీ బాత్‌, మోదీ కీ సాత్‌’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఐటీ ఉద్యోగులు, మహిళలు, వివిధవర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ‘తెలంగాణ మన్‌కీ బాత్‌’ పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కమిటీ సభ్యులు అందించారు. వీటిని పార్టీ జాతీయ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ రాజ్‌నాథ్‌సింగ్‌కు గురువారం అందించనున్నట్లు లక్ష్మణ్‌ తెలిపారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ముఖ్యఅధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)