సినిమా రంగంలో ప్రత్యేకమైన పరిస్థితులేమీ ఉండవు, బయట అన్ని రంగాల్లోని సూత్రాలే ఇక్కడా వర్తిస్తాయంటోంది అనుపమ పరమేశ్వరన్. మలయాళంలో ప్రయాణం మొదలుపెట్టిన ఈమె, తక్కువ సమయంలోనే దక్షిణాదిలోని నాలుగు భాషల్లో సినిమాలు చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమతో నాది ప్రత్యేకమైన అనుబంధం అని చెప్పే అనుపమ ఇటీవల మరో అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. కొత్తగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వాళ్లకి మీరు ఎలాంటి సలహాలిస్తారని అడిగితే… ‘‘వేరొకరితో నిన్ను పోల్చి చూసుకోవద్దని మాత్రమే చెబుతాన’’ని అంది అనుపమ. ‘‘బయట కూడా చాలా మందిని గమనిస్తుంటాం కదా. మనం ఏం చేస్తున్నామనే విషయం కంటే, పక్కవాళ్ల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మనం ఒకటో పాఠంలో ఉంటే, పక్క వాళ్లు పదో పాఠంలో ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్లతో మనల్ని పోల్చి చూసుకుంటే ఏం లాభం? సినిమా పరిశ్రమలోనూ అంతే. ఒకొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మన ప్రతిభని, మనదైన ప్రత్యేకతని ప్రదర్శించడంపై దృష్టిపెడితే అంతా సానుకూలమే’’అని చెప్పింది అనుపమ.
